top of page

ఫ్యామిలీ డాక్టర్

Writer: Vemparala Durga PrasadVemparala Durga Prasad

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #Family doctor, #ఫ్యామిలీడాక్టర్, #TeluguKathalu, #తెలుగుకథలు, #సామాజికసమస్యలు

వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (01/12/2024) ఎంపికైన కథ


Family Doctor - New Telugu Story Written By - Vemparala Durgaprasad

Published In manatelugukathalu.com On 25/11/2024

ఫ్యామిలీ డాక్టర్ - తెలుగు కథ

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


శ్రీనివాస్ కి ఆ రోజు బ్యాంకు కి వెళ్లాలని లేదు. వంట్లో నలత గా అనిపిస్తోంది. మేనేజర్ కి ఫోన్ చేశాడు.. 


“హలొ.. మేనేజర్ గారూ! నాకు వంట్లో బాగులేదు.. ఈ రోజు రాలేను”. 


“ఏమైంది శ్రీనివాస్?”.. మేనేజర్ ప్రశ్న. 


“జ్వరం, ఒళ్ళు నొప్పులు అనిపిస్తోంది సార్”. 


“అశ్రద్ధ చేయకు.. వూళ్ళో అసలే మలేరియా కేసులు ఎక్కువ గా ఉన్నాయిట, డాక్టర్ కి చూపించుకో.. " ఉచిత సలహా ఇచ్చేసాడు మేనేజర్. 


శ్రీనివాస్ కి మేనేజర్ మాటలకి మరీ కంగారు వేసింది. 


“ఎందుకయినా మంచిది ఒక సారి డాక్టర్ దగ్గరికి వెళ్లడం బెటర్”.. అనుకున్నాడు. 


భార్య నీలిమ అంతకు ముందు అదే మాట అంటే.. “పర్లేదు లే.. డోలో వేసుకుని, ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటే.. అదే తగ్గిపోతుంది " అన్నాడు 


శ్రీనివాస్ కెనరా బ్యాంకు లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. విశాఖపట్నం అన్నా, పెద్ద వాల్తేరు అన్నా అతనికి చచ్చేంత అభిమానం. 


ఇక్కడ శ్రీనివాస్ గురించి కొంత చెప్పుకోవాలి. అతను పుట్టి పెరిగింది విశాఖపట్నం లోనే. స్కూల్ చదువు లిటిల్ ఏంజెల్స్ లో అయితే, కాలేజీ చదువు బుల్లయ్య కాలేజీ లో అయింది. 20 ఏళ్ళ అనుబంధం విశాఖపట్నం తో. అతని తండ్రి రైల్వే లో చేసి రిటైర్ అయ్యేరు. వుద్యోగం రావడం రావడం విశాఖపట్నం లోనే వచ్చింది. దాంతో అతని ఆనందానికి అవధులు ఉండేవి కావు. 5సంవత్సరాల క్రితం విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. 3 సంవత్సరాల క్రితం నీలిమ తో అతని పెళ్లి అయ్యింది. నీలిమ పుట్టిల్లు విజయవాడ అవడం తో ఆమెకి భర్త వుద్యోగం విజయవాడలో ఉండడం తో సంతోషం గా ఉండేది. కానీ, శ్రీనివాస్ విజయవాడ లో ఉన్నంత కాలం ముళ్ల మీద గడిపినట్లు గడిపి, ఈ మధ్యనే, అంటే గత నెల లోనే మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసాడు. అతని ఏకైక ఆస్తి తండ్రి ఇచ్చిన 3 గదుల చిన్న ఇల్లు పెద్ద వాల్తేరు లో నే వుంది. అద్దెకి ఇచ్చిన ఆ ఇంటిని ఖాళీ చేయించుకుని, ఫామిలీ షిఫ్ట్ చేసేసేడు. 


కాఫీ తెచ్చి, మరో సారి చెప్పింది నీలిమ.. “డాక్టర్ దగ్గరకి వెళ్ళచ్చు కదా” అని.



“అదే అనుకుంటున్నాను”, అని కాఫీ తాగి, లేచి ప్యాంటు షర్ట్ వేసుకుని, స్కూటర్ మీద డాక్టర్ సుగుణాకర రావు క్లినిక్ కి బయలు దేరేడు. 


డాక్టర్ సుగుణాకర రావు అంటే అతనికి చాలా మంచి అభిప్రాయం. చిన్నప్పటి నుండి, ఇంట్లో ఏ అనారోగ్యం వచ్చిన, ఇంటిల్లి పాదీ అయన దగ్గరే వైద్యం చేయించుకునే వారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. 


సుగుణాకర రావు గారు కూడా అనవసరపు మందులు రాయడు, పరీక్షలు అని చెప్పి డబ్బు వృధాగా ఖర్చు పెట్టించడు. 


ఉషోదయ సెంటర్ లో మూలన వుండే ఆ క్లినిక్ అతనికి ఇప్పుడు కనబడ లేదు. అక్కడ ఎవరినో అడిగితే “క్లినిక్ మేడ మీద” అని చెప్పేరు. అప్పుడు చూసేడు. బిల్డింగ్ ఎంతగానో మారిపోయింది. పాత పెంకుటిల్లు స్తానం లో 3 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది. మొదటి ఫ్లోర్ బాల్కనీ గోడ కి బోర్డు వుంది. అందులో పెద్ద పెద్ద అక్షరాలతో "సుగుణాకర రావు "MD అని కనిపిస్తోంది. గోల్డెన్ లెటర్స్ మెరిసిపోతున్నాయి. 


 బిల్డింగ్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయి. పై ఫ్లోర్ కి వెళ్లి, హాలు లో కి ప్రవేశించేడు. 

హాలు లైటింగ్ అదిరిపోయింది. రిసెప్షన్ లో అమ్మాయి కూర్చుని వుంది. హాలు లో ఓ 10 వరసల లో కుర్చీలలో పేషెంట్లు కూర్చుని వున్నారు. ఓ మూల టీవీ నెమ్మదిగ మోగుతోంది. 

నర్సులు హడావిడిగా డాక్టర్ రూమ్ లోకి, బయటకి తిరిగేస్తున్నారు. 


శ్రీనివాస్ ని చూడగానే, రిసెప్షనిస్ట్ “పేషెంట్ మీరేనా” అంది. 


తలాడించాడు శ్రీనివాస్. 


“ఏమిటి ప్రాబ్లెమ్” అంది. 


 “ఫీవర్” అన్నాడు.. శ్రీనివాస్. 


“మీరు 500 కన్సల్టేషన్ ఫి ఇవ్వండి. ఫైల్ రాస్తాను” అంటూ గబా గబా ఫైల్ తీసింది. 


 500 రూపాయలు కట్టేడు. పేరు, వివరాలు అడిగి, ఫైల్ రాసి ఇచ్చి, " సుధా! ఈయనకి టెంపరేచర్ చూడు” అని ఓ నర్స్ కి పురమాయించింది. 


ఓ ఖాళీ కుర్చీ లో కూలబడ్డాడు. 

సుధా అనబడే నర్స్ వెంటనే అతనికి టెంపరేచర్, వెయిట్, షుగర్, బీపీ చూసింది. 

ఓ గంట పట్టింది.. డాక్టర్ రూమ్ లోకి వెళ్ళడానికి. 


వెళ్తూనే, డాక్టర్ సుగుణాకర రావు గారిని చూసి., పలకరించాడు శ్రీనివాస్. 

“డాక్టర్ గారు గుర్తు పట్టారా.. నేను శ్రీనివాస్ ని, శంకర రావు గారి అబ్బాయిని”. అని గుర్తు చేసేడు. 


సుగుణాకర రావు గారు గుర్తు పట్టినట్లు నవ్వి.. “ఈ మధ్య మీరు వైజాగ్ లో లేరా” అని ప్రశ్నించాడు. 


" అవును డాక్టర్, నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. 5 సంవత్సరాలు గా లేను. ఈమధ్యనే మళ్ళీ వచ్చేను " అన్నాడు. 


“ఓకే.. చెప్పండి.. ఇప్పుడు మీ ప్రాబ్లెమ్ “ అన్నాడు.. ఫైల్ చూస్తూ. 


రాత్రి నుండీ జ్వరం, ఒళ్ళు నొప్ప్పులుగా వుంది సార్. 


వెంటనే గబగబా ఎదో రాసి, “వెళ్లి సెకండ్ ఫ్లోర్ లో బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ ఇచ్చి రండి, ఇక్కడ రాసిన రెండు ఇంజక్షన్లు కూడా కొనుక్కుని రండి” అన్నాడు. 


“సరే” అని చెప్పి.. సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి బ్లడ్ ఇచ్చి, అక్కడ రిపోర్ట్స్ కోసం ఓ మూడు వేలు కట్టేడు. ఆ ఇంజెక్షన్లు గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న ఫార్మసీ లో కొనుక్కుని వచ్చేడు. అక్కడ ఓ 400 రూపాయలు అయింది. 


ఇంజక్షన్ లు అతని చేతిలో చూస్తూనే, సుధ అనబడే నర్స్ ఓ గది వైపు సూచించింది. 

అది క్యాజువాలిటీ రూమ్. అక్కడ 3 మంచాలు వున్నాయి. అక్కడ ఒక నర్స్ కూర్చుని వుంది. 

శ్రీనివాస్ ని, ఆ బెడ్ మీద పడుకోమని చెప్పి, 2 ఇంజెక్షన్లు చెరో చేతి కి చేసింది. 


శ్రీనివాస్ వైపు తిరిగి, .. "ఇప్పుడు డాక్టర్ గారు రౌండ్స్ కి వెళ్తారు. మీరు బ్లడ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయండి.. లేదా మరో గంట ఆగి రండి ".. అంది. 


చేసేది ఏమీ లేక, ఇంటికి వచ్చేసేడు. ఓ గంట తర్వాత మళ్ళీ వెళ్ళేడు. రిపోర్ట్స్ తీసుకుని, డాక్టర్ రూమ్ లో కి వెళ్ళేడు. 

డాక్టర్ గారు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. 


మాటలని బట్టి శ్రీనివాస్ కి అర్ధం అయింది.. కొడుకు అమెరికా లో MS చేస్తున్నాడు ట, 

కూతురు లండన్ లో మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది ట. నెల నెలా వాళ్ళకి ఫీజులు, హాస్టల్ ఖర్చులు తడిసి మోపెడు అయిపోయాయని ఏకరువు పెడుతున్నాడు.  ‘బహుశా ఎవరో దగ్గిర వాళ్ళు అయుంటారు’ అనుకున్నాడు.. శ్రీనివాస్. 


ఇంతలో కాల్ ముగించి, శ్రీనివాస్ వైపు తిరిగి, ఫైల్, రిపోర్ట్స్ చూస్తూ.. 

“నార్మల్ ఫీవరే.. భయం లేదు. వూళ్ళో డెంగ్యూ, మలేరియా ఎక్కువగా వున్నాయి. అన్ని రకాలుగా చూసుకోవడం మంచిది. అందుకే ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించేను. మందులు రాస్తాను, అవి తీసుకుని 5 రోజులు వాడండి.. తగ్గిపోతుంది. ” అన్నాడు. 

“5 రోజుల్లో తగ్గక పొతే రండి “ అంటూ ఫైల్ చేతికి ఇచ్చేడు. 


శ్రీనివాస్ మొహం జేవురించింది. మామూలు జ్వరం అని చెప్పడానికి 4000/- వదిలిందా.. 

ఇప్పుడు ఈ మందులు యెంత అవుతాయో.. అని మనసులో అనుకుంటూ.. " సరే డాక్టర్" అని నెమ్మదిగా కిందకి వచ్చేసేడు. 


ఫార్మసీ లో బిల్ ఓ 1200/- అయింది. బయటకి వస్తూంటే, ఫార్మసిస్ట్ ఎవరితోనో అంటున్న మాటలు అనుకోకుండా విన్నాడు. 


"ఇదివరకు ఇన్నిన్ని మందులు, పరీక్షలు చేసేవారు కాదు డాక్టర్.. పిల్లలు ఫారెన్ లో చదివిస్తున్నారు కదా.. ఖర్చులు ఆయనకీ పెరిగిపోయాయి. పైగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, బ్యాంకు లోన్ కూడా కట్టాలి కదా". 


“మరి మా ఖర్చులు పెరిగితే.. మేము ఏమి చేయాలో ” అని విసుక్కుంటూ భారంగా స్కూటర్ దగ్గరకి నడిచేడు శ్రీనివాస్. 


 సమాప్తం  


వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





 
 
 

1 Comment


mk kumar
mk kumar
Nov 26, 2024

వెంపరాల దుర్గాప్రసాద్ గారి "ఫ్యామిలీ డాక్టర్" కథ మన సమాజంలోని ప్రస్తుత ఆరోగ్య రంగంలో ఉన్న సమస్యలను తెలివిగా ప్రస్తావిస్తుంది. వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ప్రతిష్ఠాత్మక ఫ్యామిలీ డాక్టర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎలా మారిపోయాడో ఆవిష్కరించడం చాలా బాగా కుదిరింది. కథలోని ప్రధాన కథానాయకుడు శ్రీనివాస్ జ్ఞాపకాల సన్నివేశాలు, సుగుణాకర రావు గారిపై అతనికి ఉన్న నమ్మకం, చివరికి ఆ నమ్మకం ఎటువంటి భారంగా మారిందో ఎంతో స్పష్టంగా ఉంది.


ఈ కథ సామాజిక సమస్యల్ని అద్దం పట్టి చూపడంతో పాటు, వైద్య సేవల మీద నిర్దేశింపబడిన ఖర్చులు మానవీయ కోణంలో ఎలా భారంగా ఉంటాయో సూటిగా చెప్పింది.


Like
bottom of page