top of page

గంగా గౌరి



'Ganga Gowri' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 21/04/2024

'గంగా గౌరి' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


రక్త సంబంధపు అనుబంధాలు ఎవ్వరికైనా చిన్ననాడు మధురాతి మధురాలు. యుక్తవయస్కులైన కొందరిలో స్వార్థ ద్వేషాలు ప్రబలుతాయి. కొందరు వున్న వారి విషయంలో ఆ తత్త్వం మరీ విపరీతం.. అదే పేదల గుడిసెల్లో ఆ మధురాను బంధాలు ఏ వయస్సునైనా చాలామందిలో ఒకేరీతిగా ఉంటాయి. కారణం వారంతా ఇంకా ఈ నవనాగరీకత మాయలో పూర్తిగా మునిగిపోలేదు. వారికి తెలిసిందల్లా కష్టం చేయడం.. కడుపు నింపుకోవడం.. ఒకరిపట్ల ఒకరు ఎంతో అభిమానంతో వుండటం. ఆ బంధాలన్నింటిలో అక్కాతమ్ముల అనుబంధం అనుభవిస్తేనే తెలిసేది!!.. 


అది మచిలీపట్నం ప్రాంతాన సముద్రపు ఒడ్డున వున్న ఒక చిన్న బెస్త పల్లె. సుమారు పాతిక ఇళ్ళు ఉంటాయి. అందరూ బీద మృత్యకారులే. ఎత్తైన ఇసుక దిబ్బమీద సముద్రానికి కిలోమీటరు దూరంలో వుంటుంది ఆ పల్లె. ఆ గూడెం నాయకుడు వీరన్న. అతని భార్య సావిత్రి. వారికి ఇద్దరు పిల్లలు. మొదటి కాన్పులో ఆడపిల్ల. పేరు గౌరి. రెండవ కాన్పులో మగబిడ్డ. పేరు గంగడు. 


ప్రపంచాన్ని కుతకుత ఉడికించిన కరోనా కారణంగా ఆ వ్యాధి సోకి తగిన చికిత్సకు నోచుకోని పార్వతి చనిపోయింది. వారం పదిరోజుల్లో మరో ఐదుగురు ఆ కారణంగానే చనిపోయారు. ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉన్నది తిని ప్రశాంతంగా బ్రతికే ఆ పేదల నిలయంలో కారుచీకట్లు కమ్ముకొన్నాయి. అందరికీ భయం. ఏ రోజు ఎవరు ఆ మహమ్మారి కరోనాకు బలైపోతారనే దిగులు.. 


అప్పటికి గౌరి వయస్సు పద్దెనిమిది. గంగడి వయస్సు పన్నెండు. తల్లిపోయిన నాటినుండి గౌరి తన తమ్ముడైన గంగణ్ణి తన ప్రాణ సమానంగా అభిమానించింది. తాను తినకుండా వాడి పొట్ట నింపేది. వాడు అడిగితే.. ’నేను తినే నీకు పెడుతుండరా!.. ’ అనేది. భార్యా వియోగంతో పదిరోజులు వీరన్న వేటకు సముద్రానికి వెళ్ళలేదు. చేతిలోని పైసలు అయిపోయాయి. వీరివద్ద చేపలను కొనే ఖాసిందాదాను కలిసికొని కొంత సొమ్మును అప్పు తెచ్చుకొని గంజినీళ్ళు త్రాగేవారు ఆ ముగ్గురు. భార్య వియోగంతో వీరన్న తాగడం ప్రారంభించాడు. 


వీరన్న బావమరిది కోటేసు. తనతోటే వేటకురాని వీరన్నను చూచి.. 

"బావా!.. ఎన్నాలిట్లా ఆకాశానికేసి సూస్తూ, నా చెల్లిని తలపోసుకుంటూ బతకతావే.. ! ఆ పిల్లల్ని చూడు. వాళ్లకి కూడు గుడ్డ ఎవరిస్తరే. ఒకటి రెండు రోజులైతే సరే. వారాలు, నెలలు తరబడి ఎవరు సాయం సెత్తారే!.. గతాన్ని మరిచిపోవాల. పిల్లల్ని గురించి ఆలోసించాల. వేటకు బయలుదేరాల. చేపలను పట్టాల. పైసలు సంపాదించాల. పిల్లని బాగా చూసుకోవాల. నా మాట ఇను. పద.. ఏటకి పోదాం" అని ఎంతో అభిమానంగా అనునయంగా చెప్పాడు కోటేసు.

 

గంగడు తన మేనమామ కోటేసు తన తండ్రి చెప్పిన మాటలన్నీ విన్నాడు. 


ఆ చిన్ని గుండెలో ఎన్నో ఆలోచనలు ’అయ్య అమ్మ పోయిన కాడినించి, మనిసి మనిసిగా లేడు. ఆయనకు ఎంతో బాధ. ఇన్నాళ్ళు సంసారాన్ని సంపాదించి ఈదినోడే కదా!.. ఆయన మనసు మారేదాకా ఏమి అనకూడదు. ఆయనకు బదులుగా మామతో కలిసి ఏటకి నేను పోతాను. చేపలను పడతాను. డబ్బు సంపాయిస్తాను. అయ్యా, అక్కను ప్రేమగా జాగర్తగా సూసుకొంటాను. అది నా దరమం. ’ అనుకొన్నాడు గంగడు.

 

తన మామ కోటేసుని కలిసి తన నిర్ణయాన్ని చెప్పాడు. కోటేసుకు ఒక కొడుకు రఘు. వాడికి తన నిర్ణయాన్ని చెప్పాడు గంగడు. ఇద్దరూ సమ్మతించారు. 


ఆ గూడెం మధ్యవుంది గంగమ్మ గుడి. ఆ గుడిఎళ్ళి ఆ తల్లి కుంకుమను నొసటను పెట్టుకొని, మొక్కి, వేడుకొని మామ, బావలతో స్టీమ్ బోట్ ఎక్కి సముద్రంలో ప్రవేశించాడు గంగడు. 

  *

కాలచక్రంలో సంవత్సరం జరిగిపోయింది. సముద్రంలో అలలకు ఎదురుగా ఎలా బోటును నడపాలో బాగా నేర్చుకొన్నాడు గంగన్న. సాగరంలో దిగి బాగా ఈతకొట్టడం కూడా నేర్చుకున్నాడు. వేటకు పోయి వచ్చాక చేపలను కోటేసు ఖాసిందాదాకు అమ్మేవాడు. అతను ఇచ్చిన పైకంలో ఐదవ వంతు గంగడికి ఇచ్చేవాడు. గంగడు ఆ డబ్బును తన అక్క గౌరి చేతికి ఇచ్చేవాడు. 


అది సంక్రాంతి సమయం.. గంగమ్మ గుడి దగ్గర అందరూ పొంగళ్ళు పొంగించి ఏటను బలి ఇచ్చి ఆనందంగా సంబరాలు జరుపుకొన్నారు. 


ఆ సందర్భంలో రఘు తన అక్క గౌరితో కలిసి ఆనందంగా మాట్లాడటం.. అతని మాటలకు గౌరి సంతోషంగా జవాబు చెప్పడం గంగడు చూచాడు. అతనికి విషయం అర్థం అయ్యింది. 

ఆ మరుసటి ఉదయాన.. 


"అక్కా!.. "

"ఏరా!.. "

"నేనో మాట అడుగుతా! నిజం చెప్పాలి!" అన్నాడు గంగడు. 

"అడుగు. నాకు తెలిసింది చెబుతా!"

"తప్పుగా అనుకోవుగా!"

"అనుకోనురా!"

"రఘు బావంటే నీకు ఇష్టమా అక్కా!"


గౌరి ఆశ్చర్యపోయింది. సిగ్గుతో నవ్వుతూ తలదించుకొంది. 

"సెప్పక్కా!"

"ఏం చెప్పల్రా!" నవ్వింది గౌరి. 

"ఆ.. నాకు అరదం అయిందిలే! నేను.. నీ లగ్గం రఘు బావతోనే జరిపిస్తా!.. " ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని నవ్వుతూ చేతిలో చెయ్యివేశాడు గంగడు. 


గౌరి చేయిని వెనక్కు తీసుకొని నవ్వుతూ గుడిసెలోనికి వెళ్ళిపోయింది. 

గంగడు గంగమ్మ గుడి దగ్గరకు వెళ్ళాడు. 

"తల్లీ!.. నా అక్క మనసు నీకు ఎరుకే. ఆమె కోరిక నెరవేరాల!.. మా బావ రఘుతో మా అక్క లగ్గం జరగాల. నీవు జరిపించాల. లగ్గానికి పైసలు కావాలిగా!.. నేను సంపాయిస్తా!.. తల్లీ ఒక బోటు కొనాలనుకుంటుండా. ఖాసిందాదాను అడగబోతుండా వారు నాకు బోటును కొనేదానికి డబ్బులు ఇచ్చేలా సెయ్యి తల్లీ. అంతా నీదే బారం. ఆ అయ్యకాడికి నేరుగా ఎలతుండా.. అమ్మా! అంతా నీదే భారం.. " మనసారా ప్రార్థించి గంగడు ఖాసిందాదా ఇంటివైపునకు నడిచాడు. మనస్సున గంగమ్మ నామాన్ని జపిస్తూ.. 

  *

"ఆఁ.. గంగా!.. "

"అయ్యా!.. "

"నీకు బోటు కావాలంటావ్?"

"అవును సామే! డబ్బు సంపాదించాల. అక్క లగ్గం గొప్పగా సెయ్యాలయ్యా! దయసూపండి. జీవితాంతం మీ మనిషిగా వుంటాను. అమ్మతోడు" దీనంగా చెప్పాడు గంగడు. 


నీ గురించి మీ మామ కోటేసు చాలా గొప్పగా చెప్పాడు. బోటును అలలకు ఎదురుగా నడపడంలో గాని, వలను విసరడంలో గాని.. వలను తిరిగి బోటు వైపుకు లాగడం గాని.. అన్నీ మెలుకువళను చాలా త్వరగా నేర్చుకొన్నావట" ఆనందంగా నవ్వుతూ చెప్పాడు ఖాసిందాదా. 

"అయ్యా!.. నాదేముంది అంతా గూడెం మద్దెలో వున్న మా గంగమ్మతల్లి దయ సామి. మమ్మల్నందర్ని కాచి కాపాడేది ఆ తల్లే కదా సామీ!" ఎంతో వినయంగా చెప్పాడు గంగడు. 

"గంగా!.. "

"సామీ!.. "


"ఎల్లుండి ఉదయానికల్లా స్టీమ్ బోట్ నీ ఇంటి ముందుంటుంది. అది నీది. కానీ నీవు చేపలను మాత్రం నాకే అమ్మాలి!.. సరేనా!.. "

"అట్టాగే సారు.. మాట తప్పను!"


ఆనంద పారవశ్యంతో గంగడు ఖాసిందాదా కాళ్ళు పట్టుకున్నాడు. ప్రీతిగా గంగడిని ఖాసిందాదా పైకిలేపి అతని కళ్ళల్లోని ఆనందాశ్రువులను తుడిచాడు. కుర్చీలో కూర్చోపెట్టాడు. వారి బేగం తెచ్చిన ఛాయ్ కప్పు గంగడికి అందించాడు. ఇరువురూ చాయ్ త్రాగారు. 

గంగడు ఆ తల్లి పాదాలను తాకి.. 

"అమ్మా! నన్ను దీవించమ్మా" ప్రీతిగా కోరాడు. 


"ఆ చల్లని తల్లి.. ’బెటె ఇజ్జత్ కేసాతో సౌసాల్ జీవో!’ హృదయపూర్వకంగా దీవించింది. పైకి లేచి ఇరువురికి నమస్కరించి గంగడు ఆనందంగా గూడెం వైపు వెళ్ళిపోయాడు. 

  *

ప్రపంచంలో మనుగడను అంటే సంసారజీవితాన్ని గడిపేవారు రెండు రకాలు ’మొదటిరకం ఎలాగైనా బ్రతికితే చాలు. వీరికి ధర్మం నీతి నిజాయితీ న్యాయాలు చాలాదూరం. వారి అవసరం తీర్చుకొనేదానికి, వారు ఏమైనా మాట్లాడుతారు. వారితో సై అన్నవారిని అభిమానిస్తాడు. ఏదో తోచిన సాయం వారికి, వీరి మనస్సు వున్న స్వార్థం, స్వప్రయోజనం కోసం చేస్తారు. 


రెండవ రకం.. పై తత్త్వానికి పూర్తి వ్యతిరేకులుగా దైవాన్ని నమ్మి, సాటి మానవులను గౌరవాభిమానాలతో చూస్తూ ఆ ఎదుటి వారి అవసరాలకు తాము చేయగలిగిన సాయం ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తారు. పైవారి వెంట వున్నట్లుగానే వీరి వెంటా కొందరు వారి అభిమానులు వుంటారు. యదార్థం చెప్పాలంటే కృత ద్వాపర త్రేతా యుగాల్లోలా (మంచి చెడ్డ కలయిక) యీ కలియుగంలోనూ వుంది. ’రాజు మెచ్చింది రంభ.. ’ అన్నట్లు ఎవరికి నచ్చిన మార్గం వారిది. 


ఖాసిందాదా రెండవ వర్గానికి చెందినవాడు. ఎంతో దైవ భక్తి కలవాడు. ఆడిన మాటను తప్పడు. గంగడికి చెప్పిన రోజుకు అతని పేరు ముద్రణ చేయించిన స్టీమ్ బోటును సముద్రపు ఒడ్డున లారీలో దింపించాడు. 


దాన్ని చూచిన గంగన్న పరమానంద భరితుడైనాడు. పరవశంతో ఖాసిందాదా కాళ్ళపై పడ్డాడు. గూడెం జనాలకంతా అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. గంగడికి, అక్క గౌరికి తండ్రి వీరన్నకు మహాదానందం. కోటేసుకు మనస్సున ద్వేషం.. తన దగ్గర పనిచేసే గంగడు యజమాని అయినాడనే సంకుచిత చింతన. పైకి నవ్వుతూ ఖాసిందాదాతో ముచ్చటించాడు. ప్రతాప్ అమాయకుడు. గంగడిని కౌగిలించుకొని అభినందించాడు. 


గంగడు, గంగమ్మ గుడిలో ఆ తల్లికి పూజ జరిపించాడు. ఆ తల్లి కుంకుమ, పసుపులను తన బోటుకు అక్కచేత సింగారింపజేశాడు. తన సావాసగాళ్ళ ఇరువురితో, సాగరానికి సాగిలమొక్కి తన బోటును నీళ్ళలోనికి దించాడు. హితులంతా చప్పట్లు కొట్టారు. కోటేసు లాంటి కొందరు గంగడి అదృష్టాన్ని చూచి మనస్సున ఈర్ష్వ చెందారు. 

  *

కాలచక్రం మరో రెండు ప్రదక్షిణాలు చేసింది. కొంతకాలంగా వీరన్న యదలోని బాధను మరిచి గంగడితో కలిసి వేటకు సాగరంపై బోటులో బయలుదేరేవాడు. వారంతా రెండు మూడు రోజులు సాగరంలోనే గడిపేవారు. 


సాగరగర్భంలో ఎన్నోరకాల జీవరాసులు చిన్న చిన్న చేపల నుండి తిమింగలం వరకూ నివసిస్తూ వుంటాయి. ఆ కోవలో పులస (Pulasa) అనే చేప ఒక జాతి. దాని ఖరీదు ఎక్కువ. ఈ తెగ నీటి ప్రవాహాన్ని ఎదురు ఈతను సాగిస్తాయి. 


ఆయా తెగల చేపలు యాత్రలోని జనంగా ఒక్కో సమయంలో నీటి పై భాగానికి గుంపుగా వస్తూ ఉంటాయి. జాలరులు ఆ సమయాన్ని ఆయా తెగ చేపలను పట్టాలనే భావనతో సాగర మధ్యాన కాచుకొని ఉండి వారి దృష్టికి వారు కోరిన చేపల సంకేతం అందగానే వలను సాగరంలో బోట్లోనుండి విసురుతారు. ఈ ప్రక్రియలో గంగన్న తండ్రి వీరన్న సిద్ధహస్తుడు. వీరు ఒడ్డుకు తెచ్చిన చేపలను ఖాసిందాదా మంచి వెలకు కొనేవాడు. నెలకు ఐదుసార్లు వేటకు బయలుదేరేవాడు. మూడునాలుగు రోజుల తరువాత ఒడ్డుకు చేరేవాడు. 


గంగన్న ఖాసిందాదా బాకీని తీర్చేశాడు. అక్క పెళ్ళికి కొంత సొమ్ముము ఖాసిందాదా దగ్గరే కూడబెట్టారు. 


పంతులు నుండి మంచిరోజును తెలుసుకొని తండ్రి కొడుకులు కోటేసు ఇంటికి (గుడిసె) కు వెళ్ళారు. రఘు, గౌరీలు ఇష్టపడ్డారనివారికి లగ్గం జరిపించాలని ప్రాధేయపూర్వకంగా కోటేసును కోరారు వీరన్న. 


"ఆఁ.. సూడు బావా! నీవు సెప్పినాదంతా బాగానే వుండాది. నాదొక ప్రశ్న?" చిరునవ్వుతో చెప్పాడు కోటేసు. 


"అదేంటో సెప్పు మావా!" దీనంగా అడిగాడు గంగన్న. 


మనస్సున ఏందో కపటం పెట్టుకొని కోటేసు మాట్లాడుతున్నాడని వీరన్న గ్రహించాడు. ఏది ఏమైనా ఆడపిల్ల తండ్రి సహనంతో కార్యాన్ని సాధించుకోవాలనే తత్వం తెలిసిన వీరన్న చిరునవ్వుతో కోటేసు ముఖంలోనికి చూచాడు. 


"ఒరే గంగా! మీ బావకు ఏమాత్రం కట్నం ఇస్తావురా" అడిగాడూ కోటేసు. 


ఆ తండ్రికొడుకులు ఆశ్చర్యపోయారు. 

కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. 

"మావా!"

"ఏందిరా?"


"నీకు ఎంత కావాలి?" అడిగాడు గంగడు. 

"ఓ లచ్చ!" కోటేసు జవాబు. 


"మావా!.. అది చాలా పెద్ద మొత్తం కదా మావా! మరోమాట సెప్పు!" దీనంగా అడిగాడు గంగడు. 

కోటేసు మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత.. 

"రేయ్ బామ్మర్ది! నీ అక్క బతికుంటే నువ్వు ఇట్టా మాటాడే వాడివారా!" ప్రాధేయపూర్వకంగా అడిగాడు వీరన్న. 


"ఇదిగో సూడండి. అనవసరమైన మాటలొద్దు ఫైనల్‍గా చెబుతుండా తొంభై ఏలు యియ్యాల!"

తండ్రి కొడుకులు ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. వీరన్న ఎదో మాట్లాడబోయాడు. 

గంగన్న తన చేతిని తండ్రి నోటికి అడ్డంగా పెట్టాడు. 


"మావా!.. "

"సెప్పు!.. "

"అట్టాగే.. తొంబై ఏలు ఇస్తా!.. పంతులుగారికి సెప్పి లగ్గానికి ముహూర్తం పెట్టించమంటావా!"

"రేయ్! గంగా! ముందు నా చేతిలో డబ్బు పడాల. ఆ తరువాత లగ్గానికి రోజును ఎంచుకుంటా! సరేనా!"

"అట్టాగే మావా!"

"డబ్బులు ఎప్పుడిత్తావ్?"

"నెలరోజుల్లో!"


"ముప్పయవ రోజు నాటికి డబ్బు ఇవ్వలేకపోతివా నా కొడూకు రఘుకు నీ అక్క గంగకు ఈ జనమలో లగ్గం జరుగదు" కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు కోటేసు. 

"ఇస్తా మావా!" అనునయంగా చెప్పాడు గంగడు. 


"ఇవ్వకపోతివా నేను సెప్పినాదే జరుగుద్ది" ఖచ్చితంగా చెప్పాడు కోటేసు. 

"మాట తప్పను మావా!"

"సరే. ఇక ఎల్లండి"


తండ్రి కొడుకులు తమ గుడిసె వైపునకు బయలుదేరారు. 

పది అడుగులు వేసిన తరువాత.. 

"అయ్యా!.. "

"ఏంది గంగా?"


"మావ అడిగిన డబ్బును గురించి అక్కకు సెప్పమాకే!" దీనంగా కోరాడు గంగడు. 

అలాగే అన్నట్లు విచారంగా తలాడించాడు వీరన్న. 

  *

"సామీ!" పిలిచాడు గంగడు. 

గంగడి ఆ పిలుపు విని ఖాసిందాదా వరండాలోనికి వచ్చాడు. 

"కూర్చో గంగా! ఏమిటి విషయం?" అడిగాడు. 


గంగన్న తన అక్క, రఘుల మనస్సులోని కోరికను, వారి వివాహ విషయాన్ని క్రిందటి రోజున కోటేసు అడిగిన డబ్బు మొత్తాన్ని గురించి ఖాసిందాదాకు చెప్పాడు. 

"గంగా!.. "

"అయ్యా!.. "


"కోటేసు అడిగిన డబ్బును నేను ఇస్తాను. బోటు డబ్బును తీర్చినట్టుగా తీర్చు సరేనా!"

"సామీ!.. సామీ చాలా సంతోషం సామీ. మీ మేలును నేను ఈ జనమలో మరిచిపోలేను" సంతోషంతో చేతులు కోడించి ఖాసిందాదాకు నమస్కరించాడు గంగడు.

శలవు తీసుకుని గూడెం వైపుకు బయలుదేరాడు.

 

ఆ పేదవాని హృదయంలో తన అక్క పెండ్లిని గురించిన ఎన్నో ఆలోచనలు. 

’పెద్ద పందిరి వెయ్యాల. మామిడి తోరణాలు కట్టాల. గుడిసె గోడలకు రంగులు ఎయ్యాల, గంగమ్మ గుడిముందు పెళ్ళి గొప్పగా జరపాల, గూడెం అందరికీ రెండు మూడు ఏటను కోసి పలావన్నం పెట్టాల, ముఖ్యంగా రఘు బావకు, ఒక బంగారు ఉంగరం, అక్క మెడకు ఒక బంగారు చైను కొనాల. యియన్నీ జరగాలంటే తాను మరో నెల రోజులు కష్టపడాల. సముద్రం మిదికి ఏట కెల్లాల. యీటన్నిటికి ఓ యాభై ఏలు కావాల’అన్నీ జరిగినంత సంతోషంగా ఆనందంగా గూడెం చేరాడు రంగడు. 


ఆ సాయంత్రం.. వార్తల్లో అండమాన్ ప్రాంతంలో వాయుగుండం లేగిందని, అది అటు కోల్‍కత్తా వైపుకో, ఇటు భారత్ వైపుకో ఎటు కదలనున్నదో ఇరవై నాలుగు గంటల్లో వివరిస్తామని వార్తా ప్రసారం జరిగింది. రెండు రోజులుగా వీరన్న జ్వరంతో బాధపడుతున్నాడు. గంగడు తన లక్ష్య సాధనకు మిత్రులు ఇద్దరితో కలిసి బోట్‍లో సాగరాన (బే ఆఫ్ బెంగాల్) ముందుకు సాగాడు. అక్క తండ్రి చెప్పిన మాటలను వినలేదు. రెండవ రోజు సముద్రంలో అల్లకల్లోలం. తుఫాను ప్రారంభం అయింది. 

  *

"నీగళ్‍పర్?.. " చింతనిప్పులాంటి కళ్ళతో అతను గంగడి ముఖంలోని చూచాడు ఒక మనిషి. 

చచ్చి బ్రతికిన గంగడు దిగులుతో కళ్ళు తెరువలేక తెరిచి అతని ముఖంలోనికి చూచాడు. 

"ఆళ్ రొంబ వీక్. కొంచెం సమయం ఆహట్టం. వునపుకుడు" సావధానంగా చెప్పాడు మరో రెండవ వ్యక్తి. 


రెండు క్షణాల తరువాత.. "శరవణా సాపాట్ కొండా!.. " బిగ్గరగా చెప్పాడు. ఐదు నిమిషాల్లో ఆ శరవణ అనే వ్యక్తి ప్లేట్లో అన్నం సాంబార్ ఊరగాయ తెచ్చి గంగడి ముందు ఉంచాడు. 

"సాపడు.. " అన్నాడు ఆ రెండవ వ్యక్తి. 


ఆనాటికి గంగడు భోజనం చేసి నాలుగు రోజులు. 

వారు శ్రీలంక కోస్టల్ గార్డ్స్.. 


తమ సముద్ర తీరాన పడివున్న గంగడిని.. వారు చూచి వారి శిబిరానికి చేర్చి, డాక్టర్ చేత పరీక్ష చేయించి ప్రాణం వుందని తెలిసికొని చికిత్స చేసి గంగడిని బ్రతికించారు వారు. 

"ఊ.. సాపడు!" రెండవసారి చెప్పాడు ఆ రెండవ వ్యక్తి.. 


వణికే చేతులతో గంగడు మెల్లగా అన్నాన్ని కలిపి తినసాగాడు. 

నాలుగు ముద్దలు తిని నీరు త్రాగేటప్పటికి గంగడి తనువుకు కొంచెం శక్తి సమకూరింది. 

మెల్లగా ఆ అన్నాన్నంతా తిన్నాడు మంచినీరు తాగాడు. 

మరో ఆఫీసర్ అక్కడికి వచ్చాడు. 


అక్కడ వున్న ఆ ఇరువురూ వారికి సెల్యూట్ చేశారు. 

వారు "ఎప్పడి ఇర్‍కు?. " అడిగారు. 


"ఫరవాయిల్లెసార్!.. ఇప్పుదా కొంచం సాపటా!.. " అన్నాడు రెండవ వ్యక్తి. 

ఆ వచ్చిన వ్యక్తి కుర్చీలాక్కుని గంగడు చం ప్రక్కన కూర్చున్నాడు. 

అతని ముఖంలోకి ప్రీతిగా చూచాడు. 

"ఎందవూరు?"

"నా.. కు.. అ.. ర.. వం.. రాదు సార్!" మెల్లగా చెప్పాడు గంగడు. 


"ఓ.. తెలుగా!"

"అవును సార్!"

"ఏ వూరు?"

"మచిలీపట్నం!"

"సముద్రంలో ఎలా పడిపోయావు?"

మెల్లగా గంగన్న తన కథను ఆఫీసర్‍కు చెప్పాడు. 


"అక్క పెండ్లికి డబ్బు కావాలి సార్!.. అందుకే ఏటకు నాలుగు రోజుల నాడూ నా ఇద్దరు స్నేహితుల్తో బోట్‍లో సముద్రంలో దిగినా.. మేము నడి సముద్రంలో వుండగా గాలీ వాన తుఫాన్ ప్రారంభం అయ్యింది. నా బోట్ ఇంజన్ చెడిపోనాది, ఆకాశాన్ని తాకే అలలు, గాలి వేగానికి బోటు తిరగబడింది. గట్టిగా నేను తెడ్డు కర్రను పట్టుకొన్నా నీళ్ళల్లో పడిపోయినా.. చాలాదూరం యీదినా నా వాళ్ళు ఎట్ట పోయారో పాపం.. నాకు తెలవదు. నేను చచ్చిపోతాననుకొన్నా వాళ్ళను గురించి బాధపడ్డ కొంతసేపు యీదుకుంటా. ఆ తరువాత ఏం జరిగినాదో నాకు తెలవదు సారూ!.. కళ్ళు తెరిచేటప్పటికి ఈ అయ్యలను చూడగలిగినా!.. "గంగడి కళ్ళల్లో కన్నీరు చెప్పడం ఆపేశాడు. 


"భయపడకు బాధపడకు నీ వాళ్ళు వేరే చోట బతికే వున్నారు. నీ పేరేమిటి?"

నాపేరు ప్రతాప్. మాది విజయవాడ. నేను శ్రీలంకలో యిక్కడ అసిస్టెంట్ కమాండెంట్‍గా పనిచేస్తున్నాను. "


"నా పేరు గంగడు సార్!"

"మీ అక్క పెండ్లి ఎప్పుడు?"


"ఇంకా లగ్గం రోజు.. రోజు.. "గంగన్న చెప్పలేకపోయాడు

"నిర్ణయించలేదా!"

"అవును సార్!"


"ఈ రోజు రేపు విశ్రాంతి తీసుకో. ఎల్లుండి నిన్ను నీవారిని మన దేశానికి విశాఖపట్నానికి షిప్‍లో పంపుతాను. సరేనా!" నవ్వుతూ అడిగాడు అసిస్టెంట్ కమాండెంట్ ప్రతాప్. 

గంగన్న మంచం దిగి ప్రతాప్ కాళ్ళమీద పడ్డాడు. 


"సామీ!.. మీరు నా పాలిట దేవుడు. చచ్చిన నన్ను బతికించినారు. ఆశ్రుధారలతో పరవశంతో పలికాడు గంగడు. 

ప్రతాప్ అతన్ని లేవదీసి మంచంపై కూర్చీబెట్టాడు. 


"సాయంత్రం కలుస్తాను" ప్రతాప్ వెళ్ళిపోయాడు. 

ప్రతాప్ చెప్పిన మాట ప్రకారం ఆ రోజున కార్గో షిప్‍లో అతని మిత్రులను గంగడిని ఎక్కించాడు. పదివేల రూపాయలను అతని చేతిలో ఉంచాడు. 


"అక్కకు ఏదైనా ఆమె కోరింది కొని ఇవ్వు. నాకు అక్కా చెల్లి లేరు గంగన్నా! ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. ఎంత అవసరం అయినా సముద్రంలో కలకలం లేవబోతుందని వింటే వేటకు బయలుదేరకు. జాగ్రత్త. " చిరునవ్వుతో చెప్పాడు ప్రతాప్. 


ఆనందంతో గంగన్న ప్రతాప్ ముఖంలోనికి చూస్తూ చేతులు కోడించాడు. మరుసటి దినం గూడెం చేరారు ముగ్గురూ, గుడిశకు పోకుండా సముద్ర తీరానికి తన బోటు చేరిందేమో అనే ఆశతో వెదికాడు. అతని బోటు కనుపించింది. ఆనందంతో నేలకూలాడు. సముద్రుడికి నమస్కరించాడు గంగడు. 


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

60 views0 comments

Comentarios


bottom of page