top of page
Writer's picturesingeetham Ghatikachala Rao

ఎవరికి ఎవరు?




'Evariki Evaru' - New Telugu Story Written By Singeetham Ghatikachala Rao

Published In manatelugukathalu.com On 11/08/2024

'ఎవరికి ఎవరు?' తెలుగు కథ

రచన: సింగీతం ఘటికాచల రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



బిర్లా మందిర్ కు దగ్గరగా అతను తరచూ వచ్చే స్టార్ హోటల్ లోకి ప్రవేశించాడు అభిజిత్. లోపలికి వెళ్ళి రెండే కుర్చీలు ఉన్న ఒక టేబిల్ దగ్గర కూర్చున్నాడు.


 వెంటనే యూనిఫామ్ లో ఉన్న అమ్మాయి అక్కడికి వచ్చి విష్ చేసి చిరునవ్వుతో మెనూ కార్డ్ అతని ముందుంచింది. వెంటనే నీళ్ళు కూడా సమకూర్చింది. గత నాలుగైదు రోజులుగా అక్కడ చూస్తున్నాడా అమ్మాయిని. అదేమిటోగానీ తను ఏ టేబిల్ దగ్గర కూర్చుంటే అక్కడికే ఆ అమ్మాయి వస్తూంది. ఆ అమ్మాయి ముఖంలో ఏదో తేజస్సు ఉట్టి పడుతూంది. ఆ అమ్మాయి చూపుల్లో ఏదో ఆకర్షణ ఉన్నది. బాగా చదువుకున్నదానిలా ఉంది.


 రెండు నిముషాలు గడిచాక ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. వెంటనే తనకు కావలసినది ఆర్డర్ చేశాడు అభిజిత్. ఐదు నిముషాల వ్యవధిలోనే అతను ఆర్డర్ చేసినవి తెచ్చి టేబిల్ మీద సర్ది “హావ్ ఎ గుడ్ డే సర్” అనేసి వెళ్ళిపోయింది.


 తింటూనే ఆలోచనల్లో పడిపోయాడు అభిజిత్. పెళ్ళి చేసుకొమ్మని ఇంట్లో ఒకటే గోల పెడుతున్నారు. కానీ వాళ్ళు చూసిన సంబంధాలలో తనకు కావలసిన లక్షణాలున్న అమ్మాయి ఇంతవరకూ కనిపించలేదు. ఆ క్షణంలో, నెల క్రితం ఆఫీసులో కొత్తగా చేరిన అపర్ణ మదిలో మెదిలింది. చాలా అందగత్తె. తాను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి. ఐతే పరిచయమై కనీసం నెల కూడా కాకముందే ప్రపోజ్ చెయ్యడమన్నది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ అలాంటి అందగత్తె విషయంలో ఆలస్యం అమృతం విషం అన్న సామెత గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల తన పలకరింపు ఎక్కువచేసి పరిచయాన్ని కొత్తపుంతలు తొక్కించాలనుకున్నాడు.

 మెల్లగా వ్యక్తిగత విషయాలు ఆరా తీస్తూ తన పరిచయాన్ని విస్తరింపజేసుకున్నాడు. దాని ఫలితంగా, ముఖ్యంగా గత వారం రోజులుగా ఆ అమ్మాయి మరింతగా తనకు తానే అతని దగ్గరికి వచ్చి పలకరించడం అతని మనసులో సంతోషాన్ని నింపింది.


 ఇక ప్రపోజ్ చెయ్యడమే తరువాయి. సరిగ్గా ఆ విషయం దగ్గరే గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు మాట పెగలక కాస్త బెరుకుగా అనిపిస్తూ అతన్ని బాగా ఇబ్బందికి గురి చేస్తూంది. బహుశా దానిక్కూడా ప్రత్యేకమైన స్థలం అనేదేదైనా ఉండాలేమో అని కూడా ఆలోచించాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు హటాత్తుగా ఇదే హోటల్ అతని మదిలో మెదిలింది. కాఫీ ఆఫర్ చేసి తన మనసులోని మాటను ఇక్కడే చెప్పొచ్చుగా అన్న ఆలోచన బ్రహ్మాండంగా అనిపించింది.


 ‘రేపు సాయంత్రం ఆఫీస్ ముగిశాక అపర్ణను ఇక్కడికి పిల్చుకు రావాలి’ అని నిర్ణయించుకుని తినడం ముగించి ఫింగర్ బౌల్ లో చేతులు కడిగేసుకున్నాడు.


 ఆ అమ్మాయి బిల్ వాలెట్ తెచ్చి ఇచ్చింది. వెంటనే ఐదువందల కాగితాన్ని అందులో ఉంచి ఆమెకందించాడు. ఆమె తిరిగి ఇచ్చినదాన్లో పెద్ద నోట్లు మాత్రం తీసుకుని మిగతా అంతా అందులోనే ఉంచేసి బయటపడ్డాడు అభిజిత్.


 తన ఆలోచన అమలు చేసేందుకు మానసికంగా తనను తాను సిద్ధం చేసుకోవాలి. అందుకు మానసిక శక్తితోడు దైవ శక్తి కూడా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటూ తలెత్తి చూశాడు. పాలరాతితో నిర్మించబడి దీపపు కాంతుల వెలుగులో ధగద్ధగాయమానంగా వెలుగొందుతున్న బిర్లా మందిర్ కనిపించింది. సన్నగా తల పంకించి ‘రేపు’ అనుకుని ఇంటికి బయలుదేరాడు అభిజిత్.


 మర్నాడు శనివారం అటు తరువాత ఆదివారం. రెండు రోజులు ఆఫీసుకు శెలవు. ఇక సోమవారమే అపర్ణను కలవగలడు. ఫోన్ చేసి గుడికి రమ్మంటే వస్తుందా? అనుకున్నాడు గానీ చెప్పలేదు. ఆమెకు దైవభక్తి, నమ్మకం ఉందో లేదో తెలియదు.


 అలజడి రేగుతున్న మనసుతో మర్నాడు బిర్లా మందిర్ చేరుకున్నాడు. యాదృచ్ఛికం, కాకతాళీయం లాంటి పదాలే నిజమైతే ఎక్కడో మనసు మూలల్లో అపర్ణ కూడా గుడికి రావచ్చేమో అన్న ఆశ కించిత్ కలుగుతూంది. ఆ ఆలోచనే అతనికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. గుడి మెట్లు ఎక్కుతూండగా పక్కనే వేరే ఎవరో బాగా పరిచయమైన ముఖం కనిపించినట్టైంది. పక్కకు తిరిగి చూస్తే ఒక అమ్మాయి పదహారణాలా తెలుగుతనం ఉట్టిపడేలా లంగా ఓణీతో మెట్లెక్కుతూ ఉంది తన పక్కనే. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అతన్ని చూసి సన్నగా నవ్వింది, బాగా పరిచయమున్నట్టు. అతను మరింతగా అయోమయానికి లోనయ్యాడు. నవ్వుతూందంటే ఆ అమ్మాయికి తను తెలుసా? ఎలా? ఎక్కడ చూసింది? అన్న ప్రశ్నలు ఉదయించి ఆలోచనలో పడేశాయి.


 ఆ వెంటనే “హలో సర్” అంటూ పలకరించింది.


 సస్పెన్స్ భరించలేక, “నేను మీకు తెలుసా?” అనడిగాడు.


 “అవున్లెండి. యూనిఫామ్ లో ఉంటే గుర్తుపట్టేవారేమో కదా” అన్నది. అదే చిరునవ్వు!


 హటాత్తుగా అతనికి గుర్తుకొచ్చింది! ఆ అమ్మాయి హోటల్ లో వెయిటర్! ఆహా. ఎంత తేడా! ప్యాంటు షర్ట్ లో ఉన్న అమ్మాయి హటాత్తుగా ఇలా సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపిస్తే తికమక పడాల్సిందే కదా. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి “ఓహ్ మీరా! నిజంగానే గుర్తుపట్టలేక పోయాను. అయామ్ సారీ” అన్నాడు నొచ్చుకుంటూ.


 “ఛఛ. మీరెందుకు సారీ చెప్పడం. అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూంటారా?” అన్నది.


 తల అడ్డంగా ఊపి, “చాలారోజులైంది. ఎందుకో ఇవాళ రావాలనిపించింది. అంతే” అతని మనసులో అపర్ణ ఉంది. అతని కళ్ళు కూడా ఆమె కోసమే వెదుకుతున్నాయి. ‘యాదృచ్ఛికం... రాసిపెట్టి ఉంటే తప్పకుండా ఇవాళ తను కలుస్తుంది’ అనిపిస్తూందతనికి. కానీ ఆ విషయాలన్నీ ఈ అమ్మాయితో తను చెప్పలేక, అందుకే అలా నాన్చాడు.


 “మీరేంచేస్తుంటారు?” అడిగింది ఆ అమ్మాయి.


 “సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇన్ఫోసిస్ లో”


 “వావ్. మంచి కంపెనీ. ఇల్లు ఇక్కడికి దగ్గరేనా?” 


అవునన్నట్టు తలూపాడు అభిజిత్.


 “నా పేరు అభినయ. ఇంట్లో అంతా అభి అని పిలుస్తారు. మీ పేరు తెలుసుకోవచ్చా?” చాలా చనువుగా అడిగింది.


 ఆశ్చర్యపోయాడు అభిజిత్. “నా పేరు అభిజిత్. మా ఇంట్లో కూడా నన్ను అభి అని పిలుస్తారు. భలే కోఇన్సిడెన్స్” అతని పెదాలు మాట్లాడుతున్నాయి గానీ అతని కళ్ళు మాత్రం అపర్ణ కోసం వెదుకుతున్నాయి.


 అది గమనించిన అభినయ “ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు?” అన్నది.


 “అబ్బే. అదేం లేదు. మా ఫ్రెండొకరు వస్తానని ఫోన్ చేశారు. ఈ గుంపులో కనిపెట్టడం కష్టం కదా. అందుకే అలా చుట్టూ చూస్తున్నాను” అబద్దం చెప్పేశాడు.


 “ఈ కాలంలో కూడా కనిపెట్టడం కష్టమంటే ఎలా సర్. చేతిలో మొబైల్ ఉంది. లొకేషన్ షేర్ చెయ్యమంటే చాలు. రెండో నిముషంలో ఎక్కడున్నా పట్టెయ్యొచ్చు” అన్నది.


 ఇబ్బందిగా చూశాడు అభిజిత్. తన మనసులో ఉన్న ఆలోచనలు బయటపడనివ్వ కూడదని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కానీ వీలు పడడం లేదు.

 కాస్సేపటికి ఎందుకో నవ్వింది అభినయ.

 “ఎందుకు నవ్వుతున్నారు?” అనడిగాడు అర్థం కాక.


 “నా ఉద్దేశ్యం తప్పుకాకుంటే మీరు ఎవరో ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. తప్పైతే అయామ్ సారీ. కాస్త ఎక్కువగా మాట్లాడినట్టున్నాను” అన్నది. ఆశ్చర్యంగా చూశాడు అభిజిత్ ఆమె వంక.


 “సరే. నేను బయలుదేరుతాను. మా పేరెంట్స్ అప్పుడే గుడికి చేరుకున్నారు. నాకోసం ఎదురు చూస్తుంటారు” అంటూ అతని జవాబు కోసం ఎదురుచూడకుండా క్షణాల వ్యవథిలో అంతర్థానమైంది అభినయ. హోరున వర్షం వచ్చి వెలిసినట్టనిపించింది అభిజిత్ కు. అతను అనుకున్నట్టుగా అపర్ణ ఆరోజు గుడికి రాలేదు. యాధృఛికం అన్న పదం పనిచెయ్యలేదు.


 సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే అపర్ణ కనిపించింది. ఎందుకో ఇవాళ ఆ అమ్మాయి మునుపటికంటే అందంగా కనిపించింది. అందులోనూ రాగానే అతన్ని పలకరించి, అంతకన్నా ఆశ్చర్యంగా మునుపెన్నడూ లేని విధంగా కరచాలనం చేసింది. దాంతో అతని మనసు పట్టరాని సంతోషంతో సీతాకోక చిలుకలా ఎగిరింది.

 ఆలస్యం అమృతం విషం అన్న నానుడు పదేపదే గుర్తుకు వస్తూండడంతో ఇక ఆగలేక వెంటనే లేచి అపర్ణ సీట్ దగ్గరికి వెళ్ళాడు.


 “అపర్ణా, సాయంత్రం ఫ్రీయేనా?” అడిగాడు ఉపోద్ఘాతంగా.


 అతనివంక అదోలా చూసి “మ్, ఫ్రీ అంటే... ఫ్రీయే” అంటూ సాగదీసింది.


 “కెన్ వియ్ హావ్ ఎ కాఫీ టుగెదర్?” అన్నాడు. మాట తడబాటును బలవంతంగా, విజయవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు.


 “ఓస్ ఇంతేనా, ఓకే” అన్నది. మనసు తేలికైంది అభిజిత్ కు.


 సాయంత్రం హోటల్ కు వెళ్ళారు ఇద్దరూ. ఎప్పటిలాగే రెండు కుర్చీలు మాత్రమే ఉండే ఒక టేబిల్ చూసి కూర్చున్నాడు అభిజిత్. అతనికి ఎదురుగా కూర్చుంది అపర్ణ.


 అభిజిత్ ను చూడగానే అభినయ వేగంగా వచ్చింది. అతనితోబాటు మరో అమ్మాయి ఉండడం చూసి ఠక్కున తన వేగానికి కళ్ళెం వేసి మెల్లగా వచ్చి విష్ చేసింది ఇద్దరికీ.


 మెనూ కార్డ్ తీసుకుని అపర్ణకిచ్చాడు అభిజిత్. అదే సమయంలో అభినయ వంక చూశాడు. అభినయ అపర్ణవంక చూసి “అమ్మాయి బాగుంది“ అన్నట్టు కళ్ళతోనే చెప్పింది.


 అభినయ చేసిన సైగ అర్థం చేసుకుని తడబడ్డాడు అభిజిత్. ఆరోజునుంచీ అపర్ణతో కలిసి తరచుగా ఆ హోటల్ కు రావడం పరిపాటి అయిపోయింది అభిజిత్ కు. ఎప్పుడు వచ్చినా రాకున్నా వారాంతాలలో తప్పనిసరిగా హాజరయ్యేవారు.

 రోజులు వారాలుగా నెలలుగా మారేందుకు అట్టే సమయం అవసరం లేదు. మూడు నెలలైనా తన మనసులోని మాట చెప్పేందుకు అభిజిత్ కు చాలినంత ధైర్యం కుదరడం లేదు. ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో అయోమయంగా ఉంది.


 స్నేహం స్నేహం అంటూనే ఉన్నట్టుండి ప్రేమ అనేస్తే దానికి ఆ అమ్మాయి ప్రతిక్రియ ఎలా ఉంటుందో ఊహించుకోలేకున్నాడు. ఎన్నాళ్ళిలా సాగిదీయాలి. తనేమంటుంది. ఔనంటుంది లేదా కాదంటుంది. అంతటితో ఆ ఘట్టం ముగుస్తుంది. ఔనంటే జీవితం, కాదంటే మనసుకు ఓ విధమైన ప్రశాంతత, ఇబ్బందికర క్షణాలు తప్పుతాయి. మనసంతా కలగాపులగంగా ఉంది.


 అలా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఆరోజు సాయంత్రం ఒక నిర్ణయానికి వచ్చాడు. నేరుగా చెబితే కోపగించుకుంటుందేమో. ఒక చిన్న కార్డు ముక్క మీద రాసి అందిస్తే...! ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. దాదాపుగా ప్రేమ లేఖ రాసినట్టే. మినీ ప్రేమలేఖ. ఒకే వాక్యంలో!


 సాయంత్రం ఆఫీసు ముగిశాక కాఫీ షాప్ కు వెళ్దామని పిలిచాడు అభిజిత్.

 “సారీ అభి, ఇవాళ మనోజ్ బర్త్ డే పార్టీ ఉందట. రేపెళ్దాం” అనేసింది అపర్ణ.


 “మనోజ్... ఎవరు?”


 “నిన్ననే చేరాడు మా సెక్షన్లో... వెరీ హాండ్ సమ్, రిచ్ అండ్ నైస్ గై” అని కళ్ళెగరేస్తూ నిష్క్రమించింది అపర్ణ.


 ఆమె వెళ్ళిపోయాక ఉలికిపడ్డాడు. ‘అంటే... తనకు పోటీ మరొకడు వచ్చేశాడన్నమాట. ఇన్నాళ్ళుగా ఆలస్యం చేసినందుకు బహుశా అపర్ణ తనను వేరేలా అర్థం చేసుకుందేమో. తననొక పిరికివాడికింద జమకట్టేసిందేమో’

 అతని మనసు ఆ ఆలోచనను కొట్టిపారేసింది. ‘నో. అపర్ణ అలాంటిది కాదు. మంచి అమ్మాయి. నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి తనలో. ఇక ఆలస్యం చెయ్యకూడదు. రేపే నా నిర్ణయం చెప్పెయ్యాలి’ అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు.


 మర్నాడు సాయంత్రం కూడా ఆమె వేరే ఏదో పని చెప్పి అతని మనసులోని ప్రేమ ప్రవాహానికి గండికొట్టింది. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం అతనితో కాఫీకి వచ్చేందుకు ఓకే చెప్పింది అపర్ణ. బిర్లా మందిర్ దగ్గరున్న అదే హోటల్.


 మెనూ కార్డ్ తీసుకుని చూసి ఆర్డర్ చేశాక తన మాటలు ఎలా ప్రారంభించాలో తెలియక కాస్సేపు తడబడి కార్డులోనుంచి తల ఎత్తకుండానే ఉపోద్ఘాతంగా “అపర్ణా. నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను” అన్నాడు.


 జవాబు రాకపోవడంతో కార్డు పక్కకు తప్పించి ఆమెవంక చూశాడు.

 అపర్ణ లేదు. చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. ఇబ్బందిగా చుట్టూ చూశాడు అభిజిత్, తననెవరైనా గమనిస్తున్నారేమోనని.


 చుట్టుపక్కల టేబిల్స్ ఖాళీగానే ఉన్నాయి. అప్పుడే అభినయ వచ్చింది టేబిల్ దగ్గరికి. ఆమెను చూడగానే ఉలికిపడ్డాడు. తనేమైనా వినేసిందా?


 “ఏంటి సర్. ఇవాళెందుకో చాలా నెర్వస్ గా ఉన్నట్టున్నారు” అన్నది మెల్లగా.


 తన తడబాటును బైటపడనీయకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ “అబ్బే. ఏం లేదే. ఆఫీసులో వర్క్ గురించిన ఆలోచన... అంతే” అన్నాడు కృత్రిమంగా నవ్వుతూ.

 ‘ఛ. మరీ ఇంత పిరికితనం పనికిరాదు. ఐనా కార్డు ముక్కమీద రాసుకునే వచ్చాను కదా. వెళ్ళే ముందు తన వ్యానిటీ బ్యాగ్ లో ఆ ముక్క ఉంచేసి దానికి సమాధానం చెప్పమంటే సరి. ఇక ఈ ఉపోద్ఘాతాలన్నీ వద్దు’ అనుకున్నాడు.


 అపర్ణ వచ్చి కూర్చుని “మన పరిచయమై ఎంత కాలమైంది. నాలుగు నెలలుంటుందా” అనడిగింది టిష్యూ పేపర్ తో చేతి తడి తుడుచుకుంటూ.


 “ఉంటుంది. ఏం?”


 “మొట్టమొదట నిన్ను చూసిన క్షణంలో నీకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారనుకున్నాను. చూస్తే నువ్వేమో బ్యాచిలర్” అంటూ ఫకాలున నవ్వేసింది. ఇబ్బందిగా నవ్వాడు అభిజిత్.


 అంతలో అభినయ అతనిచ్చిన ఆర్డర్ పట్టుకొచ్చి టేబిల్ మీద సర్దింది.


 అభినయ వెళ్ళిపోయాక, “చాలా రోజులుగా గమనిస్తున్నాను. నువ్వెప్పుడు వచ్చినా ఈ అమ్మాయే నీకు సర్వ్ చేసేందుకు వస్తుంది. ఏంటీ విషయం?” అన్నది కన్ను గీటుతూ.


 ఎదురు చూడని ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు అభిజిత్. మళ్ళీ ఫకాలున నవ్వింది అపర్ణ.


 “ఓకే ఓకే. ఎంజాయ్. ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం” అన్నది.


 కాస్త నెర్వస్ గా ఫీలయ్యాడు అభిజిత్. కాఫీ పూర్తి కాగానే అభినయ బిల్ వాలెట్ తెచ్చి టేబిల్ మీద ఉంచింది. అప్పుడు హటాత్తుగా అతనికి పర్స్ లోని కాగితం గుర్తొచ్చింది. ‘దాన్ని ఎలాగైనా అపర్ణ బ్యాగ్ లో ఉంచాలి’ అనుకుంటూంటే, అపర్ణ లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది.


 అదే అదనుగా, ఆమె వెళ్ళిన వంకే చూస్తూ పర్స్ తీసి అందులో ఉంచుకున్న కాగితాన్ని ఆమె వ్యానిటీ బ్యాగ్ ముందువైపు జిప్ తీసి అందులో ఉంచేశాడు.


 దూరంగా నిలబడి ఉన్న అభినయ అది గమనిస్తూనే ఉన్నది. కానీ ఆమె గమనిస్తున్న విషయం అభిజిత్ కు తెలియదు.


 అపర్ణ వచ్చి కూర్చుంది. “నాకెందుకో ఈ ఫింగర్ బౌల్ నచ్చదు. చేతులు కడుక్కున్నట్టే ఉండదు” అన్నది టిష్యూ పేపర్ తో చేతులు తుడుచుకుంటూ.


 మౌనంగా ఉన్నాడు అభిజిత్. మనసులో టెన్షన్.

 “వెళ్దామా?” అన్నది బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ.


 “అపర్ణా...” అన్నాడు మెల్లగా. ఏంటన్నట్టుగా చూసిందతనివంక అపర్ణ.


 “నీ బ్యాగ్ లో ఒక కాగితం ముక్క ఉంది. దానికి జవాబు కావాలి” అన్నాడు. ఆ వాక్యం పలికి ముగించేందుకు బాగానే కష్టపడ్డాడు అభిజిత్. అంత తడబాటు తత్తరపాటు ఎందుకో అతనికే అర్థం కావడం లేదు. మనసులోని మాట అంత నెర్వస్ నెస్ అవసరమా అనిపించింది.


 విచిత్రంగా అతనివంక చూసి అపర్ణ బ్యాగ్ తెరవబోయింది.


 “నోనో. ఇప్పుడు కాదు. ఇంటికెళ్ళి తీరిగ్గా కూర్చుని ఆలోచించి సమాధానం చెప్పు”


 బ్యాగ్ జిప్ మీదినుంచి చెయ్యి తీసేసింది అపర్ణ. ఏదో అర్థమైనట్టు గుంభనంగా నవ్వింది. “జవాబు ఇప్పుడే చెప్తే ఏమైనా ఇబ్బందా?” అనడిగింది.


 “నీకు ఆలోచించుకునేందుకు టైమ్ కావాలిగా” అన్నాడు ఈసారి కాస్త ధైర్యంగా.


 “ఓకే. అలాగే కానీ” అంటూ బయటికి నడిచింది.


 “పద. బిల్ కట్టేసి వస్తాను” అన్నాడు. అపర్ణ వైపే చూస్తూ పర్స్ తీసి అందులోనుంచి ఓ కాగితం బిల్ తో బాటు ఉంచాడు.


 ఆ వెంటనే అభినయను పిలిచి వాలెట్ అందిస్తూ “కీప్ ది ఛేంజ్” అన్నాడు.

***

  సోమవారం ఉదయం ఆఫీసుకు చేరుకుని తన సీట్ వద్దకు వెళ్ళగానే అక్కడికే అపర్ణ వచ్చింది. ఆమె ముఖం కోపంతో కందిపోయి ఉంది. ఒకట్రెండు క్షణాలు అతనివంక తదేకంగా చూసి చాచి బలంగా లెంపకాయ కొట్టింది. ఆ శబ్దానికి చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ అటువైపు చూశారు. ఐతే ఏం జరిగిందో ఎవరూ చూడలేదు. అందరికీ శబ్దం మాత్రమే వినిపించింది.


 “నువ్విచ్చిన కాగితానికి ఇదే నా జవాబు” అనేసి చరచరా వెళ్ళిపోయింది.


 అవమానం భరించలేకపోయాడు అభిజిత్. వెంటనే శెలవు అప్లై చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వారం రోజుల వరకూ ఆఫీసుకు వెళ్ళలేదు.


 ఆరోజు శనివారం సాయంత్రం ఎప్పటిలాగే హోటల్ కు వెళ్ళాడు అభిజిత్, ఒంటరిగా.


 అపర్ణ లేకపోవడం, పైగా వాడిన ముఖంతో ఉన్న అతన్ని చూసిన అభినయ ఏదో జరిగిందని గ్రహించింది. ఆమెకు అర్థమైంది కూడా.


 “గుడ్ ఈవెనింగ్ సర్. మీ ఫ్రెండ్ రాలేదా ఇవాళ?” అనడిగింది.


 “మనుషులను అర్థం చేసుకోవడం అందరికీ చేతకాదేమో” అన్నాడు మెల్లగా.


 “అంటే... మీ ప్రపోజల్ కాదన్నదా?” అనడిగింది.


 విచిత్రంగా చూశాడు ఆమెవంక. ‘తను ప్రపోజ్ చేసినట్టు ఈమెకెలా తెలుసు?’

 “మీరన్నది నిజమే సర్. మనిషిని అర్థం చేసుకోకున్నా ఫర్వాలేదు. అపార్థం మాత్రం చేసుకోకూడదు. అది చాలా ఘోరమైన తప్పు” అన్నది. తల దించుకుని కూర్చున్నాడు అభిజిత్.


 అతను చెప్పకుండానే వేడిగా ఉల్లిపాయ బజ్జీలతోబాటు టీ తీసుకొచ్చింది అభినయ.

 మౌనంగా అవి తిని టీ తాగి ముగించాడు. బిల్ తెచ్చి పెట్టింది అభినయ.


 పర్స్ తీసి రెండువందల నోటు బిల్ వాలెట్ లో ఉంచాడు. ఆ సమయంలో అక్కడొక కాగితం ముక్క కనిపించింది. కొద్ది క్షణాలపాటు దానివంక తదేకంగా చూసిన అభిజిత్ అదిరిపడ్డాడు. ‘ఈ కాగితం ఇక్కడికెలా వచ్చింది?’ అనుకున్నాడు.


 “నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం కావాలి” అని రాసి ఉందా కాగితం మీద. 


అంటే ఆరోజు ఈ కాగితానికి బదులుగా వేరే ఏదైనా కాగితం ఉంచాడా తను! అంటే... దీనికి బదులుగా ఐదువందల కాగితం...! ఓ గాడ్. అంటే... ఎంత ఘోరం జరిగిపోయింది. నిజంగా ఇది దిద్దుకోలేని పొరపాటే. అసలెలా జరిగిందో అర్థం కాలేదు.


 ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ‘అంటే ఆరోజు వ్యానిటీ బ్యాగ్ లో ఉంచాల్సిన కాగితాన్ని బిల్ వాలెట్ లో ఉంచి బిల్ వాలెట్ లో ఉంచాల్సిన డబ్బును వ్యానిటీ బ్యాగ్ లో ఉంచాడు. కాగితానికి బదులుగా కరెన్సీని చూసిన అపర్ణకు అది ఘోరమైన అవమానంగా, అతి జుగుప్సాకరంగా తోచింది. నిజమే. ఐదు వందలిచ్చి దానికి నీ సమాధానం కావాలంటే ఎవరికైనా తప్పకుండా కోపం వస్తుంది. దానికి ప్రతిక్రియ సోమవారం ఆఫీసులో తెలిసింది.


 అదే సమయంలో అతని మస్తిష్కంలో మరో అనుమానం మొలిచింది. అంటే... ఆరోజు సాయంత్రం తను హోటల్లో డబ్బులివ్వకుండానే వెళ్ళిపోయాడు. అందుకు అభినయ తన జేబులోనుంచి ఇచ్చుకుందన్నమాట. మొదటిసారి బిర్లా మందిర్ మెట్లమీద ఆమెతో మాట్లాడ్డమే తప్ప ఆ తరువాత పెద్దగా పరిచయం లేని తనకు, కేవలం ఈ కాగితాన్ని చూసి జరిగినది పొరపాటని అర్థం చేసుకుని హుందాగా ప్రవర్తించింది. ఇలాగే అపర్ణ కూడా జరిగిన తప్పిదాన్ని తనకు నిదానంగా చెప్పి ఉంటే బాగుండేది. అలా అందరి ముందు చెయ్యి చేసుకుంటుందనుకోలేదు. కొద్ది క్షణాలపాటు అభినయవంక తదేకంగా చూశాడు అభిజిత్.


 “మీకేదైనా అవమానం జరిగి ఉంటే ఆ అపార్థానికి కారణం బహుశా ఈ కాగితం ముక్కేనేమో సర్” అన్నది అభినయ మెల్లగా.


 “కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పులను కూడా పరిస్థితులు ఒప్పుగా మార్చేస్తాయి. నా జీవితంలో కూడా బహుశా అదే జరగబోతూందేమో” అంటూ మెల్లగా బిల్ తో బాటు తన చేతిలోని కాగితాన్ని మళ్ళీ బిల్ వాలెట్ లో ఉంచేశాడు.


 “చాలా థాంక్స్ అభి. చనువుగా అభి అని పిలిస్తే కోపం రాదనుకుంటాను. ఆరోజు పొరపాటున ఈ కాగితాన్ని ఇక్కడుంచాను. ఇవాళ ఉద్దేశ్య పూర్వకంగానే ఉంచుతున్నా. ‘ఆమె కాదన్న తరువాత నేను కావల్సివచ్చానా?’ అని నువ్వు నన్ను కోపగించుకున్నా సరే నేనేమీ అనుకోను. నీ కోపం న్యాయమే. నిజానికి మన పరిచయం రోజూ కేవలం పావుగంట, కాఫీ తాగే సమయంలోనే. కానీ సున్నితమైన పరిస్థితుల్లో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అదే మనసుతో ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటాను. చేసుకుంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మొదటిసారి నిన్ను గుడిలో కలిశాను. ఆరోజు నేను గుడిలో ప్రవేశించిన సమయంలో ఎవరో కలుస్తారన్న భావన నా మనసులో మెదులుతూనే ఉంది. అది నువ్వేనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడిది దైవ నిర్ణయమే అనుకుంటా. దైవ నిర్ణయమెలా ఉన్నా నీ నిర్ణయం ముఖ్యం. ఏడాదిలోపు ఎప్పుడు చెప్పినా సమ్మతమే. ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన కొన్ని ఆలోచనలు భావాలు ఉంటాయి. నీ మనసేం చెప్తుందో దాని ప్రకారమే నిర్ణయం తీసుకో. ఇంతకన్నా చెప్పలేను. ఉంటాను” అంటూ లేచాడు. 


కొద్ది క్షణాలు ఆమెలో చలనం లేదు.

 ఆమె బిల్ వాలెట్ చేతిలోకి తీసుకుని భద్రంగా, పదిలంగా ఎదపై అదుముకుంది అభినయ. అతని కళ్ళల్లోకి చూసింది. నిష్కల్మషమైన అతని చూపుల్లో నిజం కనిపిస్తూంది.


 “వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు బిర్లా మందిర్ లో కలుద్దాం. అప్పుడు చెప్తాను సమాధానం” అన్నది అతని కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ.


 దూరంగా ఎక్కడో పాట వినిపిస్తూంది... “ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక”. ఆమె సమ్మతిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో, తేలికపడ్డ మనసుతో బయటికి నడిచాడు అభిజిత్.

***

సింగీతం ఘటికాచల రావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/grsingeetham

నా పేరు సింగీతం ఘటికాచల రావు. మా తండ్రిగారి పేరు సింగీతం వెంకటరమణ రావు, జడ్.పి హైస్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేశారు. తల్లిగారు కృష్ణవేణీబాయి, గృహిణి.

ఆరుగురు సంతానంలో నేను మూడోవాణ్ణి. పుట్టిన స్థలం నెల్లూరు పట్టణం. పదవ తరగతి పూర్తి చేశాక నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాలలో 1981 లో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను.

1989 లో చెన్నైలోని “ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)” లో చేరి అక్కడే అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా ఏప్రిల్ 2024 లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం చెన్నైలోనే స్థిర నివాసం.

1996 లో అనంతపురం వాస్తవ్యులైన శ్రీ గురురాజారావు, శ్రీమతి చంద్రకాంతగార్ల కుమార్తె విజయలక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు ప్రద్యుమ్న రావు, చిన్నవాడు ప్రద్యోత రావు.

సాహితీ ప్రస్థానంః నా రచనా వ్యాసంగం పన్నెండో ఏట ఛందోబద్ధమైన కవిత్వంతోనే ప్రారంభమైంది. అలా వ్రాయడంలో ఏకైక గురువు తండ్రిగారే. ఆ చిన్న వయసులోనే “సరస వినోదిని” సమస్యా పూరణం విరివిగా పాల్గొన్నాను. 1997 లో “ఐదు పైసలు” అనే శీర్షికతో రాసిన సింగిల్ పేజీ కథ స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైనది. మొదటి పారితోషికంగా యాభై రూపాయలు వచ్చాయి. 2005 లో తిరిగి మొదలైన సాహితీ ప్రయాణం ఇప్పటివరకూ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. హాస్య, సామాజిక, థ్రిల్లర్, సరసమైన అంటూ అన్నిరకాల కథలనూ రాశాను.

2007 లో “పెంకుల వసారా” కథ అనిల్ అవార్డ్ కన్సొలేషన్ బహుమతి, “పిచ్చుక గూళ్ళు” కథ 2010 సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్ గెలుచుకుంది.

మొదటి నవల “మనసున మనసై”, 1997 లో స్వాతి మాస పత్రిక అనుబంధ నవలగా ప్రచురింపబడింది. బహుమతి పొందిన నవలలలో “అజాత శత్రువు” (స్వాతి 16 వారాల సీరియల్), “రాగ విపంచి” (నవ్య వీక్లీ, సిపి బ్రౌన్ అకాడమీ అవార్డు రెండవ బహుమతి) “సారేజహాసే అచ్ఛా” (స్వాతి 16 వారాల సీరియల్) ముఖ్యమైనవి. ఇప్పటివరకూ 130 కథలు, 15 నవలలు అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం స్వాతి సపరివార పత్రికలో “సారేజహాసే అచ్ఛా” సీరియల్ ప్రచురితమౌతూంది.


49 views0 comments

Comments


bottom of page