అత్తగారి కథలు - పార్ట్ 2
'Dubara Kharchulu' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 11/05/2024
'దుబారా ఖర్చులు' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 2)
రచన: L. V. జయ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
సమర్థ్ కి కూతురు పుట్టాక, కొత్త ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కొత్త ఇంటికి మొదటి సారి వచ్చిన సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, వస్తూనే ఇల్లంతా తిరిగి చూసి, "ఇంత పెద్ద ఇల్లు ఎందుకురా? దుబారా ఖర్చు. ముందున్న ఇంట్లోనే ఉండచ్చు కదా" అంది.
"ఆ సింగల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పుడు సరిపోదు కదమ్మా. అందుకని, ఈ రెండు 2 బెడ్ రూమ్ లు ఉన్న ఇల్లు తీసుకున్నాను" అన్నాడు సమర్థ్.
"మీ ఆవిడ అడిగిందా ఈ ఇల్లు తీసుకోమని." అంది కోడలు జాగృతిని చూస్తూ. లేదని చెప్పాడు సమర్థ్.
"బాగా వెనకేసుకొస్తున్నావ్ మీ ఆవిడని. ఇంటినిండా అక్కరలేని వస్తువులే ఉన్నాయి. దుబారా ఖర్చులు." అంది జాగృతిని కోపంగా చూస్తూ, కొడుకుతో నెమ్మదిగా, "కూతురు కూడా వచ్చింది కదా ఇప్పుడు. ఇంకా ఖర్చు పెరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి." అని చెప్పింది రాధ.
"నువ్వు వచ్చావు కదా. అన్నీ దగ్గరుండి నేర్పించు" అని రాధ కి చెప్పి వెళ్ళిపోయాడు సమర్థ్.
సమర్థ్, బయటకి వెళ్ళగానే, తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలు పెట్టింది రాధ.
"నా కూతురి ఇంట్లో, కర్టెన్స్, బెడ్ పక్కన మాట్స్ ఉన్నాయని, నువ్వు కూడా కొనేసి ఉంటావ్. నా కూతురుకి, నీకు పోలికా?" అంది జాగృతి తో. జాగృతి, రాధ ని చూసి, ఊరుకుంది.
'అవసరమైన వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు తప్ప ఇంకేమి లేవు ఈ ఇంట్లో. అయినా అత్తగారు ఎందుకు ఎప్పుడూ తిడుతూ ఉంటారో' అనుకుంది జాగృతి.
జాగృతి అంటే ముందు నుండి ఇష్టం లేదు రాధ కి. జాగృతిని, ఎప్పుడూ ఎదో ఒకదానికి తిడుతూనే ఉంటుంది. జాగృతి కి కూతురు పుట్టాక, తన కొడుకు, తనకి దూరం అయిపోతాడు అనిపించి, జాగృతి మీద ఇంకా కోపం పెరిగిపోయింది రాధకి.
"లేచాక కాలు కిందపెట్టలేదేమో సుకుమారి. బెడ్ పక్కన మాట్స్ వేసుకుంది. నా కూతుర్ని, నేను కాలు కిందపెట్టకుండా పెంచాను. అది ఏదైనా కొనుకుంటుంది. నీకు ఎందుకు?" అంది రాధ.
'నిజంగానే ఈవిడ కర్టెన్స్, మాట్స్ గురించే తిడుతున్నారా? లేక వాళ్ళ కూతురిలా నేను ఉండకూడదు అంటున్నారా?' అర్ధం కాలేదు జాగృతి కి.
"నీలాగ, బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్లిపోదు నా కూతురు. ఇంట్లోనే ఉంటూ, భర్తని, పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది. కాబట్టి, దాని భర్త, దానికి కావాల్సినవి కొంటాడు. నీకెందుకు ఇవన్నీ?" అంది రాధ.
'ఈవిడ వెళ్ళనిస్తే కదా బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్ళడానికి. ఎప్పుడో మాన్పించింది కదా. ఇంకా తిడుతోందేంటి ఈవిడ? ' అని అనుకుంది జాగృతి.
జాగృతి, పెద్ద IT కంపెనీ లో ఉద్యోగం చేసేది. కంపెనీ వాళ్ళు, జాగృతి తెలివితేటల్ని చూసి, అమెరికా పంపారు. అక్కడ, కొన్నాళ్ళు చేసి వచ్చింది. పెళ్లి అయ్యాక కూడా మళ్ళీ పంపిస్తామన్నారు. ఆ విషయం తెలిసినప్పటినుండి, జాగృతిని ఉద్యోగం మానెయ్యమని తిడుతూనే ఉంది రాధ. జాగృతి కి ప్రెగ్నన్సీ వచ్చాక, ఆఫీస్ కి వెళ్లనివ్వకుండా చేసి, వేరే ఊళ్ళో వున్న, వాళ్ళ అమ్మ ఇంటికి పంపేసింది రాధ. జాగృతి కి, ఉద్యోగం మానెయ్యాల్సి వచ్చింది.
"ఏ లోకంలో ఉన్నావ్? నేను చెప్పేది వింటున్నావా? " అత్తగారి మాటలకి, ఆలోచన నుండి బయటకి వచ్చింది జాగృతి.
"నా కూతురు ఇంట్లో, రేపు కిట్టి పార్టీ ఉంది. ఫ్రెండ్స్ అందరిని పిలిచి, భోజనం పెడుతోంది. ఇద్దరు పిల్లలతో చేసుకోగలదో లేదో? నేను వెళ్తాను సాయానికి. అవునూ, నీకేమైనా కిట్టి పార్టీ లాంటి అలవాట్లు ఉన్నాయా?" అని అడిగింది రాధ. లేదని చెప్పింది జాగృతి.
"అలాంటివేమీ పెట్టుకోకు. దుబారా ఖర్చు." అంది రాధ.
' కూతురికి అలాంటి అలవాట్లు ఉంటే దుబారా ఖర్చు కాదనుకుంటా' అనుకుంది జాగృతి.
"దాని ఫ్రెండ్స్ అందరూ రకరకాల బట్టలు వేసుకుని వస్తారు. నా కూతురు అందరికంటే, స్పెషల్గా ఉండాలని, పట్టు లంగా, జాకెట్టు కుట్టించి తెచ్చాను. బుట్ట చేతులు కూడా పెట్టించాను. చిన్నప్పుడు ఎప్పుడో వేసుకునేది ఇలాంటివి. మళ్ళీ వేసుకునే అవకాశం వస్తుందో రాదో."అంటూ లంగా, జాకెట్టు చూసి మురిసిపోయింది రాధ. "అయినా, అది ఏం వేసుకున్నా అందంగా ఉంటుంది. నీలా కాదు." అంది.
ఆవిడ మాటల్ని తట్టుకోలేక, కూతుర్ని తీసుకుని తన రూమ్ లోపలికి వెళ్ళిపోయింది జాగృతి.
"నువ్వు అనవసరంగా ఎక్కువ బట్టలు కొనకు. దుబారా ఖర్చు" అని వెనకనుంచి అంటున్న అత్తగారి మాటలు వినపడ్డాయి జాగృతి కి.
'ఈవిడ ఏమీ మారలేదు. కూతురి గురించి గొప్పగా చెప్తూ, కోడలిని తిట్టాలి. అదే ఈవిడ లక్ష్యం.' అనుకుంది జాగృతి.
కూతుర్ని పడుకోబెట్టి, వంటచెయ్యడానికి వెళ్ళింది జాగృతి. రాధ కూడా వెనకాలే, వంటిట్లోకి వచ్చి, "ఎన్ని సామానులో? ఇకముందు నువ్వు ఒక్క చెంచా కొన్నా నాకు తెలియకుండా కొనడానికి వీల్లేదు" అని గట్టిగా అరిచి చెప్పింది రాధ. ఆవిడ అరుపుకి, తుళ్ళిపడింది జాగృతి.
జాగృతి తీసిన కూరల్ని వెనక్కి పెట్టించి, వేరే కూరలు తీసింది రాధ. ఒక అగ్గిపుల్లతో, 3 స్టవ్ లు వెలిగించి, "చూడు, ఇలా పొదుపు చెయ్యాలి. దుబారా ఖర్చులు చెయ్యకూడదు" అంది నెమ్మదిగా. 'ఈవిడేంటి? ఇంతలోనే గొంతు మార్చేసింది?' అనుకుంది జాగృతి.
అప్పుడే, సమర్థ్ వంటిటి వైపు రావడం చూసి, 'ఓహ్. అందుకా ఈవిడ అగ్గిపుల్లతో పొదుపు పాఠాలు నేర్పుతోంది' అనుకుంది జాగృతి.
"ఈ రోజు నుండి నా కొడుకుకి నేను వండిపెడతాను. నీ వంట తిని సన్నగా అయిపోయాడు" అంది రాధ కొడుకుని చూస్తూ.
'పోనిలే. ఈవిడ వల్ల వంటపని తగ్గుతుంది.' అని సంతోషింది జాగృతి.
అప్పటికే, స్టవ్ లు కొంతసేపటి నుండి వెలుగుతూ ఉండడం తో, వంటిల్లంతా గ్యాస్ వాసన వచ్చింది. జాగృతి కి, రాధ మాటలకి వచ్చిన తల నొప్పి, గ్యాస్ వాసన వల్ల ఇంకొంచెం పెరిగింది.
'ఈవిడ దుబారా ఖర్చులు అని నన్ను తిడుతోంది. ఇంతసేపు గ్యాస్ పోయినా పర్వాలేదనుకుంటా.' అనుకుంది జాగృతి.
"నా కూతురు, ఎంత బాగా వంట చేస్తుందో. నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క పని కూడా నేను చేయించలేదు. ఇప్పుడు ఎంత కష్టపడుతోందో పాపం." రాధ, తన కూతురి గొప్పలు చెప్తూనే ఉంది.
'ఈవిడ, కూతురికి ఏమీ నేర్పకుండా అత్తగారి ఇంటికి పంపచ్చు. కోడలు కొంచెం నేర్చుకుని వచ్చినా తిట్లు తప్పవు' అనుకుంది జాగృతి.
"హోటల్స్ కి వెళ్తారు కదా మీరు?" జాగృతిని అడిగింది రాధ. ఏం సమాధానం చెప్పలేదు జాగృతి. సమాధానం చెప్పినా రాధ వినదు. అనాల్సినవి, అనేస్తుంది.
"మీలా ప్రతి వారం హోటల్ కి వెళ్ళరు వాళ్ళు. ఎదో వారానికి ఒక్కసారో, రెండు సార్లో వెళ్తారు. వారం అంతా కష్టపడుతుంది కదా, అందుకు వాళ్ళ ఆయన హోటల్స్ కి తీసుకుని వెళ్తాడు. నువ్వేం వెళ్ళక్కరలేదు." అంది.
రోజంతా, కూతురి గురించి ఎదో ఒకటి చెప్తూ, జాగృతిని తిడుతూ గడిపింది రాధ.
ఆ రోజు రాత్రి, జాగృతి మొహం చూసి, "ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి. ఏమైంది నీకు? ఈ రోజు ఇలా ఉన్నావ్?" అని అడిగాడు సమర్థ్. అత్తగారు ఉదయం తిడుతున్న విషయం చెప్పాలనుకుంది, కానీ, సమర్థ్ ఏమంటాడో అని చెప్పలేకపోయింది జాగృతి.
"అమ్మ నీకు చాలా నేర్పానని చెప్పింది. ఏం నేర్పింది?" అని అడిగాడు.
"ముందు నేనొకటి అడుగుతాను. దానికి సమాధానం చెప్పండి. అప్పుడు చెప్తాను" అంది జాగృతి. సరే నన్నాడు సమర్థ్.
"ఒకరు, ప్రతి వారం హోటల్ కి వెళ్లి తింటారు. ఒకరు, వారానికి ఒక్కటి, రెండుసార్లు హోటల్ కి వెళ్లి తింటారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ సార్లు హోటల్ కి వెళ్తున్నట్టు? " అని నవ్వుతూ అడిగింది జాగృతి.
"రెండో వాళ్ళేగా. ఇంతకీ అమ్మ ఏం చెప్పిందో చెప్పు" కుతూహలంగా అడిగాడు సమర్థ్.
"మీ అక్క గురించి చాలా చెప్పారు. ఆవిడలా నన్ను ఉండద్దు అన్నారు. ఆవిడ ఇంట్లో ఉన్నవి, మన ఇంట్లో ఉంటే, వాటిని దుబారా ఖర్చు అన్నారు. ఆవిడలా కిట్టిపార్టీలు పెట్టకూడదని, ఆవిడలా బట్టల్ని ఒక్కసారి వాడి, వదిలెయ్యకూడదని, ఆవిడలా బట్టలకి అనవసరంగా డబ్బులు వేస్ట్ చెయ్యకూడదని, వాళ్ళలా ప్రతివారం హోటల్ కి వెళ్లకూడదని చెప్పారు. వదిన గురించి చెప్తూ, నాకు ఎన్నో విషయాలు నేర్పించారు" అంది జాగృతి నవ్వుతూ.
ఆ నవ్వులో, బాధ కనపడింది సమర్థ్ కి. జాగృతి, తనకి కనపకుండా కళ్ళు తుడుచుకోవడం చూసాడు సమర్థ్.
జరిగినదంతా అర్ధం అయ్యింది సమర్థ్ కి. రాధ, జాగృతి తో మాట్లాడేతీరు, ప్రవర్తిస్తున్న విధానాన్ని చూసాడు సమర్థ్.
'కూతురికి, కోడలికి పోలిక పెట్టిందన్నమాట అమ్మ. ఇంట్లో ఉండే కూతురు గొప్ప. బాగా చదువుకుని, సంపాదించగలిగి ఉండి, ఉద్యోగం చేయొద్దంటే, మానేసిన కోడలు గొప్ప కాదు. కూతురికి అన్నీ సంతోషాలు ఉండాలి. కోడలికి ఉండకూడదు.జాగృతి, ఈ విషయాన్ని దాచి, అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నానని చెప్పింది' అనుకున్నాడు.
"దుబారా ఖర్చులు పెడుతున్నావ్ అని అమ్మ అనడం విన్నాను. బాధపడకు. నువ్వేం పెట్టటం లేదు. ఒక చెంచా కూడా ఆవిడకి తెలియకుండా కొనద్దు అని చెప్పింది కదా. రేపు బయటకి వెళ్తున్నప్పుడు, ఒక చెంచా కొనుక్కుని వస్తాను అని చెప్పిరా. ఏమంటుందో చూద్దాం" అన్నాడు.
'ఆవిడ నా మీద అరవడం సమర్థ్ విన్నాడన్నమాట. అయినా ఏం లాభం? అమ్మకి ఏమీ చెప్పడు. ' అనుకుంది జాగృతి.
ఎన్ని తిట్లు తిన్నా, ఎవరి గురించి చెడు చెప్పలేదు జాగృతి.
జాగృతి మీద ఉన్న ఇష్టం, ఇంకా పెరిగింది సమర్థ్ కి.
***
అత్తగారి కథలు - పార్ట్ 3 త్వరలో
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
@sahsamlanguages
• 4 days ago
అత్తా , కోడలి ముచ్చట్లు బాగున్నాయి . ఒక్క అగ్గిపుల్ల తో మూడు స్టవ్ లు వెలిగించడం బాగుంది. ఈ రోజు అత్తదే పైచేయిగా ఉంది.మరి రేపు..