ధర్మో రక్షతి రక్షితః
- Ayyala Somayajula Subramanyam
- Apr 6, 2023
- 5 min read

'Dharmo Rakshathi Rakshithaha' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'ధర్మో రక్షతి రక్షితః' తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు. స్వర్గాలు చూపిస్తానని చెప్పదు. భ్రమ పెట్టదు.
గీత చదివాక కష్టాలు ఉంటాయి. గీత చదివాక సవాళ్ళుంటాయి. గీత చదివాక
సంక్షోభాలుంటాయి. అయితే ఆ సంక్షోభాలని, ఆ సవాళ్ళనీ ఎదురుకోవడానికి సరి
పడా ధైర్యం వస్తుంది.
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ
'నీ భాధ్యత నీవు నిర్వర్తించు. అంత వరకు మాత్రమే అధికారము ఉంది. ఫలితాల
గురించి ఎందుకు ఆలోచిస్తావు. అధి నీ పని కాదు’
గీతను అర్థం చేసుకుంటే భయాలుండవు. మోహాలుండవు. ఊగిసలాటలుండవు.
ధైర్యంగా, స్థిరంగా జీవితాన్ని ఎదురుకొంటాం.
భాద్యతల నుంచి దూరంగా పారిపోతున్న మనలను ‘ఈ పిరికితనం మీకు ఎక్కడ
నుంచి వచ్చిందయ్యా’ అంటాడు. ఎన్ని మార్పులొచ్చినా స్థిరంగా ఉండమంటాడు.
యతోధర్మస్తతోజయః - నీవు ధర్మపరుడవైతే జయం నీ వెంటే ఉంటుంది.
కురుక్షేత్రమహాసంగ్రామములో కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యము, భీష్మ, ధ్రోణ, కర్ణ, శల్య, కృపాచార్య, భూరీశ్రవ, సోమదత్తాదులు, దుర్యోదన, దుశ్శాసనాది శత సోదరులు సమేతంగా యుద్దరంగంలో అశువులు భాశారు. ఏడు అక్షౌహిణిల సైన్యం, నిరాయుదుడుగా శ్రీకృష్ణుడు పాండవులచెంతన ఉండి విజయము అనుగ్రహింప జేసెను. ధర్మము ఎటు ఉంటే భగవానుడు కూడా అచ్చటనే ఉండును.
___________________________
గద్వాలుకు ' ధర్మసంస్థానం ' అని ప్రతిష్ట ఉన్నది.
ఈ మాట రాజే అనుకున్నాడా, దానిని అహంభావం అంటాం. గద్వాల ఆస్థాన పండితులే అన్నారా అంటే ముఖ ప్రీతి వ్యవహారం అనుకుంటాం.
ఆ సంస్థాన ప్రజలే అన్నారా, వాళ్ళంతా ' నా పృథ్వీపతిః' అనే పాతభావాల వాళ్ళంటాం.
కానీ, గద్వాలును ధర్మసంస్థానం అన్నది శత్రు రాజనుకోండి. అందునా పరధర్మీయుడనుకోండి. గద్వాలును జయించి తన రాజ్యములో కలుపుకోవాలనే దురాశాపరుడైనా, పరమతస్థుడైనా శత్రురాజైనా సత్యం ఎంత చక్కగా గ్రహించాడు. ఎంత చక్కగా చాటి చెప్పినాడు! అనుకుంటాం.
గద్వాలు సంస్థానం తెలంగాణలో ఉండేది. అది గోల్కొండ రాజుల సామంత రాజ్యం. సనాతన ధర్మాన్ని సంప్రదాయాలని చక్కగా రక్షిస్తున్న ముష్ఠిపల్లి శోభనాద్రి భూపాలుడు గద్వాలు సంస్థానం కోటను పరిపాలిస్తున్న రోజులు. అందువలన ఆ సంస్థానంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండెడివి. ప్రజలు సుఖసంతోషాలతో నుండెడివారు.
గోల్కొండ నవాబులు భోగలాలసులు. భోగాలకు ధనం కావాలి. ఆ ధనాన్ని శత్రువులను జయించి, సాధించాలి. ధనం లేని శత్రువులని ఎంతమందిని జయించి ఏమి లాభం? కాబట్టి గద్వాలును సాధించాలి అన్నారు మంత్రులు. నవాబు వినలేదు, అన్నాడు కదా గద్వాలు రాజు ఎంత ధనవంతుడైనా మనకన్నా ధనవంతుడా? మొత్తం దోచినా మన ఒకరోజు భోగానికి చాలదు అన్నాడు.
నవాబు దర్బారు చేస్తుండగా గూఢచారులు వచ్చారు. నవాబు, మంత్రులు రహస్య మందిరానికి వెళ్ళారు. గూఢచారులు మనవి చేశారు. జహాపనా! తుంగభద్రా నదీ తీరమున గద్వాలుకు నాలుగామడల దూరంలో వేణీసోమపురం అనే కుగ్రామం ఉన్నది. అక్కడ వేద సదస్సు జరుగుచున్నది. వందమంది చాకులాంటి కుర్రాళ్ళు గుక్క తిప్పుకోకుండా మంత్రాలు చదివారు. ఇసుక వేస్తే రాలనట్లు జనం చేరారు.
తాటి చెట్టంత ఎత్తున వేదికమీద వాళ్ళావిధంగా వేదాలు వల్లిస్తుంటే పది ఆమడ
లు వినిపించింది. ఆ మంత్రాలు విని ఇంకా కొంతమంది దూరదూరాలనుంచి వచ్చి చేరారు. వాళ్ళందరీ అప్పటికప్పుడు స్నానాలు, అప్పటికప్పుడు వేసిన పందిళ్ళలో భోజనాలు, ఆశ్చర్యమేమిటంటే ఆ జనంలో రాజు కూడా ఒకడు. అల్లంత దూరంలో గుర్రం దిగాడు. నదిలో స్నానం చేసి వేదిక వైపు నడిచాడు.
అంతలో వేదఘోష ఆగింది. మెరుపు మెరిసినట్లు వేదికమీద ఒక స్వామి వారు కనిపించారు. అంత జనం ఉన్నా సూదిపడితే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది. ఉరుము ఉరిమినట్లుగా ఆ స్వామి వారు ఉపన్యసించారు. వేదమతం, సనాతన మతం, హిందూమతం. ఇవన్నీ ఒకటే. హిందూమతం లేని హిందూదేశం ఏమిటి?
ఎన్ని అవాంతరాలు వచ్చినా మన మతం శాశ్వతం. హిందూమతం ఒక సాంప్రదాయం అన్నారు స్వామివారు.
జనమంతా ఏకకంఠంతో ' జై వ్యాస తత్త్వజ్ఞ స్వామి వారికి జై ' అన్నారు.
పాదుషా మంత్రులవంక చూశాడు. మంత్రులు గూఢచారుల వంక తిరిగారు. గూఢచారులు పాదుషాకు, మంత్రులకు నమస్కరించి నిష్క్రమించారు. మంత్రులు విన్న
వించారు. గోల్కొండ రాజ్యాన్ని ఏలేది పాదుషావారు కాదు. గద్వాల రాజు. ఆ రాజు వ్యాస తత్త్వజ్ఞుల వారికి వట్టి సేవకుడు. పాదుషా ఇంకొక్కసారి హుక్కా లాగి ఏమీ చెప్ప
కుండా వెళ్ళిపోయారు.
మంత్రులు మళ్ళీ ఆలోచించారు. ఈ సారి పాదుషా దర్బారు చేస్తుండగా ఒక చిత్రకారుడు వచ్చాడు. తాను చూసిన ప్రకృతి చిత్రాలను చూపించాడు. లేడిని తరిమే సింహం, చిన్న చేపను మింగబోయే పెద్దచేపా. పావురాయిని తరిమే డేగ సుల్తానును బాగా ఆకర్షించాయి. తరువాత ఆ చిత్రకారుడు మబ్బు తెరల మరుగున మెరుపువంటి ఒక మహా సౌందర్యవతి చిత్రాన్ని చూపాడు. పాదుషా ఏకాంత మందిరానికి దారి తీశాడు. ఆయన ఇంగితాన్ని గ్రహించి చిత్రకారుడు అనుసరించాడు. తరువాత కొంతసేపటికి మంత్రులకు వార్త వెళ్ళింది.
గద్వాల్ పై దాడికి రెండువేల గుర్రపు దళాన్ని సిద్ధం చేయమని. ' ఆహా' అనుకున్నారు మంత్రులు.
అది వైశాఖమాసం. ఎండ నవాబుగారి మనసులోని కోరికలాగా మండుతోంది. ఫౌజు గుర్రాలు పాదుషా వారి మనస్సు లాగా పరుగెత్తాయి. చీకటి పడిన తరువాత గద్వాలు ను ముట్టడించాలనుకున్నాడు. అంతవరకూ ఎక్కడ విశ్రమించాలి అనుకుంటూ ఉండగా కృష్ణానది వచ్చింది.
పేరుకు జీవనదే కాని ఎక్కడో మధ్యలో పిల్ల కాలువలాగా ఉంది. ఈ గట్టు నుండి ఆ గట్టు వరకూ ఇసుక। ఇసుక। ఇసుక।
అర్ధరాత్రి వరకూ అక్కడ విశ్రమిద్దామనుకున్నారు. గుర్రాలని నది ఒడ్డున చెట్టుకు కట్టారు. ఆయుధాలని ఒక చెట్టు క్రింద ఉంచి పదిమందిని కాపలా పెట్టారు.
ఆ వార్త గద్వాలు రాజుకు చేరింది. వచ్చిన శత్రుసైన్యం రెండువేల గుర్రపుదళం. తమ సైనికులు రెండువందల మంది లేరు. జనకుని వంటి ఆ రాజు ధర్మపరిపాలనలో వారికికి పనే లేదు. రాజు ఆలోచించాడు. తమ వీరులు నిత్యసన్నద్ధు లైనా పదిరెట్లున్న సైన్యానికి బదులు చెప్పలేరు. యుద్దం వలన గెలుపుమాట దేవుడెరుగు. ప్రజలు దుఃఖాల పాలౌతారు.
రాజు పూజామందిరానికి వెళ్ళాడు. అక్కడ నిలువెత్తు కృష్ణస్వామి విగ్రహముంది.
' యతోధర్మస్తతోజయః' అన్నట్లు తోచింది. వెంటనే గుర్రం మీద నాలుగామడల దూరంలో ఉన్న వేణీసోమపురం బయలుదేరాడు.
గోలుకొండ సైనికులు కృష్ణానది ఇసుక తిన్నెలమీద తమకు రాబోయే విజయం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి దూరంగా పోతున్న రౌతు గుర్రపు డెక్కలు చప్పుడు వినిపించింది. వాళ్ళాలోచించారు. వాడు తమ వార్త గద్వాల చేరిస్తే అటకాయించాలి. రౌతు గద్వాల విడిచి పోతున్నాడు, పోనీలే అనుకున్నారు.
గద్వాల రాజు వేణీసోమపురం చేరాడు. స్వామివారు సమాధిలో ఉన్నారు. శిష్యుడు రాజు రాక చెప్పబోయాడు. ఎప్పుడయినా రాజు ఆశ్రమానికి వస్తే ఆయనకు చిత్రాసనం
వేస్తారు. స్వామి శిష్యునికి ఆ ఆసనం చూపించారు.
శిష్యుడాశ్చర్యపోయాడు. రాజు ప్రవేశించి స్వామి సమ్ముఖాన చిత్రాసనం మీద కూర్చున్నాడు. రాజు యవనుల దండయాత్ర గురించి వివరించాడు. స్వామి చిరునవ్వు నవ్వి, తన బక్కచిక్కిన శరీరం వైపు మళ్ళించాడు. రాజు చెంపలు వేసుకుని స్వామి వారి పాదాల వద్ద సాగిలపడ్డాడు.
స్వామి పరిశీలించాడు. రాజు సన్యాసి లాగా ఉన్నాడు. అతని ఆర్తి తన దేహం గురించి కాదు. తనను నమ్ముకుని నిశ్చింతగా నిద్రపోతున్న ప్రజల గురించి తాను దీక్షగా సాగిస్తున్న ధర్మం గురించి. స్వామి రాజును లెమ్మన్నాడు.
“రాజా! ధర్మాన్ని ధరించు. మార్గణాన్ని ధరించు. వాహిని నీ వెంట ఉంది. శత్రువులకు పరాజయం కలుగుతుంది” అని ఆశీర్వదించెను.
రాజు చేతులు చాచాడు. స్వామి వారి చేతిలో అక్షతలున్నాయి. కనులు మూసుకుని
ఉన్నారు.
' ధర్మో భవతు సద్ధర్మః మారణాస్పంతు మార్గణాః
వాహినీ వహినీ రాజన్ స్వాదరా పరాజయః'
అంటూ కనులు తెరచి మంత్రాక్షతలు రాజు చేతిలో ఉంచారు స్వామి వారు. రాజు దానిని భక్తితో స్వీకరించెను. ఉత్తరీయం కొంగున ముడి వేసుకొనెను. వచ్చిన దారిన వెళుతున్నాడు.
అతని మనసులో స్వామి వారి ఆశీర్వాదమే మెదలుతున్నది. తన చేతిలో ధర్మం (విల్లు)లేదు.. మనసులో ధర్మం ఉంది. చేతిలో మార్గణాలు (బాణాలు) లేవు. మనసులో భగవంతుని వెదికే ఆలోచనలు - మార్గణాలు ఉన్నాయి. వాహిని(సేన) లేదు. ప్రక్కన కృష్ణ వాహిని( నది) ఉంది.
స్వామివారి ఆశిష్షు ' స్యాదరా పరాజయః' అని. ఆయన మనసులో కృష్ణుడున్నాడు.
ప్రక్కన కృష్ణ ఉన్నది. ఉన్నదా? కనుచూపు మేరలో కనిపించడం లేదు. కళ్ళు మూసుకుంటేనే కృష్ణుడున్నట్లు కృష్ణ కూడా ఉన్నది. కళ్ళు తెరిచాడు. కృష్ణ ఉండే ఉంటుంది. పిల్ల కాలువ లాగా । శత్రువునకు తాను ఒరిగి ఉన్నట్లు. ఇసుకకు ఒరిగి ఎక్కడో ఉంటుంది కృష్ణమ్మ. రాజు ఉత్తరీయం ముడివిప్పి మంత్రాక్షతలని 'కృష్ణార్పణమ్' అని నదిలోకి విసిరాడు.
గట్టున చెట్లకు కట్టిన గుర్రాలు గింజుకుంటున్నాయి. ఘోషిస్తున్నాయి. దూరంగా కృష్ణమ్మ నృత్యం చేస్తూ కాదు, తాండవం చేస్తూ వస్తున్నది. గట్టున ఆయుదాలని కాపలా కాస్తున్న పదిమంది, గట్ల మధ్య ఆదమరచి నిద్రపోతున్న సైనికులని నిద్ర లేపటానికి పరుగెత్తారు. వారు వీరూ చేరి రెండువేలయ్యారు. ఒక్కసారి కృష్ణమ్మ రానే వచ్చింది.
వస్తూనే తరంగ హస్తాలతో వారిని తీసుకుని సముద్రం వరకూ సాగిపోయింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న రాజు కనులలో కృతజ్ఞత మెరిసింది. ఇంత చేసిన ఆ కృష్ణ ఒడ్డున ఉన్న పన్నెండు గ్రామాలని వ్యాసతత్త్వజ్ఞ స్వామి వారికి ఆ క్షణానే సంకల్పరూపంగా దానం చేశాడు రాజు.
తెల్లవారింది. గద్వాలు సైనికులు నది ఒడ్డున కుప్పవేసిన ఆయుదాలని, ఒడ్డున చెట్లకు కట్టిన గుర్రాలను తీసుకొని పోయారు. గోలకొండ నవాబుకు ఈ కథ తెలియదు. ఆయన మంత్రులని పిలిపించాడు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. విజయవార్త వినిపిస్తారని నవాబు చూశాడు. ఆయన చెబుతాడని వాళ్ళనుకున్నారు. ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూచుకొంటున్నారు.
గట్టుమీద ఆయుదాలని కాచిన సైనికులలో పరుగెత్తలేని సైనికుడు తాను చూచిన మహా ప్రళయాన్ని పాదుషాకు, మంత్రులకు విన్నవించాడు. ఆశ్చర్యమేమిటంటే నది
లో అంతకుముందు చుక్కనీరు లేదు. అందరూ కొట్టుకొని పోయిన తరువాత చూస్తే అప్పుడు కూడా చుక్క నీరు లేదు. అది విన్న పాదుషా అన్నాడు గదా, ' గద్వాల ధర్మసంస్థానం' అని !
ఆ మంత్రులలో ఒక బ్రాహ్మణమంత్రి కూడా ఉన్నాడు. ఈ దండయాత్రకు అతడు విముఖుడు. అతని మాట ఎవ్వడూ ఖాతరు చెయ్యలేదు. అతడు మనసులో నొచ్చు కున్నాడు.
" అరక్షితం తిష్ఠతి దిష్ట రక్షితమ్
సురక్షితం దైవహతం వినశ్యతి' అని.
ఇదే కదా " యతోధర్మస్తతోజయః" -
_______________________శుభంభూయాత్_____________________________________
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments