'Gajulu Chesina Pelli Part 2/2' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
'గాజులు చేసిన పెళ్లి - పార్ట్ 2/2' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
బుద్ధిమంతుడైన కాలేజీ కుర్రాడు చంద్రశేఖర్.
అనుకోకుండా ఒక గాజుల కొట్లో అందమైన అమ్మాయిని చూసి మనసుపడతాడు. ఆ అమ్మాయి తాను చదివే కాలేజిలోనే చదువుతున్నట్లు తెలుసుకుంటాడు.
ఇక గాజులు చేసిన పెళ్లి పెద్దకథ చివరి భాగం చదవండి.
సాయంత్రం బి. ఎస్. సి. ఫస్ట్ ఇయర్ చదువుతున్న తమ ఊరి కుర్రాడు కిరణ్ ఇంటికి వెళ్లి, వాడిని బయటకు తీసుకువచ్చి ఆ అమ్మాయి గురించి చెప్పి, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోమని రిక్వెస్ట్ చేసాడు. కిరణ్ చిన్న నవ్వు నవ్వి, ‘మరి దీనికి కొంచం ఖర్చు అవుతుంది’ అన్నాడు, ముత్యాల ముగ్గు లో రావు గోపాలరావు లా. ‘సరే’ అని ఓ ఏభై నోటు వాడి కిచ్చాడు చంద్ర శేఖర్. రెండు రోజుల తర్వాత ‘దేవ’ శివాలయం లో కలుసుకున్నారు శేఖర్, కిరణ్.
“ఆ అమ్మాయి పేరు చంద్ర లేఖ. బ్యాంకు మేనేజర్ గారి అమ్మాయి. ఈ సంవత్సరమే శివపురం వచ్చారు. ఆ అమ్మాయి కి ఒక అన్నగారు ఉన్నాడు. తణుకు లో ‘పాల టెక్నిక్ కాలేజీ లో‘ చదువుతున్నాడు. కరాటే మాస్టారు. అది గుర్తు పెట్టుకో’ అన్నాడు కిరణ్ చేయి చాపుతూ. శేఖర్ ఇంకో ఏభై ఇచ్చాడు కిరణ్ కి.
ఒక శుక్రవారం నాడు కాలేజీ అయ్యాకా చంద్రలేఖ ని ఫాలో అయ్యాడు చంద్రశేఖర్. ఆమె కన్యకాపరమేశ్వరి గుడిలోకి వెళ్ళింది. సైకిల్ గోపురం దగ్గర పెట్టి లోపలకు వెళ్ళాడు. ఐదు నిముషాలకు చంద్రలేఖ బయటకు వచ్చి కళ్యాణ మండపం మెట్ల మీద కూర్చుంది. పడమరన ఉన్న చిన్న గాలి గోపురం శిఖరం పైనుండి సూర్య కిరణాలు ఆమె మొహం పై పడి, ఆమె మొహం మరింత కాంతివంతంగా ఉంది. నెమ్మదిగా నడిచి ఆమె ముందు నిలబడ్డాడు.
ఆమె తలెత్తగానే, హాయ్’ అన్నాడు. ఆమె ప్రశ్నార్ధకంగా చూసింది.
“మొన్న ‘గోరాయన’ కొట్టు దగ్గర మీ గాజు ఆది ఇచ్చారు కదండీ. నాకు చాలా మేలు చేసారు. థాంక్స్” అన్నాడు.
చంద్రలేఖకి ఆరోజు సంఘటన గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వింది. ముగ్ధ మనోహరమైన ఆ నవ్వు చూసి మరోసారి మనసు పారేసుకున్నాడు చంద్ర శేఖర్.
‘నా పేరు చంద్ర శేఖర్. మన కాలేజీ లోనే బి. ఎస్. సి. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను’ ఆమె మొహం కేసే చూస్తూ చెప్పాడు. ఈలోగా ఆమె ఫ్రెండ్ రమణి పిలవడంతో చంద్రలేఖ ఆమెతో కలిసి వెళ్ళిపోయింది. ఆమె స్నేహితురాలిని చాలాసేపు తిట్టుకున్నాడు చంద్రశేఖర్. మరి కొద్దిసేపు ఆమెతో మాట్లాడే అవకాశం పోయింది కదా, అని.
ఇంటికి వెళ్ళాకా ఆమె రూపాన్నే గాఢంగా తలుచుకున్నాడు. మర్నాడు కిరణ్ ద్వారా తెలుసుకున్నాడు, ప్రతి శుక్రవారం చంద్రలేఖ గుడికి వస్తుందని. తర్వాత శుక్రవారం ఆమె కంటే ముందుగా గుడికి వెళ్లి కళ్యాణ మండపం దగ్గర ఎదురు చూస్తున్నాడు. చంద్రలేఖ గుడిలోకి వెళ్లి వచ్చి మండపం మెట్ల మీద కూర్చుంది.
చంద్రశేఖర్ ఆమె దగ్గరకు వెళ్లి ‘హాయ్’ అన్నాడు. ఆమె కూడా ‘హాయ్’ అంది. వెంటనే తన పుస్తకాల బాగ్ లోంచి ఓ పేపర్ తీసి ఆమెకిచ్చాడు. అది చూసి చంద్రలేఖ ఆశ్చర్య పోయింది.
గత వారం తను కళ్యాణ మండపం మెట్లమీద కూర్చున్న చిత్రం అది. రంగుల్లో చాలా బాగా వచ్చింది. మళ్ళీ మళ్ళీ చూసి ఆనందపడింది. “థాంక్స్” అంది శేఖర్ కేసి తిరిగి.
సంతోషంతో వెలిగి పోతున్న ఆమె మొహం కేసే చూస్తూ ‘నో మెన్షన్’ అన్నాడు. ఐదు నిముషాలు మాట్లాడుకున్నాక, చంద్రలేఖ అతను ఇచ్చిన పేపర్ ని తన పుస్తకాలలో పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె గుడి ప్రహరీ గోడ దాటి వెళ్తూ, వెనక్కి తిరిగి, చిన్నగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది. అది చూసి శేఖర్ మనసు, ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన పిల్లాడి లా సంతోషంతో ఉప్పొంగి పోయింది.
అప్పుడప్పుడు గుడి కళ్యాణ మండపం దగ్గర కలుసుకోవడం, తను కొత్తగా వేసిన పెయింటింగ్స్ ఆమెకి ‘కానుక’ గా ఇవ్వడం చేసాడు శేఖర్. రెండు నెలలు గడిచాయి. ఒక రోజు సైకిల్ మీద ఇంటికి వెడుతున్న చంద్ర శేఖర్ ని, ఒక కుర్రాడు రోడ్డు కి అడ్డంగా వచ్చి ఆపాడు. ఇద్దరూ సైకిళ్ళు దిగారు.
ఆ కుర్రాడు శేఖర్ షర్టు కాలర్ పట్టుకుని, రెండు చెంపలూ వాయించేసాడు. ‘మళ్ళీ మా చెల్లాయితో మాట్లాడావా, ప్రాణం తీస్తా. జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్ధం అయ్యింది అతను చంద్రలేఖ అన్నయ్య అని.
నెమ్మదిగా సైకిల్ తొక్కుకుని ఇంటికి వచ్చాడు శేఖర్. తన ప్రేమకి మొదటిలోనే ఇలా అవాంతరం వచ్చిందేమిటా? అని మధనపడ్డాడు. ఆ రాత్రి భోజనం చెయ్యలేదు.
మర్నాడు కాలేజీ కి వెళ్ళాడు శేఖర్. ఆరోజు శుక్రవారం. చంద్రలేఖని కలుద్దామని ఉన్నా, ఆమె అన్నయ్య గుర్తుకు వచ్చి ఆ ఆలోచన విరమించుకున్నాడు. గుడి దగ్గర మరోసారి ఘర్షణ పడితే, సివపురమే కాదు, తమ ఊళ్ళో కూడా ఈ విషయం తెలుస్తుంది, చాలా అల్లరి అవుతుంది. రోజులు గడుస్తున్నాయి. పరీక్షలు దగ్గర పడటంతో, చంద్రలేఖ గురించి ఆలోచిండం తగ్గించి, చదువు మీద దృష్టి పెట్టాడు శేఖర్.
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయ్యాయి. పీ. జీ. ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టాడు శేఖర్. కాలం వేగం గా పరుగెడుతోంది. శేఖర్ బి. ఎస్. సి. ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాడు. ఎంట్రన్స్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. ఎంఎస్సి. లో జాయిన్ అవడానికి వైజాగ్ లో మంచి కాలేజీ లో సీట్ వచ్చింది. వెంటనే వైజాగ్ వెళ్లి ఎం. ఎస్. సి. లో జాయిన్ అయ్యాడు. అప్పుడప్పుడు చంద్రలేఖ గుర్తుకు వచ్చినా మనసు సమాధాన పరచుకుని చదువు మీదే దృష్టి పెట్టాడు.
రెండేళ్ళు గిర్రున తిరిగాయి. శేఖర్ ఎం. ఎస్. సి. లో గోల్డ్ మెడల్ సాధించాడు. శేఖర్ తల్లీ, తండ్రీ కూడా చాలా సంతోషించారు. పీహెచ్. డి. చెయ్యాలని ఉన్నా తండ్రికి బర్డెన్ కాకూడదని నిర్ణయించుకున్నాడు. తను వెంటనే ఉద్యోగం చూసుకుంటే, తమకి ఉన్న ఐదు ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో తల్లీ తండ్రీ సుఖంగా బతుకుతారని ఆశించాడు. వైజాగ్ లోని ఓ ప్రైవేటు కాలేజీ లో లెక్చరర్ గా జాయిన్ అయ్య్యాడు శేఖర్. అప్పుడు అడిగాడు కిరణ్ ని, ‘చంద్రలేఖ ఏం చేస్తోందని?’.
డిగ్రీ పరీక్షలు అయ్యేసరికి, చంద్రలేఖ వాళ్ళ నాన్న గారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యిందని, అందరూ విజయవాడ వెళ్లిపోయారని చెప్పాడు. చంద్రలేఖ పాస్ సర్టిఫికేట్, టి. సి. వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకువెళ్ళాడని కూడా చెప్పాడు. చంద్రలేఖ ఊళ్ళో లేదని తెలిసాకా అతని మనసు బాధగా మూలిగింది.
తను ఉద్యోగస్తుడు అయ్యాకే, ఆమెకి కనిపించాలని అనుకున్నాడు. కిరణ్ ఇంకో విషయం చెప్పాడు, ‘నీకు గోల్డ్ మెడల్ వచ్చిన సంగతి, చంద్రలేఖ ఫ్రెండ్ రమణి కి చెప్పానని, ఆ విషయం ఆమె చంద్రలేఖకి చెప్పిందని చంద్రలేఖ చాల సంతోషించిందని, రమణి తనకు చెప్పిందని కూడా చెప్పాడు.
కిరణ్ లో మెచ్యూరిటే వచ్చింది, చిన్న తనం చేష్టలు పోయాయి. కిరణ్ కి ‘థాంక్స్’ చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు శేఖర్.
ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేసుకో అని, తల్లీ తండ్రీ పట్టుబట్టారు. కొద్ది కాలం ఆగమని చెప్పాడు శేఖర్. రెండేళ్ళ కాలం యిట్టె గడిచిపోయింది. శేఖర్ కి అతను పనిచేస్తున్న కాలేజీ లో మంచి పేరు వచ్చింది.
యాజమాన్యం నెలకు ఏభై వేలు జీతం ఇస్తున్నారు. దసరా సెలవులకు దేవా వచ్చాడు శేఖర్. శివపురం లో స్నేహితుల్ని కలుద్దామని, స్కూటర్ మీద శివపురం వచ్చాడు. ‘గోరాయన కొట్టు’ కేసి యదాలాపంగా చూసిన శేఖర్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు.
కొట్టు అరుగు మీద చంద్రలేఖ, రమణి మాట్లాడుకుంటూ కనిపించారు. వెంటనే స్కూటర్ పక్కకు ఆపి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు శేఖర్. వయసు తెచ్చిన అందంతో, చంద్రలేఖ మెరిసిపోతోంది.
“హలో చంద్రలేఖా” అన్నాడు శేఖర్. మాటలు ఆపి అతని కేసి చూసి కళ్ళు పెద్దవి చేసి చిన్నగా నవ్వి, ‘శేఖర్ బాగున్నావా?’ అని అడిగింది చంద్రలేఖ.
‘బాగున్నాను’ అన్నట్టు తలూపాడు శేఖర్. అతన్ని పరిశీలనగా చూసింది చంద్రలేఖ. పొడగరి అయిన శేఖర్, ఇన్ షర్టు చేసుకుని చాలా హుందాగా ఉన్నాడు. రమణి, చంద్రలేఖ అరుగు దిగి కిందకు వచ్చారు. ‘నువ్వు గోల్డ్ మెడల్ సాధించావని రమణి చెప్పింది. కంగ్రాట్స్ ‘ అని కుడిచేయి ముందుకు చాపింది చంద్రలేఖ. శేఖర్ కూడా తన చేయి కలిపీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతని మనసు ఒక మధురానుభూతికి లోనయ్యింది. రోడ్డు కి అవతల వైపు ఉన్న ఐస్ క్రీం పార్లర్ శేఖర్ కంట పడింది.
‘ఏదైనా డ్రింక్ తీసుకుందామా?’ నవ్వుతూ అడిగాడు శేఖర్. ‘అలాగే’ అంది చంద్రలేఖ. ముగ్గురూ ఐస్ క్రీం పార్లర్ లోకి వెళ్లి కూర్చున్నారు.
మూడు కూల్ డ్రింకులు తనే తెచ్చాడు శేఖర్. ముగ్గురూ డ్రింకులు తాగుతుండగా “నువ్వు ఏం చేస్తున్నావు?” ఆరాధనగా చంద్రలేఖ కేసి చూస్తూ అడిగాడు శేఖర్.
‘నాది పీ. జి. అయ్యింది. జాబు కోసం చూస్తున్నాను. నువ్వు?”అడిగింది ఆమె. ‘వైజాగ్’ లో లెక్చరర్ గా చేస్తున్నాను. నువ్వు వస్తానంటే చెప్పు. మా కాలేజీ లో జాబు చూస్తాను’ నవ్వుతూ అన్నాడు శేఖర్.
అతని మాటలకి చిన్నగా నవ్వింది చంద్రలేఖ. ‘మా ఇంట్లో వాళ్ళని అడగాలి. అవునూ, నువ్వు బొమ్మలు వేస్తున్నావా?’ ఆసక్తిగా అడిగింది. ఆమె ప్రశ్నకి దీర్ఘంగా నిట్టూర్చాడు శేఖర్.
“కొద్ది కాలం గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కనిపించావుగా. మళ్ళీ ప్రారంభిస్తాను” అన్నాడు శేఖర్.
“ఇదిగో ఇలా కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా మాత్రం వెయ్యకు” అంది చంద్రలేఖ గట్టిగా నవ్వుతూ. ముగ్గురూ మనసారా నవ్వుకున్నారు ఆమె మాటలకి. ‘నువ్వేమిటి, ఇలా వచావు?’ అడిగాడు శేఖర్.
“మా ఫ్రెండ్ సుప్రజ కి నిశ్చితార్ధం ఈరోజు ఉదయం జరిగింది. అందుకని వచ్చాను. సాయంత్రం బస్సు కి విజయవాడ వెళ్ళిపోతాను” అంది చంద్రలేఖ. ఆమె అడ్రస్ అడిగి, ఫోన్ లో రికార్డు చేసుకున్నాడు శేఖర్.
ఒక పావుగంట అయ్యాకా ముగ్గురూ బయటకు వచ్చారు. శేఖర్ వాళ్లకి వీడ్కోలు పలికి, స్కూటర్ ఎక్కి తన ఫ్రెండ్ హరనాద్ ఇంటికి వెళ్ళాడు.
విజయ దశమి రోజు ఉదయమే డోర్ బెల్ మోగడంతో, తలుపు తీసిన చంద్రలేఖ, శేఖర్ ని, ఫిజిక్స్ హెడ్ నరసింహాచారి గారిని చూసి ఆశ్చర్యపోయింది.
“నమస్కారం మాస్టారూ” ఆయనకీ దణ్ణం పెట్టి లోపలకు ఆహ్వానించింది ఇద్దరినీ. హాలులో కూర్చున్న తండ్రికి పరిచయం చేసింది వారిని ‘మా ఫిజిక్స్ హెడ్ ఆచారి గారు, నాకు సీనియర్ చంద్రశేఖర్’ అని. కుశల ప్రశ్నలు అయ్యాకా ఆచారి గారు మాట్లాడారు.
“చూడండి సార్, ఇతను చంద్రశేఖర్. నా స్టూడెంట్. ఎంఎస్. సి. లో గోల్డ్ మెడల్ సాధించాడు. వైజాగ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. మీరూ మీ అమ్మాయిని కనుక్కుంటే మనం ముందుకు వెళ్ళవచ్చు” అన్నారు సూటిగా ఆచారి గారు.
చంద్రలేఖ తండ్రి శాంతారాం గారికి విషయం అర్ధమయ్యింది. పక్కనే ఉన్న కూతురి కేసి తిరిగి ‘నీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగారు. ఆమె అంగీకారం అన్నట్టుగా తలూపింది. అది చూసి ఆచారి గారు ‘శుభం’ అని అన్నారు. ఆ తర్వాత, దేవ నుండి శేఖర్ తల్లి తండ్రులు విజయవాడ వచ్చి చంద్రలేఖని చూడడం, మరుసటి నెలలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం వేగంగా జరిగిపోయాయి.
బుధవారం ఉదయం పది గంటల సమయం. ‘గోరాయన కొట్టు’ చాలా రష్ గా ఉంది. ‘నమస్కారం సార్ ‘ అన్న పిలుపుకి తల తిప్పి చూసాడు లక్ష్మణ రావు. ఎదురుగా పొడుగ్గా ఉన్న అతన్ని చూసి ఎవరా? అని ఆలోచించాడు. వెంటనే గుర్తుకు వచ్చింది. ‘నువ్వు మీ అక్క గాజులు తెమ్మంటే, ఆది గాజు పడేసి, ఇంకోళ్ళ ఆది తీసుకుని, గాజులు పట్టుకేల్లావు కదా” అడిగాడు లక్ష్మణ రావు.
“అవును సార్, ఆ ఆది గాజే మా పెళ్లి చేస్తోంది” అని నవ్వాడు శేఖర్. అతని వెనక నుండి నవ్వుతూ ముందుకు వచ్చింది చంద్రలేఖ.
‘నువ్వు బ్యాంకు మేనేజర్ గారి అమ్మాయివి కదా. మొన్నే వచ్చి వెళ్లావు కదా’ అన్నాడు నవ్వుతూ లక్ష్మణ రావు. ‘అవునండి’ అంది చంద్రలేఖ.
“మమ్మల్ని ఇద్దరినీ కలిపింది మీ కొట్టూ, మీరు ఇచ్చిన గాజులూ. అందుకే మీరు మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి” అని పెళ్లి శుభలేఖ లక్ష్మణ రావు కిచ్చాడు శేఖర్. శుభలేఖ తీసుకుని, “తప్పకుండా వస్తాను” అన్నాడు లక్ష్మణ రావు.
మిగతా స్నేహితులకి శుభలేఖలు ఇవ్వడానికి స్కూటర్ ఎక్కి ముందుకు సాగారు, చంద్రశేఖర్ చంద్రలేఖ.
=================================================================================
సమాప్తం
========================================================================
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments