top of page

దయలేని పుత్రుడు

Writer's picture: Neeraja PrabhalaNeeraja Prabhala

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #దయలేనిపుత్రుడు, #DayaleniPuthrudu, #TeluguKathalu, #తెలుగుకథలు


Dayaleni Puthrudu - New Telugu Story Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 23/02/2025

దయలేని పుత్రుడు - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


మమతలెరిగిన, మధువులొలికే మన మాతృభాష ‘తెలుగు. ’ 


తెలుగు భాష అంటే చిన్నప్పటి నుంచి నాకు మక్కువ ఎక్కువ. అందులో మన జీవన స్థితిని తెలిపి, గతిని మార్చే శతక పద్యములంటే చాలా ఇష్టం. వాటిని స్ఫూర్తి గా తీసుకుని మీ అందరి ఆశీస్సులతో ఈ చిన్న కథ వ్రాస్తూ‌, చదివి ప్రోత్సాహిస్తారని ఆశిస్తూ.. 


“తల్లి తండ్రులయందు దయలేని పుత్రుడు

పుట్టనేమి? వాడు గిట్టనేమి? 

పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా ?

విశ్వదాభిరామ వినుర వేమ. ”


రామయ్య గారు స్కూలు మాస్టరు గా పదవీ విరమణ చేసి తను కష్టపడి కట్టుకున్న ఇంటిలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఏనాడు ఎవరినీ చేయి చాచి అడుగకుండా భార్య, ఇద్దరు కొడుకులు, ఒక్క కూతురు తో గౌరవంగా జీవిస్తూ, పిల్లల ను తన శక్తి కి మించి వాళ్ళు కోరుకున్న చదువులు చెప్పించి, వాళ్లు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరిపించి, వాళ్ళ బాగోగులు కనిపెట్టుకుంటూ తనకు చేతనైన విథంగా అండగా ఉన్నారు. వేర్వేరు ఊళ్ళల్లో వాళ్లు మంచి ఉద్యోగాలలో స్థిరపడి భార్యా, బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. 


కూతురు ని కూడా మంచి యోగ్యుడైన వాడికిచ్చి వివాహం జరిపించి, ఆమె పురుళ్ళు వగైరా బాధ్యతలు నెరవేర్చారు. ఆయన భార్య జానకమ్మ కూడా భర్తను అనుసరించి నడుస్తూ, ఉత్తమ ఇల్లాలు గా పేరు తెచ్చుకుంది. 


 కోడళ్ళు కూడా వాళ్ళకు అవసరమైనప్పుడు, పిల్లల పెంపకం వంటి విషయాలల్లో ఆవిడ సాయం పొందేవారు. కాలక్రమేణా కొడుకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు, తద్వారా ఆస్థి-అంతస్థులు, హోదా ఏర్పటటం, వాళ్ళ పిల్లలు పెద్ద వారవటం‌తో క్రమేపీ వీళ్లతో రాక- పోకలు కూడా తగ్గించటమే కాక, పదే పదే చెప్పిన మీదట ఎప్పుడో పండుగకు వచ్చి ఏదో ముళ్ల మీద కూర్చున్న ట్టుగా గడిపి 'వాళ్లు వచ్చారు' అన్న ఆనందం తీరకుండానే వెళ్ళొస్తామని బయలుదేరేవారు. ఎంతో లోతైన, సుదీర్ఘ జీవితాన్ని చూసిన ఆ దంపతులు అర్థం చేసుకొని మెలిగేవారు. 


ఒక రోజున జానకమ్మకు బాగా సుస్తీ చేయగా, డాక్టర్లు పరీక్షలు చేసి కిడ్నీ చెడిపోయిందని చెప్పగా, ఆవిషయం కొడుకులకు చెపితే, ఉద్యోగ బాధ్యతలు, పని ఒత్తిడితో రావటం కుదరదని, అవసరమైతే కొంత డబ్బు పంపుతామని చెప్పి బాధ్యతల నుండి తప్పించుకొన్నారు. కూతురికి తెలిసి బాథపడి, వచ్చి వాళ్లను తనింటికి తీసుకెళ్లి సపర్యలు చేసి‌, తన కిడ్నీ లలో ఒకదానిని తల్లికి ఇచ్చి కంటికి రెప్పలాగా చూసుకున్నది. 


కొడుకులు, కోడళ్ల నిరాదరణ, నిర్లక్ష్యము జానకమ్మ మనసును క్రుంగదీసి ఆ దిగులు తోనే తనువు చాలించగా, కూతురికి భారం కాగూడదనుకుని రామయ్య గా రు తనింటికి వచ్చి భార్య జ్ఞాపకాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. బాల్యంలో మాస్టారి వద్ద విద్యాభ్యాసం చేసిన రవి కి లెక్చరర్ గా ఆ ఊరికి బదిలీ అయింది, ఆయన వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి, ఆయన స్థితి గతులను తెలుసుకొని‌, కొడుకుల నిరాదరణ కు వ్యథ చెంది‌ ఇంటికి వచ్చాడన్న మాటేగానీ ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. 


మరుసటి రోజున వాళ్ళ కొడుకులను కలుసుకొని వాళ్ళకు తండ్రి పరిస్థితి వివరించగా 'ఆయన మాకేమిచ్చాడు ? ఆస్తులా-అంతస్థులా?’ అన్న వాళ్ళ మాటలకు ఖిన్నుడయి ‘ఆయన మీ కన్న తండ్రి, మీ ఈ ఉన్నతికి ఆయనే కదా కారణం, ఇక నైనా మీరు ఆయన్ని దగ్గరుంచుకుని చక్కగా చూసుకోండి ' అని హితవు చెప్పగా, 'ఆయన వలన మాకు ప్రయోజనమేముంది? ఆయనకు సేవలు చేసే ఓపిక, సమయము మాకు లేదు' అన్న వాళ్ళ మనోగతం అర్థమయి ఇంటికి వచ్చి భార్య గీత తో జరిగిందంతా చెప్పి బాధ పడగా, "తల్లి తండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి? వాడు. గిట్టనేమి? పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా? విశ్వదాభిరామ వినుర వేమ. " అన్న వేమన పద్యం మీ మాస్టారు మీకు నేర్పించారని ఎప్పుడూ చెపుతారు కదా! మీరేమీ బాథ పడద్దు, మనం రేపు వెళ్లి ఆయనను ఒప్పించి మనింటికి తీసుకొచ్చుకుని మనతో ఉంచుకుందాము‌, ఆయన్ని నా కన్న తండ్రి లాగా చూసుకుంటాను" అన్న గీత మాటలకు సంతసించి భార్య ను, కొడుకును తీసుకుని మాస్టారింటికి వెళ్ళాడు రవి. 


వాకిట్లో బాదం చెట్టు క్రింద కుక్కిమంచంలో పడుకొని నిర్మలమైన ఆకాశం వేపు చూస్తూ, ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న ఆయన వదనాన్ని చూసి మనసు చివుక్కుమనగా 'మాస్టారూ ' ! అని చేయి తట్టి రవి పిలువగా, తృళ్ళిపడి తేరుకుని భార్యా, బిడ్డతో వచ్చిన రవిని చూసి పలకరించారు. 


“నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా! మీరు మా వద్దకు రండి, ప్రశాంతంగా ఉందురు గాని, వీడు మీ మనవడు హర్ష‌, వీడితో హాయిగా ఆడుకుందురు గాని” అని తన కొడుకు హర్షను ఆయన చేతిలో ఉంచి ఆ బాబుతో 'తాతయ్యా! ' అని పిలువమని చెప్పగా ముద్దు ముద్దు మాటలతో పిలిచిన ఆ పసివాడిని మురిపెంగా చూస్తూ గుండెలకు మరింత హత్తుకున్నారు. 


గీత కూడా 'మనింటికి రండి‌, మీకు ఏలోటూ రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను' అని చెప్పగా ఆయన అంగీకరించి‌, రవి చేయి అందుకుని వాళ్ళింటికి బయలుదేరారు. గీత ఆయన బట్టలను కొన్నింటిని ఒక సంచీలో సర్ది, ఇంటికి తాళం వేసి కొడుకుని ఎత్తుకుని వాళ్ళను అనుసరించింది. 


మాస్టారు తన శేష జీవితాన్ని ప్రశాంతంగా రవి వద్ద గడుపుతూ‌ ఆ భగవంతుని కి కృతజ్ణతలు తెలిపారు. 


.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link









 
 
 

1 comentário


mk kumar
mk kumar
4 days ago

ఈ కథ తల్లిదండ్రుల పట్ల కొడుకుల నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. పిల్లల కోసం కష్టపడ్డా, వృద్ధాప్యంలో రామయ్య గారు ఒంటరిగా మిగిలిపోతారు.కొ డుకులు బాధ్యతలు వహించకపోయినా, కూతురు తల్లికి కిడ్నీ దానం చేసి సేవ చేస్తుంది.


తండ్రిని చూసుకునేందుకు రవి ముందుకు వచ్చి ఆదరంగా చూసుకుంటాడు.ఇది తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేసే హృదయస్పృహ కథ.

సమాజంలో మారుతున్న కుటుంబ విలువలపై ఈ కథ ఆలోచింపజేస్తుంది.


Curtir
bottom of page