top of page
Writer's pictureBharathi Bhagavathula

ఏమంటారూ?

Emantaaruu? Written By Bharathi Bhagavathula

రచన : భాగవతుల భారతి


"తన అస్థిత్వాన్ని కాపాడుకోటానికి మగాడు చేసే ఘీంకారమే ,అహంకారం, కోపం, అసహనం "~ అలా వ్రాస్తూ పోతుండగా ~వంటమనిషి కాఫీ కప్పు తెచ్చి టేబుల్ మీదపెట్టి వెనుదిరిగింది.

నేనేదో అడిగేలోపలే "అమ్మగారూ!" అంటూ లోపలికి వచ్చాడువరహాలు.

ఏమాట కామాటే కొత్త వంటమనిషి నీరజ కాఫీ చక్కగా పెట్టింది . బాగుంది కాఫీ అని చెబుదామనే లోపే ~ఆమెవెళ్ళిపోయి, వరహాలు రంగప్రవేశం చేసాడు.

"అమ్మగారూ! కావేరి పెళ్ళి! శుభలేఖ ఇద్దామనీ! " నసిగాడు.

శుభలేఖ ఇచ్చిన పనివారికి ,ఏదైనా కానుక ఇచ్చి పంపటం ఆచారం. కావేరి మా ఇంట్లో చక్కని పనిపిల్ల. వరహాలు కూతురూ. బీరువాలోంచి కొంత సొమ్ముతీసి అతనికిచ్చి,

"అదేమిటీ! కావేరీ ఇంకా చిన్నపిల్లేగా!చదివించకుండా పదునాలుగేళ్ళకే పెళ్ళిఎందుకో!" అన్నాను నేను యాధాలాపంగా.

"అమ్మగారూ! ఆడపిల్లకి సదూలెందుకండీ! ఆడదాని చదువు ఇంటికే అరిష్టమండీ!మీకు తెలీనిదేముందీ! చదూకున్న ఆడోళ్ళుచెప్పినట్లు వినీ, మగాడికి అనుకూలంగాఉంటారా? ఆ~ ఇవన్నీ మాకు ఎందుకూ. ఈమె ఉద్యోగం చేయాలా? ఊళ్ళు ఏలాలా?"

వాక్పవాహం ఇలా సాగుతూనే ఉండగానే నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.

"షటాప్ ~అండ్ గెటౌట్" అరిచాను.

నాఅరుపు నాకే భయం గొల్పింది.ఇక వరహాలైతే ఏమనుకున్నడో గానీ, బిక్కుబిక్కు మని చూస్తూ, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి నా గదిలో మంచంమీద వాలాను నేను ఆంధ్రుల అభిమానస్ర్రీ వాద రచయిత్రి సుధామయిని.ఇప్పుడు 60 సంవత్సరం లో అడుగుపెట్టాను. బి, పి, సుగర్ మామూలే.

'స్త్రీవాద' అని ఎందుకు నొక్కి చెబుతున్నానంటే, కరుడుగట్టిన ఉగ్రవాదం లాగా, కేవలం స్త్రీల సమస్యలను మాత్రమే అది కవితైనా, పాటైనా, పద్యమైనా, కధైనా, స్త్రీల తరుఫున వాదించే ఓ లాయర్ లాగా, పెన్నుతో,రచనతో, రాసిఒప్పించిమెప్పించగలను .అంటే ఆడవాళ్ల , వేదనకైనా ,రోదనకైనా, ఏ చిన్న సమస్య కైనా మగవాడే కారణం అనే నా రచనల సారాంశం, ఎంతో మంది అభిమానులకు నన్ను దగ్గరచేసింది నన్ను.

ఎన్నో అవార్డ్స్,సన్మానాలూ,రచయిత్రిగాదాదాపు పాతిక సంవత్సరాల అనుభవం నా సొంతం. మా ఆయన గారి సహకారంకూడా ఉందనుకోండీ. ఏ ముఖాముఖి లో పాల్గొన్న ప్రతిసారీ తరచుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు . 'స్త్రీ వాద రచనలే చేయటానికి కారణం ఏమిటీ? స్త్రీ వాదసాహిత్యం ఎప్పట్నించి మెుదలు పెట్టారూ?' ప్రశ్నల జవాబు దాదాపు నా అనుభవం లో నేను చూసిన సాటి స్త్రీల వ్యధలూ,గాధలూ అనేకం, అదే కారణమేమో!

అలాంటి నా ముందు వరహాలు తన ఆడపిల్ల గురించే అలా మాట్లాడటం నేను తట్టుకోలేని అంశమేగా! మరి.

/////////

గది గుమ్మం దగ్గర మెత్తని అడుగుల అలికిడి, బహుశా వంటమనిషి కాఫీ తెచ్చిందనుకుని, "ఇప్పుడేం వద్దు" అన్నాను,సౌమ్యంగానే.

"నేను కాఫీ ఇవ్వడానికి రాలేదండీ! మీతో మాట్లాడాలనీ ~ నసిగింది వంటావిడ.

లేవటానికి ప్రయత్నించాను.

ఆమె "లేవటానికి ప్రయత్నించకండి, రెస్ట్ తీసుకోండి.ఐతే ఎందుకో మీరు టెన్షన్ కి గురయ్యారు." అంది మెల్లగా.

"నేనూ" ~ చెప్పబోయాను.

ఆమె " తెలుసునాకు! సమాజంలో స్త్రీల మీద, స్త్రీలకు జరిగే అన్యాయాలన్నింటికీ పురుషులే కారణం అని మీ వాదన కదూ! పురుషులే కారణంకాదు.స్త్రీలే కారణమైన సందర్భాలూ అనేకం, మీరు ఆదిశగా ఆలోచిస్తే ఈ ఆవేశం వచ్చేదికాదేమో! ఓ సర్కిల్ గీసుకుని అందులోంచి బయటకు రాలేక ~~"

నేనూ ఆమెమాట పూర్తికానీయలేదు.

"అలా జరగడానికి వీల్లేదు!" నిదానంగానే అన్నాను. సాటి స్త్రీల మీద నాకెంతో గౌరవం

"జరిగిందని నిరూపిస్తే?" అన్నది ఆమె. ఆశ్ఛర్యపోయాను. ఓ వంటమనిషికి ఇంత అతి చనువా?!

"ఇదిగో ఈ పెన్ను వదిలేస్తాను".చేతులోని పెన్నును మంచం మీదనే విసిరాను. రచయిత్రిననే, అహం కంఠంలో ధ్వనించింది అంతకంటే ఆమె "అవసరం లేదు, ఏ విషయానికైనా రెండు పార్శ్వాలుంటాయ్. నే చెప్పే కధ విని ఆ కోణంలోంచి సమస్య ఎలా పరిష్కరించాలో ఆ దిశగా రచనలు చేయండి చాలు, "ఆమె చెప్పటం మెుదలెట్టింది.

'''"""""""""""" ఆమె పేరు మేఘన. నలుగురు సంతానంలో చిన్నది, మహా టెంపర్. లెక్కచేయని మనస్తత్వం. అంతగత్తెననే భ్రాంతిలో బ్రతుకేది. తల్లిని ఎంత మాట ఐనా అంటానికి వెనుకాడేదికాదు. ప్రతీ విషయానికీ, ఇంత గొంతు వేసుకుని గొడవ, గొడవ చేసేది. మితిమీరిన అహంకారం.

అతి చిన్న వయసులోనే,వివాహం గురించి ముదురు అభిప్రాయాలూ,"మెుగుడంటేఇష్టం లేదనకో మంగళసూత్రం తెంపేసి విడాలుకులిచ్చేసి, వెళ్ళిపోవచ్చు" వినేవాళ్ళు తెల్లబోయి చూసేవాళ్ళు. 'చిన్నతనంలే కాలంతో పాటు మారుతుందిలే' అని ఊరుకునేవారు.

రోజులు గడిచినాయ్. మేఘనకు పెళ్ళయింది. అన్ని కుటుంబాలలో ఉన్నట్లు కలహాలూ, చిన్నచిన్న తగాదాలూ,అత్త గొణుగుళ్ళూ, పోట్లాటలూ నేపద్యంలో ముగ్గురు సంతానానికి తల్లయింది.

అసలు కధ ఇక్కడే మెుదలయింది. అతి చిన్న ఉద్యోగస్థుడయిన మేఘన భర్త , తల్లీ, భార్య, ముగ్గురు పిల్లల పెంపకం కొంచెం ఇబ్బంది అనిపించి, అత్యవసర పరిస్థితి లో భార్య ఉద్యోగం చేస్తాననే కోరికను మన్నించాడు.

అక్కడ పరిచయం అయ్యాడు ,సంపత్ ఆఫీస్ మేనేజర్ గా. మేఘనకి అతనికీ చనువు పెరిగింది. ఓ బలహీనక్షణంలో కాలుజారింది.

"ఆడదానికో నీతి?మగాడికో నీతా?" అని ప్రశ్నించింది.

"రోజులు మారాయ్ ,తప్పు ఎవరుచేసినా దిద్దుకుని సరిచేసుకునే వెసులుబాటును సమాజం అందరికీ కల్పించింది "అన్నది.

వెసులుబాటును ఉపయోగించుకుని దిద్దుకోవాలి కదా తప్పును. కానీ, దాన్ని అలవాటుగా మార్చుకుంది మేఘన. అలవాటు ఆఫీసు వరకే ఐనా బాగానే ఉండేది.

అఫీసు వదిలాక కూడా రాత్రి 9 గంటల వరకూ భర్తా పిల్లలకి షాపింగ్ పేరుతో అబద్దం చెప్పి తిరుగొచ్చేది. పిల్లలు, భర్త ఊరు వెళ్ళిన సమయంలో ఇంటికే వచ్చాడు సంపత్. పెళ్ళాం ఊరెళితే మెుగుడు చేస్తేనే ఒప్పుకోలేని పనిని మేఘన, అవలీలగా చేసేసింది. అప్పటికీ ఆపేసి తప్పుదిద్దుకోవచ్చు. సంసారాన్ని నడిపించుకోవచ్చు. మళ్లీ మళ్లీ అదే పనిచేసి ఓ రోజున అనుమానాస్పద స్థితిలో భర్తకుపట్టుబడింది.

ఇక కీచులాటలూ, కుమ్ములాటలూ, తల్లిదండ్రుల రాయబారాలూ, భర్త, మేఘనను ,ఏలుకోటానికి ఇష్టపడలేదు. తల్లీదండ్రీ అల్లుడితో కన్నీళ్ళు పెట్టుకోగా, అతను దూషించినా , మెత్తబడ్డాడు . కానీ మేఘన"ఎవరూ నా విషయంలో కల్పించుకోనక్కరలేదు, నేను బ్రతకగలను".అంది.

పిల్లల్ని తెచ్చుకుని తల్లీదండ్రీ దగ్గర ఉండమనీ, కొన్నాళ్ళకి పరిస్థితులు చక్కబడతాయని నచ్చచెప్పచూసారు. వినలా. పోనీ ముగ్గురు పిల్లలలో ఒక్కరినైనా తెచ్చుకో! అండగా ఉంటారు అనే మాట కూడా పెడచెవిన పెట్టింది.

వెళ్ళిపోయింది అఙ్ఞాతవాసంలోకి. ఎక్కడుందో ఏం చేస్తోందో,చుట్టాలకు గానీ,ఆఖరికి తోబుట్టువులకు కూడా తెలీదు. రహస్యంగా ఉంచారు.ఆమెను కలవాలంటే ముందుగా ఓ నెంబర్ కి ఫోన్ చేస్తే ఓ స్థలానికి పార్కైనా సరే, ఆమె వస్తుంది. మాట్లాడాలి. ఆమెమీద ఎన్నో పుకార్లు. నిందలూ చేయకూడని వ్యాపారం ఏదో చేస్తోందనీ, ఇంకా ~~ఇంకా ఎన్నో

10 సంవత్సరాలు గడిచాయ్. ఎవర్నో ఓ వ్యక్తి ని వెంటబెట్టుకుని,స్వగ్రామానికి వచ్చింది తన పేరు మానస అని మార్చుకుని.

అయితే ఇతను ఆ మేనేేజర్ సంపత్ యేనా? అని ఎవరూ ప్రశ్నించలా? ఆ సంపత్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు కాబట్టి. అంతకన్నా గమ్మత్తు అతనికి అంతకు ముందు పెళ్ళి కాలేదట.

అప్పుడూ సమాజం స్వాగతం పలికాలీ అనుకుంది. తల్లీదండ్రీ,తోబుట్టువులూ బంధువులూ, "పోన్లే మేఘన జీవితం కుదుట పడిందీ, ఇంత కాలానికి సంతోషం "అని ఆమెనూ అతణ్ణి హృదయపూర్వకంగా ఆశీర్వదించి, సమాజం మరో అవకాశం ఇచ్చిందనే ఆనందంతో, ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండేవారు. అందరిళ్ళకూ వస్తూ, పోతూ అతనూ చక్కటి కలివిడితనంతో మెలిగేవారు. రెండు సంవత్సరాలు అలాగే జరిగినాయ్. కాలం అలాగే నడిస్తే బాగుండేది.

ఓ రోజు ఇద్దరూ గుడికెళ్ళారు. లింగంమీద నీళ్లు పోస్తూ, గుళ్ళోనే పడి మరణించాడతను.

అందరూ తలో చెయ్యీవేసి సాగనంపాలనుకున్నారు, అతని గురించి వివరాలు చెప్పమనీ వాళ్ళ వాళ్ళకి కబురు చేద్దామని ప్రయత్నించిన నేపద్యంలో ఆసక్తి కరమైన అంశాలు బయటికొచ్చాయ్.

ఇద్దరికీ పెళ్ళేకాలా! డేటింగ్ లో ఉన్నారు. అతని తరుఫువారి తో ఎలాంటి సంబంధాలూ లేవు. ఎలా? పైగా అతని గురించి ఆమె చెప్పిన వివరాలు వేరు తో సహా, వాళ్ళ వాళ్ళు చెప్పిన పేరు వివరాలు,ఉద్యోగం వేరు. ఎలాగోలా వాళ్ళ వాళ్ళని పిలిపించారు. మానస ఉరఫ్ మేఘనను నానా తిట్లూ తిట్టుకుంటూ, శవం వాళ్ళే తీసుకుపోయారు

అతను చాలా అదృష్ట వంతుడే. కానీ మేఘన, (మానస )అతను చిన్న ఉద్యోగంలో సంపాదించిన సొమ్ము తో నిలబడింది.

ఇంకో వింత ఏంటంటే కట్టుకున్న భర్త, పిల్లలు ఎక్కడో బ్రతికే ఉండగా, డేటింగ్ చేసిన వ్యక్తి కోసం పూలూ, మంగళ సూత్రం బొట్టూ తీసేయటం.

అపుడు 'ఏ మనిషైనా, ఎలాగైనా ప్రవర్తించవచ్చా? నచ్చినదంతా చేసేయవచ్చా?' సమాజం ప్రశ్నించింది.

అయినా సమాజం తనలో ఆశాభావమే నింపింది. తోబుట్టువులు సానుభూతి తోనే చుట్టూ కమ్ముకున్నారు. కాని అహంకారం నిలువనీయలా !వాళ్ళతో కూడా ఏదో వంకతో తగాదాలు. బావ తనను కోరుకున్నాడనీ, ఒదిన గయ్యాళిదనీ , తోబుట్టువులకూ దూరమైంది .స్వతంత్రంగా బ్రతకగలనూ, అని ఆత్మవిశ్వాసం అనుకునే అహం తో తిరిగింది. కానీ కాలం రాపిడికి సొమ్ము కరిగిపోయింది.

మనుమలూ మనుమరాళ్ళనీ ఎత్తి, రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో, భుజాన బ్యాగ్ వేసుకుని, ఏదైనా వంటలక్క ఉద్యోగమైనా దొరక్కపోతుందా? అని బయలుదేరింది. తీవ్రమైన పశ్చాత్తాపానికి, గురై ,కుమిలి కుమిలి పోతోంది. తప్పూ ఒప్పూ ల లింగ వివక్షత తీసేస్తే , అనేక కారణాల వల్ల భర్త తో విడిపోయి పిల్లలతో తమకంటూ జీవితాన్ని చక్కగా ఎదుర్కుంటూ, సాధించి చూపిన అనేక మహిళామణులున్నారు. మరి ఇక్కడ ఓ మగాడు కారణం కాదుగా! ఆమె పతనానికి కారణం" ~ఏమంటారూ? "

//////////////////

కధ చెప్పటం ఆపి నన్నుఅడిగింది వంటమనిషి, "ఇందులో ఆ స్త్రీ సమస్యకు కారణం ఎవరూ? ఏం సాధించినట్లూ? ఓ గృహిణిగా కాకపోయినా, తల్లిగా నైనా స్త్రీ కి పరిపూర్ణత కాదా? స్త్రీల చదువులే సమాజంలో సమస్యలన్నిటికీ కారణం కాదు. అలాగే మగవారూ కారణం కాదేమో... వేరే కోణం ఉందేమో! ఈ రోజు తప్పుతెలుసుకున్నా దిద్దుకోలేదేమో! ఏ లింగమైనా ఈగోఎవరికైనా సబబేనా?అన్ని సమయాలలో!

స్త్రీకైనా పురుషుడికైనా నైతికబలమే ఆయుధం. ఆలోచించి ఆ రకంగా రచనలు చేయండి .ఇలాంటి కధలు ఇంకా చాలా తెలుసు నాకు. ఇంకా చెప్పమంటారా?" అని.

"వద్దు ! మీరు చెప్పిన కధ ఎక్కడా విన్నట్లు లేదు. కొత్తగా ఉంది .నిజమా? కథా? ఐనా వాళ్ళని దగ్గరనుండి చూడందే రచయిత్రిగా నేను అంగీకరించలేను. వేరే ఇంకేదో కోణం ఉండే ఉంటుంది భర్తపరంగా, " నేను మెుండి వాదనకు దిగాను.

'ఆ కధలోని మేఘన ~తర్వాత పేరు మార్చుకున్న మానస ~ఇప్పుడు మీ ముందుకొచ్చిన నీరజ నేనే ! ఇప్పుడు నేనేం చేస్తే మంచి జీవితంలోకి తిరిగిరాగలను? ఏడుస్తూ ప్రశ్నించిందామె.

అంతే నాలో గుండె, చేతిలో పెన్నూ జారిపోయాయ్.

రచయిత్రిగా నేనే కొత్త జన్మ ఎత్తి,సరికొత్త కోణంలోంచి రచనలు చేయటం మెుదలుపెట్టాను.

/////////////////


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత్రి పరిచయం : పేరు --భాగవతుల భారతి,

ఊరు--ఖమ్మం ,

చదువు-- m.A;m.A(B.ed),

వృత్తి-- గృహిణి,

అభిరుచి --పాట, వచనకవిత, కథ', వ్యాసం

పద్యాలు వ్రాయటం.

ప్రచురణలు -- అనేకం.


427 views2 comments

4 Comments


venkateswar rao
venkateswar rao
Jan 09, 2021

భారతి గారూ!... సమాతూకంగా అలోచించి రాయటం వల్ల రచయితలు

సమాజానికి సరియైన సందేశం ఇవ్వగలరు..మంచి సందేశం ఉంది మీ కథలో ... బాగుంది . అభినందనలు.

Like

drdsridevi
drdsridevi
Jan 07, 2021

భారతి గారు కథ , కథనం బాగున్నాయి. ఈ నాడు స్వేచ్చ అనే ముసుగులో తప్పు చేస్తున్న ఆడవాళ్ళకు కనువిప్పు కా గలదు మీ రచన. కలానికున్న పదునుతో ఇలాంటి రచనలు పక్కదారి పడుతున్న స్త్రీలను మార్చ గలగాలి. పవిత్ర వివాహ బంధం తో సంసారాన్ని దిద్దడం లో భారత స్త్రీ స్థానం ప్రపంచం లోనే ఉన్నతం. Good luck.

Like

challasr1969
challasr1969
Jan 06, 2021

భారతీ గారు మీ కథానిక బాగుందండి

మేఘన character చాలా చక్కగా మలిచారు

అట్లాంటి వారు కోకల్లలు ప్రస్తుత కాలంలో

Like

srinivas gorty
srinivas gorty
Jan 06, 2021

Nice bharathi garu

Like
bottom of page