top of page

 ఏనుగు ఎప్పుడూ వెయ్యే

#KLakshmiSailaja, #కే. లక్ష్మ శైలజ, #ఏనుగుఎప్పుడూవెయ్యే, #EnuguEppuduVeyye, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Enugu Eppudu Veyye - New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 27/02/2025

ఏనుగు ఎప్పుడూ వెయ్యే - తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



'ఎవరికీ తలవంచకు..ఎవరినీ యాచించకు'


టి. వి. లో వస్తున్న పాటను వింటున్న సుబ్రహ్మణ్యం తన ఆఫీస్ లో జరుగుతున్న విషయాలను గుర్తుకు తెచ్చు కున్నాడు. తనలాంటి వాళ్ళు ఎవరినీ ఎదిరించకుండా ఉంటే అందరూ అణిచి వేస్తున్నారు. తలవంచకుండా వుంటే తలబిరుసు తనమంటున్నారు. మరి నిజాయితీగా నడిచేదెలా? అనుకున్నాడు. 


*** 

"అదేమిటి సుబ్రహ్మణ్యం, ఈ ఫైల్ కు నోట్ ఫైల్ లో శాంక్షన్ చెయ్యవలసిన అమౌంట్ ను నేను చెప్పినదానికంటే చాలా తక్కువగా మెన్షన్ చేశారు" అన్నాడు ఇంటర్కంలో ఆఫీసర్. 

 

"సర్, అక్కడ ఎలిజిబులిటీ ప్రకారం వ్రాశాను" అని సుబ్రహ్మణ్యం చెప్తే, "నేను నిన్న మీకు చెప్పాను కదా?" విసుక్కుంటూ అన్నాడు ఆఫీసర్. 


"ఓరల్ గా చెప్పారు సర్. ఇప్పుడు మీరు అమౌంట్ మార్చమని ఫైల్ మీద ఇంస్ట్రక్షన్స్ ఇవ్వండి సార్" దృఢంగా చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం. 


ఠక్కున ఫోన్ పెట్టేశాడు ఆఫీసర్. తప్పు తన మీద వేసుకోకుండా క్లర్క్ మీద తోసేద్దామని ఆఫీసర్ ప్లాన్ చేశాడు. కానీ ఫైల్ కు ప్రాణమైన నోట్ ఫైల్ మీద వ్రాత పూర్వకంగా ఆర్డర్ తీసుకోకుండా సుబ్రహ్మణ్యం ఆఫీసర్ చెప్పిన మొత్తాన్ని వ్రాయడు. అది ఆఫీసర్ కు కోపం తెప్పించింది. ఎంత ఎక్కువ మొత్తాన్ని శాంక్షన్ చేస్తే అంత కమిషన్ వస్తుందని ఆఫీసరు ఆశ. ఒక్కరూపాయి కూడా ‘గీతం’ గా ఆశించని సుబ్రహ్మణ్యం ఆఫీసర్ కు పంటికింద రాయిలా వున్నాడు


జిల్లాలోనే కాదు జోన్ మొత్తం లో సుబ్రహ్మణ్యం నిజాయితీతో సరితూగే వాళ్ళు లేరు. ఎంతో కొంత ఆఫీస్ కు పని మీద వచ్చేవాళ్ళు తెచ్చిఇచ్చే మామిడి పళ్ళ కైనా ఆశ పడని వాళ్ళు ఉండరు. కానీ సుబ్రహ్మణ్యం ఎవరైనా తమ రిటైర్మెంట్ శాంక్షన్ చేశారని వాళ్ళు స్వీట్ పాకెట్ తెచ్చి ఇచ్చినా, 'వద్దండీ..మీ పిల్లలకు తీసుకు వెళ్ళండి' అనేవాడు. ఆఫీసు లో కనీసం టీ కూడా తాగేవాడు కాదు. అందరితో మాట్లాడతాడు కానీ ఎవరి స్వంత విషయాల్లో తల దూర్చడు. కవర్లల్లో, కర్చీఫ్ లల్లో ఎవరైనా డబ్బులు ఇవ్వబోయినా తీసుకోడు. ఎప్పుడూ ఆఫీస్ కు ఆలస్యంగా రాడు. 


సాయంత్రం ఐదుగంటల పైన ఎంతో పని ఉంటే తప్ప ఉండడు. ఏరోజూ తన సెక్షన్లో ఫైల్ లేటుగా సమర్పించడు. అందుకే ముఖ్యమైన ఆ సెక్షన్ లో నిజాయితీపరులు ఉండాలని సుబ్రహ్మణ్యంను ఆ డిపార్ట్మెంట్ జోనల్ ఆఫీసర్స్ కూడా ఆ రోజుల్లో తొమ్మిది సంవత్సరాలు సుబ్రహ్మణ్యం ను అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చెయ్యకుండా ఆపారు. 


 కానీ మారుతున్న కాలంలో దిగజారుతున్న నిజాయితీ వల్ల కొత్త ఆఫీసర్లు రూల్ ప్రకారం కాకుండా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు సరిపోయేట్టుగా శాంక్షన్స్ జరగాలని అనుకుంటూ ఉన్నారు. అది సుబ్రహ్మణ్యంకు ఇబ్బంది అవుతోంది. 


 ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనలు సుబ్రమణ్యాన్ని మానసికంగా కుంగదీశాయి. ఆఫీసర్ ముఖ్యమైన విషయాలన్నీ తను లేకుండానే తన జూనియర్స్ తో మాట్లాడి నిర్ణయాలు తీసుకొని, చివరలో 'మీరిలా చేసేయండి' అని చెప్తున్నారతనికి. ఆ జూనియర్స్ కొంతమంది అతన్ని చూసి వొంకరనవ్వు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు. సుబ్రహ్మణ్యం ఎప్పుడూ వాళ్ళతో పోటీ పడేవాడు కాడు. అంతస్తుకు మించి బట్టలు, బంగారు వాళ్ళలాగా వేసుకునేవాడు కాదు. అందువల్ల వాళ్ళలో కొంతమంది దృష్టి లో 'లంచాలు తీసుకోని చేతకాని వాడి' లాగా ఉండేవాడు. 


 అతని వెనుక కొంతమంది ఎగతాళి చేసీనా పట్టించుకునే వాడు కాదు. కానీ అతను గంజాయివనం లో తులసిమొక్క కనుక, అవతలి వాళ్ళు అవినీతి పనులకు దొరికి పొయ్యి పేపర్లో ఫోటో వేయించుకోబట్టే ఒకింత సుబ్రహ్మణ్యం ను చూసి ఒక్కోసారి జంకే వాళ్ళు కూడా. 


 ఆకాశానికి కనిపించని స్థంభాల లాంటి వారిలో సుబ్రహ్మణ్యం ఒకడు. ఈ దేశ చరిత్రలో ఇలాంటివారు ఉండబట్టే ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. పంటలు పండుతున్నాయి. 


.. 

 

ఈ మధ్య తనకంటే జూనియర్ ను, తన సీట్ కు మార్చి, తనను తక్కువ ప్రాముఖ్యమైన సెక్షన్ కు మార్చినప్పుడు, ఆ అవమానం తన సహోద్యోగులు ఎవరూ తనతో పంచు కోలేదు. చూసీ చూడనట్లు వున్నారు. అంత అవమానకరంగా తను ఆఫీస్ లో గడపాలా? అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. గౌరవం లేని చోట మనుగడ అవసరం లేదు. తల వంచుకుని అంత హేయమైన జీవితం గడిపే అవినీతి బ్రతుకు కాదు తనది. 


ఆఫీసు పద్ధతుల్లో విపరీతమైన మార్పులు వచ్చి 

అన్యాయమే రాజ్యమేలుతున్నది. 


ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చాడు సుబ్రహ్మణ్యం. తన వయసు యాభైనాలుగు. ఇంట్లో పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. ఇకనుంచి ప్రశాంతంగా జీవితం గడపవచ్చు. సామాన్యమైన జీవితం గడపడానికి పెన్షన్ వస్తుంది. అలా ఆలోచించి తెలిసిన పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని, ఒకవారం సెలవుపెట్టి, ఇంట్లో చర్చించి, స్వచ్ఛంద పదవీ విరమణ కు అప్లయ్ చేశాడు. 


ఇప్పుడిక ఎవరి గద్దింపులూ, ఎవరి ఎగతాళి మాటలూ వినవలసిన అవసరం లేదు అనుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఆసెలవు రోజులల్లో చూడాలనుకున్న ఒకటి రెండు దగ్గరగా ఉన్న పుణ్య క్షేత్రాలను ఫ్యామిలీతో కలిసి చూసి వచ్చాడు. రిటైర్మెంట్ తరువాత తను క్లాసులు చెప్పాలనుకున్న ట్యుటోరియల్ కాలేజ్ లో ఆ రోజు వివరాలన్నీ మాట్లాడి వచ్చాడు. నెలకు వచ్చే పెన్షన్ కు ఈ జీతం కలుస్తుంది, తనకూ కొంత వ్యాయామం లాగా వుంటుందని ఆ ఏర్పాటు చేసుకున్నాడు. 


రిటైర్మెంట్ తీసుకున్న రోజు కనీసం అతనికి కాఫీ కూడా ఇచ్చిపంపలేదు, ఆఫీస్ వాళ్ళు. అతనితో ఎవరూ మాట్లాడలేదు. ఆతరువాత కొంతమంది ఇంటికి వచ్చీ, కొంతమంది ఫోన్ చేసీ ‘ఆఫీసర్ కు ఇష్టం లేకుండా సుబ్రహ్మణ్యం తో మాట్లాడలేక పోయామనీ, సెండాఫ్ చెప్పలేక పోయ్యామనీ’ అన్నారు. నిజమే వాళ్ళు తెల్లవారి మళ్ళీ ఆఫీసర్ తో కలిసి పని చెయ్యాలి కదా. 


వాళ్ళల్లో కొంతమందికి సుబ్రహ్మణ్యం అంటే మనసులో గౌరవం వుంది. అలా అని సుబ్రహ్మణ్యం తో మాట్లాడితే ఆఫీసర్ కు కోపమొస్తుందనీ, మళ్ళీ వాళ్ళను ఆఫీసరు ఇబ్బంది పెట్టవచ్చుననీ వాళ్ళ భయం. వాళ్ళు ధైర్యంగా ఆఫీసర్ ను ఎదిరించలేరు. అందుకని అవన్నీ తనకు తెలుసు కనుక ‘ఏం ఫరవాలేదు’ అన్నాడు వాళ్ళతో సుబ్రహ్మణ్యం. 


తను ఎప్పటికీ తప్పు చేయవలసిన అవసరం లేదు. ఎవరికీ తలవంచే అవసరం అంతకన్నా లేదు. అనుకున్నాడు.. 'ఏనుగు ఎప్పుడూ వేయ్యే కదా' అన్న రీతిలో తల ఎత్తుకొని తిరిగే సుబ్రహ్మణ్యం. 


ఉద్యోగంలో ఉన్నా లేకున్నా అదే నిజాయితో ఇంకా ఎక్కువ ప్రశాంతతో “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అని నిరూపిస్తూ సాగిపోయాడు. 


సమాప్తం


కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 సమాప్తం

రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

 నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


1 commentaire


mk kumar
mk kumar
03 mars

బాగా రాశారు

J'aime
bottom of page