#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #Erpatlu, #ఏర్పాట్లు, #TeluguHeartTouchingStories
Erpatlu - New Telugu Story Written By - Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 28/12/2024
ఏర్పాట్లు - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"శారదా! త్వరగా తయారవ్వు! పదిగంటలు దాటింది, బ్యాంక్ కి వెళ్దాం." అన్నాడు రామచంద్ర.
"అలాగేనండి, క్షణంలో వస్తాను." అని రెండు నిమిషాల్లో తయారై భర్త ముందు నిలుచుంది శారదమ్మ.
ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంక్ కి వెళ్ళారు వారిద్దరూ. రామచంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి, ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. ఉద్యోగ విరమణ చేసి కొద్దినెలలే అయింది. ఉద్యోగ విరమణ సందర్భంగా తనకి లభించిన డబ్బులు ఫిక్సిడ్ డిపాజిట్ చెయ్యడానికి వచ్చారు వాళ్ళిద్దరూ. తన పేర్న కొంత, భార్య పేర్న కొంత డిపాజిట్ చేశాడు. బ్యాంక్ లో వెయ్యిరూపాయలు డ్రా చేసాడు. శారదమ్మ చేత మరో వెయ్యి రూపాయలు డ్రా చేయించాడు.
"ఇంట్లో డబ్బులున్నాయి కదండీ, మళ్ళీ ఎందుకు ఖాతాలోంచి డబ్బులు తీస్తున్నారు?" అడిగింది శారదమ్మ అర్ధంకాక.
"బ్యాంకులో ఎలా డబ్బులు డ్రా చెయ్యాలో నువ్వు తెలుసుకోవాలని. అలాగే ఏటిఎంలో డబ్బులు తియ్యడం కూడా నేర్చుకోవాలి నువ్వు, ఎప్పుడైనా అవసరం రావచ్చు!" అన్నాడు రామచంద్ర.
"మీరుండగా నాకెందుకండీ ఆ తిప్పలన్నీ?" అందామె.
మరుసటి రోజు పోస్టులో వచ్చిన హెల్త్ ఇన్సూరన్స్ పేపర్లు శారదమ్మకి ఇచ్చాడు జాగ్రత్తగా దాయమని. వాటి ఉపయోగం కూడా వివరించి చెప్పాడు.
"ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండీ!" అందామె.
"వాటి ఉపయోగం మున్ముందు చాలా ఉండొచ్చు." అన్నాడతను.
ఆ రోజంతా ఓ ఫైల్ ముందరేసుకు కూర్చుంటే, "ఉద్యోగం చేసినన్నాళ్ళూ, ఆఫీసు ఫైళ్ళన్నీ ఇంటికి తెచ్చి చూసేవారు. ఇప్పుడెంకండీ మళ్ళీ ఈ ఫైళ్ళు పట్టుకు కూర్చున్నారు?" అని అడిగింది.
నవ్వాడు రామచంద్ర. "ఇదేమిటో నీకు తర్వాత తెలుస్తుందిలే!" అని మళ్ళీ దీక్షగా తన పనిలో మునిగిపోయాడు.
'ఎప్పుడూ ఇంతే, ఏ మాటా పూర్తిగా చెప్పరు.' సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిందామె.
సాయంకాలం ఆ ఫైలు ఆమె చేతికిచ్చి, "ఈ ఫైలు జాగ్రత్తగా దాచు. అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది." అన్నాడు రామచంద్ర.
శారదమ్మ ఆ ఫైలు జాగ్రత్తగా తీసుకెళ్ళి అలమరాలో దాచింది.
ఓ సంవత్సరం తర్వాత...
తనకి ఏదో నలతగా ఉందని, గుండెల్లో చిన్నపాటి నొప్పి ఉందని రామచంద్ర చెప్పడంతో గాబరా పడింది శారదమ్మ. హఠాత్తుగా ఏం చెయ్యాలో ఆమెకేమీ అర్ధం కాలేదు. అప్పుడే గుర్తొచ్చిందామె, ఇలాంటి సమయంలో వెయ్యడానికి డాక్టర్ ఓ మాత్ర ఇచ్చాడని. గబగబ మందుల బ్యాగ్ వెతికి ఆ మాత్ర వేసింది రామచంద్రకి. అప్పటికే నొప్పితో విపరీతంగా బాధపడటంతో పక్కింట్లో ఉన్న సోమశేఖర్ గార్ని పిలిచింది. అతను వచ్చి పరిస్థితి గ్రహించి వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేసాడు. అప్పుడు శారదమ్మకి గుర్తుకువచ్చింది భర్త తనకి హెల్త్ ఇన్సూరన్స్ పాలసీ ఇచ్చి చెప్పిన సంగతి. అవి పట్టుకొని అంబులెన్స్ ఎక్కిందామె గుబులు పేరుకున్న గుండెల్తో.
హుటాహుటిన రామచంద్రని దగ్గర్లోనే ఉన్న హాస్పిటల్ కి చేర్చారు వాళ్ళిద్దరూ. శారదమ్మకి చాలా ఆందోళనగా ఉంది. సెల్ ఫోన్ తీసి ముంబైలో ఉన్న కొడుకు శేఖర్ కి ఫోన్ చేసింది. మనసులో ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంది. కానీ ఆమె మొర ఏ దేవుడూ ఆలకించలేదు. చికిత్స జరుగుతుండగా మరునాడు ఉదయం తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచాడు రామచంద్ర. కన్నీరు మున్నీరైంది శారదమ్మ.
శేఖర్ ముంబై నుండి వచ్చాడు. రామచంద్ర అంత్యక్రియలు జరిగాయి. శారదమ్మకి లోకమంతా శూన్యంగా తోచింది. భర్త లేకుండా తను ఒంటరిగా ఎలా ఉండాలో బోధపడలేదు. ఇంతకుముందు ఓ సారి కొడుకు దగ్గరకు వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వచ్చింది. అత్తగారి పొడ కోడలికి గిట్టదు. అక్కడికెళ్ళి వాళ్ళ సంసారంలో తను ఇమడలేదు. పన్నెండు రోజుల తర్వాత శేఖర్ వెళ్ళిపోయాడు తల్లిని వంటరిగా వదిలేసి. త్వరలో మళ్ళీ తిరిగి వస్తానని, తల్లిని ముంబై తీసుకు వెళ్తానని చెప్పి వెళ్ళాడు, కానీ అతని మాటల మీద అసలు నమ్మకం లేదు శారదమ్మకి.
నెల రోజులు గడిచాయి. శేఖర్ నుండి ఫోన్ కూడా రాలేదు. ఆ ఆశ వదిలేసుకుంది ఆమె. ఓ రోజు సాయంకాలం చీకటిలో కూర్చొని భర్త గురించే ఆలోచిస్తూ, దుఃఖిస్తూండగా ఆమెకి ఓ రోజు రామచంద్ర ఇచ్చిన ఆ ఫైల్ గుర్తుకు వచ్చింది. వెంటనే వెళ్ళి అలమరా తెరిచి ఆ ఫైల్ చేతిలోకి తీసుకుంది. అందులో ఏమున్నాయో చూసిన ఆమె అంతులేని విస్మయానికి గురైంది. ఇంతకీ అందులో ఉన్నవేమిటంటే, తన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు పూర్తిగా రామచంద్ర నింపి ఉన్నాడు. కేవలం శారదమ్మ సంతకం పెట్టడమే తరువాయి. అందుకోసం ఏమేం కావాలో పూర్తి వివరాలు, కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి.
తన పేరున చేసిన ఇన్సూరెన్స్ పాలసీలు, ఒకవేళ తనకేమైనా అయితే ఎలా క్లెయిం పొందాలో కూడా వివరంగా రాసి, ఫారాలు నింపి కూడా ఉంచాడు రామచంద్ర.
బ్యాంక్ అకౌంట్ వివరాలేకాక, తన తదనంతరం నామినేషన్ ఫారాలు నింపి ఎలా ఇవ్వాలో కూడా రాసాడు. ఒకేళ తను, ఏ కారణం చేతనో ముందుగా పోతే, ఆమెకే మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసాడామెకోసం రామచంద్ర. అప్పుడు గుర్తుకు వచ్చింది శారదమ్మకి, తనని కూడా బ్యాంకుకి, ఏటిఎం కి తీసుకెళ్ళి డబ్బులెలా తియ్యాలో నేర్పించాడన్న సంగతి. పెళ్ళైన దగ్గర నుండి తనకేమీ లోటు రాకుండా చూసుకున్న భర్త, తను మరణించిన తర్వాత కూడా తనకోసం అన్ని ఏర్పాట్లూ చేసాడని గ్రహించిందామె.
ఆమె కళ్ళలోంచి రెండు చుక్కలు ఆ ఫైలు మీద పడి ఆమె కళ్ళు మసకబారాయి.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
ఏర్పాట్లు" అనే ఈ కథ, భర్త తన భార్య కోసం చేసిన అణచిపాటు గల ప్రేమను చక్కగా వర్ణిస్తుంది. భార్యకు ఏమీ తెలియకుండా, ఆమె భవిష్యత్తును భరోసాగా ఉంచడానికి చేసిన ఏర్పాట్లన్నీ ఆమె మరణం తర్వాతే తెలుసుకొని ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త తన ప్రేమను చూపించిన విధానం చాలా ప్రత్యేకమైనది.