ద్రోహం
- Divakarla Padmavathi
- Mar 16
- 6 min read
#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #Droha, #ద్రోహం, #TeluguCrimeThriller

Droham - New Telugu Story Written By - Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 16/03/2025
ద్రోహం - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
దివ్య మనసు ఆందోళనతో నిండిపోయింది. వారం రోజుల క్రితం తన తల్లికి ఒంట్లో బాగులేదని, తండ్రి ఫోన్ చేసాడని ఊరికెళ్ళిన దినేష్ నుండి ఎటువంటి ఫోనూ లేదు. ఇంటికి చేరగానే ఫోన్ చేస్తానన్నవాడు ఎంతకీ ఫోన్ చెయ్యక పోయేసరికి తనే అతనికి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో హతాశురాలైంది. అతనికేమైనా ప్రమాదం జరిగి ఉండదుకదా అని ఆందోళన చెందింది.
ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆలోచించి, ఆలోచించి మనసు మొద్దుబారిపోయింది. ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా అదే ఆలోచన. దినేష్ కి ఏమైంది? ఎందుకు తనకి ఫోన్ చెయ్యడం లేదు? ఆమె మనసు కీడు శంకిస్తోంది. చేస్తున్న పనిలో మనసు అసలు లగ్నం కావడంలేదు.
దివ్య అన్యమనస్కంగా ఉండటం గమనించిన ఆమె స్నేహితురాలు, కోలిగ్ అయిన రమ్య, "ఏమిటి దివ్యా, అంత పరధ్యానంలో ఉన్నావు? ఏమైంది? ఆరోగ్యం బాగుంది కదా?" అని అడిగింది.
దీర్ఘంగా ఆలోచనల్లో మునిగి ఉన్న దివ్య ఆమె మాటలకు ఉలిక్కిపడింది. ఒక్కసారి నిట్టూర్చింది. స్నేహితురాలితో చెప్తే తన బాధ కొంత ఉపశమనం కలగడమేకాక, ఆమె ఏమైనా సలహా ఇస్తుందేమోనని ఓ చిన్న ఆశ కలిగిందామెకు.
"వారం రోజుల క్రితం వాళ్ళూరికెళ్ళిన దినేష్ నుండి ఎటువంటి కబురూ లేదు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. " అందామె దిగులుగా.
ఒక్కక్షణం స్నేహితురాలి మొహంవైపు చూసింది రమ్య. వాడిపోయి ఉందామె మొహం. జాలి వేసింది రమ్యకి.
"వాళ్ళింట్లో వారెవరి ఫోన్ నంబర్లూ నీవద్ద లేవా?" అని అడిగింది.
అడ్డంగా తల ఊపిన దివ్యకేసి వింతగా చూసింది రమ్య. "మరెలా! ఎలా వాళ్ళని కాంటాక్ట్ చేస్తావు?" అని అడిగింది.
ఆమెవైపు బేలగా చూసింది దివ్య. "మాది ప్రేమ వివాహం అని నీకు తెలుసు కదా! మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు. అలానే అతని తల్లితండ్రులూ ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. అయిన వాళ్ళందరికీ దూరంగా బతుకుతున్నాం. ఈ మధ్యనే దినేష్ తండ్రి ఫోన్ చేసి తల్లికి ఒంట్లో బాగులేదని, ఓ సారి రమ్మని చెప్పాడు. తన తల్లితండ్రులకు దూరమయ్యానని చాలా సార్లు నా దగ్గర బాధపడ్డాడు కూడా. నేనే వెళ్ళమని చెప్పడంతో వెళ్ళాడు. " చెప్పింది దివ్య.
ఒక్కక్షణం స్నేహితురాలివైపు వింతగా చూసింది రమ్య.
"మరింకే ఫోన్ నంబర్ నీవద్ద లేదా?" అని అడిగింది.
"లేదు!" అని ఆలోచనలో పడింది దివ్య.
ఆమెవైపు జాలిగా చూసింది రమ్య.
"ఎన్నాళ్ళ నుంచి అతనితో నీకు పరిచయముంది?" అని అడిగింది.
"ఎందుకలా అడుగుతున్నావు? నువ్వు అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. రెండేళ్ళైంది అతనితో పరిచయం ఏర్పడి. నేనంటే దినేష్ కి చాలా ప్రేమ తెలుసా! నాకూ అతనంటే ప్రేమే! సంవత్సరం పాటు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి, మా ఇద్దరి అభిప్రాయాలు బాగా కలిసాయని బాగా ఇష్టపడి, ఆ తర్వాతే పెళ్ళి చేసుకున్నాం. " అంది.
"ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ప్రేమలో పడి విచక్షణా జ్ఞానం కోల్పోతున్నారు నేటి యువత. ఈ ప్రేమ ముసుగులో జరిగే మోసాలెన్నో! తల్లితండ్రులు మనకిచ్చిన స్వేచ్ఛాస్వాతంత్రాలు దుర్వినియోగం చేస్తున్నాం. మన కోసం నిరంతరం ఆలోచించే తల్లితండ్రుల మాటను పెడచెవిన పెడుతున్నాం.
మన సమాజం, సంస్కృతి పూర్తిగా భిన్నమైనవి. ఆధునిక పోకడలు మనకి నప్పవు. విదేశాల్లో విరివిగా కనిపించే సహజీవనం, సింగిల్ పేరంట్ లాంటి ఆధునిక పోకడలకి మన సమాజం ఆమోద ముద్ర వేసేంత స్థితికి రాలేదు. ఇలాంటివి మన సమాజం హర్షించదు. పైగా ఈ మధ్యే ఇలాంటివాట్లో ఘొరంగా మోసపోయి బలైపోయిన మహిళలను మనం చూస్తూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. మహిళలకి మాత్రమే కాదు కొన్నిచోట్ల అబ్బాయిలకీ ఈ పరిస్థితి తప్పడంలేదు.. " చెప్తోన్న రమ్యవైపు కోపంగా చూసింది దివ్య.
"నువ్వనుకున్నట్లు దినేష్ మోసగాడు కాదు. నన్ను గాఢంగా ప్రేమించాడు. అతనేదో ప్రమాదంలో చిక్కుకున్నాడో ఏమో అని నేను కలవరపడుతూ, నువ్వేదో సలహా ఇస్తావని ఆశించి నీకీ విషయం చెప్పాను. నీకు చెప్పి నేనే బుద్ధి తక్కువ పని చేసాను. " రోషంగా అంది దివ్య. ఆమె కనుల్లో నీరు నిలిచింది.
దివ్య మాటలకు మాన్పడిపోయింది రమ్య. మరుక్షణం దివ్య ఉన్న పరిస్థితి గ్రహించి ఆమెపై విపరీతమైన జాలి కలిగింది.
"సారీ దివ్యా! నేను నీ మనసు నొప్పించాను. ఈమధ్య ఇలాంటి సంఘటనలే మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటే అవేశంతో ఏదేదో తెలియక వాగాను. మా అక్కయ్యకి జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చి ఎమోషన్ కి గురైయ్యాను. అంతే!" అని, "దినేష్ పని చేసే ఆఫీసులో అడిగితే అతని ఇంటి ఫోన్ నంబర్లు ఏమైనా తెలుస్తాయేమో, అలాగే ఇంటి అడ్రెస్ కూడా కనుక్కుంటే స్వంతంగా వెళ్ళి రావచ్చు కదా. " అంది దివ్య భుజంపై చెయ్యవేసి అనునయిస్తూ.
కళ్ళు తుడుచుకొని మౌనంగా తలూపింది దివ్య. దివ్య దినేష్ పని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీకి బయలుదేరుతూంటే, రమ్య తను కూడా వస్తానంది. ఇద్దరూ అరగంటలో అక్కడికి చేరుకున్నారు.
"ఇక్కడ దినేష్ అన్న పేరు గల ఉద్యోగెవరూ లేరే?" అన్నాడు అక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్ వాళ్ళిద్దరికేసి తేరిపార చూస్తూ.
ఒక్కసారి అయోమయానికి గురైంది దివ్య. "సార్, సరిగ్గా చూడండి! అతను ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. " చెప్పింది ఆశ చావక.
"లేరమ్మా! అలాంటి పేరుగల వ్యక్తి ఎవరూ ఇక్కడ లేరు. " మళ్ళీ చెప్పాడా ఆఫీసర్.
ఒక్కసారి నిరాశ ఆమె అణువణువునా వ్యాపించింది. రమ్య వైపు చూడటానికి మొహం చెల్లలేదు.
అమెను తట్టింది రమ్య. "పద వెళ్దాం!" అని.
తిరిగి వెళ్తున్నప్పుడు అడిగింది రమ్య. "దినేష్ గురించి ఇంకేమైనా గుర్తుకు వస్తే చెప్పు! ఇంట్లో డైరీ లాంటివి ఉంటే, అందులో వివరాలు ఏమైనా ఉండవచ్చు. "
"లేదు దినేష్ కి డైరీ రాసే అలవాటు లేదు. " నిస్పృహగా చెప్పింది దివ్య.
"సరే! అతని పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో అతని అడ్రస్, వివరాలు ఉండవచ్చు. " అంది రమ్య.
"అక్కడ అవసరం ఉండవచ్చని పాస్ బుక్, చెక్ బుక్, ఏటిఎం కార్డు కూడా వెంట తీసుకెళ్ళాడు దినేష్. "
"అలాగైతే ఆ బ్యాంక్ లో విచారిస్తే ఏమైనా వివరాలు దొరుకుతాయేమో?" అంది రమ్య.
ఇంతవరకూ ఆ ఐడియా తట్టనందుకు తనను తాను నిందించుకుంది దివ్య. ఇద్దరూ కలిసి దినేష్ అకౌంట్ ఉన్న బ్యాంక్ కి వెళ్ళారు. ముందు దినేష్ వివరాలు చెప్పడానికి నిరాకరించిన మేనేజర్ ఆమె సమస్యను అర్ధం చేసుకొని సహకరించడం వల్ల దినేష్ ఇంటి విలాసం మొత్తానికి కనుక్కోగలిగారు. కాకపోతే, అతని అకౌంట్లో ఉండవలసిన డబ్బులన్నీ వెళ్ళిన ముందురోజే డ్రా చేసుకున్నాడని తెలిసి ఖిన్నురాలైంది దివ్య.
అంతేకాక తన దగ్గర నుండి కూడా ఐదులక్షలు తీసుకున్నాడు. ఆలోచించేకొద్దీ ఆమె తల తిరిగిపోయింది. భువనేశ్వర్ లో అతని తల్లితండ్రులు ఉన్నారని తెలుసుకొని అక్కడికెళ్ళాలని నిశ్చయించుకుంది దివ్య. తను, దినేష్ కలిసి తీయించుకున్న ఫొటో దగ్గరుంచుకుంది. మరుసటి రోజు ఉదయం బెంగుళూరు నుండి భువనేశ్వర్ కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కింది.
బ్యాంక్ నుండి సంపాదించిన అడ్రస్ బట్టి ఆ ఇల్లు తెలుసుకోవడం అంత సులభం కాలేదు. భువనేశ్వర్లో రమ్యకి తెలిసిన భరత్ అనే అతని సహాయం తీసుకుంది. దినేష్ తల్లితండ్రులు ఆ ఇల్లు అమ్మేసి ఎటో వెళ్ళిపోయారని తెలుసుకొని దిగులు చెందింది. ఎక్కడ దినేష్ కోసం వెతకాలో ఆమెకు అసలు అర్ధం కాలేదు. ఇలాంటి దుస్థితిలో పడతానని ఆమె కలలో కూడా ఊహించలేదు.
దినేష్ ను అంత గుడ్డిగా నమ్మింది మరి! తనను అంత గాఢంగా ప్రేమించిన దినేష్ తనను మోసం చేసాడా! తను నెలనెలా సంపాదించిన జీతంలో చాలా భాగం అతని అకౌంట్లోనే వేస్తోంది, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పనికి వస్తుందని. ఒక్కసారి మిన్ను విరిగి మీద పడినట్లనిపించింది ఆమెకు.
ఆమె పరిస్థితి చూసి జాలిపడిన భరత్, "నాకు తెలిసిన పోలీసు ఆఫీసర్ ఇన్సిపెక్టర్ ప్రశాంత్ అని ఖారవేల పోలీసు స్టేషన్లో ఉన్నాడు. అతనేమైనా ఈ విషయంలో సహాయం చెయ్యగలడేమో అడుగుదామా?" అని ఆమెనడిగాడు.
అప్పటికే దివ్య మనసు భారంగా తయారైంది. ఆలోచించి, ఆలోచించి ఆమె మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. అనాలోచితంగా తలూపిందామె.
దివ్య చెప్పిందంతా పూర్తిగా విన్నాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్. దివ్య, దినేష్ కలిసి తీయించుకున్న ఫొటోను నిశితంగా చూసాడు. బ్యాంక్ నుండి ఆమె సంపాదించిన దినేష్ తల్లితండ్రుల పేర్లు, అడ్రస్ ఉన్న వివరాలు అన్నీ కూడా రాసుకున్నాడు.
"మేడం! నాకు ఓ రెండు మూడు రోజుల సమయం ఇవ్వండి! ఈ ఆధారాలు చాలు నాకు. ఈ ఫొటోను అన్ని పోలీసు స్టేషన్లకి పంపుతాను. త్వరలో ఏ విషయమూ మీకు చెప్తాను. " అని ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడతను.
భరత్ ఇంట్లోనే రెండు రోజులూ ఉందామె. భోజనం వడ్డిస్తూ అతని భార్య భార్గవి దివ్యపై సానుభూతి కురిపిస్తూ, "ఇవాళా రేపూ ఎవ్వర్నీ నమ్మడానికి లేదమ్మాయీ! ఒకరి విషయాలోకరు పూర్తిగా తెలుసుకోకుండా ప్రేమలో కూరుకుపోతారు. ప్రేమ పెళ్ళి చేసుకుంటారు, సరే! సహజీవనమంటారు. ఇలాంటి కొత్త పోకడలతో నష్టపోయేది కేవలం మహిళలే! పెద్దలు పెళ్ళిళ్ళు కుదిరిస్తే అంతా పూర్తిగా విచారించిగానీ పిల్లనివ్వరు. తల్లితండ్రులిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదు.
ప్రేమవివాహం చేసుకోదలచుకుంటే, వాళ్ళ అనుమతి తీసుకుంటే, ఇలాంటి దుర్గతి పట్టదు కదా! ఈ మధ్యనే బెంగుళూరులో జరిగిన మహాలక్ష్మి ఉదంతం అందరికీ తెలిసినదే!.. " అని ఇంకేదో చెప్తూంటే కళ్ళనీళ్ళ పర్యంతం అవుతోన్న దివ్యను చూసి, "ఇంక ఆపు భార్గవీ! అసలే ఆమె బాధలో ఉంది. నువ్వు ఆమెను మరింత బెంబేలెత్తించకు. " అని ఆమెను మందలించాడు భరత్.
సరిగ్గా మూడవరోజు ఇన్సిపెక్టర్ ప్రశాంత్ నుండి ఫోన్ వస్తే, భరత్ తో కలిసి వెళ్ళింది దివ్య.
వాళ్ళిద్దర్నీ కూర్చోమని చెప్పి, "మేడం.. మీరెలాంటి వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారో తెలుసా!" అన్న అతనివైపు షాక్ కొట్టినట్లు చూసింది దివ్య.
"మీరిచ్చిన ఫొటో చూస్తూనే నాకు అనుమానం వేసింది. ఇక్కడికి యాభై కిలోమిటర్ల దూరంలో ఉన్న ఊరతనిది. ఇంతకు ముందు ఇక్కడే ప్రేమ పేరుతో రెండు పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళను దోచుకొని పరారైయ్యాడు. బెంగుళూరెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని వలలో వేసుకున్నాడు.
తల్లితండ్రులను ఎన్నడూ పట్టించుకోలేదతను. వాళ్ళు దినాతి దీన స్థితిలో వాళ్ళ ఊళ్ళో ఉన్నారు. దినేష్ అన్న మారుపేరుతో మిమ్మల్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతని అసలు పేరు సంతోష్ సాహు. అతనిమీద ఇప్పటికే కొన్ని కేసులున్నాయి. మళ్ళీ మరో పెళ్ళికి సిద్ధపడుతూండగా పట్టుబడ్డాడు. ఇలాంటి కేసులేమీ కొత్త కాదు మాకు. ఎటొచ్చీ ఇలాంటి సంఘటనలు ఎన్ని తెలిసినా యువతలో మార్పు రావడం లేదు, అదే విచారించదగిన విషయం. సరే, అతన్ని చూస్తావా?" అని అడిగాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్.
అప్పటికే దివ్య మొహం తెల్లగా పాలిపోయింది. దినేష్ మోసగాడంటే ఇప్పటికీ ఆమె నమ్మలేకపోతోంది. కానీ, ఇప్పుడు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అప్రయత్నంగా తలూపిందామె.
చేతికి బేడీలతో అక్కడికి తీసుకురాబడ్డ దినేష్ ను చూడగానే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటన అతని దగ్గరకు వెళ్ళి రెండు చెంపలూ గట్టిగా వాయించింది. ఆమె కళ్ళల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి.
"నమ్మకద్రోహీ! నువ్వంటే నా ప్రాణమన్నావు. నన్ను నిలువునా దోచుకున్నావు. గుడ్డిగా ప్రేమలో పడి ఘోరంగా మోసపోయాను. " అని మళ్ళీ ఎడాపెడా అతన్ని వాయించబోతూంటే అడ్డుకున్నాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్.
దినేష్ ఊరఫ్ సంతోష్ మొహం అవమానంతో ఎర్రగా కందగా తల కిందకు దించుకున్నాడు.
"ఆగండి మేడం! అతని విషయం మాకు వదలండి. చట్టాన్ని మీ చేతులోకి తీసుకోకూడదు. అతనికి తగిన శిక్ష పడుతుంది. కాకపోతే, మీరతనికి ఇచ్చిన డబ్బులు రాబట్టాల్సుంది. మరో పెళ్ళి చేసుకొని, మరో యువతికి అన్యాయం జరకుండా మాత్రం కాపాడగలిగాం. జీవితాంతం తోడుండే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి జాగురూకతతో వ్యవహరించడం ఎంతైనా అవసరం,
లేకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇలాంటి ఉదంతాలు బయట పడ్డాకైనా యువత వింత పోకడలు తగ్గుతాయని ఆశించాలి, అంతే మేము చేయగలిగింది. " చెప్పాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్.
తల వంచుకుంది దివ్య. ఆమె కళ్ళలోంచి నీళ్ళు జలజలా రాలాయి.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
SUPERB