top of page

దుష్టులతో స్నేహం హానికరం

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #దుష్టులతోస్నేహంహానికరం, #DushtulathosnehamHanikaram, #TeluguComedyStories, #తెలుగుకథలు, #బాలలకథ


Dushtulatho sneham Hanikaram - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 21/11/2024

దుష్టులతో స్నేహం హానికరం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 


 బొర్రాగుహలు చీకటి మసక వెలుగులో ఉన్నాయి. గుంపులుగా గబ్బిలాలు గుహల పైకప్పులపైన నివాస ముంటున్నాయి. వాతావరణం, తిండికి అనుకూలంగా ఉండటంతో ఇక్కడికి నివాసం మార్చేయి. ఇంతకు ముందు బయట పెద్ద చింతచెట్టు మీద కాపురముండేవి. అకస్మాత్తుగా

వచ్చిన హుద్ హుద్ తుఫాను కారణంగా పెను గాలులకు చింతచెట్టు వేళ్లతో నేల కూలడంతో సమీపం లోని బొర్రా గుహల్లోకి నివాసం మార్చేయి. 


 అంతకు ముందే గుహల్లో కొండ తేనెటీగలు గూళ్లు కట్టుకుని ఆవాసముంటున్నాయి. తేనెటీగలు గబ్బిలాలను గుహల్లోకి అనుమతించలేదు. ఎన్నో తరాల నుంచి నివాసముంటున్న చింతచెట్టు తుఫాను గాలికి కూలిపోవడం వల్ల గత్యంతరం లేక ఇక్కడికి వచ్చామని చెప్పగా రాణి తేనెటీగ సహచరుల్ని సంప్రదించి అంగీకరించింది. అప్పట్నుంచీ గబ్బిలాలు ఒకవైపు, తేనెటీగలు మరోవైపు సఖ్యతగా గుహలో నివాస ముంటున్నాయి. 


 పగలు తేనెటీగలు పరిసరాల్లోని పసుపు పచ్చని వడిశ, సూర్యకాంతం రకరకాల పూల నుంచి తేనెను సంపాదించి గూటికి చేరుస్తాయి. 


 రాత్రి గబ్బిలాలు గుంపులుగా సమీప అడవిలో ఫలాలు,  చేలలో మిడతలు కీచురాళ్లు ఎలకల్ని వేటాడి వెలుగు వచ్చే లోపు గుహలకు చేరుకుంటాయి. 


 ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎండాకాలం మొదలై వాతావరణంలో వేడి ఎక్కువైంది. నీటి వనరులు కరువై పువ్వుల ఉత్పత్తి తగ్గి తేనెటీగలు తేనె కోసం దూరప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది. తెచ్చిన తేనెను పొదుపుగా వాడుకుంటున్నాయి. 


 ఒకరోజు ఎండవేళ ఆడ మగ ఎలుగు బంట్లు తమ చిన్నారి ఎలుగుతో నివాసం వెతుకుతు బొర్రా గుహలకొచ్చాయి. 


 ఎవరీ కొత్త జంతువులని గబ్బిలాలు ఆశ్చర్య పోతూ "ఎవరు మీరు? ఇక్కడి కెందు కొచ్చా”రని నిలదీసాయి.. 

అప్పుడు తేనెటీగలు ఆహారం కోసం దూరప్రాంతాలకు పోయాయి. 


 "మమ్మల్ని ఎలుగుబంట్లు అంటారు. చెట్లే మాకు నివాసం. తుఫాను కారణంగా సమీప అడవిలోని చెట్లన్నీ నాశనమై నిలువ నీడ లేక ఎండలతో అల్లాడుతున్నాం. చంటిది ఎండల వేడికి తట్టుకోలేక పోతోంది. వర్షాలు పడి అడవిలోని చెట్లు చిగురించి పచ్చగా అయేవరకు మాకు ఇక్కడ నివాసానికి చోటి”వ్వండని గబ్బిలాల్ని వేడుకున్నాయి. 


 తాము కూడా తుఫాను గాలికి చింతచెట్టు నేలకూలినందున ఆశ్రయం కోసం ఈ గుహల కొచ్చాం. తమలాగే ఈ జంతువులు నిరాశ్రయులై ఈబిడ్డతో తిరుగు తున్నాయని

కనికరించి గుహలో ఉండటానికి అనుమతించాయి. 


 దూర ప్రాంతాల నుంచి తేనెతో అలసి గుహకి తిరిగొచ్చిన తేనెటీగలు తమ ఆవాసంలో ఎలుగుబంట్లను చూసి భయపడ్డాయి. 


 ఎవరు వీటిని ఇక్కడ ఉండటానికి అనుమతిచ్చారని అవి తర్జనభర్జన పడుతుండగా ముసలి గబ్బిలం గంగూ కలగ చేసుకుని తమలాగే ఈ జంతువులు కూడా తుఫాను వల్ల ఆశ్రయం లేక ఎండల వేడితో చిన్న పిల్లతో యాతన పడుతున్నాయని, వర్షాలు కురిసి అడవిలో వృక్ష సంపద పెరిగితే తిరిగి వాటి స్థావరాలకు మళ్ళిపోతాయట. అందువల్ల కొద్ది

నెలలు మనతో గుహలో ఉండటానికి అనుమతించామని సానుభూతి కనబర్చింది. 


 ఆ మాటలు విన్న తేనెటీగలు "ఇక్కడ వద్దు, ఇవి మోసకారి జంతువులు. మేము చెట్ల మీద తేనెపట్లు కట్టుకుంటే చెట్లెక్కి మమ్మల్ని తగిలేసి తేనె జుర్రుకుంటాయి. అందువల్ల ఇవి ఇక్కడుంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమే" అని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. 


"లేదు, లేదు. మా మాటల్ని నమ్మండి. మేము మీకు ఎటువంటి హాని తలపెట్టం " అని ప్రాధేయపడ్డాయి. 


 "మీరు గుహ కప్పు పైన ఉంటారు. మేము కింద ఉంటాము. కనుక మిమ్మల్ని ఎలా చేరుకోగల”మని సానుభూతి మాటలు చెప్పాయి. 


 గబ్బిలాలు కూడా వంత పలకడంతో తేనెటీగలు కొన్ని షరతులతో గుహలో ఉండటానికి అంగీకరించేయి. 


 రోజులు గడుస్తున్నాయి. ఎండల వేడి ఎక్కువైంది. అడవి జంతువులకు నీరు దొరకడం లేదు. పువ్వులు కరువై దూర ప్రాంతాలకు పోయి తేనె తెచ్చుకుంటున్నాయి తేనెటీగలు. 

 

 గుహలో ఉంటున్న ఎలుగుబంట్లు పగలు దాహం కోసం విప్పపువ్వులు తిని మత్తెక్కి అరుపులతో గుహను మారుమోగిస్తున్నాయి. కప్పుపైన విశ్రాంతి తీసుకుంటున్న గబ్బిలాలకు నిద్రాభంగమై యాతన పడుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఎలుగు గొడ్లు వాటి మాట వినడం లేదు. 


 ఒకరోజున చిన్న ఎలుగుకు దాహం వేసింది. ఎక్కడా నీరు పుట్టలేదు. ఎలాగని ఆలోచించగా పైన నిండుగా తేనె తుట్టె కనబడింది. తేనెటీగలు బయటకు పోయి ఉంటాయని తలిచి మగ ఎలుగుబంటి గుహ బయటికెళ్లి సమీపంలో ఉన్న వెదురు పొద నుంచి పొడవైన ఎండిన వెదరు బొంగు విరిచి తెచ్చింది. 


ఆ వెదురు బొంగుతో పైన ఉన్న తేనెతుట్టను పొడవడానికి ప్రయత్నిస్తుండగా, ఎండ వేడిమి కారణంగా బయటకు వెళ్లని తేనెటీగలు రాబోయే ఆపదను పసిగట్టి గబ్బిల సమూహాన్ని అప్రమత్తం చేసాయి. 


 గబ్బిలాలు కూడా రెచ్చిపోయాయి. సమూహాలుగా ఏర్పడి నాలుగు వైపుల నుంచి పెద్ద ఎలుగుబంట్ల మీదదాడి చేసి వాటి కళ్లు ముక్కు చెవులు కొరికేసాయి. మరోవైపు

 కొండ తేనెటీగలు దొరికిన చోట కొండీలు గుచ్చి విష పూరితం చేసాయి. 


 'బ్రతుకు జీవుడా ' అనుకుంటూ పిల్లను తీసుకుని అడవిలోకి పరుగు లంకించాయి ఎలుగు గొడ్లు. 


 దుష్టులను చేరదీస్తే హాని తప్పదని గబ్బిలాలు తెలుసుకున్నాయి. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


52 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Nov 21

"దుష్టులతో స్నేహం హానికరం" కథ ద్వారా కందర్ప మూర్తి గారు దుష్టులతో స్నేహం చేస్తే వచ్చే హానిని చక్కగా వివరించారు. గబ్బిలాలు, తేనెటీగలు బొర్రా గుహల్లో శాంతియుతంగా సహజీవనం చేస్తుండగా, ఎలుగుబంట్లు చేరడం వల్ల సమస్యలు వస్తాయి. వారి లోభం, అల్లరి తేనెటీగలతో గొడవలకు దారితీస్తుంది. చివరికి గబ్బిలాలు, తేనెటీగలు కలిసి ఎలుగుబంట్లను గుహల నుంచి తరిమేస్తాయి.


ఈ కథ సహజీవనం, నమ్మకం, దుష్టులతో అనుబంధం పెట్టుకుంటే వచ్చే అనర్థాలపై స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. సులభమైన భాష, ఆకర్షణీయమైన కథనంతో పిల్లలకూ పెద్దలకూ ఉపయుక్తంగా ఉంది - MK KUMAR


Like
bottom of page