top of page

ఎవరు మారాలి?

Updated: Aug 23, 2023


'Evaru Marali' - New Telugu Story Written By Surekha Puli

'ఎవరు మారాలి' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఫోన్ చాలా సేపటినుండి మొగుతున్నది. నిద్ర మత్తు పూర్తిగా వదలని ఆశ్రితకు ఫోను ధ్వని చెవుల్లో కర్ణకఠోరంగా విన్పిస్తుంది. బెడ్ ప్రక్కన వున్న టీపాయి మీదికి చేయి చాపినా అందుకోలేని మత్తు, తెరల తెరలుగా నిద్ర మత్తు!


విజయ్ మీద పట్టలేని కోపం. సూర్యుడు కళ్ళు తెరవక ముందే విజయ్ కాళ్ళు జాగింగ్ పేరిట పరుగులు పెడతాయి.


“హలో.. , ఆశ్రితా హియర్. ”

“హలో, నేను పశుపతిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే హైదరాబాద్ రావాలి, మీ అక్క చనిపోయింది, ”


“బావగారు నమస్తే! ఏమిటి మీరనేది, అక్క.. రాజీ అక్క.. చనిపోయిందా? ఎప్పుడూ, ఎలాగ. ??


“ఆత్మహత్య చేసుకుంది” అవతలి కంఠం.

“బావగారు, ఏం చెబుతున్నారు? వినలేక పోతున్నాను. నిజం చెప్పండి, ప్లీజ్”


“అవునమ్మా, నిజమే, కారణాలు తెల్సు కుందామంటే ఎక్కడా ఏ ఉత్తరము కూడా కనిపించటము లేదు. మీ ఆయనకు కూడా చెప్పమ్మా, యింకా నేను చాలా ఫోన్లు చేయాలి. ”


ఫోన్ కట్ అయింది.


రాత్రంతా సుఖంగా, ప్రశాంతమైన నిద్ర పోయిన ఆశ్రిత తల దిమ్మెక్కిది. కామధేనువుకు పర్యాయ పదం రాజ్యలక్ష్మి! అటువంటి దేవతా మూర్తి ఆత్మహత్య చేసుకోవడం ఎంత దారుణం !!


అత్తగారింట్లో ఆశ్రిత కు వున్న ఏకైక తోడు రాజ్యలక్ష్మి!.. చనిపోయిందా?? అందునా ఆత్మహత్యా???


గుండె వేగం పెరిగింది. ఎప్పుడూ సంతోషం పంచుతూ, కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా సహాయ పడుతూ.. అసలు అక్కకు కష్టాలు, కన్నీళ్లే లేవని ముద్ర దాల్చిన ఇల్లాలి ఆత్మహత్యకు బలీయమైన కారణమేంటి?”


“హ్యాపీ హోమ్” అని ఎప్పుడూ పేరుగాంచిన స్వర్గంలో అలజడా!?


బావగారు అంటే స్వయానా విజయ్ అన్న పశుపతి, ఎంతో హుందా మనిషి. ఆ అనురాగ జంటకు పంట రవళి, పరశురామ్.


పరశురామ్ పై చదువులకు విదేశం వెళ్ళాడు. అతని సహవిద్యార్ది, ఫ్రెండ్ శ్రీనాథ కిచ్చి రవళి టెన్త్ పరీక్షలు రాయగానే పెళ్లి జరిపించారు. పదిహేనవ యేట పెళ్లి వద్దని వారించినా రాజ్యలక్ష్మి వినలేదు. కూతురి విషయంలో మొండిగా ప్రవర్తించింది.


అన్నీ బాగానే వుంటే ఆత్మహత్య ఎందుకు? తన మనుసు విప్పి ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితులేమిటి?


అన్నీ ప్రశ్నలే. మామూలుగా ఇంట్లో ఎవరైనా చనిపోతేనే చాలా బాధగా వుంటుంది అటువంటిది ఆత్మహత్య అంటే ఆత్మీయులకు ఎంత రంపపు కోత!


ఆశ్రిత రిసెర్చ్ మొదలైనప్పటి నుండి ఎన్నో కేసులు స్టడీ చేసింది. కానీ ఈమారు రాజీ అక్క.. ఆత్మ.. తలచు కుంటేనే వంట్లో నరాలన్నీ పని చేయటము మానేసాయి.


కూర్చున్న చోటు నుండి లేచి నిలబడేందుకు శక్తి లేదు. అన్ని కోణాల్లోను గుండె మోత ఘోరంగా ఘోషిస్తుంది.


హమ్మయ్య! విజయ్ వచ్చాడు. వదిన అంటే అమితమైన గౌరవం. బ్యాడ్ న్యూస్ చెప్పింది.


ఎల్లవేళలా నవ్విస్తూ, నవ్వుతూ వుండే విజయ్ ముఖం ఒక్క సారిగా చెదరి పోయింది. భార్య కంటే బలంగా వుండే భర్త దీనావస్థ చూసి, ఆశ్రిత బెడ్ పైనుండి లేచి విజయ్ చేతిని ఓదార్పుగా పట్టుకొని కళ్ళలోకి చూసింది. తెల్లగా వుండే కళ్ళల్లో ఎర్రటి జీరలు మూగుతున్నాయి, ఆశ్రితనే చూస్తున్నాడు.


“విజయ్” ఆర్ధతతో కూడిన స్వరం, “నీ బాధ నాకు అర్థమైంది. ” ఎర్రటి జీరల కళ్ళు కన్నీటి బొట్లను స్రవించాయి. ఆ కన్నీటికి కళ్ళలో నిలిచే ఓపిక లేక మెల్లిగా జారుకుంటున్నాయి. కొన్ని క్షణాలు మౌనంగా వున్నారిద్దరూ, చటుక్కున ఆశ్రిత చేయిని విడిపించుకుని తన మొబైల్ తీశాడు.


రెండు ఎయిర్ టిక్కెట్స్ బుకింగ్ కన్ఫర్మ్ అయినాయి.


*****


బెంగుళూరులో పేరు మోసిన ప్రైవేట్ సంస్థలో విజయ్ హోదా గల ఉద్యోగి. న్యూస్ పేపర్ అడ్వర్టయిస్ ద్వారా ఆశ్రితను రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నాడు. సోషియాలజీ లో పి. హెచ్. డి చేస్తుంది.


విజయ్ వదినను తల్లిదండ్రుల కన్నా మిన్నగా గౌరవిస్తాడు. నిజమేనని ఆశ్రిత ఎన్నో విషయాల్లో, మరెన్నో సందర్భాలలో రూఢి చేసుకుంది. పరోక్షంగా విజయ్ వదిన తో, ప్రత్యక్షంగా రాజ్యలక్ష్మి అక్కతో ఆశ్రిత ఆత్మీయతను పంచు కుంటారు.


బెంగుళూర్లో “డైనమిక్ విజయ్” భర్త హైదరాబాద్ లో అన్నావదినల ముందు స్తబ్దుడై పోవటం భార్యకు నచ్చదు.


పరశురామ్, రవళి లు చిన్నాన్న గుణగణాలు పుణికి పుచ్చుకున్నారు. ఆశ్రిత బలవంతం మీద సెలవుల్లో ఇండియా వస్తే బెంగుళూరులో చాలా వుల్లాసంగా ఎంజాయ్ చేస్తారు, మరి హైదరాబాద్లో పూర్తి భిన్నంగా వుంటారు. వీళ్ళకు మాటలు రావా అనే అనుమానం కలుగుతుంది. ఈ తరహా ప్రవర్తన అందరికి ఒక ప్రశ్న వలె మిగిలింది.


“రీసెర్చ్ చేస్తున్నదానివి, ఈ విచిత్ర ప్రవర్తన పైన కారణం కనుక్కో” మాటల్లో పెట్టి, అక్క నవ్వేస్తూ వుండేది.

హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా పశుపతి బావగారు కూడా సరదాగా “నీ రాకతో ఇంట్లో లక్ష్మీ కళ వచ్చిందని” ఆదరణ చూపించేవారు.


అందరూ హ్యాపీ మనుషులే, మరి హింసను తలపించే ఆత్మహత్యకు మూలం ఏంటి?


చావు పైన పూర్తి అవగాహన వుంటేనే ఆత్మహత్యకు పాల్పడతారు. అంటే జీవితం పైన విరక్తి శాతం పెరుగుటయే ముఖ్య కారణం. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు రోదపెడుతున్నై తప్ప తరుగుట లేదు.


***


స్వతహాగా విజయ్ ఎవరితోనూ గొడవ పడడు, ఎందుకో ప్రతీ ఆటో వాడిని విసుక్కుంటునాడు. మీటర్ చార్జి కంటే ఇంత ఎక్కువా, అంత ఎక్కువా అనే ధోరణే సాగుతున్నది. వేలు వెచ్చించి విమానంలో ప్రయాణం చేశాక, పదుల్లో పేచీ ఎందుకు? అందులోనూ ఈ సందర్భంలో..


చివర్న ఆశ్రిత ఓ ప్రక్కగా వెళ్ళి ఆటోను కుదుర్చుకుంది. మూడ్ఆఫ్ గా వున్న విజయ్ ను చేయి పట్టుకొని ఆటోలో కూర్చోబెట్టింది. “విజయ్ యు ఆర్ వెరీ అప్సెట్, కూల్ యువర్ సెల్ఫ్! మనం వెళ్ళేది చావుకు! సెక్రటేరియట్ ముందర అజిటేషన్, ధర్నాలకు కాదు. పైగా మనం అక్కడి జానాన్ని ఓదార్చాలి, ఇప్పుడే మూడ్ఆఫ్ తగదు. ”


ఆశ్రిత మాటలు కొంచెం రిలాక్స్ అనిపించింది. భార్య రెండు అరచేతుల్ని పట్టుకొని భోరుమని దుఃఖాన్ని వెల్లడించాడు. “ఇట్స్ ఒకే.. ” సముదాచ్చింది.


బెంగళూరు నుండి హైదరాబాద్ ప్రయాణం ముప్పావు గంట పట్టినా, ఎయిర్పోర్టు నుండి ఆల్వాల్ చేరుకోడానికి రెండు గంటలు దాటింది!


పచ్చటి వాకిట్లో తెల్లటి ముగ్గులతో కళ కళ లాడే ముంగిలి వెల వెల పోతున్నది.


తమ్ముడితో తక్కువగా మాట్లాడే పశుపతి అన్నాడు. "పోస్టుమార్టం నుండి బాడి రాలేదు. "

" ఏ హాస్పిటల్"?

"ఉస్మానియా"

" హూ ఈస్ కోఆర్డినేటింగ్ దేర్”?

" మా ఆఫీసు ఫ్రెండ్స్"

"డీటైల్స్ ఇవ్వండి ఉస్మానియా వెళతాను. "

"వద్దు, నువ్వు వెళ్లొద్దు. "

"నేనూ వెళ్లక, మీరూ వెళ్లక.." విజయ్ స్వరం హెచ్చింది.

"అన్నా, మీరు వెళ్లి బాడీ తెస్తారా, నేను తెచ్చేదా?" నిశ్చయముగా అన్నాడు. తమ్ముడి నిశ్చయం బెదిరింపు వలె తోచింది.

మనిషి కదిలాడు శవం కోసం.


***

వదిన ఆత్మహత్యకు ఏమైనా ఆధారం దొరుకుతున్నదేమోనని ఇల్లంతా వెదికాడు. బ్రతికుండగానే ఒకర్ని కష్ట పెట్టని వదిన, చావుకి కారణాలు చెబుతూ ఇతరులను కష్టపెడుతుందా?


వదినలో తల్లిని చూసిన మనసు తల్లడిల్లి పోతున్నది, శ్వాస ఎగసి పడుతున్నది.


అక్క డెడ్బాడీని చూడ్డనికి వచ్చే జనాల అనకూలత కోసము ముందు గదిలోని ఫర్నీచర్ అంతా ఓ మూలకు గోడ వారీగా సర్దింది.


కనబడ్డ విలువైన వస్తువులన్నీ అల్మార లో పెట్టి లాక్ చేసింది.


తెల్లటి బట్టలో రాజ్యలక్ష్మి శవాన్ని పశుపతితో పాటు ఇరుగు పొరుగు హల్లోకి మోసుకొచ్చారు.


ఆశ్రిత ఏడుస్తున్నది. విజయ్ వదిన కాళ్ళకు దండం పెట్టి, చెంపలు వాయించుకుంటూ దుఃఖిస్తున్నాడు. శవానికి తలవైపు కూర్చుని తలవంచుకుని విలపిస్తున్నాడు పశుపతి.


మర్నాడు పిల్లలు వచ్చి, కరవు తీరా కంట నీరు కార్చాక దహన సంస్కరణలు ముగిశాయి.


***


నిర్జీవంగా ఇంటికి తిరగి వచ్చిన ఆశ్రితకు రాజ్యలక్ష్మి చేతి వ్రాతతో రాసిన పోస్టల్ కవర్ చూసేసరకి జీవం పుంజుకొచ్చింది. ఆతృత, ఆనందం, దుఃఖం వీటన్నిటి మిశ్రమం వలన కవరు చింపాలంటే ధైర్యం రాలేదు.


కవరు తెరిచేందుకు సాహసం లేదు. అధైర్యంతో విజయ్ చేతిలో పెట్టింది.


ఏ మాత్రం తొణకక, ఉత్తరాన్ని డ్రస్సింగ్ ఛైర్ మీద పెట్టాడు. “స్నానం చేసి, రిలాక్స్ అయ్యాక చదువుదువు గానీ. ”


“సరే, మీరు చదవండి వింటాను. ”

మనిషినే చదివిన నేను ఉత్తరము ఏం చదవాలి మనసులో అనుకున్నాడు. కానీ అసలు కవర్ తెరవలేదు. ఉత్కంట భరించలేక మొదలుపెట్టింది.


డియర్ ఆశ్రితా,

వరుసకి చెల్లివే అయినా నీలో ఒక మంచి స్నేహితురాలిని చూసిన చనువుతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ రీసర్చ్ చదువుకు కొంతైనా ఉపయోగపడునేమొ అని నా అభిప్రాయం. అంతే గానీ నా చావుకి కారకుల మీద పగతో కక్ష కోసం కాదు.


పశుపతి నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం అనే పదానికి నిఘంటువు సమాధానం వేరు. నా జీవితానికి మాత్రం వేరే అర్థం. పశుపతి దృష్టిలో తాను తన కొరకు తయారు చేసుకున్న తోలుబొమ్మ! అతను ఆడిస్తేనే ఆట, అంటే నా కదలిక. అతని సుఖం, సంతోషం, అతని అవసరాలు మాత్రమే కావాలి. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి మాత్రం అతనొక పురుషోత్తముడు. అందరి మెప్పులు పొందాలని హద్దుల్లేని కోతలు కోస్తుంటాడు. నా భర్తగానే కాదు, ఒక తండ్రిగా కూడా బాధ్యత లేని జీవి.


నా పెళ్ళికి విజయ్ చిన్నవాడు. మేమిద్దరమూ తల్లీకొడుకుల వలె వుండే వాళ్ళము. ఎన్నో మార్లు నాకు విజయ్ మధ్య అగ్గిపుల్లను గీసే వాడు. హేళన చేసేవాడు. ఒకసారి పరీక్షల సమయంలో చదువుతూ అన్నం తినకుండా టేబల్ పైన నిద్ర పోయాడు. జాలి వేసి, అన్నం కలిపి, నిద్ర లేపి నా చేతులతో తినపించాను. నాకు శిక్షగా నా అరచేయిని గరిటతో వాత పెట్టాడు. అన్నగారి దుశ్చర్యకు తమ్ముడు చాలా గొడవ చేశాడు. అమ్మలాంటి వదినను తప్పు పట్టినందుకు; నాకు విజయ్ కు అక్రమ సంబంధం అంటగట్టి, యింట్లో నుండి పొమ్మన్నాడు.


నమ్మకం లేని మనిషికి సుఖం తక్కువ.


ఆ అపనమ్మకము వలననే కనబడ్డ ప్రతీ మనిషికి తను ఎంత గొప్పవాడొ, తన దయాదాక్షిణ్యాల మీద మేము ఎలా బ్రతుకుతన్నదీ దండోరా వేస్తూనే వుంటాడు. పొరపాటున కూడా నేను నా పిల్లలతో మనసు విప్పి మాట్లాడకూడదు. చదువులో ఒక్క మార్కు తక్కువ వచ్చినా చావ బాదేవాడు. ఆయన పాటలు గానీ, టివి గానీ అతి బిగ్గరగా పెట్టుకుంటాడు. ఎవ్వరూ ఎటువంటి ఆక్షేపణ చెప్పరాదు. నవ్వుతూ వుండొద్దు, అట్లా అని సీరియస్గా వుండొద్దు. మౌనంగా వుంటే మాట్లాడమంటాడు, మాట్లాడితే మొదలవుతుంది గొడవలకు నాంది.


అన్నీ అసత్యం, అసభ్యం గోచరించే మాటలే. నేను మొద్దుబారి పోయాను. ఒకే ఒక్క సారి భక్తి సినిమాకు పిల్లలతో వెళ్ళాము. ఇక బ్రతికుంటే సినిమాలకు వెళ్లొద్దని ఒట్టేసుకున్నాను. ఆఫీసు తరువాత ఇంటా, బయట మత్తు పదార్థాల బానిస.


పిల్లలకు చదువు, ఇల్లు తప్ప వేరే వ్యాపకాలు లేవు, వుండొద్దు. తాగి వచ్చి తండ్రిగా కారణం లేకుండానే దండన. నేను వారిస్తే వాళ్ళతో పాటు నేను హింస భరించాలి. వాళ్ళకి జబ్బు చేస్తే మంత్రాలు, చింతకాయలు అంటాడే తప్ప డాక్టర్కు చూపించే ప్రయత్నమే చేయడు.


పశుపతి లేని వేళల్లో నేను, నాకు లేని ధైర్యాన్ని చెప్పి, చక్కగా చదువు కొని, ఆర్థికంగా నిలబడే స్తోమతతో స్వేచ్ఛగా వెళ్ళి పొమ్మనేదాన్ని, పాపం వాళ్ళ ఆశలు, కోర్కెలు బాధలు ఎవ్వరితోనూ చెప్పేవారు కాదు. నా వంటి నిండా స్విచ్ లు. అందుకే అందరకి నేనొక బాధ్యత గల ఇల్లాలు.


ఎప్పుడో ఇంటి నుండి వెళ్ళిపోయిన విజయ్, నిన్ను పెళ్లి చేసుకొని తోడుగా నా ఆశీర్వాదం కోసం వచ్చాడు. నువ్వు అందం, చదువు, సంస్కారం కలిగిన దానివి, ఆయన నీ ముందు ఎంత నటించే వాడు!


నిన్ను పోలుస్తూ నన్ను కించ పర్చేవాడు. ఆయనకు నువ్వు భార్య అయితే కాపురం పచ్చగా వుండేదని కలల కనే వాడు. అందుకే నీతో నవ్వుతూ, సరదాగా మాట్లాడేవాడు. ఏ కల్మషము లేని సహృదయత నీకుంది. నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నీ ద్వారా పరుశురామ్ ఫారిన్ చదువులు, ప్రతీ సెలవులకు వాళ్ళ మనోవికాసం కొరకు నీ వద్దకు పంపే ఏర్పాటు చేసేదాన్ని. నా లోని స్వార్థం, నిన్ను తెర వలె అడ్డుగా వాడుకున్నాను, ఇది తప్పేమో!


ఇది గమనించి, నాకు పరోక్షంగా తోడ్పడ్డాడు విజయ్. విదేశాల చదువుల ఖర్చు కూడా కొంత ఆయనకు తెలియకుండా సాయం చేసే వాడు.


పరిపక్వం చెందని రవళికి పెళ్లి వద్దని గొడవ చేశావు. మాకు దూరంగా విదేశాల్లో అన్నకు దగ్గరగా వుంటే రవళి సంతోషంగా వుంటుందని అనుకున్నాను. పెళ్ళికి విజయ్ చాలా సహకరించాడు


నేను పిల్లల కోసం అన్నీ భరించాను, వాళ్ళ జీవితాలు ఓ కొలిక్కి వచ్చాయి, ఇక నా పాత్ర ఏమిటి?


గతంలో ప్రతీ క్షణం నేను నా మనసుతో తిరగబడే దాన్ని, నాలో లావా పేరుకు పోయింది. ఈయన్ను వదిలేసి పిల్లల వద్ద హయిగా వుండొచ్చు కదా అని నా కథ విన్న ఎవరైనా సలహా ఇవ్వొచ్చు! నేను అలసి పోయాను. చనిపోవాలనే కోర్కె నాలో రోజు రోజుకు బలీయమైనది.


ఆత్మహత్య మహా పాపమని పెద్దలన్నారు. మరి అదే పెద్దలు భర్త అనే పురుషుడు పెట్టె హింసను భరిస్తుంటే నోరు మెదపరెందుకు? విజయ్ లాంటి వాళ్లు జోక్యం చేసుకున్నా ఫలితం దక్కలేదు.


అతనితో నా జీవితం దుర్భరము. కోర్టులు, చట్టాలు స్త్రీ స్వేచ్ఛ సంఘాలు ఎన్నో పరిష్కార మార్గాలు వున్నా, నాలోని ఈ మంటను ఆర్పలేవు. కొత్త జీవితం మొదలుపెట్టినా, ఇన్నేళ్ల నా సంసార జీవితపు దుర్ఘటనలో నన్ను వదిలి పోలేవు.


నువ్వు, బావగారు అంటూ ఎంతో గౌరవించే వ్యక్తి ఒక క్రూర మృగం అని నీకు తెలియదు. అందుకే ఎవ్వరకీ రాయని ఉత్తరము నీకు రాస్తున్నానంటే అర్థమయ్యే వుండాలి.


భవిష్యత్తులో నా పిల్లల మంచీ-చెడు చూసేందుకు నువ్వు, విజయ్ చాలు. ఈ దైర్యం వల్లనే నాకు విముక్తి కావాలనుకున్నాను.


ప్రతీ జంట మీలాగా అన్యోన్యంగా కలిసి మెలసి వుండాలని కోరుకుంటున్నాను.


ఇన్నాళ్ళూ తోబుట్టవులుగా నీతో ప్రేమనే పంచి, ఇప్పుడు నా దుఃఖాన్ని నీ ముందు పెట్టినందుకు క్షమించు..


ఇక చాలించనా ఈ రాతను, తలరాతను.. నా జీవితాన్ని.. ప్రేమతో.. అక్క.


చదవడం పూర్తి చేసిన ఆశ్రిత మనసు భారమైంది. ఈ విషయాన్ని తన నుండి దాచి విజయ్ కూడా తప్పు చేశాడు. పశుపతి బావగార్ని తాను మార్చడానికి ప్రయత్నం చేసేది. అతను మారేవాడేమో. అనవసరంగా నిండు ప్రాణాన్ని కర్కశంగా బలి చేసుకుంది.


ప్రతీ విషయాన్ని భర్తతో చర్చించే ఆశ్రిత ఒక రోజు అడిగింది. విజయ్ నవ్వుతూ జవాబు యిచ్చాడు “మై డియర్ ఆశ్రితా! మనిద్దరి మధ్య ఈ సఖ్యత, అనురాగం వర్ధిల్లనీ.


నా పైన అంత పెద్ద నింద వేసిన వాడ్ని, దేవతకు మారు పేరైన వదినను చిత్రహింస పెట్టిన కపటిని నువ్వు మారుస్తావా? ఏ మార్పు అయినా స్వతహాగా, సహజంగా రావాలి.


ఎందుకంటే మా అన్నకు నీ పట్ల వున్న యిష్టానికి అర్థం వేరు.


వదిన నీ ఉత్తరంలో చాలా క్లుప్తంగా, కుదించి రాసింది. కానీ ప్రత్యక్షంగా ప్రతీ దినమూ అప్పటి పరిస్తితులు ఎదుర్కున్న నేను ఎంతటి రంపపుకోత అనుభవించానో తెలుసా?! అందుకే పరోక్షంగా పరశురామ్, రవళిలకు నాకు చేతనైనంత సాయపడి వదిన సంతోషాన్ని వెతుక్కునేవాడిని.


ఆశ్రిత ఎదురు మాటల్లేక వింటూ వుంది.

“నా అర్ధాంగి నాకు సలహాలిస్తూ, నన్ను సమర్దిస్తూ, నాతో ప్రేమగా ప్రేరేపిస్తూ నా పట్ల అవగాహన కల్గి వుండాలి. అన్న మూర్ఖుడు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. " నవ్వుతూ మొదలైన మాటలు సీరియస్ గా మారుతున్నై.


సమఉజ్జీగా “ఐ అగ్రీ విత్ యు, నో మోర్ ఫర్తర్ డిస్కషన్ ప్లీజ్. ”


“వై నాట్? యు టూ కం అవుట్ ఆఫ్ది సిచుట్వేషన్, నీ రిసెర్చ్ ఏమంటుందో చెప్పాలి. ” గంభీరమైన స్వరం.


“ఓకే. బావగారి సంగతి వదిలేసేయి, వాట్ ఎబౌట్ యు? అక్కను ఆ నరక కూపంలో నుండి తొలగించి ఆమెకు న్యాయం ఎందుకు చేయలేదు?”


నెచ్చెలికి సమాధానం, “చాలా సార్లు ప్రయత్నం చేశాను, కుదరలేదు, ఇంత తొందరగా యిలా వదిన జీవితం బలవంతంగా ముగుస్తుందను కోలేదు. రియల్లీ ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ఇట్. "


"నాలోని పశ్చాత్తాపమే మాటి మాటికి క్షమించు వదినా అని నాలో మారుమ్రోగుతున్నది. అందుకే ఆశ్రితా నీ థీసీస్ ద్వారా తెలియజేయి; ఎన్ని కష్టాలు వచ్చినా, మనసు ఎంత బాధ పడినా, ఎన్ని అవహేళనలు ఎదుర్కున్నా, మనిషి ఆత్మహత్యకు పూనుకో రాదని, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు తోడుగా నిలుస్తారని ఎలుగెత్తి చెప్పు. ఆత్మహత్య మహా పాపం, ఘోరం అని నీ రీసెర్చ్ లో కొత్త మాటలతో, మరింత ఆకర్షణ స్పురించే అర్థాలతో నిర్వచించు. అన్నింటినీ శాసించే బలాన్ని సంఘం కల్గించాలని గళం ఎత్తి, నీ వాచకంలో రచించు.. ” ఉద్వేగంతో చైతన్యవతంగా అన్నాడు విజయ్.


ఎవరు మారాలి? ఇటువంటి దుస్థితి ఎదుర్కుంటే స్త్రీ మారాలా, పురుషుడు మారాలా? ఆత్మహత్యలను డీ కొట్టే ఆన్సర్ లేదా? మన చుట్టూ వున్న సమాజం పడగలు విప్పదెందుకు? ఈ అనైతిక చర్యకు ముగింపు లేదా??


ఎన్నో రోజుల థీసిస్ ఈ రోజు పూర్తి చేయాలని తీర్మానించుకుంది ఆశ్రిత.


****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


3 Comments


@rakheevenugopal362 • 1 day ago

Innocent ladies are dying because of some idiots.. "who should be changed " you have given a very suitable title..

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Sep 11, 2023
Replying to

Thank you very much for the comment. Comments are the inspiration for me. ✍️🤝

Like

@surekhap4148 • 1 minute ago

నా హృదయ పూర్వక అభినందనలు

Like
bottom of page