#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #DoctorNaPranamMeeChethulloUndi, #డాక్టర్నాప్రాణంమీచేతుల్లోఉంది, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Doctor Na Pranam Mee Chethullo Undi - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 21/02/2025
డాక్టర్..! నా ప్రాణం మీ చేతుల్లో ఉంది - తెలుగు కథ
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
నా పేరు డాక్టర్ విశ్వాస్.
హెపటాలజీ లో ఎండీ పూర్తి చేసుకున్న నా ముందు పెద్ద సమస్య వచ్చి పడింది. స్వంతంగా క్లినిక్ ప్రారంభించడమా.. లేక ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ లో పని చేయడమా.. అనేదే ఆ సమస్య.
ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకోవడం కంటే ఎవరినైనా సలహా అడగటం ఉత్తమమని అనుకున్నాను.
మెడిసన్ చదివేటప్పుడు నా సీనియర్ దివ్య గుర్తుకు వచ్చింది. తను చాలా ఇంటెలిజెంట్. ఆమెతో ఎన్నో విషయాలపై ఆసక్తికరమైన చర్చలు జరిగేవి. నలుగురిలో ఉన్నప్పుడు మేమిద్దరం ఓ గంట పక్కకు వెళ్లి వచ్చినా ఎవరూ కామెంట్ చేసేవారు కాదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకున్నట్లు కాక, ఇద్దరు మేధావుల మధ్య చర్చలా ఉండేది మా సంభాషణ. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేస్తోంది.
ఆలోచన వచ్చిందే తడవుగా ఆమెకు కాల్ చేసాను.
"హాయ్ విశ్వాస్! ఎలా ఉన్నావ్? చాలా కాలానికి కాల్ చేస్తున్నావ్. సంవత్సరం క్రితం ఒక మ్యారేజ్ లో కలిసాము. అంతే" అంది దివ్య.
"అవును దివ్యా. అప్పుడే నీ ఫోన్ నంబర్ ఇచ్చావు. జనరల్ మెడిసిన్ లో పీజీ చేసి హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చేరినట్లు చెప్పావు. ఒక సలహా కోసం నీకు కాల్ చేసాను.." చెప్పాను.
"విషయం చెప్పు. నాకు తోచిన సలహా ఇస్తాను. అన్నట్లు నీ పీజీ పూర్తయిందా" అడిగింది దివ్య.
"పూర్తయింది. ఆ విషయం లోనే నీ సలహా కోసం కాల్ చేసాను. "
"ఇప్పుడు అందరికీ వచ్చే సమస్య ఒకటే. వెంటనే పెళ్లి చేసుకోవాలా కాస్త ఆగాలా అని డైలమా" అంటూ నవ్వింది దివ్య. తరువాత తనే, "జస్ట్ జోక్ చేసాను. అంతే! కెరీర్ గురించేగా నువ్వు కాల్ చేసింది?" అంది.
"అవును దివ్యా. ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ లో చేరాలా లేక స్వంత ప్రాక్టీస్ పెట్టుకోవాలా తేల్చుకోలేకుండా ఉన్నాను. మా ఊర్లో.. అంటే వరంగల్ లో హాస్పిటల్స్ ఉండే లొకాలిటీలో మాకు కాస్త స్థలం ఉంది. అక్కడ ఒక చిన్న హాస్పిటల్ కట్టుకుని ప్రాక్టీస్ చెయ్యమని అమ్మానాన్నల సలహా. అక్కడ ఇప్పుడన్నీ నాలుగైదు అంతస్థుల హాస్పిటల్స్. ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటి మధ్య నేను చిన్న హాస్పిటల్ పెట్టి పికప్ కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకని ఎక్కడైనా చేరి అనుభవం, పేరు తెచ్చుకున్నాక స్వంత ప్రాక్టీస్ పెట్టొచ్చని అనుకుంటున్నాను”.
"విశ్వాస్! నీ ఆలోచన కరెక్ట్. నిబద్ధత, నిజాయితీ ఉండే డాక్టర్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ పెంచుకుంటారు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎక్సపీరియెన్స్ కోసం ఎక్కడైనా చేరడం మంచిదే. కానీ ఇక్కడ మంత్లీ టార్గెట్స్, క్వార్టర్లీ టార్గెట్స్.. ఇలా ఉంటాయి. " చెప్పింది దివ్య.
"ఈ టార్గెట్స్ అనే మాట నా చిన్నప్పుడు విన్నాను. బ్యాంకు లో పని చేస్తున్న మా నాన్నగారు, ఎల్ ఐ సి లో పనిచేస్తున్న మా అమ్మగారు టార్గెట్స్ రీచ్ కావడం కోసం నానా హైరానా పడేవారు. మళ్ళీ ఇప్పుడు వింటున్నాను ఆ మాట. ఇంతకీ ఏమిటా టార్గెట్స్?" అడిగాను నేను.
"దాని గురించి చెప్పి నిన్ను ముందే భయపెట్టడం ఎందుకులే. అన్నట్లు మా గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ వాళ్ళు మరో ఆరు నెలల్లో కొత్తగా కొన్ని బ్రాంచీలు ఓపెన్ చెయ్యబోతున్నారు. వరంగల్ లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలని అనుకుంటున్నారు. వివరాలు కనుక్కుంటాను. కొత్త బ్రాంచ్ కాబట్టి, లోకల్ వ్యక్తిగా నీకు అవకాశం ఉంటుంది. రెండు రోజుల్లో కాల్ చేస్తాను" చెప్పి ఫోన్ పెట్టేసింది దివ్య.
***
అన్నట్లుగానే రెండు రోజుల తరువాత కాల్ చేసింది దివ్య.
"వరంగల్ లో మా బ్రాంచ్ ప్రారంభించడం ఖాయమేనట. ప్రస్తుతానికి వేరే హాస్పిటల్ బిల్డింగ్ ని ఓన్ చేసుకుంటున్నారట. నిదానంగా మరో పెద్ద బిల్డింగ్ కడతారు.
డాక్టర్స్ రిక్రూట్ మెంట్ కోసం త్వరలో నోటిఫికేషన్ ఉంటుంది. వివరాలు చెబుతాను. అప్లై చెయ్యి. ఇంటర్వ్యూ ఇక్కడే ఉంటుంది. విష్ యు ప్రామిసింగ్ కెరీర్" చెప్పింది దివ్య.
మరో వారానికి నాకు వివరాలు చెప్పి నా చేత జాబ్ కు అప్లై చేయించింది.
***
హైదరాబాద్ లో ఒక స్టార్ హోటల్ లో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాను.
ఆ హాస్పిటల్ ఎండీ, హెచ్చార్ మేనేజర్, ఇంకా ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేశారు. నాకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పట్ల అవగాహనా ఉంది. అవసరమైన మేరకు రాజకీయ అవగాహన కూడా ఉంది. దాంతో వాళ్ళు నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. జీతం ఫ్లెక్సిబుల్ అనీ, పెర్ఫార్మెన్స్ ని బట్టి ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్పారు.
"మీ గురించి డాక్టర్ దివ్య చెప్పారు. టాలెంట్ తో పాటు మంచి ఆదర్శాలు ఉన్న వ్యక్తి అని చెప్పారు. చాలా సంతోషం. మీలాంటి యువకుల టాలెంట్ తో మా హాస్పిటల్ ఖచ్చితంగా నెంబర్ 1 అవుతుంది. కాస్త కార్పొరేట్ థింకింగ్ అర్థం చేసుకుంటే చాలు. పూర్తి వివరాలు రేపు వీళ్లిద్దరూ చెబుతారు” అంటూ మిగతా ఇద్దర్నీ పరిచయం చేసాడు ఎండీ.
"హీ ఈజ్ మిస్టర్ రాజన్, వరంగల్ లో పెట్టబోయే హాస్పిటల్ కి ఇంచార్జి.. అండ్ హీ ఈజ్ మిస్టర్ దివాకర్ - వరంగల్ బ్రాంచ్ కి కాబోయే ఫైనాన్స్ మేనేజర్. ఇద్దరూ మా సంస్థలో సీనియర్స్. రేపు ఇదే హోటల్ లో వీళ్లను కలవండి. మళ్ళీ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. జస్ట్ ఒక గెట్ టుగెదర్ లాగా అన్నమాట. డాక్టర్ దివ్య గారిని కూడా రేపు రమ్మంటాము. కాస్త ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు" అని చెప్పి ఇంటర్వ్యూ ముగించారు.
ఆ సాయంత్రం దివ్యను కలిసాను.
"ఇప్పుడే నాకు కాల్ చేశారు. రేపు నీతో పాటు రమ్మని, ఈలోగా కాస్త అవగాహన కల్పించమని.. " అంది దివ్య నవ్వుతూ.
"టార్గెట్స్ గురించేనా?” నేనూ నవ్వుతూ అడిగాను.
"తెలుసన్న మాట.. " అంది దివ్య.
"కాస్తో కూస్తో జనరల్ నాలెడ్జీ ఉన్నవాడిని దివ్యా.. ఏదో అమ్మాయిల విషయంలో కాస్త అమాయకుడిలా ఉంటానుగానీ.. "
"అది అమాయకత్వం కాదు. కెరీర్ పైన దృష్టి. ఒక రకంగా నీదీ కార్పొరేట్ తింకింగే. వీళ్లకు బాగానే సరిపోతారు" అంది దివ్య.
"కాదు దివ్యా. నాది డాక్టర్ అయి, ప్రజలకు సేవ చెయ్యాలనే తపన" చెప్పాను నేను.
"జస్ట్ జోక్ చేశాను, అంతే! నీ గురించి నాకు తెలియదా.. అప్పట్లో నిన్ను మరో 'భారతీయుడు' అనేవారు. నాకు ఇంకా గుర్తే” అంది దివ్య నవ్వుతూ.
"సరేగాని ఇంతకీ వాళ్లు నాకు కన్వే చేయమన్న మెసేజ్ ఏమిటి?" అడిగాను.
"ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టడానికి, మెయింటెయిన్ చేయడానికి ఖర్చు చాలానే ఉంటుంది. ఈ కార్పొరేట్ రంగంలో పోటీని తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఎక్విప్మెంట్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి భారీగా అప్పులు చేయాల్సి ఉంటుంది. ఆ అప్పులు, వాటి మీద వడ్డీ తీరాలంటే ఆదాయం ఎక్కువగానే ఉండాలి. పాతిక లక్షలు పెట్టి ఒక పరికరం కొన్నారంటే దాన్ని అవసరం ఉన్నా లేకపోయినా వాడాల్సి ఉంటుంది" చెప్పింది దివ్య.
"అంటే రేపు ఇవన్నీ నాకు చెప్తారన్నమాట" అన్నాను.
దివ్య చిన్నగా నవ్వి "వాళ్లంత త్వరగా ఓపెనప్ కారు. ఎలాగైనా సరే వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ కావాలని చెబుతారు. అలా రీచ్ కాకపోతే మరో జాబ్ వెతుక్కోవాల్సి ఉంటుందని కూడా చెబుతారు. ఆ టార్గెట్స్ రీచ్ కావడానికి మీ తెలివితేటలు, సమర్ధత ఉపయోగించమంటారు. మీరు సర్జన్ కాదు. కేవలం కన్సల్టెంట్ ఫిజీషియన్ మాత్రమే. సర్జరీ అవసరమైన వారిని గుర్తించి సర్జన్ వద్దకు పంపడమే మీరు చేయాల్సిన పని.
అలా ఒక నెలలో లేదా ఒక మూడు నెలల కాలంలో ఎంతమందిని సర్జరీకి సజెస్ట్ చేశారు అనేదాన్ని బట్టి మీ పెర్ఫార్మన్స్ అంచనా వేస్తారు. వారం వారం మీ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది పరిశీలించి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు". చెప్పింది దివ్య.
"అర్థమయింది. డాక్టర్ గా నా సేవలు పేషెంట్లకు నచ్చితే వాళ్లు మరి కొంతమందిని నా వద్దకు పంపుతారు. అయితే ఇలా జరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయమే వాళ్లతో మాట్లాడుతాను. బిజినెస్ కోసం అవసరం లేని వారికి సర్జరీలు రెకమెండ్ చెయ్యను" దృఢంగా చెప్పాను నేను.
"అలా చేయమని వాళ్లు కూడా అడగరు. కేవలం ఒత్తిడి తేవడం ద్వారా మిమ్మల్ని వాళ్ల దారిలోకి తెచ్చుకుంటారు. అయినా కొత్తగా ఓపెన్ చేయబోయే బ్రాంచి కాబట్టి వాళ్లు కూడా మరీ అంత తొందరపడరు. వీలైనంత మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నువ్వు సంకోచించకుండా రేపు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వు" చెప్పింది దివ్య.
మర్నాడు నేను హోటల్ రూమ్లో వాళ్ళిద్దర్నీ కలవడానికి వెళ్లాను. దివ్య కూడా అప్పుడే అక్కడికి వచ్చింది.
"ముందుగా రాజన్ మాట్లాడుతూ "సీ మిస్టర్ విశ్వాస్! మీరు చాలా షార్ప్ అని డాక్టర్ దివ్య గారు చెప్పారు. మీలాంటి యాక్టివ్ పర్సన్, లోకల్ పర్సన్ మా హాస్పిటల్ లో చేరడం మాకు చాలా సంతోషం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి చాలు. ఈ సంస్థ బాగుంటేనే మీరు మేము బాగుంటాము. మన సంస్థను ఏరకంగా లాభాల బాటలో నిలబెట్టాలో మీరే ఆలోచించుకోండి.
సర్జరీ అంటే సాధారణంగానే పేషంట్లలో ఒక భయం ఉంటుంది. అయితే 'ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్' అనే సామెత మీరు వినే ఉంటారు. అవసరమైన వ్యక్తికి సర్జరీ చేయకపోతే అతని ప్రాణానికి ముప్పు రావచ్చు. పైగా ఇప్పట్లో ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. లేదా ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఉంటాయి. కాబట్టి సర్జరీ అనేది ఈ రోజుల్లో ఎవరికీ పెద్ద భారం కాదు. కానీ మనకు మాత్రం పెద్ద వరం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు మీ మనసులో పెట్టుకోండి. మీకు ఇచ్చిన టార్గెట్స్ సులభంగానే దాటగలుగుతారు" చెప్పాడు రాజన్.
తర్వాత ఫైనాన్స్ మేనేజర్ దివాకర్ మాట్లాడుతూ "విపరీతమైన నష్టాలు రావడంతో మన ఖమ్మం బ్రాంచీని త్వరలో మూసేయబోతున్నారు. చాలామందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. మేమిద్దరం సీనియర్లం కాబట్టి పొమ్మనలేక వరంగల్లో పెట్టబోయే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ. లాభాలు సంపాదించడమే వాళ్ళ ధ్యేయం. అయితే కేవలం లాభాలు వస్తే సరిపోదు. ప్రతి సంవత్సరం ఆ లాభాలు పెరుగుతూ ఉండాలి. అప్పుడే మనం మన ఉద్యోగాల్లో ఉండగలుగుతాం" అన్నాడు.
ఒక నిమిషం మౌనం తర్వాత నేను గొంతు సవరించుకొని ఇలా చెప్పాను "సంస్థ కోసం కష్టపడి పని చేయడంలో నేను ఎంత మాత్రం వెనకడుగు వేయను. రాత్రి పగలు విరామం లేకుండా పని చేయడానికయినా నేను సిద్ధం. ఈ ఇంటర్వ్యూ కి వచ్చే ముందే నేను ఖమ్మం బ్రాంచ్ గురించి కొంతవరకు తెలుసుకున్నాను. మనవాళ్లు సర్జరీ సిఫార్సు చేసిన పేషెంట్ కు వేరే హాస్పటల్ వాళ్ళు మాత్రలతోనే నయం చేశారు. ఆ విషయం అతను న్యూస్ చానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో వివరంగా చెప్పాడు. అందువల్లనే ఆ బ్రాంచ్ కి రెప్యుటేషన్ దెబ్బతింది. సంస్థ లాభాల కోసం మరెన్నో మార్గాలు ఉన్నాయి. నేను నా సొంత ఖర్చులతో గ్రామాలలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాను. అక్కడికి వచ్చిన పేషంట్లను పరీక్షించి నిజంగా సర్జరీ అవసరమైన వాళ్లను గుర్తిస్తాను. అయితే అందుకు కొంత సమయం పట్టవచ్చు. కానీ బలమైన పునాదుల మీద నిర్మించిన కట్టడం చాలా కాలం స్థిరంగా ఉంటుంది అని నా నమ్మకం".
చెప్పడం ముగించాను నేను.
రాజన్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి "ఐ అప్ప్రీషియేట్ యూ యంగ్ మాన్! యూ ఆర్ అపాయింటెడ్. నీ మీద మేం పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయొద్దు" అన్నాడు.
వాళ్లకు థాంక్స్ చెప్పి దివ్యతో కలిసి బయటకు వచ్చాను. కంగ్రాట్స్ చెప్పింది దివ్య.
***
హాస్పిటల్లో చేరిన రోజు నుండే ఎంతో సిన్సియర్గా పనిచేయడం మొదలు పెట్టాను. వేళకు భోజనం చేయడం ఆరోగ్యానికి ముఖ్యమని తెలిసినా చాలా రోజులు మధ్యాహ్న భోజనం మూడు గంటలకు చేసేవాడిని. ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే చుట్టుపక్కల పల్లెలు అన్నిట్లో మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్లకు ప్రాథమిక పరీక్షలు చేశాను. అనుమానం వచ్చిన వారిని హాస్పటల్ కు పిలిపించి పరీక్ష చేశాను. నిజంగా సర్జరీ అవసరమైన వాళ్ళని సర్జన్ వద్దకు పంపాను. నేను ఆ హాస్పిటల్లో చేరి మూడు నెలలు కావస్తోంది.
ఒకరోజు రాజన్ నాకు కాల్ చేసి "మన మార్కెటింగ్ టీం వాళ్లని ఒక పెద్దాయన కన్సల్ట్ చేశాడట. వేరే హాస్పటల్ వాళ్ళు సర్జరీకి రికమెండ్ చేశారట. సెకండ్ ఒపీనియన్ కోసం మన దగ్గరికి వస్తున్నాడు. మీరు కూడా ఆయనకు సర్జరీ రెకమెండ్ చేయండి. ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా మరుసటిరోజే చేయించుకోమని చెప్పండి. ఆ హాస్పిటల్ కంటే తక్కువ ఫీజు తీసుకుంటామని కూడా చెప్పండి. మన టార్గెట్ కు కొద్ది దూరంలోనే ఉన్నాము. ఇలాంటప్పుడు వచ్చిన అవకాశం మిస్ చెయ్యొద్దు" అని ఫోన్ పెట్టేశాడు.
కొద్దిసేపటికి ఒక 80 ఏళ్ల పెద్దాయన నా గదిలోకి వచ్చాడు. అతన్ని తీసుకువచ్చిన మార్కెటింగ్ అసిస్టెంట్ "ఈయనకు సర్జరీ అవసరమట. వేరే హాస్పటల్లో చాలా డబ్బులు అడుగుతున్నారట. మీరు రాజన్ గారితో మాట్లాడి కాస్త కన్సెషన్ ఇప్పించండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
నేను ఆయన వంక చూశాను. మనిషి బాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు. సర్జరీకి తట్టుకునే వయస్సు కాదు అతనిది. అసలు అతన్ని పరీక్షించకుండానే సర్జరీ చేసేయాలని రాజన్ గారు అనుకోవడం నాకు నచ్చలేదు.
"ఆ పెద్దాయన గొంతు సవరించుకొని "నా పేరు రంగారావు. అగ్రికల్చర్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. పిల్లలు ఇద్దరూ వాళ్ళ కుటుంబాలతో అమెరికాలో ఉన్నారు. నా భార్య కాలం చేసి రెండేళ్లు అయింది. ఈ వయసులో అమెరికాకు వెళ్లలేక, పని వాళ్ళ సహాయంతో ఇక్కడే ఉంటున్నాను. తరచుగా కడుపునొప్పి వస్తూ ఉండడంతో పోయిన వారం ఒక హాస్పిటల్లో చూపించుకున్నాను. లివర్ లో కొంత భాగం డామేజ్ అయిందనీ, హెపటెక్టమీ చేయించుకొమ్మనీ చెప్పారు. సెకండ్ ఒపీనియన్ కోసం మీ దగ్గరకు వచ్చాను. ఈ వయసులో ఆపరేషన్ తట్టుకోలేనేమో అని అనిపిస్తోంది” అంటూ అంతకు ముందు చేయించుకున్న రిపోర్ట్స్ చూపించాడు.
"మీరు టెస్ట్స్ రాసివ్వండి. మళ్ళీ చేయించుకుంటాను. నా అదృష్టం బాగుండి సర్జరీ తప్పుతుందేమో.. " అన్నాడాయన ఆశగా.
కొన్ని టెస్టులు రాసిచ్చి మర్నాడు కలవమన్నాను.
"వస్తాను డాక్టర్ గారూ! నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి" అంటూ నమస్కరించి వెళ్లాడాయన.
తరువాత రాజన్ కి ఫోన్ చేసాను.
"ఈ పెద్దాయన సర్జరీ తట్టుకోలేడు. ఆయనకు ప్రాణాపాయం జరిగితే మన హాస్పిటల్ కి చెడ్డపేరు. రేపు రిపోర్ట్స్ చూసి మీకు మళ్ళీ కాల్ చేస్తాను. వీలైనంత వరకు సర్జరీ అవాయిడ్ చేద్దాం" అన్నాను.
"ఎనభై ఏళ్ళ మనిషి పోతే ఎవరూ పట్టించుకోరు. మనల్ని తప్పు పట్టారు. అయినా మన సర్జన్ మంచి ఎఫిషియెంట్. పైగా ఈ సర్జరీ జరిగితే నీ టార్గెట్, సర్జన్ టార్గెట్, నా టార్గెట్ అన్నీ దాటుతాము. వెతుక్కుంటూ వచ్చిన అవకాశం మిస్ చెయ్యొద్దు" కాస్త గట్టిగానే చెప్పాడు రాజన్.
రాజన్ మాటలకు అసహ్యం వేసి కాల్ కట్ చేసాను.
ఆ సాయంత్రమే రిపోర్ట్స్ తెప్పించుకుని చూసాను.
మందులతో తగ్గే అవకాశం ఉంది. పైగా పేషంట్ ఆరోగ్యం సర్జరీకి సహకరించదు.
వెంటనే పెద్దాయనకు కాల్ చేసి సర్జరీ అవసరం లేదని చెప్పాను. వాడాల్సిన మందుల వివరాలు వాట్సాప్ లో పెట్టి ఇక హాస్పిటల్ కి రావలసిన అవసరం లేదని చెప్పాను.
తరువాత దివ్యకు కాల్ చేసి విషయం చెప్పి, ఇలా అన్నాను.
"వందలో తొంభై సర్జరీలు సక్సెస్ అయితే ఆ హాస్పిటల్ మంచి హాస్పిటల్ కిందే లెక్క. కానీ ప్రతి పేషంట్ కీ తన ప్రాణం విలువైనదే. ఆ ప్రాణం పోవడంలో మన పాత్ర వుంటే అది మనం చేసిన హత్య కిందే లెక్క. ఎనభై ఏళ్ళు వచ్చాయని రాజన్, తన ప్రాణాలు ఎవరైనా తీస్తే ఒప్పుకుంటాడా? మన ప్రాణం లాగానే కదా పక్కవాడి ప్రాణం!
అన్నం పెట్టే సంస్థకు లాభాలు రప్పించాలని వాళ్ళు చెప్పారు. కానీ నిజానికి అన్నం పెట్టేది, మనందరి జీత భత్యాలు ఇచ్చేదీ పేషేంట్ లు ఇచ్చే డబ్బుతోనే. వాళ్లకు వీలైనంత న్యాయం చెయ్యడమే వృత్తి ధర్మం. ప్రాణాలకు విలువ ఇవ్వని ఈ హాస్పిటల్ లో నేను పని చెయ్యలేను. రిజైన్ చేస్తున్నాను. నాలాంటి వారిని కలుపుకొని స్వంతగా ప్రాక్టీస్ పెడతాను " అన్నాను.
"బయటకు చెప్పక పోయినా నావి కూడా అవే భావాలు. నీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనలాంటి మరి కొందరిని కూడా సంఘటిత పరిచి ఒక హాస్పిటల్ పెడదాం" అంది దివ్య.
"పేషంట్ మరణంలో కాక ఆరోగ్యంలో మన లాభాలు వెతుక్కుందాం". చెప్పాను నేను.
శుభం
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments