'Edi Bandham - Part 1/2' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao
Published In manatelugukathalu.com On 21/08/2024
'ఏది బంధం - పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం
రచన: వారణాసి భానుమూర్తి రావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
ఓ ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్ లో మాస్టర్ చెక్ అప్ కోసం క్యూ లైన్లో నిలబడ్డాను. ఉదయం ఏడు గంటలవుతోంది. అప్పటికే క్యూ లో పది మంది ఉన్నారు. అక్కడ మాస్టర్ చెక్ అప్ కి ప్రయర్ అపాయింట్ మెంట్ లేదు. ఎవరు ముందు వస్తే వారు డబ్బులు చెల్లించి ఆ పరీక్షలు చేయించు కోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, రెండు గంటల తరువాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ టెస్ట్, ఎచ్ బీ ఏ1, సి, సీ పీ యు, యూరిన్ టెస్ట్, ఈ సీ జీ, టీ ఏం టీ, అల్ట్రా సౌండ్ లివర్ టెస్ట్, బీ పీ, చెస్ట్ ఎక్స్ రే లాంటి పరీక్షలు చేయించుకొనే సరికి మధ్యాహ్నం 12 గంటలవుతుంది. అప్పుడే నాకు కాళ్ళు లాగు తున్నాయి. నా వయసు 35 ఏళ్ళు. అయినా నీరసం. ఈ సాఫ్ట్ వేర్ వుద్యోగాలు వచ్చాక, జీవితం అంటే రోత పుడుతోంది. లాప్ టాప్ లో ప్రొగ్రాములు చెయ్యడం తోనే పగలు, రాత్రి పూట ఇక క్లయింట్స్ కాల్స్, తరువాత బాస్ తో డిస్కషన్లు, సబార్డినేట్స్ తో అసైన్ మెంట్స్ గురించి జూమ్ మీటింగులతోనే అర్ద రాత్రి దాటిపోతుంది. ఈ జీవితాలకు క్షణం గూడా తీరిక లేదు. తిండి మీద ధ్యాస లేదు. నిద్ర కరువయింది. ఇంటిలో పెళ్ళాం, పిల్లలతో ఆప్యాయంగా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులయిందో?
సాఫ్ట్ వేర్ వుద్యోగంలో లక్షల్లో జీతాలుంటాయని ఇంజినీరింగ్ లో చేరడానికి లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించాడు మా నాన్న. ఆయన ఐ ఐ టి కి టార్గెట్ చేశాడు. కానీ ఐ ఐ టీ లో సీటు రాలేదు. స్టేట్ ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. పేరున్న ప్రైవేటు కాలేజీలో సీటు వచ్చింది. మంచి రాంక్ తోనే ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఫైనలియర్ లో ఉండ గానే కాంపస్ సెలెక్షన్ అని తన్నుకు పొయ్యారు కొన్ని పేరొందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు. అప్పటి నుండీ ఈ వెట్టి చాకిరీకి సడలింపు లేదు. కనీసం మనిషికీ, మర యంత్రానికీ తేడా లేదు. మనుషుల్ని మర యంత్రాల కన్నా హీనంగా వాడుకొంటున్నాయి ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలు. మానవతా విలువలు సున్నా! ఎంతసేపూ డబ్బుతో మెజర్ చేస్తూ దారుణంగా వుద్యోగస్థుల్ని హింసిస్తున్నారు. మధ్య మధ్య లో లే ఆఫ్ ల భయం. ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో తెలీదు. అసలు ఈ వుద్యోగాలకు జాబ్ గ్యారంటీ లేదు. ఎప్పుడు వుంచుతారో, ఎప్పుడు తీసేస్తారో తెలీదు.
కౌంటర్ లోకి హాస్పిటల్ స్టాఫ్ వచ్చారు. చక చక మని డెస్క్ టాప్ లు ఓపెన్ చేసి, బిల్ల్స్ ప్రింట్స్ ఇస్తూ, జీ పే, క్రెడిట్ కార్డు లేదా కాష్ తీసుకొంటూ ఒక్కొక్కరినే బ్లడ్ టెస్ట్ కి, యూరిన్ సాంపిల్ కి పంపిస్తున్నారు.
నా వంతు వచ్చింది.
అంతలో మా వెనకాల ఒక ఓల్డ్ ఏజ్ కపుల్ వుంది. వారు నిలబడ లేక పోతున్నారు. ఆ అంకుల్ వయసు సుమారు 75 ఏళ్ళు, అమ్మ గారి వయసు 70 ఏళ్ళు వుండొచ్చు. నాకు వారిని చూస్తూనే చాలా ఫీలయ్యాను. చాలా బాధ అనిపించి, వారి దగ్గరకు వెళ్ళి పరామర్శించాను. వారు గూడా కొన్ని అత్యవసర పరీక్షల కోసం వచ్చారని తెలుసు కొన్నాను. వారిని నేనున్న చోటికి తీసుకు వచ్చి నిలబెట్టించాను. వెనుక నిలుచున్న వారు నన్ను ఎగా దిగా చూస్తున్నారు. కౌంటర్ దగ్గరకి వెళ్ళి, హాస్పిటల్ స్టాఫ్ తో వాగ్వాదానికి దిగాను.
"వయసు మళ్ళిన సీనియర్ సిటిజన్లకు ఇదేనా మీరు ఇచ్చే ట్రీట్ మెంట్?" అని గద్దించాను.
"వారికి ప్రత్యేక కౌంటర్ వుండాలి గదా? అది ఎందుకు లేదు?” అని మళ్ళీ గట్టిగా అరచాను.
వారి దగ్గర నుండి సమాధానం లేదు.
వెంటనే అక్కడున్న రెసిడెంట్ మేనేజర్ ని పిలిపించి వివరించాను. వారికి సపరేట్ కౌంటర్ ఎందుకు పెట్ట లేదు అని అడిగాను.
ఆమె నాకు సారీ చెప్పి నేరుగా ఆ వృద్ధ దంపతుల్ని తీసుకు వెళ్ళి కౌంటర్ లో డబ్బులు కట్టించి ఫైల్ అందించింది.
వారిని బ్లడ్ సాంపిల్స్ ఇవ్వడానికి ఇంకో రూం కి వెళ్ళమంటూ రూం నెంబర్ చెప్పింది. ఇక వారి వల్ల గాదని నేనే వారిని దగ్గరుండి నడిపించు కొంటూ బ్లడ్, యూరిన్ సాంపిల్ ఇప్పించాను. అప్పటికే వారికి ఆయాస మొస్తోంది.
"ఆమ్మా.. ఈ మధ్య ఇంటికే వచ్చి గూడా పరీక్షలు చేస్తారు. మీరెందుకు ఇంత శ్రమ పడి డైరెక్ట్ గా వచ్చారు. చూడండి మీరెన్ని బాధలు పడుతున్నారో!" అని అంకుల్ గారి కోసం వీల్ చేర్ ఒకటి అభ్యర్థించాను. వెంటనే హాస్పిటల్ స్టాఫ్ వారు వీల్ చేర్ తెచ్చి ఇచ్చారు.
"ఔట్ పెషంట్స్ కి వీల్ చేర్ అడిగితేనే ఇస్తారండీ !" అన్నాడు ఆ వీల్ చేర్ అబ్బాయి.
ఏడిసారులే ! అని మనసులో అనుకొని, నేనేమీ మాట్లాడ లేదు.
"బ్రేక్ ఫాస్ట్ చేసి రెండు గంటల తరువాత వస్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్ తీసుకొంటాము. బ్రేక్ ఫాస్ట్ కోసం బేస్ మెంట్ లో ఉన్న కాంటీన్ కి వెళ్ళాలి" అన్నాడు కౌంటర్ లో ఉన్న కాషియర్.
వారిని లిఫ్ట్ దగ్గరకు తీసుకు వెళ్ళి మా రెండవ ఫ్లోర్ నుండి బేస్ మెంట్ కి వారిని తీసుకు వెళ్ళాను.
లక్కీ గా వీల్ చేర్ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు.
వారికి కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ ఇప్పించాను. ఏదో ఇడ్లీ, వడ మరియు కాఫీ తీసుకొన్నారు.
వారు నా పట్ల కృతజ్నతా భావంతో చూస్తున్నారు. ఏమిటో వారిని చూస్తూనే నాలో ఒక ఆరాధనా భావం కలుగుతోంది. చనిపోయిన నా తల్లిదండ్రులను చూసుకొన్నట్లే ఉంది. అనారోగ్య కారణాల వలన తన తల్లిదండ్రులు ఇరువురూ ఈ మధ్యనే చనిపొయ్యారు. వారికి పూర్ణాయస్సు ఇవ్వలేదు ఆ విధాత.
"బాబూ.. మీరు వెళ్ళండి. మా కోసం మీ టైంని వేస్ట్ చేసుకోవద్దండి. మీరు గూడా బ్రేక్ ఫాస్ట్ చెయ్యండి" అని ఆ అంకుల్ అన్నాడు.
అప్పటికి గానీ నేనెందుకు ఆ హాస్పిటల్ కొచ్చానో నాకర్థం అయింది.
"నేను గూడా మాస్టర్ హెల్త్ చెక్ అప్ కొచ్చాను. కౌంటర్ లో డబ్బు ఇంకా కట్ట లేదు. అందుకే ఫ్రీగా ఉన్నాను. నేను రేపో ఎల్లుండో మళ్ళీ వస్తాను లేండి అంకుల్. ముందు మీ టెస్ట్ లు కానియ్యండి" అని అన్నాను.
నేను గూడా చక చక మని బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని వారిని తీసుకొని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాను. ఆసుపత్రి లిఫ్ట్ లు భారీ సైజ్ లో ఇరవై ముప్పై మంది పట్టేటట్లు ఉంటాయి. అందులోనూ పేషంట్లను, వారి స్టెచర్స్, వీల్ చేర్స్ పట్టాలంటే చాలా పెద్ద లిఫ్టులు వుండాలి. అందులోనూ అవి నిదానంగా కదులు తాయి. లిఫ్ట్స్ క్రిక్కిరిసి వుంది పేషంట్లతో, అటెండంట్లతో మరియు సిస్టర్స్ తో.
ఫ్లానింగ్ లేని ఆసుపత్రులు. ఇలాంటి పరీక్షలు చేసుకొనే వారి కంతా అన్ని టెస్ట్ లు కలిపి ఒకే ఫ్లోర్ లో ఎందుకు పెట్టరు? తొలిసారిగా నాకీ కార్పొరేట్ హాస్పిటల్ మీద చాలా కోపం వచ్చింది.
కాంటీన్ నుండి వారిని ఒకటవ ఫ్లోర్ లో ఉన్న ఈ సీ జీ, చెస్ట్ ఎక్స్ రే లు ముగించాను. వారిని మళ్ళీ మూడవ అంతస్థు లో ఉన్న నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కి తీసుకు వెళ్ళి అల్ట్రా సౌండ్ చేయించాను.
ఈ టెస్ట్ కి చాలా సేపు పట్టింది. ఒక లీటర్ నీళ్ళు తాగిన తరువాత బ్లాడర్ ఫుల్ అవుతే తప్ప ఈ టెస్ట్ చెయ్యరు. ఒక గంట తరువాత సిస్టర్ వీరిద్దరినీ పిలిచారు.
అల్ట్రా సౌండ్ టెస్ట్ ముగించడానికి అర్ద గంట పట్టింది. మళ్ళీ వారిని రెండవ అంతస్థు లో ఉన్న బ్లడ్ టెస్ట్ లాబ్ కి తీసుకెళ్ళాను. పోస్ట్ లంచ్ బ్లడ్ టెస్ట్ చెయ్యాలి. ఇంకా అర్ద గంట టైముందన్నారు వారు.
అన్ని టెస్ట్ లు ముగించేసరికి 12 గంటలు దాటింది.
హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి వారు
చాలా అలిసిపొయ్యారు. నీరసంగా వున్నారు.
"బాబూ.. మీకెలా కృతజ్ణతలు చెప్పాలో తెలియడం లేదు. మీ సహాయానికి చాలా థాంక్స్" అన్నారు అంకుల్.
"అంత మాట అనకండి అంకుల్. ఇంతకీ మీరెలా వచ్చారు?" అన్నాను నేను.
"ఆటో లో.. ఏదైనా ఒక ఆటో వెతికి పెట్టు బాబూ!" అని అడిగారు అంకుల్.
"ఈ ఎండలో ఆటోలో వెళ్ళడం కష్టం. నా కార్లో దింపుతాను. రండి!" అని నా కార్లో ఎక్కించు కొన్నాను.
కారు గచ్చి బౌలి లో ఉన్న ఒక కాలనీలోకి అడ్రస్సు చెబితే గూగుల్ మాప్ ద్వారా వారి ఇంటికి చేరు కొన్నాము.
ఇల్లు ఇండిపెండెంట్ హౌస్. చాలా బాగుంది. కానీ చాలా పాత ఇల్లులాగా ఉంది. బయట మొక్కలు. పెద్ద పెద్ద చెట్లు.. విశాలమైన పోర్టికో. తాళం తీసి లోపలికి వెళ్ళాను. పెద్ద హాలు. హాలు నిండా పాత ఫర్నీచరు. విశాల మయిన కిచెన్. పెద్ద పెద్ద బెడ్ రూములు, ఆ రూముల నిండా పాత మంచాలు, వాటి మీద మాట్రెస్ లు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పూల కుండీలు.
"ఇల్లు చాలా బాగుంది అంకుల్" అని నేను అన్నాను.
"ఈ ఇల్లు నేను యాభై సంవత్సరాల ముందు కట్టించాను. అప్పుడు నేను ఇక్కడే యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేస్తూ వుండే వాడిని. అక్కడే రిటైర్ అయ్యాను బాబూ!” అన్నాడు అంకుల్.
"మరి పిల్లలు లేరా?"
"వున్నారు. ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి"
"మరి వారు ఎక్కడ ఉన్నారు?"
"అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు బాబూ!" అన్నారు అంకుల్.
"మరి మీరు గూడా వెళ్ళవచ్చు గదా?"
"అమెరికా లో ఉండడం మా కిష్టం లేదు బాబూ!ఇరవై సార్లు వెళ్ళాము. కానీ నాలుగైదు నెలల కంటే వుండాలనిపించదు. ఏముంది అక్కడ? ఆ క్లైమెట్ గూడా మనకి పడదు. ఎవరు గానీ మాట్లాడే దిక్కు వుండదు. అంతా నిశ్శబ్ధమే! ఒకరితో ఒకరు మాట్లాడే టైముండదు. ఎవరికి వారే బిజీ. మాకా వాతావరణం నచ్చక ఇక్కడే వుండి పొయ్యాం" అన్నారు అంకుల్.
అంతలో అమ్మగారు కాఫీ చేసుకొచ్చి పట్టుకొచ్చారు.
"మీ కెందుకమ్మా శ్రమ?" అని అన్నాను నేను.
"పరవా లేదమ్మా!" అని అమ్మ గారు కాఫీ గ్లాసు అందించింది.
ముగ్గురమూ కాఫీ త్రాగాము.
"అమ్మా! నా పేరు చక్రపాణి. కొండాపూర్ లో నేనూ, నా శ్రీమతి వుంటాము. మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి" అని వారికి నా మొబైల్ నెంబర్ వ్రాసి ఇచ్చి, ఏమైనా పని పడితే ఫోన్ చెయ్యమని, మొహమాట పడవద్దని మళ్ళీ మళ్ళీ చెప్పి వచ్చేశాను. నా కారు కొండా పూర్ వైపు వేగంగా కదిలింది.
ఇంకా ఉంది
‘ఏది బంధం ?’ పెద్ద కథ రెండవ భాగం త్వరలో..
వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.
వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.
వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.
తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.
*వీరి ముద్రిత రచనలు*------------------
1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.
2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .
3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్ నెల 17 వ తేదీ వెలువరించారు. ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు
4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.
5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!
*అముద్రిత రచనలు*
1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.
2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.
3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.
4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.
*విద్యాభ్యాసం*-----------
వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.
ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు. ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు. వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు. ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.
*వృత్తి*------
వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.
వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు;1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ2. సహస్ర కవి రత్న3. సాహితీ భూషణ4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో.5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 20216. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.
@hindudharmamargam2136
• 7 hours ago
కథ చాలా బాగుంది.