top of page

ఏది ఒంటరి..

Writer: BVD Prasada RaoBVD Prasada Rao

#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #EdiOntari, #ఏదిఒంటరి, #TeluguStory, #తెలుగుకథ

Edi Ontari - New Telugu Story Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 19/03/2025

ఏది ఒంటరి - తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆ నగరం నడిబొడ్డున.. ఆరు రోడ్ల కూడలి ఒకటి ఉంది. ఆ కూడలిన ఒక పురాతన మర్రి చెట్టు ఉంది. 

ఈ చెట్టు ఎప్పటి నుండో.. తన విశాలమైన నీడలో.. ఎందరో పాదచారీలకు.. వాహనదారులకు.. నీడనిస్తూ స్వేద తీరుస్తోంది. వేసవిలో మరిన్నూ. 


అందుకే దీనిని ఎవరూ అడ్డుగా భావించడం లేదు. ఎవరు విత్తనం నాటారో.. ఎలా సంరక్షింపబడిందో.. కానీ ఈ చెట్టు ఒక మిన్నగా నిలిచి రమారమీ అన్ని నోళ్లతో కొనియాడ బడుతోంది. 


మరియు.. తన పంచన పలు సభలు నిర్వహింప బడుతుంటాయి.. పరి పరి సమావేశాలు నిర్వహింప బడుతుంటాయి.. అడపాతడపా ఓ మోస్తరు కళా ప్రదర్శనాలు లాంటివి కూడా చోటు చేసుకుంటుంటాయి. మరి ఇంతటి ఆశ్రమించేటంతటి గొప్ప చెట్టు ఇది.


మరో ముచ్చట.. ఈ చెట్టు కింద మజిలీలే తప్పా నివాసాలు నిషేదనీయం. ఈ నియమం అతిక్రమించకుండా స్థానికల్లో ఎవరో ఒకరు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు.


ఎండగా ఉన్న ఈ మధ్యాహ్నం.. ఈ చెట్టు మొదలునానుకొని కూర్చుని ఉన్నాడు శ్రీనివాసరావు. ఇతడు ఒకింత దయగల పదిహేనేళ్ల అబ్బాయి. అవసరంలో ఉన్న ఎవరికైనా సహాయకారి. ఇస్తే పుచ్చుకునే స్వభావం తప్పా.. అడిగి పుచ్చుకునే వాడు మాత్రం కాదు. 


అట్టి పనులతో అటు ఇటు తిరుగాడే శ్రీనివాసరావు.. తరచుగా.. ముఖ్యంగా మధ్యాహ్నాలలో ఈ చెట్టు నీడన కాసింత సేపు విశ్రాంతి తీసుకుంటుంటాడు. పైగా కాసిన్ని కునుకుపాట్లు పడుతుంటాడు. అలానే ఈ చెట్టు కొమ్మల్లో గూళ్లు కట్టుకొని ఉన్న చిన్నాచితక పిట్టల రకరకాల కిచకిచలను ఆస్వాంతం ఆస్వాదించడం ఇతడికి మంచి ఇష్టం.


అలా వింటూ.. కునుకు తీస్తూ.. ఉన్న శ్రీనివాసరావు ఉన్నపళాన ఉలిక్కి పడ్డాడు. కను రెప్పలను విప్పాడు. అప్పటికే.. ఇంచు మించుగా తన చెంతకి వచ్చి ఉన్న ఒక కోడి పిల్లని చూసాడు. అది కుంటుతూ తచ్చాడుతోంది. 


'ఇది ఎలా ఇక్కడికి రాగలిగిందో..' ప్రశ్నించుకున్నాడు శ్రీనివాసరావు. 


ఆ వెంబడే చుట్టూ చూసాడు. తల్లి కోడి కానీ, పిల్ల కోళ్ల జాడ గానీ ఆ దరిదాపుల కానరాలేదు.


'పాపం.. ఎలా తప్పిపోయిందో.. తన వాళ్లు ఎక్కడనో..' అనుకుంటాడు శ్రీనివాసరావు. 


తన చెంత చేరిన కోడి పిల్ల కాలి గాయం గమనించాడు శ్రీనివాసరావు. మరియు దాని పీల కిచకిచలు అతడిని కలవరి పరిచాయి. మరో మారు పరిసరాలు కలయ చూసాడు. వేరే ఏ రకం కోడి ఆనవాళ్లు కంట పడలేదు.


కోడి పిల్ల అవస్థకి శ్రీనివాసరావు మది తల్లడిల్లుతోంది. అతను ఆ పిల్లని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. పైకి లేచాడు. ఓదార్పు మాటలుగా.. గుసగుసగా.. ఏమేమో అంటున్నాడు. 


అలానే.. "దిగులు కావద్దు.. నేను నీకు సహాయం చేస్తాను." వత్తాసులా గొణిగాడు.. తన సహజ గుణంతో.


పిమ్మట.. తన ఎడమ అర చేతిలో.. ఆ కోడి పిల్లని అమర్చుకొని.. తన కుడి అర చేతి సాయంతో తన సైకిల్ ఎక్కేయగలిగాడు శ్రీనివాసరావు. 


శ్రీనివాసరావు.. ఆ కోడి పిల్లని తన ఇంటికి తీసుకెళ్లాడు. దానికి నీటి చుక్కలు పట్టాడు. దాని కాలి గాయం మీద తమ పుండుల పళాస్త్రి పూసాడు. పిదప ఆ కోడి పిల్లని ఒక గోనె గుడ్డ మీద పెట్టాడు. 


తొలుత నుండి శ్రీనివాసరావు నైజం ఎఱిగిన అతడింటి వారు.. ముఖ్యంగా అతడి తల్లి.. అతడి చేష్టలకు వింతవ్వలేదు.. అడ్డు పడలేదు.


"అమ్మా.. దీనిని చూస్తుండవా. నేను బయటి పనులు చక్కదిద్ది వస్తాను." చెప్పాడు శ్రీనివాసరావు తల్లితో ఒబ్బిడిగా.


ఆ తల్లి తప్పక ఒప్పుకుంటుంది.

శ్రీనివాసరావు బయటికి వెళ్లాడు.

రోజులు గడిచే కొద్దీ.. ఆ కోడి పిల్ల మెల్లిగా పుంజుకుంది. పిల్ల కాస్తా పెద్దదయ్యింది. 


శ్రీనివాసరావు పక్కా సేవల మూలంగానే అది తేరుకుంది. ఆ ఇంట్లో ఒక స్వంత మనిషిలా తిరుగాడుతోంది.


తెల్లవారున.. ఆ కోడి ఉత్సాహంగా రెక్కలు విప్పి.. 'కొక్కురొకో' అంది. ఈ మారు మళ్లీ మళ్లీ అరిచింది. 


శ్రీనివాసరావు తండ్రికి ఈ మారు గట్టి చిరాకయ్యింది.

నిద్ర లేచి.. లైట్ వేస్తూనే.. "దీని గోల రోజు రోజుకు జాస్తీ అవుతోంది. మధ్యలోనే నిద్రని లేపేస్తోంది." అరిచాడు.


ఆ గందికకి ఇంటి వారు లేచిపోయారు.

"ఈ రోజు దీనిని చంపి.. వండేయే." శ్రీనివాసరావు తండ్రి చిందులు తొక్కుతూ భార్యకి విసురుగా చెప్పాడు.


శ్రీనివాసరావు గతుక్కుమన్నాడు. అది గమనించింది అతడి తల్లి. కొడుకు వాటం ఎరిగింది.. పైగా తను ఒక తల్లి కావడం మూలంగా.. "చాల్లెండి. ఇంతకాడ నుండి మన మధ్య తిరుగుతూ పెరిగింది ఇది. అలాంటి దానిని చంపేసి తినడమా. ఛ." కొడుకునే చూస్తూ చెప్పింది భర్తకు.


"ఇంకెన్నాళ్లు సాకుతావు. మన తిండెక్కి బలిసింది. మన నిద్ర సుఖం దీనికి పట్టదు. ఇలాంటి దానిని వెనుకేసుకు వస్తున్నావు. ఇంకెన్నాళ్లని మేపుతావు." కసురుకుంటాడు శ్రీనివాసరావు తండ్రి.


ఆ వెంబడే..

"వీడికి పనిపాటు తప్పా చదువు లేదు. వీడిని నువ్వే వెనుకేసుకు వస్తుంటావు. వీడి వలన ఒళ్లు గుల్లవ్వతోంది. ఛ." గావుగా అరిచాడు శ్రీనివాసరావు మీద. 

పెనుగాలిలోని చిగురాకులా శ్రీనివాసరావు ఊగిసలాడుతున్నాడు.


అతని చుట్టే ఆ కోడి తచ్చాడుతోంది. దానికి అక్కడి రభస తెలుస్తోంది. 'అవును మరి.. అదీ ఒక జీవేగా.'


శ్రీనివాసరావే తొలుత తెములుకున్నాడు. ఆ గోలను వెంటనే ఆపాలనుకున్నాడు. పైగా బాగా తెల్లారిపోయింది. చుట్టు పక్కలోళ్లు నిద్రలు లేస్తున్నారు. దాంతో.. జర్రున ఆ కోడిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంటి బయటికి విసురుగా నడిచాడు. అతడి వారు అతడ్నే చూస్తూ చప్పబడి.. ఉన్న చోటులనే ఉండిపోయారు చాలా సేపటి వరకు.


అలా బయటికి వెళ్లిన శ్రీనివాసరావు చాలా సేపటికి తిరిగి వచ్చాడు. అతడితో కోడి లేదు. ఇంట్లో వాళ్లతో మాట్లాడక తన పనులు తాను చేసుకున్నాడు శ్రీనివాసరావు. తిరిగి సైకిల్ తో బయటి పనులకు కదిలాడు.


"దోసెలు వేసాను. తిను." తల్లి చెప్పింది. 

శ్రీనివాసరావు వద్దన్నాడు. బయటికి వెళ్లి పోయాడు. 


ఆ తల్లి అప్పటికి ఏమీ అనలేక పోయింది. ఆమెకి కొడుకు పట్టు తెలుసు.. సరిగ్గా తర్వాతి పూటకై తిండికి వచ్చి కూర్చుంటాడని.. వాడు ఆకలికి ఆగలేడని.

మధ్యాహ్నం.. ఎండ బాగా కాస్తోంది..


శ్రీనివాసరావు ఆ మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు ఎప్పటిలాగే. అదే తోవన.. తన అలవాటున కునుకుపాట్లు పడుతున్నాడు. 

కాకతాళీయంగా.. ఒక్క మారుగా.. ఆ చెట్టు పై కాకులు గమ్మున గోల మొదలెట్టాయి.

శ్రీనివాసరావు కళ్లు తెరిచేసాడు. 


తన దరిలోనే ఒక కాకి పిల్ల పడి ఉంది. అది ఎగరలేక పోతోంది.

పై కాకుల హడావిడి పెరుగుతోంది.


కింద పడిన కాకి పిల్లనే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసరావు.. 

అతడి చూపులో చేవ లేదు.. అతడి చేతలో చలనం లేదు..


ఆ తోవన..

తన కుడి అరచేతి మీద పొడుస్తునేలా ఏవో గుచ్చు స్పర్శలు కావడంతో.. ఆ చేతిని లాక్కుంటూనే.. తల విదిలించుకున్నాడు శ్రీనివాసరావు. చూసాడు.


అతడి చెంతన ఆ కోడి.. అదే కోడి.. అతడు ఉదయంన.. ఆవేశంన.. ఆక్రోశంన.. తన తండ్రి చేతిలో చావ కూడదన్న నెపంతో.. చాలా దూరాన వదిలి పెట్టేసిన ఆ కోడే.. 

అది అతనినే చూస్తోంది..


శ్రీనివాసరావు నిలవరించు నివ్వెరన పడ్డాడు జల్దీగానే. 

ఆ కోడి అతడి పైకి ఎగపాకిపోతోంది.. తన ముక్కుతో అతడి ముఖంపై గుచ్చుతోంది..

శ్రీనివాసరావు బోలెడు కంగారు పడ్డాడు.. గజిబిజిగా తేరుకున్నాడు..

ఆ కోడిని నేల మీదకు నెట్టేసినట్టు చిన్నగా తోసేసాడు.


ఈ కోడి విషయంలో తన తండ్రి యాగీ శ్రీనివాసరావు గుర్తున వేలాడుతోంది..

నిజమే.. అతడి తండ్రి చేష్ట దగ్గర నుండి శ్రీనివాసరావు మనో స్థితి పితపిత లాడిపోతోంది..


ఒక్క మారుగా.. బెంబేలుగా.. తన్నుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక.. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

అక్కడికి చేరిన ఆ కోడి శ్రీనివాసరావు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తోంది..

అంతలోనే గబుక్కున లేచి పోయాడు శ్రీనివాసరావు. 


సైకిల్ ఎక్కకుండా.. దానిని విసురుగా నెట్టుకుంటూ.. దాని స్టాండ్ కూడా తీయకుండా.. అక్కడ నుండి పరుగులు తీసాడు.. ఒక పిచ్చి వాడిలా.. వెను తిరిగి చూడ లేనివాడిలా..


ఆ తర్వాత..

శ్రీనివాసరావు ఆ చెట్టు కిందికే కాదు.. ఆ చెట్టు వైపుకు కూడా.. రావడం మానుకున్నాడు..

ఆ కోడి కూడా శ్రీనివాసరావు గురించి దేవులాట ఆపేసుకుంది.. 


హూ.. 

దాపు కాని దాతృత్వం.. కాపు రాని ఆత్మీయత.. ముమ్మాటికి.. ఒంటరివే.


***


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










 
 
 

Comentários


bottom of page