#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #EduruChupulu, #ఎదురుచూపులు, #TeluguHeartTouchingStories
Eduru Chupulu - New Telugu Story Written By - Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 16/11/2024
ఎదురు చూపులు - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అనసూయమ్మ పని పూర్తై పక్క మీదకు చేరేసరికి రాత్రి పదిగంటలు దాటింది. వంటిల్లు చక్కబెట్టుకొని, మనవల్నిద్దర్నీ నిద్రపుచ్చిన తర్వాత, పక్క మీదకు చేరి నిద్రపోవడానికి ప్రయత్నించసాగింది. రోజంతా పనిపాటలతో ఆమె పూర్తిగా అలిసిపోయింది. సాధారణంగా అలసట చెందిన శరీరం, విశ్రాంతిగా వాలగానే నిద్ర ఆవహిస్తుంది. కానీ, ఇవాళెందుకో అనసూయమ్మని నిద్రాదేవి కరుణించలేదు. మనసులో ఆలోచనలు జోరీగల్లా ముసురుతున్నాయి. ఆమె ఎంత ప్రయత్నించినా మనసు నిలవటం లేదు. ఉదయం జరిగిన సంఘటనలు పదేపదే గుర్తుకు వస్తున్నాయి.
పెద్ద మనవడు రాకేశ్, చిన్న మనవడు రాజేశ్ ఇద్దరూ కొట్టుకుంటూంటే అడ్డుపడిందామె. రాజేశ్ చిన్నవాడవటం చేత పెద్ద మనవడైన రాకేశ్ ని మందలించింది. ఆ మాటలు కోడలు రాగిణి చెవిలో పడ్డాయి. అంతే, ఆమెకి ఒక్కసారి పూనకం వచ్చినట్లైంది. ఆగ్రహంతో ఊగిపోయింది.
"మా పిల్లలికి మేము బుద్ధి చెప్పుకోగలం. మీరేం వాళ్ళకి బుద్ధి చెప్పక్కర్లేదు. కసరక్కర్లేదు. మీ పని మీరు చూసుకుంటే చాలు!" అని ఇద్దర్నీ బరబరా అక్కణ్ణుంచి లాక్కుపోయిందామె కోపంగా.
ఆ సంఘటనకి మాన్పడిపోయింది అనసూయమ్మ. తనింతకీ ఏమంది? 'వాడు నీ తమ్ముడురా, చిన్న పిల్లాడు. నువ్వు వాడ్ని ఏమనకు!' అంతేగా! తనేమీ వాళ్ళమీద చెయ్యి చేసుకోలేదే! గట్టిగా కూడా మందలించలేదు. మరి రాగిణికి కోపం ఎందుకొచ్చినట్లు? తను అలా పెద్దాడిని మందలించకపోయినా ఆమెకి కోపం వస్తుంది.
"పిల్లలు అలా కొట్టుకుంటూంటే, చూస్తూ ఉన్నారేం?" అన్నా అనగలదు.
తను ఇక్కడికి వచ్చిన నెల రోజులవరకూ బాగానే ఉంది కోడలు. ఆ తర్వాత నుంచి ఆమె ఎత్తిపొడుపు మాటలకు కొదవేలేదు. అలాగే, సాయంకాలం పిల్లలిద్దరికీ అన్నం కూరలు వడ్డించిన తర్వాత, కొడుకు కోడలు కోసం ఉంచిన కూరలు కొద్దిగా తగ్గాయి. తనెలాగూ కూరలు తినాలని ఆశ పెట్టుకోలేదు. పచ్చడి మెతుకులైనా, పట్టెడన్నం దొరికితే చాలన్న స్వభావం తనది. చిన్నప్పుడు తనెలా పిల్లల్ని పెంచిందో తనకి బాగా తెలుసు. కూర తక్కువైందని ఎన్నెన్ని మాటలు అందామె?
"అత్తయ్యగారూ! నాకు కూరలు తక్కువైతే పర్వాలేదు. పచ్చడితోనో, ఊరగాయతోనో తినేస్తాను. మీ అబ్బాయి మాత్రం కూరలు సరిగ్గా లేకపోతే తినలేరని మీకు బాగా తెలుసుకదా! కనీసం, అతనికైనా కూరలు కొంచెం మిగిల్చాల్సింది. చూడండి, నేనైతే పిల్లల కోసం ఏమైనా త్యాగం చేస్తాను." అందామె తను అసలు తన కోసం కూరలు మిగుల్చుకోలేదన్నది కూడా గుర్తించకుండా.
భార్య అన్ని మాటలు అంటున్నా, నోరెత్తలేదు రాఘవ. అనసూయమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగినా ఏమీ మాట్లాడలేక పోయింది. ఏమి చెప్పినా ప్రయోజనం శూన్యం అని ఆమెకి తెలుసు.
ఇలా రోజూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటోంది. ప్రతీనెలా వంటనూని ఖర్చు ఎక్కువవుతుందనో, కాఫీ పొడి, పంచదార వేగం చెల్లిపోతున్నాయనో మాట పడవలసి వస్తూనే ఉంది. మళ్ళీ పండుగలకూ పబ్బాలకూ స్వీట్స్, పిండివంటలు చెయ్యాలి, కానీ పంచదార, వంటనూనె మాత్రం ఖర్చు కాకూడదంటే ఎలా? వంట పనే కాక, మొత్తం ఇంటి చాకిరీ అంతా అనసూయమ్మదే. ఆమె వచ్చిన తర్వాత పనిమనిషిని మాన్పించింది రాగిణి. ఆమె మాటకు ఎదురుచెప్పడు రాఘవ.
చిన్న కొడుకు రాఘవ ఇంటికి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. ఇంకెంత? మరో రెండు నెలలు ఓపిక పడితే, పెద్దబ్బాయి రమణ దగ్గరకు వెళ్ళొచ్చు. అంతదాకా ఎలాగోలా రోజులు వెళ్ళిపోతే చాలు. రోజులు లెక్కపెట్టుకోసాగింది అనసూయమ్మ.
*****
రామచంద్రయ్య, అనసూయమ్మ దంపతులకు రమణ, రాఘవ ఇద్దరు కుమారులు. వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు కలగడంవల్ల బంధువులందరూ వాళ్ళ అదృష్టాన్ని కొనియాడారు. ఆమె కూడా తన అదృష్టానికి మురిసిపోయింది. రామచంద్రయ్యది చిన్న ఉద్యోగమైనా దంపతులిద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు. ఉన్నంతలో తృప్తిగా జీవించారు. కాలక్రమేణా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు.
ఉద్యోగరీత్యా ఇద్దరూ చెరో రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. పెద్దవాడు పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటే, చిన్నవాడు రాఘవ తనతో కలిసి ఉద్యోగం చేస్తున్న రాగిణిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అయినా రాఘవ అభీష్టాన్ని మన్నించి పెద్దవాళ్ళు అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించారు.
పెద్దవాడు రమణ ముంబైలో స్థిరపడితే, చిన్నవాడు రాఘవ చెన్నైలో స్థిరపడ్డాడు. వాళ్ళిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా, రామచంద్రయ్య, అనసూయమ్మ దంపతులు మాత్రం స్వంత ఊళ్ళోనే ఉండిపోయారు. హాయిగా ఆనందంగా సాగుతున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో ఒక్కసారి పెను విషాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా వచ్చిన గుండెనొప్పితో సరైన చికిత్స లభించకపోవడం వల్ల రామచంద్రయ్య కాలం చేసాడు, అనసూయమ్మను ఒంటరిగా వదిలిపెట్టి.
అంతులేని విషాదాన్ని దిగమింగుకొని ఆ ఊళ్ళోనే తన మనుగడ కొనసాగించాలనే ఆమె నిర్ణయానికి కొడుకులిద్దరూ అభ్యంతరం చెప్పారు. తమతో వచ్చేయమని, మనమల్ని చూసుకుంటూ శేషజీవితం గడిపేయమని ప్రాధేయపడ్డారు. ఊళ్ళో ఉన్న ఆస్తుల్ని అమ్మి సొమ్ము పంచుకున్నారు. అయితే, ఆస్తుల్ని పంచుకున్నట్లే తల్లిని కూడా పంచుకున్నారా అన్నదమ్ములు.
ఓ ఆర్నెలు పెద్దకొడుకు దగ్గరా, మరో అర్నెల్లు చిన్నకొడుకు వద్దా ఉండటానికి ఇద్దరిమధ్యా ఒప్పందం కుదిరింది.
తన బాధ్యత కొడుకులిద్దరూ పంచుకోవడం చూసి, ముందు ఆమె మనసుకు కష్టం కలిగినా, ఎలాగూ చివరకు వాళ్ళ పంచనే కదా చేరాల్సింది అని సమాధాన పడింది అనసూయమ్మ. ఇప్పుడైతే కాళ్ళు చేతులూ ఆడుతున్నాయి కాబట్టి నెట్టుకు రాగలదుకానీ, వయసు మీద పడి లేవలేని పరిస్థితిలో ఊళ్ళో పడి ఉంటే, తనని చూసేదెవరు, చేసేదెవరు? అందుకే ఆమె కూడా వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయింది.
పైగా నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులు కూడా తనెలాగూ వాడుకోలేదు కాబట్టి, తనెక్కడ ఉంటే, వాళ్ళకే ఆ డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకుంది ఆమె. ఆ విధంగా ఆమె అన్నివిధాలా కొడుకూ, కోడళ్ళ దయాధర్మాల మీదే ఆధారపడవలసి వస్తోంది. ఇంకా నయం, తనకే ఆరోగ్య సమస్యలు ఇంతవరకూ లేవు కాబట్టీ, ఎలాగోలా నెట్టుకొస్తోంది. మనవల్ని చూసుకొనే బతుకుబండి లాక్కొస్తోందామె.
చిన్నకొడుకు వద్దకు వచ్చి నాలుగునెలలైంది. అయితే, ప్రతీరోజూ ఏదో సమస్య ఎదుర్కోవలసి వస్తోంది. పిల్లల దగ్గర తను విశ్రాంతి తీసుకుంటానని భావించిందామె కానీ, అందుకు విరుద్ధంగా ఇంటి చాకిరీ అంతా ఆమె మీదే పడింది. విశ్రాంతి మాటలా ఉంచి, ఆమెది విశ్రాంతిలేని జీవితం అయిపోయింది.
కొడుకూ, కోడలూ ఇద్దరూ ఉద్యోగస్థులవడం వల్ల, వారికి సమయానికి కాఫీ, టిఫిన్లు అందించడం, క్యారేజీ కట్టడం, పిల్లల్ని స్కూలుకి తయారు చెయ్యడం - ఇలా రోజంతా చాకిరీతో ఆమెకి విసుగొచ్చేసింది. ఎంత త్వరగా రోజులు గడుస్తాయా అని ఎదురు చూస్తోంది. రోజూ క్యాలండర్ చూస్తోందామె.
ప్రతీరోజూ రాత్రి, ‘అమ్మయ్య! ఓ రోజు గడిచింది’ అని మనసులో అనుకొనేది. ఇప్పుడే ఇలా ఉంటే, మున్ముందు అదృష్టం బాగులేక రోగాల బారిన పడితే తన బ్రతుకు ఎలాఉంటుందోనన్న ఆలోచన ఆమె మదిని కలవర పరచింది. ఆమె మనసు రోజూ గాయపడుతూనే ఉంది. శరీరానికి తగిలిన గాయమైతే మానుతుంది కాని, మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానదు.
'పుణ్యాత్ములు, ముందే వెళ్ళిపోయారు!' భర్తను తలచుకుందామె. భర్త ఉన్నంతకాలం ఆమెకే కొరతా లేదు. దంపతులు ఇద్దర్లో ఎవరు ముందు పోయినా, రెండో వారికి ఏదో విధమైన బాధ తప్పదు. తను కాబట్టి, మొండిదని తట్టుకుంటోంది. తనే ముందు పోయి ఉంటే, భర్త పరిస్థితి ఏమయ్యేదో? ఇలాంటి ఆలోచనలతో ఏ తెల్లవారుఝామునో నిద్రపట్టిందామెకి. ఆలస్యంగా నిద్రపట్టినా, తెల్లారి ఆరుగంటలయ్యేసరికి మెలుకువ వచ్చిందామెకి.
రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా, ఉదయం ఆరయ్యేసరికి ఠంచనుగా మెలుకువ వచ్చేస్తుందామెకు. గబగబా లేచి, రోజువారీ పనుల్లో నిమగ్నమైందామె. ఆరున్నరకి పాలవాడి దగ్గర పాలు పోయించుకోవడం నుండి ఆమె దినచర్య ఆరంభం అవుతుంది.
******
అనసూయమ్మ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నిజానికి వారం రోజుల ముందునుండే ఆమె తన పెట్టె సర్దుకుంది. ఆమెలో నూతనోత్సాహం చోటుచేసుకుంది. చివరకు ఇక్కణ్ణుంచి విముక్తి లభిస్తున్నందుకు ఆమె నిట్టూర్చింది. ఆ రోజే అనసూయమ్మ పెద్ద అబ్బాయి రమణ తమ్ముడింటికి వచ్చాడు తల్లిని తనవెంట తీసుకెళ్ళడానికి. అనసూయమ్మ కొడుకుని ఆప్యాయంగా పలకరించింది. "కోడలూ, పిల్లలూ ఎలా ఉన్నారు?" అని అడిగింది.
తల్లి ఇచ్చిన కాఫీ అందుకుంటూ, "బాగానే ఉన్నారమ్మా! నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు." అన్నాడు రమణ.
రమణ మాటలకు సంతోషించింది అనసూయమ్మ. ఆమె మొహం వెలిగిపోతూండటం చూసిన చిన్న కోడలు రాగిణి మూతి తిప్పుకుంది. రాఘవ కూడా ముభావంగానే ఉన్నాడు. అయితే అది అనసూయమ్మ దృష్టిని దాటిపోలేదు. కానీ రమణతో వెళ్ళబోతున్న ఆనందంలో ఆమె అది పట్టించుకోలేదు. ఆమెది తల్లి మనసు మరి!
పైగా తనెళ్ళిపోతే ఇంటిపని, వంటపని వల్ల రాగిణికి కష్టమవుతుందని ఆలోచించింది. మనవల్ని వదిలి వెళ్తున్నందుకు కొద్దిగా మనసులో బాధ కలిగింది కూడా.
రమణతో తల్లి వెళ్తున్నప్పుడు, ఆమె చేతిలో వెయ్యిరూపాయలు పెట్టాడు రాఘవ. ఆ డబ్బుల్ని చూసి, నవ్వుకొని చెరో అయిదు వందలు మనవల చేతిలో పెట్టేసి రమణతో బయటకు వచ్చేసింది అనసూయమ్మ.
రమణ ఇంటికి వెళ్ళిన అనసూయమ్మకి ఎదురు వచ్చింది పెద్ద కోడలు రమ్య. ఆమె వెనుకే వచ్చిన మనవడు మధు, మనవరాలు సుధ ఆమెని చూసి పెనవేసుకుపోయారు.
"నువ్వు ఈ సారి ఇక్కడే ఉండిపో మామ్మా. నాకు, చెల్లికి రోజూ రాత్రి మంచి కథలు చెప్తావు కదూ?" అన్నాడు మధు.
"మరి...నాతో ఆడుకుంటావు కూడా కదా..." ముద్దుముద్దుగా అంది చిన్నారి సుధ.
వాళ్ళిద్దర్నీ అక్కున చేర్చుకుంటూ, "అలాగే!..." అంది అనసూయమ్మ వాళ్ళ ఆత్మీయతకు మురిసిపోతూ.
అలా అనసూయమ్మ కొత్త మజిలీ ప్రారంభమైంది ఆ ఇంట్లో. ఆమెకి తెలుసు అక్కడ తనుండేది ఆర్నెల్లేనని. అయినా అమె నరాల్లో ఏదో కొత్త ఉత్తేజం ప్రవహించింది. పెద్ద కోడలు రమ్య చిన్నకోడలు రాగిణిలా ఉద్యోగస్తురాలు కాదు. అలా అని ఆమెకి వ్యాపకాలు లేవని కాదు. మహిళా మండలి కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటుంది. ఇంట్లో పనిమనిషి ఉండటంవల్ల ఆ శ్రమతప్పింది అనసూయమ్మకి.
ఇంటికి కావల్సిన సామనంతా నెలకోసారి తెచ్చేస్తారు. ఖర్చు విషయంలో పట్టించుకోరు. కాకపోతే, వంటవండి వడ్డించడం, మిగతా పనులన్నీ ఆమె ఎప్పటిలా చేసుకుపోతోంది. రమణ భోజన ప్రియుడు కావటంవల్ల ఆమెకి వంటపని కొద్దిగా పెరిగింది. పైగా రమ్య బయటకు వెళ్ళినప్పుడు ఆమె కోసం కాచుకోవడం తప్పనిసరైంది. భార్య లేకుండా రమణ ఒక్కడూ భోజనం చెయ్యడు. ఆ విధంగా వాళ్ళిద్దరి భోజనం అయ్యేవరకూ ఆమె కాచుకోవలసి వచ్చేది.
ఆ విధంగా ఒక్కోసారి మధ్యహ్న భోజనం పూర్తయ్యేసరికి మూడుగంటలు దాటిపోయేది. రమ్య ఒక్కర్తీ వెళ్ళినా, ఇద్దరూ కలిసి వెళ్ళినా ఎప్పుడొస్తారో తెలియదు. వాళ్ళకోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఆమెది. అయినా ఓపిగ్గా పనులు చేసుకుపోతోందామె. నెలరోజులు ఇట్టే గడిచిపోయాయి.
ఆ రోజు ఆదివారం. సాయంకాలం నాలుగు గంటలకి రమ్య కోసం కొంతమంది మహిళా మండలి సభ్యురాళ్ళు వచ్చారు. కోడలు ముందే చెప్పబట్టి వాళ్ళ కోసం కాఫీ, ఫలహారాలు తయారు చేసి ఉంచిందామె.
వాళ్ళందరూ మాటల్లో పడ్డారు.
"ఏమే రమ్యా! ఈసారి నువ్వు మన మహిళా మండలి అద్యక్షురాలిగా పోటీ చెయ్యి. ఆ బ్యాంక్ మేనేజర్ భార్య నీరజ తెగ నీలుగుతోంది. తను మహిళా మండలి ప్రెసిడెంట్ నని ఆమెకి గొప్ప గర్వం. గొప్పగొప్ప వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగి, మనల్ని పూచిక పుల్లలా చూస్తూంది. నీకేం తక్కువ? ఉద్యోగం చెయ్యడం లేదన్న మాటేగానీ, నీ చదువు ఆమెకుందా చెప్పు? ఈసారి నువ్వెలాగైనా గెలిచి ఆ నీరజ పొగరు అణచాలి." అంది గిరిజ.
రమ్య ఆమెవైపు సాలోచనగా చూడటం గమనించిన వనజ, "అవును రమ్యా, నువ్వు ఈసారి పోటీ చెయ్యి. మేమందరమూ నీకు అండగా ఉంటాము." అంది.
మిగతా వాళ్ళు కూడా ఆ మాటలు బలపర్చారు. ఈ లోపున అనసూయమ్మ వాళ్ళందరికీ ఫలహారాలు, కాఫీలు ఇచ్చింది. అలా చాలా సేపు వాళ్ళ కబుర్లు నడిచాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత, పిల్లతో మాట్లాడుతున్న అనసూయమ్మ దగ్గరకు విసవిసా నడిచి వచ్చింది రమ్య.
"మావాళ్ళు వచ్చినప్పుడు అయినా మీరు మంచి చీర ఒకటి కట్టుకోకూడదా? ఛ...ఛ..నా పరువు నిలువునా తీస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెల్సా అత్తయ్యగారూ? మిమ్మల్ని వంట మనిషనుకున్నారు. వంటావిడ చాలాబాగా చేసింది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది పంపవా అని అడిగింది ఒకామె. మీరేమో నా పరువు ఇలా నిలువునా తీస్తున్నారు." అందామె కోపంతో.
బిత్తరపోయింది అనసూయమ్మ. వంటపనిలో ఉండటంవలన చీర కొద్దిగా నలిగిపోయింది, అంతే! అయినా తను ముందే చెప్పొచ్చు కదా, 'ఆవిడ మా అత్తగా’రని.
అప్పుడు అహం అడ్డొచ్చింది. తీరా వాళ్ళేదో మాట అనేసరికి తనమీదే కోపం ముంచుకొచ్చింది' మనసులో అనుకున్నా, పైకి మాత్రం మౌనం వహించింది అనసూయమ్మ. తనేమైనా జవాబు ఇస్తే, అదో పెద్ద రగడ అవుతుంది. వీలైనంతవరకూ మౌనంగా ఉండటమే మంచిదని ఆమెకి అనుభవం నేర్పిన పాఠం ఒంటబట్టించుకుంది. తన వలన, కొడుకు కోడళ్ళ మధ్య మనస్పర్థలు రావడం ఆమెకి ఇష్టం లేదు.
అయితే మనసు గాయపడుతూనే ఉంది. ఎంత సర్దుకుపోతున్నా ఏదో సమయంలో ఏదో మాట పడవలసి వస్తోంది. మరోసారి రమ్య తల్లితండ్రులు వచ్చారు. అక్కడ, వాళ్ళమధ్య కూడా ఆమెకి అవమానమే జరిగింది. కళ్ళలోని కన్నీళ్ళు కనపడకుండా జాగ్రత్తపడుతూ, అవమానాల్ని సహిస్తూ, మనవల్ని చూసుకుంటూ కాలం గడుపుతోందామె. ప్రతీరోజూ రోజులు లెక్కపెట్టుకుంటోందామె.
ఎప్పుడు ఇక్కణ్ణుంచి విముక్తి లభిస్తుందా అన్న ఆలోచనలతో రోజులు ముందుకు సాగిపోతున్నాయి. చివరికి ఆరునెలలూ పూర్తై, చిన్న కొడుకు రాఘవ దగ్గరకు వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. ఎప్పుడు రాఘవ వస్తాడా, తనని తీసుకువెళ్తాడా అని ఎదురుచూస్తోందామె. అనసూయమ్మ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రమణని, కోడల్ని, మనవల్ని వదిలి వెళ్ళాలంటే మనసులో ఓ మూల దిగులు ఆవహించినా, మళ్ళీ ఆమెలో నూతనోత్సాహం పుంజుకుంది.
ఎందుకంటే, ఈ ఆర్నెలల్లో రాఘవ ఇంట్లో తను ఇంతకుముందు పడిన కష్టాలు మర్చిపోయిందామె. కొత్తగా కలిగిన కష్టాలు, పాత కష్టాల్ని మరిపింప చేస్తాయి మరి! ఈ పంజరంలోంచి విడుదలై, మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళిపోతోందామె.
అయితే, ఈ భవబంధాల పంజరాల నుండి అనసూయమ్మకి విముక్తి ఎప్పుడో మరి? ఆమె శక్తంతా ఉడిగినాక, అన్నదమ్ములిద్దరూ కలిసి అమెని వృద్ధాశ్రమంలో చేర్చితేనో, లేకపోతే ఈ బతుకు పంజరంలోంచి జీవుడు విడుదలైన తర్వాతేమో, ఎవరికి మాత్రం తెలుసు? ఎప్పటికైనా విముక్తి మాత్రం తథ్యం! అప్పటివరకూ ఎదురుచూపులు తప్పవు! ఎప్పుడూ రోజులు లెక్క పెట్టుకోవడంతోనే సరిపోతోంది అనసూయమ్మకు పాపం!
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
"ఎదురు చూపులు" కథలో అనసూయమ్మ అనే వృద్ధురాలికి తన కుమారుల, కోడలల నుండి ఎదురైన అనుభవాలు, వృద్ధాప్యంలో ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లు గాఢంగా, సున్నితంగా పోరాడుతూ వివరించబడ్డాయి. ఆమె జీవితం వృద్ధాప్యంలో ఏర్పడిన సంబంధాలతో నిండిన ఒక అందమైన చిత్రణ.
అనసూయమ్మ తన జీవితంలో అనేక దుఃఖాలను మానసికంగా శక్తితో జయించినప్పటికీ, ఆమె ఇప్పుడు తన బంధువుల మధ్య జీవిస్తున్న జీవితాన్ని, ప్రేమ-పరస్పర సంబంధాలను చూడటంతో పాటు, తన స్వీయ విలువను కూడా గుర్తించడం చాలా కష్టం.
కథ చివర్లో, అనసూయమ్మకి సరైన విముక్తి ఎప్పుడు లభిస్తుందో అనేది ప్రశ్నగా వేయబడింది. ఆమె జీవితం, కుటుంబం, వృద్ధాప్యం, గుండె చింతలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు. ఈ అన్ని అంశాలను మెలకువతో పరిగణిస్తూ, అనసూయమ్మ జ్ఞానం, దయతో జీవిస్తోంది.
ఈ కథ ఒక వృద్ధ మహిళ జీవితం, మనసు, కుటుంబ సంబంధాల పై చర్చ చేస్తుంది. చివరికి ఆమె జీవితంలో ఉన్న "ఎదురు చూపులు" ని ఎలా జయించాలో ప్రశ్నిస్తుంది.