top of page
Writer's pictureNeeraja Prabhala

ధైర్యే సాహహే లక్ష్మి

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #DhairyeSahaseLakshmi

, #ధైర్యేసాహహేలక్ష్మి


'Dhairye Sahase Lakshmi' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 09/10/2024

'ధైర్యే సాహహే లక్ష్మి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



వేకువనే లేచి ఇంటిపనులు పూర్తి చేసి కాఫీ త్రాగుతూ అమెరికాలో ఉంటున్న కూతురు శిరీష ఫోన్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది అన్నపూర్ణమ్మ. వారం వారం కూతురి ఫోన్ కోసం ఎదురుచూడటం ఆవిడకు పరిపాటే. కాసేపటికి ఫోన్ రింగయితే లిఫ్ట్ చేసింది. 


"హలో! అమ్మా! ఎలా ఉన్నావు? మన సూపర్ మార్కెట్, అనాధ శరణాలయం బాగా నడుస్తున్నాయా?" అడిగింది శిరీష.


"బాగానే ఉన్నాను. అవి చాలా బాగా నడుస్తున్నాయి. మీరెలా ఉన్నారు?" అడిగింది అన్నపూర్ణమ్మ. 


"మేము బావున్నామమ్మా" చెప్పింది శిరీష. కాసేపు కబుర్లు అయ్యాక ఫోన్ పెట్టేసింది శిరీష. 


తరువాత అన్నపూర్ణమ్మ ప్రతిరోజూ లాగానే అనాధాశ్రమానికి వెళ్లి అక్కడున్న అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లకి కావలసిన ఏర్పాట్లు చూసింది. అక్కడ వాళ్లందరి కష్టసుఖాలను, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకొంటూ, పని చేసే ఆయాలను, వాళ్ల బాధలను గ్రహిస్తూ ఎవరికి ఏలోటూ రాకుండా చూసుకుంటూ రోజంతా అక్కడే గడిపి సాయంత్రం ఇంటికి వచ్చింది.


అన్నపూర్ణమ్మకు ఆ రాత్రి సరిగా నిద్రపట్టక గత స్మృతులలోకి మనసు పరుగుతీసింది. అన్నపూర్ణమ్మ భర్త రంగారావు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పెద్దలిచ్చిన మూడు గదుల ఇంట్లో ఉండేవాడు. తనకున్నంతలో భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇంటరు పాసైన అన్నపూర్ణమ్మ కూడా ఒక షాపులో పనిచేస్తూ భర్తకు చేదోడుగా ఉండేది. కొన్నాళ్లకు వాళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పాప పుట్టింది. ఆ పాపకు "శిరీష" అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. శిరీష కూడా చక్కగా పెరుగుతూ తన ఆటపాటలతో, ముద్దుముచ్చట్లతో అందరినీ అలరిస్తోంది. శిరీషకు మూడేళ్లు నిండగానే అక్షరాభ్యాసం చేయించి ఆమెను మంచి స్కూలులో చేర్చారు తల్లితండ్రులు. 


శిరీష కూడా చక్కగా చదువుతూ మంచి ప్రతిభాపాటవాలతో రాణిస్తోంది. కాలం గడుస్తోంది. శిరీష పదవ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. రంగారావు ఆఫీసునుంచి వస్తూంటే స్కూటర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుప్రక్కల వాళ్లు చూసి ఆంబులెన్సు వాళ్లకి ఫోన్ చేయగానే వాళ్లు దగ్గరున్న హాస్పిటల్లో చేర్చి పోలీసులకు ఫోన్ చేశారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని వద్ద ఉన్న ఫోన్ ద్వారా విషయాన్ని అన్నపూర్ణమ్మకు తెలియచేసి హాస్పిటల్ అడ్రసు చెప్పారు.. విషయం విని ఆవిడ చాలా గాబరా పడింది. శిరీష ఆరోజు ఇంట్లోనే ఉన్నందున తల్లికి ధైర్యం చెప్పి ఆవిడతో హస్పిటల్ కు వెళ్లి తండ్రిని చూసింది. బాగా దెబ్బలతో స్పృహ లేకుండా ఉన్న భర్తను చూసి అన్నపూర్ణమ్మ హృదయం తల్లడిల్లింది. శిరీష పరిస్థితి కూడా అంతే. డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం దక్కక ఆ రాత్రి రంగారావు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి అన్నపూర్ణమ్మ, శిరీషలు ఎంతగానో రోదించారు. డాక్టర్లు, పోలీసులు వాళ్లని అనునయించి, ధైర్యం చెప్పి రంగారావు పార్ధివ దేహంతో అంబులెన్సులో వాళ్లని ఇంటికి చేర్చారు. 


తెల్లవారాక అన్నపూర్ణమ్మ తనకి తనే ధైర్యం చెప్పుకుని శిరీషని ఓదార్చి విషయాన్ని భర్త ఆఫీసు వాళ్లకి, తెలిసిన వాళ్లకి, బంధువులకు తెలిపింది. అందరూ వచ్చి ఆఖరి చూపు చూసి వాళ్లని ఓదార్చి జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించారు. రోజులు గడుస్తున్నాయి. రంగారావు ఆఫీసు వాళ్లు అన్నపూర్ణమ్మకు కొంత డబ్బునిచ్చి చేతులు దులుపుకొన్నారు. పదిరోజులు పోయాక అన్నపూర్ణమ్మ కూతురికి ధైర్యం చెప్పి మరలా ఆమె స్కూలుకు వెళ్లేలాగున చేసింది. "నీవు బాగా చదివి వృధ్ధిలోకి వస్తే నీ తండ్రి సంతోషిస్తారు" అని తల్లి చెప్పిన మాట శిరీష మదిలో బాగా నాటుకుని చక్కగా చదువుతోంది. 


కూతురి భవిష్యత్తు కోసం అన్నపూర్ణమ్మ సుదీర్ఘంగా ఆలోచించి మనోధైర్యంతో ఒక నిర్ణయం తీసుకుంది. తను చేస్తున్న షాపులో ఉద్యోగం మానేసి తనవద్ద ఉన్న డబ్బుతో ఇంట్లోనే కిరాణాషాపు పెట్టుకుంది. ఒకరిద్దరు ఆవిడని 'భర్త లేని ఒంటరి స్ర్తీ' అని వెకిలి చూపులు చూసి పిచ్చిగా వ్యవహరిస్తే చుట్టుప్రక్కల వారి అండతో వాళ్లకు తగురీతిన ధైర్యంగా బుధ్ధిచెప్పింది. 


'హాయిగా ఉద్యోగం చేసుకోక వ్యాపారమేంటని?' కొంతమంది ఎగతాళి చేసిన వాళ్లూ లేకపోలేదు.


ఆవిడ అవేమీ లెక్కచేయక తను అనుకున్న దిశగా ముందుకడుగులు వేసింది. సరుకులవీ హోల్ సేల్ గా తెచ్చి చుట్టుప్రక్కల అందరికీ నాణ్యమైన సరుకులు అందేలాగున తన కలుపుగోలుతనం, మంచితనంతో‌, మాటల చాకచక్యంతో అందరినీ ఆకర్షించింది. ఆ ఏరియాలో అంతవరకూ దగ్గరగా కిరాణాషాపు లేనందున అన్నపూర్ణమ్మ వ్యాపారం క్రమేణా వృధ్ధిలోకి వచ్చింది. 


శిరీష కష్టపడి చదివి పదవతరగతి పరీక్షలు బాగా వ్రాసి స్టేట్ రాంకు సాధించింది. అన్నపూర్ణమ్మ చాలా సంతోషించి ఆమెని మంచి కాలేజీలో చేర్పించింది. శిరీష బాగా చదువుతూ స్కాలర్షిప్ సాధించింది. 


 అన్నపూర్ణమ్మ క్రమేణా తన ఇంటి ముందున్న కాస్త స్ధలాన్ని కూడా కలిపి ఇంటిని మార్పులు చేసి సూపర్ మార్కెట్ ను పెట్టి పదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. క్వాలిటీ, క్వాంటిటీలలో ఏమాత్రం రాజీపడకుండా ఖాతాదారులను నమ్రతగా పలకరిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. వ్యాపారం బాగా వృధ్ధిచెందాక ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్య కరమైన పిండివంటలను తయారు చేయించి ప్రక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటరును ప్రారంభించింది. సుశిక్షితులైన వంటవాళ్లను పనిలోకి తీసుకుని, సహాయకులుగా క్రొత్తవాళ్లకు ఉద్యోగ అవకాశం ఇచ్చింది.

కాలం వేగంగా సాగిపోతోంది. శిరీష ఇంటరు పాసై ఇంజనీరింగ్ లో చేరి కష్టపడి చదువుతోంది. 


 అన్నపూర్ణమ్మ నీతి,నిజాయితీ, పట్టుదల, కార్యదక్షతను చూసి అందరూ మెచ్చుకొంటున్నారు. ఆవిడ కొన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టి తనకి తోచిన సాయాన్నందిస్తూ అందరికీ తలలో నాలుకలాగా ఉంటోంది. సూపర్ మార్కెట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వృధ్ధిలోకి రావడం చూసి కొంతమంది వ్యాపారస్తులు ఎన్నో అవరోధాలను కల్పించినా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతోంది ఆవిడ. రెండు సం..తర్వాత మహిళాదినోత్సవం రోజున ఆమెకి ఉత్తమ వ్యాపారవేత్తగా, ఆదర్శమహిళగా గుర్తించి అవార్డు రావడం జరిగింది. ఆ సభలో అందరూ తన తల్లిని, ఆవిడ నిర్విరామ కృషిని మెచ్చుకోవడం చూసి సంతోషించింది శిరీష. 


శిరీష ఇంజనీరింగ్ మూడవ సం..లో ఉండగానే కాంపస్ సెలక్షన్స్ జరిగి ఆమెకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ శుభవార్తను విన్న అన్నపూర్ణమ్మ తన సూపర్ మార్కెట్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే పనివాళ్లకు జీతాలను పెంచింది. వాళ్లందరూ చాలా సంతోషించారు. ప్రతిసం.. తమ సూపర్ మార్కెట్ యానివర్సరీ రోజున రకరకాల ఆఫర్లను, కూపన్లు పెట్టి ప్రముఖులచే లక్కీడ్రా తీయించేది అన్నపూర్ణమ్మ. నమ్మకము, నాణ్యత పెట్టుబడిగా ఆవిడ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వృధ్ధి చెందుతోంది. 


శిరీష ఉద్యోగంలో చేరే మొదటి రోజున తల్లికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాక తండ్రి ఫోటో వద్దకు వెళ్లి పూలదండ వేసి కన్నీళ్లతో ఆయనకు అంజలి ఘటించింది. బాధపడుతున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని "నాన్న ఆశీర్వాదం, ఆయన చల్లని దీవెన మనకెప్పుడూ ఉంటాయి. మనల్ని చూసి ఆయన చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు." అన్నది అన్నపూర్ణమ్మ.


తల్లి మాటలతో ఊరడిల్లి "అవునమ్మా! నీవు చెప్పింది నిజం. నాన్న ఆశీస్సులు, అన్నిటినీ మించి నీ ఆత్మస్థైర్యం, పట్టుదల, కార్యదక్షత, ఖాతాదారుల అభిమానం, ప్రోత్సాహం వలననే మనమీనాడు ఈ స్ధాయిలో ఉన్నాము" అంది శిరీష. 


రోజూ శిరీష ఉద్యోగానికి వెళ్లివస్తోంది. రోజులు హాయిగా గడుస్తున్నాయి. రెండు సం.. తర్వాత శిరీష తన తోటి ఉద్యోగస్తుడు విజయ్ తో ప్రేమలో పడింది. విజయ్ వ్యక్తిత్వం, మంచితనము‌, ప్రతిభ, ఉద్యోగం పట్ల అంకితభావం, అతని కుటుంబ వివరాలు శిరీష మనసును దోచేలా చేసింది. శిరీష మంచితనం, ఆలోచనా సరళి, తండ్రి లేని తనని తల్లి ఎంత కష్టపడి పెంచి, చదివించి వృధ్ధిలోకి తీసుకుని వచ్చిందీ వివరించిన తీరు అతనికి బాగా నచ్చింది. ఇరువురి మనసులు కలిశాయి. 

ఒక రోజున వాళ్లు తమ ప్రేమ విషయాన్ని ఇరుకుటుంబాలలో తెలియపర్చారు. శిరీషను గురించిన వివరాలను విజయ్ ద్వారా విన్న అతని తల్లితండ్రులు తమ కొడుకు ఆలోచించే సరైన నిర్ణయం తీసుకుంటాడనే దృక్పథంతో శిరీషను చూడాలనుకుని ఆమెని ఇంటికి తీసుకురమ్మన్నారు.


విజయ్ జరిగింది శిరీషకు చెప్పి ఆమెను తనింటికి తీసుకెళ్లి తలిదండ్రులకు పరిచయం చేశాడు. శిరీష మాటతీరు, సంస్కారం, పెద్దలంటే ఆమెకు ఉన్న మర్యాద వాళ్లకు నచ్చి పెళ్లికి అంగీకరించారు.


 శిరీష ద్వారా ఆమె ప్రేమ విషయం, విజయ్ కుటుంబం గురించి విన్న అన్నపూర్ణమ్మకు జీవితం పట్ల మంచి అవగాహన కల శిరీష ఆలోచించే సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్న నమ్మకంతో విజయ్ ను చూడాలంది. ఆసాయంత్రం విజయ్ ను ఇంటికి తీసుకొచ్చి తల్లికి పరిచయం చేసింది శిరీష. విజయ్ సంస్కారం, మాటతీరు, పెద్దలంటే వినయవిధేయతలు అన్నపూర్ణమ్మకు నచ్చి వాళ్ల పెళ్లికి సుముఖత చూపింది. 


ఇరుపెద్దలు మాట్లాడుకుని ఒక శుభముహూర్తాన తాంబూలాలు పుచ్చుకున్నారు. మరో రెండు నెలలకు వాళ్ల పెళ్లి వైభవంగా జరిపించింది అన్నపూర్ణమ్మ. విజయ్ తో కాపురానికి అత్తవారింటికి వచ్చింది శిరీష. త్వరలోనే శిరీష తన కలుపుగోలుతనంతో వాళ్లతో కలిసిపోయింది. విజయ్, శిరీష లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ హాయిగా ఉద్యోగానికి వెళ్లివస్తున్నారు. శిరీష రోజూ ఫోనులో తల్లి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారాంతంలో భర్తతో వెళ్లి ఆవిడని చూసివస్తోంది. ఏడాది తర్వాత తమ కంపెనీల ద్వారా వాళ్లు అమెరికాకు వెళ్లారు. భారమైన హృదయంతో ఇరు పెద్దలు వాళ్లకి వీడ్కోలు పలికారు. 


అన్నపూర్ణమ్మకు అనాధాశ్రమాన్ని నెలకొల్పాలన్న ఆలోచనతో దాన్ని శిరీష, విజయ్ ల ఆమోదంతో, స్ధానికుల సహకారంతో తన వద్ద ఉన్న ధనంతో స్ధలం కొని దానిని అమలుచేసింది. అచిరకాలంలోనే ఎందరో అనాధలను అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పిస్తూ, వాళ్లని కంటికి రెప్పలా చూసుకుంటూ మంచిపేరు తెచ్చుకుంటోంది అన్నపూర్ణమ్మ. 


ఏదో చప్పుడైతే ఆలోచనల నుంచి తేరుకుని క్రమేణా నిద్రలోకి జారుకుంది అన్నపూర్ణమ్మ. 

 భర్తను కోల్పోయినా ధైర్యంగా, స్వయంకృషి, నీతినిజాయితీతో, ఆత్మ స్ధైర్యంతో జీవితంలో ముందుకడుగులు వేసి కన్నబిడ్డను తీర్చిదిద్ది, వ్యాపారం, అనాధాశ్రమం ద్వారా ఎందరికో ఉపాధి, మరెందరికో ఆశ్రయం కల్పిస్తున్న అన్నపూర్ణమ్మ అందరికీ ఆదర్శం. ఆవిడ మనోధైర్యంతో జీవితంలో రాణిస్తూ “ధైర్యే సాహహే లక్ష్మి” అని నిరూపించింది. 



.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








50 views0 comments

Comments


bottom of page