top of page
Writer's pictureNarasimha Murthy Gannavarapu

గరుడాస్త్రం - ఎపిసోడ్ 7






(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

శ్రీ హర్ష మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్.

అనుకోకుండా హాస్టల్ గది ఖాళీ చెయ్యాల్సి రావడంతో రూమ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తండ్రి చిన్ననాటి స్నేహితుడు లాయర్ కరుణాకరం గారిని కలుస్తాడు. అయన శ్రీ హర్ష ను తన అవుట్ హౌస్ లో ఉండమంటాడు.


కరుణాకరం గారి అమ్మాయి ప్రణవి తో పరిచయమవుతుంది.

ఒకరోజు కరుణాకరన్ గారు శ్రీహర్షని పిలిచి కోనసీమలో జరిగే ఒక పెళ్ళికి తన కూతురికి తోడుగా వెళ్ళమంటాడు. ప్రణవితో కలిసి అక్కడికి వెళతాడు శ్రీహర్ష. పెళ్లి కూతురి పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు.


శ్రీ హర్షతో కలిసి పాపికొండలు వెళ్లివస్తుంది ప్రణవి.

పరీక్షలు పూర్తయ్యాక తన ఊరికి బయలుదేరుతాడు శ్రీహర్ష.

ప్రణవిని విడిచి వెళ్లడం అతనికి బాధ కలిగిస్తుంది.



ఇక గరుడాస్త్రం ఏడవ భాగం చదవండి..

ఇంటికి వెళ్ళగానే అతని తల్లి సుశీల చాలా సంతోషించి దిష్టి తీసింది. స్నానం తరువాత టిఫిన్ ఇచ్చి కొడుకు యోగ క్షేమాలు అడిగింది. కరుణాకరం గారి కుటుంబం గురించి అన్నీ అడిగింది. తల్లికి చెబుతునాడే గాని అతనికి విసుగ్గా వుంది.. ప్రయాణం లో అలసట వల్ల చిరాగ్గా ఉన్నాడని ఆమె అనుకుంది.


ఆ రాత్రి భోజనాల తరువాత డాబా మీదకు వెళ్ళాడు. మంచు పడుతోందని జలుబు చేస్తుందనీ సుశీల కొడుక్కి చెప్పింది.. అతను ఆమె మాటల్ని పట్టించుకోకుండా డాబా మీదకు ఎక్కాడు. కొబ్బరి చెట్ల ఆకుల్లోంచి పున్నమి వెన్నెల ముఖం మీద పడుతోంది.. పల్లె కావడం వల్ల ఎనిమిదికే ఊరు నిద్రపోయింది.. అంతా నిశ్శబ్దం.. చాలా రోజుల తరువాత రణ గణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణాని కొచ్చాడు.. రేపట్నుంచీ ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా పరీక్ష మీద దృష్టి కేంద్రీకరించాలి.. ఈ పరీక్షలో పాసై ఉద్యోగం వస్తేనే తన గమ్యం చేరుకునే అవకాశం కలుగుతుంది..


మీద తెల్లటి ఆకాశం నిర్మలంగా ఉంది.. నక్షత్రాలు మెరుస్తూ ఆకాశానికి అందాన్నిస్తున్నాయి. ఆకాశంలో తెల్లటి కొంగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి. దూరంగా ఏటి దగ్గర తోటల్లోంచి కోకిల కుహు కుహు నాదం అక్కడి నిశ్శబ్దన్ని భంగ పరుస్తోంది.. ఆ వెన్నెలను చూస్తూంటే అతనికి చక్రవాక పక్షి గుర్తు కొచ్చింది. దాన్నే వెన్నెల పులుగంటారనీ ఎక్కడో చదివాడు..


కానీ ఆ పక్షినెప్పుడు చూడలేదు. వెన్నెట్లో విహరించే ఆ పక్షిని తలుచుకుంటే అతని శరీరం పులకరించసాగింది.. అలా అతని ఆలోచనలు మళ్ళీ ప్రణవి మీదకు మళ్ళాయి. ఒకసారి సముద్రపు ఒడ్డున వెన్నెల్లో ఆమెను 'వెన్నెల్లో ఆడపిల్ల' నీ చెబితే ఆమె ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది.. అప్పుడు చిరునవ్వుతో తనను చూసిన ఆమె చూపు ఎన్నో రోజులు తనను వెంటాడింది.. తిలక్ అందమైన అమ్మాయిలకు ఎంత అందమైన పేరు పెట్టాడు! వెన్నెల్లో ఆడపిల్ల.. మళ్ళీ ఆలోచనలు.. ఆమెతో గోదావరిలో పడవలో ప్రయాణం.


తెల్లటి ఆకాశం; తెల్లటి తెరచాప ;తెల్లటి ప్రణవి.. పాపికొండల్లో తెల్లటి జలధార.. దాని కింద తెల్లటి దుస్తుల్లో ప్రణవి.


ఆలోచనలు వెంటాడుతున్నాయి.. ఆమెకు దూరంగా వచ్చినా ఆలోచనలు ఆమె వైపే వెళుతుండటం అతనికి కోపం కలిగించ సాగింది..


చదువు కొంటున్నప్పుడు నిద్ర ఎప్పుడు కనురెప్పల మీదే ఉండేది. తను వద్దనీ ఎంత మొత్తుకున్నా అది వినేది కాదు.. ఈ రోజు తనకి కావాలన్నా ఆ నిద్ర రావటం లేదు.. ఈ రోజు కూడా అది కనురెప్పల మీదే ఉంటూ వాటిని మూసుకోనివ్వటం లేదు.. “నిద్రా! నీకెందుకు నేనంటే అంత కోపం.. ”.


తన ఆలోచనలు తనకే నవ్వు తెప్పించసాగాయి.. - అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకోసాగేడు. రాను రాను మలయ మారుతం అతనికి జోల పాడసాగింది.. అంతే.. గాఢ నిద్రలోకి జారిపోయాడు.

**** ***** ****** ********

ఆ మర్నాడు ఉదయాన్నే శ్రీహర్ష పొలానికి వెళ్ళాడు. ప్రభాత సమయం కావడంతో అక్కడ నిర్మానుష్యంగా, ప్రశాంతంగా ఉంది.. బట్టి లోంచి నీటి శబ్దం వినిపిస్తోంది. శ్రీహర్ష ఓ గంట సేపు పొలమంతా తిరిగి ఇంటికి కొచ్చాడు. ఆ తరువాత ఏటికెళ్ళి స్నానం చేసి ఇంటికి రాగానే అతని తల్లి సుశీలమ్మ వేడి వేడి భోజనం వడ్డించింది. అది తిన్న తర్వాత గాఢంగా నిద్ర పట్టేసింది. సాయంత్రం లేచి డాబా మీదకు వెళ్ళి పుస్తకాలను తెరిచాడు. మనసు వాటి మీద లగ్నం కావటం లేదు. పడమటి సంజె ఎర్ర బారుతోంది. కొబ్బరాకుల సందుల్లోంచి ఎర్రటి కిరణాలు ముఖం మీద పడుతునాయి. ఒక్కసారి నిలబడి ఊరి వైపు చూసాడు. వీధింతా పశువుల మందతో అలికిడిగా ఉంది..

గోధూళి వేళ కావడంతో పశువులు ఇంటి దారి పడుతూనాయి. పదవ తరగతి వరకు తన జీవితం ఈ పల్లెలోనే గడిచింది. అప్పుడు స్నేహితులులతో కాలం తెలిసేది కాదు. పొలానికి వెళ్ళడం, ఏటి ఒడ్డున వాలీబాలు, కబాడీ ఆటలు, చదువుకోవడం.. ఇలా సరదగా గడిచింది.

కానీ ఇంజనీరింగ్ తరువాత తన ఆలోచనే ధోరణి మారిపోయింది. ఇప్పుడు తనకి పెద్దగా స్నేహితులు లేరు. వున్నా వాళ్ళెవరూ రారు.. తను నాలుగు సంవత్సరాల లో చాలా తక్కువ సార్లు ఈ ఊరికొచ్చాడు. వచ్చినా రెండు మూడు రోజులే.. అలా చాలా బిజీగా గడిచిపోయింది. ఇంజనీరింగ్ చదువు ఒక యజ్ఞం లాంటిది.. స్నేహితులు, ఆటలు.. వీటిని పెట్టుకుంటే చదువు ముందుకు సాగదు.. ఆ చదువన్నాళ్లు ప్రతీ క్షణం విలువైనదే.. చదువై పోగానే ఎంత వేగం తన ఊరు వెళతాను అని తొందర పడ్డాడు. కానీ వచ్చిన తరువాత ఆ ఉత్సాహం లేదు. ఇక్కడి వాతావరణం వేరేగా ఉంది. పల్లెలు బాగా మారిపోయాయి, ముఖ్యంగా సెల్ ఫోన్లు, మోటార్ బైకులు, టీవీలు, పల్లెల్ని బాగా పాడు చేసాయి. ఈ తరం కుర్ర కారెవ్వరూ వ్యవసాయం చెయ్యటానికి ఉత్సాహం చూపటం లేదు. అందరూ సాఫ్ట్ సాఫ్ట్ వేర్ చదివి హైదరాబాదో, బెంగుళూరో వెళ్ళిపోవాలని చూస్తున్నారు.


చాలా మంది వ్యవసాయ కూలీలు పట్నం బాట పట్టేసారు. పిల్లల చదువుకి బాగా విలువిస్తున్నారు. అందుకే నాగళ్ళు, ఎడ్ల బళ్ళు అంతరించిపోతున్నాయి.. ఏ పొలంలో చూసినా ట్రాక్టర్స్, వరి కోసే యంత్రాలు పెరిగాయి. ఏ పొలంలో చూసిన ట్రాక్టర్ చప్పుళ్ళే.. సాయంత్రం అయ్యేసరికి పూర్వం వీధుల్లో కబుర్లు చెప్పుకునేవారు.. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి అందరూ టీవీలు ముందు కూర్చుంటున్నారు.. చాలా మంది ప్రతిరోజు మోటార్ బైకుల మీద పట్నాలు వెళ్తున్నారు. దీనివల్ల ఖర్చు పెరుగుతోంది. వ్యవసాయ కూలీల రేటు కూడా బాగా పెరిగింది.

శాస్త్ర విజ్ఞానం ఒక విధంగా మనిషికి మంచి చేసేనా అదే సమయంలో అసమానతలకు దారి తీసింది.. అలా అనీ అభివృద్ధిని ఆపలేము. పూర్వం పొలాలన్నీ వర్షం మీద ఆధారపడేవి కానీ ఇప్పుడూ ప్రతీ పొలంలో ఒక ట్యూబ్ వెల్; నీటికి ఎద్దడిలేదు..


శ్రీహర్ష ఆలోచనల్లోంచి బయట పడ్డాడు.. చీకటి ముసురుకుంటోంది.. తను వచ్చి అప్పడే 15 రోజులైంది. ఈ పాటికి ప్రణవి పెళ్ళిచూపులు అయిపోయి ఉంటాయి. ఆమె గుర్తుకు రాకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా కుదరటం లేదు. వారం తరువాత తను వాళ్ళ పట్నం పరీక్ష కోసం వెళ్ళాలి. రక్షణ శాఖలో సైంటిస్ట్ ఉద్యోగం కోసం ఆనలైన్ పరీక్షకి బాగానే ప్రిపేర్ అయ్యేడు. ఆ రోజు పరీక్షకు వెళ్ళినపుడు ప్రణవి వాళ్ళింటికి వెళ్ళకూడదనీ నిర్ణయించుకున్నాడు.


వెళితే మళ్ళీ మనసు అలజడికి లోను కావచ్చు.. అది తన కెరీర్ మీద ప్రభావం చూపవచ్చు. జీవితంలో కొన్ని కొన్ని పరిచయాలు మధ్యలోనే వచ్చి మధ్యలోనే అదృశ్య మౌతాయి. ప్రణవితో తన పరిచయం కూడా రైలు ప్రయాణంలో స్నేహం లాగ గమ్యం చేరగానే మరచిపోయేటట్లుండాలి.. ఆమెకు త్వరలో పెళ్ళి కాబోతోంది. కాబట్టి ఆమె తలంపు మంచిది కాదు..


జీవిత చక్రం ఎప్పుడూ నిశ్చలం కాదు. అది నిరంతర భ్రమణ శీలి.. ముందుకెళుతునే ఉంటుంది . సుఖ, దుఃఖాలు, కష్ట సుఖాలతో దానికి పని ఉండదు.

ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నా ప్రణవి మరపు రావటం లేదు.. తనను వెంటాడుతోంది. ఆ సమయంలో అతని కెందుకో ఎప్పుడో విన్న

“మానూ మాకును కాను

రాయి రప్పను కానే కాను

మామూలు మడిసిని నేను”

గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే పాట..


ఆ మర్నాడు శ్రీహర్ష పొలంలో ఉన్నప్పుడు రైతు వెంకన్న వచ్చి “బాబూ! తమరింటికి ఎవరో సుట్టాలు కార్లో వొచ్చినారు, అమ్మగోరు రమ్మంటున్నారు ” అని చెప్పాడు.

ఆ మాటలకు అతను ఆశ్చర్యపోయి ఇంటి వైపు బయలుదేరాడు. కార్లో తమ ఇంటికి వచ్చే చుట్టాలు ఎవరై వుంటారోననీ అతను తీవ్రంగా ఆలోచించసాగాడు..


అలా ఆలోచిస్తూ, అడుగులు వడి వడిగా వేయసాగాడు. పది నిముషల తరువాత అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందర తెల్లటి కారు ఆగివుంది ;ఆ కారుని చూడగానే ఎవరొచ్చారో అతనికి అర్థం అయింది.


అది తనూ, ప్రణవి ప్రతిరోజూ కాలేజీకి వెళ్ళే కారు.. అంటే కరుణాకరం గారు వచ్చారా? బహుశా ప్రణవి పెళ్ళి పిలుపు కోసం వచ్చి ఉంటారు? ఆ ఆలోచన రాగానే అతనిలో ఆందోళన మొదలైంది. ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. హల్లోకి వెళుతునే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

ఎదురుగా అందంగా మెరిసిపోతూ అక్కడ ప్రణవి నిలుచొని ఉంది..

***** ******* ******* *******

ఏటి ఒడ్డు.. సంధ్యా సమయం కావడంతో చల్లటి గాలులు వీస్తున్నాయి. గోధూళి వేళ కావడంతో సూర్యుడు పడమరలోకి జారుకుంటున్న దృశ్యం ఏటి మీద పరావర్తనం చెందుతూ అందంగా కనిపిస్తోంది.


ఆ ఏటి ఒడ్డున ప్రణవి, శ్రీ హర్ష కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం ఇంటి దగ్గర ప్రణవిని చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకొచ్చావని అడుగు దామనుకుంటున్న సమయంలో అతని తల్లి సుశీల రావడంతో మాట మార్చి “అమ్మా! ఈమె ప్రణవి.. కరుణాకరం గారి అమ్మాయి; పల్లెటూళ్ళంటే బాగా ఇష్టం. నాతోనే వస్తానంది కానీ ఆ సమయంలో ఏదో పనుండి రాలేకపోయింది. ” అని చెప్పాడు.


సుశీలమ్మ చాలా సంతోషించి ప్రణవిని లోపలికి తీసికెళ్ళి ఇల్లంతా చూపించింది. రమణమూర్తి కూడా కరుణాకరం కూతురనీ తెలియగానే సంతోషించి కొడుకుతో ఊరంతా చూపించమని చెప్పాడు.


సాయంత్రం దాకా ఆమెను ఎందుకొచ్చిందో కనుక్కుందామన్నా వీలు చిక్కలేదు. అందుకే ఏరు చూపిస్తాననీ చెప్పి ఇప్పుడు తీసుకొచ్చాడు.


ప్రణవి ఏటిని చూడగానే చాలా ఆనందపడింది. తెల్లటి ఇసుక తిన్నెని రాసుకుంటూ గల గల మనీ ప్రవహిస్తున్న ఏరు, సూర్యకిరణాల వెలుగుకి మిల మిల మెరుస్తున్న అలలు, దూరంగా ఏట్లో పడవ, గాలికి ఊగుతున్న తెరచాప; అలా అక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కరించబడుతూ చాలా అందమైన వర్ణచిత్రంలా కనిపిస్తోంది.


“ శ్రీ హర్షగారూ! మీలో భావుకతకు కారణం ఈ ఏరేననీ అర్థం అయింది. ఇంత మంచి ఏటి ఒడ్డు ఉండే ఊర్లో పుట్టడం మీ అదృష్టం.. అందుకే మీ మాటల్లో కవిత్వం, తాత్వికత కలబోసి వినిపిస్తుంటాయి” అంది ఏటి వైపు చూస్తూ.

“అది సరే! మీరేమిటి చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసారు. ఇది పట్నం కాదు. మీ లాంటి పెళ్ళి కాని అమ్మాయిలు వస్తే ఊరంతా రకరకాలుగా అనుకుంటారు?” అన్నాడు.


“మీరింకా పాత తరం వాళ్ళలా ఆలోచిస్తున్నారు.. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అమ్మాయిలు చదువుకుంటున్నారు. పూర్వం మగవాళ్ళతో మాట్లాడటానికి మొహమాట పడేవారు.. ఇప్పుడు అలా లేదు.. ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఏం నాలాంటి అమ్మాయిలు మీ ఇంటికి రాకూడదా , వస్తే మీ అమ్మానాన్నలు ఏమైనా అనుకుంటారా? అయినా మీ నాన్నగారు చదువు చెప్పే ఉపాధ్యాయులు.. అతను సంకుచితంగా ఆలోచిస్తారని నేననుకోను” అంది ప్రణవి నవ్వుతూ.


“వాళ్ళు అనుకోకపోయినా ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు.. అది సరే ఏమిటిలా వచ్చారు? నాన్నగారికి చెప్పే వచ్చారా?”

“ఏం! ఇక్కడికి రాకూడదా? దానికి నాన్నగారి పర్మిషన్ కావాలా?”

“అలా కాదు! మీకు పెళ్ళి కుదరబోతోంది. ఈ సమయంలో రావడం మంచిది కాదని నా అభిప్రాయం.. ”


"పెళ్ళి కుదిరితే రాకూడదా? మనం స్నేహితులుగా ఉండకూడదా చెప్పండి. అయినా మిమ్మల్ని నా పెళ్ళిచూపులప్పుడు రమ్మనమనీ చెబితే వస్తానన్నారు.. కానీ రాలేదు.. అన్యాయం కాదా?”


"పెళ్ళిచూపులప్పుడు నాలాంటి యువకులు ఉంటే ఆ పెళ్ళికొడుకు కుటుంబం వాళ్ళు అనుమానపడే అవకాశం ఉంటుంది. అందుకే రాలేదు. అది సరే పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? ఆ విషయాలు చెప్పండి. ”


“ఇప్పుడా విషయాలు దేనికండి! ఇంత అందమైన ఏరు, దాని ఒడ్డున అందమైన అమ్మాయి, పక్కనే పెళ్ళి కాని అందమైన యువకుడు.. హాయిగా ఏవో కబుర్లు చెప్పవచ్చు కదా? అయినా నాకు పెళ్ళి కుదురుతోందంటే మీకు ఏ విధమైన అసూయ లేదా? సంవత్సరం కాలం మన మిద్దరం కలిసి తిరిగేము. ఎన్నో కబుర్లు చెప్పకున్నాము..

అటువంటిది నేను పెళ్లై అమెరికా వెళ్ళిపోతే మీకు బాధ అనిపించటం లేదా? కనీసం ఒక మంచి స్నేహితురాలు దూరమై పోతోందన్న భావన కూడా కలగటం లేదా. అంటే నేను తప్పుగా మీ గురించి ఊహించుకున్నానన్న మాట” అంది ప్రణవి.


ఆమె మాట్లాడుతుంటే పెదవులు వణకటం శ్రీహర్ష గమనించాడు. ఆమె మాటలకు ఏం చెప్పాలో తోచక కొద్దిసేపు మౌనం దాల్చాడు.. సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మౌనమే ఒక్కొసారి జవాబువుతుందనీ అతనెక్కడో చదివాడు. “సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు కమ్యూనిటికేట్ ఎట్ టైమ్స్”.


"ప్రణవి గారూ! మీరు పొరబడ్డారు.. ఆకాశంలో పౌర్ణమి నాటి అందమైన మిల మిల మెరిసే నక్షత్రాలను తెంచి దండకూర్చి జడలో తురుముకోవాలంటే కుదురుతుందా?! చందమామ రావే! జాబిల్లిరావే! అనీ పాడుకుందుకు బాగుంటుంది. కానీ ఆ జాబిల్లిని మనం కోరుకుంటే తప్పు కాదా? స్వార్ధం అవదా ? ఆ జాబిల్లి మన దగ్గరకు వస్తుందా? కొన్ని కొన్ని చూడటానికే బాగుంటాయి. స్వంతం కావు.. స్వంతం చేసుకోవాలనుకోవడం పేరాశ అవుతుంది..


కలువకు చంద్రుడు ఎప్పుడూ దూరమే.. అలా ఉంటేనే అందం.. అవి రెండూ కలవవు.. అలాగే రైలు పట్టాలు కలవకుండా సమాంతరంగా ఉంటేనే గమ్యం చేరుకుంటాము.. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే 'అర్హత' అనేది ఉంటేనే దాని కోసం ఆశ పడాలి; మీరు ఆకాశంలో నాకు అందనంత ఎత్తులో ఉన్నారు.. కానీ ఒక్కోసారి మన మనసు మన మాట వినదు. అర్హత లేని కోరికలు కోరుతుంటుంది. నాకు అన్నీ తెలిసినా మీరు పరిచయం అయిన తరువాత నా మనసు మిమ్మల్ని కోరుకుంది. మీతో జీవితాంతం అడుగులు వెయ్యాలని అనుకున్నాను. ఎన్నోసార్లు నాలోని వివేకం అది జరగని పననీ హెచ్చరిస్తున్నా నేను దాని మాట వినలేదు.


కానీ ఒక్కసారిగా మీ నాన్నగారు మీ పెళ్ళి విషయం చెప్పగానే అగాధంలోకి జారిపోయిన భావన కలిగింది. తట్టుకోలేక పోయాను. కొన్ని రోజులు బాధ పడ్డాను ;ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను ; కానీ తర్వాత నాలో వివేకం మేల్కొంది. నా తప్పుని తెలుసుకున్నాను. అనవసరమైన కోరికలు పెంచుకోరాదనుకున్నాను.. నేనేమిటో, నా స్థాయి ఏమిటో బోధపడింది. అందుకే మా ఊరు వచ్చేసాను.


వచ్చేసేను గానీ ఎప్పుడు మీ పెళ్ళివార్త వినవలసి వస్తుందోననీ అనుక్షణం భయపడుతూ గడుపుతునాను. ఆ విషయం తెలిస్తే నేను తట్టుకోలేను; నా మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియక మధనపడుతున్నాను.. ఇలా మా ఊరు వచ్చిందగ్గర్నుంచి నాలో అలజడి మొదలై కొనసాగుతోంది.. ”


“ఈ రోజు మిమ్మల్ని మళ్ళీ మా ఇంట్లో చూడగానే అది మరింత పెరిగింది.. మీ పెళ్ళి అయిపోయిందన్న విషయం తెలిసిపోతే ఇంక నాకు బాధుండదు.. మనసుని రాయి చేసుకుంటాను”.. అన్నాడు శ్రీహర్ష గద్గద కంఠంతో.. మాట్లాడుతుంటే అతని గొంతు బొంగురు పోయింది.

=================================================================

ఇంకా వుంది


=================================================================


గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


59 views0 comments

Comments


bottom of page