top of page
Writer's pictureNeeraja Prabhala

ఎంకి ప్రేమ



'Enki Prema' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 06/03/2024

'ఎంకి ప్రేమ' తెలుగు కథ

రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



“మావా! ఇయాల నీవు సంద్రానికి యాటకు ఎల్లొద్దు మావా! అదేదో తుపానంట. చాలా పెద్ధదంట. నాకు చాలా భయంగా ఉంది. ఎల్లొద్దు. ” అంది ఎంకి తన మావ నాయుడుతో.

 

“అదికాదే ఎంకి! ఆడికి ఎల్లకపోతే మన కడుపులు ఎలా నిండుతాయే సెప్పు. అయినా ఇలాంటివన్నీ మనకు కొత్త కాదు కదుటే. ఆ గంగమ్మతల్లి సల్లని తల్లి. నాకేంకాదు. ఇలాంటి భయాలెట్టుకోక. ముందు కూడెట్టు. తిని బేగి ఎల్లొస్తా! ” అన్నాడు నాయుడు. 


ఎంకి లేచెళ్లి కంచంలో తన మావకు బువ్వ పెట్టింది. ఇంతక్రితమే చేసిన తన మావకిష్టమైన ఏడిఏడి సేపల కూరను కొసరి కొసరి ప్రేమతో వడ్డించింది. నాయుడు ఆబగా ఆబగా తింటూ మధ్య మధ్యలో కొన్ని ముద్దలు ఎంకి నోట్లో పెట్టాడు. 


“డేగిశాలో నాకు కూర ఉంది మావా ! ముందు నీవు తిను. మళ్లీ యాడన్నా కడుపుకాలితే తినేందుకు నీకు బువ్వేదీ? అసలే నీవు ఆకలికాగలేవు. కడుపునిండా తిను మావా! ” ప్రేమగా అంటూ తన మావనోటిలో మరికొన్ని ముద్దలు పెట్టింది ఎంకి. ‘బ్రేవ్’ మంటూ త్రేన్చి లేచి ఎంకి ప్రేమ నీళ్లతొట్టికాడికెళ్లి తన సేయి కడుక్కున్నాడు నాయుడు. ఆ తడిసేయిని ప్రక్కనే నుంచున్న ఎంకి చీరకొంగుకు తుడిచాడు. 


నవ్వుతూ తన మావ దగ్గరకు మరింత జరిగింది ఎంకి. ప్రేమతో తన భార్యను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు నాయుడు. తన మావ కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది ఎంకి. 


కాసేపయ్యాక నాయుడు బయలుదేరబోతుంటే “మరోమారు ఆలోచించు మావా! నాకేటో గుబులుగా ఉంది. ఇయాల లేచిన కాడినుంచీ నా మనసు మనసులో లేదు మావా! “ అంది గోముగా ఎంకి. 


“ఇదుగో! ఎంకీ! ఇంకో మాలి సెపుతున్నా. నాకేం కాదే. నామాటినవే. నా ముద్దుల ఎంకివి కదూ. నా ఇంటి లచ్చిమి. ఏదీ! కిలకిలా నవ్వవే! నీ నవ్వు సాలా బాగుంటదే. ! పెళ్లాం నవ్వుతూ తన మగడిని బయటకు పంపితే అంతా శుభమేట. ఎన్నికట్టాలాచ్చినా సల్లంగ తిరిగొస్తాడట. మొన్న మనూరి గుళ్లో పంతులుగారు సెప్పారు కదుటే! ఏదీ నవ్వు” అన్నాడు నాయుడు. 


కిలకిలా నవ్వింది ఎంకి. 


“నీ నవ్వుతో ఆ సెందురుడి ఎన్నెలంతా ఇయాల ఇప్పుడే మనింట్లో తొంగున్నట్టుందే నా ఎంకీ. ఎంత సక్కంగ ముద్దొస్తున్నావో నా ముద్దుల ఎంకీ! ” అన్నాడు నాయుడు ఎంకిని దగ్గరకు తీసుకుని. 


“సాల్లే మావా! నీవెప్పుడూ ఇలాగే పొగుడుతావు. నీవిట్టా కబుర్లాడుతూ కూకుంటే ఎట్టా? ఆ పొద్దు సూస్తూ ఊరుకోదుగా! బేగినే ఎల్లి పొద్దుకూకముందే ఇంటికి రా మావా ! ” అంది ఎంకి. 


“సరేలేయే. నీ మాట ఎప్పుడు కాదన్నాను?. ” అంటూ బయలుదేరాడు నాయుడు. 


“నేకూడా నావదాకా వస్తా మావా! నీనావ ఎల్లేదాకా చూసి మల్లీ తిరిగొచ్చేత్తా మావా ! ” అంది ఎంకి. 


“సరే! ” అన్నాడు నాయుడు. 


ఇద్దరూ సంద్రం దాకా బయలుదేరెళ్లారు. నాయుడు సంద్రానికి దణ్ణం పెట్టి సంద్రంలోకి దిగాడు. తన నావకు తెరసెల్లా కట్టి నావను నడుపుతూ బయలుదేరాడు. 


ఎంకి తన కనుచూపుమేర తన మావ కనపడేదాకా చేయూపుతూ నిలబడి అతను వెళ్లగానే ఇంటికి వచ్చింది. కానీ ఇల్లంతా బోసిపోయింది తన మనసులాగా అనుకుంది. 


 “తుఫానంటున్నారందరూ. తన మావ ఎలా వస్తాడో?ఏమో? వద్దంటే వినడాయే నా ముద్దుల మొగుడు. ” దిగులుగా మనసులో అనుకుంది ఎంకి. 


“నా మావకి నేనంటే ఎంత పేమో! నామావ నాకు మొగుడుగా దొరకడం నా అదృష్టం” తన మావని తలుచుకుంటూ మురిపెంగా అనుకుంది ఎంకి. 


చూస్తూండగానే పొద్దుగూకింది. బయట బాగా ఈదురు గాలులు వీస్తున్నాయి. అవి అంతకంతకూ ఎక్కువవుతోంది. తన మావకోసం వాకిలికాడ ఎదురుసూస్తోంది ఎంకి. అర్రరాత్రైనా ఇంకా తన మావ జాడ కానరావట్లేదు. సూసిసూసి కళ్లు కాయలు కాసేలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని గుమ్మంకాడ ఎదురుచూస్తున్న ఎంకికి కళ్లు మూతలు పడ్డాయి. 


చాలా సేపటికి చుట్టుప్రక్కల వెలుతురికి తృళ్లిపడి కళ్లుతెరిచింది ఎంకి. తెల్లారిందని గ్రహించింది. తుఫాను సద్దుమణిగిందేమో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తన మావ కోసం ఇల్లంతా వెతికింది. ఏడుస్తూ సంద్రంకాడికి బయలుదేరి వెళ్లింది. 


“గంగమ్మ తల్లీ. నా మావను సల్లంగ సూడు. నా మావని నాకు దక్కించు. నా మావ లేందే నా బతుకులేదు. నా మావ సాలా మంచోడు తల్లీ. నా మావను నాకిప్పించు తల్లీ! ” అని భోరున ఏడుస్తూ ఆ తల్లికి దణ్ణం పెట్టింది ఎంకీ. 

 

అలా చాలాసేపు ఆ ఒడ్డున తిండితిప్పలు లేకుండా తన మావకోసం ఎదురు చూస్తున్నది ఎంకి. కాసేపటి తర్వాత సముద్రుడు కరుణించినట్టుగా అల్లంత దూరంలో నావ కనిపిస్తోంది. ఎంకికి కళ్లు మెరిశాయి. తన మావ వచ్చేస్తున్నాడని దిగాలున లేచి నుంచుంది. 


 ” మావో! మావా! బేగి రా “ అని చెయ్యూపుతోంది ఎంకీ. 


కాసేపటికి నావ ఒడ్డును సమీపించింది. నావను లంగరుకేసి కట్టి అందులోంచి దిగిన తన మావను చూసి హత్తుకుని ఏడ్చింది ఎంకి. 


 “నీకోసం రాత్రంతా ఎదురుచూస్తూ ఎంత దిగులు పడ్డానో తెలుసా మావా! . నా మాంగళ్యం గట్టిది కాబట్టి నీవు సల్లంగ వచ్చావు. నీకేం కాలేదు కదా! ”అంది తన మావ సెంపలను, నుదుటిని చేతితో ప్రేమగా తడుముతూ ఎంకి. 


“నీ పేమ, ఆ గంగమ్మతల్లి దయ ఉన్నంతకాలం నాకేం కాదే! . ఇంటికి పోదాం పద. సూడు. నీకళ్లు ఎలా ఎర్రపడ్డాయో?. తోటకూర కాడలాగా నీ మొహం చూడు ఎలా వాడిపోయిందో?” అన్నాడు నాయుడు తన ఎంకిని ప్రేమగా దగ్గరకు తీసుకుని. 


ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ఎంకి తన మావకు కమ్మని బువ్వ వండిపెట్టగా ఇద్దరూ తృప్తిగా తిన్నారు. కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పుకుని పడుకుని హాయిగా నిద్రపోయారు. 


…..సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


Video link

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




 


50 views0 comments

Comments


bottom of page