top of page
Writer's pictureGinnela Venkata Ramana

దేవుడు!



'Devudu' - New Telugu Story Written By G V Ramana

Published In manatelugukathalu.com on 13/09/2024

'దేవుడు' తెలుగు కథ

రచన: జి వి రమణ


 “ఇందాకటినుండీ ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తరేమిటండీ?” అడిగింది సుజాత రాంబాబుని. 


 దానికి జవాబుగా రాంబాబు ఫోన్ లో కనిపిస్తున్న పేరుని సుజాతకి చూపిస్తూ, “మళ్ళీ నాకు ఏదో పని చెప్పడానికే చేస్తున్నాడు, నేను ఎత్తను గాక ఎత్తను” అంటూ విసురుగా ఫోన్ పక్కన పెట్టేశాడు.


 ఫోన్ చేస్తోంది బెనర్జీ, బెనర్జీ రాంబాబు పనిచేసే బ్యాంకు తాలూకు ఎంప్లాయిస్ యూనియన్ కి జనరల్ సెక్రటరీ. కలకత్తా నుండి కాల్ చేస్తున్నాడు. 


 నిన్నమొన్నటిదాకా రాంబాబు బెనర్జీతో బాగానే రాసుకుపూసుకు తిరిగేవాడు ఈ మధ్యనే యూనియన్ అఖిల భారత స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు బెనర్జీతో పాటు రాంబాబు కూడా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేశాడు, బెనర్జీ తన కన్నా జూనియర్ అయినా మంచి మెజారిటీతో గెలిచాడు. అదిగో అప్పటినుంచి రాంబాబు వైఖరిలో మార్పు వచ్చింది.

 తను కావాలి అనుకున్నది పొందలేక పోయినప్పుడూ అది ఇంకొకరికి దక్కినప్పుడూ రాంబాబుకి ఉండే ఉక్రోషం గురించి సుజాతకి బాగా తెలుసు.


 “ఎందుకండీ అంత కోపం, మీరూ ఆయనా ఒకే యూనియన్ లీడర్లు, ఆయన అఖిలభారత సెక్రెటరీ అయితే మీరు రాష్ట్ర సెక్రటరీ కదా, మీరూ మీరూ సఖ్యతగా లేకపోతే ఇంక మేనేజ్మెంట్ మీ మాటకు ఏం విలువ నిస్తుంది, పైగా మీరు హైదరాబాద్లో ఉండి మీ హెడ్ ఆఫీస్ కలకత్తాలో ఉంటే, మీ కన్నా కలకత్తాలో ఉండే బెనర్జీనే జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించడం తేలిక కాబట్టి, అందరూ ఆయన్ని గెలిపించి ఉంటారు. నేనెప్పుడూ సొంత పనుల కోసం బెనర్జీ మీకు ఫోన్ చేసినట్లు చూడలేదు, మీ మెంబర్స్ అవసరాల కోసమే కదా మీ బోటి లీడర్లు ఉన్నది.”


 సుజాత చెప్పేవన్నీ నిజాలే అయినా ఒక జూనియర్ అయిన బెనర్జీ గెలవటం, దాని తాలూకు అధికారంతో అతడిచ్చే ఆదేశాలు తను నెరవేర్చాల్సి రావడం - రాంబాబుకి ఎక్కడో అహం అడ్డు తగులుతోంది. సుజాత చెప్పనయితే చెప్పింది కానీ, రాంబాబు ఆ మాటలు పట్టించుకోడని ఆమెకు తెలుసు. 


*

 అరగంట తర్వాత మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి రాంబాబు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. సుజాత ఫోన్ అందుకుంది, మళ్ళీ బెనర్జీనే, ధైర్యం చేసి కాల్ ఎత్తింది. బెనర్జీ, రాంబాబూ కొంతకాలం కలకత్తాలో కలిసి పనిచేశారు అప్పుడు అక్కడ జరిగిన ఫంక్షన్లలో ఇద్దరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నప్పుడు ఇరు కుటుంబాల సభ్యులూ ఒకరికొకరు బాగా పరిచయం అయ్యారు, “హలో బెనర్జీ గారూ, ఎలా ఉన్నారు? రాంబాబు వాష్ రూమ్ లో ఉన్నాడు” అంది సుజాత, ఎప్పుడో బెంగాల్ లో ఉండగా కొద్దికొద్దిగా నేర్చుకున్న బెంగాలీ భాషలో. 

 “మేము బాగున్నాము, మీరెలా ఉన్నారు?” లాంటి కుశల ప్రశ్నలు అయ్యాక, “అయితే రాంబాబు వాష్ రూమ్ నుండి వచ్చాక ఒకసారి కాల్ చేయమని చెప్పమ్మా” అన్నాడు బెనర్జీ బెంగాలీలో. 


 అది జరగని పని అని సుజాతకు తెలుసు, “ఫర్వాలేదు బెనర్జీ గారు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను ఆయనకి చెప్తాను, ఆయన చాలా బిజీగా ఉంటున్నారు” విషయం తెలుసుకోవడానికి తనే మార్గం సులువు చేసింది.


 “ఏం లేదమ్మా అస్సాం నుండి నబదీప్ అని మా కరీంగంజ్ బ్రాంచ్ రిటైర్డ్ స్టాఫ్, అతనికి కళ్ళకు సంబంధించిన జబ్బు ఏదో వచ్చి కళ్ళు పూర్తిగా కనబడడం లేదని చెప్పాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, దానికి వైద్యం హైదరాబాదులోనే ఉందనీ, బాగు చేయించుకోవాలంటే అక్కడికి వెళ్లి చేయించుకోవాలి అనీ చెప్పాడు. అతనికి పిల్లలు లేరు, భార్య ఉంది, వాళ్ళు హైదరాబాద్ వచ్చి చూపించుకోవాలి అనుకుంటున్నారు, రాంబాబు వాళ్లకి సాయం చేస్తాడేమోనని ఫోన్ చేశాను, వాళ్ళకి హైదరాబాదులో బంధువులు ఎవరూ లేరు. రాంబాబు సరే అంటే అతని నెంబర్ వాళ్ళకి ఇచ్చి కాంటాక్ట్ చేయమని చెబుదామని ఫోన్ చేశాను”


 “ఏవిధంగా సాయం చేయాలి?” అడిగింది సుజాత. 


బెనర్జీ రాంబాబు నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకుంటే మంచిదని. తొందరపడి వాగ్ధానాలు చేస్తే తర్వాత రాంబాబు ఎలా రియాక్ట్ అవుతాడోననే భయంతో.


 “అది ఫోన్ చేసినప్పుడు నబదీపే చెప్తాడు, దాని ప్రకారం ఫాలో అయితే చాలు”


 “అయితే నేను నా నెంబర్ మీకు ఇస్తాను అది నబదీప్ కి ఇచ్చి నాకు ఫోన్ చేయమనండి. రాంబాబు ఈ మధ్య వేరే పనుల వల్ల చాలా బిజీగా ఉంటున్నాడు, బహుశ అతనికి ఇబ్బంది కావచ్చు” అంటూ సుజాత తన నెంబర్ బెనర్జీకి ఇచ్చి, రాంబాబుని ఈ పని నుంచి తప్పించింది. 


 థాంక్స్ చెప్పి బెనర్జీ ఫోన్ కట్ చేశాడు. 


 తర్వాత, అనుకున్న ప్రకారం ఆ రోజు నబదీప్ నుండి సుజాత కు ఫోన్ వచ్చింది, తనకు కళ్ళు కనబడడం లేదనీ, త్వరలో చికిత్స కోసం హైదరాబాద్ వస్తాననీ, తన వెంట తన భార్య వస్తుందనీ, పది రోజులు అక్కడే ఉండవలసిన అవసరం ఉంటుందనీ, దాని కోసం ఆస్పత్రికి దగ్గరగా ఏదైనా లాడ్జిలో బస ఏర్పాటు చేసి పెట్టాలనీ, అలాగే ఒక రోజు తన భార్యకు ఆ పరిసరాలు పరిచయం చేస్తే చాలనీ చెప్పాడు. 


 సుజాత ఒక క్షణం ఆలోచించి, “ఒక గంటలో మళ్లీ మీకు ఫోన్ చేస్తాను” అని వెంటనే వాళ్ళ పనిమనిషి రంగమ్మ కొడుకు హనుమంతుకి ఫోన్ చేసి, నబదీప్ దంపతుల వివరాలు చెప్పి, వాళ్లు వచ్చిన రోజున రైల్వేస్టేషన్లో పికప్ చేసుకుని ఐ హాస్పిటల్ కి దగ్గరగా ఒక మంచి లాడ్జిలో దింపి వాళ్ల అవసరాలు చూడాలి అని చెప్పింది. 

 “అలాగే మేడమ్” అన్నాడు హనుమంతు. 


 హనుమంతు వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అయ్యాడు. హనుమంతు ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోజుల్లో రంగమ్మ రాంబాబును సాయం అడిగితే అతడే క్యాబ్ కొనుక్కోడానికి హనుమంతుకి లోన్ ఇప్పించాడు.


 హనుమంతు ఓకే చేయగానే సుజాత నబదీప్ కి ఫోన్ చేసి హనుమంతు ఫోన్ నెంబర్ ఇచ్చి అస్సాం నుండి బయలుదేరింది మొదలు తిరిగి వెళ్లే వరకు అతడితో టచ్ లో ఉండి కావలసినవన్నీ చేయించుకోమని చెప్పింది. 


 నబదీప్ దంపతులు హైదరాబాద్ వచ్చిన రోజు గంట ముందే హనుమంతు వాళ్ళ కోసం రైల్వే స్టేషన్ కి వెళ్లాడు. రైలు వచ్చాక నబదీప్ దంపతులను గుర్తుపట్టడం హనుమంతుకు పెద్ద కష్టం కాలేదు. అంధుడైన ఒక పెద్దమనిషిని భార్యలాంటి ఒక స్త్రీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే వాళ్ళు గాక ఇంక ఎవరై ఉంటారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని, వారి సామానులు తీసుకుని కార్లో సర్ది తను ముందే చూసి ఉంచిన లాడ్జికి తీసుకువెళ్ళాడు. 


 తన జీవనానికి బాటలు వేసిన రాంబాబు గారి పని కనుక, ఆయనకు మాట రాకుండా వీళ్లు ఉన్నన్ని రోజులూ వీళ్ళ వెంటే ఉండి అన్నీ జాగ్రత్తగా చేయాలి అనుకున్నాడు హనుమంతు. అంతే.... తను వాళ్ళ కొడుకునే అన్నంతగా బాధ్యత తీసుకున్నాడు. 

 మర్నాడు తనే స్వయంగా నబదీప్ ని ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాకే తన పనికి వెళ్ళాడు. అలా నబదీప్ డిశ్చార్జ్ అయ్యేవరకూ చేశాడు.

 పది రోజుల్లో నబదీప్ కి ఆపరేషన్ పూర్తయి కళ్ళు బాగా కనబడడం మొదలుపెట్టాయి. ఇక రేపు తిరుగు ప్రయాణం అవుదాం అనుకున్నరోజు నబదీప్ భార్యతో సహా హనుమంతు సాయంతో రాంబాబు ఇంటికి వచ్చాడు.


 సరిగ్గా ఆ సమయానికి రాంబాబు వాకిట్లోనే ఉన్నాడు. హనుమంతు వాళ్లను తీసుకుని లోపలికి వస్తుంటే “ఎవరు వీళ్ళు?” అంటూ అడిగాడు హనుమంతుని. 


 “మీ ఫ్రెండ్ నబదీప్ సార్” అన్నాడు హనుమంతు. 


 రాంబాబు అయోమయంగా “నబదీపా? వీళ్ళెవరో నాకు తెలియదే?” అన్నాడు. 


 రాంబాబూ, హనుమంతూ తెలుగులో మాట్లాడుతుంటే నబదీప్ కి ఏమీ అర్థం కాక అయోమయంలో ఉన్నాడు. 

 ఇంతలో వెనకనుండి సుజాత వచ్చి, విషయం తెలుసుకుని వాళ్ళని సాదరంగా లోపలికి తీసుకొచ్చింది.


 అప్పుడు చెప్పింది రాంబాబుకు జరిగిన విషయం. 

 “ఓహో ఇది బెనర్జీ అప్పజెప్పిన పనా, ఇలా చేస్తూ పోతే నన్నొక నౌకర్లాగా పనులు అప్ప చెపుతాడు, అసలు నా తరపున నిన్నెవరు ఈ పనులు చేయమన్నారు” అన్నాడు గుసగుసగా సుజాతకి మాత్రమే వినపడేలా, 


మనసులో కోపం మొహంలో కనపడకుండా, పైకి మాత్రం, “సంతోషం” అని నబదీప్ వైపు తిరిగి, “అంతా బాగా జరిగింది కదా!” అన్నాడు హిందీలో. 


 “అవునండీ, మీరు ఎవరో నాకు ప్రత్యక్షంగా తెలియకపోయినా, మీరు బిజీగా ఉన్నా కూడా, మేడం గారి ద్వారా చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోను నా పేరు నబదీప్ – ‘నబదీప్’ అంటే అస్సామీలో కొత్త వెలుగు అని అర్థం, అలాంటి కొత్త వెలుగుని నాకు ప్రసాదించడంలో సహాయపడిన నా దేవుడు సార్ మీరు” అన్నాడు నవదీప్.


 నవదీప్ ‘దేవుడు’ అన్నప్పుడు సుజాత కనుబొమలు ఎగరేస్తూ రాంబాబు కళ్ళల్లోకి చూసింది, “బెనర్జీ ఫోన్ కూడా ఎత్తని నువ్వు దేవుడివా? ” తనలో తనే అనుకుంటున్నట్లు అన్నది రాంబాబుకి మాత్రమే వినపడేలా. 


 రాంబాబు మొహం మ్లానమయింది.


 ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తుంటే, నబదీప్ కొనసాగించాడు, “మేము మళ్లీ హైదరాబాద్ ఎప్పుడు వస్తామో తెలియదు, అందుకే వెళ్లేలోగా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి, ఒక చిన్న సన్మానం చేసి వెళ్లాలని వచ్చాం” అంటూ వెంట తెచ్చిన బ్యాగ్ లోంచి అస్సాం నుండి ప్రత్యేకంగా తెచ్చిన ఖరీదైన బట్టలు రాంబాబుకి అందించారు నబదీప్ దంపతులు. 


 “మీరు పంపిన హనుమంతు మమ్మల్ని తన సొంత తల్లి దండ్రుల్లా చూసుకున్నాడంటే నమ్మండి, దీన్ని బట్టి మీరు అతనికి ఏమి చెప్పి పంపి ఉంటారో అర్థమవుతోంది సార్, నిజంగా మీరు దేవుడు సార్ దేవుడు” అన్నది నబదీప్ భార్య.


 అందుకు సుజాత, “నిజంగా వీళ్ళ పట్ల దేవుడివి నువ్వురా హనుమంతూ, ఆయన కాదు” అంది రాంబాబు వైపు చూస్తూ. 


 “అయ్యగారు నాకు చేసిన సాయం ముందు ఇది ఏ పాటి సాయం అమ్మగారూ, అయ్యగారే అందరికీ దేవుడు” అన్నాడు హనుమంతు.


 వచ్చిన పని పూర్తయిన తర్వాత నబదీప్ దంపతులు వెళ్ళిపోతుంటే, “మీకు సాయపడింది నిజంగా ఆ దేవుడే, నేను కాదు” అన్నాడు రాంబాబు హిందీలో. 


 “నిజమే, లేక పోతే బెనర్జీ ఫోన్ వచ్చినప్పుడు మీ ఫోన్ నా చేతికి రావడం ఏమిటి?” అంది సుజాత, నబదీప్ దంపతులు గేటు దాటాక. 


 “దేవుడే సాయం చేయదలిస్తే, అది ఎవ్వరివల్లా ఆపబడలేదు. అందులో భాగ స్వాములు అయిన వాళ్లే ‘దేవుడు’ అనిపించు కోవడానికి అర్హులు. భావోద్వేగంలో నేను తప్పు చేశాను సుజాతా. ఆ దేవుడు నన్ను క్షమించు గాక” అన్నాడు రాంబాబు జీర పోతున్న గొంతుకతో. 

 

--- అయిపోయింది - - -


జి వి రమణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : వెంకట రమణ

ఇంటి పేరు : గిన్నెల

జననం : 1961 డిసెంబర్

వృత్తి : విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి

నివాసం : సైనిక్ పురి, సికిందరాబాద్.

కథలు చదవడము, అప్పుడప్పుడు 'జి వి రమణ' పేరుతో కథలు వ్రాయడము ఇష్టం. నా కథలు 'విపుల, చతుర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి' , వంటి పాత పత్రికలతో పాటు 'కౌముది, సహరి, తెలుగు జ్యోతి, సంచిక' వంటి అంతర్జాల పత్రికలలో, ఇంకా 'బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలభారతి' వంటి పత్రికలలో పిల్లల కథలు ప్రచురితం అయి, అప్పుడప్పుడు కొన్ని బహుమతులు పొందాయి.

74 views0 comments

Comments


bottom of page