కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Detective Pravallika Episode 4 - Udaya Ragam' Telugu Web Series written by Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
మినిష్టర్ వీరేశం గారి ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ కేస్ సాల్వ్ చేసింది ప్రవల్లిక.
డ్రగ్ మాఫియా కేస్ విషయమై బెంగళూర్ వెళ్లిన తండ్రి పురంధర్ కి సహాయం కావాలని తెలియడంతో, తాను కూడా బెంగళూర్ వెళ్లాలనుకుంటుంది.
తన అన్న కొడుకు ఉదయ్ ని బెంగళూర్ పంపిస్తున్నానని చెబుతాడు ఏ సి పి ప్రతాప్.
తాను కూడా వస్తానని చెప్పడానికి ఉదయ్ దగ్గరకు వెడుతుంది ప్రవల్లిక.
ఇక చదవండి...
ఇంతలో తన ఫోన్ మ్రోగటంతో చూసింది ప్రవల్లిక. అమ్మ కాల్ చేస్తోంది.
"వన్ మినిట్ అంకుల్" అని ప్రతాప్ తో చెప్పి కాస్త అవతలికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రవల్లిక.
"ప్రవల్లికా! మీ నాన్నగారు ఫోన్ చేసారు. ఆయన వెళ్ళింది బెంగళూరులో డ్రగ్ మాఫియా కేస్ అని చెప్పారు కదా. అక్కడ కేస్ కాస్త కష్టంగానే ఉందట. అక్కడ ప్రతాప్ అంకుల్ లా హెల్ప్ చేసే పోలీస్ ఆఫీసర్ లు లేరట. లోకల్ డిటెక్టివ్ లు డ్రగ్ మాఫియా కేస్ కాబట్టి నాన్నకు అసిస్ట్ చేయడానికి జంకుతున్నారట. పోనీ ప్రవల్లికను పంపమంటారా అంటే నన్ను కోప్పడ్డారు. చిన్నపిల్లను మాఫియా గొడవల్లో ఇరికించడమేమిటని బాగా అరిచారు. ఇంతకీ డైమండ్ నెక్లెస్ కేస్ ఏమైంది? ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళావు." అంది శారద.
"మళ్ళీ చెప్తానమ్మా! ఇక్కడ బిజీగా ఉన్నాను. కాసేపాగి ఫోన్ చేస్తాను" అని ఫోన్ పెట్టేసింది ప్రవల్లిక.
తరువాత ప్రతాప్ దగ్గరకు వెళ్లి " అంకుల్! నేను అర్జెంట్ గా బెంగళూర్ వెళ్ళాలి. ఏర్పాటు చేయగలరా? ఇంట్లో తెలియకూడదు. తెలిస్తే ఒప్పుకోరు. అక్కడికి చేరుకున్నాక చెబుతాను" అంది.
"వద్దమ్మా! నాన్నగారు వెళ్ళింది డ్రగ్ మాఫియా కేసు గురించి. ఆ కేస్ లో నీ ప్రమేయం వద్దు. అనవసరంగా చిక్కుల్లో పడతావు. ఆ మాఫియా వాళ్ళు కరుడుగట్టిన దుర్మార్గులు. వాళ్ళ దృష్టిలో పడటం మంచిది కాదు" అన్నాడు ప్రతాప్.
" నాన్నగారు ఆల్రెడీ అక్కడ చిక్కుల్లో ఉన్నట్లున్నారు. అలాంటప్పుడు నేను ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండగలనా? నేనేమీ గన్ తీసుకొని మాఫియా డెన్ లోకి దూరడం లేదు. జస్ట్ నాన్నగారి ఆలోచనలు షేర్ చేసుకుంటాను. నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాను. అంతే" అంది ప్రవల్లిక.
"పురంధర్ గారు ఆల్రెడీ నాకు ఈ బెంగళూర్ మాఫియా కేస్ కాంప్లికేట్ అయిన విషయం చెప్పారు.
అందుకోసం ఒక మనిషిని ఎంపిక చేసి ఇప్పుడే బెంగళూరు పంపుతున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు" అని చెప్పాడు ఏ సి పి ప్రతాప్.
ఇంతలో ఒక ఆరడుగుల అందమైన యువకుడు సెక్యూరిటీ ఆపుతున్నా లెక్క చెయ్యకుండా ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని కాసేపు హాల్ లో కూర్చోమన్నాడు ప్రతాప్.
తరువాత ప్రవల్లిక వంక చూసి "ఇక నువ్వు ఇంటికి వెళ్ళమ్మా! నాన్న గారికి ఏ ఇబ్బందీ కలక్కుండా నేను చూసుకుంటాను" అన్నాడు.
"ప్లీజ్ అంకుల్. నన్నుకూడా బెంగళూరు వెళ్లనివ్వండి. మీరు పంపించే వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళైతే , నేను కూడా వాళ్ళతో వెడతాను. అతని ఫోన్ నంబర్ ఇస్తే నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ప్లీజ్... " అంది ప్రవల్లిక.
కాస్సేపు అలోచించి, ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు ప్రతాప్. వెంటనే అతనికి కాల్ చేసింది ప్రవల్లిక.
"సర్, నేను డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లికను. నాన్నగారికి హెల్ప్ చెయ్యడానికి మీరు వెళుతున్నట్లు ప్రతాప్ అంకుల్ చెప్పారు. నన్ను కూడా మీతో తీసుకొని వెళ్ళండి. ప్లీజ్ సర్!" అంటూ అభ్యర్థించింది అతన్ని,
"ముందు నన్ను సర్ అనడం మానేయండి. నేను మీ ఈడు కుర్రవాడినే." అన్నాడతను.
ప్రతాప్ వంక ఆశ్చర్యంగా చూసింది ప్రవల్లిక.
" మా అన్న కొడుకు IPS ట్రైనింగ్ పూర్తి చేసి, పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతన్నే ఇప్పడు మీ నాన్నగారికి సహాయంగా పంపిస్తున్నాను. ఇప్పుడు హాల్ లో కూర్చుంది అతనే" అన్నాడు ప్రతాప్.
వెంటనే ఫోన్ కట్ చేసి, హాల్ లో ఉన్న అతని వద్దకు వెళ్ళింది ప్రవల్లిక.
"సర్" అని వెంటనే నాలిక్కరుచుకొని "మీ పేరు తెలియక సర్ అన్నాను. ఐ యామ్ ప్రవల్లిక" అంది.
అప్రయత్నంగా అతనితో చెయ్యి కలిపింది ప్రవల్లిక.
"నైస్ టు మీట్ యూ మిస్ ప్రవల్లికా' అన్నాడతను, ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.
ఎందుకో అతని కళ్ళలోకి సూటిగా చూడటానికి ఇబ్బందిగా అనిపించింది ప్రవల్లికకు.
బహుశా అది సిగ్గు వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు.
ఎప్పుడు లేనిది ఇదేమిటి?
నేను పురంధర్ గారి అమ్మాయిని.
హ్యాండ్ సమ్ గా ఉన్న అబ్బాయి చెయ్యి తగలగానే డిస్టర్బ్ కాకూడదు.
ఐ యామ్ ప్రవల్లిక... ఐ యామ్ ప్రవల్లిక... ఐ యామ్ ప్రవల్లిక...
మనసులోనే తనను తాను హిప్నటైజ్ చేసుకోవడానికి ప్రయతిస్తూ పైకే అనేసింది 'ఐ యామ్ ప్రవల్లిక' అంటూ.
"ఐ యామ్ ఉదయ్... ఐ యామ్ ఉదయ్... ఐ యామ్ ఉదయ్. పేరు మూడు సార్లు చెప్పడం మీ ఇంటి ఆచారం అనుకుంటాను" నవ్వుతూ అన్నాడతను ప్రవల్లిక చెయ్యి వదలకుండానే.
"మా ఆచారాలు పాటించాలని అప్పుడే డిసైడ్ అయ్యారా?" అంటూ మెల్లగా తన చేతిని విడిపించుకుంది ప్రవల్లిక.
తరువాత ఇద్దరూ ప్రతాప్ వద్దకు వెళ్లారు
" పోస్టింగ్ రాకముందే పురంధర్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నీకు. ఆల్ ది బెస్ట్ ఉదయ్. టేక్ కేర్ అఫ్ ప్రవల్లిక. తనకు ఏ ఇబ్బందీ కలక్కుండా చూసుకో" అని ఉదయ్ తో అన్నాడు ప్రతాప్.
తరువాత ప్రవల్లిక వైపు తిరిగి " నిన్ను బెంగుళూరు పంపినందుకు మీ డాడీ కి నామీద కోపం రాకుండా నువ్వే మేనేజ్ చెయ్యాలి. ఐ యామ్ ష్యూర్ .. ఈ కేస్ లో కూడా నీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటావు" అన్నాడు.
" బాబాయ్. ఈ జూనియర్ కి కూడా కాస్త అవకాశం ఇవ్వమనండి టాలెంట్ చూపించడానికి"అన్నాడు ఉదయ్ నవ్వుతూ.
" ఐ పి ఎస్ కి సెలెక్ట్ అయి నీ టాలెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు. ఇద్దరూ కలిసి పురంధర్ గారికి హెల్ప్ చెయ్యండి చాలు. ఈ కేస్ గురించి మీకు చాలా వివరాలు చెప్పాలి. ఇది సరైన ప్రదేశం కాదు. నా ఆఫీస్ కి రండి " అన్నాడు ప్రతాప్.
ప్రవల్లిక దినేష్ వంక చూస్తూ " చూడు దినేష్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో మీ నాన్నతో వివరంగా మాట్లాడు. ఆయన నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. పరిస్థితి చెయ్యి దాటిపోయి ఉంటే మాత్రం ఏ సి పి గారి హెల్ప్ తీసుకోండి" అంది .
అలాగేనన్నట్లు తల ఊపాడు దినేష్, దించిన తల ఎత్తకుండానే.
కాస్త జాలి కలిగింది ప్రవల్లికకు. కానీ అతను చేసిన తప్పును సూరజ్ మీదకు వెయ్యాలని చూడడం మాత్రం క్షమించలేక పోతోంది.
ప్రతాప్ వీరేశం వంక చూస్తూ "నా వెహికల్ గేట్ బయట ఉంది. లోపలికి పంపండి" అన్నాడు.
వెహికల్ లోపలికి రాగానే డ్రైవర్ తో " నువ్వు ఆఫీస్ కి వెళ్ళు. మేము తరువాత వస్తాం " అని చెప్పి పంపించేశాడు.
తర్వాత వీరేశంతో "డ్రగ్ మాఫియా కేస్ కదా. మా వెహికల్ ని ఎవరైనా ఫాలో అవుతూ ఉండొచ్చు. మేము వెళ్ళడానికి మీ వెహికల్ అరేంజ్ చెయ్యండి ప్లీజ్" అన్నాడు.
వెంటనే తన డ్రైవర్ ను పిలిచాడు వీరేశం.
"వీళ్ళను కావలసిన చోట డ్రాప్ చెయ్యి' అని డ్రైవర్ తో చెప్పాడు.
వీరేశానికి థాంక్స్ చెప్పి, ఉదయ్, ప్రవల్లికలతో బయలుదేరాడు ప్రతాప్.
ప్రతాప్ ఉద్దేశం అర్థమయింది ప్రవల్లికకు.
'ఈ కేస్ లోని సీరియస్ నెస్ తమకు తెలియాలనీ, అప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటామనీ ఆయన ఇలా చేసారు. కానీ ఈ కేస్ కు తాము భయపడటం లేదనీ, తేలిగ్గానే సాల్వ్ చేస్తామనీ ఆయనకు తెలియాలి' అనుకుంది ప్రవల్లిక.
అనుకున్నదే తడవుగా ఉదయ్ వంక తిరిగి, " చూసారుగా. ఇది చాలా సీరియస్ కేస్ ఉదయ్ గారూ! ఇప్పుడైనా సరే. మీరు డ్రాప్ అవుతానంటే చెప్పండి. మేం ఏమీ అనుకోము' అంది.
" మీరు సైకాలజీ స్టూడెంటా?" ప్రశ్నించాడు ఉదయ్.
" కాదు. బి టెక్ స్టూడెంట్ ని. ఇంతకీ ఎందుకలా అడిగారు?" అడిగింది ప్రవల్లిక.
"ఏంలేదు. సరిగ్గా నేను చెప్పాలనుకున్నది మీరు చెప్పారు. నా మనసులో మాట మీకెలా తెలిసిందా అని అలా అడిగాను" అన్నాడు ఉదయ్.
"అంటే మీరు డ్రాప్ అవుతున్నట్లేనా?" అతని ఉద్దేశం తనకు అర్థం కానట్లు అంది ప్రవల్లిక.
"కాదు. మీరు ఇక్కడే వుండి, సింపుల్ కేస్ లు చూసుకోండి… నేను బెంగళూర్ వెళ్లి నాన్నగారికి హెల్ప్ చేస్తాను" అన్నాడు ఉదయ్ , ఆమెను ఉడికిస్తూ.
" చూడండి అంకుల్. నేను సాల్వ్ చేసినవి సింపుల్ కేసులా ?' కాస్త కోపం నటిస్తూ అంది ప్రవల్లిక.
ప్రతాప్ కలుగజేసుకుంటూ " చూడు ఉదయ్! నీ ఉద్దేశంలో చిన్న కేసులు కూడా మేము సాల్వ్ చెయ్యలేక, ప్రయివేట్ డిటెక్టివ్ ల హెల్ప్ తీసుకుంటామనా?" ప్రవల్లికకు సపోర్ట్ చేస్తున్నట్లుగా అన్నాడు.
"చూడండి మిస్ ప్రవల్లికా! మనం ఇపుడు వెళ్తున్నది మా బాబాయ్ ఆఫీసుకి. అవునా? " హఠాత్తుగా అడిగాడు ఉదయ్.
కాదు. అంకుల్ డ్రైవర్ కి ఎక్కడికి వెళ్లాలో చెప్పడం, మనం ఏ సి పి ఆఫీస్ కి కాకుండా వేరే రూట్లో వెళ్లడం మీరు గమనించారు. అది నాకు తెలుసు" అంది ప్రవల్లిక.
'యు ఆర్ బ్రిలియంట్ ప్రవల్లిక గారూ! మీతో కలిసి ప్రయాణం చెయ్యబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నాడు ఉదయ్.
కార్ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఆగింది.
డ్రైవర్ ను వెళ్లిపొమ్మన్నాడు ప్రతాప్.
గెస్ట్ హౌస్ మేనేజర్, ప్రతాప్ కి సెల్యూట్ చేసి లోపలికి ఆహ్వానించాడు. ముగ్గురికీ తనే స్వయంగా కాఫీ సర్వ్ చేసి, బయటకు వెళ్లి పోయాడు.
ఒకసారి గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు ప్రతాప్.
" బెంగళూర్ కేంద్రంగా చాలా రోజులనుంచి ఒక డ్రగ్ రాకెట్ నడుస్తోంది. వాళ్ళు చేసే మొదటి పని ప్రముఖులతో ఏదో నెపంతో పరిచయం చేసుకొని ఫోటోలు దిగడం.
ఆ ఫోటోలు చూపి తమకు పెద్దల సహకారం ఉందని సామాన్యులను నమ్మిస్తారు. సెలెబ్రిటీలను, రాజకీయ నాయకుల పిల్లల్ని, వ్యాపారవేత్తలని ఏదో ఒక రకంగా లోబరుచుకుని, బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వారి ద్వారా మరికొంత మందిని తమ గ్రిప్ లోకి తెచ్చుకుంటారు. ఈ మధ్య ఒక యువ పారిశ్రామికవేత్తను బ్లాక్ మెయిల్ చెయ్యాలని ప్రయతించి, అతను అంగీకరించకపోవడంతో చంపేశారు. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని అతని భార్యను బెదిరించారు. కానీ ఆమె ధైర్యంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆమెకు అండగా నిలిచిన ఒక సిన్సియర్ పోలీస్ ఉన్నతాధికారి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
అది రోడ్ ప్రమాదం కాదనీ, హత్యేననీ అతని భార్య గట్టిగా నమ్ముతోంది. అక్కడ వున్న డిటెక్టివ్ లు మాఫియా తో గొడవలెందుకని ఆ కేస్ టేకప్ చెయ్యలేదు. ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ నాకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆవిడ నా సహాయం కోరింది. నేను పురంధర్ గారికి ఆ కేస్ విషయం చెప్పగానే, వెంటనే ఆ కేస్ పరిశోధిస్తానని చెప్పారు. సిటీలలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిందనీ, యువత నిర్వీర్యమైపోతోందనీ చాలా బాధ పడ్డారు. ఎవరో ఒకరు ప్రాణాలకు తెగించి, డ్రగ్ మాఫియాను ఎదిరించాలనీ, అది తానే అయితే ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తాననీ చెప్పారు.
ఇటీవలి కాలంలో వారి దృష్టి మన సిటీ పైన పడింది. కాబట్టి ఈ కేస్ సాల్వ్ చేస్తే , మన రాష్ట్రంలో డ్రగ్స్ సప్లై ని అదుపు చెయ్యవచ్చని కూడా ఆలోచించి, బెంగళూరు వెళ్లారు పురంధర్ గారు"
చెప్పడం ఆపి, ఇద్దర్నీ పరిశీలనగా చూసాడు ప్రతాప్.
ఇద్దరిలో ఇందాకటి చిలిపితనం పోయి, సీరియస్ నెస్ ఉండడం చూసి ఆనందించాడు.
" ఇదే నేను కోరుకున్నది. అప్పుడే జాగ్రత్తగా ఉండగలుగుతారు" అన్నాడు ప్రతాప్.
" అవును బాబాయ్. కేస్ ను సీరియస్ గానే డీల్ చెయ్యాలి. ఎవరో ఫోన్ చేసి ఫలానావాడు నేరస్థుడు అని చెప్పేస్తారని ఎదురు చూడకూడదు” అన్నాడు ఉదయ్ .
అతని మాటల్లో ఇందాకటి చిలిపితనం గమనించింది ప్రవల్లిక.
'ఇతని సంగతి ఇప్పుడు కాదు, తరువాత చెప్తాను' అని మనసులో అనుకుంది..
తిరిగి చెప్పడం కొనసాగించాడు ప్రతాప్.
'కోవిడ్ కారణంగా పురంధర్ గారు వెళ్లిన మరుసటి రోజునుంచే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసారు.
మీరు కార్ లో వెళ్ళడానికి ఏర్పాటు చేశాను. మీరిద్దరూ డ్రైవింగ్ బాగా తెలిసిన వాళ్ళని నాకు తెలుసు. కానీ మీకు జర్నీ స్ట్రైన్ ఉండకూడదని డ్రైవర్ ను ఏర్పాటు చేశాను. ఇక మీ ఇద్దరికీ గన్ లైసెన్స్ లేదు. అందుకే మా సి ఐ కిషోర్ ను మీతో పంపిస్తాను. అతను మఫ్టీలోనే మీతో వస్తాడు. అతని దగ్గర గన్ ఉంది. దాని అవసరం రాదనే అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితివస్తే అతను దాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు అతన్ని పరిచయం చేస్తాను " అని, పక్క గదిలో వున్న కిషోర్ కు మిస్డ్ కాల్ ఇచ్చాడు.
వెంటనే వీళ్ళు ఉన్న గదిలోకి వచ్చాడు కిషోర్.
" ఐ యామ్ కిషోర్ ' అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడతను. అతని వయస్సు దాదాపు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు. బాగా దృఢంగా, చురుగ్గా ఉన్నాడు.
ఉదయ్, ప్రవల్లికలు కూడా తమను పరిచయం చేసుకున్నారు.
" మన సిటీ కి బెంగుళూరు నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు తెలిసింది. ఆ కేస్ విషయమై అక్కడికే వెళ్తున్నాను. సమయానికి మీరు కూడా బెంగళూర్ వెళ్తున్నట్లు తెలిసింది. కాబట్టి అందరం కలిసే వెళ్దాం" అన్నాడతను.
" థాంక్ యు సర్.." అన్నారు ఉదయ్, ప్రవల్లికలు.
" మీకందరికీ ఇక్కడే లంచ్ ఏర్పాటు చేశాను. భోంచేసి బయలుదేరండి” అన్నాడు ప్రతాప్.
"అయ్యో! మీకెందుకు సర్ శ్రమ" అంది ప్రవల్లిక.
"నేను చెప్పగానే పొద్దున్న ఆరింటికి బయలుదేరి వచ్చావు. ఇంతవరకు టిఫిన్ కూడా చెయ్యలేదు. ఇక భోజనం కూడా చెయ్యకుండా వెడితే నీరసించిపోతావు" అన్నాడు ప్రతాప్.
ప్రవల్లిక వంక ప్రశంసాపూర్వకంగా చూసారు ఉదయ్, కిషోర్ లు.
లంచ్ ముగిసాక, ప్రతాప్ గారి వద్ద సెలవు తీసుకొన్నారు ముగ్గురూ.
డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు కిషోర్.
ఉదయ్, ప్రవల్లికలు వెనక సీట్లో కూర్చున్నారు.
కారు బెంగళూరు వైపు సాగుతోంది.
"నీ పేరేమిటి?" డ్రైవర్ ను ప్రశ్నించాడు కిషోర్.
"శివ సర్" అన్నాడతను.
"డ్రైవింగ్ బాగుంది. ఎన్నేళ్ళనుంచి చేస్తున్నావ్?" అని అడిగాడు కిషోర్.
"పాతికేళ్ళనుంచి సర్. ఆపకుండా ఇరవై గంటలు నడపగలను. అందుకే ప్రతాప్ గారు లాంగ్ డ్రైవ్ లకు నన్ను పంపిస్తుంటారు" అన్నాడు శివ.
వెనక సీట్లో వున్న ప్రవల్లికకు, ఇందాక ఉదయ్ తనను టీజ్ చేసిన విషయం గుర్తుకు వచ్చింది.
అతనికి ఎలా రిటార్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నంతలో అతనే
"మీ పరిశోధనల గురించి బాబాయ్ చెప్పారు. మిమ్మల్ని వెతుక్కుంటూ క్లూస్ వాటంతట అవే వస్తాయని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని ఆలోచిస్తున్నారా?" అన్నాడు.
"అదేం కాదు. మీరు ఐ పి ఎస్ సెలెక్ట్ అయినవాళ్లు కదా. 'ఏదైనా మంచి పజిల్ ఇస్తే బెంగళూర్ వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటారు' అని అనుకుంటున్నాను" అంది ప్రవల్లిక.
"పజిల్స్ అంటే నాకు బలే సరదా. స్కూల్ డేస్ లో బాగా ఎంజాయ్ చేసేవాడిని. నాకు తెలిసి మీరడిగే ప్రశ్నలు శివ ఆన్సర్ చెయ్యగలడనుకుంటాను. అతని వల్ల కాకపోతే నేను ట్రై చేస్తాను. ఏమంటావ్ శివా?" అన్నాడు ఉదయ్.
"అలాగే సర్. అడగమనండి" అన్నాడు శివ ఉత్సాహంగా.
"నీకయితే కొన్ని సరదా ప్రశ్నలు అడుగుతాను. ఒక ఏనుగును ఫ్రిజ్ లో పెట్టాలి. ఎలా?" అడిగింది ప్రవల్లిక.
"ఏనుగు బొమ్మనేమో! " అన్నాడు శివ.
"కాదు. నిజం ఏనుగునే" అంది ప్రవల్లిక.
"ఏనుగుకంటే పెద్ద ఫ్రిజ్ తయారు చేయించాలి" అన్నాడు శివ.
"కాదు. ఫ్రిజ్ డోర్ తీసి పెట్టాలి. మరో ప్రశ్న. ఒక అడవిలో జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఒక జంతువు మాత్రం రాలేదు. ఆ జంతువు ఏమిటి?"
కాస్సేపు ఆలోచించాడు శివ.
"తెలీదు మేడం. మీరే చెప్పండి" అన్నాడు చివరికి.
"ఏనుగు రాలేదు. మనమే ఫ్రిజ్ లో పెట్టముగా. ఈసారి మాత్రం నువ్వు సరిగ్గా చెప్పేస్తావు. ఒక ఒంటెను ఫ్రిజ్ లో పెట్టాలి. ఎలా?" అడిగింది ప్రవల్లిక.
"ఫ్రిజ్ డోర్ తీసి పెడతాము" టక్కున చెప్పాడు శివ.
"కాదు.. ఏనుగును బయటకు తీసి పెడతాము" సంభాషణలో తనూ పాలు పంచుకుంటూ అన్నాడు కిషోర్.
"కరెక్ట్. ఈసారి మాత్రం శివ టక్కున చెప్పేస్తాడు. ఒక అడవిలో జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఒక జంతువు మాత్రం రాలేదు. ఆ జంతువు ఏమిటి?" ఇందాక అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగింది.
" ఏనుగు. ఇందాకే అడిగారుగా" అన్నాడు శివ.
"కాదు. ఒంటె' అంటూ నవ్వింది ప్రవల్లిక.
"మీ ప్రశ్నలకు బుర్ర వేడెక్కింది మేడం. ఎక్కడైనా ఆపి టీ తాగాలి" అన్నాడు శివ.
"సరే. ఈసారి మీటింగ్ కి జంతువులన్నీ వచ్చాయి. ఎలా?" అడిగింది ప్రవల్లిక.
ఏం చెప్పాలో అర్థం కాక రెండు చేతులతో బుర్ర గోక్కున్నాడు శివ.
"నువ్వు టీ అడిగావు కదా ! పాలకోసం ఫ్రిజ్ తీసినప్పుడు ఒంటె తప్పించుకుంది" అంది ప్రవల్లిక.
ఆ స్పాంటేనియస్ ప్రశ్న, జవాబులకు అందరూ నవ్వేశారు.
"నేను కూడా శివను ఒక ప్రశ్న అడుగుతాను. బెంగళూరు వెళ్లాల్సిన వాళ్ళు వైకుంఠం వెళ్లారట. ఎలా? జవాబు నేనే చెబుతాను. ఇలా స్టీరింగ్ వదిలేసి బుర్ర గోక్కుంటే…” అన్నాడు ఉదయ్.
వెంటనే స్టీరింగ్ పట్టుకున్నాడు శివ.
"ఐ పి ఎస్ లెవెల్ ప్రశ్నలు అడగలేదని ఉదయ్ సార్ కి కోపం వచ్చినట్లుంది. TTFFSSE ... తరువాత వచ్చే లెటర్ ఏమిటి?" అడిగింది ప్రవల్లిక.
"ప్రతి లెటర్ రిపీట్ అయింది కాబట్టి నెక్స్ట్ లెటర్ E అనుకుంటాను" అన్నాడు కిషోర్.
కాదు.టు, త్రి,ఫోర్,ఫైవ్,సిక్స్,సెవెన్,ఎయిట్ , తరువాత నైన్ కాబట్టి N " చెప్పాడు ఉదయ్.
"వెల్ సెడ్' అంటూ చప్పట్లు కొట్టాడు కిషోర్.
“నాకూ చప్పట్లు కొట్టాలనుంది కానీ ఉదయ్ బాబు ఈ సారి కైలాసం వెడతామని అంటారని ఆగాను" అన్నాడు శివ.
"మొదటి ప్రశ్న కాబట్టి సింపుల్ గా అడిగాను. ఇక సీరియస్ గా అడుగుతాను" అంది ప్రవల్లిక.
"నేను జవాబు చెప్పేసాను కాబట్టి సింపుల్ గా అడిగానంటున్నారు. నిజానికి అది కష్టమైన ప్రశ్న" " అన్నాడు ఉదయ్.
"అవును. ఆ జవాబు నాకు తట్టలేదు" అన్నాడు కిషోర్.
"మీ బాస్ గారి అన్న కొడుకని వెనకేసుకొని రావద్దు కిషోర్ గారూ! ఈ సారి నిజంగా కష్టమైన ప్రశ్న అడుగుతాను. చెప్పమనండి" అంది ప్రవల్లిక.
"ఐ యామ్ వెయిటింగ్" అన్నాడు ఉదయ్ సినిమాటిక్ గా.
" MTWTF... తరువాత ఏమిటి?" అడిగింది ప్రవల్లిక.
" ఆల్టర్నేట్ గా T వస్తోంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది కూడా T " అన్నాడు కిషోర్.
"కాదు. చెప్పానుగా కష్టమైన ప్రశ్న అని. IPS గారే చెప్పాలి" అంది ప్రవల్లిక.
అంతలో ఉదయ్ ఫోన్ మోగింది.
సరదాగా సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో అనుకోని ప్రమాదం ఎదురవుతుందనీ, వాళ్ళని... ముఖ్యంగా ప్రవల్లికని కైలాసమో.. వైకుంఠమో.. చేర్చే ప్రయత్నం జరుగుతోందనీ ఆ క్షణంలో వాళ్లకు తెలీదు.
నెక్స్ట్ ఎపిసోడ్ " ప్రవల్లిక ఇన్ డెత్ ట్రాప్ " త్వరలో...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
.
Comments