top of page

ఏకలవ్యుడి కథ

Writer's picture: Kasivarapu VenkatasubbaiahKasivarapu Venkatasubbaiah

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Ekalavyudi Katha' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

'ఏకలవ్యుడి కథ' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


యాదవ వంశంలో అంధక శాఖకు చెందిన రాజు శూరసేనుడు. శూరసేనుడు, మారిష దంపతులకు తొమ్మిది మంది కుమారులు, ఐదు మంది కుమార్తెలు. శూరసేనుడు మధరను పరిపాలిస్తుండేవాడు. కొంతకాలానికి శూరసేనుడు తన బావైన ఉగ్రసేనుడికి మధర పాలనా బాధ్యతలు అప్పగించి ఆవులు పెంపకం వృత్తి చేపడతాడు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. కంసుడి చెల్లెలు దేవకి. శూరసేనుడి కొడుకులలో పెద్దవాడు వాసుదేవుడుకి కంసుడు తన చెల్లలైన దేవకిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు.


ఈ వాసుదేవుడి దేవకి పుత్రులే బలరామకృష్ణులు. ఇక శూరసేనుడి కుమార్తెలలో శ్రుతదేవ ఒకతి. మరో కమార్తె వృంద. ఈమెను కుంతిభోజుడు పెంచడం వలన కుంతి అని పేరు వచ్చింది. ఈమె కుమారులే పాండవులు. కృష్ణుడి మేనత్తలు ఐదుగురు. అందులో కుంతి కుమారులు తప్ప మిగతా నలుగురు మేనత్తల కుమారులు కృష్ణుడికి శత్రువులు కావడం చిత్రమైన విశేషం.


శూరసేనుడు శ్రుతదేవని సూతరాజైన కేకయదేశరాజు కుంగేకయేశ్వరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కేకయరాజు సుక్షత్రియుడు కాదు. సూతకులస్తుడు. క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వారిని సూతులు అంటారు. సూతులకు క్షత్రియులకు సత్సంబంధాలు ఉండేవి.


క్షత్రియులు సూత కులస్తులను తమతో సమానంగా గౌరవించేవారు. పిల్లను ఇచ్చేవారు. పిల్లను చేసుకొనేవారు. సూతులు రథకారులుగా, సైన్యాధిపతులుగా, మంత్రులుగా, రాజ్యాలు ఏలే రాజులుగా ఉండేవారు. కుంతి తొలి చూలు కర్ణుడు కూడా సూతుల ఇంట పెరిగి అంగ రాజ్యాన్ని పాలించే రాజు అవుతాడు. ఒక సూతకన్యను, ఒక క్షత్రియకన్యను వివాహం చేసుకొన్నాడు.


అలాగే కేకయ రాజ్యాన్ని పాలించే రాజు కేకయుడు సూతులందరికి నాయకుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మాళవి. ఈమె కుమారుడు బాణుడు అను పేరుతో పుట్టి కీచకుడుగా ప్రసిద్ధి గాంచాడు. రెండవ భార్య శ్రుతదేవ. ఈమె కుమార్తె చిత్ర అను పేరుతో పుట్టి సుధేష్ణగా పెరిగి విరాటరాజును పెళ్లాడుతుంది.


శ్రుతదేవకు కేకయరాజైన కుంగేకయేశ్వరుడికి పుట్టినవాడు ఏకలవ్యుడు. ఇతనికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శత్రుఘ్నుడు. ఇతడు జన్మించినప్పుడు దుశ్శకునాలు సంభవించాయి. పూర్వం రాజులకు కొడుకు జన్మించినప్పుడు దుశ్శకునాలు సంభవిస్తే కుల క్షయము, వంశ నాశనము జరుగుతుందనీ నమ్మకం బలంగా ఉండేది.


ఏకలవ్యుడు పుట్టినరోజు కూడా పురోహితులు ఈ బాలుడి వలన వంశనాశనం జరుగుతుందని చెప్పుతారు. దానితో బాలునిపై ఎంతో ప్రేమాభిమానాలు ఉన్న దేశశ్రేయస్సు కోసం, వంశక్షేమం కోసం మమకారాన్ని వదులుకుని నట్టడివిలో విడిచిపెట్టి వస్తారు. ఏకలవ్యుడి పుట్టుకను బట్టి కృష్ణుడికి బావమరిది వరస, పాండవులకు అన్నదమ్ముల వరుస అవుతాడు.


దుతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా అనేక దుశ్శకునాలు కలిగాయి. అప్పుడు కూడా పురోహితులు. అతని వల్ల కలిగే కష్టనష్టాలు, దూషణ నాశనాలు వివరించి చెప్పి అతన్ని అడవుల్లో విడిచి రమ్మంటారు. అందుకు దుతరాష్ట్రుడు మొదటి కొడుకని పుత్రవ్యామోహముతో అడవిలో విడిచి రావడానికి అంగీకరించడు.


ఏకలవ్యుడిని అడివిలో విడిచిపెట్టి వచ్చాక ఆటవిక తెగల రాజైన అరణ్యధన్వుడు అతని భార్య సులేఖలకు దొరుకాడు. బాలుడిని పరమానందంగా తీసుకుని పోయి ఏకలవ్యుడు అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అరణ్యధన్వుడు ఏకలవ్యుడికి స్వయంగా విలు విద్యను నేర్పి వీరుడిగా తీర్చిదిద్దుతాడు.


ఏకలవ్యుడు అడివికి తిరుగులేని యువరాజు అయ్యాడు. అటవిక జాతులన్నిటినీ ఒక చత్రం క్రిందికి తెచ్చాడు. అందరికి చదువు, యుద్ధ విద్యలు నేర్చుకునే ఏర్పాటు చేశాడు. పక్షులు, జంతువులు, కౄరమృగాలు అన్నింటనీ అదుపాజ్ఝలో ఉంచుకున్నాడు. అటవీ తెగల ప్రజలు సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతలు ఏర్పాటు చేసి అమ్ముకునే వీలు కల్పించాడు. అడవిలో ఉండే మైదాన ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చి ప్రజల చేత వ్యవసాయం చేయించాడు.


అటవికుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించి పోకుండా అటవికుల నృత్యం, అటవికుల సంగీత వాయిద్యాలు వాయించడం నేర్చుకోవడం కోసం, ప్రదర్శించడం కోసం ఒక సాంస్కృతిక భవనం నిర్మించి ప్రోత్సహిస్తాడు. అటవీ జనానికి ఇష్టుడు, ఆప్తుడు అయ్యాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడంటే తెగల ప్రజలందరికీ అపారమైన ప్రేమ అభిమానం.


అరణ్యధన్వుడు అటవి తెగలకు రాజే కాదు మగద చక్రవర్తి అయిన జరాసంధుడికి సామంతుడు, సర్వసైన్యాధ్యక్షుడు కూడా. అరణ్యధన్వుడి చెల్లెలు కాంతార. కాంతార కూతురు వనజ.


వనజ అడివికే అందం, చూడు చక్కని రూపవతి, అడవి మల్లె తీగలా ఉంటుంది. ఆమెకు ఆరడుగుల ఎత్తు ఉండి, అపురూపమైన అందం కలిగిన, బలాడ్యుడైన ఏకలవ్యుడంటే అమితమైన ప్రేమ, ప్రాణాధికం. అతడిని చూడందే ప్రొద్దు పోదు. ఆమెకు అతడిదే లోకం. ఏకలవ్యుడికి కూడా వనజంటే వల్లమాలిన అభిమానం,


కొండలు కోనలు, పర్వత సానువులు, లోయలు, జలపాతాలు, సెలయేర్లు, పచ్చిక బయల్లు అన్నీ వీరి విహారస్థలాలే. కోతికొమ్మచ్చులు, జలకాలాటలు, వేట, ఏనుగుల సవారీలు, గుర్రపు స్వారీలు వీరి విహారాలలో భాగాలు. పొదరిల్లులు, గుహలు వీరి విశ్రాంతి ప్రదేశాలు. కనులు పండుగగా ఉండే ఈ జంటకు తెగల పెద్దలు వివాహం జరిపించాలని ఎప్పుడో నిర్ణయించారు.


ఓ దినం అరణ్యధన్వుడు ఏకలవ్యుడిని పిలిచి " నాయనా ఏకలవ్యా! నాకు వార్డక్యం పైబడుతున్నది. నా బాధ్యతలు నీవు చేపట్టవలసి ఉన్నది. దానికి ముందు నీవు సద్గురువును ఆశ్రయించి మరిన్ని గొప్ప యుద్ధ విద్యలను అభ్యసించి తిరుగులేని మహావీరుడుగా తిరిగి రావాలి" అని కర్తవ్యాన్ని సూచించాడు.


తండ్రి మాట అనుసరించి ఏకలవ్యుడు విశేష ప్రతిభావంతమైన విద్యల కోసం ద్రోణాచార్యుడి దగ్గరకు పోయి తనను శిష్యుడిగా చేర్చుకోని క్షాత్ర విద్యలను నేర్పమని కోరుతాడు.


ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి ముఖ వర్చస్సును తీక్షణంగా గమనించి ‘ఇతనికి క్రోదావేషాలు అధికమని, భవిష్యత్తులో దుష్టులతో కలుస్తాడని దుర్మార్గులకు సహాయంగా నిలుస్తా’డని తన యోగశక్తితో గ్రహించి "నేను క్షత్రియులకు తప్ప ఇతరులకు శస్త్రాస్త్రాలు నేర్పను " అని చెప్పి వెనక్కి పంపి వేస్తాడు.


తిరిగి వచ్చిన ఏకలవ్యుడు సమున్నతమైన స్థానంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని బంక మట్టితో తయారు చేసుకుని, ఆ విగ్రహమే గురువుగా భావించి, ఆ విగ్రహం ముందు శస్త్రాస్త్రాలను దీక్షతో అధ్యయనం చేసి అభ్యాసం చేస్తాడు. కఠోరమైన సాధనతో అస్త్రప్రయోగ ఉపసంహరణాది సమస్తంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు ఏకలవ్యుడు.


అస్త్రవేగంపై నియంత్రణ సాధిస్తాడు. శబ్ధభేధి విద్యను అభ్యసించి కైవసం చేసుకుంటాడు. విల్లు విద్యలో అర్జునుడికి సరిసాటిగా ఎదుగుతాడు.


ఒకరోజు ఏకలవ్యుడుండే అడివికి ద్రోణాచార్యుడు తన శిష్యులైన కౌరవులు పాండవులతో వేటకుక్కలతో వేటకు వస్తాడు. ఒక కుక్క ఏకలవ్యుడు విలువిద్య సాధన చేస్తున్న వైపుగా వస్తుంది. ఏకలవ్యుడి విచిత్ర వేషధారణ చూసి మొరిగి చికాగు పరుస్తుంది. ఏకలవ్యుడు కుక్క నోరు తెరిచి మూసేంతలో కుక్క నోటిలో ఏడు బాణాలు దెబ్బ తగలకుండా రక్తం రాకుండా వెస్తాడు. కుక్క నోటినిండా బాణాలతో ద్రోణుడి దగ్గరకు పోతుంది..


‘ఇంతటి నైపుణ్యంగా బాణాలు ప్రయోగించిన విలుకాడు ఎవరూ?’ అనుకుంటూ ద్రోణుడు శిష్యులతో కలిసి కుక్క వెంట ఏకలవ్యుడిని సమీపించాడు. గురువు ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతించాడు. ద్రోణాచార్యుడిని ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, మెడలో పూలమాల వేసి, పాదక్షాళన జేసీ, పాదాలపై పూలు జల్లి, నీళ్ళు తలపై చల్లుకుంటాడు. ఈ కార్యక్రమంలో తెగల ప్రజలందరూ అత్యుత్సాహంగా పాల్గొన్నారు.


సంతుష్టుడైన ద్రోణుడు, "ఏకలవ్యా! నీవు అస్త్రవిద్యలను అభ్యసించడానికి నావద్దకు వచ్చినప్పుడు నేను నేర్పును అన్నాను కదా! మరి ఈ విలువిద్యా నైపుణ్యం ఎలా సాధించావూ?" అని ఏకలవ్యుడిని అడిగాడు.


"గురువర్యా! మీరే నా గురువులు. మీరు కాదన్నాక నేను తిరిగి వచ్చి మీ మూర్తిని విగ్రహంగా మొలుచుకొని, ఆ విగ్రహమే త్రికరణ శుద్ధిగా గురువుగా భావించి, తదేక దీక్షతో విలువిద్య సాధన చేశాను. తమరి దయవల్ల ధనుర్విద్యా ప్రపూర్ణుడను అయ్యాను గురుదేవా!" నిష్కపటంగా విన్నవించాడు.


ద్రోణుడు ఆలోచించాడు. ’కుక్క మొరిగిందనే చిన్న కారణానికే కోపంతో దాని నోరును బాణాలతో నింపాడు అంటే ఇతనికి కోపము అదుపులో ఉండదని, ఇలాంటి వ్యక్తి దగ్గర ఇంతటి గొప్ప విలువిద్యలు ఉంటే భవిష్యత్తులో ఇతని వలన సమాజానికి, దేశానికి హాని జరగవచ్చ’ని మనసులో అనుకున్నాడు.


" ఏకలవ్యా! నీవు నన్ను గురువుగా భావిస్తున్నావు కదా! మరి గురుదక్షిణ ఇవ్వలేదేమీ?" అడిగాడు ద్రోణుడు కపటం కడుపు దాచుకుని.


"గురువర్యా! ఏమి కావాలనో నిర్మొహమాటంగా సెలవియ్యండి గురుదేవా! నిరభ్యంతరంగా నిస్సంకోచంగా సమర్పించుకుంటాను" విన్నవించాడు నిష్కల్మషమైన హృదయంతో ఏకలవ్యుడు.


"అయితే ఏకలవ్యా! నీ కుడిచెయ్యి బొటనవ్రేలు ఇమ్ము" అంటాడు నిర్దయుడైన ద్రోణుడు.


ద్రోణుడి వాక్కులు విన్న ప్రజలు హాహాకారాలు చేశారు. “అన్యాయం అక్రమం దుర్మార్గం" అని విలపించారు. వనజ బోరున గుండెలవిసేలా ఏర్చింది.


అరణ్యధన్వుడు " ఏమయ్యా బాపడూ! నువ్వేమైనా విద్య నేర్పావా! గురు దక్షిణ ఎలా అడుగుతున్నావు, ఏ అర్హత ఉంది నీకు. ఎవరైనా ధన కనక వాస్తు వాహనాలు గురుదక్షిణగా అడుగుతారు. నీవేంటి బొటనవ్రేలు అడుగుతున్నావు? అంటే మావాడు విలువిద్యలో రాణించ కూడదనే కుబుద్ధితో అడుగుతున్నావు.


మావాళ్ళు ఎదగ కూడదని, మిమ్మల్ని మించి పోకూడదని కుట్రతో, అగ్రవర్ణ దురహంకారంతో అడుగుతున్నావు. నీ కోరికలో న్యాయం లేదు కాబట్టి గురుదక్షిణ ఇవ్వడు పో!" అంటూ గద్దించాడు.


"ఆమాటే ఏకలవ్యుడిని చెప్పమనండి. ఇక్కడి నుండి తక్షణమే వెళ్లి పోతాను" అన్నాడు ద్రోణుడు ఏకలవ్యుడి వాగ్దానంపై నమ్మకంతో.


ఏకలవ్యుడు " నాన్నా! మాట తప్పడం వీర లక్షణం కాదు. మాట తప్పి చరిత్రహీనుడను కాలేను. ఎంత కష్టమైన ఎంత నష్టమైనా వాగ్ధానం నెరవేర్చుకోవడమే నీతివంతుని విధానం. కాబట్టి వాగ్ధానం నెరవేర్చడంలో అడ్డు తగలవద్దు నాన్నా!” అని చెప్పి తన నడుముకు ఉన్న సురకత్తిని తీసుకుని కుడిచేతి బొటన వ్రేలిని తటాలున ఖండించి ద్రోణుడి పాదాలు చెంత పెట్టాడు. ఆ చర్యతో అక్కడ ఉన్న అందరూ దిగ్భ్రాంతి కి గురైనారు. ద్రోణుడు కూడా చలించి పోయాడు.


"శభాష్ మహావీరా! నీ యశస్సు దిగంతాలకు వ్యాపిస్తుంది. నీ కీర్తి ఆచంద్రార్కం నిలుస్తుంది. నీను సమస్త లోకాలు ప్రశంసిస్తాయి. నీకు శుభం కలుగు గాక" అని పలికి ద్రోణుడు తన శిష్యులతో కలిసి వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడి జనమంతా శోక సముద్రంలో మునిగి పోయారు.


ఆ తరువాత కూడా ఏకలవ్యుడి అస్త్రవిద్యా సాధన నిరాటంకంగా సాగింది. అటు కొంత కాలానికి వనజకు ఏకలవ్యుడికి వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు అరణ్యధన్వుడు. ఆ వివాహానికి మగధ చక్రవర్తి జరాసంధుడు, అతని స్నేహితుడు చఏదఇరఆజ్య భూపాలుడైన శిశుపాలుడు, పూండ్రవాసుదేవుడు, సామంతరాజులు, మిత్రరాజులు పాల్గొన్నారు. ఏకలవ్యుడి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. కాలక్రమంలో ఆ దంపతులకు ఇద్దరు మగ సంతానం కలిగింది.


జరాసంధుడు చేసిన ఒకానొక యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా పాల్గొని ఆ యుద్ధంలో మరణించాడు అరణ్యధన్వుడు. తండ్రి మరణాంతరం ఆటవిక తెగల, జాతుల నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది ఏకలవ్యుడికి. తండ్రి వారసత్వంగా వచ్చిన మగధ సామ్రాజ్య సైన్యాధ్యక్ష పదవిని కూడా స్వీకరించాల్సి వచ్చింది. ద్రోణుడు తలంచి నట్లుగానే దుష్టులైన జరాసంధుడితోను, శిశుపాలుడితోను, పౌండ్రక వాసుదేవుడితోను కలిశాడు ఏకలవ్యుడు.


శిశుపాలుడి తరుపున భీష్మకునితో రాయబారం నెరపి రుక్మిణీని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు ఏకలవ్యుడు. మగద రాజ్య సైన్యం, చేది రాజ్య సైన్యం, పుండ్ర రాజ్య సైన్యమును కలిపి మహా సైన్యం తయారు చేశాడు ఏకలవ్యుడు. కృష్ణుడిపై జరాసంధుడు చేసిన పద్దెనిమిది దండయాత్రలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ముందుండి సైన్యాన్ని నడిపించాడు. శస్త్రాస్త్రాల ప్రయోగంలోను యుద్దపాటవంలోను నైపుణ్యాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందుతాడు ఏకలవ్యుడు.


గదా యుద్ధంలో మహా పండితుడైన బలరామునితో గదా యుద్ధంలో పాల్గొని బలరామునితో "ఏకలవ్యా! నీవు గొప్ప వీరుడివి" అని పొగర్తలు అందుకున్నాడు.


"మహా వీరా! దైవాంశ సంభూతా! నీతో గదా యుద్ధంలో తలపడడం వల్ల నేను గొప్ప అదృష్టవంతుడినయాను దేవా!" అనుకుంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు ఏకలవ్యుడు.


జరాసంధుడు కృష్ణుడిపై చేసిన చివరి దండయాత్రలో కృష్ణుడితో ఏకలవ్యుడు ద్వంద్వ యుద్దములో పాల్గొని కృష్ణుడి చేతిలో మరణిస్తాడు.

మరణిస్తూ, "శ్రీకృష్ణదేవ! నీ చేతిలో మరణించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ధన్యమైంది. నాకు పునర్జన్మ లేకుండా చెయ్యి స్వామీ" అంటూ కృష్ణపరమాత్మను వేడుకుంటాడు ఏకలవ్యుడు.


"ఏకలవ్యా! నీవు నీతివంతుడివి. నిష్కల్మషమైన జీవితం నీది, నిర్మలమైన మనసు నీది. అయితే దుష్టుల సహవాసం చేశావు. దుర్మార్గుల వైపు యుద్ధం చేశావు. అందుకే ఇలా మరణించవలసి వచ్చింది. నీకు అరణ్యధన్వుడు తండ్రి కాదు. నా మేనత్త శ్రుతదేవకు కేకయరాజుకు పుట్టినవాడివి. నాకు మేనత్త కొడుకువి.


నువ్వు పుట్టినప్పుడు అపశకునాలు సంభవించాయని, నీ వలన వంశనాశనం జరుగుతుందని అడవిలో విడిచి పెట్టారు. అరణ్యధన్వుడు నిన్ను చేరదీసి పెంచుకున్నాడు. " అని ఏకలవ్యుడి జన్మరహస్యం తెలిపాడు కృష్ణుడు.


"పరమాత్మ! నా జన్మ పవిత్రమైనది. దేవా! లోకాపాలకా! నన్ను నీలో కలుపుకుని నాకు ముక్తి ప్రసాదించు స్వామి" ప్రార్థించాడు ఏకలవ్యుడు.


"లేదు ఏకలవ్యా! నీవు ఇంకొక జన్మ ఎత్తవలసి ఉంది. నేర్పని విద్యకు అన్యాయంగా గురుదక్షిణగా బొటనవ్రేలు కోరినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి కదా! శేషం ఉండకూడదు. ద్రుపదుడు ద్రోణుడిని సంహరించే కుమారుడి కోసం, అర్జునుడిని వివాహం చేసుకోనే కూతురు కోసం చేస్తున్న యజ్ఞగుండం నుండి ఆయుధ సహితంగా, సశరీరంతో, నవయవ్వనంతో, ధృష్టద్యుమ్నుడు అను పేరుతో నీవునూ, ద్రౌపది ఆవిర్భవిస్తారు.


రాబోయే కురు పాండవ కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల సైన్యాధిపతిగా సైన్యాన్ని రణరంగంలో నడిపిస్తావు. ఎందరో వీరులను ఓడిస్తావు. ద్రోణుడిని సంహరిస్తావు. పద్దెనిమిది దినములు జరుగు యుద్ధంలో చివరి వరకు ఉంటావు.


తన తండ్రి ద్రోణుడిని చంపిన కోపముతో నిద్రిస్తున్న నిన్ను అశ్వద్ధామ సంహరిస్తాడు. అక్కడితో జన్మ పరంపరల నుండి నీకు విముక్తి కలిగి వైకుంఠంలో నా దగ్గరకు వస్తావు. " అని భవిష్యత్తు ఆచరణను వివరిస్తాడు శ్రీకృష్ణుడు.


"ఈ సమస్త సృష్టిని నడిపించేవాడివి. నీ సృష్టిని నీ ఇష్టం వచ్చినట్లు నడిపించుకో ప్రభు! నీ ఆజ్ఞా బద్ధులం మేము. " భక్తిప్రపత్తులతో నమస్కరించి కన్ను మూశాడు ఏకలవ్యుడు.


ఏకలవ్యుడి తరువాత అతని పెద్ద కుమారుడు కేతుమాన్ అరణ్య రాజ్యానికి రాజవుతాడు. ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేసి భీముడి చేతిలో మరణిస్తాడు. యుద్దానంతరం ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగానికి సంబంధించిన గుర్రం అరణ్య రాజ్యంలో ప్రవేశించినప్పుడు అశ్వరక్షకుడైన అర్జునుడిని ఏకలవ్యుడి చిన్న కుమారుడు ఎదిరించి ఓడిపోయి, అర్జునుడికి లొంగిపోయాడు.

***

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.




370 views0 comments

Yorumlar


bottom of page