top of page
Writer's pictureNeeraja Prabhala

ధీర వనిత రాధిక

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ధీరవనితరాధిక, #DheeraVanithaRadhika, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Dheera Vanitha Radhika - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 20/11/2024

ధీర వనిత రాధిక - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన రాధిక తను ఏదైనా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని అనుకుని తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. 


ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాఘవయ్య తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య జానకమ్మ, కూతురు రాధికతో సంతోషంగా ఉంటూ ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతున్నారు. ఏకైక కూతురు రాధికను కష్టపడి డిగ్రీ చదివించారు.


 త్వరలో ఏదైనా మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లిచేయాలనే యోచనలో వాళ్లు ఉన్నారు. రాధిక తనకు ఇప్పుడే పెళ్లి వద్దని, తను ఏదైనా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలనీ, తన కాళ్లమీద తాను నిలబడాలనే తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు ముందు ఒప్పుకోకపోయినా కూతురి ధృఢ నిర్ణయాన్ని, మొండి పట్టుదలని కాదనలేక అంగీకరించారు. 

 

రాధిక ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు షాపులలో సేల్స్ గరల్స్, స్విగ్గీ, జొమాటో లలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకి వెళ్లింది. చివరికి స్విగ్గీ లో ఆమెకు ‘ఫుడ్ డెలివరీ ఉమెన్’ గా ఉద్యోగం వచ్చి సంతోషంగా ఒప్పుకుంది. మంచి జీతం, ఫుడ్ డెలివరీ వగైరాలు చేసి తను ఎంతోమందికి సాయపడే అవకాశం వచ్చిందనుకుని ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది రాధిక. 


“రాధికా! పెళ్లి కావలసిన పిల్లవి. స్విగ్గీ లో చేరుతావా? అదీ డెలివరీ ఉమెన్ గా. నీకేమైనా మతి పోయిందా? నలుగురూ ఏమనుకుంటారు? మన పరువేం కాను?” కోపంతో అరిచాడు రాఘవయ్య. 

 

 “నీ మాట కాదనలేక ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాం. ‘ఫుడ్ డెలివరీ ఉమెన్’ గా వేళాపాళా లేకుండా అన్నిచోట్లా తిరగాలి. ఆడపిల్లగా కష్టపడటమే కాక కష్టమర్లు, పోకిరీల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. రోజూ పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాం. ఈ ఉద్యోగం వద్దు. ఇంకేదైనా ఉద్యోగం ప్రయత్నించు. స్విగ్గీ లో ఉద్యోగం అంటే నీకు పెళ్లిసంబంధాలు కూడా రావమ్మా. నా మాట విను రాధికా!” అనునయంగా అంది జానకమ్మ కూతురితో. 


“అమ్మా, నాన్నా! నేనీ ఉద్యోగం చేయాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. మీ అనుమానాలేమీ నిజంకావు. అవన్నీ మీ కాలంలోవి. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు కష్టపడి చదివి ఉద్యోగం చేస్తూ తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. అయినా లోకులు కాకులు. ఏ రంగంలోనైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను ఉద్యోగం చేస్తానమ్మా. ఉద్యోగం ఈ ఊర్లోనే కదా! మీరంతా ఉండగా నాకేం కాదు. మీరిద్దరూ ఒప్పుకోండమ్మా ప్లీజ్!” తల్లి వద్దకు వచ్చి గోముగా అంది రాధిక.

 

కూతురి మాటలకు మెత్తబడి జానకమ్మ సుముఖత చూపించింది.


“ఏమండి! అమ్మాయి అంతగా ఆ ఉద్యోగాన్ని ఇష్టపడుతుంటే మనం కాదనడమెందుకు? మన కళ్లముందే రోజూ ఉద్యోగానికెళ్లొస్తుంది. ఏదన్నా ఇబ్బందులొస్తే అప్పుడే వేరే దాంట్లో చేరుతుంది. ఒప్పుకోండి” అంది భర్తతో జానకమ్మ.


 “సరే! తల్లీకూతురు ఒకటయ్యాక ఇంక నాదేముంది? కానీ అన్నిచోట్లా జాగ్రత్తగా ఉండు రాధికా. ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పు.” అన్నాడు రాఘవయ్య.


“మా మంచి నాన్న” తండ్రి వద్దకు వచ్చి సంతోషంగా అంది రాధిక.


 “ఇంక ఇద్దరూ భోజనానికి లేవండి.” 

అని భోజన ఏర్పాట్లలో మునిగింది జానకమ్మ. అందరూ సంతోషంగా భోజనాలు చేసి నిద్రకుపక్రమించారు. రాధికకు మాత్రం ఆలోచనలతో నిద్ర పట్టలేదు. 


రోజూ కంపెనీకి వెళ్లిరావడం, ఫుడ్ డెలీవరీకై కష్టమర్స్ వద్దకు తిరగడానికి తనకేదైనా టూవీలర్ బండి ఉంటే బావుండన్నది ఆమె ఆలోచన.


 రాధికకి తన స్నేహితురాలు ఉమ గుర్తొచ్చింది. ఎందుకైనా మంచిదని అప్పుడప్పుడు ఉమ వద్ద తను టూవీలర్ నడపడం నేర్చుకుంది. ఇటీవలే లైసెన్సు కూడా వచ్చింది తనకి. ఈమధ్యనే ఉమ క్రొత్త బండిని కొనుక్కుంది. తన పాత బండిని ఇస్తుందేమో ఉమని అడుగుదామని నిర్ణయించుకుంది. ఆమె తన మాట కాదనదు. రేపే ఉమని అడగాలి ” అనుకుని నిద్రపోయింది రాధిక.


ఆ మరురోజు ఉదయాన్నే రాధిక ఉమని కలిసి తన ఉద్యోగం విషయం చెప్పింది. 


“ కంగ్రాట్స్ రాధికా!” అంది ఉమ. 

“ఉమా! నాకొక సాయం చేస్తావా? మొన్నటిదాకా నీవు వాడిన నీ పాత టూవీలర్ బండిని నాకిస్తావా? నేను దానిని ఉపయోగించుకుంటాను.” అంది రాధిక.


“దానిదేముందే!. నాకెలాగూ ఇంకోటి ఉంది. తీసుకో. నీకుపయోగపడితే ఆనందమే కదా! నాకేం డబ్బులు వద్దు. ఊరికినే తీసుకుని వాడుకో. మానాన్నేమనరు. సరేనా!” అంది ఉమ.

 

“ధాంక్యూ! ఉమా!” అంది రాధిక ఉమని హత్తుకుని.

“మనలో మనకి ధాంక్స్ ఏమిటే?” అంది ఉమ.


 తర్వాత ఉమ తన బండిని రాధికకి ఇచ్చింది. దానిమీద రాధిక తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో విషయాన్ని వివరించింది. అందరూ సంతోషించారు.


ఆ మరురోజే రాధిక తను పనిచేయబోయే స్విగ్గీ కంపెనీకి వెళ్లింది. అక్కడి మేనేజర్ సాదరంగా పలకరించి తమ కంపెనీ నియమనిబంధనలను, కష్టమర్లతో ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆర్డర్లు తీసుకోవాలో, వాళ్లందరిచే ఎలా మన్ననలను పొందాలో మొ.. వాటిని వివరించి మిగిలిన స్టాఫ్ నంతటినీ రాధికకు పరిచయం చేశాడు. వాళ్లందరూ చాలా కలుపుగోలుగా మాట్లాడటం చూసి కొండంత ధైర్యం వచ్చింది రాధికకి. 


స్వతహాగా చురుకైన రాధిక కంపెనీలో ఆర్డర్లు వగైరా అన్నీ నేర్చుకుంటూ రోజువారీ ఉద్యోగానికి వెళ్లివస్తోంది. కొన్నాళ్లయ్యాక తొలి సంపాదనని అందుకున్న రాధిక దానిని తన తల్లితండ్రుల చేతికిచ్చి వాళ్లకు నమస్కరించింది. వాళ్లు చాలా సంతోషించారు. చూస్తూ ఉండగానే రెండు నెలలు గడిచాయి.


 రాధిక తన కస్టమర్లతో చక్కగా మాట్లాడుతూ వాళ్లకు సమయానికి ఆర్డర్లు అందచేస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంటోంది. క్రమేణా కొన్ని గేట్ వే అపార్ట్మెంట్ లలోకి కూడా వెళ్లి అందరికీ సమయానికి ఆర్డర్లు అందచేస్తూ, వాళ్లందరితో మంచిగా ఉంటూ తన ప్రవర్తనచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాధిక చదివిన చదువు, ఉద్యోగం చేస్తూ ఆమె కుటుంబానికి సాయపడటం గురించి తెలిసి ఆమె కష్టపడే వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ 

 “ఎండనకా, వాననకా ఆడపిల్లైనా కష్టపడి చక్కగా ఉద్యోగం చేస్తోంది. బాధ్యత గల్గిన మంచిపిల్ల రాధిక “ అని ఆ అపార్ట్మెంట్ లలో కొందరు రాధిక రాగానే ఆప్యాయంగా పలకరించి త్రాగేందుకు మంచినీళ్లు, మజ్జిగ ఇస్తున్నారు. వాళ్ల ఆప్యాయతకి రాధిక మనసు కరిగిపోతోంది. 


 రాధిక తన జీతంలో కొంత డబ్బుతో ఫుడ్, పండ్లు, వాటర్ బాటిళ్లను కొని ఫుట్ పాత్ ల మీద ఉండే వాళ్లకు, బీదవాళ్లకు అందిస్తోంది. వాటినందుకుని రాధికను “ ఏ అమ్మ కన్నబిడ్డో! సల్లగుండమ్మా” అంటూ ఉంటే రాధిక మనసంతా హాయిగా ఉంటోంది. 


ఆ కమ్యూనిటిలోనే రిటైర్డ్ అయిన ముసలిదంపతులు రోజూ రాధికను గమనిస్తూ ఉంటున్నారు. ఒకరోజున ఆమెని దగ్గరకు పిలిచి తమకు ఆన్లైల్లో ఫుడ్, పండ్లు, కూరగాయలు, మెడిసిన్స్ మొ.. వాటిని ఎలా?, ఎక్కడ? ఆర్డర్లు పెట్టాలో, వాటి పేమెంట్స్ ఎలా చేయాలో? చెప్పమని కోరారు. రాధిక అంతా వివరంగా చెప్పి వాళ్లకి చూపించింది. వాళ్లు రాధికని అభినందించారు. 


ఆ పొరుగున ఉన్న ఒక మార్వాడి కుటుంబంలోని ఆడవాళ్లు ఫుడ్ డెలివరీకై వచ్చిన రాధికను రోజూ గమనిస్తూ ఆమెని ఎగాదిగా చులకనగా చూడటం రాధిక కంటపడకపోలేదు. రాధిక దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ఒకరోజున వాళ్లు రాధికను “ఏయ్! ఫుడ్ ఉమెన్. ఇలా రా!” అని పిలిచారు. 


తనని పేరుతో గానీ, మేడమ్ అని గానీ అభిమానంగా పిలవకుండా వాళ్లు పిలిచిన పిలుపుకి బాధపడి ఏదైనా ఆర్డరు కోసం పిలిచారనుకుని 

తన వృత్తి ధర్మంగా వాళ్ల వద్దకు వెళ్లింది రాధిక.


 “చూడు. రోజూ టూవీలర్ పై వస్తూ ఈ పాటి చిన్న ఉద్యోగానికే ఏదో గొప్పగా ఫీలవుతున్నావు. ఇదీ ఒక ఉద్యోగమేనా? మా ఇంట్లో పనివాళ్ల జీతమంత ఉండదు నీజీతం. తెలుసా!” అన్నారు. 


వాళ్ల మాటలకు రాధిక మనసులో బాధపడి వాళ్లకి తగిన బుధ్ధి చెప్పాలనుకుంది.

 

“నమస్తే. నా పేరు రాధిక. సభ్యత లేకుండా మీరు మాట్లాడిన మాటలకు మీకు నమస్కరించాలనిపించకపోయినా నాకు సంస్కారం ఉన్నందున మీకు నమస్కరించాను. ‘ఫుడ్ ఉమెన్’ అన్నారు కదా! ఇది ఒక బాధ్యత గల ఉద్యోగం. మీకు అవసరమైనప్పుడు తల్లిలా మీకు ఫుడ్ వగైరాలు అందించేది మేమే. ఇది నాకేం చిన్నతనం కాదు. నేను కష్టపడి సంపాదిస్తూ బ్రతుకుతున్నాను. మీ ఇంట్లో పనివాళ్ల అవసరం లేకుండా మీరొక్కరోజు కూడా ఉండలేరు. ధనం ఉండగానే కాదు. ఇతరులను గౌరవించే సంస్కారం, వాళ్లకు సాయపడే మనస్తత్వం ఉండాలి. నా గురించి మానేసి ముందు అది నేర్చుకోండి. అంతేగాక ఇతరులను అవమానించే నీచగుణం మానుకోండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. నా మాటలు మీకర్థమయ్యే ఉంటాయనుకుంటాను” అని రివ్వున వెనుతిరిగి ఆత్మవిశ్వాసంతో బయటికివచ్చింది. 


రాధిక సమాధానం వాళ్లకు ఊహించని చెంపదెబ్బ. అది వాళ్ల మనసుమీద ప్రభావం చూపి లోతుగా ఆలోచింపచేశాయి. క్రమేణా వాళ్లల్లో మార్పు రాసాగింది. ఒకరోజున వాళ్లు రాధికని పిలిచి ‘సారీ’ చెప్పారు. ఆ మార్పుకు రాధిక చాలా సంతోషించింది. క్రమేణా వాళ్లు కూడా రాధికకు ఆర్డర్లు ఇవ్వసాగేరు. 


రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున రాధిక తన ఉద్యోగంలో భాగంగా ఫుడ్ డెలివరీ చేసి తిరిగి వస్తుండగా చీకటి పడింది. వేగంగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్న ఆమెని కొందరు ఆకతాయిలు అడ్డగించారు. 


అందులో ఒకడు “ఏయ్! ఫుడ్ డెలివరీ ! మాకు బాగా ఆకలిగా ఉంది. ఆకలి తీరుస్తావా? అని వెకిలిగా అన్నాడు. 

ఇంకొకడు “రాధికా సమేతా కృష్ణా!” అంటూ పాటని అందుకున్నాడు.

“భలే పాడుతున్నావురా కృష్ణా!” అన్నాడు ఇంకొకడు.


 వాళ్లు ఆప్రాంతం వాళ్లేనని, తన పేరుని కూడా తెలుసుకున్నారని అర్ధమైంది రాధికకి. 


 రాధిక ధైర్యం తెచ్చుకుంది. వృత్తి ధర్మంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఊహించింది కనుక ఏమాత్రం జంకకుండా 

“మీలాంటి వాళ్లనెందరినో చూస్తున్నా. మర్యాదగా మీరు పోతారా? షి టీమ్ కి అప్పగించనా? కేసులు అంటూ మిమ్మల్ని బుక్ చేసి పోలీసు స్టేషన్ లో పడేస్తారు”. అని వాళ్లని బెదిరించింది. వెంటనే తన ఫోన్ ఆన్ చేసి షి టీమ్ కి ఫోన్ చేయబోయింది. షి టీమ్, కేసులు అనగానే వాళ్లు కాస్త వెనక్కి తగ్గి పరుగందుకున్నారు. ఇదొక అనుభవం అనుకుని రాధిక ఇంటికొచ్చింది. 

 

 ఆ తర్వాత తనకే సమస్యలొచ్చినా ధైర్యంగా, సమయస్ఫూర్తిగా వాటినెదుర్కొంటూ హాయిగా ఉద్యోగం చేస్తూ మంచిపేరు గడిస్తోంది రాధిక. 


 స్విగ్గీ వంటి విభిన్నరంగంలో ‘ఫుడ్ డెలివరీ ఉమెన్’ గా ఉద్యోగాన్నెంచుకుని సమర్ధవంతంగా విధిని నిర్వహిస్తూ అందరిచేత శెభాష్ అనిపించుకుంటోంది రాధిక. 

 

ఆత్మవిశ్వాసం, ధైర్యం, పది మందికి సాయంచేసే గుణం ఉంటే చాలు ఎవరైనా అభివృద్ధి పధంలోకి దూసుకుపోతారనేదానికి రాధికే నిదర్శనం.


.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








47 views0 comments

Commentaires


bottom of page