top of page

ఎదను తాకే కవితలు

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #ఎదనుతాకేకవితలు, #EdanuTakeKavithalu, #EdaMeetinaRagalu, #TeluguReviewsOnBooks

Edanu Take Kavithalu - Review of Palla Venkata Ramarao on the book of poems 'Eda Meetina Ragalu' written by Kasivarapu Venkata Subbaiah

కవికి మనుషులతో, సమాజంతో గాఢానుబంధం ఉండాలి. జీవితంలోని లోతైన పార్శ్వాలను చూడగలిగి ఉండాలి. ఆ గాఢ అనుభవాలతో ఒకలాంటి తాత్వికత అలవడుతుంది. అది ఉత్తమ కవితగా మారడానికి దోహదపడుతుంది.కవి , రచయిత శ్రీ కాశీవరపు వెంకట సుబ్బయ్యకు సమాజం లోని వివిధ వర్గాలతో, వ్యక్తులతో మంచి అనుబంధం ఉంది.వివిధ సందర్భాల్లో, వివిధ అవస్థలలో తాను పొందిన అనుభవాలు,అనుభూతులు అతన్ని కవితా రచనకు పురికొల్పాయి.ఆ కవితల సమాహారం 'ఎద మీటిన రాగాలు' అనే సంపుటి.


కవికి సూక్ష్మ పరిశీలన ఒక లక్షణం.ఆ లక్షణాన్ని పునికి పుచ్చుకున్న వెంకట సుబ్బయ్య కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా ఆయుధం మనిషికి ఎలా అవసరపడిందీ, పుట్టుక నుంచి చావు దాకా అతని అవసరాలు ఎలా తీర్చిందీ, అతనికి సర్వావస్థల్లో ఎంత ధైర్యాన్ని ఇచ్చిందీ 'మనిషి- ఆయుధం' అనే కవితలో విశదీకరించారు.


అనాదిగా అవిచ్ఛిన్నంగా వస్తున్న

మనిషి ఆయుధం అనుబంధం

పునః పునః ప్రారంభమవుతుంది

ఎడతెగని సహవాస బంధం

కొనసాగుతూనే ఉంటుంది


కవి మానవ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులే కాకుండా స్నేహితులు, పరిచయస్తులు, సాహితీ మిత్రులకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. తనకు ఉపకారం చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపాలన్నది వారు విధించుకున్న నియమం. ఆ కోవలో రాసిన కవితే అగస్త్యభ్రాత. తనకు సాహితీ ప్రస్థానానికి తొలి అడుగులో దోహదపడిన ఒక సాహితీ మిత్రుని అనుబంధ చిత్రణే అగస్త్యభ్రాత కవిత.ఆ మిత్రుడు ఎవరో మనకు తెలిసినా ఆయన తన ఉనికిని బయట పెట్టవద్దన్నారు కాబట్టి మనం కూడా దానికి కట్టుబడాలి.


"అతని రాక కోసం

నా ఇంటి గవాక్షం గుండా

చూపుల వర్షం కురిపిస్తాను

అతను రాని రోజు

నా గుండె బండై బరువెక్కుతుంది "

అనాలంటే ఎంత ఆత్మీయత అనురాగాలు ఉండాలి.


సామ్యవాదిని అని చెప్పుకున్న వెంకటసుబ్బయ్య ప్రజాస్వామ్యవాది. మానవతావాది.


'ఏటిపై నీటి ప్రాజెక్టు' కవితలో అభివృద్ధి రథచక్రాల కింద నలిగిపోయే దీనుల చిత్రణ ఉంది. ఒకవైపు అభివృద్ధికి హర్షధ్వానాలు వినపడుతుంటే మరోవైపు అందుకు కారణమై త్యాగాలు చేసిన వారు నిశ్శబ్ద వేదనను అనుభవిస్తుంటారు. కవి ఆ కోణాన్ని తడిమి చూశారు ఈ కవితలో.ఈ అవస్థను వైపరీత్యంగా అభివర్ణించారు.


మరొక కవితలో మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తిని ప్రశ్నిస్తూ

నువ్వు విచక్షణారహితంగా ప్రవర్తిల్లుతూ

ఇతర వ్యక్తుల్లో విచక్షణా సహితాన్ని ఆపేక్షించడం

ఏ నీతి తత్పరతకు కొలబద్ద?

(స్వాతిశయం)


అంటారు వెంకట సుబ్బయ్య. ఈ కవితలో మనుషుల్లో ఉన్న అవలక్షణాలు అన్నింటినీ ఎండగట్టారు.


స్త్రీని ఇతివృత్తంగా స్వీకరించిన మరొక కవితలో మహిళల సమస్యలను గొప్పదనాన్ని ఆమూలగ్రహం చర్చించారు.

ఆమె అనంత యుగాల నుండి సేవైక భావాన్ని

నిలువెల్లా నింపుకొని కారుణ్యతను బోధిస్తూ

సమాజ సముద్ధరణకు

సగభాగం బాధ్యతను స్వీకరిస్తూ వస్తూ ఉంది

(రూపు దాల్చిన సహనం)


ప్రతి కన్నతండ్రి ఆవేదనను ప్రతిబింబిస్తూ రాసిన కవితే 'జీవన పోరాటం'. బ్రతుకుతెరువు అన్వేషణలో కొడుకు పడే కష్టాన్ని తాను అనుభూతిస్తూ..

జనారణ్యపు ఎడారుల్లో

బేహార్ల గుంపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ

ప్రతిభ తూకాలకు జ్ఞాన కొలతలకు

ప్రాణాలు ఉగ్గబట్టి పోరాడుతున్నావా

అంటూ అడుగుతాడు.


నిబ్బరం సడలి స్థిరత్వం కోల్పోకు

ఏకాగ్రత సంధించుకొని ఉక్కు సంకల్పంతో ఉద్యమించు

నిరాశ నిస్పృహ నిర్లిప్తత నిర్వేదాన్ని విసర్జించు

కసి కృషితోనే విజయం సొంతమని గ్రహించు

అంటూ కర్తవ్యాన్ని ఉద్భోదిస్తాడు కూడా.


ఎదమీటిన రాగాలు కవితలో

ఒక అపురూప వాక్యం పురుడు పోసుకుంటున్న

సమయంలోనే నిత్య కృత్య కర్తవ్యం

దాని గొంతు నులిమేసి విధినిర్వహణ వైపు

బయలుదేరి పోతుండడాన్ని అనుభవిస్తుంటాం

అనడం కాలం కర్కషత్వాన్ని, కవి అసహాయతను ప్రతిఫలిస్తుంది. ఇది ప్రతి కవికి అనుభవైకవేద్యమే. ఒక కవిత పుట్టడానికి కవి ఎంత ప్రసవ వేదనపడతాడో ఈ కవిత తెలియజేస్తుంది.


మనకు రోజు ఎదురయ్యే మనం పట్టించుకోని,కలికాలంలే అని మనసును సముదాయించుకొని వెళ్లే కొన్ని అన్యాయాలపై గళం ఎత్తుతూ

పొరుగువాని పెళ్ళాం సక్కంగుందని

కన్నేయడం దుర్మార్గం అన్నా!


ఎనకింటోన్ని వేధించి ఏడిపించి

వెళ్ళగొట్టడం న్యాయం కాదన్నా!


న్యాయం కోసం దగ్గరికి వచ్చినోన్ని

నిండా ముంచడం ధర్మం కాదన్నా!


ఆదరించినోన్ని సహకరించినోన్ని

వెన్నుపోటు పొడవడం సబబు కాదన్నా!


అని

నీ పద్ధతి మార్చుకోకుంటే నీకే ప్రమాదం అన్నా!

(మంచిది కాదన్నా!)

అంటూ తీవ్రంగా హెచ్చరిస్తాడు.


సంఘంలోని లోపాలపై ఎంత అసహనం ఉన్నా....

నిదానించు నిమ్మలించు!

నిర్వేదాన్ని వీడి ఒకింత ఆలోచించు!

కాదనను బ్రతుకు మార్గం దుర్గమమే

అయినా పయనం సుగమమే

అందుకు కావలసిందల్లా

సంయమనం సమయస్ఫూర్తి

సందర్భోచిత ప్రవర్తన

(ఒకింత ఆలోచించు!)

అంటూ కర్తవ్యం కూడా బోధిస్తాడు.


సమాజంలోని బంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్న కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని రుజువు చేస్తూ సమాజంలో జరిగే కొన్ని అనైతిక సంఘటనలను ఉదాహరిస్తూ చెప్పిన కవిత పాఠకుల్ని ఒకింత ఆలోచింపచేస్తుంది.

జాగ్రత్త మిత్రమా!

వంచనా శిల్పులు ద్రోహచింతనాపరులు తప్ప

అభిమానులు ఆత్మీయులు అరుదు సుమా!

(నేస్తమా! జాగ్రత్త సుమా!)


ఈ కవిత చదువుతుంటే వర్తమానంలో మనకు ఎదురయ్యే మనుషులందరూ జ్ఞాపకం వస్తారు. మన జీవిత అనుభవాలు గుర్తుకు వస్తాయి.

బ్రతుకు మంత్రం కవితలో

మూసుకున్న త్రోవలలో పయనం

విఫలమై వెతలు చుట్టుముట్టి

ఊపిరి సలపనీయవు

బతుకు భయం దేహపర్యంతం ప్రాకి

ప్రమోదం నుంచి

ప్రమాదంలోకి నెట్టుతుంది

అంటూ జీవితంలో అందరి చేత మోసగింపబడి చివరికి ప్రాయోపవేశం దాకా వెళ్లి అనుభవజ్ఞుడు ఎవరో ఎదురుపడితే జీవితతత్వాన్ని బోధిస్తే ఇంటి వైపు మళ్లుతాడు.


జీవన భద్రతపై సందేహాలు బ్రతుకు భయాలు ప్రతి వ్యక్తికి సహజమైపోయిన నేటి కాలంలో ఈ కవిత పాఠకున్ని ఆకర్షిస్తుంది.


ఈ కవి సమాజంలోని దురాచారాలు, ద్వంద్వ ప్రవృత్తులు,అసమానతలు, అసహాయతలు వంటి వాటిపై విల్లు ఎక్కువ పెట్టినా భవిష్యత్తుపై ఆశాభావం ఉంది.

మనసులన్నీ మరుమల్లెలై

వికసించాలే గాని

మానవత మధుర ఫలాలివ్వదనే

సంశయానికి తావెక్కడిది

అంటాడు. రేపటి ఉదయం పై ఎంత భరోసా లేకపోతే ఈ మాట అంటాడు.


తన చివరి కవిత 'గమ్యం లేని గమనం'లో మానవుని అనేక దశలను వర్ణించి ఎంతో చేయాలనుకుని ఏమి చేయలేక నిరాసక్తితో చివరికి నిరర్థకంగా జీవితాన్ని ముగించే సామాన్య మానవుడి అవస్థను వర్ణించాడు. జీవితాన్ని స్తబ్దుగా ముగించకుండా ఏదో ఒక విజయం సాధించాలని చెప్పకనే చెప్పారు.

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు తన 54 కవితలలో 54 విభిన్న కవితా వస్తువులు స్వీకరించి తన జీవితానుభవాలతో పాటు వర్తమాన సామాజిక స్థితిగతులను ప్రతిభావంతంగా చిత్రీకరించారని చెప్పవచ్చు. వారి కవితా యాత్ర ఇదే విధంగా ముందుకు సాగుతూ మరొక సంపుటితో మనల్ని పలకరిస్తారని ఆశించవచ్చు..

-----------


-పల్లా వెంకట రామారావు


35 views0 comments

Comments


bottom of page