ఎవరికి మోక్షం
- Ayyala Somayajula Subramanyam
- Feb 22
- 4 min read
#AyyalaSomayajulaSubrahmanyam, #EvarikiMoksham, #ఎవరికి మోక్షం, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #పురాణం, #ఆధ్యాత్మికం, #devotional

Evariki Moksham - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 22/02/2025
ఎవరికి మోక్షం - తెలుగు కథ
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
మహాశివరాత్రి పర్వదినాన కాశీపుణ్యక్షేత్రం మహాకోలాహలంగా ఉంది. శివనామంతో మారుమ్రోగి
పోతోంది. ఎటు చూసినా విభూతి పూతలు పూసుకొని, రుద్రాక్షమాలలు ధరించి చేతిలో అర్చన
కోసం బిల్వదళాలను పట్టుకొని ఉన్న భక్తపుంగవులే కనబడుతున్నారు. హరహర మహాదేవ, హర
హర మహాదేవ అంటూ మేను మరచి బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు.
కైలాసభువనం లో పార్వతీదేవి ఈ కోలాహలాన్ని చూసి అబ్బురపడింది. పతి చెంతకు చేరి “మహాదేవా; శివరాత్రి పర్వదినాన నిన్ను సేవించువారికి మోక్షం ఇస్తావని ప్రతీతి; మరి ఈ రోజు శివరాత్రి వ్రతం చేస్తున్న అందరికీ మోక్షం ఇస్తున్నారా? ముక్తి ఇంత సులభమా?” అని ప్రశ్నించింది.
గంగాధరుడు చిరునవ్వు నవ్వి ‘నీవు నాతో మారువేషంలో భూలోకానికి రా. ఏమి చేయాలి నీకు వివరిస్తాను. ఆ విధంగా నీవు వింత నాటకమాడు. అప్పుడు నీకే ప్రత్యక్షంగా ఎవరికి మోక్షం వస్తుందో తెలుస్తుంది’ అని పలికి శివుడు పార్వతీదేవితో కలిసి వృద్ద దంపతుల వేషంలో భూలోకం
లోని కాశీక్షేత్రానికి విచ్చేశారు.
ముందే శివుడు వివరించిన విధంగా పార్వతీ అమ్మవారు, పండుముత్తైదువ వేషంలో కాశీక్షేత్రంలో గంగాతీరంలో కూర్చొని, తన ఒడిలో ముదుసలి వేషంలో ఉన్న పరమశివుణ్ణి పడుకోబెట్టుకుని ఏడుస్తూ, ‘ఓ పుణ్యాత్ములారా; ఎవరైనా గుక్కెడు నీళ్ళను దాహంతో బాధ పడుతున్న నా భర్తకు అందించి పుణ్యం కట్టుకోండి’ అని బిగ్గరగా చెబుతోంది.
దారినపోయే దానయ్యలు కొందరు “ఇదేమిటమ్మా? ప్రక్కన అంతటి గంగానదిని పెట్టుకుని గ్రుక్కెడు నీళ్ళకోసం ఇంతగా ఆరాటపడుతున్నావు” అని వెక్కిరింతగా అడిగారు.
అందుకు ఆ ఇల్లాలు, “నాయనలారా; పెద్దతనం వల్ల నేను నడిచివెళ్ళి నీళ్ళు తీసుకువచ్చి, నా భర్తకు ఇవ్వలేను. మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే వారు గంగనీళ్ళు తీసుకువచ్చి, నాభర్త దాహాన్ని తీర్చి పుణ్యం కట్టుకోండి.
ఎంతమాత్రం పాపం చేసినవారు నీరు ఇచ్చినా, నా భర్త మరణిస్తాడు. అప్పుడు ఆ హత్యాపాతకం మీకు చుట్టుకుంటుంది. కనుక మీలో పాపం అసలు చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రుక్కెడు నీళ్ళు తీసుకు వచ్చి నా భర్త ప్రాణాలను కాపాడండి” అంది.
ఈ మాటలు విన్న వారంతా ‘ఏమిటీ? పాపం చేయని వారు మాత్రమే ఈ వృద్ధుడి దాహం తీర్చాలా? ఏ కొద్దిపాటి పాపం చేసిన వాడైనా ఈయనగారికి నీళ్ళు ఇస్తే ప్రాణాలు పోతాయా? విచిత్రంగా ఉందే: ఇంతకుముందు ఎప్పుడూ ఇటువంటి విడ్డూరాలు మనం విని ఎరుగం; పాపం చేయకుండా ఎవరు
మాత్రం ఉండగలుగుతారు. తెలిసీ, తెలియకో ఏదో ఒక సందర్భంలో మనకు పాపం అంటకుండా ఉంటుందా? కనుక మనము ఇతనికి నీళ్ళు ఇచ్చి, వృద్ధుని హత్యను మూట కట్టుకోవడం ఎందుకు? అసలు ఏ పుణ్యాత్ముడు ఇతనిని కాపాడగలుగుతాడో, ఆ పుణ్యాత్ముని చూడడం కోసమైనా మనం ఇక్కడే ఉందాము’ అని అనుకుంటూ, గుంపులు గుంపులుగా ఒక మాటలో చెప్పాలంటే కాశీలోకి భక్త జనమంతా అక్కడ చేరింది.
ఈ వింతను చూసిన కాశీనగరంలో నుండి ఒక వేశ్య ఆ వృద్ధ ముత్తైదువ దగ్గరకు వచ్చి “తల్లీ; నీకు అభ్యంతరం లేకపోతే, ఈ గంగనీటితో నీభర్త దాహార్తిని తీరుస్తాను” అంది.
అందుకు అక్కడున్నవారంతా అభ్యంతరం తెలిపారు. “నీవు వేశ్యవు. నీకు పాపం అంటకుండా ఎలా ఉంది?” అని అడిగారు.
అందుకు ఆ వేశ్య “ఓ మహానుభావులారా; ఈ మహాశివరాత్రి పర్వదినాన గంగలో స్నానం చేసి డుంఢి
గణపతిని, కాలభైరవుని, విశాలాక్షిని, అన్నపూర్ణను, విశ్వనాథుని సేవించాను. శాస్త్రవచనాన్ని అనుస
రించి మహాశివరాత్రినాడు గంగలో స్నానం చేసి ఉపవసించి, విశ్వనాథ దర్శనం చేసుకున్న వారికి పాపం లేదు. కనుక నేను పాపాత్మురాలిని కాను. త్రికరణముల శుద్ధిగా నేను పుణ్యాత్మురాలిని” అని చెప్పి, అక్కడి వారి సందేహాన్ని తీర్చింది.
ఈ సంభాషణ వింటున్న మాయావేషంలోని పరమశివుడు “ఓపార్వతీ; ఆ వేశ్య చేత్తో నాకు దాహం తీర్పించు. విన్నావుగా ఇటువంటి నమ్మిక కలిగిన వారికి మాత్రమే, మోక్షము కలుగుతుంది. శివరాత్రి యొక్క పూర్తి ఫలితం చేకూరుతుంది” అని చెప్పెను.
పార్వతీదేవి ఆ వేశ్యతో పరమశివునికి నీరు అందింపజేసింది.
వేశ్యయెక్క పరమభక్తికి మెచ్చుకున్న ఉమామహేశ్వరులు ఆమెకు మోక్షము ప్రసాదించారు.
తత్వజ్ఞానం:
మనిషి శరీరం లో ఉండే 24తత్వాలను చైతన్యంతో అధిగమించిన వాడు 25 తత్వమైన జ్ఞానాన్ని
క్రమంగా 26 వ తత్వం ఆత్మ, 27 వ తత్వం పరమాత్మలను అధిగమించి, 28 వ తత్వం విదేహ స్థితికి సంకేతమే శివలింగమని, అందుకు సూచికగానే ప్రతీ నెల 28 వరోజున (మాస) శివ రాత్రిగా పాటిస్తారని ధర్మశాస్త్రప్రవచనం. వాటన్నింటిలోకి ఉత్తమమైనది మహాశివరాత్రి.
శివపంచాక్షరీ:
‘నమఃశివాయ’ అనేది శివపంచాక్షరీ. దీనికి “ ఓం” కారాన్ని చేర్చి జపించేవారు. పంచాక్షరీ లోని అయిదక్షరాలు పంచమహాభూతాలు. అయిదు తన్మాత్రలు. అయిదు విషయాలు. అయిదు ప్రాణాధి వాయువులు. అయిదు జ్ఞానేంద్రియాలు. అయిదు కర్మేంద్రియాలు. ఇవన్నీ పంచాక్షర బ్రహ్మ స్వరూపమైనవి. అందువలన శివపంచాక్షరీ విశిష్టమైనది.
అథమానసపూజ:
“అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః
సర్వ భూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషతః
శాంతి పుష్పం, తపః పుష్పం ధ్యాన పుష్పం తధైవచ సత్యమష్ట విధం పుష్పం. శివప్రీతికరం భవేత్.
‘శివా; ఈ పుష్పాష్టకంతో నీవు సంతుష్టవయ్యెదవు గాక. అహింస, ఇంద్రియ చాపల్యరాహిత్యం అన్ని
ప్రాణాల పట్ల దయ కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత
గుణం, నిరంతర తపం, నిత్యధ్యానం, నిజం చెప్పే గుణం, వీటితో నిన్ను మానసికారాధన చేస్తా’నని
మహాశివరాత్రి నాడు ప్రతిన చేసి, వాటిని ఆచరణలో పెడదాం.
వివిధ లింగాల పూజా ఫలితాలు:
ఏ లింగాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేది ధర్మసింధు వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి
వాటి గురించి తెలుసుకుందాం.
వజ్రలింగాన్ని పూజించడం వలన ఆయుర్‌వృద్ధి కలుగుతుంది.
ముత్యపు లింగాన్ని పూజించడం వలన రోగ నాశనమవుతుంది.
వైఢూర్యంలో చేసిన లింగాన్ని పూజించడం వలన పీడిత బాధలు తొలుగుతాయి.
పధ్మరాగమణి నిర్మిత లింగాన్ని పూజించడం వలన ధనవృద్ధి కలుగును.
పుష్యరాగ లింగాన్ని పూజించడం వలన సౌఖ్యముగా చేకూరును.
ఇంద్రనీలమణి లింగాన్ని పూజించడం వలన యశస్సు లభిస్తుంది.
మరకత లింగాన్ని పూజించడం వలన పుష్టి కలుగుతుంది.
స్ఫటిక లింగాన్ని పూజించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి.
వెండి లింగాన్ని పూజించడం వలన ఉన్నతపదవులు పొందగలరు. పితృ ఋణ విముక్తి కలుగుతుంది.
సువర్ణ లింగాన్ని పూజిస్తే ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది.
బెల్లముతో చేసిన లింగాన్ని, అన్నను తో చేసిన లింగాన్ని పూజించడం వలన వంశ వృద్ధి కలుగుతుంది.
శివరాత్రినాడు తమ శక్త్యానుసారం రత్న, కాంచన, రజత, శిల, దారు, మృత్రిక, రస, గంధాలు, ఇసుక లేదా పుట్ట మన్ను దేనితోనైనా సవేదికా లింగాన్ని చేయించి పూజించిన యొడల వారికి జన్మ సంస్కార బంధాలు కలుగవు అని విజ్ఞులంటారు.
“కర్పూర గౌరవం, కరుణావతారం
సంసారసారం, భుజగేంద్ర హారం
సదావసంతం హృదయారవిందే
భవం భవాని సహితం నమామి”
“రాజరాజేశ్వరా, రక్షించు జగధీశ్వరా”.
***శుభంభూయాత్***
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ఆధ్యాత్మిక కథలు ఎన్నో తెలిసిన, మళ్లీ చదవాలని అనిపిస్తుంది - ఇది రచయిత గొప్పతనం
"ఎవరికి మోక్షం" కథలో ముక్తి (మోక్షం) అసలు అర్ధాన్ని అర్థమయ్యేలా ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. మహాశివరాత్రి సందర్భంలో పార్వతీదేవి, శివుని మోక్షం గురించి ప్రశ్నించగా, శివుడు ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వకుండా భూలోకానికి వచ్చి పరీక్ష నిర్వహిస్తాడు. కాశీ పురిలో ఒక వృద్ధుడిగా మారిన శివుడు, దాహంతో ఉన్న తనకు నీళ్లు ఇవ్వాలని కోరుతాడు. అయితే, "పాపం లేని వారే నీళ్లు అందించాలి" అనే నిబంధన పెట్టడంతో, జనాలెవ్వరూ ముందుకు రాలేక పోతారు. చివరికి, ఒక వేశ్య మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి, తాను మహాశివరాత్రి ఉపవాసం చేసి పాపరహితురాలినని ప్రకటించి నీరు అందించగా, శివుడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ ద్వారా మోక్షం అనేది కేవలం పాపం-పుణ్యాల లెక్కతో సంబంధం లేకుండా, భక్తి, నిష్కపటత, విశ్వాసం, అంతర్ముఖతను ఆధారంగా చేసుకుని లభిస్తుందనే సందేశాన్ని అందించారు. మానవుడు తన తప్పులను సరిదిద్దుకునే మనోభావం కలిగి, అచంచలమైన భక్తితో శరణాగతి పొందితే, అతడికి మోక్షం సిద్ధమవుతుందని ఈ కథ తెలియజేస్తుంది.