top of page

గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 1

Updated: Jul 29, 2023


'Gajulu Chesina Pelli Part 1/2' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 1/2' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“ఇదిగో వెంకట లక్ష్మి, నేను పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మా అక్కకి ఉత్తరం పోస్ట్ లో వేసి, అక్కడి నుండి ‘గోరాయన కొట్టు’ దగ్గరకు వస్తాను. నువ్వు కూడా అరగంటలో అక్కడ ఉండాలి” అంది కమల, పక్కింటి వెంకటలక్ష్మి తో.


“అలాగే వదినా. నేనూ గాజులు కొనుక్కోవాలి. గోరాయన కొట్టు దగ్గరకే వస్తాను. కానీ నువ్వు నాకో సాయం చేయాలి” అడిగింది కమలని, వెంకటలక్ష్మి.


“ఏం చేయాలి?” నవ్వుతూ అడిగింది కమల.


“వచ్చేటప్పుడు రెడ్డి గారి కొట్టు దగ్గర, నాకో రేడియో కొని పెట్టాలి.. నీ రేడియో లాగే ఝాం అని మోగుతూ ఉండాలి. మా ఆయన దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి నా రేడియో చూసి ఆశ్చర్య పోవాలి”

కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చెప్పింది వెంకటలక్ష్మి. ఆమె మాటలకు, కమల నవ్వుకుంది. అలాగే అని తలూపింది కమల. అత్తగారితో ‘బయటకు వెళ్తున్నాను’ అని చెప్పి రోడ్డు మీదకు వచ్చింది కమల. ఉదయం పదిగంటల సమయం. మెయిన్ రోడ్డు జనంతో బిజీ గా ఉంది. ఆరోజు సోమవారం. శ్రావణ మాసం ఆదివారం ప్రారంభం అయ్యింది. సరుకులు కొనుక్కునే వారితో, బట్టలు కొనుక్కునే వారితో షాపులు అన్నీ కిట కిట లాడుతున్నాయి.


కమల బీళ్లవారి రామాలయం దాటి, కామాక్షి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చింది. లోపలకు వెళ్లి అమ్మవారికి దణ్ణం పెట్టుకుంది.


పూజారి సూరిబాబు “ఏం కమలా, పొద్దున్నే బయలుదేరావు? షాపింగ్ కా” అన్నాడు.

“అవునండి. రేపు శ్రావణ మంగళ వారం కదండీ, గాజులు, పువ్వులు, పళ్ళూ కొనుక్కోవాలి. వస్తానండి” అని చెప్పి బయటకు వచ్చి నాలుగు అడుగులు వేసి లింగాల వీధిలోకి తిరిగింది.


వెంకట రెడ్డి గారి ఇంట్లోనే ఉంది పెద్ద పోస్ట్ ఆఫీస్. చిన్న పోస్ట్ ఆఫీస్ చెరుకువాడ లో ఉంది.

రెండు నిముషాలలో పోస్ట్ ఆఫీస్ కి చేరుకుంది కమల. సోమవారం అవడం వలన పోస్ట్ ఆఫీస్ కూడా చాలా రష్ గా ఉంది. రాత్రి అక్కకు రాసిన ఉత్తరం పోస్ట్ డబ్బాలో వేసి పోస్ట్ మన్ కోసం చూసింది. అప్పుడే పోస్ట్ మన్ వేర్రియ్య లోపల నుండి వచ్చి, ఉత్తరాల కట్టలని, సైకిల్ వెనక ఉన్న కేరేజీ కి పెట్టుకున్నాడు. కమల గబ గబా వేర్రియ్య దగ్గరకు వెళ్లి ‘అన్నా నాకు ఏవైనా ఉత్తరాలు ఉన్నాయా?’ అని అడిగింది.


వేర్రియ్య చేతిలో ఉన్న మరో ఉత్తరాల కట్ట వెతికి కమల కి, ఓ పోస్ట్ కార్డు చేతిలో పెట్టాడు. అది చూడగానే కమల మొహం వికసించింది. కమల మేనత్త రమణమ్మ అమలాపురం నుండి రాసిన ఉత్తరం. అందరం బాగానే ఉన్నామని, వీలు చూసుకుని పిల్లలతో ఒకసారి అమలాపురం వచ్చి వెళ్ళమని రాసింది.


ఉత్తరం చదివేసి చేతిలోని చిన్న సంచీలో పెట్టుకుంది. కమల తల్లి చిన్నప్పుడే చనిపోతే, రమణమ్మే కమలని పెంచి పెద్ద చేసింది అందుకే మేనత్త అంటే కమలకి చాలా ఇష్టం, ప్రేమ. ఇంటికి వచ్చిన ఉత్తరాల్ని అత్తగారు ముందు చదివి, ఆ తర్వాత కమలకి ఇస్తుంది. ఏమైనా అంటే ఆవిడ పెద్ద గొడవ చేస్తుంది. అందుకే మౌనంగా ఉంటుంది కమల. ఇలా బయటకు వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్ కి వచ్చి తన ఉత్తరాలు ఉంటె, తనే తీసుకుంటుంది.


కమల ‘గోరాయన’ కొట్టు దగ్గరకు వెళ్లేసరికి చాలా రష్ గా ఉంది. ఆడవాళ్ళకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఆ కొట్టు దగ్గర ఉంటాయి. అది లక్ష్మణ రావు షాపు. అతని ఎడమ చేతి చిటికెన వేలుసి ఎప్పుడూ చాలా పొడవైన గోరు ఉంటుంది. ఆడవాళ్ళకు గాజులు ఇచ్చేటప్పుడు, గాజుల్ని టెస్ట్ చేసి ఇచ్చేవాడు లక్ష్మణ రావు. అప్పుడు అతని గోరు చూసి చాలా మంది ఆశ్చర్య పోయే వారు. ’ ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాడు ఆ గోరుని’ అని.


గాజుల్లో ‘ ఓటివి ‘ చూసి వాటిని తీసేసి మంచి గాజులు ఇస్తాడు. చాలా క్వాలిటీ ఉన్న వస్తువులే అమ్మడం కాకుండా, అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు లక్ష్మణ రావు. మెయిన్ రోడ్ లో పీర్ల పంజా కి వెళ్ళే మలుపులో ఉంది అతని షాపు. గాజులు, రిబ్బన్లు, బొట్టు బిళ్ళలు, తిలకాలు, కాటిక డబ్బాలు, చీరల ఫాల్స్ అన్నీ ఉంటాయి. వీటితో పాటు రోల్డ్ గోల్డ్ గొలుసులు, దుద్దులు, గాజులు కూడా ఉంటాయి.


కమల షాపు అరుగు మీద ఉన్న బల్ల మీద కూర్చుని ఉంది. కాసేపటికి ఆయాసపడుతూ వెంకట లక్ష్మి వచ్చింది. అప్పటికి జనం తగ్గారు. ఇద్దరు మాత్రమె ఉన్నారు. కమల, వెంకట లక్ష్మి తమకు కావాల్సిన రంగు రంగుల గాజులు కొనుక్కున్నారు. వారి పక్కనే ఇద్దరు ఆడపిల్లలు లేటెస్ట్ బొట్టు బిళ్ళలు కొనుక్కుంటున్నారు. ఈలోగా ఒక కుర్రాడు సైకిల్ మీద వచ్చి, సైకిల్ స్టాండ్ వేసి అరుగు మెడకు వచ్చాడు.


లక్ష్మణ రావు ఆ కుర్రాడిని ‘ఏం కావాలని?”అడిగాడు. మగ పిల్లలు ఎవైరైనా వస్తే వాళ్ళని వెంటనే పంపించేస్తాడు లక్ష్మణ రావు. లేదంటే వాళ్ళు అలా ఆడవాళ్ళని చూస్తూ నిలబడి పోతారని అతనికి అనుభవం.


“రెడ్ కలర్ కటింగ్ గాజులు కావాలి”అన్నాడు ఆ కుర్రాడు.


“సరే, గాజు సైజు తెచ్చావా, ఇలా ఇయ్యి”అన్నాడు లక్ష్మణ రావు. ఆ కుర్రాడు ఫాంట్ జేబులు చూసాడు, చొక్కా జేబు చూసాడు. ఉహూ.. ఏమీ కనపడ లేదు. కంగారుగా మళ్ళీ జేబులన్నీ వెతికాడు.

అయిన గాజు కనపడలేదు. ‘ఎక్కడో పడిపోయిందండి’ అన్నాడు బిక్క మొహం వేసి. కాలేజీ లో చదివే కుర్రాడిలా ఉన్నా, మొహం లో ఇంకా అమాయకత్వం వదలలేదు.


‘సైజు గాజు లేక పొతే కష్టం. ఇంటికి వెళ్లి పట్టుకురా” అన్నాడు లక్ష్మణ రావు.


ఆ మాట వినగానే ఆ కుర్రాడిలో మళ్ళీ కంగారు వచ్చింది. “మాది ఈ ఊరు కాదండి. ‘దేవ‘ అండి. మళ్ళీ అంత దూరం సైకిల్ మీద వెళ్లి రావాలి. మా అక్క సన్నగానే ఉంటుందండి. సన్నగా ఉండేవాళ్లకు సరిపడే గాజులు ఇవ్వండి” అన్నాడు ఆ కుర్రాడు. అతని మాటలకి నవ్వాడు లక్ష్మణ రావు.


“మనుషులు, లావూ, సన్నం కాదయ్యా. చెయ్యి ఎలా వుందో చూసి ఆ చేతికి సరిపడే గాజులు ఇవ్వాలి. ఎదో ఒకటి ఇచ్చాననుకో, లూజు అయ్యాయనో, బిగుతు అయ్యాయనో, వాటిని వెనక్కి పట్టుకు వస్తారు. మాకు టైం వేస్ట్. అందుకని ఇంటికి వెళ్లి ‘ఆది’ గాజు పట్టుకు రా. ఇస్తాను” అన్నాడు లక్ష్మణ రావు.


అప్పుడు చూసాడు ఆ కుర్రాడు బొట్టు బిళ్ళలు చూస్తున్న ఇద్దరు ఆడపిల్లల్ని. అందులో ఒక అమ్మాయి కేసి చూపిస్తూ, “మా అక్క ఈవిడ లాగే సన్నంగా ఉంటుందండి. ఆవిడ సైజు చూసి, రెడ్ కలర్ కట్టింగ్ గాజులు రెండు డజన్లు ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్లి గాజు పడేసానంటే, మా అక్క తిడుతుందండి” అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అతని అవస్థ చూసి లక్ష్మణ రావు కి జాలేసింది.

తెల్లగా, సన్నగా మెరుపుతీగలా ఉన్న ఆ అమ్మాయిని ‘“నీ గాజు ఓ సారి తీసి ఇయ్యి పాపా” అని అన్నాడు లక్ష్మణ రావు.


వాళ్ళ ఇద్దరి సంభాషణ విన్న ఆ అమ్మాయి తన కుడి చేతికి ఉన్న బంగారు గాజు తీసి లక్ష్మణ రావు కి ఇచ్చింది. లక్ష్మణ్ రావు గాజుల పెట్టి లోంచి రెడ్ కలర్ గాజులు తీసి టెస్ట్ చేసి, రెండు డజన్లు ఒక అట్ట పెట్టెలో పెట్టి, పెట్టిని దారంతో గట్టిగా కట్టి ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఈ రెండునిముషాలలో ఆ అమ్మాయిని పరిశీలనగా చూసాడు ఆ కుర్రాడు. బాపు బొమ్మలా ఉంది అని అబ్బురపడ్డాడు. తర్వాత లక్ష్మణ రావు కి డబ్బులు ఇచ్చి, ఆ అమ్మాయి కేసి తిరిగి “థాంక్స్ అండి” అని సైకిల్ ఎక్కి వెళ్లి పోయాడు.


ఆ కుర్రాడు వెళ్లిపోయాక “ఈ రోజుల్లో కుర్రాళ్ళకి జాగ్రత్త తక్కువ, ప్రతీదీ పడేస్తారు” అంది కమల. ఆమె మాటలకి గాజు ఇచ్చిన అమ్మాయి ‘కిసుక్కున’ నవ్వింది. ఆ అమ్మాయిని చూసిన వెంకట లక్ష్మి తను కూడా నవ్వింది. ఒక పావు గంటలో తమకు కావాల్సిన గాజులు, బొట్టు బిళ్ళలు, కాటుక డబ్బాలు కొనుక్కున్నారు కమల, వెంకట లక్ష్మి. డబ్బులు ఇచ్చేసి వెనక్కి తిరిగి, రెడ్డి గారి రేడియో కొట్టు దగ్గరకు వచ్చారు ఇద్దరూ.


శివపురం గ్రామ కచేరీ ఎదురుగానే ఉంది సూర్యనారాయణ రెడ్డి గారి రేడియో షాపు. ఆరడుగుల ఎత్తు, ఫాంట్, హాఫ్ హ్యాండ్ షర్టు తో ఎప్పుడూ తన పక్క వారికి ఏదో విషయం బోధిస్తూనే ఉంటారు రెడ్డి గారు. ఆయన ఫిలిప్స్, మర్ఫీ రేడియో లకు డీలర్. సౌండ్ ఇంజనీర్ కూడా. శివపురం, మార్టేరు, పాలకొల్లు లలోని సినిమా ధియేటర్లకు ‘సౌండ్’ సమస్యలు వస్తే రెడ్డి గారు వెళ్లి వాటిని సరిచేసి వస్తారు.


ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. రెండు సంవత్సరాల క్రితం కమల, రెడ్డి గారి షాపు లోనే ‘ఫిలిప్స్’ ట్రాన్సిస్టర్ కొంది. చాలా చక్కగా పనిచేస్తోంది. అందుకే వెంకటలక్ష్మి అటువంటి రేడియో యే, కావాలని పట్టుబడుతోంది.


ఇద్దరూ మెట్లు ఎక్కి షాపు లోపలకు వచ్చారు. “నమస్కారం రెడ్డి గారూ, ఈవిడకి ట్రాన్సిస్టర్ కావాలంట. నాకు ఫిలిప్స్ కంపెనీ ది, ఇచ్చారు. అటువంటిదే కావాలంటోంది” అంది కమల. రెడ్డి గారు ఇద్దర్నీ కూర్చోమని చెప్పి, షో కేసు లోంచి కమల కిచ్చిన ట్రాన్సిస్టర్ లాంటిదే తీసి ఆన్ చేసి చూపించారు. ఆ సౌండ్ కి వెంకటలక్ష్మి మొహం విప్పారింది. ‘అబ్బ ఎంత బాగుందో కదా’ అని సంబర పడింది.


“రెడ్డి గారూ, ఇదే ఇవ్వండి” అని ఆనందంగా చెప్పింది వెంకటలక్ష్మి. రెడ్డి గారు చిరునవ్వు నవ్వి ‘అలాగే అమ్మా’ అని పాలీష్ క్లాత్ తో ట్రాన్సిస్టర్ ఓ సారి తుడిచి, అట్ట పెట్టిలో పెట్టి, బిల్ రాసి ఇచ్చారు.


వెంకటలక్ష్మి డబ్బులు తీసి ఇచ్చింది. ఇద్దరకీ రంగు రంగులలో ప్రకృతి దృశ్యాలు ఉన్న రెండు కేలండర్లు, రెండు పెన్నులు ఇచ్చారు రెడ్డి గారు. “ఎప్పుడూ, ఎదో ఒకటి ఎక్సట్రా ఇస్తారు రెడ్డి గారు” అని నవ్వుతూ అంది కమల. ఇద్దరూ షాపు దిగి, పక్కనే ఉన్న ఎస్. వి. రెడ్డి గారి సోడా షాపు లో నిమ్మ సోడా తాగి ఇంటికి వెళ్ళారు.


శివపురం నుండి స్పీడా గా సైకిల్ మీద వచ్చిన కుర్రాడు, ఇంటికి రాగానే అక్క కోసం చూసాడు. ఆమె తల్లితో వంటింట్లో మాట్లాడటం వినిపించింది. గది లోకి వెళ్లి, తెల్ల కాగితం తీసుకుని, అట్టపెట్టి లోంచి ఒక గాజు తీసుకుని, పెన్నుతో దాని సైజు తెల్ల కాగితం మీద గీసుకుని, దాన్ని భద్రంగా కాలేజీ పుస్తకం లో దాచాడు. తర్వాత అక్క గారి దగ్గరకు వెళ్లి గాజులు ఇచ్చాడు.


“చందూ, గోరాయన కొట్టులోనే తెచ్చావా?” అని అడిగింది అక్క గారు.


“‘ఆ. ఆయన కొట్టులోనే తెచ్చాను. చాలా మంది ఉన్నారే బాబూ” అన్నాడు చంద్ర శేఖర్.


“అవును మరి, ఆయన నమ్మకంగా ఇస్తాడు కాబట్టి, ఎక్కువ మంది ఆయన దగ్గరే కొంటారు. ఆయన గోరు చూసావా? ఎంత పొడుగు ఉంటుందో?” కళ్ళు పెద్దవి చేసి అడిగింది అక్క.


“ఆ. చూసాను. గోరు చాలా పొడుగు ఉంది. ఎలా కాపాడుకుంటున్నాడో” అని తన గదిలోకి వెళ్ళిపోయాడు.


గోరాయన, చేతి గోరు కంటే, గాజు ఆది ఇచ్చిన అమ్మాయి నాజూకైన చేయి, ఆ చేతి గోళ్ళ కున్న అందమైన గోరింటాకు ఎర్రటి అందం, చంద్ర శేఖర్ మనస్సులో బాగా నాటుకుపోయింది.


‘బంగారు రంగు తో మెరిసిపోతూ ఎంత అందంగా ఉంది?’ అని వందో సారి అనుకున్నాడు. శివపురం నుండి ‘దేవా’ వస్తూ ఆమె అందాన్ని, పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాడు.


చంద్ర శేఖర్ శివపురం డిగ్రీ కాలేజీ లో బి. ఎస్. సి. ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయిల విషయం లో చాలా దూరంగా ఉంటాడు. అతని మిత్రులు అందరూ అతన్ని ‘ముద్ద పప్పు’ అని అంటారు.


అయినా బాధపడడు. చదువే అతని ధ్యేయం. ఎం. ఎస్. సి. చేసి లెక్చరర్ గా స్థిరపడాలని అనుకుంటున్నాడు.


ఇప్పుడు అతని మనస్సు బాగా డిస్ట్రబ్ అయ్యింది. మర్నాడు కాలేజీ కి వెళ్ళినప్పుడు, తన క్లాసు లోని అమ్మాయిల్ని, పరీక్షగా చూసాడు. ‘ఊహూ ‘ వీళ్ళెవరూ ఆ అమ్మాయికి సరిపోరని గ్రహించాడు.

రెండు రోజులు పోయాక అకస్మాత్తుగా గాజుల కొట్లో కనిపించిన అమ్మాయి, బి. ఎస్. సి. ఫస్ట్ ఇయర్ క్లాసు లోంచి వస్తూ కనిపించింది. చంద్రశేఖర్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ అమ్మాయిని అనుసరిస్తూ గాంధీ బొమ్మల సెంటర్ వరకూ వచ్చాడు. సైకిల్ దిగి, చక్రాలలో గాలి ఉందొ లేదో అన్నట్టు ఒకసారి చూసాడు.


ఆ అమ్మాయి శివాలయం వీధి లోకి తిరిగి ఒక మేడ లోకి వెళ్ళడం చూసాడు. వినాయక స్వీట్ షాపు లోకి వెళ్లి ఒక స్వీట్ కొనుక్కుని తిన్నాడు. అతని మనస్సు చాలా హాయిగా ఉంది.

========================================================================

ఇంకా వుంది...

========================================================================

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.




Comments


bottom of page