కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Gajendra Moksham' New Telugu Story Written By Lanka Sankara Narayana
రచన: లంకా శంకర నారాయణ
మొసలి బారి నుండి గజేంద్రుడిని కాపాడిన భగవంతుడు ఈ భార్యా బాధితుడికి ప్రత్యక్షమయ్యాడు.
మరి ఇతడిని కాపాడగలిగాడా లేదా అనేది ప్రముఖ రచయిత లంకా శంకర నారాయణ గారు రచించిన ఈ కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
నా వివాహం 1984 వ సంవత్సరంలో జరిగింది.
మా మామగారు బెంగుళూరు యూనివర్సిటీలో సంస్కృత అధ్యాపకులు. మా ఆవిడను కాపురానికి పంపిస్తూ “బాబూ! మా అమ్మాయి చాలా సజ్జనురాలు. జాగ్రత్త” అని చెప్పారు.
‘ఇదేమిటి సజ్జనురాలు అంటాడు, జాగ్రత్త అంటాడేమిటబ్బా’ అనుకున్నా. పోనీలే సజ్జనురాలే కదా అని సర్దుకున్నా.
అయితే కాపురానికి వచ్చిన నెల రోజులకే నాకు అర్ధం అయ్యింది మా ఆవిడ సజ్జనురాలు కాదు, సజ్జనార్ అని (దిశ రేప్ కేసులో నలుగురిని ఎన్ కౌంటర్ చేసిన పోలీస్ ఆఫీసర్ సజ్జనార్). అయితే అక్కడ సజ్జనార్ రేప్ చేసిన వారిని ఎన్ కౌంటర్ చేసాడు. ఇక్కడ రేప్ మనమీదే, ఎన్ కౌంటర్ మనల్నే. ఎలా అని అనుకుంటున్నారా? అదే చెపుతున్నా.
పెళ్ళైన కొత్తలో కొంచెం అతి ఉత్సాహం ప్రదర్శించి ‘ఇల్లు ఊడ్చి తుడుస్తానే’ అన్నా. దానికావిడ ‘మీకెందుకండి? మీరు హాయిగా కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుకోండి. నేను ఊడ్చి తుడుస్తాగా” అని నా చేతికి కాఫీ కప్పు ఇచ్చింది.
‘మామగారు చెప్పింది నిజమే, సజ్జనురాలే’ అనుకున్నా.
ఒకవారం గడిచిన తరువాత “ఏమండీ! ఊరికే అలా కూర్చోకపోతే నేను ఊడుస్తూ ఉంటే మీరు వెనకాల నుంచి తుడుచుకుంటూ రావచ్చుగదా” అంది. సరే పోనీ అడుగుతోంది గదా అని తుడవడం మొదలు పెట్టా.
రెండో వారం గడిచేసరికి “మీరు ఇల్లు ఊడ్చి తుడుస్తూ ఉండండి. నేను మీకు కాఫీ కాచి పట్టుకొస్తా” అంది. సరే తప్పుతుందా అసలే కొత్త పెళ్ళాం అని సరే అన్నా.
నాలుగో వారం గడిచేసరికి అవిడ కుర్చీ లో కూర్చుని పేపర్ చదువుకుంటూ “ఇదిగో! ఒక కప్పు కాఫీ నాకిచ్చి, ఇల్లు ఊడ్చి తుడిచేసేయ్” అంది. ఇప్పుడు అర్ధం అయ్యింది మామగారు జాగ్రత్త ఎందుకు చెప్పారో.
ఆ తరువాత కొన్నాళ్ళకు మా అవిడ సంగీతం క్లాసు కు వెళ్ళినప్పుడు మా పనమ్మాయి ఫొను చేసి “రెండు రోజులు రాను సారూ” అని చెప్పింది.
సరే మా ఆవిడని ఎలాగైనా సంతొషపెట్టాలని గిన్నెలన్నీ శుభ్రంగా తోమేశా. కాసేపటికి ఆవిడ వచ్చింది.
“పని మనిషి రెండు రోజులు రాదుట” అని చెప్పా.
లోపలికి వెళ్ళి తోమిన గిన్నెలు చూసి వచ్చి “గిన్నెలు మీరు తోమారా” అని అడిగింది.
“అవును” అన్నా.
“మీకు అసలు బుద్ది ఉందా?” అని అరిచింది.
నేను గిన్నెలు తోమినందుకు మనసులో చాలా బాధ పడుతోంది అనుకుంటూ “పరవాలేదు లేవే” అన్నా.
దానికి ఆవిడ “నేను ఇంకా భోజనం చేయలా. కాసేపుంటే అన్నీ కలిపి తోమేవారు కదా” అంది. దేవుడా!
ఆ మరునాడు ప్రొద్దున్నే మా ఆవిడ నాతో “ఏమండీ! ఇవాళ కూడా పనమ్మాయి రాదు. మీరు గిన్నెలు తోమకండి” అని చెప్పింది. అలాగేలే అన్నా.
మళ్ళీ సంగీతం క్లాసుకు వెళ్ళేటప్పుడు “నేనులేనని గిన్నెలు తోమేయకండి” అని చెప్పింది. “అలాగేలేవే” అన్నా.
మళ్ళీ సంగీతం క్లాసు నుంచీ ఫోన్ చేసింది. “ఏమండీ! గిన్నెలు తోమట్లేదుగా” అంది.
“అబ్బా…! తోమట్లేదులేవే” అన్నా.
.
కాసేపటికి సంగీతం క్లాసు నుంచీ వచ్చింది. “ఏమండీ గిన్నెలు తోమేశారా” అంది.
“లేదే.. నువ్వు అన్నిసార్లు చెప్పిన తరువాత ఎందుకు తోముతానే” అన్నా.
.
“ఐతే తోమలేదా.. ఖర్మ! నేనే తోముకుంటాలెండి” అని కోపంగా వంటింట్లోకి వెళ్ళిపొయింది.
‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే’ అని ఒక మహకవి అన్నాడు. ఇన్నిసార్లు తోమవద్దని చెపితే తోమమనా అర్ధం.
ఇలా మొసలి నోట్లో కాలు పెట్టిన గజేంద్రుడిలా 30 సంవత్సరాలు సంసార జీవితం పూర్తి చేసా. ఉద్యొగం నుండి పదవి విరమణ కుడా చేసా.
పదవి విరమణ తరువాత ఖాళీగా ఉండటం ఎందుకని ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలం లో రోజూ ఉదయం 2 గంటలు చెట్లు, గడ్డి పెంచటం కాలక్షేపంగా చేసుకున్నా.
అప్పుడు ఒకరోజు మా ఆవిడ “ఏమండీ! నేనూ కోడలూ సాయంత్రం షాపింగ్ కు వెడుతున్నాం. మీరు సాయంత్రం ఖాళీగానే ఉంటారు కదా.. కాస్త మేడమీద ఆరేసిన బట్టలు మడతపెట్టి తీసుకురండి. అలాగే కాస్త సన్నజాజి పూలు కూడా కోసుకు రండి ప్లీజ్” అంది. ప్లీజ్ అంటోంది కదా అని సరే అన్నా.
రెందో రోజు “ఏమండీ! నేనూ కోడలూ సాయంత్రం పేరంటానికి వెడుతున్నాము. కాస్త బట్టలు, పూలు తెచ్చేయండి” అంది.
ఈసారి ‘ప్లీజ్’ అనలా.
ఐనా తప్పదుగా… ‘సరే’ అన్నా.
మూడో రోజు సాయంత్రం మా ఆవిడ ఇంట్లోనే ఉంది. టి. వి చూస్తోంది.
నావంక చూసి “ఏమిటి ఇంకా బట్టలు పూలు పట్టుకురాలా?” అంది.
‘నువ్వు ఇంట్లొనే వున్నావు కదే’ అందామనుకున్నాను కానీ మా మామగారు చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చి” ఇదిగో! ఇప్పుడే తెస్తున్నా” అన్నా.
అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు సాయంత్రం నేను బట్టలు, పూలు తేవటానికి మేడమీదకి వెడుతుంటే మా ఆవిడ కూడా నా వెనకాలే వచ్చింది.
“ఏమండీ! మీరు కొన్నాళ్ళు బట్టలు మడత పెట్టటం, పూలు కోయటం లాంటి పనులు చేయకండి” అంది. ఆవిడ లో కలిగిన ఈ పరివర్తన కు అనందం కలిగింది కాని కొన్నాళ్ళే ఈ పనులు చెయ్యవద్దని ఎందుకు చెప్పింది? అదే ఆవిడని అడిగాను.
“ఏమీలేదండీ! ఈ కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించారుకదా! ఎదురుగుండా ఫ్లాట్ల వాళ్ళందరూ బయటే నుంచుని ఇటే చూస్తున్నారు. అందుకని లాక్ డౌన్ తీసేసేదాకా మీరు బయట పనులు మాని లోపల పనులు చూసుకోండి. ఇవి నేను చేస్తా” అంది.
అబ్బ.. ఎంత ప్రేమే నేనంటే నీకు..!
నేను ఇంటి ముందర గడ్డి పని చేసేటప్పుడు ఆదారిన వెళ్ళే ఆడవాళ్ళు, మగవాళ్ళు నాతో నాలుగు ముక్కలు మాట్లాడి వెడుతూ ఉంటారు.
ఒకరోజు నేను బయట పని చేస్తున్నప్పుడు మా ఆవిడ మా మనవరాలిని పిలిచి “కన్నా! తాత ఏంచేస్తున్నాడో చూసిరారా” అంది.
అది బయటకు వచ్చి చూసి వెళ్ళి, “బామ్మా! తాత ఎవరో అంటీతో మాట్లాడుతున్నాడు” అని చెప్పింది.
“అనుకున్నా! ఈయనకి ఏమన్నా మొక్కల మీద ప్రేమా పాడా.. ఎప్పుడు ఎవరితో సొల్లు కొడదామా అని ఆ చెట్ల పని చేస్తూ ఉంటాడు” అంటూ బయటకు వచ్చింది.
“ఏయ్! ఏం పీకుతున్నావు?” అంది.
“గడ్డి పీకుతున్నానే” అన్నా.
“నిన్ను గడ్డి పీకద్దని చెప్పానా.. ఇప్పటికే కాలనీలో అందరూ నన్ను గడ్డిపీకే అయన భార్య అని పిలుస్తున్నారు. ఐనా నిన్ను పారిజాతం పూలు యేరమని చెప్పా కదా” అంది.
“అన్నీ ఏరేశానే. ఇంక లేవు” అన్నా.
“ఒకసారి ఊపు” అంది.
“ఈవయస్సులో నేనేం ఊపగలనే” అన్నా.
ఆవిడ చెట్టు దగ్గరకి వెళ్ళి దబ దబా ఊపింది
ఒక వంద పూలు రాలి పడ్డాయి
“ఇవన్నీ ఏరి రెండు నిముషాలలో లొపలికి తీసుకురా. నేను పూజ చేసుకోవాలి” అంది.
రాను రాను దీని బాధ భరించడం చాలా కష్టంగా ఉంది. దీని బాధ నుంచి నన్ను రక్షించేవాడు ఎవడు?
ఇంక లాభం లేదు.గజేంద్రుడిని మొసలి బారి నుండి రక్షించిన ఆ శ్రీహరే నన్ను రక్షింప గలవాడు అని భావించి “ఓ శ్రీహరీ! భక్తజన రక్షకా.. ఈబాధకు ఏదైనా తరుణోపాయం చూపించు” అని ప్రార్ధించాను.
ఆశ్చర్యం! ఎదురుగా విష్ణుమూర్తి నిలబడి ఉన్నాడు.
“స్వామీ.. మీరు నిజంగా విష్ణుమూర్తేనా?” అని అడిగాను.
“ఎందుకా సందేహం” అని అడిగారు స్వామి.
“అంటే.. వెంటనే ప్రత్యక్షం ఐతేనూ…” అన్నా
“ఇదేనయ్యా మీ భక్తులతో బాధ! వెంటనే ప్రత్యక్షం ఐతే నువ్వు దేముడివేనా? అంటారు. ఆలస్యం ఐతే నువ్వు అసలు ఉన్నావా? అంటారు. ఇంతకీ నీ బాధ ఏంటి?” అన్నారు స్వామి.
“అదే స్వామీ! నా భార్య పెట్టే బాధలు భరించలేక చస్తున్నా. ఏదైనా తరుణోపాయం అనుగ్రహించు” అన్నా.
దానికి స్వామి చిరునవ్వుతొ
“భర్తలైనాక భార్యలుండకా తప్పదు
భార్యలున్నాక బాధలుండకా తప్పవు
దీన్ని గురించి శొకింప తగదు నాయనా” అన్నారు.
“ఐతే నా బాధలకు విముక్తి లేదా స్వామీ!” అన్నా.
“ఎయిడ్స్ లాగా దీనికి మందు లేదు నాయనా. నివారణ ఒక్కటే మార్గం” అన్నారు స్వామి
“మరైతే ఆ నివారణ ఏమిటో చెప్పు స్వామీ!” అన్నా.
"అలా అడుగు చెపుతా..
ఒకటి ‘మూస్కో’, రెండు ‘చేస్కో’ ” అన్నారు స్వామి.
“ఇదేమి నివారణ స్వామి.. నాకు అర్ధం కావటం లేదు” అన్నా.
“పిచ్చివాడా! నోరు "మూస్కో"... నీ భార్య చెప్పింది "చేస్కో" …ఇదే నీ బాధలకు నివారణ” అని స్వామి అంతర్ధానమయ్యారు.
"మౌనమే నీ బాష ఓ మూగ మనసా" అన్న పాట ఎక్కడో దూరంగా నెమ్మదిగా వినిపిస్తోంది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు లంకా శంకర నారాయణ. నేను 1956 అక్టోబర్ 16 న జన్మించాను. మా స్వస్థలం అంధ్ర ప్రదేశ్ ఇండియా లోని బందర్. నేను హైదరబాద్ లోని రాష్ట్ర సహకార బాంక్ లొ పని చేసి 2014 లొ పదవీ విరమణ చేసాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికా లొ ఉంటున్నారు.
Aruna Yallapragada • 3 days ago
Very funny 🤣