top of page

దొంగ పెళ్ళి



'Donga Pelli' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 07/08/2024

'దొంగ పెళ్ళి' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


కళ్యాణమండపం పెళ్ళివారితో చాలా సందడిగా, కళకళలాడుతూ ఉంది. వధువు విశాల, వరుడు వాసుల వివాహం అంగరంగ వైభోగంగా జరుగుతోంది. పురోహితుడు పూర్ణయ్య శాస్త్రిగారు పెళ్ళి మంత్రాలు బిగ్గరగా చదువుతున్నారు. మంగళవాద్యాలు హోరు మిన్నంటుతోంది. పెళ్ళి కూతురు తండ్రి పరంధామయ్య హడావుడిగా అటూఇటూ కలియ తిరుగుతున్నాడు. అతిథులందరూ ఆ వివాహ వైభోగాన్ని తిలకిస్తూండగా హఠాత్తుగా జరిగిందా సంఘటన!


ఆ పెళ్ళి మంటపంలోకి ప్రవేశించాడు ఓ పోలీసు ఇన్స్పెక్టర్. కోరమీసాలతో, ఓ చేతిలో లాఠీతో, మరో చేతిలో బేడీలతో అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్ష్యమైన ఆ ఇన్స్పెక్టర్ని చూడగానే అందరికీ మతులు పోయాయి. పెళ్ళికొడుకు తండ్రి తాతారావైతే వణికిపోయాడు. తను కట్నం విషయంలో పట్టుబట్టినట్లు పోలీసులకు ఎవరో ఉప్పందించారేమోనని భయపడ్డాడు. కట్నం ఇవ్వడం ఇష్టంలేక కావాలనే ఆడపెళ్ళివారిలో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేసారేమోనని తలిచాడు. అతని కాళ్ళూ చేతులూ ఆడలేదు. నిలువెల్లా వణికిపోసాగాడు.


పెళ్ళికూతురి తండ్రి పరంధామయ్య కూడా ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు. మగపెళ్ళివారి ఏ వస్తువులో, నగలో పోయాయేమో, అందుకే పోలీసులకు ఫోన్ చేసారేమోనని బెదిరిపోయాడు. ఎంతో ఖర్చుచేసి తలపెట్టిన ఈ వివాహ కార్యక్రమం రసాభాస అవదు కదా అని అందోళన చెందాడు. 


అయితే ఎవర్నీ పట్టించుకోకుండా తిన్నగా పెళ్ళి మంటపం వద్దకు వెళ్ళి తన కోరమీసాలు మెలితిప్పాడు ఆ పోలీసు ఇన్స్పెక్టర్. చేతిలోని బేడీలు ఎత్తిపట్టుకొని పెళ్ళికొడుకువైపు కౄరంగా చూసాడు. 


"ఈ ఇన్స్పెక్టర్ నరసింహం అంటే నేరస్థులకి హడల్! ఎవరికీ ఎప్పుడూ కనిపించని నాలుగో సింహమేరా ఈ నరసింహం! హత్యలు, బ్యాంకు దోపీడీలు చేసి పారిపోయి వచ్చి ఇలా దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంటూంటే నేను పోల్చలేననుకుంటున్నావా? లే, మర్యాదగా లేచి నిలబడు!" చేతిలో ఉన్న బేడీలు ఊపుతూ రివాల్వర్ని పెళ్ళికొడుకు వాసు తలకి గురిపెట్టాడు. 


అందరూ ఒక్కసారి మాన్పడిపోయారు ఆ సంఘటనకి. పెళ్ళికొడుకు మొహం అవమానంతో నల్లగా మాడిపోయింది! ఒక్కసారి అతనికేమీ అర్ధం కాలేదు. తడబడుతూ పెళ్ళిపీటల మీదనుంచి లేచి నిలబడ్డాడు. అందరూ పెళ్ళికొడుకువైపు అనుమానంగా చూసారు పెళ్ళి కూతురితో సహా! పరంధామయ్య అందోళనగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెళ్ళిపెద్దల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపించింది. అతిథులందరూ లేచి నిలబడ్డారు జరగబోయే రసవత్తర సన్నివేశం చూడటానికి. సీరియల్స్, సినిమాల్లో తప్పించి ఇలాంటి దృశ్యాలు నిజ జీవితంలో చూసి ఎరగరు మరి!


సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ నరసింహం దగ్గరకు ఎవరో కంగారుగా పరుగెట్టుకొచ్చారు. ఆ వచ్చినతనివైపు నవ్వుతూ చూసి, "సార్! ఎలా ఉంది సార్, నా పెర్ఫార్మెన్స్? డైలాగులు అదిరిపోయాయి కదా!" అని అడిగాడు నరసింహం. 


"నా కొంప ముంచావు కదయ్యా! ఇది మన సినిమా కోసం వేసిన పెళ్ళి సెట్ కాదు. ఇక్కడ నిజం పెళ్ళి జరుగుతోంది. మన సినిమా 'దొంగ పెళ్ళి' సెట్ పక్క మంటపంలో వేసాం. పద, అక్కడకి!" అని అక్కడున్న వాళ్ళని క్షమాపణ అడిగి అతన్ని లాక్కెళ్ళాడు సినిమా డైరెక్టర్ మంత్రిమౌళి.


ఒక్కసారి జడివాన వెలిసినట్లుంది. పెళ్ళిపెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. కుతూహలంగా జరగబోయేది తలచుకొని కళ్ళింతలు చేసుకొని చూస్తున్న అతిథులందరూ ఒక్కసారి చప్పబడిపోయారు.

 *************


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.



67 views1 comment

1 Comment


chaala Bagundi 😎

Like
bottom of page