top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

గబ్జీ వర్సెస్ కరోనా








Video link


'Gabji Vs Corona' Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి.

మాదక ద్రవ్యాలు ఎందరో యువకుల్ని బలి తీసుకున్నాయి.

కరోనా చాలా మందిని కడతేర్చింది.

వీటన్నిటికంటే ఒక గేమ్ ప్రమాదకరమా? ఆ గేమ్ పేరేమిటి?

సమాధానం కోసం మల్లవరపు సీతారాం కుమార్ గారి ఈ కథ వినండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం



"నాతో పెట్టుకోవద్దురోయ్! చంపేస్తాను... ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. మార్ డాలుంగా..." గదిలోంచి కేకలు వినిపించడంతో భయపడింది వాసంతి. వేగంగా గది వద్దకు వెళ్లి తలుపు తట్టింది.

"ఒరేయ్ పవన్! ఏమైందిరా? ఎందుకలా కేకలు పెడుతున్నావు? ఎవరితో గొడవ పడుతున్నావు... ముందు తలుపు తియ్యి" అంటూ అరిచింది.


కానీ కొడుకు పవన్ తలుపు తీయకపోవడంతో, హాల్లో టీవీ చూస్తున్న భర్త వెంకట్రావు దగ్గరకు వెళ్ళింది.


"ఏవండీ! అబ్బాయి ఊరి నుంచి వచ్చి గంట కూడా కాలేదు. 'స్నానం చేసి రారా టిఫిన్ పెడతాను' అంటే, 'నిద్ర వస్తోందమ్మా! ఒక గంట దాకా డిస్టర్బ్ చేయొద్దు' అని గది లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరినో చంపేస్తానంటూ ఫోన్లో బెదిరిస్తున్నాడు. తలుపు తీయడం లేదు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. అక్కడ కాలేజీ హాస్టల్ లో ఎవరితో అయినా గొడవ పడ్డాడేమో" అని ఆందోళన తో చెప్పింది వాసంతి.


వెంటనే వెంకట్రావు కూడా ఆ గది వద్దకు వెళ్లి తలుపు దబదబా బాదాడు. కానీ పవన్ తలుపు తీయలేదు. ఇప్పుడు అరుపులు కూడా వినపడడం లేదు. ఆందోళనతో పక్కింట్లో ఉన్న తమ ఫ్యామిలీ ఫ్రెండ్ గురునాథానికి ఫోన్ చేశాడు వెంకట్రావు. ఈ విషయం విన్న గురునాథం ఫక్కున నవ్వాడు. కోపం వచ్చింది వెంకట్రావుకు.


"ఒరేయ్! నేను సీరియస్ విషయం చెబుతుంటే ఏమిటా నవ్వు? నేను చెప్పింది సరిగా వినలేదా?" కోపంగా అన్నాడు వెంకట్రావు.


"నువ్వు టెన్షన్ పడకురా. ఈమధ్య గబ్జీ అనే ఆన్లైన్ గేమ్ ఒకటి వచ్చింది. అది అలవాటైన వాళ్లంతా ఇలా కేకలు పెడుతూ ఉంటారు. మీ అబ్బాయి హాస్టల్ నుంచి పొద్దున్నే వచ్చాడు కాబట్టి మీకు విషయం తెలియదు. మావాడు యింటినుంచే కాలేజీ కి వెళ్తాడు కాబట్టి నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. నీతో కూడా ఒకటి రెండు సార్లు మా అబ్బాయికి గేమ్స్ పిచ్చి పట్టింది అని చెప్పాను. గుర్తులేదా?" అని మళ్లీ నవ్వుతూ చెప్పాడు గురునాథం.


"చెప్పావు కానీ మరీ ఇంత పిచ్చిగా ఆడుతారా? అలా పెద్దపెద్దగా కేకలు ఎందుకు పెడుతున్నాడు? నేను తలుపు తట్టినప్పుడు తియ్యాలి కదా!" ఇంకా అనుమానం తీరక అడిగాడు వెంకట్రావు. "చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు కాబట్టి నువ్వు తలుపు తట్టినా వినపడలేదు" చెప్పాడు గురునాథం.


"ఇప్పుడు అరుపులు ఆగిపోయాయి. మరి ఇప్పుడైనా నా మాటలు వినబడాలి కదా" తన అనుమానాన్ని పొడిగిస్తూ అన్నాడు వెంకట్రావు.


"ఆడుతున్న గేమ్ అయిపోయి ఉంటుంది. మరో గేమ్ కోసం మనుషులు దొరికే దాకా ఇలా ఉంటారు. మళ్ళీ మామూలే" తన అనుభవాన్ని విప్పి చెప్పాడు గురునాథం.





అయినా ఆశ తీరక మరోసారి గది తలుపులు తట్టాడు వెంకట్రావు. అయినా తలుపులు తెరుచుకోలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఆ గది కిటికీ దగ్గరకు వెళ్ళాడు వెంకట్రావు. అది ఏ సి రూమ్ కావడంతో కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. లోపల కర్టెన్ వేసి ఉండడం తో ఏమీ కనబడ్డం లేదు. తిరిగి ఇంట్లోకి వచ్చి ఇంటర్నెట్ మోడెమ్ ఆఫ్ చేశాడు.


తన వైపే చూస్తున్న భార్యతో "ఇంకాసేపట్లో బయటకు వస్తాడు" అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు.


అతను చెప్పినట్లే మరో నిమిషానికి పవన్ బయటకు వచ్చాడు. అతని మొహం లో చికాకు తాండవిస్తోంది. మోడెమ్ ఆఫ్ చేసి ఉండడం గమనించాడు.


"అమ్మా! ఈ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారు?" అంటూ గట్టిగా అడిగాడు తల్లిని.


"అదే... అది.. మీ నాన్న ఫ్యాన్ ఆఫ్ చేయబోయి ఈ స్విచ్ నొక్కి ఉంటాడు. సరే గానీ స్నానం చేశావా? టిఫిన్ పెడతాను. రాత్రి 8 గంటలకు బస్సు ఎక్కావు. ఎప్పుడు తిన్నావో ఏమో" అంది వాసంతి.


"ఏమిటమ్మా నాన్న మరీ బుద్ధి లేకుండా..." అంటూ మోడెమ్ ఆన్ చేసి తిరిగి గదిలోకి వెళ్ళాడు పవన్.



కొడుకు మాటలు భర్త ఎక్కడ విన్నాడో అనే అనుమానంతో భర్త దగ్గరకు వెళ్ళింది వాసంతి.

అతను మామూలుగానే ఉండడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకొని అబ్బాయికి తలనొప్పిగా ఉందట. 'పడుకుంటున్నాను' అని చెప్పాడు. ఇందాక కూడా నిద్రలో ఏదో కలవరించినట్లు ఉన్నాడు" అంటూ సర్దిచెప్ప బోయింది.


'బుద్ధి లేకుండా ఏం మాట్లాడుతున్నావ్?"అంటూ భార్యను అరిచాడు వెంకట్రావు. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి.


"ఈ మాట ఇంతకుముందు నేను ఎప్పుడైనా నీతో అన్నానా? అడిగాడు వెంకట్రావు.

కళ్లు తుడుచుకుంటూ, గొంతు పెగల్చుకుని "లేదండీ" అంది వాసంతి.

"పోనీ నేను గానీ, నువ్వు గానీ మన అబ్బాయిని ఈమాట ఎప్పుడైనా అన్నామా?" తిరిగి ప్రశ్నించాడు వెంకట్రావు.

"ఎప్పుడూ అనలేదండీ" ఏడుపును దిగమింగుకుంటూ అంది వాసంతి.


"మరి వాడిప్పుడు అంత మాట ఎందుకు అనాలి? ఇప్పుడు కొత్తగా సెల్ఫోన్లలో అదేదో గబ్జీ అనే గేమ్ వచ్చిందట. అది ఆడే వాళ్ళందరూ ఇలాగే పేరెంట్స్ ను కసురుకుంటూ ఉంటారట" అని చెప్పాడు వెంకట్రావు.


ఆశ్చర్యపోయింది వాసంతి. "అదేమిటండీ? గేమ్ ఆడితే అవతలివాళ్లను ఓడించాలని చూస్తారు. ఒకవేళ ఓడిపోతే ఈసారి మరింత పట్టుదలగా ఆడుతారు. కానీ ఇలా కేకలు పెట్టడం, ఇంట్లో వాళ్ళను నోటికి వచ్చినట్లు అనడం ఏమిటి" అంది.


"ఈ గేమ్ ఆడే వాళ్లంతా ఇలాగే తయారవుతారట. ఇందాక ఫోన్లో మన గురునాథం కూడా అదే మాట చెప్పాడు" అని వెంకట్రావు తన భార్యతో చెప్తూ ఉండగానే గురునాథం వాళ్ల ఇంట్లోకి వచ్చాడు.


"నీకు నూరేళ్ళు గురునాథం! నీ గురించి చెప్తూ ఉండగానే వచ్చావు" అంటూ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించాడు వెంకట్రావు.


"నాకూ నూరేళ్లు బతకాలని ఉంది గానీ ఈ లోపలే మా అబ్బాయి రోషన్ నన్ను మర్డర్ చేసేలా ఉన్నాడు" అంటూ కుర్చీలో కూర్చున్నాడు గురునాథం.


"ఛీ...అవేం మాటలురా" అన్నాడు వెంకట్రావు.


"నా బాధ నీకు తెలీదురా. చెప్పుకుంటే పరువు చేటు. మొదట్లో ఇంట్లో మాకు తెలియకుండా చాటుమాటుగా ఆడేవాడు. మేము గమనించి చీవాట్లు పెట్టడంతో ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో సిగ్నల్ అందనట్లుగా నటిస్తూ మేడ పైకి వెళ్లే వాడు. ఒక రోజు అలా వెళ్లినప్పుడు మేడపై నుండి కేకలు వినబడ్డాయి. దాంతో మేము పైకి వెళ్లి చూశాము. అక్కడ మంచి ఎండలో అటు ఇటు ఆవేశం గా తిరుగుతూ చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కేకలు పెడుతున్నాడు. ఆ రోజు వాడికి బడిత పూజ చేశాను.



తర్వాత వాడు ఏమైనా బాధ పడ్డాడేమో అనుకొని వాడిని దగ్గరకు తీసుకొని ఓదార్చాను.'ఇంకెప్పుడూ ఆ గేమ్ ఆడ వద్దు' అంటూ వాడిని ఒట్టు వేయమన్నాను. వాళ్ల అమ్మ మీద ఒట్టు వేశాడు మావాడు. ఆ రోజు రాత్రికి వాడిని నా పక్కనే పడుకోబెట్టుకున్నాను. మా ఆవిడ చిన్న మంచం వేసుకొని విడిగా పడుకుంది. అర్ధరాత్రి లఘుశంక కోసం లేచిన నాకు పక్కన రోషన్ కనపడలేదు.


కొంపదీసి అలిగివెళ్ళి పోలేదు కదా...!

ఆ ఆలోచన రాగానే ఒళ్ళు ఝల్లుమంది.

ఆందోళనతో మా ఆవిడను లేపాను.

రోషన్ కనపడ్డం లేదని ఆమెకు చెప్పాను.

ముందుగా ఇల్లంతా వెతికాము.

ఎక్కడా లేడు.

బయటకెళ్ళి చూద్దాం అనుకున్నాం.

తలుపు గడియ తీసి ఉంది.

బయటనుండి గడియ పెట్టుకొని వెళ్లి ఉంటాడనుకున్నాం.

తలుపు లాగగానే తెరుచుకుంది.

అంటే డోర్ దగ్గరకు లాక్కుని వెళ్లిపోయాడన్నమాట.

నయం! బార్లా తెరిచి వెళ్ళలేదు...అనుకుంటూ బయటకు వెళ్ళాం.

గేట్ తీసుకొని బయటకు వెళ్ళబోతూ ఒకసారి వరండా తేరిపార చూసాము.

ఒక మూలగా నేలమీద కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నాడు.

"రోషన్!" అని గట్టిగా పిలిచాను.


చెవులకు ఇయర్ ఫోన్స్ ఉండటం వల్ల నా పిలుపు అతనికి వినిపించలేదు.

పైగా అటువైపు తిరిగి ఉండటంతో మమ్మల్ని చూడలేదు.

మా ఆవిడ వాడి దగ్గరకు వెళ్లి వాడిని గట్టిగా కుదుపుతూ, "బాబూ రోషన్!" అని పిలిచింది.

చేతిలో ఉన్న మొబైల్ నేలకేసి కొట్టాడు రోషన్.

"పిచ్చిదానిలా బిహేవ్ చేసావేంటమ్మా! అవతల వాడు నన్ను షూట్ చేసాడు" అన్నాడు పళ్ళు కొరుకుతూ.


కళ్ళలో నీళ్లు తిరిగాయి మా ఆవిడకు.

"ఏంటి నాన్నా ఇది...అంటూ ఏదో చెప్పబోయింది.

"మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదని బయటకు వచ్చి ఆడుకుంటున్నాను. నేను ఇంత అడ్జెస్ట్ అవుతున్నా మీరు ఇలా చేస్తున్నారు" అన్నాడు కోపంగా.

"అది కాదురా! బయట దోమలు చూడు ఎలా ఉన్నాయో..."అంటూ చెబుతున్న మా ఆవిడని కసిరేసాడు రోషన్.

"అవతల వాళ్ళు నన్ను షూట్ చేసిపారేసారు. నువ్వేమిటో దోమల గురించి మాట్లాడుతున్నావు" అన్నాడు మాదే తప్పు అన్నట్లుగా.


ఎలాగో వాడిని బుజ్జగించి ఇంట్లోకి తీసుకొని వచ్చేసరికి మా తల ప్రాణం తోకలోకి వచ్చింది"

చెప్పడం ముగించాడు గురునాథం.


"ఈ గబ్జీ గేమ్ చాలా ప్రమాదకారిలా ఉంది. పేరెంట్స్ అందరూ కలిసి ఈ గేమ్ ను నిలిపివేయించాలి" అన్నాడు వెంకట్రావు.


"నిజమే. మన కాలనీ ప్రెసిడెంట్ ను రేపు కలుద్దాం. అయన సామాజిక ఉద్యమాలు చేయడంలో దిట్ట" అన్నాడు గురునాథం.

***


మర్నాడు వెంకట్రావు, గురునాథం ఇద్దరూ కలిసి వాళ్ల కాలనీ ప్రెసిడెంట్ అచ్యుతరావును కలిశారు. ఇద్దరూ తమ అనుభవాలను ఆయనతో చెప్పారు.


అయన చిన్నగా నవ్వి "ముందుగా నా అనుభవాన్ని షేర్ చేస్తాను. ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. విని నవ్వకండి" అంటూ చెప్పడం ప్రారంభించాడు.


ఒకరోజు అచ్యుతరావు, అయన భార్య దేవిక ఒక పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది.

వాళ్ల అమ్మాయి సృజన "ఇంకో నెల్లోనే ఎక్జామ్స్ ఉన్నాయి కదా. నేను చదువుకోవాలి. మీరు వెళ్ళండి" అంది.

రాత్రిపూట అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి సందేహిస్తూనే, చేసేదిలేక జాగ్రత్తలు చెప్పి వెళ్లారు.

పెళ్లి జరుగుతూ ఉండగానే ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది.

ఉరుములంటే సృజనకు చెప్పలేనంత భయం.


దేవిక కూతురికి ధైర్యం చెప్పడానికి ఇంటికి ఫోన్ చేసింది.

కానీ సృజన లిఫ్ట్ చెయ్యలేదు.

ఇద్దరికీ టెన్షన్ మొదలైంది.

ఎన్ని సార్లు ప్రయత్నించినా లాభం లేక పోయింది.


చేసేది లేక తమ ఇంటికి దగ్గరలో ఉన్న తన స్నేహితుడు సుబ్బారావుకు కాల్ చేసాడు అచ్యుత రావు. విషయం చెప్పి "వర్షం తగ్గేదాకా సృజనకు తోడుగా ఉండండి. లేదా తనని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. మేము వచ్చాక పిక్ అప్ చేసుకుంటాము " అని అభ్యర్థించాడు.


"దాందేముంది. నేను చూసుకుంటాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు" అన్నాడు సుబ్బారావు.


ఇక ఆ విషయం మర్చిపోయి పెళ్ళిలో స్నేహితులతో, పరిచయస్తులతో సరదాగా గడుపుతున్నారు.

ఓ గంట గడిచాక పాలు కాచి పెట్టమని చెప్పడానికి కూతురికి ఫోన్ చేసింది దేవిక.

ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు సృజన.

విషయం భర్తకు చెప్పిందామె.

అచ్యుతరావు వెంటనే సుబ్బారావుకు కాల్ చేసాడు.


సుబ్బారావు మాట్లాడుతూ "అమ్మాయిని తీసుకొని రమ్మని మా అబ్బాయి శివను పంపాను.

వర్షం ఎక్కువైంది కదా. తగ్గాక వస్తారులే. మా వాడు ఉన్నాడు కాబట్టి భయం లేదులే" అన్నాడు.


అచ్యుతరావు దంపతులకు టెన్షన్ మొదలైంది.

రాత్రిపూట ఒంటరిగా అమ్మాయి..అబ్బాయి..

పైగా వర్షం, ఉరుములు మెరుపులు...

ఇక అక్కడ ఉండలేక పెళ్లి భోజనం కూడా చెయ్యకుండా బయలుదేరారు.

వచ్చే దారిలో ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు సృజన.

ఆఘమేఘాల మీద ఇంటికి చేరుకున్న వామనరావు దంపతులు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.


బయట వరండాలో నేలమీద కూర్చొని మొబైల్ నొక్కుకుంటూ ఉన్నాడు సుబ్బారావు గారి అబ్బాయి శివ.

ఇంటి తలుపు వేసి ఉంది.

ఒకసారి వీళ్ళవంక చూసి తిరిగి గేమ్ లో మునిగిపోయాడు శివ.

వీళ్ళు దగ్గరకు రావడంతో విధిలేక తల ఎత్తి " బెల్ నొక్కాను అంకుల్. ఇంకా తలుపు తియ్యలేదు" అని చెప్పి మళ్ళీ గేమ్ లో పడిపోయాడు.

బెల్ నొక్కడంతో పాటు తలుపు దబదబా బాదాడు అచ్యుతరావు.

అయినా సృజన తలుపు తియ్యలేదు.


తన సెల్ లో టార్చ్ ఆన్ చేసి బయట ఉన్న ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసాడు అచ్యుతరావు.

వెంటనే తలుపు గట్టిగా బాదాడు.

"వస్తున్నా నాన్నా!" అంటూ తలుపు తీసింది సృజన.

తిరిగి మెయిన్ ఆన్ చేసి ఇంట్లోకి వెళ్లారు అచ్యుతరావు దంపతులు.

ఒకసారి తల ఎత్తి చూసి, తిరిగి గేమ్ లోకి తల దూర్చాడు శివ.

"ఒంటరిగా ఉన్నావు కదా! భయపడుతూ ఉంటావని నిన్ను తీసుకొని వెళ్ళడానికి సుబ్బారావు అంకుల్ వాళ్ల అబ్బాయి శివ వచ్చాడు" చెప్పాడు అచ్యుతరావు.

"ఇప్పుడా రావడం? తీరా మీరు వచ్చాక" అంది సృజన.

చెప్పడం ముగించాడు అచ్యుతరావు.


"ఇదండీ విషయం. ఈ గేమ్ పిచ్చిలో పడి, వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఒకరినొకరు పట్టించుకోవడం లేదు. మా అమ్మాయి నాలుగు సబ్జెక్ట్ లలో తప్పింది. ఏమైనా రేపు మన కాలనీ మీటింగ్ పెట్టి ఈ గేమ్ బాన్ చెయ్యడానికి ఉద్యమం ప్రారంభిద్దాం" అని అభయం ఇచ్చాడు.


మర్నాడు కాలనీ వాళ్ళందరూ సమావేశమయ్యారు.

ఈ గేమ్ కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడపాలని అందరూ తీర్మానించారు.

'క్విట్ గబ్జీ' అనే పేరుతో ఒక బ్లాగ్ ప్రారంభించారు కొందరు.

దేశవ్యాప్తంగా లక్షలమంది పేరెంట్స్ అందులో చేరారు.

కొంతమంది రీసెర్చ్ స్టూడెంట్స్ గబ్జీ వల్ల కలుగుతున్న నష్టాలు, కరోనా వల్ల కలుగుతున్న నష్టాలు పోలుస్తూ తాము సేకరించిన వివరాలు వ్యాసాలుగా ప్రచురించారు.


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కరోనా కంటే గబ్జీ వల్ల ఎక్కువ నష్టం కలుగుతోంది.

దాదాపు నాలుగు కోట్లమంది యువత ఈ గేమ్ కి అడిక్ట్ అయ్యారు. రాత్రనక పగలనక ఆడుతూ ఉన్నారు.

రేపు వీళ్ళు పేరెంట్స్ గా మారితే వీళ్ళ పిల్లల పరిస్థితి ఏమిటి?

దేశాన్ని కాపాడాల్సిన యువత ఈ గేమ్ మత్హులో పడి నిర్వీర్యులయితే ఇక దేశం ఏమవుతుంది?

కరోనా కేవలం కొద్దీ మంది యువకులకు సోకింది.

కానీ ఈ గబ్జీ వల్ల మరి కొద్ధి రోజుల్లో దాదాపు సగం యువత పిచ్చివాళ్లుగా మారబోతున్నారు.


'క్విట్ గబ్జీ' కి దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది.

మరి ప్రభుత్వాలు ఈ గేమ్ ను బాన్ చేస్తాయా లేక ఈ గేమ్ మీద భారీగా పన్నులు వేసి తమ ఆదాయాన్ని పెంచుకుంటాయా వేచి చూడాలి.

శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).








64 views0 comments

Comments


bottom of page