'Desa Drohini Kalenu' - New Telugu Story Written By K. Lakshmi Sailaja
Published In manatelugukathalu.com On 13/06/2024
'దేశ ద్రోహిని కాలేను' తెలుగు కథ
రచన, కథా పఠనం: కే. లక్ష్మీ శైలజ
….. ఐ.ఏ.ఎస్. ఒక అత్యున్నత అధికారం…..
కలెక్టర్ అంటే ప్రభుత్వ చట్టాలను ధర్మ బద్ధంగా అమలు పరుస్తూ, ప్రజలకు రక్షణ కల్పిస్తూ, వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో తృప్తిగా జీవించవచ్చు.
“కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఆద్యా. సివిల్స్ వ్రాసిన మొదటిసారే 85 వ రాంక్ తెచ్చుకున్నావు“ అంటున్న నాన్న ఆనంద్ అభినందనలు వింటూ “థాంక్యూ నాన్నా” అంది ఆద్య సంతోషంగా.
“కంగ్రాట్స్” అంది వాళ్ళమ్మ అరుంధతి. ఆ మాటల్లో సంతోషం లేదు. అభినందనలు చెప్పాలి కాబట్టి చెప్పినట్లుగా వుంది.
అమ్మ మాటలకు ఆద్య కినుకగా చూసింది.
అది చూసి “అలా నీరసంగా చెప్తావెందుకు? ఈ రోజు నీ కూతురు సాధించిన విజయం సామాన్యమైనది కాదు. సర్వోత్తమమైన పదవి చేపట్టబోతోంది. ఒక జిల్లాకు రాజు లేదా రాణి అవుతోంది. రాజమాతగా ఎక్కడికీ వెళ్ళినా నీకూ ఆ గౌరవం లభిస్తుంది” ఎంతో ఉద్వేగంగా అన్నాడు ఆనంద్.
కానీ సివిల్స్ అప్లికేషన్ వేసిన రోజే అరుంధతి వ్యతిరేకించింది.
“గౌరవనీయమైన వైద్య వృత్తి పూర్తి చేశావు. ఇందులో ఇంకా పై మెట్టు ఎక్కడానికి వైద్యానికి సంబంధించి పై చదువులు చదువుకో. డెవలప్మెంట్స్ తెలుసుకో. ప్రజలకు సేవ చెయ్యి. ‘వైద్యో నారాయణో హరిః ‘ అన్నారు. వైద్యుడు దేవునితో సమానం. అంతటి గౌరవం వదిలేసుకుంటున్నావు.
అంతేగాక ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్ కోర్స్ చేసి, ఇప్పుడు వైద్యవృత్తిని పక్కన పెట్టీ ఐ.ఏ.ఎస్. అవుతావా? ఇది కరెక్ట్ కాదు” అంటూ కోప్పడింది.
కానీ ఆద్య తన ఫ్రెండ్స్ వ్రాస్తున్నారనీ, తండ్రి ప్రోత్సహిస్తున్నాడనీ అమ్మ మాటలను వినకుండా సివిల్స్ వ్రాసింది.
అది గుర్తొచ్చింది ఆద్యకు. “నేను ర్యాంక్ తెచ్చుకున్నాననే సంతోషం నీకు లేనే లేదు” అంది ఆద్య కినుకగా.
“ఖచ్చితంగా లేదు. చిన్నప్పటి నుంచీ నేను నీకు నేర్పిన నీతి నిజాయితీలు మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు ప్రతి రాజకీయనాయకుడూ నువ్వు చేసే పనిని ప్రశ్నించగలడు. ఏ పని చేసినా రాజకీయనాయకులకు అనుకూలంగానే చెయ్యాలి. నువ్వు అస్తిత్వం లేకుండా వాళ్ళు చెప్పినట్లు చేసే పరిస్థితి లో ఉంటావు. నేను ప్రభుత్వ ఉద్యోగస్తురాలిగా చూస్తున్నాను. వారి మాట వినని కలెక్టరు కు ట్రాన్స్ఫర్ తప్పదు. ఏ ఒక్కచోటనో తప్ప అంతటా ఇలాగే జరుగుతుంది. అవ్వటానికి కలెక్టర్ జిల్లాకు అధికారి అయినా రాజకీయనాయకులే అధికారులు. వాళ్ళ చెప్పుచేతల్లో కలెక్టర్ ఉండాల్సిందే.
అదే కాక నువ్వింత దేశద్రోహం చేస్తున్నప్పుడు నేను సంతోషంగా ఎలా వుంటాను?”
ఆ మాటలకు “దేశద్రోహమా!?” విస్మయంగా అంది ఆద్య.
“అవును. నువ్వు డాక్టర్ కోర్స్ చదివింది ప్రభుత్వ సొమ్ముతో. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టీ ఐదు సంవత్సరాలు నీకు వైద్యవిద్య ఉచితంగా నేర్పిస్తే నువ్వు ప్రజలకు వైద్యం చెయ్యకుండా తప్పించుకుంటూ ఉన్నావు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు చదివావు. ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు చేసి నీ దారిన నువ్వు వేరే ఉద్యోగానికి వెళ్తున్నావు. అంటే ప్రభుత్వాన్ని మోసంచేస్తున్నావు. అది దేశద్రోహం కాదా?” అంది అరుంధతి గట్టిగా.
“ఇదుగో… నువ్వు అమ్మాయిని గాభరా పెట్టకు. ఐ. ఏ. యస్. వాళ్ళకు జీవితాంతం ఎన్నో సౌకర్యాలున్నాయి” అని అరుంధతి తో అంటూ “ఆద్యా, అమ్మ మాటలకేం గానీ …మర్నాడు ఆదివారం కనుక ఆరోజు కర్నూల్ హోటల్ లో పార్టీ అరేంజ్ చేద్దాము. నీ ఫ్రెండ్స్ ను ఆ హోటల్ దగ్గరకు రమ్మని చెబుదువు” అన్నాడు ఆనంద్.
ఆద్య తల్లి మాటలు పూర్తిగా అర్ధం కాక ఆలోచిస్తూ, తండ్రి వైపు మౌనంగా చూసి తల ఊపింది, సరే నన్నట్లు.
ఆ రోజు సాయంత్రం ఆద్య ఇంట్లో తన మెడికల్ జర్నల్స్ సర్దుతూ ఉన్నప్పుడు మనసులో ఏదో పోగొట్టు కుంటున్నగా అనిపించింది. తను ఇంతకుముందు ఎంతో ఇష్టంగా వాటిని చదివేది. ‘ఇంక తను వీటిని చూడడానికి అవకాశముండదు’ అనుకోగానే మనసుకెంతో కష్టంగా అనిపించింది. కాలేజ్ లో వచ్చిన మెడల్స్ చూసింది. బీరువాలో హ్యాంగర్స్ కు వేలాడదీసిన తెల్లటి కోటును చూస్తూ చాలాసేపు అన్యమనస్కంగా గడిపింది.
వాళ్ళ నాన్న ఆదివారం పార్టీకి కావలసిన ఏర్పాట్లను ఫోన్ లో అరేంజ్ చేస్తున్నాడు. ఆరోజు రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు ఆద్యతో ఆనంద్ చెల్లెలి కూతురు అలేఖ్య ఫోన్ లో మాట్లాడింది.
“వదినా, కంగ్రాచులేషన్స్. కాబోయే కలెక్టరమ్మ గారూ ఇక నుంచీ ప్రజలతోనూ, అధికారులతోనూ, పేపర్ వాళ్ళతోనూ, రాజకీయనాయకుల తోనూ మీరు ఎంతో బిజీగా గా వుంటారు కదా! వీళ్ళందరితో నేనెలా విసిగి పోతున్నానో నీకు తెలుసు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కదా! ఒక ఎం.ఆర్.ఓ గా నేనిప్పుడు నీకింది అధికారిని కూడా. మా తలనొప్పులు నీక్కూడా రాబోతున్న శుభ సందర్భం లో ‘వెల్కమ్ టు అవర్ జోనర్ ‘ “ అంటూ సరదాగా మాట్లాడింది.
అప్పుడు ఆద్య ఇంకోరకంగా కూడా దిగులుపడింది. అంటే ఇప్పుడు ఏ.సి. రూం లో వైద్యం చేసుకునే తను ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ జిల్లా అంతా తిరగడమే కాకుండా అలేఖ్య చెప్పిన వాళ్ళందరితో ఇబ్బంది పడవలసి వస్తుందా? ఒక డాక్టర్ గా ఎంతో బాధ్యతగా వైద్యం చేస్తూ రోగులను కాపాడటం లో తనకు తృప్తి లేదనిపించి కలెక్టర్ గా వెళ్ళాలని తనకు అనిపించిందా? ఎటూ తేల్చుకోలేక ఆ రోజు కలత నిదుర పోయింది ఆద్య.
మొదటి అప్పాయింట్మెంట్ గా రూరల్ ఏరియా లో పోస్టింగ్ ఇచ్చినందున ఆ మారుమూల ప్రభుత్వ మండల ఆసుపత్రి లో డాక్టర్ గా పనిచేస్తోంది ఆద్య.
ఆద్యకు కంగ్రాట్స్ చెప్పడానికి ఆ ముందు రోజు ఆనంద్, అరుంధతి అక్కడికి వచ్చారు.
ఆరోజు ఉదయం మామూలుగానే ఆసుపత్రికి వెళ్ళింది ఆద్య. కొద్దిసేపటికి ఒక గర్భవతి మహిళను ఆటో లో తీసుకొని వచ్చారు వాళ్ళ బంధువులు. ఆ మహిళకు కాన్పు సమయం దగ్గర పడటం తో బాగా నొప్పులతో ఇబ్బంది పడుతోంది. వాళ్ళు ఆ ఊర్లో కాకుండా పక్కనే ఉన్న అడవిలో పళ్ళ తోటల దగ్గర కాపలా ఉండేవాళ్ళు. అందువల్ల ఆసుపత్రి అధికారులు ముందుగా చెప్పి ఉన్నా అవసరానికి 108 ను ఉపయోగించుకోవడం కూడా వాళ్ళకు తెలియలేదు.
ఆద్య వెంటనే అలర్ట్ అయ్యింది. ‘బిడ్డ అడ్దం తిరిగింది, కాన్పు కష్టం’ అనుకుంటూ ఆపరేషన్ కు సిద్ధమయ్యింది, నర్సు సహాయంతో. దాదాపు రెండు గంటల నిర్విరామ కృషితో తల్లీ పిల్లలు ఆపదనుంచి క్షేమంగా బైట పడ్డారు.
ఆద్యకు ఎంతో టెన్షన్ రిలీజ్ అయ్యింది. తల్లి ఆరోగ్యం, పాప ఆరోగ్యం బాగుంది. అలసిన ఆద్యకు
ఆసుపత్రి చూడటానికి వచ్చిన అరుంధతి పళ్ళరసం ఇచ్చి తల నిమిరింది. ఆద్య అలసటగా నవ్వింది.
ఇంతలో ఆ గర్భవతి భర్త, అత్త, అమ్మ ఆద్య ఉన్న రూం లోపలికి వచ్చారు.
“డాక్టరమ్మా…నువ్వు దేవతవమ్మా. నా కూతురిని బ్రతికించావు” అంటూ కాళ్ళు పట్టుకోబోయింది, గర్భవతి వాళ్ళమ్మ.
“ఆ..ఆ… వద్దు. వద్దు” అంటూ ఆద్య దూరం జరిగింది.
“నేను చెయ్యగలిగింది చేశాను. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. అంతా భగవంతుని దయ. మీ అదృష్టం కొద్దీ వాళ్ళు క్షేమంగా వున్నారు” అంది మళ్ళీ.
“క్షమించండమ్మా. చాలా సేపటికి గానీ ఆటోలు దొరకలేదమ్మా” అంటూ చేతులు జోడించాడు గర్భవతి భర్త.
అరుంధతి మౌనంగా వాళ్ళను, ఆద్యను మార్చి మార్చి చూస్తోంది, ‘చూశావా? డాక్టర్ గా నీ ధర్మం నెరవేర్చినందుకు ఎన్ని కృతజ్ఞతలు కురిపిస్తున్నారో!” అన్నట్లుగా వున్నాయి ఆద్యను చూస్తున్న ఆమె చూపులు.
ఆద్య కూడా తను చేసిన వైద్యానికి వాళ్ళెంత సంతోషపడుతున్నారో చూస్తూ తృప్తి పడుతోంది. అటు అరుంధతి వైపు కూడా ఆలోచనగా చూస్తోంది. ఆమె మనసు ద్వైదీభావనతో కొట్టుమిట్టాడుతోంది. ‘తను కలెక్టర్ గా ఉండి, వారికి ఆర్థికంగా ఎన్ని ఉచిత సౌకర్యాలను కల్పించినా వారి కళ్ళల్లో ఇంత కృతజ్ఞతా భావాన్ని చూడలేదేమో?’ అని అనుకుంటోంది.
అది అరుంధతి గమనిస్తూ ఉండిపోయింది.
......
ఆదివారం పార్టీ దగ్గర ఆద్య ఫ్రెండ్స్ ఆద్యను ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు.
“ఇంక నీకు ఉదయం లేస్తే ఫినాయిల్ వాసనలు, రోగుల బాధలు ఉండవు. నీ చుట్టూ అడుగడుగునా అటెండర్స్ ఉంటారు. నువ్వేం చెప్పినా నీ ఆజ్ఞను పాటించే జిల్లా ఉద్యోగస్తులు ఉంటారు” అంటూ.
కానీ ఆ మాటలకు ఆద్య ముఖం సంతోషంతో వెలగలేదు. చిరు మందహాసం తో కొంచెం ఆలోచనగా చూస్తోంది అందరినీ.
అందరూ డిన్నర్ చేసిన తరువాత ఆద్య ఇలా చెప్పింది.
“ఐ. ఏ. ఎస్. రాంక్ తెచ్చుకోవడం సంతోషమే. ప్రతి ఉద్యోగం లో ఉన్నట్లుగానే ఐ. ఏ. యస్. లోనూ కష్టనష్టాలున్నాయి. డాక్టర్ వృత్తిలోనూ ఉన్నాయి. అంతమాత్రాన డాక్టర్ వృత్తిని చిన్నబుచ్చలేను. డాక్టర్ అంటే దైవంతో సమానం. ఒక్కొక్కరి ఆరోగ్య సమస్యలను తీర్చినప్పుడు వారి కృతజ్ఞతాపూర్వకమైన ప్రవర్తన మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది. అది ఐ.ఏ.యస్. ఆఫీసర్ గా నేను ప్రభుత్వ చట్టాలను అమలు చేసి ప్రజలకు కల్పించే సౌకర్యాల కంటే ఖచ్చితంగా ఎక్కువగానే మనకు సంతోషాన్ని ఇస్తుంది.
ఇంకొక విషయం కూడా నేను ఆలోచించాను. ప్రభుత్వం వారు ఐదు సంవత్సరాలు ప్రజల డబ్బును ఎంతో ఖర్చు చేసి నన్ను వైద్య విద్య చదివిస్తే, నేను వైద్యవృత్తి పక్కన పెట్టీ ‘దేశద్రోహిని’ కాలేను. ఐ. ఏ. ఎస్. ను స్వీకరించలేను. కలెక్టర్ కావడం తప్పుకాదు. వైద్య వృత్తిని కాదని కలెక్టర్ గా వెళ్ళడం తప్పనిపించింది. నా అవసరం ప్రజలకు డాక్టర్ గానే ఎక్కువ ఉందనిపిస్తోంది. మాతృదేశ రుణం వైద్య సేవ చేస్తూ కూడా తీర్చుకుంటాను. నన్ను అభినందించిన మీకందరికీ నా కృతజ్ఞతలు. నా కళ్ళు తెరిపించిన మా అమ్మకు నేనెంతో రుణపడి ఉంటాను”
ఆద్య మాటలు పూర్తయ్యేలోపే అందరికీ వెనగ్గా కూర్చున్న వాళ్ళమ్మ లేచి వచ్చి కూతురి చెంపలు నిమిరి నుదురు ముద్దాడింది. ఎంత సంఘర్షణ తరువాత కూతురిలో ఈ మార్పు వచ్చిందో అర్థం చేసుకుంది. అరుధతి ఆనందభాష్పాలు రాలుస్తుండగా… తను తప్పటడుగు వేసి తప్పు చెయ్యకుండా కాపాడిన అమ్మ ఆనందాన్ని చూసి దీర్ఘంగా శ్వాసించింది ఆద్య.
*** సమాప్తం***
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
Comments