'Edi Bandham - Part 2/2' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao
Published In manatelugukathalu.com On 24/08/2024
'ఏది బంధం - పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం
రచన: వారణాసి భానుమూర్తి రావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
జరిగిన కథ:
మాస్టర్ చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన చక్రపాణి అక్కడికి వచ్చిన వృద్ధ దంపతులకు సహాయం చేస్తాడు. తన ఫోన్ నంబర్ వాళ్ళకి ఇచ్చి అవసరమైతే కాల్ చెయ్యమంటాడు.
ఏది బంధం - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఏది బంధం ? పెద్దకథ చివరి భాగం వినండి.
అమెరికాలో సెటిల్ అయిన పిల్లలు. ఇక్కడనే వుండి పోయిన తల్లిదండ్రులు. వయసున్నంత వరకూ తెలియదు గానీ, పిల్లలు ఈ వయసులో దగ్గర లేక పోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనా తీతం. ప్రతి తండ్రి, తల్లి కోరుకొనేది ఒక్కటే. అవసాన దశలో పిల్లలు తమ ప్రక్క ఉండాలని, కానీ విదేశాల్లో సెటిల్ అయిన పిల్లలు ఎలా రాగలరు? పోనీ వచ్చినా ఎన్ని రోజులని వుండగలరు? ఎంతో మంది తల్లిదండ్రులు ఈ మానసిక వ్యధను భరించలేక అనారోగ్యం పాలవుతున్నారు. చివరి క్షణాల్లో నా అనే వారు లేక, తోడు లేక, పిల్లలున్నా అనాధల్లాగా బ్రతుకులు ఈడుస్తున్నారు. దీనికి మార్గం లేదా? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? జీవితమంటే అమెరికా, డాలర్లు సంపాయించడం, లక్జరీ కార్లల్లో తిరగడం, లక్జరీ ఇళ్ళు కొనడమేనా? జీవితమంటే అనురాగం, అప్యాయత, మమత, అయిన వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం, వారితో కలిసి టైం స్పెండ్ చెయ్యడం, వున్నదానితో తృప్తిగా బ్రతకడం కాదా? ఎందుకు ఈ నేటి యువత అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ అంటూ విదేశాలకు పరుగులు పెడుతున్నారు? ఇక్కడ లేనిది, అక్కడ ఉన్నది ఏమిటి? డబ్బేనా జీవితం? డబ్బేనా శాశ్వతం ?
బరువైన హృదయంతో మా ఇల్లు చేరాను. ఇంటికి వెళ్ళగానే శ్రీమతి "ఎందుకు ఇంత లేటయ్యింది?" అని అడిగింది. నేను హెల్త్ చెక్ అప్ చేసుకోలేదని, ఒక ఓల్డ్ ఏజ్ కపుల్ కి తను ఎలా సహాయం చేసిందీ జరిగిన దంతా చెప్పాను. శ్రీమతి గూడా నన్ను సపోర్ట్ చేసింది.
"మంచి పని చేశారు. స్నానం చేసి రండి. లంచ్ రెడీగా ఉంది." అని అంది తను.
నేను స్నానాల గది లోకి దూరి స్నానం చేసి వచ్చి లంచ్ ముగించాను.
మనసంతా బాధగా ఆ అంకుల్, అమ్మగారి మీదనే ధ్యాస పోతోంది. లంచ్ చేసుకొన్నారో లేదో, భోజనం చేశారో లేదో అని ఆలోచిస్తూ మగత లోకి జారుకొన్నాను.
**********************************
పది రోజుల తరువాత
ఒక రోజు నా ఆఫీసులో పని చేసుకొంటున్నాను.
అంతలో నా మొబైల్ మ్రోగింది.
ఫోన్ లో అటువైపు ఒక ఆడ గొంతు ఏడుస్తూ మాట్లాడు తోంది. అది అమ్మ గారి గొంతే!
"ఏమయింది అమ్మా! ఎందుకు ఏడుస్తున్నారు?" గాభరగా అడిగాను.
"అంకుల్.. అంకుల్.. ఇక లేరు బాబూ.. ఆయన నన్ను వదలి వెళ్ళి పొయ్యారు" అని చిన్న పిల్లలా ఏడ్చింది అమ్మ గారు.
"అమ్మా! మీరు బాధ పడకండి. వెంటనే నేనూ నా శ్రీమతి వస్తాము. మీరు అధైర్య పడవద్దు" అని వెంటనే శ్రీమతికి ఫోన్ చేసి విషయ మంతా చెప్పి, రెడీగా వుండమని చెప్పాను.
వెంటనే మా అధికారికి ఈ విషయ మంతా చెప్పి, ఆఫీసు నుండి ఆఘ మేఘాల మీద ఇల్లు చేరుకొని, శ్రీమతి తో పాటు గచ్చీ బౌలి లో ఉన్న అంకుల్ గారి ఇంటికి బయలు దేరాను.
నన్ను చూడగానే అమ్మ గారు బావురు మని ఏడ్చింది. మా శ్రీమతి ఆమెను దగ్గరకు తీసుకొని సముదాయించింది.
"పొద్దున్నే హుషారుగా ఉన్నారు. బ్రేక్ ఫాస్ట్ గూడా చేశారు. బీ పీ, సుగర్ మందులు గూడా వేసుకొన్నారు. పది గంటలు ఆ ప్రాంతంలో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ కుర్చీలోనే వాలి పొయ్యారు. అప్పటి నుండీ వులుకూ లేదు, పలుకూ లేదు" అని అమ్మగారు ఏడుస్తూ చెప్పారు.
వెంటనే నాకు తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేశాను. అతను వచ్చి పల్స్ చూసి చనిపొయ్యాడని చెప్పాడు. బహుశా సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చిందన్నాడు.
అమ్మ గారికి తెలిసిన బంధువులకు, స్నేహితులకు, అతని పూర్వ విద్యార్థులకు ఫోన్ చేసి విషయ మంతా చెప్పాను.
"అమ్మ గారూ.. పిల్లలకు ఈ విషయం ఇంకా చెప్పలేదా?" అడిగాను నేను.
"లేదు. వారికిప్పుడు అర్థ రాత్రి గదా. గాఢంగా నిద్ర పోతూ వుంటారు. వారిని డిస్టర్బ్ చెయ్యడ మెందుకొని నేనే ఫోన్ చెయ్య లేదు బాబూ!" అంది ఆమె రోదిస్తూ.
తండ్రి చనిపోతే ఆ వార్త తెలపడానికి అమెరికా లో వున్న పిల్లలకు నిద్రా భంగం అవుతుందా? ఇదేదో వింతగా ఉందే!
అంబులెన్స్ వారికి ఫోన్ చేసి అంకుల్ పార్థివ శరీరాన్ని గ్లాస్ ఫ్రీజర్ లో పెట్టించాను.
అంకుల్ పార్థివ దేహాన్ని చూడడానికి ఎవరెవరో వస్తున్నారు. పూల హారాలు, బొకేలు పట్టుకొని అతని కడ సారి దర్శనం చేసుకొంటున్నారు.
అమ్మ గారు అచేతనురాలై ఏమీ చెయ్య లేక పోతోంది. పిల్లలు ఈ పరిస్థితుల్లో ఇక్కడ లేరనే బాధను ఆమెను కృంగ దీస్తోంది.
అమ్మ గారి బంధువుల్లో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఆ పనులన్నీ పర్య వేక్షణ చేస్తున్నారు.
"అమ్మా! పిల్లలకు ఈ విషయం తెలియ చేశారా? ఇప్పుడు చెబితే వారు రావడానికి రెండు మూడు రోజులయినా పడితుంది. ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకొని అమెరికా నుండి రావడానికి టైం పడుతుంది. అంతవరకూ ఈ పార్థివ దేహాన్ని ఇక్కడ వుంచడం మంచిది కాదు. ఏమంటారు?" అన్నాడు ఆ పెద్దాయన.
"అన్నయ్య గారూ.. మీకు ఏది సబబు అని తోస్తే అది చెయ్యండి" అన్నది అమ్మగారు.
ఆ పెద్దాయన నా కేసి తరువాత ఏమి చేద్దాము? అన్నట్లు చూశాడు.
నేను చక చక మని అమెరికా లో ఉన్న వారి మొబైల్ నంబర్స్ తీసుకొని వారి అబ్బాయికి మొదట వీడియో కాల్ చేశాను. అతనికి జరిగిన విషయం అంతా చెప్పాను. అతని మొహంలో గానీ, మాట్లాడే టప్పుడు గానీ ఎలాంటి హావ భావాలు గానీ, బాధ గానీ కనబడ లేదు.
"డాడీ బాగానే వుండే వారు గదా? మాకెప్పుడూ వారి హెల్త్ ఇస్సూస్ గురించి చెప్పనే లేదు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్!" అని అన్నాడు వాళ్ళ అబ్బాయి.
వెంటనే అతను వారి అమ్మతో మాట్లాడాడు.
"అమ్మా.. నువ్వు ధైర్యంగా వుండు. మేమొచ్చే సరికి రెండు రోజులన్నా అవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ముగించెయ్యి" అని తాపీగా అన్నాడు వారి అబ్బాయి.
వెంటనే అతను తన ఇద్దరి చెల్లెళ్ళకి కాన్ ఫెరన్స్ కాల్ కలుపుతూ వీడియోలో మాట్లాడాడు.
అమ్మాయిలిద్దరూ వారి నాన్న గారి భౌతిక దేహాన్ని చూస్తూనే బావురుమన్నారు.
తరువాత నేను వారి అబ్బాయితో మాట్లాడి దహన కార్యక్రమాలు గురించి మాట్లాడాను. వారికి రావడానికి వెంటనే కుదరదు కాబట్టి ఆ దహన కార్యక్రమాలు చేసెయ్య మన్నారు.
నలగురైదుగురు బంధువులు, నలుగైరుదుగురు పూర్వ విద్యార్థులు తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరు. అందరూ వెళ్ళిపొయ్యారు. బంధాలన్నీ ఇలాగే ఉంటాయి కాబోలు అనుకొన్నాను. ఎప్పుడైతే మనిషి మర యంత్రాలతో, గాడ్జెట్స్ కి బానిసయి, డబ్బుల మోజులో పడి సంపాదనే జీవితం అనుకొన్నారో, అప్పుడే మానవ సంబంధాలు మృగ్యమై పొయ్యాయి.
జన సంబంధాలన్నీ ధన సంబంధాలయి పొయ్యాయి. మనిషి మారి పొయ్యాడు.
నేను అమ్మ గారి దగ్గరకు వెళ్ళి, ధైర్యం చెబుతూ జరగ వలసిన కార్యక్రమాలు గురించి చెప్పాను. ఏమనుకొన్నదో ఏమో, అమ్మ గారు గుండె దిటువు చేసుకొని, కార్యక్రమాల గురించి మాతో వివరంగా మాట్లాడింది.
అమ్మ గారు నా చేతిలో లక్ష రూపాయలు దహన కార్య క్రమాల కోసం వుంచుకొమ్మని ఇచ్చారు. వద్దన్నాను. కానీ ఆమె ఒప్పుకోలేదు.
బ్రాహ్మణులు వచ్చేశారు. పూల మాలలు తెచ్చారు. పాడె కట్టడానికి కావలసిన సరంజామా అంతా తెచ్చారు. శవ సంస్కారపు వేద మంత్రాలతో అంకుల్ పార్థివ శరీరాన్ని నీటితో, పాలతో స్నానం చేయించారు. పూల మాలలతో నింపిన శరీరాన్ని పాడె మీదకు చేర్చారు. మహా ప్రస్థానానికి నేను ఫోన్ చేసి దహన కార్యక్రమాలు కి అరేంజ్ చేశాను. పాడె మొయ్యడానికి నలుగురు మిగిలారు.
జీవితంలో ఎంత మంది పరిచయం అయినా ఒక నలుగురుని మాత్రం మంచి స్నేహితుల్ని సంపాయించుకో ! అన్న సామెత నాకు స్ఫురణకు వచ్చింది. ఆ నలుగురు పాడె మొయ్యడానికి సరిపోతారు అని అర్థం.
అమ్మగారు నా దగ్గరకు వచ్చి బిగ్గరగా రోదిస్తూ,
"నాకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నా, ఈ రోజు ఎవ్వరూ లేని దాన్ని అయ్యాను. ఆయన తల కొరివి పెట్టాడానికి గూడా ఎవ్వరూ లేరు" అని చిన్న పిల్లలా ఏడ్చింది.
నేనూ, నా శ్రీమతి అమ్మ గారిని ఓదార్చాము.
"మీ బంధువుల్లో ఎవరూ లేరా అమ్మా?" అని నేను అడిగాను. ఆమె మౌనంగా రోదిస్తూ లేరన్నట్లు తల అడ్డంగా ఊపింది.
"బాబూ.. నువ్వే మా కొడుకని ఆయనకు ఈ రోజు తల కొరివి పెట్టు నాయనా!" అని ఆమె రోదిస్తూ నా రెండు చేతులూ పట్టుకొనింది.
నేను ఆశ్చర్య పొయ్యాను. ఒక్క రెండు మూడు నిముషాలు స్థాణువై పొయ్యాను.
"సరే అమ్మా! నేనే తల కొరివి పెడతాను" అన్నాను నేను.
ఆమె నన్ను హత్తుకొని బిగ్గరగా ఏడ్చింది. నా శ్రీమతి గూడా ఏమన లేదు. సరే అంది.
జీవితంలో ఎప్పుడు ఏ మనిషి పరిచయ మవుతాడో, ఎందుకు పరిచయ మవుతాడో తెలియదు. ఋణాను బంధాలు అంటే ఇవేనా? ముక్కూ మొహం తెలియని నేను అంకుల్ కి తల కొరివి పెట్టడమా? వారికి కొడుకున్నా నా చేత ఆ భగవంతుడు ఈ కార్యక్రమాల్ని చేయిస్తున్నాడే? ఏమిటీ వైచిత్రి??
సాయంత్రం మూడు గంటలకు అంకుల్ పార్థివ దేహం మహా ప్రస్థానానికి వైకుంఠ రథం లో బయలు దేరింది.
కట్టెల మీద అంకుల్ పార్థివ శరీరం నిర్జీవంగా పడి ఉన్నది. అక్కడున్న బ్రాహ్మణులు దహన పూజా కార్యక్రమాల్ని నిర్వహించి, ఒక కుండలో నీరు పోసి భుజాల మీద కెత్తుకొని, మూడు సార్లు ప్రదక్షిణ చెయ్య మన్నారు. ప్రతి సారీ తిరిగినప్పుడు ఒక రాయితో కుండని రంధ్రం చేస్తూ వుంటే, నీరు ధారగా కారి పోతున్నాయి. అలా మూడు సార్లు చేసిన తరువాత తల కొరివి పెట్టమన్నారు. ఘంట సాల గారి భగవత్ గీత శ్లోకాలు మెల్లగా వినబడుతున్నాయి.
వణుకు తున్న చేతుల్తో, నారాయణ, నారాయణ అంటూ భగవన్నామ స్మరణ చేసుకొంటూ తల కొరివి పెట్టాను.
నా కళ్ళల్లోంచి కన్నీరు ధారా పాతంగా వస్తోంది. గుండె బరువెక్కింది. నా తండ్రిని పోగొట్టుకొన్నంత బాధ కలిగింది నాకు.
*****************************************
వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.
వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.
వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.
తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.
*వీరి ముద్రిత రచనలు*------------------
1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.
2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .
3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్ నెల 17 వ తేదీ వెలువరించారు. ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు
4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.
5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!
*అముద్రిత రచనలు*
1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.
2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.
3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.
4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.
*విద్యాభ్యాసం*-----------
వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.
ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు. ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు. వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు. ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.
*వృత్తి*------
వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.
వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు;1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ2. సహస్ర కవి రత్న3. సాహితీ భూషణ4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో.5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.
@hindudharmamargam2136
• 6 minutes ago
Super. Congrats Writer Bhanu Sir.