top of page
Writer's pictureIndira Rao Shabnavis

ఏ దారెటు పోతుందో



Ee Daretu Pothundo New Telugu Story

Written By Indira Rao Shabnavis

రచన: ఇందిరా రావు షబ్నవీస్




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“అమ్మా!! అమ్మా!!”

“ఇంద ఈ రొట్టె తిను” అని బలవంతంగా ఎవరో నోట్లో చిన్న రొట్టెముక్క పెట్టారు.

కళ్ళు తెరిచే ఓపిక కూడా లేకపోయింది వర్ధనికి. ఆ చిన్న ముక్క నాలికకి తగలగానే మరచిపోయిన ఆకలి, రుచి ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కళ్ళు మూసుకునే ఆ పెట్టే చెయ్యి ఎవరిదో చూడకుండానే ఆవురావురుమని గబగబా తింది. అంత హడావిడిగా తినడంలో గొంతులో ముక్క అడ్డుకొని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది.


“అమ్మా! ఇదిగో నీళ్లు తాగు” అని రెండు చుక్కలు నోట్లో పడ్డాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది తన ప్రాణం నిలిపింది ఎవరు అన్నట్టుగా.


ఒక పది, పన్నెండేళ్ల అమ్మాయి ఉన్నంతలో కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకొని ఉంది.. పిల్లలో బీదరికం ఉట్టిపడుతోంది. కానీ కళ్ళల్లో ప్రేమ, జాలి కనబడుతున్నాయి.. తినడం అపి, చుట్టూ తిరిగి చూస్తూ “ఎవరమ్మా నువ్వు?” అంది ఓపిక తెచ్చుకుంటూ వర్ధని.


“ముందు నువ్వెవరవో చెప్పమ్మా. ఇక్కడ రెండు రోజుల నుండి పడి ఉంటే చూసి మా నాయన టీ, రొట్టె ఇవ్వమంటే వచ్చాను.. ఏ ఊరు మీది?” అంది ఆ అమ్మాయి.


“తానెవరో? ఇక్కడికి ఎందుకొచ్చిందో?” వెంటనే గుర్తు రాలేదు వర్ధనికి.


“ఇదే వూరు?” అంది.

“తిరుపతి” అంది ఆ అమ్మాయి.


‘తిరుపతా? తను ఇక్కడికి ఎలా వచ్చింది?’ కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.


“తిరుపతి.. తిరుపతి... తనది కాకినాడ కాదూ!! ఇక్కడ... అన్నట్టు అవును.. వాడేడి?” మళ్ళీ చుట్టూ చూసింది.

“వాడేడీ?” అంది వెతుకుతూ.


“ఎవరు? ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రెండు దినాలుగా పండుకొని వుంటివి. ప్రాణం ఉందో లేదో కూడా తెలవలె. మా నాయన వచ్చి చూసి ఇగో ఈ టీ తాపించమంటే వచ్చిన” అంది అమ్మాయి మళ్ళీ.


తను, వాడు తిరుపతి రావడం, దైవ దర్శనం చేసుకోవడం, హోటల్ లో టిఫిన్ తింటూ “ఫోన్ వచ్చిందని ఇప్పుడే మాట్లాడి వస్తాను ఇక్కడే వుండు” అని చెప్పిన కొడుకు ఎంతకీ రాకపోవడం.. అన్నీ గుర్తుకు వచ్చాయి వరసగా.


‘కావాలనే వదిలి వెళ్లాడన్న మాట తనని? ఇలా వదిలించుకున్నాడా? ఇంకే దారి దొరకలేదా తనని వదిలించుకోవడానికి? ఊరెళ్ళి ఏమని చెప్పాడు అందరికి?’..

అన్నీ సమాధానం లేని ప్రశ్నలే వర్ధనికి.


ఇంతలో ఆ పిల్ల తండ్రి దగ్గరికి వచ్చాడు “వాణీ ! ఆమె లేచిందా?” అని అడుగుతూ.

వర్ధని ని చూసి “ఏమమ్మా, లేచినావా? ఏడ నుండి వచ్చినావు?” అన్నాడు.

“నువ్వు ఎవరు బాబు?” అంది వర్ధని.


“నాకు ఈడ టీ బండి ఉందమ్మా. ఈ పిల్ల నా కూతురు. రెండు దినాల్నుంచి అట్టా నువ్వు పండుకొని ఉంటే చూసి నేనే పిల్లని పంపిన. ఎప్పుడు తిన్నవో ఏమో అని” అని అన్నాడు.


ఆ ప్రేమ, ఆప్యాయతకి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి వర్ధనికి.

“ఏమయింది తల్లీ, అంతా బాగేనా? మీ మనుషులు ఏడ వుంటారు? “ అన్నాడు మళ్ళీ.


“మా వాళ్ళా? నాకు నా అనే వాళ్ళున్నారా అసలు” అనుకుంది వర్ధని.


వర్ధని పరిస్థితి చూసి జాలి పడ్డాడు నరసింహులు.

“ఎక్కడనుంచి వచ్చిందో పాపం, చూస్తే మంచి కుటుంబం నుండి వచ్చిన తల్లి లాగే వుంది” అనుకున్నాడు.


“నాకు నా అనే వాళ్ళు, నా వాళ్ళు ఎవరు లేరు బాబు.. “ అంది వర్ధని.

“మరి ఎక్కడ నుండి వచ్చావు? ఎక్కడికి వెళతావు...” సందేహం గా అన్నాడు నరసింహులు .


‘అవును, నా అనే గూడు లేదు ఇప్పుడు. మళ్ళీ ఆ నరక కూపం లోకి వెళ్లడం అవసరమా? వెళ్లినా మళ్ళీ వాడు ఎదో ఒకటి చెయ్యడని నమ్మకం ఏంటి? ఈసారి ప్రాణమే తీయ్యచ్చు.. కడుపున పుట్టిన కొడుకే గాని రాక్షసుడు వాడు. ఎంత కైనా తెగిస్తాడు’ అనుకుంది వర్ధని.

“నాకు నా అనే వాళ్ళేవ్వురూ లేరన్న” అంది మళ్ళీ.

ఏం చెయ్యాలో పాలుపోలేదు నరసింహులుకి కూడా.. చూస్తూ చూస్తూ ఒక ఆడ కూతురిని రోడ్డు మీద వదిలలేసి వెళ్ళడానికి మనస్కరించలేదు.. అలాగని తనింటికి రమ్మంటే... ఏమనుకుంటుందో.. పేదవాడు తాను.. తప్పుగా అనుకుంటే.

ఇంతలో వాణి “నాయన, పోనీ అత్తని మనింటికి తీసుకొని పోదామా” అంది గబుక్కున..

ఆ పాపా ఆలా వరస కలపడం ముచ్చటగా అనిపించింది వర్ధనికి.

“అవును, పోనీ మా ఇంటికి రామ్మా. నేను అంత గొప్పవాడిని కాను, కానీ .... “అని ఆగిపోయాడు నరసింహులు.


“అన్నా, నువ్వు నేను ఎవరో తెలియకుండా రమ్మని ఒక ఆడపడుచు ని పిలిచినట్టు పిలవడమే చాలు, నేను కూడా అంత గొప్ప దానిని కాదు.. వస్తాను పద” అని వాళ్ళతో బయలు దేరింది.

తన చిన్న టీ బండి మీద అన్ని సర్ది పెట్టి ముగ్గురు నరసింహులు ఇంటి వైపుకు కదిలారు.


“అమ్మా, నీ కష్టం ఏందో తెలవదు, చూస్తే పెద్ద కుటుంబం ఆడమనిషి లాగ వున్నావు.. ఇక్కడ ఎట్లా వచ్చినావు? ఇట్లా అడుగుతున్నానని అనుకోకు తల్లీ, కావాలంటే నిన్ను నీ ఊరు, నీ మనుషుల కాడికి పంపస్తా. కుటుంబం అన్నాక మంచి చెడు, కోపాలు అన్ని వుంటాయి.. కొంచెం సర్దుకు పోవాలి కదా!! ఇట్లా కోపం తెచ్చుకొని అయినవాళ్ళని కాదనుకుంటే ఎట్లా.. నీకు చెప్పేటంత పెద్దోన్ని కాదు గానీ “ అన్నాడు అనునయంగా నర్సింహులు..


“అన్నా, నేను కోపం తో ఇల్లు వదిలి రాలే. నా వాడు అనుకున్న నా కొడుకే నన్ను మోసం చేసి ఇట్లా ఊరు కాని ఊరు లో వదిలేసి పారిపోయాడు“ అని తన కథ చెప్పుకొచ్చింది.

వర్ధని పుట్టిన ఆరేళ్లకే తండ్రి పొలం లో ఎద్దు కుమ్మి మంచం మీద పడ్డవాడు మళ్ళీ లేవలేదు. అమాయకురాలైన తల్లిని మరిది, ఆడపడుచు మోసం చేసి, పొలం లో పంటలు పండటం లేదని నెమ్మదిగా అమ్మించేసి అంతే వచ్చిందని ఒక వంతు చేతిలో పెట్టేసి చెయ్యి దులిపేసుకున్నరు. చదువు లేదు, చేతిలో చంటి పిల్ల, పుట్టింట చూసే దిక్కు లేదు.


తన పొలం లోనే కూలీగా చేరి బిడ్డని సాకింది. తల్లి అమాయకత్వమే వచ్చింది వర్ధనికి. మాటలు రావడమే ఆలస్యంగా వచ్చాయి, ఎదుగుదల కూడా అంతంత మాత్రమే. ఎక్కువ మాట్లాడక పోయినా ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా అతి శుభ్రంగా చేసేది. అందుకని కొంచెం పెద్దయ్యాక అందరు ప్రతి చిన్న పనికి, చేతి సాయానికి పిలవడం మొదలు పెట్టారు. ఎంత బండ పనైనా చేసేది.


నేను చెయ్యలేను, చెయ్యను అనేది కాదు. వాళ్ళిచ్చిన పప్పో, కూరో, లేదా బియ్యం లాంటివి ఇంటికి తెచ్చేది. ఎవ్వరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు కారు. ఇంట్లో మిగిలిన అడుగు బొడుగు ‘పట్టుకెళ్లు తల్లి, నీ కోసమే ఉంచాను’ అనేవాళ్ళు. ‘అదేమిటి’ అనేది కాదు. వాళ్ళు ఏది ఇస్తే అదే మహా ప్రసాదం లాగే తీసుకెళ్లేది. తల్లి కూడా ఏమి అనేది కాదు. తను తెచ్చిందే ఇద్దరు సర్దుకొని తినేవాళ్ళు.


చూస్తుండగానే 18 ఏళ్ళు నిండాయి వర్ధనికి. అందరు పెళ్లెప్పుడూ అని తల్లిని అడగడం మొదలు పెట్టారు. అంతవరకు ఆ ఊహ తట్టనందుకు తనను తాను తిట్టుకుంది, భయపడింది, బెంగ పెట్టుకుంది తల్లి.

“అవును, ఎలా? ఎలా చెయ్యాలి దీని పెళ్లి? పిల్ల ఎక్కువ తెలివైనది కాదు, అందం అంతంత మాత్రమే. తను డబ్బు దస్కం వున్న మనిషి కాదు, ఏం చెయ్యాలి భగవంతుడా?” అనుకుంది మళ్ళీ బెంగగా మరోసారి తల్లి.


ఎప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పార్వతమ్మ గారు “ ఎవరికో ఎందుకు, బంగారం లాంటి పిల్ల మా వర్ధని, నా కోడల్ని చేసుకోను? “ అంది.

దిక్కు తోచలేదు వర్ధని తల్లికి. అందరికి తెలుసు ఆవిడ కొడుకు సంగతి. వాడికి లేని అలవాటు లేదు. ఎప్పుడూ తాగి, పట్నం లో నాగమణి ఇంటిలో గడిపి వస్తుంటాడు. డబ్బు అయిపోయినప్పుడు తల్లిని పీడించుకొని తిని చేతికి అందినంత పట్టుకుపోతాడు. ఒక్కడే కొడుకు. తండ్రి లేని పిల్లాడని బాగా గారాబంగా పెంచింది. చదువు వంట పట్టలేదు. తల్లి తరఫున బాగా ఆస్థి కలిసి వచ్చింది. ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టడానికే పుట్టాడా వీడు అనిపిస్తుంది. ఊళ్ళో వాడి సంగతి తెలిసే ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఏళ్ళు ముదురుతున్నాయి.


వాడికి పెళ్లి చేస్తేనన్నా కాస్త ఇంటి పట్టునుంటాడేమోనని పార్వతమ్మ గారి ఆశ. పెళ్లి చేస్తే కుదురుగా ఉంటాడేమోనని, వాడి కడుపున ఒక కాయ కాస్తే, సంసారం కుదుట పడితే ఎన్నాళ్ళు గానో ఎదురుచూస్తున్న కాశీ కి పోవాలని ఆశ. ఏది తీరడం లేదు ఆవిడకి. ఇప్పుడిది ఇది చాలా మంచి అవకాశం లాగా తోచింది. ఎలాగూ లేని వాళ్ళు.. వర్ధని తల్లి ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ తేగలదు? అందులో వర్ధని సంగతి అందరికి తెలిసిందే. పది మంది చేసే పని ఒక్క పిల్ల చేస్తుంది. ఎలాగోలా వర్ధని తల్లిని ఒప్పించగలిగితే అనుకొని నెమ్మదిగా ఇద్దరినీ మంచి చేసుకోవడం మొదలు పెట్టింది.


పండగలకి కొత్త బట్టలు కొనివ్వడం, “రావే ఎన్నాళ్ళైందో చక్కగా జుట్టు దువ్వుకుని” అని దగ్గరికి తీసుకోని నున్నగా నూనె రాసి తల దువ్వడం, పండగలకి పబ్బాలకి స్పెషల్ గా తయారుచేసిన వంటకాలు ఇవ్వడం.. ఇలా అన్ని ప్రయత్నాలు చేసింది. ఇద్దరికీ అర్ధం కాలేదు ఎందుకు అకస్మాత్తుగా ఇలా మారిపోయిందో ఈవిడ అని.


తెలిసాక వర్ధని తల్లికి ఏం చెయ్యాలో తోచలేదు. అటు చూస్తే పిల్లాడి సంగతి అందరికి తెలిసిందే. ఇటు చూస్తే చేతిలో దమ్మిడీ లేదు, తన తరువాత పిల్ల సంగతి ఏంటి? అన్న దిగులు అనుక్షణం వెంటాడుతూనే వుంది.

“ఎలా? ఏం చెయ్యాలి?” అనుకుంది మరోసారి బెంగగా వర్ధని తల్లి.


పార్వతమ్మ ఈ సారి సూటిగానే అసలు విషయానికి వచ్చేసింది. “ఏమ్మా మా గోవిందును చేసుకుంటావా?” అని, వర్ధని తల్లితో “చెప్పమ్మ, ముహూర్తం పెట్టించమంటావా?” అంది.


“అమ్మ, గోవిందుబాబు” నసిగింది వర్ధని తల్లి.


“ఆ..వాడికేం తక్కువ, పదెకరాల మాగాణి కి ఆసామి వాడు. చిన్నతనం వల్ల అలా కుదురు లేక పోయాడు కానీ కొంచెం వయసు వచ్చి పెళ్లి చేస్తే వాడే సంసారం భుజాల మీద పడి మారడా?” అంది కొంచెం కోపంగా. అదేమాట నలుగురితో చెప్పించింది. ఇంకేమి అనలేక ఒప్పుకుంది వర్ధని తల్లి.


వర్ధనిని అడిగిన వాళ్ళు కానీ తన అభిప్రాయం గురించి పట్టించుకున్న వాళ్ళు గాని లేరు.


“ఎంత అదృష్టవంతురాలు!! అలా పూరి గుడిసె లోంచి ఇలా పెద్ద భవంతి లోకి వచ్చేస్తుంది” అని తన అదృష్టాన్ని పొగిడిన వాళ్ళే అందరు.. కామోసు అనుకుంది వర్ధని. చూస్తుండగానే పెళ్లై పోయి కాపురానికి వచ్చేసింది. ఇప్పుడు ఒకటే తేడా. అందరిళ్ళలోకి వెళ్ళి అన్ని పనులు చెయ్యనక్కరలేదు.. అందరిళ్ళల్లో చేసే పనంతా ఈ ఒక్క ఇంట్లో నే. తాళి కట్టిన మొగుడు ఆ గంట తరువాత మళ్ళీ కనిపించలేదు.. పట్నంలో ఎవరితోనో ఉంటాడని వింది..


పెళ్ళి అయ్యాక, ఇంతకు ముందు, జీవితం లో మార్పు లేదు, ఒక్క గుండెల మీద మంగళసూత్రం తప్ప. అంతవరకు అతి ముద్దు చేసిన పార్వతమ్మ అన్ని పనులు నెత్తిన రుద్దడం మొదలు పెట్టింది. నెమ్మదిగా ఒక్కొక్క పనివాళ్ళని మాన్పించేసింది. పని చెయ్యటం తనకు అలవాటే గా అనుకుంది వర్ధని. ఇంటి మీద ధ్యాస మళ్ళీ నప్పుడు వచ్చి తల్లి దగ్గర డబ్బులు తీసుకొని ఒకటో రెండో రోజులు ఉండి మళ్ళీ వెళ్ళి పోయేవాడు గోవిందు.


ఏనాడూ వర్ధనితో మాటలు లేవు. తాగి వచ్చి కొట్టె దెబ్బలు తప్ప. తను ఎంత మౌనం గా భరిస్తూ వుంటే అంత రెచ్చి పోతుండే వాడు. ఎందుకు చేసుకుంది ఈ పెళ్ళి అని అనుకోలేదు వర్ధని.. “అసలు అలోచించే బుర్ర ఇవ్వలేదు” భగవంతుడు అనుకుంది. ఈ లోపల ఒక పుత్ర రత్నాన్ని ప్రసాదించాడు గోవిందు. చిన్నప్పటినుండి తల్లిని తండ్రి చావగొట్టడం చూసి ఆడదాన్ని అలా చితక బాదడం కోసమే మగ పుట్టుక లోని పరమార్ధం అనుకున్నాడు ఆ జాతి రత్నం.ఆ తండ్రి కడుపున పుట్టినందుకు, పులి కడుపున పులే పుడుతుందని తండ్రి చెడ్డ అలవాట్లు చిన్న తనం నుండే అలవర్చుకున్నాడు.

వాడికి తోడు నాయనమ్మ విపరీత మైన గారాబం. వంశోద్దారకుడు పుట్టాడని వాడు అడిగినవి, అడగనివి అన్నీ ఇచ్చేది పార్వతమ్మ. వాడి ఎదురుగానే కోడల్ని నానా మాటలు అనేది.. మొగుడితో దెబ్బలు, అత్తగారి మాటలు, కొడుకు దుడుకు తనం బండబారిపోయింది వర్ధని.


విపరీతమైన తాగుడు వల్ల లివర్ చెడి భర్త, వృద్యాప్యపు జబ్బులతో అత్తగారు ఒకరి తరువాత ఒకరు మరణించాక కొంచెం తెరిపిన పడింది వర్ధని. “హమ్మయ్య, దెబ్బలు, తిట్లు, ఇంక వుండవు” అనుకుంది. కానీ, అధికారం, డబ్బు, ఆధిపత్యం రాగానే కొడుకు చెలరేగిపోయాడు. వాడిని అదుపులో పెట్టేవాళ్ళు లేక తండ్రిని మించిన వాడయ్యాడు. తల్లి అడిగినంత డబ్బు ఇవ్వక పోతే కొట్టే స్టేజి కి వచ్చాడు.


కొన్నాళ్ళు భరించి ఒకనాడు “ఇవ్వను పొమ్మంది”. “ఏం చేసుకుంటావో చేసుకో” అంది. అంత ధైర్యం సడన్ గా తల్లికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. కొన్నాళ్ళు చాల ప్రేమగా నటించాడు. ముందు అతని ప్రవర్తనకి బోల్తా పడినా నెమ్మదిగా గ్రహించింది ఇదంతా దేనికో. వర్ధని మనసు ముందు మెత్తబడినా మళ్ళీ కొడుకు సంగతి తెలుసు కనక బిగుసుకుపోయింది అలాగా అయినా మారతాడేమోనని. తల్లిని ఎలా లొంగదీసుకోవాలో, ఎం చెయ్యాలో తోచలేదు రమేష్ కి.


“పోనీ చంపేస్తే, పీడా వదిలిపోతుంది. ఆస్థి అంతా తానే ఇష్టమొచ్చినట్టు అనుభవించవచ్చు” అనుకున్నాడు ఒక్క క్షణం. “అమ్మో, దొరికిపోతే!! పోలీసులు, జైలు, గొడవ”. మళ్ళీ భయమేసింది. మరి “ఎలా వచ్చిలించుకోవడం?” బాగా అలోచించి తల్లితో లేని ప్రేమ నటించి “పద, ఎప్పటినుంచో తిరుపతి దర్శనం చేసుకుందాం అంటున్నావు కదా, వెళదాం” అన్నాడు.


“ఏమైంది వీడికి? దేవుడి దయ వల్ల మారుతున్నాడేమో , పోనిలే మంచిగానే ఆలోచిద్దాం” అనుకుంది వర్ధని . ఆ వారం రోజులు తాగుడు, అల్లరి గొడవ లేకుండా వున్నాడు. టికెట్స్ తెచ్చి తిరుపతి తీసుకెళ్లాడు ఫ్లైట్ లో.. పెద్ద హోటల్ లో దింపాడు.. ఏంటి? ఇంత హంగామా చేస్తున్నాడు?? నిజంగా బుద్ది వచ్చిందా వీడికి?? అ స్వామి దయవల్ల వీడు మారి ఒక ఇంటి వాడైతే ఇంకేం కావాలి? అనుకుంది.


దైవ దర్శనం చేయించాడు. కింద తిరుపతి కి వచ్చారు.. ఇంకో మంచి హోటల్ తీసుకున్నాడు.. కాణిపాకం, కాళహస్తి చూపించాడు.చిన్నప్పుడు తన చిలిపి చేష్టలు తల్లితో పంచుకున్నాడు. ఆ తల్లి మనసు మురిసి పోయింది. నా తండ్రి మారిపోయాడు అనుకుంది. అన్నీ అయ్యాక మళ్ళీ తిరుపతి తీసుకొని వచ్చి గోవిందరాజస్వామి ని మరోసారి చూడాలని ఉంది అన్న తల్లి కోరిక తీర్చి అక్కడ దగ్గర లో వున్న హోటల్ లో భోజనం చేస్తుండగా వాడికి ఫోన్ వచ్చింది.


“ఇప్పుడే వస్తాను, నువ్వు తింటూ వుండు” అన్నాడు. వెళ్లిన వాడు గంటైనా పత్తా లేదు. చెయ్యి కడుక్కొని వచ్చి కూర్తుంది. బిల్లు తెచ్చిన సర్వర్ ని చూసి “బాబు వస్తాడు కొంచెం అగు” అంది. అతను “బిల్లు డబ్బులు కట్టేసాడమ్మా” అన్నాడు . మరి ఇదేవిటి అని చూస్తే 50 రూపాయల చిల్లర వుంది. ఎటు వెళ్లినట్టు అని బయటకు వచ్చి చూసింది. ఎక్కడ లేడు. వాడు తీసుకున్న హోటల్ ఎక్కడో, పేరేమిటో కూడా గుర్తు లేదు.

అసలు అవన్నీ పట్టించుకోలేదు నాకెందుకు లే అని. ఇప్పుడు చేతితో ఆ 50 రూపాయల చిల్లర తప్ప ఇంకేం లేదు. “ఎటు పోయాడు? ఏదయినా కొనుక్కు రావడానికి వెళ్లాడా?” ఆనుకొని మళ్ళీ వెతుక్కుంటాడేమోనని అక్కడే ఒక పక్కన బల్ల మీద కూర్చుంది ఆ వెర్రి తల్లి.


సాయంత్రం అయింది, రాత్రి అయింది, కొడుకు రాలేదు. ఒకటి రెండు టీలు తాగింది ఆకలిని ఓర్చుకోవడానికి. రాత్రి వరకు ఉన్నాక అర్దమయింది. కావాలనే వదిలించుకోవడానికి వదిలి వెళ్లిపోయాడని..

“ఎం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి?” మళ్ళీ తిరిగి ఊరు వెళ్లినా తనను చూస్తాడని నమ్మకం లేదు. రెండురోజులు అరటి పండ్లు తింటూ దొరికిన చోట నీళ్ళు తాగుతూ మరీ ఆకలి వేస్తే టీ తాగుతూ గడిపేసింది. వున్న డబ్బులు అయిపోయాయి.ఇదంతా నటనా?? ఈ మూడు రోజులు వాడు చూపించిన ప్రేమ?? దుఃఖం వచ్చింది. భర్త పోయినప్పుడు కూడా అంత బాధ పడలేదు..


తన జీవితం ఎందుకు ఇలా కష్ఠాలమయం అయ్యింది?? పూర్వ జన్మలో ఎంత పాపం చేసుకుందో అని ఏడ్చి ఏడ్చి శోష వచ్చి అలాగే కళ్ళు మూసుకుంది. నాలుగు రోజులయ్యేసరికి నీరసం తో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఒక పక్కగా గోడకి ఆనుకోని కూచుంది.


రెండు రోజులుగా పక్కన టీ బండి నర్సింహులు ఈ పెద్ద మనిషి ని చూస్తున్నాడు.. మొదటి రోజు రెండు కప్పులు టీ మాత్రం తాగింది ..నిన్నటి నుంచి అలాగే పడుకొని ఉంది..”ఎవరో పెద్దింటి ఆడపడుచు లాగా వుంది” అనుకొని జాలిపడి టీ, రొట్టె కూతురితో పంపించాడు.


తన కథ విన్నాక అభ్యంతరం లేకపోతే వాళ్ళ తో అక్కడే ఉండమన్నాడు నరసింహులు. “కానీ తమది పూరి గుడిసె, అందులో ఉండగలవా అమ్మా నువ్వు?? చూస్తుంటే కలిగిన ఇంటి మనిషి గా అనిపిస్తుంది” అన్నాడు.


“అన్నా, నీకంటే పేద కుటుంబం నాది.. నీ దగ్గర ప్రేమ, ఆప్యాయత వున్నాయి.. నాకు అవి కూడా లేవు” అంది కళ్ళ నీళ్ళతో..


రెండురోజులు వాళ్ళతో ఉన్నాక వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు వర్ధనిని కదిలించాయి. ఇన్నాళ్లు ప్రేమ లేమితో బాధపడుతున్న ఆమెకు ఊటబావి దొరికినట్టనిపించింది. మనుషులకు డబ్బు కాదు ముఖ్యం, ఇలాంటి బంధాలు, ఆప్యాయత, అనురాగాలు చాలా బలాన్నిస్తాయి” అనుకుంది మరోసారి.


నెమ్మది మీద వాళ్ళ గురించి తెలుసుకుంది. నర్సింహులు చిన్నతనంలో ఒక ప్రమాదం లో కాళ్ళు పోగొట్టుకున్నాడు. భార్య అనారోగ్యం తో చనిపోతే ఈ 12 ఏళ్ళ కూతురిని పెట్టుకొని చిన్న టీ కొట్టు పెట్టుకొని సాకుతున్నాడు.. వచ్చింది ఈ చిన్న రూమ్ అద్దె కి, బజారులో టీ బడ్డీ పెట్టుకోవడానికి ఆ యజమాని కి అద్దె కి ఇంచుమించు సరిపోతుంది... వచ్చిన రోజు వస్తుంది, లేని రోజు తండ్రి కూతురు పస్తు ఉంటారు..


వర్ధని ఆ ఇంటి పరిస్థితి గ్రహించింది. మళ్ళీ కొడుకు, ఆ నరకం లోకి వెళ్లడం అసంభవం.. వీళ్ళే ఆ తిరుపతి వెంకన్న ఇచ్చిన బంధువులు అనుకుంది. తనని ఆపదలో ఆదుకొని ఇంత అన్నం పెట్టారు. తనకు తోచినంత సాయం చెయ్యాలి అనుకొని నెమ్మదిగా నర్సింహులు ని ఒప్పించి, తన చేతికున్న రెండు బంగారు గాజులు అమ్మించి దగ్గర లో వున్న చిన్న షాప్ ని అద్దెకు తీసుకోమంది. తను కూడా ఇడ్లీలు, వడలు, దోసెలు లాంటి ఫలహారాలు చెయ్యడం మొదలుపెట్టింది..


“వర్ధని ఫలహార శాఖ” ఇంతింతై వటుఁడింతయై అన్నట్టు ఆరేళ్ళల్లో పెద్ద పేరు పొందిన ఫలహార శాఖ గా దిన దినాభి వృద్ధి చెందింది. ఇంకో నాలుగు నెలలకి కాళహస్తి, చిత్తూరు చుట్టుపక్కల వర్ధని హోటల్స్ వెలిసాయి.. నమ్మకమైన వర్కర్స్ ని పెట్టుకొని రుచి, శుభ్రత ఉండేటట్టు చూసుకుంది.. నర్సింహులు కి వర్ధని ఏది చెప్తే అది వేదం.. ఆనాడు ఇచ్చిన ఒక టీ, రొట్టె తనని ఇంత గొప్పవాడిని చేస్తుంది అనుకోలేదు.


ఇంకో రెండేళ్లకి వాణి కి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది వర్ధని.. అబ్బాయ్ సుందరం చాలా మంచి వాడు. మరో ఏడాదికి వర్ధనిని నాయనమ్మ ని చేసింది వాణి.. నెమ్మదిగా వాణికి, సుందరం కి తమ హోటల్ ని అప్పచెప్పి మనవరాలి తో ఆడుకుంటున్నప్పుడు ఆ చిన్న నాలుగేళ్ళ పిల్ల “ నాయనమ్మ, పైన కొండ మీద దేముడి ని చూసోద్దామా??” అంది.


తిరుపతి లోనే వున్నా ఆనాటి నుండి మళ్ళీ దైవ దర్శనం కి వెళ్ళలేదు వర్ధని.. ఎన్నిసార్లు ఎంతమంది రమ్మన్న రాలేదు..

నర్సింహులు ఎన్ని సార్లు “ఎందుకమ్మ అంత కోపం ఆ భగవంతుడి మీద” అన్నా మాట్లాడలేదు..

ఇప్పుడు ఈ చిన్న పిల్ల రోజూ ఏడుపే వెళ్దాం రమ్మని..


ఇంక నర్సింహులు కూడా “ అమ్మా, ఎందుకు అది అంత పంతం పడుతోందో.. వెళ్ళమ్మా.. ఆయన వల్లే కదా నువ్వు, మేము కలిసాము.. అలా దేముడి మీద కోపగించుకోకు తల్లి.. భగవంతుడి లీలలు మనకు అర్ధమవుతాయా?? “ అన్నాడు నచ్చచెప్తు..


ఆలోచన లో పడింది “నిజమే, ఆనాడు వాడు వదిలి వెళ్లిపోవడం వల్ల కదా ఈ కుటుంబాన్ని కలిసి ఈనాడు ఇలా సంతోషం గా ఉంది..లేకపోతే వాడితో ఎంత గొడవ పడుతూ వుండేదో” ఆనుకుంది.


వారం తరువాత తిరుమల కొండ మీద దైవ దర్శనం అయ్యాక “అమ్మా!!” అన్న పిలుపు విని వెనుకకి తిరిగి చూసింది.. వీల్ ఛైర్లో కొడుకు.. రెండు కాళ్ళు, రెండు చేతులు లేవు.. వెనుక ఎవరో మొగ మనిషి వీల్ ఛైర్ పట్టుకొని నిలబడి వున్నాడు.. ఒక్క క్షణం గుండె ఆగిపోయింది వర్ధనికి.. “ఏమైయింది తన కొడుక్కి??”


“రమేష్, ఏమయింది రా?? ఈ చక్రాల కుర్చీ ఏంటి?? నీ కాళ్ళు, చేతులు??” కళ్ళల్లో నీళ్ళు ధారగా కారిపోతున్నాయి.. మాట రావడం లేదు.


“అమ్మా, కన్న తల్లి ని మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేసినందుకు ఆ ఏడుకొండల వాడు వేసిన శిక్ష” అన్నాడు బాధగా రమేష్..


“అంటే నిన్ను వదిలి మన ఊరు వచ్చిన వారం రోజులకి లారి వచ్చి గుద్దేసింది.. బతికి బయటపడ్డాను కానీ కాళ్ళు, చేతులు నుజ్జు అయిపోవడం తో తీసేసారు.. అప్పటి నుండి ఇలా జీవచ్చవం లా బతుకుతున్నాను.. నీ గురించి పేపర్ లో వేయించాను.. ఎక్కడ నీ జాడ తెలియలేదు.. చేసిన తప్పుకు క్షమించమని, నువ్వు కనిపించేలా చెయ్యమని దేముడిని ప్రార్ధించడానికి ఇక్కడికి వచ్చాను.. ఎక్కడ పారెసుకున్నామో అక్కడే వెతకాలి కదా!! అమ్మా!! నన్ను క్షమించు!!” అని కుర్చీ మీద నుండి కిందకి వర్ధని కాళ్ళ మీద పడి పోయాడు రమేష్..


తల్లి మనసు కరిగి పోయింది.. రమేష్ ని గుండెకి హత్తు కుంది..

***

ఇందిరా రావు షబ్నవీస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:




నమస్తే అండి 🙏🙏

నా పేరు ఇందిరా రావు షబ్నవీస్.

మా వారు శ్రీ వెంకట్ రావు గారు.

మొదటి సారి కాలేజీ లో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి, తరువాత ఒక కథ రాస్తే కాలేజీ మ్యాగజైన్ లో ప్రచురించబడ్డాయి. అలా రాయడం అలవాటు అయింది.

నేను, మా వారు, ఇద్దరం ఒమాన్ ఎయిర్ లో 20 సంవత్సరాలు పని చేశాము.

పోతుకూచి సాంబశివరావు గారి ఒక పేజీ కథల పోటీలో పాల్గొనడం జరిగింది. దానిలో నా కథ కి మొదటి బహుమతి పోరంకి దక్షిణా మూర్తి గారి వద్దనుండి అందుకున్నాను. తెలంగాణ మాండలికం లో వున్న ఆ రచన "నేను రాసినట్టే ఉందమ్మా నీ కథ " అన్న వారి ప్రశంస నాకు పెద్ద కితాబు. తరువాత కొన్ని అప్పటి పత్రిక లలో ప్రచారించబడ్డాయి. ,

రేడియో లో నా ప్రసంగాలు తెలంగాణ తేజోమూర్తులు లో ప్రచారించబడ్డాయి. చాలా విషయాలపై తరుచు రేడియో ప్రసంగాలు, కథలు రేడియో లో ప్రసారమైన్నాయి.

మా వారిని దత్తత తీసుకున్న వారు "శ్రీ షబ్నవిస్ వెంకట రామ నరసింహారావు గారు" నల్గోండకు చెందిన ఒక ప్రసిద్ధ సాహితి వేత్త. నిజాం యుగంలో "నీలగిరి " అనే మొదటి తెలుగు పత్రికను ప్రచురించిన వారు. వారు నల్గొండలో చాలా గ్రంథాలయాలను ప్రారంభించారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు , బుర్గుల రామకృష్ణరావు గారు తదితరులతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

వారిని గురించి మొత్తం సమాచారాన్ని సేకరించి నాలుగు సంవత్సరాల క్రితం త్యాగరాయ గానసభలో "షబ్నవిస్ జీవితం - సాహిత్యం" అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది.

నేను రాసిన కొన్ని కథలకి ప్రత్యేక బహుమతిని అందుకున్నాను. ఇప్పటి వరకు సుమారు ఒక 25/30 కథలు రాసి వుంటాను. అమెరికా పత్రిక లలో కూడా నా కథలు ప్రచురితమైనవి. 2020 న్యూ జెర్సీ వారి దీపావళి కథల పోటీలలో నా కథకి మొదటి బహుమతి లభించింది.

వంటలు, తోటపని, ఇంటి అలంకరణ హాబీస్. వంటల పోటీలలో మస్కట్ లోను, ఇండియా లోను అనేక సార్లు గెలుపొందాను.


116 views0 comments

Comments


bottom of page