top of page
Writer's pictureYasoda Pulugurtha

ఎవరికెవరు ఈలోకంలో

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






'Evarikevaru Elokamlo' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

నీలాచలం, రాజేశ్వరీదేవి దంపతులు కోటీశ్వరులు.

ఎవరితోనూ విభేదాలు,విరోధాలు లేవు.

ఐదుగురు పిల్లలు ఉన్నారు.

కానీ పిల్లల వల్లే వారు బాధలు పడ్డారు.

భర్త మరణానంతరం ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది.

కంట తడి తెప్పించే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.



ఆదివారం సాయంత్రం నాలుగు గంటలైంది. వచ్చీపోయే అతిధులతో " కస్తూర్బా వృధ్దాశ్రమ ప్రాంగణం" అంతా హడావుడిగా ఉంది. కొంతమంది వృధ్దులు తమని చూడ వచ్చేవారికోసం కళ్లు కాయలు కాసేటట్లుగా ఎదురుచూస్తుంటే, మరికొందరు నిరాశగా 'నాకోసం ఎవరొస్తారులే, బ్రతికున్నా చచ్చినట్లే లెక్క వాళ్ల దృష్టిలో' అని నెమ్మదిగా గొణుక్కుంటున్నారు.

ఆ వృధ్దాశ్రమంలో ఎనభై ఎనిమిదేళ్ల రాజేశ్వరీదేవి అప్పటికి పది సంవత్సరాలనుండి అక్కడే ఉంటున్నారు. .

అదే ఊరిలో ఉంటున్న ఆవిడ మేనకోడలు 'కాంతిమతి' నెలకొకసారైనా ఆ వృధ్దాశ్రమానికి వచ్చి, మేనత్త రాజేశ్వరీదేవితో కొన్ని గంటలు గడిపి వెడ్తుంది.. కాంతిమతికి మేనత్త అంటే విపరీతమైన అభిమానమే కాకుండా జాలికూడా. అయిదుగురు పిల్లలున్నా తన మేనత్త ఎవరికీ అవసరం లేనట్లుగా, ఎవరూలేని అనాధలా వృధ్దాశ్రమంలో జీవిస్తోందని ఆవేదన పడ్తుంది. మామయ్య బ్రతికున్నంతవరకూ అత్తను మహారాణీలాగ కాలు కింద పెట్టనీయనంత అపురూపంగా చూసుకున్నారని కాంతి తల్లీ తండ్రీ మాట్లాడుకుంటూ ఉండేవారు.

రాజేశ్వరీదేవి తమ్ముడి కూతురే కాంతిమతి. ఆవిడ తమ్ముడూ మరదలూ కూడా కాలధర్మం చెందారు. రాజేశ్వరీదేవి చాలా అందగత్తె. వయస్సులో ఉండగా ఈవిడ చాలా అందగత్తె అయి ఉండొచ్చని ఇప్పుడు ఈ వయసులో చూసినవారందరూ అనుకుంటారు. ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో కూడా ఆవిడ ఎంతో ఆరోగ్యంగా పచ్చని దబ్బపండులా మెరుస్తూ, ఆవిడ పని ఆవిడే స్వయంగా చేసుకుంటారు. పొద్దుటే లేవడం, స్నానం, పూజ, చక్కటి క్రమశిక్షణని పాటిస్తూ ఉంటారు. మంచి సాహిత్యం , ఆధ్యాత్మిక పుస్తకాలు రెండూ చదువుతారు. తన తోటివారితో ఆప్యాయంగా మాట్లాడుతూ, ధైర్యం చెప్పే ఆవిడంటే ఆ వృధ్దాశ్రమంలో అందరకీ గౌరవమే..

అనుకున్నట్లుగా కాంతిమతి వచ్చింది. వస్తూ మేనత్తకు పళ్లూ, అలాగే ఆవిడకు ఎంతో ఇష్టమైన గోధుమనూకతో, ఆవునెయ్యి వేసి చేసిన రవ్వకేసరిని ఒక చిన్న స్టీల్ డబ్బాలో పెట్టుకుని వచ్చింది. అవన్నీ చూసిన రాజేశ్వరి " ఎందుకే తల్లీ ఇవన్నీ" అనగానే "ఏమత్తా.. నేను తేకూడదా?" అంటూనే స్పూన్ తో ఆవిడకు రవ్వకేసరి నోట్లో పెట్టి తినిపించింది. మేనకోడలికి తనపై ఉన్న ప్రేమకు ఆవిడ కళ్లు చెమర్చాయి.

ఉన్నట్లుండి కాంతిమతి " అత్తా, అత్తా, నీకో శుభవార్త, మా పెద్దమ్మాయి పెళ్లి కుదిరింది. కిందటిసారి వచ్చినపుడు చెప్పానుకదా, పెళ్లివారొకరు మా కీర్తనను చూసుకుని వెళ్లారని, వాళ్లకు కీర్తన నచ్చిందిట అత్తా. నిన్ననే ఫోన్ చేసి చెప్పారు. తాంబూలాలు తీసుకోడానికి వస్తామని, ముహూర్తాలు పెట్టుకుందామంటూ. ఎలాగైనా మా అమ్మాయి పెళ్లికి నిన్ను తీసుకుని వెడ్తానత్తా” అని చెపుతున్న మేనకోడలివైపు ఆప్యాయంగా చూసింది రాజేశ్వరి. “సంతోషం కాంతీ, మంచివాళ్లకెప్పుడూ దేవుడు మంచే చేస్తాడ”ని ఆవిడ....

ఆవిడ తన పాత కాలపు ట్రంకు పెట్టి తెరిచి పెట్టె అడుగున ఎర్రని పట్టువస్త్రంలో మూటకట్టి దాచిన ఒక చిన్న మూటని పైకి తీసి విప్పి, అందులో నుండి బయటకు తీసింది నాలుగుపేటల చంద్రహారాన్ని. . వంద సంవత్సరాల పూర్వం నాటిది. ఆవిడ అత్తగారు రాజేశ్వరీదేవికిచ్చిన చంద్రహారం అది. స్వఛ్చమైన మేలిమి బంగారం. రాజేశ్వరీదేవి దగ్గర ఉన్న ఏడువారాల నగలేకాకుండా, అత్తగారి అత్తగారి తరాలనుండి ఆవిడకు సంక్రమించిన ఎన్నో సాంప్రదాయ నగలన్నింటినీ ఆవిడ పిల్లలంతా పంచేసుకున్నారు.

" నీకు ఈ వయసులో బంగారమా, ఏ దొంగలో నీ పీక నులిమేసి తీసుకుపోతారంటూ". కానీ ఈ చంద్రహారం మాత్రం భోషాణం అట్టడుగున ఉండిపోయింది. . అన్ని నగలలో వారికి ఈ చంద్రహారం గుర్తురాలేదు. . ఒకటా రెండా , ఒక పెట్టెడునిండా ఉండేవి ఆవిడకు నగలు! పిల్లల దృష్టి పడకుండా జాగ్రత్తగా బధ్రపరిచింది. ఆవిడకు దానిమీద మోజుతోకాదు. ఎందుకో తెలియకుండా తనతోపాటూ ఒక గుర్తుగా మిగిలి పోయిందని. దాన్ని మేనకోడలి చేతిలో పెట్టి, నీ కూతురికి నా పెళ్లికానుకగా దీనితో ఏదైనా చేయించు కాంతీ, అంటూనే… పక్కనే ఉన్న చెక్కబీరువా తెరిచి ఎక్కడో అట్టడుగున దాచుకున్న రెండు పట్టుచీరలు, తొమ్మిది గజాల చీరలు , కాంజీవరం పట్టుచీరలు, రాజేశ్వరీదేవి భర్త కంచిలో ప్రత్యేకంగా బంగారు జరీ దారాలతో మగ్గంమీద తయారుచేయించిన అరవై సంవత్సరాలనాటి చీరలు తీసి మేనకోడలికి ఇస్తూ, వీటి జరీ అసలు సిసలైన మేలిమి బంగారం కాంతమ్మా , ఈ చీరలు కట్టుకుని మీ మామయ్య పక్కనే కూర్చుని ఎన్నో శుభకార్యాలు జరిపించాను. ధగ ధగా మెరిసే ఈ చీరలమీదే అప్పట్లో అందరి చూపులూనూ. ఇప్పుడు ఈ చీరల విలువ ఎన్నో లక్షల్లో ఉండొచ్చు. బాగా తెలుసున్న వ్యాపారికి ఇచ్చేసి ఖరీదు కట్టించుకోమంటూ మేనకోడలి చేతిలో పెట్టేసరికి, కాంతిమతికి దుఖం ఆగలేదు. మేనత్తను కౌగలించుకుని ఏడ్చేసింది ! కాంతిమతిది ఒక మధ్య తరగతి కుటుంబం. మేనత్తలాగ ఆస్తిపరురాలు కాదు. .

"అత్తా, నేను వీటి కోసం ఆశపడలేదు..నీదగ్గర ఇవన్నీ ఉంటాయన్న ఊహకూడా లేదునాకు. నాకొద్దు అత్తా, నీ ప్రేమ చాలు నాకు, నీదగ్గరే ఉంచేయ్” అనగానే,

" చూడు కాంతీ, నీవు నామీద చూపిస్తున్న అభిమానానికి వెలకడ్తున్నానని అనుకోకు. ఏమిటో ఇన్నాళ్లూ ఇవి నాతో అలా ఉండిపోయాయి. ఆస్తి పంపకాలప్పుడు పిల్లలు వీటిని చూసుంటే వీటిని కూడా వదిలేవారు కాదు. ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు, వెండిసామానూ, అలాగే ఎన్నో విలువైన నా పట్టుచీరలు నాకు నాకంటూ దెబ్బలాడుకుంటూ మరీ పంచేసుకున్నారు. పోతేపోయాయిలే అనుకుంటాను. ఇన్ని నానుండి పొంది కూడా వాళ్లకు నేను ఒక 'అవసరం లేని' మనిషిగా కనిపించడమే గుండెల్లో తూట్లుపొడిచినంతగా బాధపడతాను...

వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు, నాకిప్పుడు జీవితంలో ఏ కోరికలు లేవు. నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నానంతే'' అని నిర్వేదంగా అన్నారామె.

"నీకిలా ఇవ్వాలని దేవుడు రాసిపెట్టాడేమో కాంతీ, ఇంకా నాకెందుకు , నేనేమి చేసుకుంటాను వీటితో ? ఏ క్షణంలో రాలిపోతుందో ఈ ప్రాణం” అంటూ , " నీలాంటి మంచి మనసున్న వ్యక్తి కి ఇచ్చానన్న తృప్తి చా”లంటూ మేనకోడలి చేతిలో పెట్టి ఆశీర్వదించింది.

తన కన్నపిల్లలు తనను చూడడానికి రాకపోయినా ఎక్కడో మేనకోడలు నెలకు ఒకటి రెండుసార్లు అభిమానంగా తనను చూసి వెడుతుంది. ఆవిడకిష్టమైనవన్నీ తెలుసుకుని వండి తీసుకొచ్చి మరీ తినిపిస్తుంది. నిజానికి కాంతిమతే సహాయపడకపోతే తను ఇలా వృధ్దాశ్రమానికి వచ్చేదేకాదు. ఏ రోడ్డునో దిక్కులేకుండా పడి ఉండేది.

రాజేశ్వరీదేవికి గతం ఒక్కసారి కళ్లముందు కదలాడింది !

######

ఆవిడ భర్త నీలాచలంగారికి రాజేశ్వరీదేవికి ముగ్గురు మగపిల్లలూ, తరువాత ఇద్దరు ఆడపిల్లలు. అందరినీ బాగా చదివించారాయాన. ఆడపిల్లలకు చక్కని వరుళ్లను తెచ్చి పెళ్లిళ్లు చేసారు.

నీలాచలంగారి తండ్రి, తాత ముత్తాతలంతా ఆస్తిపరులే. నీలాచలం గారు లాయరు వృత్తి చేస్తూ బాగానే సంపాదించారు. తాతగారు, తండ్రి నుండి సంక్రమించిన పొలాలూ తోటలేకాకుండా పాతకాలంనాటి హవేలీలాంటి బంగళా లో నీలాచలంగారు భార్యా పిల్లలతో ఉంటూండేవారు. అప్పట్లో అది పెద్ద మండువా మేడ. అంటే ఈ కాలపు డూప్లెక్స్ ఇళ్లలాగా విశాలమైన మండువాలోంచి మెట్లుండి పైన మరో అంతస్తు ఉండేది. కిందా పైనా కలిపి మొత్తం పదిహేను గదులు. గదుల్లోనూ , మండువాలోనూ గోడలకి రవివర్మ చిత్రాలు నిలువెత్తు ఫ్రేముల్లో ఉండేవి. విదేశాల నుంచి , తెప్పించిన విలువైన క్రిస్టల్ షాండ్లియర్స్ , కంచుతో పోతపోసిన విగ్రహాలు ఉండేవి. తమాషాగా లోగిలిలో పెరట్లో ఉన్న నుయ్యికాక , వంటింటి నానుకుని ఒక నుయ్యి ఉండేది. వంటకి కావల్సిన నీళ్లు అప్పటికప్పుడు బకెట్టుతో మడిగా తోడి వాడుతూ ఉండేవారు. ఇంటి వెనుకాల పశువుల పాకలు, గేదెలు ఆవులు, పనివాళ్లు పాలేర్లతో హడావుడిగా ఉండేదెప్పుడూ. ఒక పెద్ద వంటశాల విడిగా కట్టుకున్నారు. అక్కడ ఎప్పుడూ పొయ్యిలు నిత్య అగ్నిహోత్రం లా వెలుగుతూనే ఉండేవి. ఇంటివారికి, పనివారికి, వచ్చిపోయే అతిధులకు ఒక అన్న సత్రంలాగ పెద్ద పెద్ద పొయ్యి ల మీద డెగిశాలలో వంటమనుషులు వంటలు వండుతూ ఉండేవారు. ఏ పండుగ పబ్బం వచ్చినా ఆ హవేలీ అంతా ఎంతో సందడిగా వచ్చీపోయే బంధుమిత్రులతో, క్లైంట్స్ తో నిత్యకల్యాణం పచ్చతోరణంగా కళ కళ్లాడుతూ ఉండేది.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఆ ఊరిలోని సంక్రాంతి సంబరమంతా వీరింట్లోనే తిష్టవేసిందా అన్న అనుభూతి కలిగేది. బావా మరదళ్ల హాస్య చలోక్తులు, బావా బావా అంటూ ఆప్యాయంగా పలుకరించుకునే బావగార్లూ, అల్లుళ్ల అలకలు, తోటికోడళ్ల గుస గుసలూ, వసపోసిన పిట్టల్లా మాట్లాడుకునే అక్కా చెల్లెళ్లూ, షోకిలారాయుడిలా పోజులుకొడ్తూ ఖరీదైన సిగరట్ కాలుస్తూ పెద్దల్లుడూ, తోటనుండి కొబ్బరిబోండాలు దింపించానయ్యా, కొబ్బరినీళ్లు తాగండంటూ తోటమాలి గోవిందూ, ధాన్యపు బస్తాలు గోదాములలో నింపించాను దొరా అంటూ నాగలి తో వచ్చిన మల్లిగాడూ, ఆవిడ ముగ్హురు మనవరాళ్లూ ఇద్దరు మనవలే కాకుండా వారి పాలేరు మల్లేశం కొడుకు కిట్టిగాడు గోచీగుడ్డ కట్టుకుని వీరినిచూసి సంబరంతో గెంతుకుంటూ రావడం, కూతురి గొబ్బెమ్మల సంబరాలూ, వారి పెద్ద మనవడు ఒక పక్కన పాటలతో బూరా ఊదడం, ఒకపక్క వంటమనిషి వండుతున్న వంటలూ, పాలేరు మల్లేశానికి దోసిలినిండా చల్లనినీరు పోస్తున్న పనిమనిషి రంగమ్మ , ఈ హడావుడిని చూస్తూ, మాకేమీ పాలుదొరకవా అంటూ మ్యాం మ్యాం…. అప్పుడు మొదలైనాయి దుర్దినాలు. ఆయన గుటుక్కుమంటే ఆస్తిపంపకాలు సరిగా జరగవని దూరాలోచన చేసిన వారి పెద్దల్లుడు గిరిధర్ ఆస్తిపంపకాల పెంట పెట్టడంతో కుటుంబం మొత్తం విఛ్చిన్న మైపోయింది. నీలాచలంగారికి ఆస్తిని పిల్లలకు పంచక తప్పలేదు. వారు ఉంటున్న హవేలీని కూడా సమంగా విభజించమన్నారు. డెవలప్ మెంట్ కి ఇచ్చేసి సమంగా ఫ్లాట్స్ పంచుకుందామన్న ఆలోచన పెద్దల్లుడు గిరిధర్ అందరి చెవిలోనూ ఊదాడు. ఈ దారుణాన్ని తట్టుకోలేని నీలాచలంగారికి రెండవసారి హార్ట్ ఎటాక్ రావడం ప్రాణం పోవడం జరిగిపోయింది. అందరికీ ఆస్తిని సమానంగా పంచిన ఆయన భార్యకు కూడా కొంత ఆస్తిని రాసాడు. తల్లి బాధ్యత కొడుకులదే అన్నట్లుగా విల్లులో వ్రాసారాయన. .

దాని ఫలితం రాజేశ్వరీదేవిని ముగ్గురు కొడుకులూ పంచుకున్నారు. తలో నాలుగేసి నెలల చొప్పున ఒక్కో కొడుకు దగ్గర ఉండేటట్లుగా… నీకు ఆస్తి ఎందుకు, మా దగ్గరే ఉన్నప్పుడంటూ కొడుకులు కోడళ్లూ ఆవిడను వేధించేవారు. తల్లి ఆస్తి కూతుళ్లకు వస్తుందంటూ పెద్దల్లుడు గిరిధర్ మళ్లీ రంగ ప్రవేశం చేసాడు. ఆవిడకు మనశ్సాంతి లేకుండా చేసేసాడు. పోనీ కొడుకులు , కోడళ్లూ బాగా చూసుకుంటున్నారా ఆవిడను అంటే అదీలేదు. కోడళ్ల సూటిపోటి మాటలు, ఎప్పుడు పోతుందో మా అత్తగారి దరిద్రం అంటూ పెద్దకోడలు తన తల్లితో ఫోన్లో చెప్పడమే కాదు, మిగతా కోడళ్లు కూడా మీకు వయసైపోయింది, అన్నింట్లో తల దూర్చకండంటూ ఖరాఖండీగా చెప్పేసి ఆవిడను ఒక మూలకు తోసేసారు. .

ఒకసారి అనుకోకుండా కాంతిమతి ఆవిడను చూడడానికి వచ్చినపుడు మేనత్త పరిస్తితిని చూసి బాధతో చలించిపోయింది. అత్తకు ఈ వయసులో వచ్చిన కష్టానికి చేతనైనంత సహాయం చేయాలనుకుని, ఒక పదిరోజులు నా దగ్గర ఉంచుకుని పంపిస్తానని వాళ్లతో చెప్పి అత్తను తనతోపాటు ఆమె ఊరుకి తీసుకొచ్చింది. మా దగ్గరే ఉండిపో అత్తా అన్నా, ఎవరిదగ్గరా ఉండనని ఒకటిరెండు రోజులు ఆలోచించారు. తను ఎవరికీ అవసరంలేదు కాబట్టి ఒక నిర్ణయానికొచ్చి మేనకోడలి సహాయంతో ఒక లాయర్ని సంప్రదించి ఆవిడ పేరున ఉన్న ఆస్తినంతా కస్తూర్భా వృధ్దాశ్రమానికి వ్రాసి ఇచ్చేసి ఆవిడకూడా ఆ వృధ్దాశ్రంలో ఉండిపోయింది. ఆస్తి ఎవరికీ ఇవ్వకుండా తల్లి అలా చేసిందని పిల్లలందరూ ఆవిడమీద కక్ష కట్టారు. పెద్దల్లుడు గిరిధర్ అయితే భార్యతో మీ అమ్మ చచ్చినా నీవు చూడడానికి వెళ్లకూడదని హుకుంజారీ చేసాడు. అదేమాటను తన తోడల్లునికి కూడా నూరిపోసాడు.

పిల్లలకు ఆవిడకూ మధ్య ఒక బలమైన ఇనప తెర పడిపోయింది. .

--------

ఒక నెలరోజుల తరువాత కాంతిమతి పొద్దునే పదిగంటలకు మేనత్తను చూసివద్దామని , కూతురికి పెళ్లిముహూర్తాలు పెట్టుకున్నామన్న శుభవార్తను కూడా అత్తకు చెప్పాలని వచ్చింది. ఆమె వచ్చేసరికి అందరి ముఖాలలో విషాదపు ఛాయలు. కాంతిమతిని చూడగానే హోమ్ నిర్వాహకుడు ఒకాయన గబ గబా వచ్చి మీ మేనత్త రాజేశ్వరీదేవిగారు పొద్దునే పూజ చేసుకుంటూ భగవధ్యానంలో ఉండగానే పక్కకు ఒరిగిపోయి స్వర్గ ప్రాప్తి చెందారని చెప్పాడు. ఈ విషయం వారి పిల్లలకు తెలియపరిచామని, తల కొరివి పెట్టడానికి రమ్మంటే, ఆవిడ ఆస్తినంతా ఆశ్రమం అనుభవిస్తున్నపుడు ఆ బాధ్యతకూడా నిర్వాహకులదేనంటూ వారినే ఆపని కానిచ్చేయమని చెప్పారని చెప్పాడాయన.

కాంతిమతికి ఆ మాటలు విన్నాకా నోటమాట రాలేదు. చలనం లేనిదానిలా అయిపోయింది. కళ్లమ్మట నీళ్లు ధారగా కారిపోతున్నాయి. మేనత్త పట్ల ఆవిడ హృదయం అర్ధ్రమైంది. అత్త ఎంతో హుందాగా మహారాణీలా జీవించింది. అటువంటి అత్తకు కన్న కొడుకులే తలకొరివి పెట్టడానికి రాలేదు. పోనీలే అటువంటి కొడుకులు తలకొరివి పెట్టినా అత్త ఆత్మకు శాంతికలగదనుకుంది.

" అయినా అత్త అనాధ కాదు, తనుండగా" అనుకుంటూ ఆశ్రమ నిర్వాహకులతో. . . . . . . . " మా అత్తకు నా భర్త తలకొరివి పెడ్తా”రని చెపుతూ తన భర్తకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది.

ఈ ' జీవనయానంలో ఎవరకేది ప్రాప్తమో, ఎవరిసేవ ఎవరికి ప్రాప్తమో' అని బరువుగా నిట్టూర్చింది కాంతిమతి. తన ప్రియమైన మేనత్తకు ఈవిధంగా బుుణం తీర్చుకోగలగడం తమ అదృష్టంగా భావించింది. కాంతిమతి భర్త రాజేశ్వరీదేవిని తన తల్లిగా భావించాడు. అతని కన్నతల్లి అతని చిన్నతనంలోనే చనిపోయింది. ఎంతో భక్తి శ్రధ్దలతో కాంతిమతి భర్త ఆశ్రమంలోనే ఆవిడ కర్మకాండలను జరిపి ఆవిడ పేరుమీద ఘనంగా పేదవారికి అన్నదానాలు నిర్వహించి రాజేశ్వరీదేవి బుుుణం తీర్చుకున్నారు..

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

శతాక్షి

రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


63 views0 comments

コメント


bottom of page