#DVDPrasad, #డివిడిప్రసాద్, #ఎక్కడో చూసినట్లుంది, #Ekkado Chusinattundi, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు
Ekkado Chusinattundi - New Telugu Story Written By - D V D Prasad
Published In manatelugukathalu.com On 31/12/2024
ఎక్కడో చూసినట్లుంది - తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సాయంకాలం వేళ! ఊళ్ళో అందరూ దాని గురించే చర్చ! సాయంకాలం నాలుగు గంటలయ్యేసరికి రామాపురంలోకి ఓ కారు ప్రవేశించింది దుమ్మురేపుతూ.
రామాపురంలోకి ప్రవేశించగానే, రావి చెట్టుకిందున్న కాళిదాసు టీ కొట్టు వద్ద కారు ఆపించి, "ఏమోయ్! మీ సర్పంచ్ సత్యారావు ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్తావా?" అడిగాడు వెనకసీట్లో కూర్చున్న వెంకటరత్నం తల బయటకు పెట్టి.
"నేరుగా వెళ్తే ఎడంచేతివైపు ఓ మర్రిచెట్టు కనిపిస్తుంది. అక్కడ టైలర్ తాతారావు దుకాణం నుంచి కుడిచేతివైపు మరో నాలుగు మలుపులు తిరిగితే సర్పంచ్గారి ఇల్లు వస్తుంది. " అని చెప్పి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది!.. " అంటూ బుగ్గపై వేలుంచుకొని ఆలోచనల్లో పడ్డాడు కిళ్ళీకొట్టు కాళిదాసు.
"మా సార్ని ఎక్కడో ఏమిటి, ఏ టివిలోనో, పేపర్లోనో చూసివుంటావులే!” చెప్పాడు ముందు సీట్లో కూర్చున్న పాపారావు. కారు ముందుకు ఉరికించాడు డ్రైవర్ దామోదరం.
కారు వెళ్ళినవైపే చూస్తూ ఆలోచనలో పడ్డాడు కిళ్ళీకొట్టు కాళిదాసు. తెల్లగా మెరిసిపోతున్న బట్టల్లో ఉన్న ఆ వ్యక్తిని ఎక్కడ చూసాడో గుర్తుకు రాక తల గోక్కున్నాడు కాళిదాసు. అక్కడే టీ తాగుతున్న అప్పారావుకీ, సదానందంకి కూడా అలాంటి సందేహమే కలిగింది.
మర్రిచెట్టు దగ్గర రెండు రోడ్లు కనపడటంతో ఎటెళ్ళాలో తెలియక కారు ఆపి, టైలర్ తాతారావుని చూసి, "సర్పంచ్ గారింటికి దారెటు?" అని అడిగాడు దామోదరం.
చేస్తున్నపని ఆపి కారువంక చూసాడు తాతారావు. కారు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిపైకి దృష్టి మరలింది. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లనిపించింది, కానీ ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు తాతారావుకి. "ముందు కుడి చేతివైపు తిరిగి, అక్కడ మన రమణగాడి లాండ్రీ షాపుంటుంది. ఆ షాపు నుండి నాలుగో ఇల్లే సర్పంచ్ సత్యారావుగారిల్లు. " చెప్పి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు తాతారావు.
ఎట్టకేలకు, సర్పంచ్ సత్యారావు ఇంటికి చేరుకున్నాడు వెంకటరత్నం. "ఏమోయ్! సత్యారావూ! ఎలా ఉన్నావు?" అని క్షేమ సమాచారాలు ఆరాతీసాడు.
తనను పలకరించిన వెంకటరత్నంని తేరిపార చూసి, ఎక్కడో చూసినట్లుందని అనిపించింది కానీ, అతనెవరో ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. "ఆ బాగానే ఉన్నాను? ఎంతకీ తమరెవరు?" సభ్యత కాదని తెలిసినా అడగక తప్పలేదు.
తెల్లబోయాడు వెంకటరత్నం. అతని పి. ఏ. పాపారావు కలుగజేసుకొని చెప్పాడు, "మన నియోజికవర్గం ఎం. ఎల్. ఏ. వెంకటరత్నంగారు, మర్చిపోయారా?" అన్నాడు.
అప్పటికి గుర్తుకువచ్చింది సత్యారావుకి అయిదేళ్ళ క్రితం వెంకటరత్నం తమ ఊరికి ఓట్లు అడగటం కోసం వచ్చిన సంగతి. నాలిక్కరుచుకొని, ‘మరి ఐదేళ్ళకొకసారి మాత్రమే కనపడితే ఎక్కడో చూసినట్లు ఉండక మరెలా ఉంటుంది! మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కదా, అందుకే కాబోలు మళ్ళీ వచ్చాడు!’ అనుకొని మొహాన నవ్వు పులుముకున్నాడు సర్పంచ్ సత్యారావు.
****************
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
విడిప్రసాద్ గారు రచించిన "ఎక్కడో చూసినట్లుంది" ఒక సామాజిక సమస్యల నేపథ్యంలో వెలువడిన చమత్కారభరిత కథ. ఈ కథలో పాతికేళ్లుగా గ్రామంలో కనబడని రాజకీయ నాయకుడు ఎన్నికల సమయంలో గ్రామంలోకి ప్రవేశించడమే కథానిక మొదటి మెట్టు. రామాపురం గ్రామస్తులు వెంకటరత్నంని ఎక్కడో చూసినట్లు అనిపించి, గుర్తు పట్టలేక కుతూహలంతో పడిపోవడం కథాక్రమానికి ప్రాణం.
రచయిత గ్రామీణ జీవితానికి రాజకీయ నాయకుల సంబంధం, ప్రజల గుర్తింపు, నమ్మకాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని వ్యంగ్యంగా చూపారు. ఐదేళ్ల క్రితం ఓట్లు అడిగేందుకు వచ్చిన ఎం.ఎల్.ఎ మళ్ళీ గ్రామానికి తిరిగి రావడం, గ్రామస్తులు అతనిని గుర్తించలేకపోవడం తనంతట తానుగా వ్యంగ్యరూపం సంతరించుకుంది.
కథ చెప్పే శైలిలో హాస్యం, సస్పెన్స్, సామాజిక విమర్శ సమపాళ్లలో ఉన్నాయి. కథ చివరికి ఒక నవ్వుతో ముగుస్తుంది కానీ underlying గా రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను సున్నితంగా ఎత్తిచూపుతుంది.
దుర్గా ప్రసాద్ గారి మూడు కథలు
1) "ఎక్కడో చూసినట్లుంది": పక్కున గట్టిగా నవ్వాం ... ముందు సస్పెన్స్ లా వుండి జోక్ లా మారింది.
2) "దాగని నేరం" & 3) "చెదిరిన కల" ... రెండూ క్రైం థ్రిల్లర్ సినిమాల్లా అనిపించాయి.
---------X X X --------పి.వి.పద్మావతి మధు నివ్రితి