top of page
Writer's pictureLalitha Sripathi

డిజిటల్ అరెస్ట్

#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #DigitalArrest, #డిజిటల్అరెస్ట్


Digital Arrest - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 13/11/2024 

డిజిటల్ అరెస్ట్ - తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఒసేయి మొద్దూ! ఏం చేస్తున్నావు? టిఫిన్ పెట్టేది ఉందా లేదా?” పూర్ణచంద్రరావు భార్య భారతిని అరిచినట్టు పిలిచాడు. 


“వస్తున్నానండి!” టిఫిన్ పళ్లెం పట్టుకుని భయపడుతూ వచ్చి ప్లేట్ అందించింది భారతి. 


'పూర్ణ' అని అందరూ పిలుచుకునే పూర్ణచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక మంచి స్థాయి లో రిటైర్ అయ్యాడు. 

అతను ఇంజనీరింగ్ చేసి వెంటనే ఉద్యోగంలో చేరాడు. ఆ రోజుల్లో ఇంజినీరింగ్ తక్కువ మంది చదివేవారు. ఇన్ని కాలేజీలు లేవు అప్పట్లో. 


చదువు అవుతూనే ఉద్యోగం వచ్చింది. పూర్ణ మేనమామ ఇంత మంచి అల్లుడిని ఎక్కడ వేరే వాళ్లు ఎగరేసుకుపోతారో అని, అప్పుడే ఇంటర్ లో చేరిన కూతురు భారతిని ఇచ్చి పెళ్ళిచేశాడు. 


భారతి అప్పుడే పెళ్లి వద్దు, చదువుకుంటాను మొర్రో అంటే చదువు అయ్యాకయినాపెళ్లేకదా, అదేదో ముందే చేసుకో అని పెళ్లి చేశారు. 


ఒకటి మేనత్త కొడుకు, చిన్నప్పటినుంచి తెలిసినవాడు, రెండు మంచి ఉద్యోగస్తుడు అని పెళ్ళికి ఒప్పుకుంది భారతి. నిజానికి భారతికి చదువులో తెలివితో పాటు లోక జ్ఞానం ఎక్కువ. 


మొగుడు 'మొద్దు' అన్నా 'పిచ్చి' అన్నా పెద్ద లెక్క చెయ్యదు, 

"అదో తుత్తి ఈ బావగాడికి" అని మనసులో అనుకుని పైకి మాత్రం వినయంగా "ఏంటండీ?" అనేది. 


నిజమైన మొద్దు మొహం పూర్ణ, ఆ యాక్షన్ అంతా నిజమనుకుని రొమ్ము విరుచుకుని తిరిగేవాడు. 

అలానే ఇద్దరి పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కట్టడం, రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి, వస్తున్న పెన్షన్ తో ఇల్లు జాగ్రత్తగా నడుపుతోంది భారతి, అయినా పూర్ణ ఒప్పుకోడు భారతి తనకంటే తెలివికలదని. 


రిటైరయ్యాక రోజూ టిఫిన్ తిని కాసేపు బయటికి వెళ్లి లంచ్ టైం కి వస్తాడు పూర్ణ. పూర్ణది అంతా పుస్తక జ్ఞానమే, లోక జ్ఞానం తక్కువ. 


ఇంటర్నేషనల్ రాజకీయాలు, రాకెట్ సైన్స్, ఇరాన్ యుద్ధం ఇవన్నీ మాట్లాడతాడు కానీ కూరలు ఎలాంటివి తేవాలి, పప్పు చెయ్యడానికి ఏ పప్పు వాడాలి, ఇడ్లీకి ఏ పప్పు వాడాలి, సెల్ తో క్యాబ్ బుక్ చెయ్యడం ఎలా ? గూగుల్ పే స్కాన్ ఎలా? లాంటివి బొత్తిగా తెలీదు కానీ స్మార్ట్ ఫోన్ పట్టుకు తిరుగుతాడు. 


“ఈ తేలికవి అన్నీ నువ్వు నేర్చుకో! నా పెళ్లాంకి ఇంత కూడా తెలీదంటే నాకు అవమానం” అంటాడు. 


“పోనిద్దూ! 'వాడి' సారీ 'వారి' సంతోషం ఎందుకు కాదనాలి” అనుకుని అన్నీ చకచకా నేర్చుకుంది భారతి. 


వంట అయ్యి టీవీలో న్యూస్ చూస్తోంది భారతీ. భారతికి రోజూ పేపర్ చదవడం, న్యూస్ వినడం అలవాటు, కాని అది పూర్ణ ఇంట్లో లేనప్పుడే చేస్తుంది. 


ఎందుకంటే పూర్ణ ఆ న్యూస్ వింటూ చేసే కామెంట్స్ కి చిర్రెత్తుకొస్తుంది. 


ప్రధానమంత్రి ఎక్కడ ఎలా మాట్లాడాలో, హోమ్ మంత్రి పాకిస్థాన్ మీద ఏ డెసిషన్ తీసుకోవాలో, ఫైనాన్స్ మంత్రి బడ్జెట్లో ఎన్ని తప్పులు చేసారో ఇలా చెప్తూనే ఉంటాడు. 


“నేనయితేనా!" అని మొదలు పెట్టగానే “నువ్వు కాదు కదా ఆ మంత్రి! వాళ్లకి ఆ పనులన్నా మిగుల్చు. అది కూడా నువ్వే చేస్తే ఎలా” అనేది భారతి. 


పూర్ణ రిటైర్ అయ్యాక ఈ గోల ఎక్కువ అయింది. 

అందుకే రోజూ కాసేపు బయటికి వెళ్లి రమ్మంటుంది, పక్కనే ఉన్న లైబ్రరీలో కాసేపు, పార్క్ లో కాసేపు కూర్చుని వస్తాడు. 


న్యూస్ చూస్తుంటే లోపలికి వచ్చాడు పూర్ణ కాళ్ళీడ్చుకుంటూ. 


“బట్టలు మార్చుకుని వస్తావా అన్నం తిందాం” అన్న భారతితో "నాకు ఆకలి లేదు నువ్వు తినేయి” అంటూనే రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. 


"ఇదేమిటి ఇలా ఉన్నాడు ఎప్పుడూ ఆకలి లేదు అనడు" అనుకుని రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి తోస్తే లోపల గడియ పెట్టి ఉంది కానీ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. 


ఆశ్చర్యపోయింది భారతి. అంత ఫోన్ లో ఎక్కువ మాట్లాడే స్నేహితులు కూడా లేరు. 


పిలిచినా పలకలేదు పూర్ణ. కాసేపు చూసి తను తిని, అన్నీ బల్ల మీద పెట్టి హాల్ లోనే దివాన్ మీద పడుకుంది. నిద్ర లేచాక చూస్తే బల్ల మీద పెట్టినవి అలానే ఉన్నాయి, 

ఖంగారు వేసింది భారతికి. 


“ఏమండీ! ఏంటి అన్నం తినలేదు” తలుపు కొడుతూ అడిగింది. 


లోపలనుంచి సమాధానం లేదు. 


“బావా తలుపు తియ్యి” అన్నా పలకలేదు, 


“పూర్ణా! తలుపు తీస్తావా పగలగొట్టనా! రోకలిబండతో పగలగొడతాను” 


అంత పనీ చేస్తుందేమోనని భయపడి తలుపు తీశాడు కానీ నోటి మీద చెయ్యి పెట్టి మాటాడద్దని సౌంజ్ఞ చేశాడు. 


మఖం అంతా చెమటలు పట్టి పది లంఖణాలు చేసినట్టు ఉన్న పూర్ణని చూసి భారతి గుండె కరిగి పోయింది. 

అన్నం తినమని సౌంజ్ఞ చేస్తే "వద్దు" అన్నట్టు తలవూపాడు. 


నెమ్మదిగా భారతిని పక్కకి జరగమని ఫోన్ చేత్తో పట్టుకుని భారతి ఫోన్లో కనపడకుండా దగ్గరికి వచ్చాడు. ఒక వీడియో కాల్ ఉన్నట్టు చూసి "ఎవరూ?" అని చెయ్యి చూపించింది. 


ఆ ఫోన్తో బాత్రూమ్ లోకి వెళ్లి పంపు తిప్పి నీళ్ల శబ్దం వినపడేటట్టు ఫోన్ పెట్టి బయటికి వచ్చాడు. 


“ఏమవుతోంది బావా! నాకు అర్థం అవడంలా“ 

అయోమయంగా అన్న భారతిని పట్టుకుని బావురుమన్నాడు పూర్ణ. 


ఖంగారు పడి నెమ్మదిగా అతన్ని కుర్చీలో కూర్చోపెట్టి ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇచ్చి “ఇప్పుడు చెప్పు“ అంది. 


“నేను బయటికి వెళ్తుంటే ఏదో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ‘మీరు పూర్ణచంద్రరావు గారేనా’ అన్నారు, ‘అవును’ అన్నాను. ‘మేము ముంబై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ వాట్సాప్ లో అరెస్ట్ వారెంట్ పెట్టాం. మీరు ఎక్కడికి వెళ్లకూడదు ఇంట్లోనే ఉండాలి, మేము చెప్పినట్టు చెయ్యాలి, మా పోలీసులు వచ్చి మిమ్మల్ని జైల్ లో పెట్టేదాకా ఇల్లు కదలకూడదు’ అన్నారు. 


‘నేను డ్రగ్స్ సప్లై చెయ్యలేదు అని అంటే మీ పేరు, మీ అడ్రస్ అన్నీ కలిసాయి,ఈ కేసు నుంచి బయటపడాలి అంటే మీరు ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాలి. మేము పంపే బ్యాంకు అకౌంట్ కి మీ అకౌంట్ నుంచి ముందు అయిదు లక్షలు పంపండి’ అన్నారు. 


నేనేమో ‘ఈ గూగుల్ పే నాకు రాదు, మా ఆవిడ చదువుకోలేదు. ఆవిడకి కూడా ఏమీ తెలీదు’ అంటే, ‘బ్యాంకు కి వెళ్లి కట్టండి, ఎవరికీ చెప్పవద్దు.. చెప్తే మీ ప్రాణానికే ప్రమాదం’ అన్నారు. నాకు ఏమీ అర్థమవడం లేదు, నా పేరుమీద డ్రగ్స్ సప్లై ఏమిటీ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు” మళ్లీ ఏడుపు మొదలెట్టాడు. 


“ముందు ఆ ఏడుపు ఆపు, అందుకే న్యూస్ వినమనేది” కసురుకుంది భారతి. 


"ఇలాంటి మోసాల గురించి టీవీలోనూ పేపర్లోను చెప్తునే ఉన్నారు, సరే ఇప్పుడు ఏం చెయ్యాలి?”


అన్న భారతితో “వాళ్లకి డబ్బులు పంపాలి” పూడుకుపోతున్న గొంతుతో అన్నాడు పూర్ణ. 


“నువ్వు నోర్ముసుకో!” అంటూ తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసింది. 


“ఎస్ సర్! ఓకే సర్!” అంటూ తన ఫోన్ పక్కనపెట్టి “నువ్వు వాళ్ళతో మాట్లాడి నాకివ్వు ఫోన్” అంది. 



“వాళ్లు నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారే! నువ్వేమిటి వాళ్లతో మాట్లాడేది” పీలగొంతుతో అన్నాడు పూర్ణ. 


మొగుడి తెలివితక్కువతనానికి పిచ్చ కోపం వచ్చింది భారతికి. నాలుగు పీకుదామని మళ్లీ మొగుడని గుర్తొచ్చి ఆగింది. 


“నీ బొంద అరెస్ట్ ఏమిటి? వారెంట్ నీకు పర్సనల్ గా ఇవ్వాలి, ఇంత చదివావు ఆమాత్రం తెలీదా! వాడు నిన్ను ఫూల్ ని చేసి నీ డబ్బులు కాజేద్దామని చూస్తున్నాడు. ఇంకా నయం నీకు గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాస్ఫర్లు రాకపోవడం మంచిదయింది” అంటూ పూర్ణ ఫోన్ లాక్కుంది. 


అవతల వాడు వీడియో కాల్ లో ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మెడలో ఐడి కార్డ్ పెట్టుకుని ఉన్నాడు. 


“హలో! పూర్ణచంద్ర కహా గయా?”అన్నాడు అధికార స్వరంతో. 

పూర్ణ కి హిందీ బాగా రాదు, 


అదే భారతి హిందీ సీరియల్స్, సినిమాలు చూసి బాగా నేర్చుకుంది. 


“బోలియే క్యా కామ్ హై" అంటూ హిందీలో మొదలుపెట్టేసరికి ఖంగు తిన్నాడు, కానీ బాగా ముదురు కదా, పూర్ణ మా ఆవిడ చదువుకోలేదని చెప్పిన విషయం గుర్తుకొచ్చి

“సీ మేడమ్ పూర్ణచంద్ర ఈజ్ అండర్ అరెస్ట్!” అన్నాడు. 


“అండర్ విచ్ సెక్షన్ ? వేర్ ఈజ్ ది అరెస్ట్ వారెంట్. యు హావ్ టు సర్వ్ పర్సనల్లీ, మీరు ముందు ఇక్కడి పోలీసులకి చెప్పి వాళ్లతో కలిసి రండి, డ్రగ్స్ అంటున్నారు కదా అది ఏ డ్రగ్ గంజాయి, హషిష్ ఏది?” ఇంగ్లీష్ లో గుక్క తిప్పకుండా వాయిస్తుంటే ఇటు పూర్ణ అటు కేడీ ఇద్దరూ షాక్ నోరు తెరిచారు. 


“నేను 1930, సైబర్క్రైమ్ వాళ్లకి రిపోర్ట్ చేసాను, వాళ్ళు నిన్ను ట్రేస్ చేశారు, అదిగో నీడోర్ శబ్దం వినిపిస్తోంది, ముందు నువ్వు అరెస్ట్ తప్పించుకోరా పిచ్చి వెధవా! నా మొగుడిని బెదిరిస్తావా! అయిపోయిందిరా నీపని ఏమనుకున్నావో!” భారతి నోటినుంచి హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్ లో వస్తున్న వాక్ బాణాలు తప్పించుకోలేక వాడు ఫోన్ పెట్టేసాడు. 


తనవంకే నోరు తెరుచుకుని కళ్ళార్పకుండా భయంగా చూస్తున్న మొగుడిని

“ఏంటలా కప్పలా నోరు తెరుచుకుని చూస్తావు, చదవగానే సరిపోదు లోకజ్ఞానం ఉండాలి, నువ్వేదో పోటుగాడినని అందరినీ విమర్శిస్తావు, ఏడ్చిపోతావని నేను ఇన్ని రోజులూమాట్లాడలేదు. ఇంకోసారి మొద్దు అన్నావో మూతిపళ్ళు రాల్తాయి. ఇప్పుడు అర్థమైందా ఎవరుమొద్దో!”

 భారతి కోపంగా అంటుంటే కాళికాదేవిని చూసినట్టు భయపడుతూ నోటమాట రాక ”సరే” అన్నట్టు తల ఊపాడు పూర్ణ. 


***

శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.




103 views1 comment

1 comentario


mk kumar
mk kumar
13 nov

Purna telivitetalu baguunyyu. Intine kadu prapanchaanni jayunche tatvam amedi. Bagundi

Me gusta
bottom of page