#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #Gadi, #గది

Gadi - New Telugu Poem Written By - Bulusu Ravisarma
Published In manatelugukathalu.com On 22/01/2025
గది - తెలుగు కవిత
రచన: బులుసు రవి శర్మ
ఆ గదిలో అందరూ వున్నారు
గది నిండా నిశ్శబ్దం
నాన్న , అమ్మ
అక్క ,అన్న ,తమ్ముడు
ఇంకా బామ్మ
గది నిండా నిశ్శబ్దం
దిండుని నిలువుగా గొడకానించి
దానికి తన వీపు ఆనించి
సగం జారిన కళ్ళ జోడు తో
జమా ఖర్చుల లెక్కలతో
కబేళాలో వ్రేలాడే కళేబరంలా
ఆ పరికరం తో కుస్తీ పడుతున్నాడు నాన్న
కొత్త వంటలు, చీరలు
బంగారం ఫ్రీ ఆపర్స్ చూస్తూ
జీవితం మింగేసిన కలలను
ఆ పరికరంలో తడుముతోంది అమ్మ
రీ ఛార్జ్ చేయమన్న
కొత్త ప్రేయసి మెసేజ్
సాయంత్రం కలిసి ఏం చేద్దాం అన్న మిత్రుల డిస్కషన్
లోన్ ఇంకా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్
మెసేజ్లను తడుముతూ
అస్తవ్యస్తంగా పెరిగిన
భవిష్యత్ లాంటి గడ్డాన్ని
గొక్కుంటున్నాడు అన్న !
ప్రియుడి సందేశాలను
ఎవరికి తెలియకుండా చదువుతూ
అర్ధ నిమీలిత నేత్రాలతో
ఎర్రబడిన బుగ్గలతో
పరికరాన్ని పొదివి పట్టుకొని
గుండెల్లో దాచుకుంటోంది అక్క!
వీడియో గేమ్స్ తో మమేకమై
బుగ్గ మీద కుడుతున్న దోమకి
నెత్తురు అప్పజెప్పి
కొత్త లోకంలో విహరిస్తూ తమ్ముడు !
తన చుట్టూ వున్న
మౌన ప్రపంచాన్ని చూస్తూ
నిస్సహాయంగా
నిట్టూర్పులు విడుస్తూ బామ్మ !
ఆ గదిలో అందరూ వున్నారు !
గది నిండా నిశ్శబ్దం !!
-బులుసు రవి శర్మ
Comments