top of page

దీని మర్మమేమి తిరుమలేశా?



'Dini Marmamemi Tirumalesa' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 10/09/2024

'దీని మర్మమేమి తిరుమలేశా?' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: పద్మావతి కొమరగిరి





వందాడి అనే గ్రామంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే ధర్మం మూర్తీభవించిన వ్యక్తి. ఆయన ఆ ఊరికి పెద్దమనిషి, సర్పంచ్ కూడా. గ్రామములో ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, వివాదాలు తగాదాలు జరిగినప్పుడు, పోట్లాటలు కొట్లాటలు సంభవించినప్పుడు పరిష్కారానికి ధర్మయ్య దగ్గరకు వచ్చేవారు. ధర్మయ్య నిష్పక్షపాతంగా సమతూకంగా విజ్ఞతతో తీర్పు చెప్పి ఇరు వర్గాలవారిని మెప్పించేవాడు.


ఒక రోజు ధర్మయ్య గ్రామ చావిడి వద్ద రచ్చబండ మీద గ్రామ సభ్యులతో కలిసి కుర్చొని ఉండగా ఒక విచిత్రమైన వివాదం తీర్పు కోసం వచ్చింది. తిరుగుడమ్మ అనే ఒక యువతి "తనను బృహన్న అనే వ్యక్తి బలవంతం చేసి చేరిచాడని, కాబట్టి తనను అతనికిచ్చి పెళ్లి చేయించండ"ని పిర్యాదు చేసింది. 


తక్షణం బృహన్న ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి మా సముక్షమున నింపండి అని గ్రామ బంటులను ఆదేశించాడు ధర్మయ్య. బంటులు సత్వరమే కదిలి ఇరువై నిమిషాల్లో బృహన్నను రచ్చబండ సముఖమున నిలబెట్టారు. 


"బృహన్నా! నీపై మానభంగం అభియోగం వచ్చినది. నీవు ఈ తిరుగుడమ్మను బలవంతంగా అనుభవించావని ఆరోపిస్తూ తనే పిర్యాదు చేసింది. నీవు ఈమెను చెరిచావా! నిజం చెప్పు! అబద్ధం చెప్పావంటే శిక్ష భయానకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేప్పు!" అని ధర్మయ్య గట్టిగా హెచ్చరించాడు. 


కుయ్యో! మోర్రో! అని మొత్తుకుంటూ "నేను చెయ్యలేదు, చెయ్యలేను కూడా దేవరా!" అని మోరపెట్టుకున్నాడు బృహన్న. 


“ఒక స్త్రీ పదిమందిలో సిగ్గు విడిచి నన్ను చెరిచాడని చెప్పుకుంటుందా! నీవు అబద్ధం చెపుతున్నావు. నిజం చెప్పితే నీకే మంచిది” గద్దించాడు ధర్మయ్య. 


"అయితే నేను ఒక చిన్న కథ చెపుతాను. విని నిజం గ్రహించండి దేవరా!" చెప్పుకున్నాడు బృహన్న. 


"సరే చెప్పు!" అనగానే బృహన్న చెప్పడం మొదలు పెట్టాడు. 


"నడుము లేని చిన్నది, కంఠంలేని కడవను తీసుకుని, కట్టలేని చెరువుకు నీళ్ళకు పోతే, అక్కడ నోరులేని జింక వేరు లేని గడ్డిని మేస్తుంటే, చేతులు లేనివాడు, లాళంలేని తుపాకీ తీసుకుని ప్రేల్చాడు. అది జింకకు తగలకుండా దాని కడుపులోని పిండానికి తగిలి దుస్సీ నేల మీద పడింది. ఇది కథ. ఇది నిజమైతే ఆమె చెప్పింది కూడా నిజమే. " పెద్దల సదురుకు విన్నవించాడు బృహన్న. 


కథ విన్న ధర్మయ్య కొద్దిసేపు యోచించి "బృహన్నా! నీవు వెళ్ళిపోవచ్చు!" అన్నాడు. అలా అనగానే బృహన్న వెళ్ళిపోయాడు. ధర్మయ్య చర్యకు గ్రామ సభ్యులందరూ అవాక్కయ్యారు. "విచారించనిదే బృహన్నను పంపేశాడే" ఆశ్చర్యంగా అనుకున్నారు.


"చూడు తిరుగుడమ్మా! బృహన్న నిర్దోషని మేము నమ్ముతున్నాం. నీవు అతనిపై అబద్ధపు ఆరోపన చేశావు. ఎందుకు చేశావు. నిజం చెప్పు! చెప్పకపోతే రక్షకభటులను పిల్లంపి వారికి నిన్ను అప్పగిస్తాను. వాళ్ళు తమ శైలిలో నిజం చెప్పిస్తారు. ఆతరువాత నిన్ను చెరసాలలో వేస్తారు. నువు చెరసాలలో మగ్గి పోతావు. కాబట్టి నిజం చెప్పు! క్షమించి వదిలేస్తాను" గాంభీర్యంగా అడిగాడు ధర్మయ్య. .


రక్షకభటులు అనగానే తిరుగుడమ్మకు వెన్నులో వణుకు పుట్టింది. " క్షమించండి ధర్మయ్య గారు!. బృహన్న నన్ను ఏమి చేయలేదు. నేనే ఆయన ఆస్తికి ఆశ పడి ఇలా చెప్పాను. అలా చెప్పితే అతనికి నాకు పెళ్లి చేస్తారని, జీవితాంతం సుఖంగా అతని ఆస్తిని అనుభవించవచ్చుని అబద్ధపు ఆరోపణ చేసాను. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. క్షమించి వదిలెయ్యండి " అని వేడుకుంది తిరుగుడమ్మ. 


"వెళ్ళిపో! ఇంకెప్పుడూ ఇలా దురాశపడి అమాయకులపై అబద్ధపు ఆరోపణలు చేయకు. బుద్ధి కలిగి బ్రతుకు" చీవాట్లు పెట్టాడు ధర్మయ్య. 


తక్షణం తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది తిరుగుడమ్మ. 


"ధర్మయ్యా! బృహన్న నిర్దోషని ఎలా నమ్మావు?" గ్రామ సభ్యులు కుతూహలంగా అడిగారు. 


"నడుము లేని ఆడది కంఠంలేని కడవతో నీళ్ళు ఎలా తెస్తుంది?

కట్టలేకుండా నీళ్ళు నిలుస్తాయా?

చేతులు లేనివాడు లాళంలేని తుపాకీతో ప్రేలుస్తాడా?

వేరు లేకుండా గడ్డి మొలుస్తుందా?

నోరులేని జింకా గడ్డిని తింటుందా?

తుపాకీ ప్రేలుస్తే జింకకు తగలకుండా గర్భంలోని పిండానికి తగులుతుందా?


ఇవన్నీ నిజం కాదు కాబట్టి ఆమె చెప్పేది నిజం కాదని చెపుతున్నాడు. అంతే కాదు, తాను ఎలాంటి వాడో ప్రత్యేకంగా చెప్పలేకా పరోక్షంగా చెపుతున్నాడు.


లాళం లేకుండా తుపాకీ ఎట్లా ప్రేల్చలేడో! అట్లానే మొగతనం లేకుండా స్త్రీని అనుభవించలేడని, తాను నపుంసకుడనని మర్మగర్భంగా చెపుతున్నాడు బృహన్న”. చెప్పాడు ధర్మయ్య. 


ధర్మయ్య కుశాగ్రబుద్ధికి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. 

 --------


 ---------- 

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.---------

65 views0 comments

Kommentare


bottom of page