top of page
Writer's pictureSairam Allu

దేనికైనా ఓ లెక్కుండాలి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link

'Denikaina O Lekkundali' New Telugu Story Written By Allu Sairam

రచన: అల్లు సాయిరాం

ప్రేమకు, అభిమానానికి లెక్క కట్టక పోయినా, కొన్ని లావాదేవీలకు ఖచ్చితంగా లెక్కలు రాసిపెట్టాలి. ఈ విషయాన్ని చక్కగా వివరించారు ప్రముఖ రచయిత అల్లు సాయిరాంగారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం

అప్పుడే చంద్రుడు డ్యూటీ దిగి, ఫాల్గుణమాస సూర్యుడు డ్యూటీ ఎక్కి,

సూర్యకిరణాలను భూమిపైకి నేరుగా ఎక్కుపెడుతున్నాడు. అంతకన్నా తీక్షణంగా

బీరువాలో ఉన్న ఆస్తుల పేపర్లు ఒకవైపు, అప్పుల, ఇన్సూరెన్స్ ల రశీదులు ఒకవైపు

పెట్టుకుని చూస్తూ, తన దస్తూరిలో పేపరు మీద రాసుకుంటున్నాడు రాంబాబు.

"ఏం చేస్తున్నావు నాన్న!" అని అంటూ పదహారేళ్ళ కూతురు ఐశ్వర్య, పదమూడేళ్ళ

కొడుకు కళ్యాణ్, రాంబాబు పక్కన వచ్చి కూర్చుని పేపర్లు చూస్తున్నారు.

"తెల్లవారి లేచినప్పట్నుంచి, బీరువాలో ఉన్న పేపర్లన్ని తీసి చూస్తున్నారేమీ! ఈరోజు బ్యాంకు పని ఏమైనా ఉందా?" అని వంటింట్లో నుంచి టీ తీసుకొచ్చి, రాంబాబు చేతికిస్తూ అడిగింది సుజాత.

"అదేం లేదు! కాసేపు, టీ ఆ పక్కన పెట్టు" అని అన్నాడు

రాంబాబు పేపర్లు చూసుకుంటూ. పిల్లలు యిద్దరూ కవర్లలో మడతపెట్టున్న పేపర్లు

బయటికి తీసి, చూస్తున్నారు.

"అక్క! ఈ కార్డు చూడు!" అని అంటూ ఐశ్వర్యకి చూపిస్తున్నాడు కళ్యాణ్.

"ఏయ్ఁ మీ యిద్దరూ నచ్చినట్టుగా పేపర్లు తీసి, అన్ని కలిపెయోద్దు. రేపు ఎప్పుడైనా తీద్దామంటే, అవసరానికి ఒక్క పేపరు కుడా పెట్టిన దగ్గర దొరకదు. ఆ పేపర్లు అక్కడ పెట్టి, మీరు వెళ్లి చదువుకోండి" అని సుజాత చెప్తుంటే "రాంబాబు- సుజాతలను ఆశీర్వాదించ ప్రార్థన" అని కళ్యాణ్ చేతిలో ఉన్న కార్డు చూపిస్తూ, నవ్వుతూ చదువుతుంటే, సుజాత అటువైపు చూసింది.

"అంటే, మీకు పెళ్లయి పందొమ్మిది సంవత్సరాలయిందా! 2003 లో జరిగిన మీ పెళ్లి

కార్డు తమ్ముడు చదువుతున్నాడమ్మా!" అని నవ్వుతూ అంది ఐశ్వర్య. సుజాత,

రాంబాబు లకి కాసేపు పెళ్లి నాటి జ్ఞాపకాల్లోకి జారుకుని, పిల్లలతో అనుభూతులను

పంచుకున్నారు.

కాసేపు తర్వాత "కళ్యాణ్! యి ఇన్సూరెన్స్ పాలసీల రశీదులు కట్టిన

సంవత్సరం ప్రకారం వరుసలో పెట్టు. ఐశ్వర్య! నువ్వు యి అప్పుల ప్రామిసరీనోట్లు

చదువమ్మా!" అని కళ్యాణ్ కి పాలసీల రశీదులు, ఐశ్వర్యకి ప్రామీసరీనోట్లు యిచ్చి,

తను యింతవరకు రాసుకున్న పేపర్లు కళ్లద్దాలు పెట్టుకుని చూసుకుంటున్నాడు

రాంబాబు.

"అవును! భారతి వదినవాళ్ళు వూరినుంచి వచ్చారంట కదా! పక్కింటి పద్మ చెప్పింది" అని సుజాత అడిగింది.

"ఆఁ వచ్చారు!" అని రాంబాబు చెప్తుంటే

" అవునా! భారతి అత్త వాళ్ళు వచ్చారా! శ్రుతి వదిన నాకు ఇంటర్ బుక్స్ యిస్తానంది. వెళ్లి తెచ్చుకోనా నాన్న?" అని చేతిలో ఉన్న పేపర్లు పక్కన పెడుతూ అడిగింది ఐశ్వర్య.


"ఇప్పుడొద్దమ్మా! నాలుగు నెలల ముందు, సుందర్ మావయ్య కరోనా వలన

సడెన్ గా చనిపోయారు కదా! వాళ్ళందరూ యింకా ఆ బాధలోవున్నారు!" అని

కళ్ళుచెమ్మగిల్లి రాంబాబు చెప్తుంటే, ఐశ్వర్య వెళ్లాలనుకున్న ఆలోచన ఆపేసింది.


"నిన్న మీరు వాళ్ళని చూడడానికి వెళ్ళారా ?" అని బాధగా అడిగింది సుజాత.

"ఆఁ వెళ్లాను! నన్ను చూడగానే తల్లికూతుర్లు భోరుమని ఒకటే ఏడ్పు! ఊరికి వెళ్లిపోయి, నాలుగునెలల తర్వాత మళ్లీ యిక్కడికి వచ్చారు కదా! యిక్కడకి వచ్చాక, సుందర్ జ్ఞాపకాలు గుర్తుచేసుకుని పిల్లలిద్దరూ ఏడుస్తూనే ఉన్నారు. ఏంలేదు! సుందర్ తో పదిహేను సంవత్సరాలుగా ఆఫీసులో కలిసి పనిచేస్తున్న నేనే, యింకా మర్చిపోలేతున్నాను. మరీ, అంతా సడెన్ గా జరిగిపోయేసరికి, వాళ్ళకి కోలుకోవడానికి టైం పడుతుంది! యిప్పుడు ఆలోచించాల్సిందేంటంటే, అసలే, యి ఆన్లైన్ క్లాసులతో పిల్లల చదువులు అంతంత మాత్రంగా ఉంటే, బాగా చదివే సుందర్ పిల్లలు, యి బాధలతో చదువులో చాలా వెనకబడిపోతున్నారు. యి టైం లో వారికి ఓదార్పు చాలా అవసరం. నువ్వు కుడా పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఓదార్చి రా!" అని అన్నాడు రాంబాబు.

"నాకు వెళ్లాలని ఉంది. కానీ, అంతవరకు బాగున్న సుందర్ అన్నయ్యకి సడెన్ గా అలా జరిగేసరికి, నాకు నోట మాట రాలేదు. యింకా వాళ్లని ఏలా ఓదార్చాలో ఏమో!" అని దిగాలుగా అంది సుజాత.


"ఈమధ్యనే యింకో విషయం తెలిసింది. సుందర్ మా ఆఫీసులో ఒకరికి

ఎనిమిది లక్షలు, మరొకరికి మూడు లక్షలు అప్పుగా యిచ్చాడంట. మనుషుల్ని గుడ్డిగా నమ్మి కనీసం ప్రామీసరీనోటు కుడా రాయించలేదంట. ఆ అప్పు తీసుకున్నవాళ్ళు, మనిషి ఉన్నప్పుడే ఏలా ఎగ్గొడదమా అని చూసే రకపు మనుషులు. మరి యిప్పుడు యిచ్చిన మనిషే లేకపోతే, యింక అంతే సంగతులు!


అసలు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుంటారు. సుందర్ రెండుమూడుసార్లు పెద్ద

మొత్తంలో డబ్బులు గురించి మాట్లాడుకున్నట్టు, డబ్బులు వాళ్ళకిచ్చినట్టు తనతో

చెప్పారని పెద్దపాప శ్రుతి చెప్తుంది!" అని అన్నాడు రాంబాబు.


"అయ్యో రామా! ఎనిమిది, మూడు, మొత్తం పదకొండు లక్షలా! జరిగిన నష్టం చాలదన్నట్లు, కొత్తగా యిదొకటా! మామూలుగానే, సుందర్ అన్నయ్యకి మొహమాటం. అయితే, పదకొండు లక్షల అప్పుకి కుడా ఒక కాగితం రాయించుకోకుండా యిచ్చేటంతగా అనుకోలేదు. పోనీ, యిప్పుడు మనం అడిగితే, ఆ అప్పు తీసుకున్నవాళ్ళు తిరిగి యివ్వరంటారా? లేకపోతే, పోలీసులకి కంప్లైంట్ యిస్తే, పోలీసులే వాళ్ల సంగతి చూసుకుంటారు కదా!" అని ఆవేశంగా అడిగింది సుజాత.


"యిచ్చిన మనిషి లేడు. తీసుకున్న మనుషులు మూర్ఖులు! మనం మాటలతో అడగగానే వాళ్లు యివ్వరు. సుందర్ వాళ్లకి డబ్బులిచ్చినట్టు సరైన ఆధారాలు మన దగ్గర లేకుండా ఏమని అడుగుతాం. బలమైన ఆధారాలుంటే కోర్టుకి కుడా వెళ్లొచ్చు! అన్ని విషయాలు నాకు చెప్పే సుందర్, యి విషయం నాకు చెప్పనేలేదు. ఒకవేళ చెప్పుంటే, అప్పుడే వాళ్లకి అప్పు యివ్వొద్దని చెప్పేసేవాడ్ని! కనీసం, సుందర్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసి, అకౌంట్ లావాదేవీల్లోనైనా వాళ్లకి అప్పు యిచ్చినట్టుగా ఉంటే అదృష్టమే! కొంచెమైనా పోరాడగలం. అలా కాకుండా, ఎమౌంట్ అంతా డైరెక్ట్ క్యాష్ యిచ్చుంటే, యిక, అప్పుతీసుకున్నవాళ్ళ దయ! మన ప్రాప్తం అనుకోవడమే!" అని ఉన్నవిషయం చెప్పాడు రాంబాబు.


"వందలా! వేలా! అలా వదిలేయడానికి! పదకొండు లక్షలండీ! ఆ లక్షలు, యిద్దరు వయసుకొచ్చిన ఆడపిల్లల చదువులకో, శుభకార్యాలకో ఉపయోగపడతాయి! అయినా, సుందర్ అన్నయ్యని అనాలి. యిద్దరు ఆడపిల్లలు ఉన్న యింట్లో డబ్బులుంటే, జాగ్రత్తగా యింట్లో దాచుకోవాలి. లేకపోతే, ఏ యింటిస్థలాలో కొనడమో, ఏ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే, పిల్లల పెళ్లిళ్లకి గట్టెక్కించొచ్చు. అదేది కాకుండా, యిటువంటి వాళ్లకి అప్పులు యిస్తే అల్లరిపాలవ్వడం తప్ప ఏం ఉపయోగం ఉండదు!" అని ఆక్రోశంతో అంది సుజాత.


"సుందర్ అప్పు యిచ్చిన మనుషులు, యిలా మోసం చెయ్యడంలో ఘనులు!

అలాగని, వాళ్లని వదిలేదిలేదు! మంచిరోజు చూసి, యిద్దరూ పిల్లలతో భారతిని

తీసుకుని, యి మూర్ఖుల యింటికివెళ్ళి, ఆడపిల్లల కన్నీళ్లతో అడిగిస్తే, కనీసం

అప్పుడైనా మనసు కరుగుతుందేమో చూడాలి!" అని రాంబాబు తన ఆలోచన

చెప్తుంటే "ఎలాగైనా వదలకూడదండీ!" అని సమర్ధింపుగా చెప్పింది సుజాత.

అమ్మనాన్నల మాట్లాడుకుంటున్న మాటలు పక్కన కూర్చుని జాగ్రత్తగా

వింటున్నారు ఐశ్వర్య, కళ్యాణ్.


"నిన్న సుందర్ యింటికి వెళ్లినప్పుడు, సుందర్ మొహమాటంతో కూడిన

నిర్లక్ష్యం వలన ఆరోగ్యం విషయంలోనే కాదు, కుటుంబ ఆర్ధిక విషయాల్లో కూడా

తీరనీ నష్టం దరిద్రపుమాయలా జరిగిపోయింది అన్నయ్య అని భారతి ఏడుస్తూ

చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోయింది. అక్కడ నుంచి వచ్చాననే గాని,

యింకా భారతి మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నాయి. నేను కుడా సుందర్ లా ఎక్కడ తప్పుచేస్తానా అనే నాకు పట్టుకున్న బాధంతా భయంగా మారి, రాత్రంతా

నిద్రపట్టనివ్వలేదు. రాత్రి నువ్వు చుశావు కదా!" అని లోలోపల మధనపడుతున్న విషయం చెప్తున్న రాంబాబు మాటలకి సుజాత కళ్ళలో నీళ్ళుతిరిగి "అయ్యో! మీరు ఎందుకలా నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు? పిల్లలు కుడా వింటున్నారు. బాధపడతారు!" అని అంది సుజాత.


"నెగెటివ్ కాదు సుజాత! అది మంచిదైనా, చెడుదైనా, అన్ని అనుభవాలు మన జీవితంలోనే రావక్కర్లేదు. కొన్ని చదువుకుని, కొన్ని విని, కొన్ని పక్కవారి జీవితాల్లో జరిగిన అనుభవాల నుంచి కుడా పాఠాలు నేర్చుకోవచ్చు! ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎవరికెప్పుడు ఏం జరుగుతుందో, బయటికి వెళ్ళినవాళ్ళు ఏలా తిరిగివస్తారో కూడా చెప్పలేకపోతున్నాం! ఆలోచిస్తే అర్ధమైందేంటంటే, దేనికైనా ఓ లెక్కుండాలి! అన్నింటికీ లెక్కలేసుకుంటే, మనం దేనికి ప్రశాంతంగా ఖర్చు పెట్టలేమనే నెగెటివ్ అభిప్రాయం మనందరికి ఉంది. మరీ, రోజువారి చిన్నచిన్న ఖర్చులకి కాకపోయినా, నెలకో, మూడునెలలకోకసారైనా, పెద్దఖర్చులు, అప్పుల గురించి లెక్కలు రాసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఈ లెక్కలు అనవసరమైన వృధాఖర్చులు తగ్గించే చిట్టాలు! ఆపద సమయాల్లో ఆసరా యిచ్చే బీమా పట్టాలు! లెక్కలంటే ఆస్తులు, అప్పుల గురించే కాదు. ఉదాహరణకి, యిప్పుడు కాసేపు ముందు, పిల్లలు మనకి పెళ్ళయి పందొమ్మిది సంవత్సరాలయిందా అని అడిగారు కదా. వాళ్లు పుట్టకముందు జరిగిన విషయం, వాళ్లకి ఏలా తెలిసింది? పెళ్లి కార్డు కుడా కాలాన్ని చూపించే ఒక లెక్కే! యిలా అనుభవాలను, అనుభూతులను వ్యక్తపరిచే ప్రతి రూపం ఒక లెక్కే!" అని కూలంకషంగా వివరించిన రాంబాబు ఆలోచనల అంతరార్ధం అర్ధమయ్యాక, అంతవరకు రాంబాబు రాసుకున్న పేపర్ల మీద ఉన్న లెక్కలని అర్ధం చేసుకోవడానికి చూస్తున్నారు సుజాత, ఐశ్వర్య, కళ్యాణ్.


"ఆరోజు సుందర్ ప్రామీసరీనోట్లు రాయించకపోయినా, కనీసం తన సొంత

డైరీలో అప్పు యిచ్చినట్టుగా రాసి ఉండుంటే, ఈరోజు తన కుటుంబ పరిస్థితి వేరేలా

ఉండేది!" అని అంటూ యింతవరకు రాయించిన ఆస్తుల, అప్పుల వివరాల పత్రాలు కవర్ లోపెట్టి, బీరువాలో జాగ్రత్తగా పెట్టాడు రాంబాబు.


"నాన్న! నేను లెక్క రాయనా?" అని అడిగింది ఐశ్వర్య.

"నువ్వు ఎవరికేమైనా యిచ్చావా తల్లీ?" అని ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

"నా ఫ్రెండ్ కుమారికి పదిరూపాయిలు యిచ్చాను. యింకా.." అని ఐశ్వర్య గుర్తుచేసుకుని చెప్తుంటే "అలా అయితే, నేను కూడా లెక్క రాస్తాను నాన్న!" అని అంటూ కళ్యాణ్ ఐశ్వర్యతో పోటీపడి చెప్తున్నాడు.


"మంచిది! చిన్న పెద్దా తేడాలేకుండా, లెక్క ఎవరైనా రాసుకోవచ్చు. కానీ, రాసే ముందు, ఒక్క విషయం ఆలోచించి రాయండి. మనం ఏ ఉద్దేశ్యంతో ఎదుటివారికి యిస్తున్నామనేది, ఆలోచించి లెక్క రాసుకోవాలి. ఒకవేళ, మనం పక్కవారికి సాయం చెయ్యడానికి డబ్బులో, ఏదో వస్తువో యిచ్చుంటే, అవి లెక్కలో రాసుకోవచ్చు. కానీ,

ఎదుటివారినుంచి తిరిగి ఆశించకూడదు! అదే, అప్పుగా యిచ్చుంటే, ఎదుటివారు

తిరిగి యిస్తారు కాబట్టి, ఆశించొచ్చు. అవి లెక్కలో రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి!"

అని పిల్లలకి మార్గనిర్దేశకంగా చెప్పాడు రాంబాబు.


"గుర్తుపెట్టుకుంటాం నాన్న!" అని రాంబాబు దగ్గర నిల్చుని ఐశ్వర్య, కళ్యాణ్ లు యిద్దరూ ఓకేమాట చెప్పారు.


పిల్లల మనసెరిగిన తండ్రిగా రాంబాబు తన్మయంతో "మంచిదమ్మా! నా లెక్కలు మీకు చూపించాను. మీ అమ్మ దగ్గర బోలెడు లెక్కలు ఉంటాయి. చూపించమని అడగండి మరి!" అని నవ్వుతూ అంటే, యిద్దరూ పిల్లలు వచ్చి సుజాతని రెండు వైపులా పట్టుకుని "నువ్వు కుడా చెప్పమ్మా!" అని అడిగేసరికి, అంతవరకు రాంబాబు చెప్తున్న విషయ దీర్ఘాలోచనలో ఉన్న సుజాత ఒక్కసారి తుళ్లిపడి, ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి "మీ నాన్న చెప్పినట్టు, అస్తులకైనా, అప్పులకైనా, ఆశించే ఆశలకైనా, దేనికైనా ఓ లెక్కుండాలి! ఇక నా లెక్కలంటారా, నేను ఏం యిచ్చినా, పెట్టినా, అది మీ ముగ్గురికే! ప్రేమని యిస్తున్నాను. ప్రాణం పెడుతున్నాను. అవి తిరిగి ఆశించేవి కాదులే!" అని ఆప్యాయంగా చెప్పింది. పిల్లలిద్దరూ రాంబాబుని ఒకరు, సుజాతని ఒకరు హత్తుకున్నారు. తమ ఆలోచనలను అర్ధంచేసుకున్న పిల్లల మాటలకి రాంబాబు, సుజాత లు మురిసిపోయి పిల్లల్ని ముద్దాడారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


151 views0 comments

Comments


bottom of page