top of page

ధీరవనిత వరమ్మ

Writer: Neeraja PrabhalaNeeraja Prabhala

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ధీరవనితవరమ్మ, #DheeravanithaVaramma, #TeluguKathalu, #తెలుగుకథలు

Dheeravanitha Varamma - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 25/03/2025

ధీరవనిత వరమ్మ - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


తొలికోడి కూతతో నిద్రలేచిన వరమ్మ తన కాలకృత్యాలను ముగించి వాకిలి ఊడ్చి పేడతో కళ్లాపు జల్లి ముగ్గులు పెట్టి గొడ్లసావిడిలోకి వెళ్లింది. గేదెల వద్దకు వెళ్లి వాటిని ప్రేమగా చేతితో నిమరగానే అవి తలలు ఊపుతూ ఒక్కసారిగా వాటి భాషలో ఆప్యాయంగా పలకరించాయి. క్రింద ఉన్న పేడని తీసి మూలన ఒకచోట పోగుచేసి ఆ సావిడిని ఊడ్చి శుభ్రం చేసింది. 


చేతులను కడిగి పచ్చి గడ్డి మేతని తెచ్చి వాటికి వేసి ఇంట్లోకి వెళ్లింది. పెద్ద గిన్నె తీసుకుని పాలు పితికేందుకు గేదెల వద్దకు వెళ్లి పాలు పితికి, కొంత పాలను దూడలకు ఉంచి వాటిని తల్లుల వద్దకు వదిలింది. అవి ఆబగా వాటి పొదుగుని త్రాగుతున్నాయి. 


ఇంట్లోకి వెళ్లి దాలిపొయ్యిలో పిడకలను వేసి పొయ్యి రాజేసి మట్టి పిడతలో పాలు కాచింది. వంట చేసి కారేజీలను సర్దింది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని లేపి ఆయనకి ముఖం కడిగి, కావలసినవి చూసి అంబలి కాచి, మందులు, మంచినీళ్లను ఇచ్చింది. తర్వాత తన ఇద్దరు కవల చెల్లెళ్లు రమ, ఉమ లను, తమ్ముడు మధుని లేపింది. వాళ్లు తయారవగానే అంబటినిచ్చి, కారేజీలనిచ్చి వాళ్లని స్కూలుకు బయలుదేరదీసింది. వాళ్లు చక్కగా చదువుతూ మంచి మార్కులను తెచ్చుకుంటున్నారు. 


ప్రక్కింటి వాళ్లకు తండ్రిని కాస్త పై ఎత్తున చూస్తూ ఉండమని నాగలిని భుజాన వేసుకుని, తాబేలు నీటి ముంతని, కాసిని విత్తనాలను తీసుకుని దూరంగా ఉన్న పొలానికి నడుస్తోంది. కాసేపటికి పొలంలోకి దిగి నాగలిని దున్ని నేలని చదును చేసి చాలులలో గింజలను నాటింది. ఆ పని పూర్తయేటప్పటికి సూరీడు తీక్షణంగా చూస్తున్నాడు. లేచి గట్టుకు చేరి తాటిచెట్టు నీడన కూర్చుని తన పైట చెంగుతో ముఖాన పట్టిన చెమటని తుడుచుకుని ముంతలోని నీటిని త్రాగి ఇంటి దిశగా నడిచింది. 


ఇంటికి చేరగానే తండ్రిని పలకరించి, ఆయన్ని లేవదీసి స్నానాది కార్యక్రమాలను పూర్తిచేసి గోడకు వారగా దిండుని ఉంచి కూర్చోబెట్టింది. తను కూడా స్నానం చేసి అన్నం కలుపుకొచ్చి తండ్రికి పెట్టి మందులు వేసి ఆయనను పడుకోబెట్టింది. తర్వాత తను కూడా భోజనం ముగించి కాసేపు విశ్రాంతి తీసుకుంది. ఇదంతా ఆమె రోజువారీ దినచర్య. 


వరమ్మ తండ్రి పరమేశం చిన్న రైతు. కష్టపడి పనిచేస్తూ భార్య లక్ష్మిని, పిల్లలను పోషించుకునేవాడు. పెద్దకూతురు వరమ్మని పదిహేనేళ్ల వయసులోనే మంచివాడు, ఎరుగున్న వాడైన కామయ్యకిచ్చి పెళ్లిచేశాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కామయ్య ఆ ఊరివాళ్ల సాయంతో పెరిగి తనకున్న ఎకరంపొలాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. 

వరమ్మ కాపురానికి రాగానే కామయ్య ఇంటికి వెలుగొచ్చినట్లైంది. వరమ్మ కూడా అతనికి పొలం పనులలో చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకొంటూ తన భర్తని ప్రేమగా చూసుకుంటోంది. అన్యోన్యంగా కాపురం చేస్తున్న ఆ జంటని చూసి అందరూ ముచ్చట పడేవాళ్లు. 


 వీళ్ల అన్యోన్యతని చూసి విధికి కన్నుకుట్టినట్లుగా రెండు సం..తర్వాత ఒకరోజున కామయ్య పొలంలో పాము కాటుకు గురై మరణించాడు. కాస్త దూరంలో పనిచేస్తున్న వరమ్మ భర్త గావుకేకను విని పరుగు పరుగున వచ్చి భర్తని చేతిలోకి తీసుకుని విలపించింది. తన చేతిలోనే ఊపిరి ఆగిపోయిన భర్తని చూసి గుండెలవిసేలా రోదించింది. చుట్టుపక్కల పొలాల్లోని రైతుల సాయంతో భర్తని ఇంటికి చేర్చింది వరమ్మ. 


ఈ దారుణవార్తని విన్న పరమేశం దంపతులు తన కుటుంబంతో సహా పరుగున వచ్చి బాధపడి వరమ్మకి ధైర్యం చెప్పి, ఓదార్చి జరుగవలసిన కార్యక్రమాలని సక్రమంగా జరిపించారు. 

ఆమెకు తోడుగా అక్కడే పదిహేను రోజులు ఉండి ఆ పొలాన్ని, ఇంటిని అమ్మి ఆ వచ్చిన పైకంతో తన ఊరిలోనే తన ప్రక్క రైతుది రెండెకరాల పొలాన్ని వరమ్మ పేరున కొన్నాడు. పుట్టింటికి చేరిన వరమ్మ చాలా రోజుల వరకు భర్త తాలూకు జ్ఞాపకాలను మరువలేకపోయేది. లక్ష్మి దంపతులు ఆమెకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ తమతో పొటే పొలానికి తీసికెళుతూ ఆమెకి కాస్త ఊరడింపునిచ్చారు. క్రమేణా వరమ్మ మనోధైర్యాన్ని కూడదీసుకుని మామూలు మనిషైంది. 


మనోవ్యధకి మందు లేదన్నట్లుగా కూతురికి వచ్చిన కష్టానికి ఒకరోజున నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసింది లక్ష్మి. జరిగిన దానికి పరమేశం, పిల్లలు వరమ్మ అందరూ దుఃఖించారు. తండ్రికి ధైర్యం చెప్పి ఓదార్చి చెల్లెళ్లను, తమ్ముడిని అక్కున చేర్చుకుంది. జరగవలసిన తంతుని జరిపించి ఆ ఇంటికి అన్నీ తానై నడిపిస్తోంది. 


ఒక సం..తర్వాత పరమేశానికి గుండె జబ్బు రాగా వైద్యం చేయించింది వరమ్మ. ఆయనను విశ్రాంతి తీసుకోమని తనే పొలం పనులు, ఇంటి పనులను చేస్తోంది. 


ఒకరోజున పొలంపనిచేసుకుంటున్న వరమ్మ మీద ఆ ఊరివాడే అయిన రంగడు ఆమెమీద అఘాయిత్యానికి తలపడితే ప్రతిఘటించి అతడిని తన చేతిలోని కొడవలితో గాయపరిచి ఇంటికి వచ్చి ఊరి పెద్దలతో ఆ విషయాన్ని చెప్పింది. వారు రంగడిని రచ్చబండ వద్దకు పిలిచి విచారణ జరిపి అతనికి శిక్ష వేసి, అతని చేత వరమ్మకి క్షమాపణ చెప్పించారు. 


“ఇంక నీకు, నీకుటుంబానికి ఏం భయం లేదు. మేమంతా అండగా ఉంటాము” అని వరమ్మకి ధైర్యం చెప్పారు ఆ ఊరి పెద్దలు. ఆమె నిప్పులాంటిదని అందరూ వేనోళ్ల కొనియాడారు. కాలం సాగిపోతోంది. అహర్నిశలు కష్టపడుతూ ధైర్యంగా ఒంటిచేతితో ఆ ఇంటిని నడిపిస్తున్న వరమ్మని చూసి ఆ ఊరి జనులు మెచ్చుకుంటూంటారు. కష్టపడి సేద్యం చేస్తూ వచ్చిన పంట డబ్బులతో చెల్లెళ్లు, తమ్ముడి చదువులకని ఒక్కోరూపాయి దాచిపెడుతోంది వరమ్మ. రమ, ఉమలు చక్కగా చదువుకుంటూ పదవతరగతిని పూర్తి చేసి పట్నంలో కాలేజీలో చేరారు. హాస్టల్ లో ఉంటూ చక్కగా చదువు కుంటున్నారు. శెలవులివ్వగానే ఇంటికి వచ్చి ఆక్కకు సాయంగా ఉండేవారు. 


తాము మంచిగా చదివి జీవితంలో స్ధిరపడినాక తమ కోసం ఇంత కష్టపడుతున్న అక్కకు విశ్రాంతినిచ్చి ఆమెని కంటికిరెప్పలా చూసుకోవాలనుకున్నారు రమ, ఉమలు. మధు పదవ తరగతికి వచ్చాడు. తను బాగా చదివి పెద్ద ఆఫీసరవ్వాలని కోరిక. తరచూ వరమ్మతో ఆ విషయమే చెబుతూఉండేవాడు. తల్లితండ్రులు తననెటూ చదివించలేదు, నిశాని కనుక వాళ్లన్నా బాగా చదవాలని వరమ్మ ఆరాటపడేది. 


శెలవులకు ఇంటికి వచ్చిన చెల్లెళ్లకు కావలసినవన్నీ చేసి పెట్టి పంపేది వరమ్మ. కాలం సాగుతోంది. రమ, ఉమలు ఇంటరు మంచి మార్కులతో పాసయి డిగ్రీలో చేరారు. ఇంక వాళ్లు డిగ్రీ పూ‌ర్తి చేయగానే మంచి సంబంధాలు చూద్దామనుకుంది వరమ్మ. 


మధు పదవతరగతి పాసయి కాలేజీలో చేరాడు. పిల్లలు మంచిగా చదువుకోవడాన్ని చూసి చాలా సంతోషంగా ఉంటున్నా పరమేశం మనసులో వరమ్మని తలుచుకుంటూ చాలా వ్యధ ఉండేది. అందరిలా తన కూతురి కాపురంకూడా బావుంటే ఎంత బావుండేది? భర్తను కోల్పోయి తమందరి కోసం ఎంత కష్టపడుతోంది? అని మధన పడుతూ ఉండేవాడు. 


ఒకరోజున పరమేశంకి గుండెనొప్పి వస్తే హాస్పిటల్ లో చేర్పించి వరమ్మ వైద్యం చేయించినా ఫలితం దక్కక పరమేశం కన్నుమూశాడు. జరిగిన దానికి వరమ్మ తనకు ఉన్న పెద్ద దిక్కుని కోల్పోయానే అని తల్లడిల్లింది. రమ, ఉమ, మధులకు తెలిసి తండ్రిని చూసి విలపించారు. వరమ్మ తనకు తనే ధైర్యం చెప్పుకుని వాళ్లని ఓదార్చి జరుగవలసిన తండ్రి కార్యక్రమాలను పూర్తి చేసింది. 


పదిహేను రోజుల తర్వాత వరమ్మ ఇచ్చిన ధైర్యతో రమ, ఉమ, మధులు కాలేజీకి వెళ్లారు. వరమ్మ ఇంక యధావిధిగా పొలంపనులలో నిమగ్నమయింది. “తండ్రి పోయిన సంం..లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తే కన్యాదాన ఫలితం దక్కి తండ్రి ఆత్మ సంతోషిస్తుంది” అన్న ఊరివాళ్ల సలహాతో చెల్లెళ్లకు మంచి సంబంధాలను వెతికింది. 


రమ, ఉమల అంగీకారంతో వాళ్లకు శేఖర్, సంతోష్ లనిచ్చి ఒకేరోజున ఇద్దరికీ పెళ్లిళ్లను చేసి వాళ్లను అత్తారింటికి పంపింది. ఆ పెళ్లిళ్ల కోసం పొలం అమ్ముతానంటే మధు ససేమిరా అంగీకరించలేదు. ఆ పొలం తనకే కావాలని పట్టుబట్టాడు. ఇంక తన పొలాన్ని అమ్మి వాళ్ల పెళ్లిళ్లని ఘనంగా జరిపించింది. తమకోసం అక్క తన పొలాన్ని అమ్మవద్దని రమ, ఉమలు ఎంతగా చెప్పినా వరమ్మ వినలేదు. 


“చూడండమ్మా! మీరు సంతోషంగా కాపురం చేసుకుంటూ బిడ్డా, పాపలతో సంతోషంగా ఉంటే చాలమ్మా నాకు. ” అంది వరమ్మ తన చెల్లెళ్లతో. పట్నంలో వాళ్లు తమ భర్లలతో సంతోషంగా కాపురం చేసుకుంటూ వీలు కుదిరినప్పుడల్లా అక్కని వచ్చి చూసి వెళుతున్నారు. ఆమెని తమ వద్ద ఉండమని చెల్లెళ్లు ఎన్నిసార్లు చెప్పినా ‘కడదాకా ఈ ఇంట్లోనే ఉండి ఈ మట్టిలోనే కలిసిపోవాలి’ అనేది వరమ్మ. 


ఇంక చేసేదిలేక ఇరుగుపొరుగువాళ్లకు తమ ఫోన్ నెంబర్లు ఇచ్చి అక్కని కనిపెట్టుకుంటూ ఉండమని, ఏదన్నా అవసరమైతే తమకు ఫోన్ చేయమని చెప్పారు రమ, ఉమలు. 

వరమ్మ యధాప్రకారం పొలాన్ని సాగుచేసుకుంటోంది. మధు శెలవులకు వచ్చి వెళుతున్నాడు. 

మరో ఐదు సం..తర్వాత మధు చదువు పూర్తిచేసుకుని బాంకు పరీక్షలు వ్రాసి మంచి ఉద్యోగాన్ని పొందాడు. ఆ విషయాన్ని వరమ్మకి చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. సంతోషంతో తమ్ముడిని హత్తుకుని దీవించింది. మధుకి ఉద్యోగం వచ్చిందని తెలిసి సంతోషంగా రమ, ఉమలు వచ్చి అతడిని అభినందించారు. 


‘తమకోసం అక్క పడిన కష్టాలు తీరినాయి. మధుకి పెళ్లి చేస్తే అక్కని ఎలాగైనా ఒప్పించి తన వద్దకు తీసికెళ్లి ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడు’ అనుకున్నారు రమ, ఉమలు. 


మధుకి పెళ్లిచేద్దామనుకుని చెప్పి అతడి ఉద్దేశ్యాన్ని అడిగింది వరమ్మ. తన క్లాస్ మేట్ జ్యోతిని ప్రేమించానని, ఆమె కూడా తని ప్రేమించిందని నీ అంగీకారంతో పెళ్లిచేసుకుందామనుందని తన మనసులోని ఉద్దేశ్యాన్ని చెప్పాడు మధు. 


ఒక రోజున ఆమెని ఇంటికి తీసుకొచ్చి అక్కకు పరిచయం చేశాడు. జ్యోతిని చూసిన వరమ్మ సంతోషించింది. ఆమె ద్వారా వాళ్ల విషయాలను తెలుసుకుని వాళ్ల తల్లితండ్రులని సంప్రదించింది వరమ్మ. అంతకుముందే జ్యోతి ప్రేమ విషయం తెలిసిన జ్యోతి తల్లి తండ్రులు తమ ఏకైక కూతురు తమతోనే ఉండాలని, మధు ఇల్లరికం రావాలని కోరారు. 

ఒక్కసారిగా నిశ్చష్టురాలై తమ్ముడి వంక చూసి అతడిని విడిగా పిలిచి అతని అభిప్రాయం అడిగింది వరమ్మ. 


 “అక్కా! జ్యోతిని పెళ్లిచేసుకుని వాళ్లింటికి ఇల్లరికం వెళతాను. ఆమెని వదిలి ఉండలేను. ” అన్నాడు మధు. ఈ ఇల్లు, పొలం అమ్మి బాంకులో డబ్బుని వేద్దాం. నీవు హాయిగా అక్కల వద్దకు వెళ్లి ఉండచ్చు. ఈ పల్లెటూరిలో పొలం పనులు, ఈ కష్టాలు ఉండవు” అని ఉచిత సలహా ఇచ్చాడు అక్కకి. 


“చూడు మధూ! నాన్న ఇచ్చిన పొలం, ఇల్లు నా కడదాకా ఉంటుందని భ్రమపడ్డాను. నీవు ఇష్టపడిన జ్యోతితో నీ పెళ్లి జరిపిస్తాను. ఇంటిలో, పొలంలో నీ వాటాలను అమ్మి ఆపైకాన్ని తీసుకొని వాళ్లింటికి ఇల్లరికం వెళ్లు. ఇంక మిగిలింది రమ, ఉమలకి. సరేనా!” అంది వరమ్మ. అందుకు సంతోషంగా అంగీకరించాడు మధు. 


జ్యోతితో, ఆమె తల్లితండ్రులతో, రమ, ఉమలతో జరిగిన విషయమంతా చెప్పి త్వరలోనే మధు, జ్యోతిల పెళ్లి జరిపించింది వరమ్మ. ఊరిపెద్దల సాయంతో మధు వాటా పొలాన్ని, ఇంట్లో భాగాన్ని అమ్మి ఆ పైకాన్ని అతనికిచ్చింది.

 

మధు చేసిన స్వార్ధ పూరిత పనికి రమ, ఉమలకి పీకలదాకా కోపం వచ్చినా అక్క బాధపడుతుందని అతడిని ఏమనకుండా మిన్నకున్నారు. మధు తన భార్యతో అత్తమామలింటికి ఇల్లరికం వెళ్లాడు. ఇంక క్రమేపీ వాళ్ల రాకపోకలు లేవు. అతను తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉండాలని కోరుకుంది వరమ్మ. 


 ఇప్పటికైనా అక్కని తమతో ఉండమని కోరిన చెల్లెళ్ల మాటలను సున్నితంగా తోసిబుచ్చి లోగడ తను చెప్పిన నిర్ణయాన్ని మరలా గుర్తుచేసింది. చేసేదిలేక రమ, ఉమలు వాళ్లిళ్లకు వెళ్లారు. 

కొన్నాళ్ల తర్వాత వరమ్మకి గుండెపోటు వస్తే సమయానికి పొరుగువాళ్లు ఆమెని హాస్పిటల్ లో చేర్చి వైద్యం చేయించారు. వెంటనే రమ, ఉమలకు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయం విన్న వాళ్లు గాభరాగా పరుగున వచ్చి హాస్పిటల్ లో అక్కని చూశారు. రెండు రోజుల తర్వాత ఆమెని డిశ్చార్జి చేయగానే ఇంటికి తీసుకొచ్చి కంటికిరెప్పలా చూసుకున్నారు. 


అక్కని ఆ స్ధితిలో చూస్తున్న వాళ్లకు దుఃఖం ఆగట్లేదు. దాన్ని మనసులోనే అదుముకుంటూ అక్కకి ధైర్యం చెబుతున్నారు. 


“చూడండమ్మా! మీరందరూ సంతోషంగా ఉంటున్నారు. నాకు ఈ తృప్తి చాలు. ఇంక ఈ రోగంతో ఏ బాధలు పడకుండా పోతే చాలమ్మా. మీకు వీలుంటే మధుని పిలవండి. అతన్ని కూడా చూసి సంతోషంగా పోతాను” అంది వరమ్మ. 


మధు వివరాలేమీ తెలీని వాళ్లకు లోగడ జ్యోతి వాళ్ల తల్లి తండ్రులు ఇచ్చిన అడ్రస్ కు ఒక మనిషి చేత మధుని రమ్మని కబురు పంపించారు. విషయం విన్న మధు మనసు కాస్త కరిగి అక్కని చూడడానికి సన్నధ్ధం కాగా జ్యోతి, ఆమె తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. అయినా వాళ్లని ఎలాగో ఒప్పించి అక్క వద్దకు వచ్చి ఆమెని చూసి కన్నీటిపర్యంతమైనాడు. మధుని చూసిన వరమ్మ కళ్లు సంతోషంతో మెరిశాయి. 


 “నన్ను క్షమించక్కా! ప్రేమతో పెంచిన నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి నిన్ను వదిలి స్వార్థంతో వెళ్లాను. నన్ను క్షమించక్కా! ” అని కన్నీళ్లతో అక్క పాదాలకు నమస్కరించాడు. 


“మనలో మనకి క్షమాపణ లేంటి? బాధపడకు మధూ. ” అని ఓదార్చింది. ఆ రాత్రి నిద్రలోనే కన్నుమూసింది వరమ్మ. జరిగినదారుణానికి రమ, ఉమ, మధులు రోదిస్తూ జరుగవలసిన తంతుని పూర్తి చేశారు. ఆ ఊరివాళ్లంతా ధీరురాలైన వరమ్మ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ శోకహృదయులై అంజలిఘటించారు. 


అక్కడే పదిరోజలుండి ఆ ఇంటిని, పొలాన్ని అక్క పేరున అనాధ శరణాలయానికిచ్చారు రమ, ఉమ, మధులు. 


“జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని తమకోసం తన జీవితాన్ని క్రొవ్వొత్తిలా 

కరిగించి వెలుగునిచ్చిన ధీరవనిత తమ అక్క” అనుకుంటూ బాధాతప్త హృదయంతో ముగ్గురూ తమ ఇళ్లకు వెళ్లారు. వాళ్లు చేసిన మంచి పనికి దివికేగిన వరమ్మ ఆత్మ సంతోషించింది. 


.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link









 
 
 

Comments


bottom of page