ఎడబాటు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Dec 31, 2024
- 6 min read
#KandarpaMurthy, #కందర్పమూర్తి, #ఎడబాటు, #Edabatu, #TeluguKathalu, #తెలుగుకథలు, #సామాజికసమస్యలు

Edabatu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 31/12/2024
ఎడబాటు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
“అప్పీ , బేగె బట్టలు , సామాన్లు సర్దవె. టౌనుకి పోయే బస్సు బండరాయి కాడకు వచ్చే ఏలయినాది.. బుడ్డోణ్ణి నాను ఎత్తుకుంటా. దుర్గమ్మ తల్లి గుడికి పోయే మనోళ్లు బండరాయి కాడకు చేరుకుంటున్నారు" పెళ్లాం అప్పలకొండను తొందర చేస్తున్నాడు దేవయ్య.
"అయిపోనాది మావా, ఊరికి పోయే సామాన్లు, నీయి నాయి గుంటడి లాగులు, చొక్కాలు మూట కట్టేసినా. దారిలో తిండానికి తివ్వ దుంపలు, తేగలు, ఏరి శనక్కాయలు మూట కట్టినా.
రోజూ కోళ్లకి గింజలేసి రాత్రి గూట్లో పెట్టమని, గేదెలకి గడ్డేసి కల్లాపు తియ్యమని పెద్దయ్యకు సెప్పు. మనం వచ్చే వరకు మూడు దినాలు ఇంటిని కనిపెట్టి చూడమని మీ తమ్ముడు సూరికి యాది చెయ్యి." మొగుడికి చెప్పుకు పోతోంది.
"అయ్యన్నీ ముందే చెప్పినానె. నువ్వు బేగె తెములు" విసుగు ప్రదర్సిస్తున్నాడు.
చుంచుకొండ గ్రామంలోని కొన్ని కుటుంబాలు సింహాద్రి అప్పన్న , బెజవాడ దుర్గమ్మ తల్లి గుడి యాత్రలకు ఎల్దామని ఎప్పటి నుంచో అనుకుంటె ఇప్పటికి సాధ్యమైంది.
దేవయ్య , పెళ్లం అప్పలకొండ, మూడేళ్ల కొడుకు సూది కొండడు వారి బంధుగణంలోని మరికొన్ని కుటుంబాలు కలిసి ముందు సింహాద్రి అప్పన్నను తర్వాత బెజవాడ దుర్గమ్మ తల్లిని దర్సించి మొక్కులు తీర్చుకోవాలని నిర్ణయానికొచ్చారు.
రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ యాత్రలు చేద్దామనుకుంటుంటే ఏదో ఒక ఆటంకం వచ్చి వాయిదా పడుతు వచ్చింది. ఈ ఏడు అదునుకు వర్షాలు పడి ఎవసాయం బాగుండి చేతికి డబ్బులు ముట్టినాయి.
గిరిజన గ్రామాలు నాగరికతకు దూరంగా నిరక్షరాస్యత మూఢనమ్మకాలు కట్టుబాట్లతో పోడు వ్యవసాయం మీద ఆధారపడి అమాయకంగా జీవనం సాగిస్తుంటారు. రెండు కోసులు అడవి మార్గంలో నడిచి కూరగాయలు, కోళ్లు, మేకలు, వంట దినుసులు వారాంతపు సంతల్లో అమ్మి వచ్చే సంపాదనతో బతుకుతుంటారు.
దూరం ప్రయాణం చెయ్యాలంటె డొంకరాయి కాడ బస్సెక్కాలి. అందరూ ప్రయాణంలో కావల్సిన తిండి, మిగతా సామాన్లు మూటలు కట్టి కుటుంబాలతో బస్సెక్కి సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకుని రైలులో విజయవాడ స్టేషనుకి చేరి బస్సెక్కి దుర్గమ్మ తల్లికి మొక్కులు తీర్చి తిరిగి తమ గ్రామానికి వెళ్లడానికి రైల్వే స్టేషనుకి వచ్చి పాసింజరు రైలుకోసం ఎదురుచూస్తున్నారు.
మధ్యాహ్నమైంది. దేవయ్య, పెళ్లం అప్పలకొండతో పాటు కొడుకు సూదికొండడు వెంట తెచ్చుకున్న తినుబండారాలు తిని నీళ్ళు తాగేరు. మరికొద్దిసేపటిలో వాళ్లు ఎక్కే రైలు ఫ్లాట్ ఫారం మీదకు వస్తోందని ఎనౌన్సు చెయ్యడంతో సామాన్లు సరిచూసుకుంటున్నారు.
ఇంతలో అప్పలకొండ అర్జంటుగా మూత్ర విసర్జన చెయ్యాలనడంతో ఫ్లాట్ ఫారం దిగి పక్కనున్న కాళీ భోగీ వైపు తీసుకెళ్లి బేగె తిరిగిరమ్మని చెప్పి వెనక్కి వచ్చేడు దేవయ్య. మూత్ర విసర్జన తర్వాత అప్పలకొండ కంపార్టుమెంటు బయటకు వచ్చి తొందరలో ముందు నుంచి కాకుండా వెనుక వైపు నుంచి దిగింది. అప్పుడే అటువైపు ఫ్లాట్ ఫారం మీద ట్రైను కదలపోతోంది.
తమ వాళ్లు అక్కడ కనిపించక పోవడంతో రైల్లో ఎక్కేసి ఉంటారని వెనక ముందు చూడకుండా కనబడిన భోగీలో ఎక్కేసింది. ట్రైను స్పీడందుకుని ఫ్లాట్ ఫారం దాటేసింది.
ఇటువైపు ఫ్లాట్ ఫారం మీద దేవయ్య ఎక్కవల్సిన రైలు రావడంతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. మిగతా ఊరి వారు సామాన్లతో జనరల్ భోగీ వైపు పరుగులు తీసారు.
దేవయ్య కొడుకును ఎత్తుకుని సామాన్లు పట్టుకుని ఊరి వాళ్లతో పాటు రైలు పెట్టెలోకి చేరి పెళ్లం అప్పలకొండ కోసం ఎదురు చూస్తున్నాడు. రైలు కదలడంతో గాబరా పడుతున్న దేవయ్యకు భార్య గుర్తులు చెప్పి వచ్చే స్టేషన్లో దిగి పోలీసు కంప్లైంటు ఇవ్వమని తోటి ప్రయాణికులు సలహా ఇచ్చారు.
భయంతో అప్పలకొండ కోసం గాబరా పడుతు కొడుకును ఊరి వాళ్లకు అప్పగించి తర్వాతి స్టేషన్లో దిగి అక్కడి పోలీసు స్టేషన్లో జరిగిన విషయం చెప్పి తన పెళ్లాన్ని ఎలాగైన వెతికి అప్పగించమని బతిమాలుకున్నాడు దేవయ్య.
రైల్వే పోలీసులు అప్పలకొండ విజయవాడ ఫ్లాట్ ఫారం మీద తప్పిపోయినందున అక్కడి స్టేషన్లో రిపోర్టు చెయ్యమని వాపసు పంపించారు. ఎప్పుడూ బస్సు ప్రయాణమే కాని రైలు ప్రయాణం చెయ్యని దేవయ్యకు ఏం చెయ్యాలో తోచడం లేదు.
అయోమయ పరిస్థితిలో విజయవాడ రైల్వే స్టేషనుకి చేరిన దేవయ్య అప్పలకొండ గుర్తులు , వయస్సు వివరాలు చెప్పగా ఎంత ప్రయత్నం చేసినా ఆచూకీ దొరకలేదు. ఎవరైన కిడ్నాప్ చేసేరేమోనని అన్ని స్టేషన్లకు సమాచారం అందించారు పోలీసులు.
దేవయ్యకు విజయవాడ స్టేషన్లో వారం రోజులు గడిచి పోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పలకొండ ఆచూకీ లభించలేదు. ఆచూకీ తెలిస్తే మీ దగ్గరి పోలీసు స్టేషనుకి తెలియ చేస్తామని నమ్మకం కలిగించి ఊరి వివరాలు ఎడ్రసు తీసుకుని ఇంటికి పంపించారు.
అప్పలకొండ లేకుండా ఒంటరిగా పెరిగిన గెడ్డం మాసిన బట్టలు నీరసించిన శరీరంతో ఊరికి తిరిగి వచ్చిన దేవయ్యను చుట్టు ముట్టి ఆందోళనగా విషయం అడిగారు
ఊరి జనం, బంధువులు.
దేవయ్య బోరున ఏడుస్తు పెళ్లాం ఆచూకీ దొరకలేదని అక్కడి పోలీసోల్లకి అర్జీ ఇచ్చినానని, దొరికిన ఎంటనే కబురు చేస్తామన్నారని " వివరాలు చెప్పేడు.
ఊరి జనం దేవయ్యను ఓదార్చి దైర్యం చెప్పేరు. కొడుకు కొండడిని పెద్దయ్య వద్ద ఉంచినారు. రోజులు గడుస్తున్నాయి. అప్పలకొండ ఎక్కడ ఎలా ఉన్నదీ ఆచూకీ తెలియలేదు. విజయవాడ రైల్వే పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దేవయ్య దగ్గరి పోలీసు స్టేషనుకెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోయింది.
అప్పలకొండ విజయవాడ రైల్వే స్టేషనులో తప్పిపోయి ఇరవై సంవత్సరాలు గడిచి పోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పలకొండ ఆచూకీ తెలియక పోవడంతో చచ్చిపోయి ఉంటుందని , చిన్నోడు కొడుకు కొండడి కోసమైనా మరో లగ్గం చేసుకోవాలని పెద్దోళ్లు నచ్చ చెప్పడంతో బంధువుల్లో మరో అమ్మాయితో దేవయ్య మనువు జరిగింది. ఆళ్లకి ఒక కూతురు పుట్టింది. దానికి కొండమ్మగా పేరు పెట్టేరు. కాలగమనంలో అప్పలకొండను అందరూ మరిచిపోయారు.
*
ఇరవై సంవత్సరాల క్రితం విజయవాడ రైల్వే స్టేషనులో పొరపాటున ఉత్తరాది వైపు వెళ్లే సూపర్ ఫాస్టు ట్రైను ఎక్కిన పల్లెపడుచు అప్పలకొండ అయోమయంలో పడింది. రైలు జనంతో కిటకిటలాడుతోంది.
అప్పలకొండ , దేవయ్య కోసం తనవాళ్ల కోసం పెట్టె అంతా వెతికినా ఎవరూ కనబడలేదు. ఎవర్ని అడిగినా ఏమీ చెప్పడం లేదు. ఏదో భాష మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏమి మాట్లాడుతున్నదీ అప్పలకొంబకు తెలియడం లేదు. రైలు జోరుగా ముందుకు పోతోంది. గంటలు గడిచి పోతున్నాయి.
రాత్రి అయింది. జనాలు ఒకరి మీద ఒకరు జోగుతు నిద్రలో ఉన్నారు. టాయిలెట్లు దగ్గర ఒక మూల అప్పలకొండ భయపడుతు ఒదిగి కూర్చుంది.
తెల్లారింది. ఏదో స్టేషనులో రైలు ఆగింది. ఫ్లాట్ ఫారం సందడిగా ఉంది. ఏదో భాష మాట్లాడుకుంటు జనాలు పరుగులు పెడుతు ఎక్కేవారు ఎక్కుతున్నారు. దిగేవారు
దిగుతున్నారు.
మద్యాహ్నానికి పెద్ద జంక్షనకి వచ్చి ఆగింది. ప్రయాణికులు ఫ్లాట్ ఫారం మీద తినుబండారాల కోసం ఎగబడుతున్నారు. రైలు ఎటువెల్తున్నదీ తెలియక అయోమయంలో పడింది అప్పలకొండ. రాత్రి నుంచి కడుపులో ఏమీ లేక నకనక లాడుతోంది.
కొంతమంది ఆడ మగ సాధువులు కాషాయ వస్త్రధారణలో రైలు పెట్టెలోకి ప్రవేశించారు. లోపల స్థలం లేక వారు టాయిలెట్ దగ్గర కూర్చున్నారు. వారిలో ఉన్న ఒక సన్యాసిని అప్పలకొండ పక్కన కూర్చుంది.
ఆమె హిందీలో ఎక్కడ నుంచి వస్తున్నావని అడిగింది. భాష తెలియక అప్పలకొండ ఏమీ సమాధానం చెప్పలేదు. సన్యాసిని తన వెంట తెచ్చుకున్న పూరీలు, రొట్టెలు పేకెట్టు విప్పి రొట్టెలు కూర ఆకులో పెట్టి తినమని అప్పలకొండ చేతిలో పెట్టింది.
అన్నం, దుంపలు తేగలు తినే అప్పలకొండ వాటిని చూసి వద్దని చేతితో చెప్పింది. అప్పలకొండ కట్టుబొట్టు మాటతీరును బట్టి దక్షినాది మహిళగా భావించి దగ్గరున్న అరటిపళ్లు తినమని ఇచ్చింది. ఆకలితో ఉండటంతో భయపడుతునె అరటిపళ్లు తీసుకుని తింది. సన్యాసిని తన దగ్గరున్న చెంబులో నీళ్లు తాగించింది.
అప్పలకొండకు ప్రాణం లేచి వచ్చినట్టైంది. సాయంకాలానికి ట్రైను ఋషికేశ్ పుణ్య క్షేత్రానికి చేరుకుంది.
అంతవరకే ట్రైను ప్రయాణం. ఇంక ముందుకు వెళ్లదు. జనంతో పాటు సాధుగణం అందరూ రైలుపెట్టె దిగి బయటకు వస్తున్నారు.
ఆ మద్రాసి మహిళ ఎవరో ఎక్కడికి వెళుతుందో తెలియక సన్యాసిని చేతి సంజ్ఞతో రైలు ఇక్కడితో ఆగిపోతుందని తనతో ఆశ్రమానికి రమ్మని చెప్పింది. ఏమి చెయ్యడానికి తెలియక ఆ సన్యాసిని వెంట ఆశ్రమానికి బయలు దేరింది అప్పలకొండ.
కొద్ది దూరం ప్రయాణించి బాబా రాందేవ్ నడుపుతున్న ఋషీకేశ్ ఆశ్రమానికి సాధు సమూహం చేరుకుంది. వారితో పాటు అప్పలకొండను ఆశ్రమానికి చేర్చేరు. అక్కడి పెద్ద సాధువుకు విషయం చెప్పి అనాధ మహిళగా ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి కాషాయ వస్త్రాలు ధరింపచేసేరు.
అప్పలకొండకు కొత్త ప్రదేశం కొత్త మనుషులు తెలియని భాష అంతా అయోమయంగా ఉంది. భాషే కాదు తిండి కూడా రోజూ తను తినే పద్దతిలో లేదు. అక్కడి వారు సంజ్ఞలతో ఏదో చెబుతున్నారు.
రోజులు గడుస్తున్నాయి. అప్పలకొండ తనలో తాను మాట్లాడుకుంటు కొడుకు కొండడిని పెనిమిటి దేవయ్యను తలుచుకుంటోంది. ఎవరో మానసిక వికలాంగురాలిగా భావించి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఆశ్రమ నిర్వాహకులకు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో బంధువులు ఎవరైన ఉన్నదీ లేనిదీ వివరాలు తెలియడం
లేదు.
ఎందరో పరాయి రాష్ట్రాల యాత్రికులు ఋషీకేశ్ వచ్చి తప్పిపోతుంటె పోలీసుల సాయంతో వారి బంధువులకు అప్పగించడం జరుగుతోంది. కాని గిరిజన మహిళ అప్పలకొండ వివరాలు మాత్రం తెలియడం లేదు.
అప్పలకొండ ఆశ్రమానికి వచ్చి సంవత్సరాలు గడిచిపోయాయి. జుత్తు జడలు కట్టి ఇంటి మీద బెంగతో చిక్కి శల్యమై తనలో తనే మాట్లాడుకుంటు అక్కడి తిండి నప్పకపోయినా అయిష్టంగానే రోజులు గడుపుతోంది. అందరూ పిచ్చిదానిగా చూస్తున్నారు.
ఆశ్రమంలో ఒకరిద్దరు పురుష సిబ్బంది ఆమెను బలత్కారం చెయ్యబోతె తప్పించుకుని అప్పటి నుంచి మగవాళ్లను దగ్గరకు రానీయడం లేదు.
కొద్ది రోజుల తర్వాత ఆశ్రమ సేవాకార్యక్రమాలకు నిధులు మంజూరు చెయ్యడానికి ప్రభుత్వం తరపున కొందరు ప్రొబేషనరీ ఐఎయస్ ట్రైనీలు ఆశ్రమ దైనందిన సేవలు తెలుసుకోవడానికి వచ్చి నిర్వాహకులతో అన్ని విభాగాలను సందర్శిస్తున్నారు.
అప్పలకొండ ఉన్న విభానికి వారు వచ్చినప్పుడు చూపుతు ఈమె ఎవరో ఏ ప్రాంతమో మాట్లడే భాష ఏదో తెలియదని హిందీలో వివరిస్తున్నారు.
అప్పలకొండ తన వాడుకభాష తెలుగులో ఏదేదో మాట్లాడు కుంటోంది. ఆ ట్రైనీ ఐఎయస్ లలో తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. అతను ఆమె మాటలు విని నీది ఏ ఊరు, బంధువులెవరని తెలుగులో అడిగేసరికి అప్పలకొండ మొహంలో కళ వచ్చింది.
ఎన్ని సంవత్సరాల తర్వాత తన భాషలో మాట్లాడే మనిషి కనబడ్డాడని మురిసిపోయింది.
తన పెనిమిటి దేవయ్య ఎలాగున్నాడు, బుడ్డోడు ఎలాగున్నాడని ఒకటే ప్రశ్నలు. ఆశ్రమ నిర్వాహకులు ఇన్ని సంవత్సరాలకు అప్పలకొండ వివరాలు తెలిసాయని ఊపిరి పీల్చుకున్నారు.
ఆ యువ ఐఎయస్ ట్రైనీ మెల్లగా అప్పలకొండను ఓదార్చి ఊరి పేరు, దగ్గరి టౌను ఎలా ఇక్కడికి వచ్చింది విషయాలు రాబట్టి లోకల్ పోలీసుల ద్వారా విజయవాడ రైల్వే పోలీసులను, డొంకరాయి మండల పోలీసుల ద్వారా చుంచుకొండ గ్రామ వివరాలు తెలుసుకోగలిగాడు.
చివరకు చుంచుకొండ గ్రామంలో దేవయ్య , ఇరవై ఏళ్ల కొడుకు కొండడిని గుర్తించింది. నలబై ఏళ్ల వయసులో సరైన పోషణ లేక పిచ్చిదానిలా శల్యావస్థలో చచ్చిపోయిందనుకున్న అప్పలకొండ బతికే ఉన్నందుకు బంధువులు, గ్రామంలో వారు ఆనందపడ్డారు. ఇరవై సంవత్సరాల తర్వాత తన వాళ్లను చూసిన అప్పలకొండ తేరుకుంది.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
కందర్ప మూర్తి గారి "ఎడబాటు" ... కళ్ళలో నీళ్ళు తెప్పించాయి.
కానీ ఒక ఆశ్చర్యకర విషయం ... సాధువులు రైల్వే పోలీస్ లేక ఇతర పోలీసులకు చెబితే వారే ఆ మనిషి యొక్క మాట్లాడే భాష గురించి ఆచూకీ తీస్తారు కదా. ... ఎవరో ఒక దక్షిణాది మనిషిని పట్టుకుని? ... మరి ఏళ్లకేళ్ళ వరకు ... ఒక తెలుగు ఐ. ఎ. ఎస్ మనిషి వచ్చే దాకా ఆగాలా? ... అయినా సుఖాంతం చేశారు. కళ్ళు చెమర్చాయి.
పి.వి.పద్మావతి మధు నివ్రితి