#AyyalaSomayajulaSubrahmanyam, #EvusamCheddamAnna, #ఎవుసంచేద్దాంఅన్నా, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు
Evusam Cheddam Anna - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 03/01/2025
ఎవుసం చేద్దాం అన్నా - తెలుగు కథ
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
ఇప్పుడంతా ఆన్‌లైన్ రాజ్యం; అమ్మడమైనా, కొనడమైనా అంతా అంతర్జాలంలోనే; వినియోగ
దారులకు ఒనగూరుతున్న మేలేమో కానీ, దీనివల్ల చాలామంది జీవితాలు తల్లకిందులు అవు
తున్నాయి. రంగా కూడా ఆ ఒత్తిడిని ఎదురుకొంటున్నాడు.
పళ్ళెంలో అన్నం కలపకుండా దానివంకే చూస్తున్నాడు రంగా. ఆర్నెల్లుగా జరుగుతున్న పరిణామాలు అతనికి మింగుడు పడటం లేదు. తినమని భార్య సైగ చేయడంతో, ఈ లోకంలోకి వచ్చాడు. రోజురోజుకూ ముభావంగా మారిపోతున్న భర్త తీరుతో ఆందోళన చెందుతూ, ఊర్లో ఉన్న అత్తామామలకి ఫోన్ చేసిందామె. వాళ్ళు సాయంత్రాని కల్లా వచ్చేశారు.
నిజామ్‌బాద్‍నుంచి ముప్పయి కిలోమీటర్ల దూరం, బండి మీద అర్దగంట ప్రయాణం.
‘జరిగేది జరుగ్తది, ఊరెళితే పరేషాన్ జేస్కోకు. మేమంత లేమా, ఏమన్న అటీటైతే సూస్కున దల్గి? సంటిపిల్లోడున్నడు ఇంట్ల, బాగా ఆలోచన జేస్తె గుడ మంచిది కాదంట. కోడలు పిల్ల నిన్ను జూశి ఫికర్ వెట్టుకుంటున్నది’ అమ్మానాన్నల మందలింపుతో కూడిన భరోసా ఇచ్చారు.
దాంతో రంగా కాస్త స్థిమిత పడ్డాడు. వాళ్ళమ్మ రెండు, మూడు రోజులు అక్కడే ఉండి సముదాయించింది. నాన్న మాత్రం పొలం పనుల మూలాన పొద్దున వెళ్ళి రాత్రికి రాసాగాడు. చివరికి తటపటాయిస్తూనే అయిదో రోజు ఇద్దరూ తిరుగు ముఖం పట్టారు. దాంతో తెలియకుండానే మళ్ళీ ఆందోళన మొదలైంది రంగా మదిలో.
రంగా కుటుంబానికి ఊర్లో పదెకరాల వ్యవసాయం ఉంది. అయినా అతనెప్పుడూ పొలంవైపు చూడలేదు. సర్కారీనౌకరీ పొందాలని అతని కల. డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ళు హైదరాబాద్‍లోనే ఉండి కష్టపడి చదివాడు. బ్యాంక్ ఉద్యోగాలు, గ్రూప్ ఉద్యోగాలు అంటూ దేన్నీ వదలకుండా, తన విద్యార్హతకు తగ్గ అన్ని పరీక్షలు వ్రాశాడు. రెండు మూడు పరీక్షలు పాసైనా, ఇంటర్వ్యూ స్థాయిలో చేజారాయి. కానీ, ఊళ్ళో ఆరాలతో పాటు చుట్టాల గుసగుసలు పెరగడంతో, ‘ఎక్కువ రోజులు ఆగితే బాగుండదని రంగాకు నచ్చజెప్పి పెళ్ళి చేసేశారు.
బాధ్యతలు నెత్తిన పడటంతో, వ్యవసాయం పూర్తిగా తెలియని పని కావటంతో చివరికి బోదన్‌లో మొబైల్ షాప్ పెట్టుకున్నాడతను. మొదట్లో వ్యాపారం మందకొడిగా సాగినా, క్రమేపీ పుంజుకుంది. కొత్ర ఫోన్లు కొనేవారి కన్నా, పాతవి పాడయ్‌నాయని వచ్చేవారు ఎక్కువయ్యారు. దాంతో మూడు నెలలు ఒక వ్యక్తిని షాప్‌లో కూర్చోబెట్టి మరీ సాయంత్రం పూట మరమ్మత్తుల్లో శిక్షణ తీసుకున్నాడు.
పది రూపాయలు విలువచేసే మైక్ పాడైతే, సర్వీస్ చార్జీలతో కలిపి వంద రూపాయలు తీసుకునేవాడు. అయినప్పటికీ అది మిగతా దుకాణాల్లో వసూలు చేసేదాని కన్నా తక్కువే. పైగా ఆర్నెల్ల లోపు మళ్ళీ పాడైతే ఉచితంగా బాగుచేసి ఇచ్చేవాడు; రోజులు గడుస్తున్నకొద్దీ ఫీచర్ ఫోన్ల మీద జనాలకు ఆసక్తి పెరగడం కూడా రంగాకు కలిసొచ్చింది.
అలా మూడు అమ్మకాలు..ఆరు మరమ్మత్తులతో తక్కువ సమయం లోనే ఎక్కువ ఆర్జించాడు రంగా. కాల ప్రవాహంలో బాబు కూడా పుట్టాడు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎక్కడో ఎవడితో కన్ను కుట్టినట్టయ్యింది. కొన్నాళ్ళలో అంతా తారుమారైంది. మార్కెట్ స్థిరత్వాన్ని కోల్పోయింది.
వినియోగదారుల అవసరాల్ని అంచనా వేయని దిగ్గజ కంపెనీలు మూతబడ్డాయి. కొత్త కొత్త వెబ్‌సైట్లు పుట్టు కొచ్చాయి. ఫోన్లు ఆన్‌లైన్ ధ్వారా విక్రయించే సంప్రదాయం మొదలైంది. దాంతో జనాలు తాము ఇన్ని సంవత్సరాలుగా బయట దుకాణాల్లో ఫోన్లు కొని ఎంతో నష్టపోయామన్న భ్రమల్లోకి వెళ్ళిపోయారు. ఆన్‌లైన్ షాపింగ్ గిరాకీ పెరుగుతున్న కొద్దీ రంగా గిరాకీ రోజురోజుకూ తగ్గుముఖం పట్టి, దిగులు పెరుగుతూ వస్తోంది.
రోజూ దుకాణం మూసేశాక స్నేహితులతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళడం రంగాకి అలవాటు. అందరూ పదో తరగతి వరకూ చదువుకున్న చెడ్డీ దోస్తులు. ; మల్లం చెరువు కాడ పార్కు, వాళ్ళు కలుసుకునే చోటు. రోడ్డు సానా వెడల్పు. దాదాపు వంద ఫీట్లుంటది. అక్కడ సాయంత్రం పూట రకరకాల చిరుతిళ్ళు, తోపుడు బండ్ల మీద వరుసగా కనిపిస్తాయి.
ఆ రోజు కూడా వాళ్ళు కలుసుకున్నారు. ఊళ్ళో విశేషాలు, ఇతర స్నేహితుల ఇబ్బందులు చర్చించుకున్నాక, ‘ ఆన్‌లైన్ గొడవ లేని వ్యాపారం పెట్టాల్రా, లేకపోతే బతకలేం’; అన్నాడు రంగా.
‘అరే .. సబ్బులు, షాంపూలు ఆన్‌లైన్ లో దొరుకుతున్నయ్. ఇట్లయితే కిరాణా దుక్నాలు గుడ మెల్ల మెల్లగ మూత పడ్తయేమోరా’ అన్నాడు సెలూన్లు పెట్టుకున్న హరి.
పది తర్వాత చదువు ఆపేసినా, కస్టమర్లతో మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంచుకోవడం వృత్తిరీత్యా అతను నేర్చుకున్న విద్య. అయితే సమయం, సందర్భం చూసుకోకుండా ఆ తెలివిని ప్రదర్శించడం అతని బలహీనత.
హరి మాటలకు, కిరాణా దుకాణం నడిపే గోపీకి సర్రున కోపం వచ్చి, ‘నీకేరంబై; జనాలకు జుట్టు పెరగదా; నీ దగ్గరకు రారా;నీకేం ఢోకా లేదు. టెన్షన్ పడకు. ’ అన్నాడు.
గతుక్కుమన్నాడు హరి. ఎప్పుడు కలిసినా, అతని మీదకే మళ్ళడం, తనేదో ఉత్తపుణ్యానికి సంపాదిస్తున్నాడని వీళ్ళంతా అనుకోవడం షరా మామూలే;
‘అవన్నీ కాదురా రంగా..ఆన్‌లైన్ ప్రభావం లేనివి, పెద్ద కంపెనీల కండ్లు పడనివి అంటే, టిఫిన్ సెంటర్లు, మెస్‌లు. అవి పెడ్తవా మరి. ’ అన్నాడు మందుల దుకాణం నడిపిస్తున్న సంఘప్ప.
’టిఫిన్ సెంటర్ పెట్టొచ్చు. కానీ మాస్టర్లతోని పెద్ద పరేషాన్ రా; మొన్న మా చిన్నమామ కొడుకు బస్‌డిపో కాడ పెట్టిండు. రెండు నెల్ల బయానా ఇచ్చి, ఫర్నీచర్ కొని ఓపెనింగ్ చేసినంత, పదిహేను దినాలకు మాస్టర్ ఏదో లొల్లి పెట్టుకుని, ఎల్లి పోయిండట. కొత్ర మాస్టర్ ని లెంకదల్గి సచ్చిపోయిండనుకో;
ఓలు దొరక్క ఫర్నీచర్ అంత అచ్చినకాడికి అమ్మేస్కోని ఇంట్ల కూసున్నడు. ఇంకొకడి మీద ఆధారపడి బిజినెస్ లు కష్టంగా;మాస్టర్ రాకుంటే మనమే టిఫిన్లు చేసెటట్లు ఉండాల’ ; అన్నాడు రంగా.
‘వంట జేసుడు మనతోటి యాడైతదిరా; అయినా ఈ ముచ్చట ఒడవది. తెగదిని. బజ్జీలు తిని ఇంటికి
పోదాం నడువుండ్రి. మస్తు నిద్రొస్తుంది. ’ అన్నాడు హరి.
మిగిలిన ముగ్గురూ అతని వంక చూశారు. వాళ్ళ చూపుల్లోని విషయం అర్థం చేసుకున్నాడు హరి. “అరేయ్, .. అప్పటికి నాకేదో కోట్లల్లో లాభమస్తున్నట్లు, ఈల్లకేదో లక్షలల్ల లాస్ అస్తున్నట్లు. ’ అని గొణుక్కుంటూ బజ్జీలు కొని తీసుకొచ్చాడు.
అందరూ అన్యమనస్కంగా తిని ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం ఏడింటికే రంగా ఫోన్ ఆగకుండా మోగుతోంది. లేచి చూస్తే అతనికి ఫోన్లు సప్లయి చేసే శేఖర్. ’మామూలుగా ఇంత పొద్దున చేయడే. ’ అనుకుంటూ ఫోన్ ఎత్తాడు.
ఆన్‌లైన్య లో మొబైళ్ళ అమ్మకాల్ని నిషేదించాలని ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నారని, పదింటికల్లా కలెక్టర్ ఆఫీసు కి వచ్చేయమని చెప్పాడు. వీలైనంత ఎక్కువమందిని తీసుకురమ్మన్నాడు. వెంటనే బయటకొచ్చి స్నేహితులకు ఫోన్ కలిపాడు రంగా.
‘అరే.. గిట్లాంటియేమన్నుంటే మంగళవారం పెట్టుకోవాల్రా. గిరాకీ అంతా పాడుగాదా?’డాంబికానికి పోతూ నసిగాడు హరి. రంగాకు చిర్రెత్తుకొచ్చింది.
‘సోమవారం రోజు ఏం గిరాకి ఉంటదిరా నీకు.. ఓడికి కథలు చెబ్తున్నవ్?రేప్పొద్దున ఏ మల్టీనేషనల్ వాడే వచ్చి సెలూన్లు పెడ్తా అంటే నీ దిక్కుకెంచి నేను రావాలా? అద్దా?’ అన్నాడు.
హరి ప్రాణం చల్లబడ్డది. ఈ దేశంలో రాజకీయాలన్నీ కార్పోరేట్ శక్తుల చేతుల్లోనే ఉన్నాయని అతని గట్టి నమ్మకం. కేంద్రంలో ప్రభుత్వం తలచుకుంటే చాలు. ఒక్క బిల్లుతో వేల కుటుంబాలు రోడ్డున పడటానికి ఎక్కువ సమయం పట్టదని అతనికి తెలుసు.
’అరే నువ్వేం టెన్సన్ తీస్కోకు. నువ్ అందరికంటే ముందుపో. మనోళ్ళకి ఫోన్ చేసి నేనే పట్కొస్త’ అని మద్దత్తిచ్చాడు. పదకొండైనా మైదానంలో వందమందికి మించి పోగవ్వలేదు. ఇప్పుడు ర్యాలీలు చేసినా జనాలు పట్టించుకోరు అని కొంతమంది, ఈ వ్యాపారం బ్రేక్ ఈవన్ పాయింట్ కొచ్చింది కాబట్టి మరో వ్యాపారంలోకి మారక తప్పదని, ఇంకొంతమంది రాకపోయి ఉండొచ్చని శేఖర్ అంచనాకొచ్చాడు.
’ఉన్నోడికేం బాధ లేదు. ఇంకో బిజినెస్ పెట్టుకుంటడు. నడిమిట్ల మనసుంటోల్లకే ఈ తిప్పలు. ; ఉన్నదంతా ఊడ్చి, సాలకపోతే అప్పులు తెచ్చి పెట్టినందుకు తప్పది’ అనుకుంటూ ర్యాలీని ప్రారంభించారు.
కలెక్టర్ ఆఫీసునుంచి బయలుదేరిన ర్యాలీ .. బస్‌డిపో, పాతబజార్, కొత్తబజార్, హనుమాండ్ల గుడి, ఛమన్ మీదుగా సాగి తిరిగి కలెక్టర్ ఆఫీసుకు చేరుకుంది. ఆ ప్రయాణంలో కొందరు వీళ్ళని వింతగా చూశారు. ఇంకొందరు జాలిపడ్డారు. కానీ మరికొందరు వీళ్ళని చూసి నవ్వుకోవడాన్ని రంగా జీర్ణించుకోలేక పోయాడు.
దాంతో విలేకరులతో మాట్లాడుతూ, “చాలామంది ఆన్‌లైన్ లో కొత్త ఫోన్ ఫలానా రోజు వస్తోందని తెలియగానే పోటీ పడి కొనేస్తున్నారు. అసలు ఫోన్లు ఎలా పని చేస్తున్నాయి. వాటికి వారంటీ అంటూ ఉంటోందా? అని ఆలోచించడం లేదు. కొన్ని ఫోన్లు రేడియేషన్ వల్ల అయిదు నిమిషాలకే వేడెక్కి పోతున్నాయి. ఇంకొన్నిటిలో కెమెరా సరిగ్గా ఉండటం లేదు. మరికొన్ని తొందరగా హ్యాంగ్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్నాక కానీ తెలియటంలేదు.
ఇప్పుడు ఆన్‌లైన్ లో ప్రీ-బుకింగ్ చేసి అమ్మే ఏ ఫోన్‌కి కూడా తగినన్ని స్పేర్‌పార్టులు తయారు చేయకుండానే విడుదల చేస్తున్నారు. ఒక సంవత్సరం వారంటీ మాత్రం ఇస్తున్నారు. ఎందుకంటే ఏడాదిపాటు వాటికేం కాదు. అని వాళ్ళకి తెలుసు కాబట్టి.
కానీ, ఆ తరువాత పాడైతే, రిపేర్ చేయలేక సర్వీసింగ్ సెంటర్లు చేతులెత్తేస్తున్నాయి. చచ్చినట్టు పదివేలు ఖర్చుపెట్టి మళ్ళీ కొత్త ఫోన్ కొనాల్సి వస్తోంది. కాబట్టి సోదరులారా, మా పొట్ట కొడుతున్న ఈ ఆన్‌లైన్ అమ్మకాలను నిషేదించాలని కోరుకుంటూ, ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నష్టపోకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నాడు.
ప్రెస్‌తో రంగా మాట్లాడిన తీరుకి శేఖర్ ఆశ్చర్యపోయాడు. సంగప్ప, హరి, గోపీ కరతాళధ్వనులు చేశారు. రంగా చెప్పింది చెప్పినట్లు వేస్తే, చదివిన వాళ్ళలో కాస్తయినా మార్పు వస్తుందని అంతా అనుకున్నారు.
మర్నాడు ఉదయం కొన్ని పేపర్లలో ర్యాలీ గురించి ఎక్కడో మూలన చిన్న వార్తగా ఫోటో లేకుండా వేశారు. మరి కొన్ని పత్రికలు ఏమీ వేయలేదు. కానీ అన్ని పత్రికల్లో మరో వార్త బాగా పెద్దగా వచ్చింది. మన దేశంలో ఆన్‌లైన్ వ్యాపారం నిర్వహిస్తున్న అమెరికాకి చెందిన కంపెనీకి, హైదరాబాద్‍లో గిడ్డంగుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు రాశారు. దాంతో రంగా దిగులు మరింత ఎక్కువైంది.
మరికొన్నాళ్ళకు 4జీ సేవలు వినియోగంలోకి రావడంతో ఆన్‌లైన్ వ్యాపారానికి మరింత ఊతం ఇచ్చినట్లు అయింది. చిన్న చిన్న పట్టణాలకు సైతం వస్తువుల్ని సరఫరా చేసేందుకు ఏకంగా సొంత కొరియర్ సర్వీసుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయా సంస్థలు చివరికి ఆన్‌లైన్ లో పేడ, పిడకలు కూడా అమ్మకానికి పెట్టారు. అలోపతి మందుల్ని కూడా సరసన చేర్చడంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అందరు మెడికల్ షాపుల వాళ్ళు కలిసి దేశవ్యాప్తంగా ఒకరోజు దుకాణాల్ని మూసి నిరసన తెలిపారు.
రంగా, హరి, గోపీ కలిసి సంఘప్పకు మద్దతుగా జులుస్‌లో పాల్గొన్నారు. ఆ రోజు సాయంత్రం నలుగురు స్నేహితులు దిగులుగా కన్పించారు. చేతులోని సర్వపిండి అలాగే ఉంది.
ఆ బండి పక్కనే ఉన్న పాన్‌షాప్ దగ్గర వేలాడుతున్న దిన పత్రికల్లో వార్త రంగా కంటబడింది. ’ గడిచిన దసరా దీపావళి పండగలప్పుడు దేశం మొత్తం మీద ఆ అయిదు రోజుల్లో జరిగిన ఆన్‌లైన్ వ్యాపారం విలువ అక్షరాలా రూ. యాభై వేల కోట్లు. ’అని దాని సారాంశం.
కళ్ళు మూసుకుని అచేతనంగా తల అడ్డంగా ఊపాడు రంగా. యాభైవేల కోట్ల వ్యాపారం పోవడంతో, దాని ప్రభావం ఎన్ని వేల కుటుంబాల మీద ఉంటుందన్న ఊహే అతన్ని భయభ్రాంతులకు గురి చేసింది.
ఇంతలో హరి ‘అందుకే కులవృత్తుల్ని నమ్ముకోమని పెద్దోళ్ళు చెప్పిండ్రు’ అంటూ తనలో తానే మాట్లాడుకున్నట్టుగా అన్నాడు. అసలే కోపం మీదున్న సంఘప్ప కి ఆ మాటలు మంట పుట్టించాయి.
‘నేను రజకుణ్ణిరా. ఇప్పుడు ఎవరు బట్టలు ఉతికి పిచ్చుకుంటున్నరు. చెప్పు. ? ఊర్లకు గుడ వాషింగ్
మెషీన్లు అచ్చేశినయ్. నా కులవృత్తిని నమ్ముకొని నేనెట్ల బతకగల్గుతా?’ అన్నాడు.
అతన్ని సముదాయిస్తున్నట్టుగా చూసిన రంగా.
‘ఒకప్పుడు డైనోసార్లు బతికుండేటియి; ఆ తర్వాత అంతరించిపోయినయి. ఇప్పుడు సుత అంతే. ;
మాట్లడేటోళ్ళు లేని భాషలు గలగల కలిసిపోయినట్టే కొన్ని వృత్తులు గుడ గలగల కలుస్తయి- ఆటితో పాటే ఆ వృత్తుల్ని నమ్ముకున్న మనుషులు గుడ; ‘ అన్నాడు నిర్లిప్తంగా.
ఇంతలో రంగా ఫోన్ మోగింది. చేసింది వాళ్ళ నాన్న ‘హలో బాపు’ అనుకుంటూ పక్కకెళ్ళాడు. వెళ్తున్న రంగా వంక దిగులుగా చూశాడు గోపీ. ఉప్పులు, పప్పులు దగ్గర్నించి అన్ని ఆన్‌లైన్‌లోనే దొరకడం, చివరికి వాళ్ళ బందువులు కూడా అక్కణ్ణుంచే తెప్పించుకోవడం అతనికి మింగుడు పడటం లేదు.
‘చిన్న చిన్న వస్తువులు, లూజ్ ఐటమ్స్ కోసం అస్తున్నరు తప్ప నెలవారీ సరుకుల కోసం ఓలు అస్తలేరు. నాకచ్చే రేట్ల కన్నా ఆన్‌లైన్ ల తక్కువ దొర్కుతున్నది. ఆడికి అసలు అంత తక్వకు ఎట్ల దొర్కుతున్నదో అర్థమైతే లేదు. టెన్షన్ అయితున్నది’. అన్నాడు.
‘ఈ జనాల్ని గూడ తప్పుపట్టలేం; అంతా మధ్యతరగతోళ్ళే. సంపాదన సాలది. ఎక్వ సంపాదించగల్గి దారి దొర్కది. ఉన్నంతల పైసల్ మిగుల్చుదమని. ఆ సైటు ఈ సైటు చూసి, యాడ తక్వ కొస్తే ఆడ కొంటున్నారు. ’ అన్నాడు సంఘప్ప.
ఇంతలో రంగా ఫోన్ మాట్లాడి వచ్చేశాడు. అతని మొహంలో మునుపటి దిగులు లేదు. కాస్త నిబ్బరంగా కనిపిస్తున్నాడు.
‘ఏమైందిరా?’ అన్నారు దోస్తులందరూ ముక్తకంఠంతో.
‘నేను ఇంటికి పోతున్నరా.. బాపు ఎంటనే అచ్చేశేయ్ అంటున్నడు’. ఆనందంతో చెప్పాడు రంగా.
అందరూ నోరెళ్ళబెట్టారు. ’ అసలేం మాట్లాడినవ్‌రా ఫోన్ల?’ అన్న వాళ్ళ ప్రశ్నకు, ఫోన్లో రికార్డయిన తమ సంభాషణను వినిపించాడు.
‘అరేయ్ రంగా..ఇన్ని సంవత్సరాలు సదుకున్నోడివి. నీకెందుకులే అని అడగలేగాని, ఇప్పుడు ఒకమాట చెప్తా ఇంటావా?’
“చెప్పు బాపు”
‘నువ్వు చిన్నగున్నప్పుడు మనకున్నది పదెకరాలు. ఆ తర్వాత మనం కొన్నది పదిహేను ఎకరాలు. అంటే మొత్తం ఇరవైఐదు ఎకరాల పొలం మనకున్నదిప్పుడు’.
“ బాపూ..?”
‘అవున్రా నిజం. ; మనూర్లె అందరు అమెరికా, ఆస్ట్రేలియా పోయి సదువుకుంట అటే సెటిల్ అయితున్నరు. ఇంకొంతమంది నీలెక్క బిజినెస్ పెట్టుకొని దూరంగా బతుకుతున్నారు. మరి ఈడుండి యవుసం జేసెటోడు ఓడు? ఇంత మంచి భూమిని ఇట్లనే ఇడ్చివెడ్తమా?’
“ అంటే .. అది..”
‘ అరే..2019 ల మన పంటకు ఎంతచ్చిందో నీకు ఎరుకే కదా? అదే నువ్వు యాపారంల సంపాదించలంటే కనీసం పదేండ్లు అయితది. ఎర్కనే కదా;’
“అవును బాపు”.
‘ఈ ఒక్కసారి నామాటిను. ఒక్క మూడేండ్లు నాతోనే యవుసం నేర్చుకో.. అప్పటికీ యవుసం నీకు సమజ్ కాకపోయిన, లేక యవుసం జేసుడు నీకిష్టం లేకపోయినా, మనకున్న పొలంలో సగం అమ్మి నీకు బిజినెస్ పెట్టిస్త. సదుకున్నోడు యవుసం జేసుడేందని ఇది కాకు.. అమెరికాల ఒక్కొక్కడు ఒంటిచేత్తోని వెయ్యి ఎకరాలు సాగు జేత్తున్నరట.. మరి మనం గుడ అట్ల జెయ్యాలంటే ఏమేం జెయ్యాలో నీ సదువు తెలివితోనే దొర్కపట్టు. ” అని వాళ్ళ నాన్న చెప్పాక కాల్ కట్ అయ్యింది.
కాసేపు అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత సర్వపిండి తినడం పూర్తి చేసిన రంగా ‘ ఇన్ని రోజులు ఆన్‌లైన్ గోలలేని పని ఏమున్నదా అని ఆలోచించి నెత్తి ఖరాబ్ జేసుకున్నరా.. ఇప్పుడర్థమైంది అది వ్యవసాయమని. ; ఇక రిస్కు, టెన్షన్ ప్రతి వ్యాపారంలో ఉంటది. వ్యవసాయాన్ని కూడా అట్లనే అనుకుందాం. అదేదో మనూర్లనే మన ఇంటి దగ్గర్నే పడదాం’ అన్నాడు.
గోపీ, సంఘప్ప ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.. ఏదో సమాధానం దొరుకుతోంది వాళ్ళమదిలో. ; రంగా కొనసాగిస్తూ ‘ మీక్కూడా ఎంతో కొంత పొలమున్నది కదా.. స్టార్ట్ చేద్దాం.. ఇంకో ఇరవై ఏండ్లు అయినంక వ్యవసాయం చేసెటోళ్ళు వేళ్ళ మీద లెక్కవెట్టేటట్టు ఉంటరు. మనూర్లె. మన వయసోళ్ళు మనతోని కలిసి పదిమంది దాటరు.
అప్పుడు ఊర్లె ఉన్న పొలం మొత్తం కౌలుకు తీసుకొమ్మని మనదగ్గరికే అస్తరు. పొలం కొనకున్నా మనిషికి వంద ఎకరాల దాక సాగు చేస్తం. ఏమంటరు?” అన్నాడు.
సంతోషంతో తల ఊపాడు గోపీ, సంఘప్ప. హరి మాత్రం రంగా లెక్కలకు నోరెళ్ళబెట్టాడు. కాసేపటికి తేరుకుని, ’ట్రిమ్మర్లు అచ్చిన కాడినుంచి షాపుకచ్చి షేవింగ్ చేస్కునెటోల్లు తక్కువైండ్రు. రెడీమేడ్ కిట్లు అచ్చిన్నుంచి ఫేషియల్ చేస్కునేటోల్లు గుడ ఎక్కువ కనిపిస్తలేరు. ఆదివారం, చుట్టీలు ఉన్నప్పుడు తప్ప మిగిన రోజులల్ల కష్టమర్లు అస్తలేరు. ఈ షాపుని మనూర్లనే పెట్టి, నేను గుడ మీతోటి యవుసంల దున్కుత. ; నా పొట్టకన్న నేను పండించుకుంట’ అన్నాడు.
హరి నిర్ణయానికి రంగా, గోపి, సంఘప్ప భుజం తట్టారు. ఇంతలో సర్వపిండి అమ్మే బండి అతను అడిగాడు “:ఏ ఉరన్నా మీది?”
‘అవుసులపల్లి అన్నా’ అని బదులిచ్చి నలుగురూ బైకుని ఉత్సాహంగా దౌడు తీయించారు.
—————————-శుభంభూయాత్——————————————————————————
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments