Written By Gannavarapu Narasimha Murthy
'గరుడాస్త్రం - ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.
అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.
ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు. కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.
పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.
ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.
శ్రీహర్షను కలవడానికి అతని దగ్గరకు వెళుతుంది ప్రణవి.
తమ వివాహానికి తండ్రిని ఒప్పించి వచ్చానని చెబుతుంది ప్రణవి.
పెద్దల అనుమతితో ఇరువురి వివాహం వైభవంగా జరుగుతుంది.
శ్రీహర్షకు డిఆర్డిఎల్ లో సైన్టిస్ట్ గా ఉద్యోగం వస్తుంది.
ట్రైనింగ్ పూర్తవగానే శ్రీహర్ష ని గరుడ మిసైల్ ప్రాజెక్టుకి బదిలీ చేసారు.
అక్కడ మిసైల్ కి సంబంధించిన డ్రాయింగ్ బయటి వాళ్లకు దొరుకుతుంది.
సిఐడీ బృందం వచ్చి శ్రీహర్షను, ప్రాజెక్ట్ ఇంఛార్జి భరద్వాజ గారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తారు.
శ్రీహర్షను కలిసి ధైర్యం చెబుతుంది ప్రణవి.
అతని బెయిల్ కోసం వాదిస్తుంది.
సైంటిఫిక్ అసిస్టెంట్ భావనని ఎవరో కాల్చి చంపుతారు.
కోర్టు ప్రణవి వాదనను అంగీకరించి, శ్రీహర్షకు బెయిల్ మంజూరు చేస్తుంది.
హారిక అనే అమ్మాయి తాను భావన హంతకుల డ్రాయింగ్ గీచినట్లు శ్రీహర్ష, ప్రణవిలతో చెబుతుంది.
హారికను కోర్టులోకి ప్రవేశపెడుతుంది ప్రణవి.
హారిక గీచిన చిత్రంలో ఉన్నవారు ఆరోజు లాకప్ లో ఉన్నట్లు చెబుతాడు ఎస్సై.
కానీ అది అబద్ధమని ప్రణవి రుజువు చేస్తుంది.
ఇక గరుడాస్త్రం - ఎపిసోడ్ 14 చదవండి..
ఆ తరువాత ప్రణవి మళ్ళీ మొదలు పెట్టింది. "యువరానర్! భావన తన హత్యకు ముందు వ్రాసిన డైరీ ఇది. ఇందులో ఆమె ఏం జరిగిందో అంతా వ్రాసింది. మల్హోత్రా అనే ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమె దగ్గరికి వచ్చి, మిసైల్స్ కి సంబంధించిన డ్రాయింగులు కావాలని అడిగినట్లు, అందుకు తాను ఇవ్వనని అతనితో చెప్పినట్లు ఆమె వ్రాసింది. ఆ తరువాత నా క్లయింట్ శ్రీహర్ష అరెస్ట్ తరువాత ఆమె మళ్ళీ మల్తోత్రాకి ఫోన్ చేసి అతన్ని నిలదీసినట్లు కూడా ఇందులో వ్రాయబడింది. దీన్ని బట్టి ఆమె హత్యకు, డ్రాయింగులు బయటకు వెళ్ళడానికి 'కింగ్ పిన్'- అంటే ముఖ్య కారణం మల్తోత్రా అని తెలుస్తోంది. తాను డ్రాయింగులు ఆమెని అడిగిన తరువాత డ్రాయింగులు బయటకు వెళ్ళాయి కాబట్టి దానికి తనే కారణం అని ఆమెకు తెలిసి పోయి ఉంటుందనీ, ఆమె బ్రతికి ఉంటే తన బండారం బయట పడుతుందని భయపడి మల్తోత్రానే భావనని కిరాయి హంతకులతో హత్య చేయించి ఉండొచ్చు. ఇంకొక్క ముఖ్య విషయం, ఆ హంతకులు రవీంద్ర చెబుతున్నట్లు ఇక్కడి వ్యక్తులు కారు. వాళ్ళిద్దరూ బీహరీ క్రిమినల్స్.. ఎన్నో హత్య కేసుల్లో ముద్దాయిలు. వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళు, ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తి తన పలుకుబడితో రవీంద్రని ప్రలోభ పెట్టి ఆ ఇద్దరు నేరస్తులను ఇక్కడికి పంపించి వాళ్ళని ఏదో కేసులో ఇరికించి లాకప్పులో ఉంచి అవసరమైన సమయంలో వాళ్ళని బయటకు పంపి హత్య చేయించారని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ కేసులో మరిన్ని మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరీ మల్తోత్రా? ఇతను ఆ మిసైల్ డ్రాయింగ్స్ కోసం ఎందుకు ఆ మిసైల్స్ డిజైన్ సెంటర్ కి వెళ్ళాడు? ఇతను ఎవరి సలహాతో ఈ పని చేసాడు? ఆ ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను ఎవరు పంపారు?; ఇంతకీ ఈ కేసులో ముఖ్య వ్యక్తులు ఎవరు? వీరికి పాకిస్తాన్ గూఢాచారులతో సంబంధం ఉందా ? ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు ఇటువంటి పనులు చేస్తూ దేశభద్రతకు ముప్పు తెస్తున్నారు? కేసుని పక్క తోవ పట్టించడానికే సీఐడి ఏ సంబంధం లేని శ్రీహర్షను అరెస్ట్ చేసారా ? వీటన్నిటికీ సమాధానాలు కావాలి. వాటికి సమాధానాలు తెలియకపోతే దేశభద్రతకు పెను ముప్ప వాటిల్లుతుంది..
దీన్ని ఇలా వదిలేస్తే చాప కింద నీరులా శత్రువులు కుట్రలు పన్ని దేశంలో అల్లకల్లోలాలు సృష్టించే అవకాశం వుంది .. కాబట్టి కోర్టు వారు ఈ సాక్ష్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించి, దేశభద్రతను కాపాడవలసిందిగా కోరుతున్నాను ” అంటూ తన వాదనలు ముగించింది.
కోర్టు ఆ కేసుని రెండు రోజుల తరువాతకు వాయిదా వేసింది.
రెండు రోజుల తరువాత శ్రీహర్ష కేసులో తీర్పు వెలువడింది. జడ్జి గారు తీర్పు వెలువరిస్తూ, “ఈ కేసులో ఇరుపార్టీల వాదనలు, పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత శ్రీహర్షకి ఈ కేసుతో ఏ సంబంధం లేదనీ, అతను నిర్దోషని భావిస్తూ అతన్ని విడుదల చేస్తున్నాను. సీఐడి వారు ఈ కేసులో సరియైన సాక్ష్యాధారాలు సేకరించడంలోనూ, కేసుని సరియైన దిశలో పరిశోధించడలోనూ విఫలమైందని భావిస్తున్నాము.. ఈ కేసులో అతి ముఖ్యమైన భావన అనే స్త్రీని ప్రశ్నించకుండా వదిలివేయడం సీఐడి చేసిన అది పెద్ద తప్పిదం . ఆమెను ప్రశ్నించి ఉంటే ఆమె హత్య నివారింపబడేదని కోర్టు భావిస్తోంది. భావన హత్య కేసుని పరిశోధించకుండా వదలివయ్యడం, అదీ కాకుండా కేసుకి సంబంధం లేని వ్యక్తులను హంతకులని అరెస్ట్ చేసి కోర్టును తప్పుదోవ పట్టించడం తీవ్రమైనవిగా కోర్టు పరిగణిస్తోంది. అందుకని ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే దీనికి సరియైన సమగ్రమైన విచారణ అవసరం అని కోర్టు భావిస్తోంది. కాబట్టి ఈ కేసుని సమగ్ర విచారణ చేయాలనీ సీబీఐని ఆదేశిస్తున్నాం.
ఈ కేసులో ఎస్పై రవీంద్ర, ఠాకూర్, బల్దేవ్ సింగ్, మల్తోత్రలకు సంబంధం ఉందన్న డిఫెన్స్ లాయర్ వాదనలు సరియైనవేనని నమ్ముతూ ఈ కేసులో సరి అయిన సాక్ష్యాలను సేకరించి ప్రవేశపెట్టిన శ్రీమతి ప్రణవిని కోర్ట్ అభినందిస్తోంది. ఈ కేసుని మళ్ళీ నెల 25వ తారీకుకి వాయిదా వేయడమైంది” అని తన తీర్పుని వెలువరించారు.
ఆ తరువాత సంఘటనలన్నీ త్వరత్వరగా చోటు చేసుకున్నాయి. సీబీఐ రంగంలోకి దిగి ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేసి, పరిశోధన మొదలు పెట్టి భావన హంతుకులిద్దరినీ, ఎస్సై రవీంద్రనీ, మల్తోత్రాని అరెస్ట్ చేసింది. రవీంద్ర తన నేరాన్ని అంగీకరిస్తూ మల్తోత్రా కోరిక మీదనే డబ్బుకు ఆశపడి నిందితులిద్దర్ని లాకప్పులోంచి బయటకు పంపి భావన హత్యకు పరోక్షంగా కారణమయ్యానని అంగీకరించాడు. మల్తోత్ర కూడా తన నేరాన్ని అంగీకరిస్తూ తాను డబ్బుకి ఆశపడి చాలా ఘోరమైన తప్పు చేసాననీ, ఈ కేసులో అసలు ముద్దాయి ముషారఫ్ అనే కాశ్మీర్ తీవ్రవాదనీ వాంగ్మూలం ఇచ్చాడు. ముషారఫ్ కాశ్మీర్ కేంద్రంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీవ్రవాది. అతను ఎందరినో ప్రలోభ పరచి భారత రక్షణ శాఖ రహస్యాలను పాకిస్తాన్ చేరవేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడనీ సీబీఐ పరిశోధనలో తేలింది .
అతని పర్యవేక్షణలో చాలా మంది పాకిస్తాన్ గూఢచారులు దేశమంతటా పనిచేస్తున్నారనీ, ఇమ్రాన్ కూడా అతను ప్రవేశపెట్టిన గూఢాచారేననీ వెల్లడైంది. ఇమ్రాన్, మల్తోత్రాను ధనంతో లోబరుచుకొని కొత్తగా తయారుచేస్తున్న గరుడ మిసైల్ డిజైన్లను సేకరించి పాకిస్తాన్ పంపించాలనుకున్నాడు. కానీ ఒక కేసులో అతను అరెస్ట్ అయినప్పుడు ఆ డ్రాయింగు దొరకడంతో ఈ కేసులో డొంకంతా కదిలింది. ఆ తరువాత కస్టడీలో అతను సైనైడ్ తాగి మరణించాడని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం అసలు ముద్దాయి ముషారఫ్ దేశం విడిచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడనీ, అతన్ని అప్ప చెప్పాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇంటర్ పోల్ ద్వారా కోరామనీ కూడా సీబీఐ తెలిపింది.. అలా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది.
శ్రీహర్ష నిర్దోషిగా కోర్టు నిర్ధారించడంతో కరుణాకరం గారు చాలా సంతోషించి ఆ రోజు పెద్ద పార్టీ ఏర్పాటుచేసాడు.. ఆ పార్టీలో ఎంతో మంది ఆఫీసర్లు, పోలీసు అధికార్లు, రాజకీయ నాయకులు, మంత్రులు వచ్చి శ్రీహర్షని అభినందించారు.
ఆ మర్నాడు దయాన్నే శ్రీహర్ష ప్రణవి కలసి వెంటేశ్వరుని గుడికి వెళ్ళారు.
***
ప్రత్యూషపు వేళ! తూరుపు రాగరంజిత అవుతోంది.. ధవళ వర్ణంతో గుడి శిఖరం మెరిసిపోతోంది. శిఖరం మీద తెల్లటి శాంతి కపోతాలు గుంపుగా ఎగురుతూ మల్లె దండను గుర్తుకు తెస్తున్నాయి. దూరంగా గుడి ఆవరణ లోంచి 'బ్రహ్మ కడిగిన పాదము' అన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాట వీనులకు విందు చేస్తోంది.
భానుడి లేత ఎర్రటి కిరణాలు ఏటవాలుగా గర్భ గుడిలోని మూల విరాట్టు మీదకు ప్రసరిస్తూ ఆ మూర్తిని తేజోమయం చేస్తునాయి.
గుడి ప్రాంగణంలో గుడి గంటల శబ్దం ప్రతిధ్వనిస్తూ ఆ గుడికి ఒక పవిత్రతని ఆపాదిస్తున్నాయి.
ఆ సమయంలో శ్రీహర్ష, ప్రణవి కారు దిగారు.. క్యూలో నిల్చొని గోవిందా అని ఉచ్ఛరిస్తూ గుడి గంటల్ని మ్రోగిస్తూ వేంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు..
“వినా వెంకటేశం ననథో ననాథా” అంటూ వేంకటేశ్వరుని స్తుతించారు.
గర్భగుడిలో సప్తవర్ణ మిశ్రమ సుమదళాలతో అలంకరించిన భగవానుడు దీపపు వెలుగులో ప్రకాశిస్తూ కనిపించాడు..
“బ్రహ్మాదయస్సు రవ రాస్స మహర్షయస్తే;
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం”
“ఓ దేవా! బ్రహ్మమున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు యోగులును నీ పూజ కోసం మంగళకర వస్తువులతో నీ సన్నిధికి వచ్చారు.. నీకు సుప్రభాతం”.
పూజారి వారిద్దరికీ తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టాడు. ఆ తరువాత గంటానాదం చేస్తూ వారికి పుష్పాలు ఇచ్చి ఆశీర్వదించాడు..
దర్శనానంతరం ఇద్దరూ ధ్వజస్తంభాన్ని చూసి బయటకు వచ్చి సంపెంగ చెట్టు కింద కూర్చున్నారు.
సంపెంగ పరిమళ సౌరభం ఆ పరిసరాలంతా వ్యాపించి అక్కడి వాతావరణానికి ఒక పవిత్రతను ఆపాదిస్తోంది.
"ప్రణవీ! ఈ రోజు భగవానుడి దర్శనం నాకు చాలా ఆనందం కలిగించింది. అందులోనూ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన తరువాత మరింత ఆనందం కలుగుతోంది. కష్టాల తరువాత వచ్చే సుఖం ఎంత ఆనంద మిస్తుందో ఇప్పుడు తెలుస్తోంది.. ” అన్నాడు శ్రీహర్ష.
“చీకటి ఉంటేనే వెలుగు, ఎండ ఉంటేనే నీడ, కష్టాలుంటేనే సుఖాల విలువ తెలుస్తుంది. అందమైన పచ్చని లోయని చూడాలంటే ఎత్తైన పర్వతం ఎక్కక తప్పదు.. గోదావరికి వచ్చే వరద వల్ల కలిగే బాధ తాత్కాలికం.. కానీ తరువాత పండే పచ్చటి పంట ఇచ్చే ఆనందం శాశ్వతం.. అలాగే కష్టాల తరువాత సుఖాలు.. సుఖాల్లో ప్రతీవాళ్ళు నవ్వుతారు ; కానీ కష్టాల్లో కూడా నవ్వేవాడే గొప్పవాడు. ఈ విషయంలో నిన్ను మెచ్చుకోక తప్పదు. నువ్వు నిరాశ చెందకుండా ధైర్యమనే గరుడాస్త్రం తో తో కేసుని ఎదుర్కొని విజేతగా నిలిచావు” అంది ప్రణవి.
“చీకట్లో వెళ్ళే వారికి చిరుదీపమే తన వెలుగుతో దారి చూపిస్తుంది. అలా, నువ్వు నాలోని నిరాశని పారద్రోలి నన్ను విజయతీరం వైపు నడిపించావు. అందుకే నీలాంటి భార్య తోడుగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా ఎదుర్కోవచ్చు. ఇదంతా ప్రణవి గొప్పతనం. ముఖ్యంగా నా కేసులో నేను నిర్దోషిననీ త్రికరణ శుద్ధిగా నమ్మి పదునైన వాదనలతో చీల్చి చెండాడి నన్ను గెలిపించావు. నిజానికి అవి వాదనలు కావు, ప్రణవ నాదాలు కాదు కాదు ప్రణవి నాదాలు” అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష.
“అబ్బో! నీ నోటంట కవిత్వం వస్తోందే!.. అది ప్రణవి నాదం కాదు.. ప్రణవి తన నాధుడి కోసం వినిపించిన ప్రణవి వాదం.. ” అంది ప్రణవి తనూ నవ్వుతూ.
“అవును.. అదే ప్రణవ నాదం” అన్నాడు శ్రీహర్ష. అతని మాటలు నిజం అన్నట్లు గుడిగంటలు మోగుతూ ప్రణవనాదాన్ని తలపించ సాగాయి.
=================================================================================
(సమాప్తం)
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం.
=================================================================================
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
vidya sagar vesapogu • 19 hours ago
Nice chala manooharamga undi Thanks sir