#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #DevudiTheerpu, #దేవుడితీర్పు, #TeluguKathalu, #తెలుగుకథలు

Devudi Theerpu - New Telugu Story Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 21/01/2025
దేవుడి తీర్పు - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వెంకట్రావు గారు టీవీ చూస్తూ సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు మధ్యాహ్నం 3. 30 అయింది. జానకి గారు వంటింట్లో “టీ” పెట్టే హడావిడి లో వున్నారు. 4 గంటలకి వాళ్ళు టీ తాగే సమయం.
వెంకట్రావు గారికి చాలా ఆనందంగా వుంది. కారణం ఆరోజు కూతురు నవ్య ముంబై నుండి వస్తోంది. అందుకే ఆరోజు సాయంత్రం క్లబ్ కి వెళ్లే ప్రోగ్రాం విరమించుకున్నారు.
“”జానకీ.. అమ్మాయి ఫ్లైట్ ఎన్నింటికి? “ అని భార్యని అడిగేరు.
“ఇప్పటికి మూడు సార్లు చెప్పేను.. సాయంత్రం 6. 30 కి అని ”.. అంది ఆవిడ విసుగ్గా.
“సరేలే.. డ్రైవర్ కి కబురు చేస్తాను” అన్నారు.
వెంకట్రావు, జానకి దంపతులకి నవ్య ఒక్కగానొక్క కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.
నవ్య ఇంజనీరింగ్ చేసి, ముంబై లో ఇన్ఫోసిస్ లో మంచి పొజిషన్ లో సెటిల్ అయింది.
ఆమె గత మూడు సంవత్సరాలు గా చెపుతూనే వుంది.. "నాన్నగారు! మీరు రిటైర్ అయ్యేక నా దగ్గరకి ముంబై వచ్చెయ్యండి” అని
విశాఖపట్నం వదిలి ఉండలేక, ఆయన, ముంబై ఎప్పుడయినా కూతురిని చూసి రావడానికి తప్ప, పూర్తిగా అక్కడికి వెళ్లే ఆలోచన చెయ్యలేదు. జానకికి కూడా ముంబై వాతావరణం, ఆ బిజీ లైఫ్ నచ్చదు. ఎప్పుడూ గుడికో, ప్రవచనాలకో వెళ్లి వస్తూండడం ఆవిడకి ఇష్టం. పైగా విశాఖపట్నం లో ఆవిడకి ఇరుగు పొరుగు తో కాలక్షేపం జరిగిపోతుంటుంది.
వెంకటరావు గారు జిల్లా జడ్జి గా పనిచేసి, 2సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యేరు. రిటైర్ అయ్యేదాకా ఆయన కి రోజూ కోర్ట్ కి వెళ్లడం, సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్ కి వెళ్లి అక్కడ టేబుల్ టెన్నిస్ ఆడడం.. ఇలా గడిచి పోయింది జీవితం.
3 నెలలకోసారి వీళ్ళు ముంబై వెళ్లడమో, లేక నవ్య ఇక్కడికి రావడమో జరుగుతూ ఉంటుంది.
ఆయన సర్వీస్ నుండి రిటైర్ అయ్యేక ఇప్పుడు ఉదయం వాకింగ్ కి వెళ్లడం, సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్ కి వెళ్లి రావడం, పగలంతా ఇంట్లో టీవీ చూస్తూ గడపడం అలవాటయింది.
నిన్న సాయంత్రం ఫోన్ లో నవ్య చెప్పిన విషయం ఆయన కి మరీ సస్పెన్స్ గా వుంది.
ముందు రోజు సాయంత్రం నవ్య ఫోన్ లో మాట్లాడుతూ.. " నాన్నా.. మీకు అమ్మకి ఒక సర్ప్రైజ్.. అది నేను రేపు వచ్చేక తెలుస్తుంది.. " అంది.
"ఏమిటో చెప్పమ్మా.. అన్నారు " ఆయన.
"లేదు.. అది సస్పెన్స్. నేను వచ్చేకే చెపుతాను " అని నవ్వేసింది.
డ్రైవర్ కి కాల్ చేసి చెప్పేరు. 5. 00 కల్లా డ్రైవర్ వచ్చేసేడు. కారు తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళేడు.
*
రాత్రి 7. 30 అయింది. కారు వచ్చి పోర్టికో లో ఆగింది.
జానకి, వెంకట్రావ్ గారు ఎదురు వెళ్లి కూతురిని రిసీవ్ చేసుకున్నారు.
కూతురి తో బాటు దిగిన ఓ అందమయిన యువకుడిని పరిచయం చేసింది.
అమ్మా, నాన్నా.. "మీట్ మై ఫ్రెండ్ ఆనంద్ " అంది. వెంకట్రావు గారు, జానకి ఆశ్చర్యం గా చూస్తున్నారు. ఆనంద్!.. వీళ్ళు మా అమ్మ నాన్న. నాన్న గారు రిటైర్డ్ జడ్జి " అంది నవ్య
గౌరవ సూచకంగా ఆ యువకుడు నమస్కరించడం, వీళ్ళు ప్రతి నమస్కారం చెయ్యడం జరిగిపోయింది.
“ఈరోజు ఆనంద్ ఇక్కడే ఉండి రేపు వాళ్ళ వూరు వెళ్తాడు”.. అంది.
ఆనంద్ కి మేడ మీద రూమ్ చూపించారు.
ఇంకో అరగంటలో నవ్య, ఆనంద్ ఫ్రెష్ అయ్యి, హాలు లోకి వచ్చేరు.
జానకి గారు రాత్రి వంటకి ఏర్పాట్ల లో వున్నారు.
సోఫాలో కూర్చున్న తర్వాత, నవ్య మొదటగా సంభాషణ మొదలు పెట్టింది.
" నాన్నా మీతో సస్పెన్స్ అన్నది ఆనంద్ గురించే.. నేను, ఆనంద్ ప్రేమించుకున్నాము. ,
నా అభిప్రాయలు మీరు గౌరవిస్తారని తెలుసు. మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. అందుకే ధైర్యంగా అతన్ని ఇంటికి తీసుకుని వచ్చేను. రేపు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్లి వస్తాడు. మా విషయం ఆవిడకి కూడా చెపుతాడు. నన్ను వీడియొ కాల్ లో ఆవిడకి చూపిస్తాడు.. “అని ఆగింది.
అప్పుడు తేరిపార చూసేడు వెంకట్రావ్ ఆ అబ్బాయిని.
కుర్రవాడు అందగాడు, మంచి పొడగరి. అతన్ని ఇదివరకు ఎక్కడో చూసినట్లు అనిపించింది.
అదే సమయం లో ఆనంద్ కి కూడా అటువంటి భావనే కలిగింది.
" మీది ఏ వూరు బాబూ.. మీ వాళ్ళ వివరాలు చెప్పు”. అన్నారు ఆయన.
“ మేము విజయనగరం దగ్గర పల్లె టూళ్లో వుండే వాళ్ళం. నాన్న గారు విజయనగరం లో రైస్ మిల్లు లో గుమస్తా గా చేసేవారు. మాకు వున్న పొలం కోసం మా చిన్నాన్న దుర్మార్గానికి ఒడిగట్టి మా నాన్నని మా పొలంలోనే చంపించేసేడు. అమ్మ కోర్టులో పోరాడినా ఫలితం దక్కలేదు. కోర్టు తీర్పు మాకు వ్యతిరేకం గా వచ్చింది.. ” అని అంటూ వెంకట్రావు గారి మొహం లోకి చూస్తున్నాడు.
అతని మొహం లో ఎన్నో సందేహాలు కనిపిస్తున్నాయి.
అప్పుడే అతనికి ఏదో స్ఫురించి నట్లు మొహం లో రంగులు మారిపోయాయి.
సరిగ్గా అదే క్షణం లో వెంకట్రావు గారికి ఆ కేసు విషయం స్ఫురించింది.
వెంటనే ఇలా అన్నారు:
" మీ నాన్న గారి పేరు “సత్యనారాయణ” కదా.. ?"
“అవునండి.. ఆ రోజు తీర్పు ఇచ్చింది మీరే అని అనుకుంటున్నా.. " వెంకట్రావు గారి కేసి చూస్తూ ఒకింత క్రోధ భావం ప్రదర్శిస్తూ ఆనంద్ గంభీరం గా అన్నాడు.
హాలు లో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది.
వంట గదిలోంచి వీళ్ళ మాటలు వింటున్న జానకమ్మ గారు గభాలున వంటింటి గుమ్మం దగ్గర కి వచ్చి నిలబడి పోయారు.
ఊహించని ఈ సంభాషణకు నవ్య మొహం లో రంగులు మారిపోయి, ఆశ్చర్యంగా, భయం గా తండ్రికేసి, ఆనంద్ కేసి మార్చి మార్చి చూస్తోంది.
ఆ రోజు కోర్టు హాలు లో చూసిన 18 సంవత్సరాల యువకుడు, దీనంగా చూస్తున్న అతని తల్లి కళ్ళముందు మెదిలేరు ఆయనకి.
ఆ దృశ్యం ఆయన మరిచిపోలేరు. తీర్పు ఇచ్చ్చినప్పుడు ఆ తల్లి స్పృహ కోల్పోవడం తనకి ఇంకా గుర్తే. ఆ కుర్రవాడి చూపులు కాల్చేసేయి ఆయన్ని ఆరోజు.
నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. ఒక నిటూర్పు వదిలి, వెంకట్రావు గారు ఇలా అన్నారు:
"అవి నేను విజయనగరం లో అని చేస్తున్న రోజులు. ఒక పది సంవత్సరాల క్రితం సంగతి..
నా జీవితం లో మొదటి సారిగా నేను తప్పు చేస్తున్నానని భావిస్తూ నిస్సహాయ స్థితి లో ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పు నన్ను అనేక సంవత్సరాలుగా వెంటాడుతోంది. నాలో గిల్టీ ఫీలింగ్ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. సమయం సందర్భం వచ్చింది కనుక, ఇప్పుడు వివరిస్తాను. ఇన్ని సంవత్సరాలుగా గూడు కట్టుకున్న బాధ మీతో పంచుకుంటే కొంత ఉపశమనం గా ఉంటుంది”.. అని ఆగారు.
వాతావరణం గంభీరంగా వుంది. జానకమ్మ గారు కూడా హాలు లోకి వచ్చి సోఫా లో కూర్చుండి పోయారు. అందరి మొఖాలు లో ఉత్కంఠ.
అప్పుడు వెంకట్రావు గారు చెప్పడం మొదలు పెట్టేరు:
"సత్యనారాయణ అనే వ్యక్తి పొలానికి వెళ్లిన కొద్దిసేపట్లో విగత జీవిగా పడివున్నట్లు అతని భార్య కి కబురు వచ్చింది. హృద్రోగం తోనే చనిపోయాడని అతని తమ్ముడు జగన్నాధరావు లోకాన్ని నమ్మించగలిగేడు.
పొలం లో ఎవరో హత్య చేసేరు అని, అది సత్యనారాయణ తమ్ముడు జగన్నాధరావు చేయించిన హత్య అని సత్యనారాయణ గారి భార్య కమల, కోర్టులో కేసు వేసేరు.
అయితే, పిటిషర్ తరపున వాదనలు విన్న నాకు అది హత్యే అని స్పుస్టం గా అర్ధం అయింది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ కేసు లో హత్య కి సంబంధించిన ఆధారాలు చూపించలేక పోయాడు, సాక్షులను కూడా సరిగా విచారించలేదని నాకు అనిపించింది. అదే సమయం లో డిఫెన్స్ లాయర్ తన తెలివి తేటలతో కేసుని తప్పు దోవ పట్టించి, సాక్షులని గందరగోళ పరిచి, తన వాదన తో అది హత్య కాదని, సత్యనారాయణ గుండె పోటు తో పొలం లో కుప్ప కూలిపోయినట్లు బలమయిన సాక్ష్యాలు చూపించేడు.
కోర్టు తీర్పు.. సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఆధారపడి ఇవ్వవలసి ఉంటుంది. న్యాయ సూత్రాలు ఒక్క నిరపరాధి ని కూడా శిక్షించకూడదు అని చెప్పడం వలన, మేము ఒక్కొక్క సారి సాక్ష్యాలు లేకపోతే దోషులని కూడా వదిలి వేయాల్సి ఉంటుంది. మన చట్టాల్లో లొసుగులు, సాక్షుల అవినీతి, గ్రామ రాజకీయాలు, అన్నీ చేరి, ఆ కేసులో హతుడి కుటుంబానికి న్యాయం జరగలేదు.
నాకు మనస్కరించక, ఆ కేసు విషయం లో తీర్పు ఇవ్వడానికి చాలా తాత్సారం చేసేను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఆ కేసు విషయం లో సరియైన సాక్ష్యాలు సేకరించమని కూడా నేను విడిగా పిలిచి మందలించడం జరిగింది. నిజానికి, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో ఆ విధంగా మాట్లాడ కూడదు అని తెలుసు. కానీ ఎప్పుడయితే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో ఆలా మాట్లాడేనో జగన్నాధం రాజకీయ నాయకులని రప్పించి ఆ కేసు విషయం లో రచ్చ చేయించేడు. ఒక రాజకీయ నాయకుడైన బంధువు ద్వారా నేను ఉద్దేశ్యపూర్వకంగా తీర్పు ఇవ్వడం లేదని, కావాలనే తాత్సారం చేస్తున్నానని, అభియోగం మోపుతూ హై కోర్ట్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేడు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ రామారావు గారు నాకు కాల్ చేసి, నన్ను హెచ్చరించారు. ఆయన మనకి బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన నాకు చెప్పింది.. ” రికార్డ్స్ ప్రకారం, సాక్ష్యాలని బట్టి తీర్పుఇవ్వాలి కానీ, మనసుకి నచ్చేలా తీర్పు ఇవ్వడం కుదరదు కదా “ అని.
“ఏతా వాతా నాకు రికార్డులను బట్టి తీర్పు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించేడు. నేను అయిష్టం గానే ఆ రోజు ఆ తీర్పు ఇవ్వవలసి వచ్చింది. తగిన సాక్ష్యాధారాలు లేని కారణం గా జగన్నాధం మీద వేసిన కేసు కొట్టివేయాల్సి వచ్చింది. ఇన్ని సంఘర్షణ ల మధ్య నేను ఆ తీర్పు ఇవ్వడం జరిగింది " అని దీర్ఘంగా నిట్టూర్చారు వెంకట్రావు గారు.
“అయితే ఆ తీర్పు పై మీరు హై కోర్ట్ కి అప్పీల్ కి వెళతారు అనుకున్నాను.. “ అని మళ్ళీ అన్నారు వెంకట్రావు గారు.
వెంకట్రావు గారి లో అపరాధ భావన చూసేక ఆనంద్ మొహం లో కొంత ప్రశాంతత వచ్చింది.
విధి లేని పరిస్థితుల్లో ఆనాడు ఆ తీర్పు తమకి వ్యతిరేకంగా వచ్చింది తప్ప, జడ్జి తప్పు లేదని అతనికి అర్ధం అయింది.
ఇలా అన్నాడు ఆనంద్: "నేను 18 సంవత్సరాల వయసు లో ఉన్నవాడిని. ఆవేశం తో వున్నాను, కానీ ఆర్ధికం గా బాగా చితికి పోయి వున్న మాకు హైకోర్టు కి వెళ్లే స్థితి లేదు. నిస్సహాయం గా ఉండి పోయాము. మా చిన్నాన్న, తర్వాతి కాలం లో మా పొలం కూడా ఆక్రమించుకుని మమ్మల్ని బయటకి తరిమేశాడు. పొట్ట చేత్తో పట్టుకుని మేము విజయనగరం చేరిపోయాము. అమ్మ కూలి, నాలి చేసుకుని నన్ను చదివించింది. కానీ, మనుషులు ఇవ్వలేని తీర్పు భగవంతుడు ఇచ్చాడండి.. " అన్నాడు.
ఆలా అంటున్నప్పుడు అతని మోహంలో కసి కనపడుతోంది. ఏళ్ళ తరబడి నిస్సహాయ స్థితి లోకి నెట్టి వేయబడిన వాడు ఒక గొప్ప అవకాశం పొందినప్పుడు వచ్చే తృప్తి ఆ కళ్ళల్లో కనపడుతోంది.
ఇప్పుడు వెంకట్రావు గారితో సహా మిగిలిన ఇద్దరూ ఆసక్తి గా ఆనంద్ వైపు తిరిగేరు.
"అవును సార్ ఇది నిజం. మనుషులు పెట్టిన కోర్టులో మాకు అన్యాయం జరిగినా భగవంతుడి కోర్ట్ లో మాకు న్యాయం జరిగింది. " అని.. ఇలా కొనసాగించేడు :
“తీర్పు వచ్చిన తర్వాత మమ్మల్ని, ఇంటి నుండి తరిమేసి, జగన్నాధం ఆ వూర్లో పెద్ద మోతుబరిగా ఎదిగేడు. 2 సంవత్సరాలు అయ్యేక, ఒక సారి కుటుంబ సమేతంగా తీర్థ యాత్రలకు కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు లోయ లో పడిపోయింది. జగన్నాధం, అతని ఇద్దరు కొడుకులు చనిపోయారు. భార్య బతికింది కానీ, మతి స్థిమితం కోల్పోయింది.
అతని భార్య తరఫు బంధువులు నడుపుతున్న అనాధ ఆశ్రమానికి సగం ఆస్తి, అతని భార్య బాగోగులు చూసుకోవడానికి సగం ఆస్తి వచ్చేలా ఆనాటి గ్రామ పెద్దలు కథ నడిపించారు.
అందులో ఒక మంచి వ్యక్తి మా కుటుంబ విషయం తెలిసి, ఆ ఆశ్రమం ద్వారా నా చదువు కి ఆర్ధిక సహాయం చేసేలా ఏర్పాట్లు చేసి ఒక విధంగా మా కుటుంబాన్ని నిలబెట్టేరు.
ఆ ఆర్ధిక సహాయం తో చదువుకున్న నేను, ఈ రోజు ఒక మంచి స్థితి లో వున్నాను. అమ్మ జ్యూట్ మిల్ లో పని చేస్తోంది.. ” అని తన కథ ముగించాడు ఆనంద్.
ఇప్పుడు వెంకట్రావ్ గారి మొహం లో రిలీఫ్. భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆయన.
ఆనంద్ చెప్పిన తన కథ విన్న తర్వాత జానకమ్మ గారి కళ్ళు చెమర్చాయి.
స్వంతంగా ఎదిగిన వాడు, కష్ట సుఖాలు బాగా తెలిసిన వాడు తన అల్లుడయితే తన కూతురు సుఖ పడుతుంది అన్పించింది ఆవిడకి.
"బాబూ నువ్వు రేపు విజయనగరం వెళ్లి, వచ్చేటప్పుడు మీ అమ్మగారిని కూడా తీసుకుని రా.
మన మధ్య బంధుత్వం ఏర్పడుతోంది కదా.. " అంది వాతావరణం తేలిక పరుస్తూ.
నవ్య, వెంకట్రావుగారు " అవును కదా " అన్నారు ఒకేసారి.
ఆ కుటుంబం చూపించే ఆప్యాయతకి మురిసిపోయాడు ఆనంద్.
"మళ్ళీ నెల శ్రావణ మాసం. ముహుర్తాలు పెట్టెయ్యమంటారేమో కూడా మీ అమ్మగారిని అడుగు బాబూ " అన్నారు వెంకట్రావు గారు ఆనంద్ ని ఉద్దేశించి.
నవ్య మొహం లో సిగ్గులు పూసేయి.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
Comments