top of page

ఏది కష్టం? ఏది సుఖం?

#GSSKalyani, #GSSకళ్యాణి, #EdiKashtamEdiSukham, #ఏదికష్టంఏదిసుఖం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Edi Kashtam Edi Sukham - New Telugu Story Written By G. S. S. Kalyani

Published In manatelugukathalu.com On 13/04/2025

ఏది కష్టం? ఏది సుఖం? - తెలుగు కథ

రచన: G. S. S. కళ్యాణి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అది భారతదేశంలోని ఒక చిన్న ఊరు. కాలేజీలో ఆఖరి క్లాస్ అవుతూనే తన పుస్తకాలు తీసుకుని పరుగులాంటి నడకతో తరగతి గది బయటకొచ్చాడు మహేశం.


"ఒరేయ్ మహేశం! ఎక్కడికిరా పరుగూ? మాష్టారు చెప్పిన పాఠం సరిగ్గా విన్నావా? ఈరోజు అన్నీ కొత్త విషయాలే చెప్పారు. అవన్నీ జీర్ణం కావడం కష్టంగా ఉంది!", మహేశం భుజం పై చెయ్యి వేసి నవ్వుతూ అన్నాడు అతడి స్నేహితుడు మారుతి.


"ఇంటికి వెళ్లగానే ఒకసారి పుస్తకంలో ఇదే పాఠం చదివితే అదే అర్థమవుతుంది. నాకు చాలా ఆకలేస్తోంది. వెళ్ళి ఏదైనా తినాలి", అన్నాడు మహేశం తన కడుపు నిమురుకుంటూ.

"ఓ! అన్నట్లు నీకొక విషయం చెప్పడం మర్చిపోయా. పుస్తకాల షాపు యజమాని రమణగారు నువ్వడిగిన సైన్సు పుస్తకం వచ్చిందని చెప్పమన్నార్రా! నువ్వు షాపుకు త్వరగా వెళ్లకపోతే పుస్తకాలన్నీ అయిపోతాయట. మళ్ళీ మన పెద్ద పరీక్షలయ్యేదాకా కొత్త పుస్తకాలు రావని అన్నారు. నీకు వీలైతే ఇప్పుడే షాపుకి వెళ్ళిపో”, అన్నాడు మారుతి. 


మహేశం చిన్నప్పుడే అతడి తల్లిదండ్రులు మరణించారు. దాంతో అనాథగా ఎన్నో కష్టాలు పడుతూ గట్టి పట్టుదలతో కాలేజీలో చదువుకుంటున్నాడు మహేశం. మారుతి చెప్పిన సంగతికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మహేశానికి. ఎందుకంటే రమణగారి దగ్గర ఉన్న ఆ సైన్సు పుస్తకాం కోసం మహేశం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఇప్పుడది కొనుక్కోవాలంటే మహేశం ఆ పూట భోజనం త్యాగం చెయ్యాలి మరి! అతడు దాచుకున్న డబ్బుల్లో కొంత భోజనానికి ఖర్చు పెట్టేస్తే పుస్తకం కొనుక్కోవడం కుదరదు.


మహేశం కొంచెం ఆలోచించి, 'వెంటనే వెళ్ళి పుస్తకం కొనుక్కోకపోతే పరీక్షలకు కష్టమవుతుంది. ఇవాళ ఒక్కరోజు నేను అన్నం తినకపోతే ఏంటీ? బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నేను ప్రతిరోజూ హాయిగా కడుపునిండా తినొచ్చు!’, అని అనుకుంటూ భోజనం మానేసి పుస్తకాల షాపుకు వెళ్ళిపోయాడు.


శ్రద్ధగా చదివి మంచి మార్కులతో చదువు పూర్తి చేశాడు మహేశం. చదువు పూర్తికాగానే మహేశానికి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం దొరికింది. పెళ్ళి చేసుకుంటే తనకంటూ ఒక కుటుంబం ఉంటుందని భావించిన మహేశం, బడిలో తనతోపాటూ పనిచేస్తున్న శ్యామలను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఏడాది గడిచేసరికి మహేశానికి పండంటి మగబిడ్డ పుట్టాడు. పసిబిడ్డను మహేశం చేతిలోకి తీసుకోగానే వాడు మహేశంవంక చూసి చిరునవ్వు నవ్వాడు.


“అబ్బ! ఈ చిరునవ్వు ఎంత బావుందో! ఇది నీ ముఖంపై ఎప్పటికీ చెరగకూడదు. అనాథగా నేను పడిన కష్టాలేవీ నీ దగ్గరకు రానివ్వను. ఆకలిబాధ అంటే ఏంటో తెలియకుండా నిన్ను పెంచుతాను!”, అని అంటూ బాబును తన గుండెలకు ప్రేమగా హత్తుకుని, వాడికి సదానంద అని పేరు పెట్టాడు మహేశం. 


తను అనుకున్నట్లుగానే మహేశం సదానందకు ఆకలి బాధ తెలియకుండా తండ్రి ప్రేమను పంచుతూ పెద్దవాడిని చేశాడు. మహేశానికి జీవితంలో అన్నివిధాలా సహకరించింది శ్యామల. ఇంజినీరింగ్ చదివిన సదానంద మహేశం కోరిక మేరకు అమెరికాకు వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం సంపాదించి, శ్యామల మేనకోడలు సౌజన్యను పెళ్ళి చేసుకున్నాడు. 


వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక సౌజన్య కూడా ఉద్యోగంలో చేరిపోయింది. అనాథగా పెరిగిన మహేశానికి తన కొడుకూ, కోడలూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని అందరికీ చెప్పుకోవడం చాలా గర్వంగా అనిపించేది. అమెరికాలో ఉంటున్నా ఎప్పుడూ భారతదేశంలో ఉన్న తన తల్లిదండ్రుల గురించే ఆలోచించేవాడు సదానంద. 


అప్పుడప్పుడూ సదానంద మహేశంతో, "నాన్నా! ఇక్కడ నేను డబ్బు బాగానే సంపాదించాను. ఇక మీ దగ్గరకు వచ్చేసి మీతో ఉంటా!", అని అనేవాడు. 


సదానంద అలా అన్న ప్రతిసారీ, "నా మనవళ్ళను అమెరికాలో చదువుకోనీరా! వాళ్ళ చదువు పూర్తయ్యేవరకూ నువ్వక్కడే ఉండు", అని అనేవాడు మహేశం. 


తనను కష్టపడి పెంచిన అమ్మానాన్నల కోసం ఏదైనా చెయ్యాలని సదానంద మనసులో ఒక గాఢమైన కోరిక ఉండేది. అందుకని తను పుట్టి పెరిగిన ఊరి పొలిమేరల్లో ఒక రాజభవనంలాంటి విల్లాను కొని, అది తన తల్లిదండ్రులకు కానుకగా బహూకరించాడు సదానంద. ఆ క్షణం మహేశం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 


బంధుమిత్రులందరినీ పిలిచి గృహప్రవేశం ఘనంగా చేశాడు మహేశం. కొన్నేళ్ళ తర్వాత శ్యామల అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. లంకంత ఇంట్లో ఎనభయ్యేళ్ళ మహేశం ఒంటరిగా ఉండలేక సదానందను తన దగ్గరకు వచ్చెయ్యమన్నాడు.


"పిల్లలు పెద్ద చదువులకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళను అక్కడకు తీసుకురావడం కుదరదు నాన్నా! నువ్వే ఇక్కడకు వచ్చెయ్", అన్నాడు సదానంద. 


"ఈ వయసులో నేను ఈ ఊరు విడిచి అక్కడకు రాలేనురా! ", అన్నాడు మహేశం.


సొంతఊరిపై తన తండ్రికి ఉన్న మమకారాన్ని అర్థం చేసుకున్న సదానంద, మహేశానికి ప్రతిరోజూ వంటతోపాటూ ఇంటిపనులన్నీ చేసిపెట్టడానికి ఎవరైనా దొరుకుతారేమోనని తెగ వెతికాడు. కానీ, మహేశం ఉంటున్న ఇల్లు ఊరికి దూరంగా ఉండటంతో అటువంటివారెవ్వరూ సదానందకు దొరకలేదు. ఎలాగో పద్మ అనే మహిళ మహేశానికి కావలసిన ఇంటిపనులన్నీ చేస్తానని ఒప్పుకుంది. అందుకు మామూలుకన్నా రెట్టింపు జీతం ఇవ్వాలని మాత్రం షరతు పెట్టింది. 


ప్రతిరోజూ ఉదయం ఎనిమిదింటికల్లా వచ్చి వంటతోసహా పనులన్నీ పూర్తిచేసే పద్మ, ఒకరోజు మాత్రం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా ఇంకా ఎందుకో రాలేదు. పద్మ ఇచ్చిన ఫోను నెంబరుకు సుమారుగా పదిహేనుసార్లు కాల్ చేసాడు మహేశం. పద్మ ఫోను ఎత్తలేదు. 


మహేశానికి విపరీతమైన ఆకలితో కడుపులో మెలితిప్పినంత నొప్పి పుట్టింది. ఆరోగ్యరీత్యా బయట వండిన పదార్థాలేవీ మహేశానికి పడవు. ఇన్నాళ్ళూ వంటాపెట్టూ శ్యామలే చూసుకుంది కాబట్టి వాటిని చేసే నేర్పుకానీ ఓర్పుకానీ మహేశానికి ఇప్పుడు లేవు. నరాలబలహీనతవల్ల వాహనం నడిపే పరిస్థితి లేకపోవడంతో పళ్ళూ, చిరుతిళ్ళవంటివి కూడా ఇంట్లో పెట్టుకోలేదు మహేశం. ఆ ఊరు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉండటంవల్ల అక్కడ ఫోను చేస్తే రెస్టారెంటువాళ్ళు ఆహారం ఇంటికి పంపే సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. 


పద్మ జాడ కనపడుతుందేమోనని మెల్లిగా చేతికర్ర సహాయంతో వీధివాకిట్లోకి వచ్చి చూశాడు మహేశం. మిట్ట మధ్యాహ్న సమయం, అందులోనూ వేసవికాలం కావడంతో ఎండ భగభగలాడుతోంది. జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలే పెద్దవయసు, ఆపై ఆకలివల్ల వచ్చిన నీరసం, వీటికితోడు వీధిలో రివ్వున వచ్చిన వేడి వడగాలి తగిలేసరికి మహేశానికి కళ్ళు తిరిగినట్లయ్యాయి. 


ఇంట్లోకివచ్చి కుర్చీలో కూలబడ్డాడు మహేశం. ఆ కుదుపుకి కుర్చీపక్కనే ఉన్న చెక్క అలమరా కదిలి, దాంట్లో ఉన్న ఒక డైరీ కింద పడింది. మెల్లిగా వంగి ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు మహేశం. తన అనుభవాలన్నీ డైరీలో రాసుకోవడం చిన్ననాటినుండీ మహేశానికి ఉన్న ఒక అలవాటు. ఎన్నో ఏళ్ళుగా అలా రాస్తూ వస్తున్న డైరీలన్నీ ఆ చెక్క అలమరాలో భద్రంగా దాచుకున్నాడు మహేశం.  ఇప్పుడు కింద పడిన డైరీ మహేశం తన కాలేజీ రోజుల్లో రాసుకున్నది!

పాత జ్ఞాపకాలతో ఇప్పుడుపడుతున్న బాధనుండీ కాస్త ఉపశమనం పొందచ్చని అనుకుంటూ ఆ డైరీలోని మధ్య పేజీని తెరిచాడు మహేశం. అందులో, ‘ఇవాళ నేను పుస్తకం కోసం భోజనం త్యాగం చేశా! బాగా చదువుకుంటే రోజూ కడుపునిండా తినొచ్చుగా!’, అని రాసి ఉంది. అది చదివి, 'ఆకలిబాధ! ఇన్నేళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ నన్ను వేధిస్తోంది!', అని నిట్టూరుస్తూ ఆ డైరీలో కొన్ని పుటలు తిప్పాడు. 


అప్పుడు ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజుల్లో తను రాసుకున్న కొన్ని వాక్యాలు మహేశం కంటపడ్డాయి. ‘ఇవాళ బస్టాండులో బస్సుకోసం ఎదురు చూస్తున్నప్పుడు నా పక్కన ఒక పెద్దాయన తన కుటుంబంతో వచ్చి నిలబడ్దాడు. ఆ కుటుంబంలో అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో! ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ప్రేమా, ఆప్యాయతలు అపారమైనవి. నాకోసం కూడా అలా కొందరు ఉంటే ఎంత బాగుంటుందో కదా! నన్ను మనసారా ప్రేమించే మనుషులు కావాలి. వారు నా చుట్టూ ఎప్పుడూ కళకళలాడుతూ తిరగాలి!’, అని రాసి ఉండటం చూసి ఏవో ఆలోచనల్లో మునిగిపోయాడు మహేశం.


డైరీలో తను రాసుకున్నట్లే చదువువల్ల ధనాన్నీ, పెళ్ళివల్ల బంధువులనూ సంపాదించాడు మహేశం. ప్రస్తుతం మహేశం ఉంటున్న ఇంటి గృహప్రవేశానికి వచ్చిన అతడి చిన్ననాటి స్నేహితుడు మారుతి మహేశంతో, "నేను నా కొడుక్కి నా పొలమంతా సాగు చేసుకోమని ఇచ్చేశాను. అయినా నేను వాడి దగ్గర ఉండాలంటే నాకు ఏదో తెలియని ఇబ్బందీ, మొహమాటమూనూ. నాకున్న కష్టాలు నీకు లేవు. నీకోసం ఇంత పెద్ద ఇల్లు కొని నిన్ను సుఖపెట్టాలనుకున్న కొడుకును కన్నావ్! ఇంతకన్నా నీకు జీవితంలో ఇంకేం కావాలిరా?", అన్న మాటలు గుర్తుకువచ్చి, 'జీవితంలో విజయాన్ని సాధించేశానని ఆనాడు అనుకున్నాను. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయ్. వైకుంఠపాళిలో పెద్దపాము మింగినట్లైపోయింది నా గతి! 


మారుతి నేను సుఖపడుతున్నట్లూ, తను కష్టపడుతున్నట్లూ మాట్లాడాడు. ఏది కష్టం? ఏది సుఖం? కంటికి రెప్పలా చూసుకునే కొడుకూ, సమయానికి వండి పెట్టే కోడలూ, ఆటపాటలతో సంతోషాన్నిచ్చే మనవళ్ళూ, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తున్న వారసులూ ఉన్న ఆ మారుతిదే కదా అదృష్టమంటే! 


అరవయ్యేళ్ళ క్రితం నేను ఆకలితో ఒంటరిగా ఎలాఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను!', అని అనుకుంటూ నిర్వికారంగా నవ్వుకున్నాడు మహేశం. అంతలో మహేశం ఫోన్ మోగింది. పద్మ అనుకుని ఫోను ఎత్తాడు మహేశం. 


"హలో నాన్నా! ఎలా ఉన్నావ్?", అడిగాడు సదానంద. 


మహేశం ఆకలి బాధను అణచుకుంటూ, "బాగానే ఉన్నారా! ఏమిటీ ఇప్పుడు చేశావ్?", అని అడిగాడు. 


"ఏమీ లేదు నాన్నా! ఆఫీసుపని పూర్తయ్యేసరికి ఈవేళయ్యింది. నేను తప్ప ఇంట్లో అందరూ పడుకున్నారు. మాకు అర్థరాత్రైపోయింది కదా! ఇందాక తొమ్మిదింటికి చాలా ఆకలి వేసింది. కానీ మీటింగ్ లో ఉండటంతో తినలేకపోయా! ఇప్పుడేమో ఆకలి చచ్చిపోయింది. పైగా ఎటూకాని సమయం. భోజనం చెయ్యాలని అనిపించట్లేదు నాన్నా. నీతో మాట్లాడాలని అనిపించింది. నాన్నా! ఇవాల్టికి నేను ఈ దేశానికి వచ్చి సరిగ్గా ఇరవై ఏళ్ళు!", అన్నాడు సదానంద. 

"అలాగా! అప్పుడే ఇరవయ్యేళ్ళు గడిచిపోయాయా?", అన్నాడు మహేశం ఆశ్చర్యంతో. 


"నాన్నా! నీకోసమే ఈ దేశానికి నేను వచ్చానని నీకు తెలుసు కదా! ఈ ఇరవయ్యేళ్ళూ అమ్మానాన్నలు ఉండికూడా వాళ్ళు లేనట్లే జీవించాను. ఇప్పుడైనా నా మాట విని నువ్వు ఇక్కడకు వచ్చెయ్ నాన్నా. నేనూ, సౌజన్యా నిన్ను బాగా చూసుకుంటాం. పిల్లలకు వాళ్ళ తాతయ్యతో గడిపే అవకాశం ఇవ్వు. నిన్ను ఇప్పటికిప్పుడు నీ నిర్ణయం చెప్పమని అనట్లేదు. మెల్లిగా ఆలోచించి ఏ విషయం చెప్పు", అంటూ ఫోను పెట్టేశాడు సదానంద.


సదానంద మాటలు విన్న మహేశం కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. 'ఆకలిబాధ ఉండకూడదని నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. చేతినిండా డబ్బులున్నా ఇవాళ నాకు ఆకలి బాధ తప్పలేదు. నా బిడ్డ అనాథలా కాకూడదని అనుకున్నాను. కానీ వాడు అమ్మానాన్నలు లేని లోటును అనుభవిస్తున్నాడు! నేనిన్నాళ్ళూ సుఖమని అనుకున్నది నా బిడ్దకు కష్టం కలిగిస్తోంది! 

ఎందుకీ పరిస్థితి?? మనిషి స్వార్థమే ఇందుకు కారణమా? ఉన్నతవిద్యావంతులై ఎం.ఎన్.సీలు నెలకొల్పిన అత్యాధునిక భవనాలలో రాత్రింబవళ్ళూ పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్నా సమయానికి పిడికెడు అన్నం తినలేని నా బిడ్దవంటి అన్నార్తులు ఈ సమాజంలో ఈమధ్య రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆధునిక జీవనశైలితో మానవసంబంధాలు కనుమరుగవుతున్న వేళ కన్నవారు ఎన్నారైలుగా మారడంతో, నావంటివారు, అందరూ ఉన్నా అనాథలుగా మిగిలిపోతున్నారు! 


ఈ కష్టాలకు ఎవరు కారణం? ఇప్పటికైనా నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇక నేను ఎన్నటికీ ఒక తండ్రిగా నా పిల్లవాడికి న్యాయం చెయ్యలేను! నేను చేసే పని నాకు కష్టం కావచ్చు. కానీ, ఆ పని చెయ్యడంవల్ల నేను నాకిష్టమైన వాళ్ళకు సంతోషాన్ని కలిగించగలుగుతూ ఉంటే ఇక ఆ పని చెయ్యడం నాకు కష్టమెలా అవుతుందీ?', అని అనుకుంటూ అమెరికా వచ్చి ఉండేందుకు తను సిద్ధమని సదానందకు చెప్పడానికి కళ్ళు తుడుచుకుని ఫోనును చేతిలోకి తీసుకున్నాడు మహేశం.


*****

 

G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





1 Comment


@GSSKalyani05

• 20 hours ago

కథను చక్కగా చదివి వినిపించిన శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ గారికి అనేక ధన్యవాదాలు

Like
bottom of page