top of page

ధీర

Writer: Rajani IttaRajani Itta

#RajaniItta, #Dheera, #ధీర, #రజనిఇట్టా, #TeluguStories, #తెలుగుకథలు


Dheera - New Telugu Story Written By Rajani Itta

Published In manatelugukathalu.com On 25/03/2025 

ధీర తెలుగు కథ

రచన: రజని ఇట్టా


మొదటిసారి తనని చూసినపుడు పెద్దగా స్పెషల్ గా అనిపించలేదు. చాలా మామూలు అమ్మాయిలానే అనిపించింది. బాగా చదువుకుంది, పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తోంది. పరాయిదేశంలో ఒంటరిగా ఉంటూ ధైర్యంగా నెట్టుకొస్తోంది. తనకి నచ్చినట్టుగా ఉంటూ, ఇష్టమైనవి చేస్తూ.. ఇండియాలో ఉన్న అమ్మానాన్నలను ప్రేమగా చూసుకుంటుంది. 


మా ఫ్లోర్ లో ఉండే నా ఫ్రెండ్ రీనా ఇంటిలో జరిగిన సత్సంగ్ లో మొదటిసారి చూసాను నేను తనని. పేరెంట్స్ తో బాటు వచ్చింది. చాలా జోవియల్ గా, లైవ్‌లీ గా ఉంది. మనసులో ఏమీ అరమరికలు లేకుండా భలే సంతోషంగా మాట్లాడింది. తనని చూడగానే నేను పాతికేళ్ల నాడు ఎలా ఉండేదాన్నో అచ్చంగా అలానే అద్దంలో చూసుకుంటున్నట్టు అనిపించింది. పేరుకి బెంగాలీ అయినా చూట్టానికి అచ్చం మిడిల్ ఈస్ట్ అమ్మాయిలా కనిపిస్తుంది. నీలి కళ్ళు, తెల్లని మేని ఛాయ, కోటేరు లాంటి ముక్కు, గిరజాల జుట్టు, ఐదడుగుల ఎనిమిదంగుళాల పొడవు.. ఓసారి చూస్తే మర్చిపోలేని ఆకర్షణీయమైన రూపం.. 


తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ రీనా ఇంట్లోనే సత్సంగ్ లోనే కలిశాను. హాయ్ హలో కాస్తా మంచి పరిచయంగా మారింది. బాగా జోక్స్ వేసేది. రెండు మూడు సార్లు షాపింగ్ మాల్స్ లో అనుకోకుండా కలిశాం. చక్కగా పలకరించేది. మా పాపతో దోబూచులాడేది. 


ఏడాది తర్వాత రీనా బర్త్ డే సందర్భంగా పెట్టిన సత్సంగ్ లో తను మళ్ళీ కనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి ఆరు నెలల ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ చెప్పాను. హెల్త్ బాగా చూసుకో అంటూ విష్ చేశాను. ఓసారి రీనా తన ఇంటికి వెళ్తున్నా అని చెప్తే డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసి పంపించాను. ఎప్పుడూ తన భర్త గురించి గానీ, అతని వివరాలు కానీ అడగలేదు. అసలా ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు నాకు. 


ఓరోజు రాత్రి పది గంటలప్పుడు సడెన్ గా రీనా తలుపుకొట్టి ‘అర్జంటుగా నాతో రా పనుంది’ అని పిలిచింది. 


రీనా ఒక డివోర్సీ. మల్టీ నేషనల్ కంపెనీలో సౌత్ ఈస్ట్ ఏషియా కి సేల్స్ హెడ్ గా పని చేస్తుంది. అయిదేళ్లుగా పక్క పక్క ఫ్లాట్స్ లో ఉండటం వల్ల మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. ఆఫీస్, గురూజీ, సత్సంగ్ తప్ప ఇంకేం పట్టని రీనాకు మా అమ్మాయి అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే పాప వచ్చాక రీనా, నేను అక్కచెల్లెళ్ళ కంటే క్లోజ్ అయ్యాం. 


అప్పటికే మా నాలుగేళ్ల అమ్మాయి నిద్ర పోవటంతో మా ఇంటాయనకి, మా ఫిలిప్పీన్స్ మెయిడ్ కి కాస్త చూసుకోమని చెప్పి రీనా తో బయటికి వచ్చాను. ఫారిన్ కంట్రీస్ లో ఇలా ఒకరికొకరు తోడుగా ఉండటం మామూలే కావటంతో ఎవరికో ఏదో అత్యవసరమని పిలిచింది అని ముందే ఊహించాను. క్యాబ్ లో ఇద్దరం సీమై నుంచి బడోక్ రిజర్వాయర్ వైపుగా వెళ్తున్నాం. 


దారిలో రీనా చెప్పింది విని కొంచెం కంగారు పడ్డాను. తన ప్రెగ్నెంట్ ఫ్రెండ్ కి బాలేదని అర్జంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలని, ఒక్కదానికి ధైర్యం చాలక నన్ను పిలిచానని చెప్పింది. నేను చాలా క్యాజువల్ గా ‘ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళి ఉంటారు కదా, మనం డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్ళాలేమో కదా’ అని అన్నాను. కంగారులో తప్పుగా క్యాబ్ బుక్ చేసిందేమో అని నా ఉద్దేశం. కానీ రీనా చెప్పిన విషయం విని కాస్త ఆశ్చర్యపోయాను. 


రీనా ఫ్రెండ్ కి నాలుగేళ్ల క్రిందట పెళ్లి అయిందట. మ్యాట్రిమోనీ లో కలిశారట ఇద్దరూ. ఆ అమ్మాయి వాళ్ళాయన తనకంటే చాలా అందగాడు, చదువుకున్నాడట. చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో సెటిల్ అయ్యాడట. కానీ ఇద్దరికీ పెద్దగా పొసగక రెండేళ్ల క్రిందట విడాకులు కూడా అయ్యాయట. రీనా వివరంగా చెప్తోంది. 


ఆమె భర్త ఆ పిల్లను చాలా చిన్నబుచ్చేవాడు. విదేశాల్లో చాలా ఇబ్బందులు పడింది. అతన్ని మార్చటానికి శాయశక్తులా ప్రయత్నించి విసిగిపోయింది. అతనో పెద్ద సైకోలా బిహేవ్ చేసేవాడు. ఎన్ని పోజిటివ్స్ ఉన్నా కూడా అతనికి శాటిస్ఫాక్షన్ ఉండేదికాదు. ఎప్పుడూ ఏదో ఒక లోపం ఎత్తి చూపేవాడు. తన ఎదురుగా మిగతా విదేశీ వనితలను చూపి తనని ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేలా మాట్లాడేవాడు. 


అతనికి నచ్చేలా ఉండటానికి ప్రయత్నించి అలసి పోయింది. అతను మాత్రం ఈ పిల్లకి ఏమాత్రం ఇష్టం లేని పనులు చేసేవాడు. ఈ అమ్మాయి ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. పేరెంట్స్ కి చెప్పినా కూడా అమ్మాయిలే అడ్జస్ట్ అవ్వాలని సద్దుకుపోమని చెప్పేవారు. ఇంక అతని ఆగడాలు మరీ మితిమీరటంతో తల్లితండ్రుల సపోర్ట్ లేకపోయినా, చాలా ధైర్యం తెచ్చుకుని విడిపోవాలని నిర్ణయంచుకుంది. 


మొత్తానికి సింగపూర్లో ఉద్యోగం రావటంతో విడాకులకు అప్లై చేసి లీగల్ గా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని సింగపూర్ వచ్చేసింది. మొదట్లో తల్లీ, తండ్రీ బాగా తిట్టి, గొడవ చేసినా.. కొన్నాళ్ళకి అమ్మాయి సంతోషమే ముఖ్యం అని అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్నారు. 


ఇవన్నీ విన్నాక ఈ విషయాలేమీ నాకు ఏమీ కొత్తగా అనిపించలేదు. ఆ అమ్మాయి మీద కొంచెం జాలి, మరి కాస్త అభిమానం పెరిగాయి అంతే. అందుకే చాలా మామూలుగా "అవునా.. పోనీలే మళ్ళీ తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కదా.. ఇపుడు పండంటి బిడ్డ కూడా పుట్టబోతోంది. ఇంకేం కావాలి" అన్నాను. 


ఈలోగా తన ఇల్లు రావటంతో రీనా క్యాబ్ వాడికి పే చేయటంలో బిజీ అయింది. బ్లాక్ నంబర్ వైపు నడుచుకుంటూ లిఫ్ట్ లో ఫ్లాట్ కి వెళ్ళాం. వెళ్ళేసరికే ఆ అమ్మాయి చిన్న బ్యాగ్ తో రెడీగా ఉంది. తనకి కొంచెం నలతగా ఉందట. నొప్పులు మొదలవుతాయని అనిపిస్తోందట. డాక్టర్ ఇచ్చిన డేట్ కి ఇంకా నాలుగు రోజులు ఉన్నా కూడా స్లైట్ గా క్రాంప్స్ వస్తున్నాయని రీనాకి ఫోన్ చేసిందట. రీనాతో బాటు నేను కూడా రావటంతో తను కొంచెం తడబాటుగా చూసింది. బ్యాగ్, మంచినీళ్ళ బాటిల్ తీసుకుని తన చెయ్యి జాగ్రతగా పట్టుకుని లిఫ్ట్ వైపు తీసుకొస్తుంటే కొంచెం మొహమాట పడింది. పర్వాలేదు, ధైర్యంగా ఉండు అన్నట్టు తనకి భరోసా ఇచ్చాను. 


రీనా తన ఫ్లాట్ లాక్ చేసి, హాస్పిటల్ కి మరో క్యాబ్ బుక్ చేసి మా వెనకే వస్తోంది. పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నాం. జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యి, డాక్టర్లు వెంటనే అటెండ్ అవటంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి క్షేమంగా ఉందని చెప్పింది రీనా. రాత్రికే కాన్పు అవ్వచ్చని డాక్టర్లు చెప్పారు. మరో గంట తర్వాత నన్ను వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది తను. 


రీనా కూడా నాకు థాంక్స్ చెప్పి ‘నువ్వెళ్ళు, మీ పాపని చూసుకోవాలి కదా’ అంది. ‘రేపు పొద్దున్నే వస్తాను’ అని చెప్పి ఇంటికి బయల్దేరాను. 


మర్నాడు రీనా ఫోన్ తో నిద్ర లేచాను. రాత్రి డెలివరీ అయిందని, పాప పుట్టిందని చెప్పింది. తనకి ఆఫీస్ పని మీద జకార్తా వెళ్ళే పని ఉందని, పోస్ట్ పోన్ చేయలేనని అంది. మా పాపని స్కూలుకు పంపించి హాస్పిటల్ కి నేను వెళ్తాను అని చెప్పాను. కానీ నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది, ఆ అమ్మాయి భర్త ఈ టైమ్ లో ఆమెను ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అని. 


మా పాపని రెగ్యులర్ డే కేర్ లో కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ లో వెయ్యటం వల్ల ఎనిమిదింటికి వెళ్తే మధ్యాహ్నం నాలుగింటికి కానీ ఇంటికి రాదు. అందుకే ఈలోగా తనకోసం కాస్త జ్యూస్, కొంచెం వెల్లుల్లి కారం చేసి, పళ్ళు కూడా తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ అప్పుడే పుట్టిన బుజ్జి పాపాయిని చూసిన నాకు ఎంత ఆనందం వేసిందో.. ఎంత ముద్దొస్తుందో బుజ్జాయి. 


మరో రెండు రోజులు హాస్పిటల్ కి, ఆ తర్వాత తన ఇంటికి వెళ్తూ ఉండటంతో ఆమెతో మంచి రిలేషన్ బిల్డ్ అయింది. నాకు పిల్లలంటే ఉన్న ఇష్టం కూడా ఒక కారణం కావచ్చు. ఆ బుజ్జి బుజ్జాయికోసమే తన దగ్గరికి వెళ్ళాలి అనిపించేది. వారం రోజులయినా ఎప్పుడూ ఆ అమ్మాయి భర్త ఫోన్ చేయటం కానీ, భర్త గురించి తను మాట్లాడటం కానీ వినలేదు. రెండు మూడు సార్లు తల్లితండ్రులు వీడియోకాల్స్ మాట్లాడటం చూశానంతే. 


వారం తర్వాత రీనా కూడా ఆఫీస్ ట్రిప్ ముగించుకుని వచ్చింది. నేను ఎటువంటి వివరాలు నా అంతట నేను అడగనని రీనాకి కూడా తెలుసు కాబట్టి తను కూడా ఎప్పుడూ ఆమె భర్త టాపిక్ తేలేదు. పాపకి ఆన్య అని పేరు పెట్టింది. కొంతమంది ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చి తనని విష్ చేసారు. పర్మినెంట్ గా అపాయింట్ చేసుకున్న పంజాబీ మెయిడ్ వీసా ఇష్యు వల్ల మొత్తానికి నెల రోజులు ఆలస్యంగా పనిలోకి చేరింది. 


నెల్లాళ్ళ తర్వతనుకుంటా ఓ రోజు మా పాపని కూడా తీసుకుని, కొన్ని బొమ్మలు, తనకి ఇష్టమని చెప్తే నిమ్మకాయ ఉప్పుడుపిండి తీసుకుని వెళ్ళాను. రీనా వాళ్ళింట్లో ఎప్పుడో తిన్నదట. అది ప్లేట్ లో పెట్టుకుని తింటూ అమ్మ వంట తినాలని ఉంది కానీ అంత అదృష్టం అందరికీ ఉండదు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ నాన్న గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందట. ఆయనని చూసుకోవటం కోసం వాళ్ళ అమ్మగారు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చిందట. తను ఒక్కతే కూతురు అట. అసలైతే డెలివరీ టైమ్ కి వాళ్ళమ్మ గారు సింగపూర్ రావాల్సిందట. కానీ అనుకోకుండా ఇలా జరిగింది అంటూ చెప్తూ బాధ పడింది. 


మరో రెండు నెలలు గడిచాయి. మా పాపకి ఆన్యని చూడటం, తన బోసి నవ్వులు చూస్తూ ఆడుకోవటం తెగ నచ్చేస్తోంది. అందుకే వారం వారం పాపని తీసుకుని తన ఇంటికి వెళ్లటం, రీనా ఇంటికి ఆ అమ్మాయి వచ్చినపుడు మా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఇలా పరిచయం కాస్తా ఫ్రెండ్షిప్ గా మారింది. 


ఓరోజు బాగా ఆడి ఆడి పిల్లలిద్దరూ పడుకున్నారు. అపుడు వాళ్ళమ్మ గారు వీడియో కాల్ చేసారు. ఏదో బెంగాలీలో కోపంగా మాట్లాడి పెట్టేసింది. చాలా డిస్టర్బ్ అయినట్టుంది. కళ్ళల్లోంచి టపటపా కన్నీళ్లు ధార కడుతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తోంది. తుడుచుకోమని టిష్యూస్ ఇచ్చి, కొంచెం వేడి వేడిగా హార్లిక్స్ కలిపి ఇచ్చాను. కొద్దిసేపటికి కాస్త తేరుకుంది. థాంక్యూ అక్కా అంటూ నా వైపు తిరిగి మాట్లాడటం మొదలెట్టింది. 


ఈ రిలేటివ్స్ ఉన్నారే వాళ్లకేం పనుండదు. ఎవరేమైతే వాళ్ళకేంటిట. మనకు అవసరం ఉన్నపుడు మాత్రం ఒక్కరూ రారు. మనం బాగుంటే మాత్రం నా అనుకుంటూ వాలిపోతారు అంది. నాకు పెళ్ళి అయిందో లేదో వాళ్ళకెందుకు. నా మొగుడు ఎవరు, ఏమి చేస్తాడు ఇవన్నీ వాళ్ళకి అవసరమా.. విడాకులు అయ్యాక అమ్మ వాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకోమన్నారు. కానీ నాకు మాత్రం మళ్ళీ ఆ వైపు మనసు మళ్ళలేదు. అలాగని జీవితాంతం ఒక్కదాన్నే కూడా ఉండాలని అనుకోలేదు. 


అందుకే నాకంటూ ఒక్క మనిషి తోడు కావాలనుకున్నాను. నా మనిషి, నా అనుకునే మనిషి, నా బిడ్డ, నా రక్తం, నా ప్రాణం. నాకంటూ బిడ్డ కావాలనుకోవడం తప్పా.. అంటూ అడుగుతోంది. తను చెప్పేది ఆసక్తిగా వింటున్న నాకు కన్నీళ్లు ఆగటం లేదు. 


వాడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా.. నా మీద నాకే అసహ్యం వేసేలా కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీశాడు. నేను జాబ్ చెయ్యటానికి తప్ప ఎందుకూ పనికిరాను అన్నాడు. ఆడతనమే లేదని అవమానించాడు. అందుకే నేను చాలెంజ్ గా తీసుకున్నా. అసలు మగాడి తోడు లేకుండా బిడ్డని కనాలని అనుకున్నా. అందుకే డోనార్ స్పెర్మ్ ద్వారా ఐయుఐ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయ్యాను. ఇపుడు నాకు ఆన్య తప్ప ఇంకేం ముఖ్యం కాదు. నాకు పెళ్ళి అంటే నమ్మకం పోయింది, పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ వద్దు, రెస్పాన్సిబిలిటీ కూడా వద్దు. అసలు ఆడదానికి పక్కన మగాడు ఉంటేనే వాల్యూ పెరుగుతుందా.. 


అలాని పెళ్లి చేసుకున్న వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. పెళ్ళిలో హ్యాపీగా ఉన్నవాళ్లు నీతో సహా మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. రీనా లాగా విడాకుల తర్వాత మళ్ళీ పెళ్ళి వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. డైవోర్స్ అయినా కూడా మళ్ళీ పెళ్ళి చేసుకుని, పిల్లలు కని హ్యాపీగా ఉన్నవాళ్లు ఉన్నారు. కానీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలనుకుంటే తప్పా. సమాజం కోసం తప్ప మనకోసం మనం బతకకూడదా. నేను నా బిడ్డని తండ్రి ఊసు తెలీకుండా, ఏ లోటు లేకుండా పెంచుతాను. నాకా నమ్మకం ఉంది. ఎవరేం అంటే నాకేంటి. నేను పట్టించుకోను. ధైర్యంగా ఉంటా అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్న తనని కళ్ళార్పకుండా చూస్తున్నాను.


మారుతున్న సమాజానికి తను ప్రతీకలా అనిపించింది. ఏం చెప్పాలో మాట రాలేదు. పీర్ ప్రెషర్ కి తల ఒగ్గకుండా తనకు నచ్చినట్టు బతుకుతున్న తన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యం వేసింది. 



అప్పటి నుంచి తనని నేను చూసే విధానంలో మార్పు వచ్చింది. తను నా కంటికి చాలా ప్రత్యేకంగా కనబడుతోంది. ఇపుడు ఆన్య కి రెండేళ్లు. నడక కూడా వచ్చేసింది. మా అమ్మాయితో బాగా ఆడుకుంటుంది. వాళ్ళమ్మ ఆఫీస్ పని మీద వేరే దేశాలకి వెళ్లి నాలుగేసి రోజులు లేకపోయినా పనమ్మాయి చాలా బాగా చూసుకుంటుంది. కొంచెం కొంచెం మాట్లాడుతోంది కూడా. 


వాళ్ళ తాత, అమ్మమ్మ అపుడపుడూ వచ్చి వెళ్తుంటారు. వాళ్ళని చూస్తే ఎంతో మెచ్యుర్డ్ గా అనిపించారు. పైకి చాలా క్యాజువల్ గా కనిపిస్తున్నా లోలోపల ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారిలా ఉన్నారు. కూతురి ఇష్టాన్ని మనసారా స్వాగతించే అతి కొద్దిమంది పేరెంట్స్ లో వాళ్ళు కూడా ఉన్నందుకు అనుకుంటా ఎంతో హుందాగా అనిపిస్తున్నారు నా కళ్ళకి. 


రీనా నాతో ఓసారి అంది, నా భర్త ఆర్మీ డాక్టర్, నేను ఎంబీఏ. పెద్దల అనుమతితో చిన్నప్పటి ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నా. కానీ అతను ఆశయాలు వేరు. నా ఆలోచనలు వేరు. నాకు ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రమోషన్స్ మీద విదేశానికి రావాల్సి వచ్చింది. తనకి ఇక్కడికి రావటం ఇష్టం లేదు. నేను నా కలలను చంపుకుని అక్కడే ఆగిపోలేను. రిలేషన్ ను కాపాడుకుందాం అని కొన్నాళ్ళు టైమ్ ఇచ్చాం. ఇద్దరి ఆలోచనలు ఎక్కడా కలవలేదు. అందుకే విడాకులు తీసుకున్నాం. కానీ నాకు బిడ్డలను కనాలన్న ఆలోచన లేదు. నేను ఒక్కదాన్నే చూసుకోగలనన్న ధైర్యం లేదు. ఆన్య లాంటి బిడ్డ కావాలని నాకూ అనిపిస్తోంది. కానీ అంత ధైర్యం నేను చేయలేమో అంది. 


నిజమే. ఎందరో ఎన్నో అనుకుంటారు. కానీ అందరూ అన్నీ చెయ్యలేరు. ఎవరో కొంతమంది మాత్రమే జీవితంలో తాము అనుకున్నవి అన్నీ సమాజాన్ని ఎదిరించి అయినా సాధించుకుంటారు. ఆన్య అమ్మలా. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదూ.. కేనా. అంటే మీనింగ్ తెలుసా.. గూగుల్ లో వేస్తే Greatest champion" or "renowned for bravery" అని వచ్చింది. నిజమే తన జీవితాన్ని తానే ధైర్యంగా లిఖించుకున్న రియల్ చాంపియన్. 



  ###


రజని ఇట్టా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నమస్తే. 

నా పేరు రజని ఇట్టా. గత పది సంవత్సరాలుగా సింగపూర్ లో ఉంటున్నాను. నేనొక గృహిణి ని. ఇలా కథల పోటీకి కథ రాసి పంపటం ఇదే మొదటిసారి.



 
 
 

Comments


bottom of page