top of page

గిల్టునగ

Writer's picture: Lakshmi Sarma BLakshmi Sarma B

#GiltNaga, #గిల్టునగ, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ


Gilt Naga - New Telugu Story Written By - Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 16/02/2025

గిల్టునగ - తెలుగు కథ

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



“హలో వసుధ.. బాగున్నావా? ఏయ్ నన్ను గుర్తుపట్టలేదు కదూ, అవున్లే నన్నెందుకు గుర్తుంచుకుంటావు! నేను చిన్నప్పటినుండి లేనిదాన్నని మీరందరు హేళన చేసేవారు.. అలానే దూరంపెట్టారు. కానీ వసుధ.. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను చాలా డబ్బున్నదాన్ని తెలుసా? నీకో విషయం తెలుసా.. నేను మన స్నేహితులందరిని కలుసుకోవాలనుకున్నాను. మొన్న పద్మను కలిస్తే నీ నెంబరిచ్చింది. 


చాలా రోజులైంది కదా మనం కలిసి.. నిన్ను పట్టగలనో లేదో. ఎందుకంటే నేను చాలా మారిపోయాను. నన్ను మీరెవ్వరు గుర్తుపట్టలేరు. అంత లావయ్యాను. అది సరే.. నన్నెప్పుడు కలవమంటావు.. ఎక్కడికి రమ్మంటావో చెప్పవే, ” 


వసుధ, ఫోన్ ఎత్తినప్పటినుండి ఆపకుండా మాట్లాడిన స్నేహితురాలు సుజనను గుర్తుచేసుకుని, నవ్వుకుంది. 


“సుజన .. అబ్బా నువ్వేం మారలేదే. అప్పటిలాగే లొడలొడవాగుతునే ఉన్నావు.

ఎలా ఉన్నావే.. ఎన్నాళ్ళయిందో మనమంతా కలుసుకుని. ఇప్పుడెక్కడున్నావు.. ఏం చేస్తున్నావు.. చెప్పవే” చిన్ననాటి స్నేహితురాలితో మాట్లాడుతున్న ఆనందం వసుధ మాటల్లో తెలుస్తుంది చూసేవాళ్ళకు. 


“ఏముందే చెప్పడానికి .. ఇప్పుడు నేను నలుగురు పిల్లల తల్లిని. మావారు బడిపంతులు. వండడం పెట్టడం ఇదే నాపని. మీలాగా నాకు చదువులేదు కదా.. అది సరే ఇంతకు ఎప్పుడు కలుద్దాం చెప్పవే. ఎప్పుడెప్పుడు మన వాళ్ళందరిని చూస్తానా అని ఉంది, ” నిట్టూరుస్తూ అంది సుజన. 


“రేపాదివారం మా ఇంటికి రావే. మావారు కూడా ఉండరు, మనిద్దరం గత జ్ఞాపకాలతో సంతోషంగా గడుపుదాము. మా ఇంటి అడ్రసు నీ ఫోన్ కు పంపుతున్నాను. తొందరగా వచ్చెయ్, నీరాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను ఉంటా, ” ఫోన్ పెట్టేసింది వసుధ. 

***


చాలా ఏళ్ళ తరువాత కలిసిన ఆనందంతో స్నేహితులిద్దరు మురిసిపోయారు. 


“అవును వసుధా .. మీరింత డబ్బున్నవాళ్ళు కదా. నువ్వేంటి ఇంత సాదసీదగా ఉన్నావు, నీగురించి ఎంత గొప్పగా ఊహించుకున్నానో తెలుసా? ఒంటినిండా నగలతో పట్టుచీరలో ఉంటావు అనుకున్నా. నీ ముందు నేను ఎలా ఉంటానో అనుకున్నాను. కానీ చూడూ.. నేను చూడు ఎంత నిండుగా తయారయ్యానో, ” ఒంపులు తిరుగుతూ నవ్వుతూ అడిగింది సుజన. 


“సుజన .. నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటినుండి ఇలానే ఉండడం ఇష్టం.

అయినా నగలున్నాయి కదా అని పొద్దస్తమానం వేసుకోలేము కదా. సందర్భాన్ని బట్టి వేసుకుంటానులే, సుజాత.. ఇప్పుడు నువ్వు తృప్తిగా ఉన్నావా ? చిన్నప్పుడు అన్నింటికీ ఇబ్బందిపడేదానివి కదా! అయినా నిన్ను చూస్తుంటేనే అర్ధమవుతుందిలే, ” సుజనను దగ్గరకు తీసుకుంటూ అంది వసుధ. 


“పోవే. ఎంతయైనా నీ అంత శ్రీమంతురాలిని కాదు. ఏదో ఉన్నంతలో ఇవే నా నగలు. నీకు ఏమేమి నగలున్నాయి వసుధ.. నాకు చూపెట్టవూ, ” గారాబంగా అడిగింది. 


“రావే చూపెడతాను, ” అంటూ చెయ్యిపట్టుకుని తన పడకగదిలోకి తీసుకవెళ్ళింది. ఆ ఇల్లు హోదా చూస్తుంటే సుజనకు కళ్ళు తిరుగుతున్నాయి. సుజన మనసులో ఏవో ఊహలు రూపు దిద్దుకుంటున్నాయన్నా సంగతి వసుధకు తెలియదు. 


“అబ్బా ఎన్ని ఉన్నాయే నీకు.. చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. వసుధా.. నాకు ఇలాంటి పెద్దగొలుసు చేయించుకోవాలని ఉంది. ఒకసారి ఇది ఇస్తావా.. మా ఆయనకు చూపెడతాను. మళ్ళి రెండు రోజుల్లో తెచ్చిస్తాను. నీకు నా మీద నమ్మకం ఉంటేనే సుమా ఏమంటావు, ” అడిగింది ఆశగా. 


“అదికాదు. ఇవ్వద్దని కాదు. కాకపోతే మా వారికి తెలిస్తే ఏమంటారోనని.. పోని ఓ పని చెయ్యి. నీ ఫోన్ లో ఫోటో తీసి చూపెట్టు సరిపోతుంది, ” తటపటాయిస్తూ చెప్పింది. 


“ అదేంటి వసుధ.. నా మీద నమ్మకం లేదా నీకు, ఇలాంటి ఫోటోలో చాలా చూపాను మా ఆయనకు. ఇలా చూసి అలా పక్కన పెడతాడు. ఇది తీసుకపోయి నా మెడలో వేసుకుని చూపెడితే ఆయనకు నచ్చుతుందని ఆశపడినాను. పోనీలే నీకు ఇవ్వాలని లేదు. స్నేహితురాలి సోమ్ము దక్కించుకునేంత దుర్మార్గురాలిని కాదు వసుధ, ” నిష్టూరం ధ్వనించే స్వరంతో అంది సుజన. 


“ అయ్యో ఎంతమాటన్నావు సుజన.. నీమీద నాకిలాంటి అభిప్రాయం ఎందుకుంటుంది చెప్పు? మా ఆయనకు కోపమెక్కువ. ఈ విషయం తెలిస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతారని అన్నానే కానీ నీకివ్వద్దని కాదు. సరేగానీ నువ్వు మళ్ళి తొందరగా తెచ్చివ్వు. ఆయనకు తెలియకుండా లోపల దాచేస్తాను సరేనా, ” సుజాత చేతిలో పెడుతూ అడిగింది. 


“వసుధ .. నీదెంత మంచి మనసో నాకు తెలియదా? అందుకే చిన్నప్పటినుండి నీ స్నేహం కోసం తపన పడేదాన్నీ, రేపే మా ఆయనకు చూపి గోల్డ్ షాపుకు తీసుకవెళాతాను. అక్కడ ఇలాంటిది తీసుకోగానే నీ దగ్గరకు వస్తాను. మరి నేను వెళ్ళిరానా, ” నవ్వుతూ వసుధ చేతిలోనుండి బంగారం తీసుకుంటూ అడిగింది. 


సుజన వెళ్ళినప్పటినుండి వసుధ మనసు మనసులో లేదు. నిజంగా నా బంగారం నాకిస్తుందో లేదో.. చాలా ఏళ్ళ తరువాత కలిసాము. చిన్నప్పటి స్నేహితురాలని తనను నమ్మాలా? తన మనస్తత్వం ఏంటో ఇప్పుడేలా తెలుస్తుంది. దేవుడా నా వస్తువు నాకు వచ్చేలా చూడు తండ్రి.. చేతులేత్తి దేవుడికి దండం పెట్టుకుంది. 


అనుకున్నట్టుగానే నాలుగురోజుల్లో వసుధ గొలుసు తెచ్చిచ్చి తను కొన్న గొలుసు చూపెడుతూ "వసుధ.. చూసావా అచ్చంగా నీలాంటిదే తీసుకున్నాను. నీ గొలుసు చూడగానే మా ఆయనకు బాగా నచ్చింది. వెంటనే షాపుకు తీసుకవెళ్ళి కొనిచ్చాడు. నీకో విషయం తెలుసా?” ఆనందం పట్టలేక చెప్పడం ఆపింది. 


సుజన ఇచ్చిన గొలుసును పరీక్షగా చూస్తూ ఏంటి అన్నట్టుగా సుజన వైపు చూసింది. 


“మా ఆయనేమన్నాడంటే ‘నీ స్నేహితురాలు దగ్గర ఏమేమి ఉన్నాయో అవి చూసి నీకు నచ్చినవి కొనుక్కో’మన్నారు, ఇప్పుడు సంపాదన బాగానే ఉందికదా అన్నారు. నాకైతే ఇదంతా నిన్ను కలిసిన వేళావిశేషం అనిపించందంటే నువ్వు నమ్ముతావా వసుధ .. ఇదిగో నా గొలుసు మొదలు నువ్వే వేసుకో” అంటూ వసుధ మెడలో వేసింది. 


వసుధకు స్నేహితురాలి మురిపెం చూస్తుంటే పాపం అమాయకురాలు అనిపించింది.

సుజనను కౌగిలించుకుని. “ సుజన .. పోనిలే మీ ఆయన మంచివాడిలా ఉన్నాడు, మనం అడిగినప్పుడు కొనివ్వరు. వాళ్ళు కొనిస్తా అన్నప్పుడే మనం కొనుక్కోవాలి, ఆలస్యం అమృతం విషం అన్నట్టు వెంటనే నీకేం కావాలో కొనేసుకో” అంది. 


“ఎలా కొనుక్కోను.. నేను షాపుకు వెళితే అన్ని నచ్చుతాయి. ఓ పట్టాన ఏది తీసుకోలేను, అప్పుడు మా ఆయనకు కోపం వచ్చి ఇక చాలు చూసింది, ఇంకోసారి వద్దామని బయటకు వచ్చేస్తాడు. ఇక బంగారం షాపుకు వెళదామంటే కూడా ఒప్పుకోడు” బేలగా ముఖం పెడుతూ అంది. 


సుజన ముఖం చూసి కిలకిలా నవ్వింది వసుధ. “ బలే తమాషాగా చెబుతున్నావే. నీకేమో బంగారం పిచ్చి మీ ఆయనకేమో ఓపిక తక్కువున్నంటుంది, పోనీ ఓ పని చేయ్యికూడదా? ఫోన్ లో గూగుల్ లో వెతికితే నీకు నచ్చినవి దొరుకుతాయి, అవి ఫోటో తీసుకున్నావనుకో నీ సరదా తీరుతుంది, మీ ఆయన సంతోషపడతాడు. ఏమంటావు, ” వస్తున్న నవ్వునాపుకుంటూ అంది. 


“ఆహా అంత తెలివే నాకుంటే షాపుకు వెళ్ళినప్పుడే కొనుక్కునేదాన్నీ, పోనీ ఒకపని చేద్దామా వసుధ, ” ఆత్రుతగా అడిగింది. 


“ఏంటీ కొంపతీసి నన్ను నీ వెంబడి షాపుకు రమ్మంటావా ఏంటే, ” ఆశ్చర్యపోతూ అడిగింది. 


“అదికాదే. నువ్వేమనుకోనంటే ఒకమాటడుగుతాను. అడిగాక కాదనకూడదు సరేనా, ” 


“సరేసరే అడుగు, ” కళ్ళెగరేస్తూ అంది వసుధ. 


“నీ దగ్గరున్న నీ నగలు ఓ నాలుగివ్వు. అలాంటివి కొని నీవి నీకు తెచ్చిస్తాను. మొన్న పెద్ద గొలుసు కొనగానే తెచ్చివ్వలేదు.. అలాగా. నీకు నమ్మకం ఉంటేను సుమా ! నేనా ఈ ఊరు విడిచి వెళ్ళిపోను. వారం రోజుల్లో అన్ని ఇచ్చేస్తాను. కాదనకే ఫ్లీజ్, ” వసుధ చుబుకం పట్టుకుని బ్రతిమాలసాగింది. 


 వసుధకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఒక్కసారిగా. నోటమాటరానట్టు సుజనను చూస్తుండిపోయింది. 


“ఏయ్ వసుధ.. ఏమిటే అలా ఉలుకు పలుకు లేని బొమ్మలా ఉండిపోయావు, నేనేమన్నా ఉత్త పుణ్యానికి అడిగాననుకున్నావా ఏంటి.. అంత భయపడిపోయావు, ” నవ్వుతూ చక్కిలిగింతలు పెట్టింది వసుధకు. 


“అబ్బా ఆగవే.. నువ్వేంటి నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నావు, అయినా నా దగ్గరున్నవన్నీ పాత డిజన్లు. ఇప్పుడన్ని కొత్తవి బోలెడన్ని డిజన్లు వచ్చాయి. నీకు తోడుగా రమ్మంటే నేను వస్తాను. ఇద్దరం కలిసి చూద్దాం, ” తప్పించుకోవడానికి అంది. 


“వద్దులే స్నేహితురాలి మీద నమ్మకం లేనప్పుడు ఏమనుకోని ఏం లాభం, సరే నేను వెళతానింక. నా బాధేదో నేను పడతానులే, ”సున్నాలా మూతిముడుచుకుని గబగబా లేచింది వెళ్ళిపోవడానికన్నట్టు. 


“అబ్బా అలా కోపంతెచ్చుకోకే. ఇవ్వడానికి భయంకాదు. మా ఆయన చూసాడంటే నిన్ను నన్ను ఇద్దరిని ఉతికిపారేస్తాడు. అందుకు భయం.అయినా నువ్వంతగా ఆరాటపడుతున్నావు కాబట్టి నీ మనసు నొప్పించడం కష్టంగా ఉంది నాకు. నా తంటాలేవో నేను పడతాను. నువ్వు మాత్రం ఆలస్యం చెయ్యకుండా తెచ్చివ్వు. మూడో కంటికి తెలియకుండానే పనైపోవాలి సరేనా, ” లోపల భయపడుతూనే నాలుగైదు డిజన్లు తెచ్చి సుజన చేతిలో పెట్టింది వసుధ. 


“అబ్బా నువ్వెంత మంచిదానివే. నిజమైన స్నేహితురాలంటే నువ్వేనే. నువ్వు నీ మాట నిలుపుకున్నావు. సరిగ్గా నాలుగురోజుల్లో నీ నగలన్ని నీ చేతిలో పెట్టి నా మాట నిలబెట్టుకుంటాను. నిన్ను ఇబ్బంది పెడుతున్నాననే బాధ ఉంది కానీ ఏం చెయ్యను.. నా వీక్ నెస్ చెప్పాను కదా, ” అంటూ గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని గబగబా బ్యాగు తీసుకుని బయలుదేరింది. సంతోషం పట్టలేకపోతుంది సుజన. 


స్నేహితురాలి ఆనందం చూస్తుంటే తృప్తిగా అనిపించింది కానీ మనసులో మాత్రం భయంగా ఉంది భర్తకు తెలిస్తే ఎక్కడ తిడతాడోనని. వారం రోజులు గడిచిపోయాయి సుజన వస్తున్న జాడే తెలియడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ 

ఎత్తడం లేదు. వసుధ గుండెలో ఒకటే దడ వస్తోంది. ఏమైంది సుజనకు.. 


నా నగలు నాకు నాలుగురోజుల్లో ఇస్తానంది. ఇంకా తేవడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు ఇచ్చాను. ఎంత లేదన్నా ఒక్కోటి నాలుగు తులాలపైనే ఉంటాయి. అంటే పది లక్షల నగదు.. అమ్మో!


గుండెలమీద చెయ్యి వేసుకుని భయపడుతూ ఒకవేళ తను ఆ రోజు బంగారం తీసుకుని క్షేమంగా ఇల్లు చేరిందా లేక దారిలో ఏదైనా ఇబ్బందికి గురైందా.. తను ఫోన్ చెయ్యకపోతే నేనైనా చెయ్యలేదే.. తనకు ఇల్లు చేరావా అని. 


ఇప్పుడెలా.. దానింటికి వెళదామన్నా ఇంటి అడ్రసు తెలియదు. ఏమిటో ఎప్పుడు అడగాలని అనుకోలేదు.. అందుకే ఈయన తిడతారు మట్టి బుర్ర అని.. ఇప్పుడేం చెయ్యాలి.. తనను ఎలా తెలుసుకోవాలి.. పోలీసు కంప్లయింట్

ఇద్దామంటే అది ఏ పరిస్థితిలో ఉందో. అమ్మో పోలీసులు ఇంటికి వచ్చారంటే ఈయనకు మొత్తం తెలిసిందంటే నా ఒళ్ళు హూనం చేసినా చేస్తారు. అసలే కోపం మనిషి. ఇలా చేసానంటే ఊరుకుంటాడా.. ఎవరికి చెప్పను?

 పోనీ ఇంకో వారంరోజులు చూస్తాను అప్పటివరకు సుజన వస్తుందేమో. ఎటూ తేలని ఆలోచనతో సతమతమౌతుంది వసుధ. 


 ఇంకో వారం పదిరోజులు గడిచిపోయాయి కానీ సుజన జాడ లేదు. ఫోన్ చేస్తునే ఉంది. ‘ఈ నెంబరుతో ఫోను పని చెయ్యడం లేదు’ అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెబుతుంది తప్పా ఫోన్ రింగైన పాపాన పోవడం లేదు. దేవుడా మంచికి పోతే నాకు చెడు ఎదురైంది..


ఎలాగైన ఈ గండం నుండి నన్ను గట్టెక్కించు స్వామి పదే పదే దేవుడి ముందు కూర్చొని వేడుకుంటూ గుమ్మం వైపే చూపులు నిలుపుకుంది. సరిగ్గా నెల రోజులకు ఎట్టకేలకు సుజన ఫోన్ ఎత్తింది. 


“హలో ఎవరు మాట్లాడుతున్నది, ” అవతలనుండి అడిగింది. 


“సుజన.. నేను వసుధను మాట్లాడుతున్నాను, ఏమైందే.. ఎక్కడకు వెళ్ళిపోయావు.. నీకోసం ఎంతగా ఎదిరి చూస్తున్నానో తెలుసా, నా బంగారం తీసుకుని పోయి నన్ను ఇలా మోసం చెస్తావా, ఇప్పుడెక్కడున్నావు.. తొందరగా నా బంగారం నాకు తెచ్చివ్వు. భయంతో నా ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి, ” ఆదుర్దాగా అడిగింది. సుజన ఫోన్ ఎత్తగానే ఆవేశం కట్టలు తెంచుకుంది వసుధలో. 


“ఏయ్ ఏం మాట్లాడుతున్నావు.. నీ బంగారం నేను తీసుకపోవడమేమిటి? నీకేమన్నా మతి చలించిందా, నువ్వే ఏం చేసావో నా మీదకు నెడుతున్నావు. స్నేహితురాలవని నీ ఇంటికి వస్తే నా మీదనే అభాండం వేస్తావా, ఛీ ఛీ.. చిన్నప్పటినుండి అంతే నువ్వు. నన్నేప్పుడు ఇలాగే ఏడిపించేదానివి. అయినా స్నేహితురాలవని నీమీద ప్రేమతో వస్తే నాకు తగిన గుణపాఠం చెప్పావు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు. ఈ ఫోన్ నెంబరు కూడా తీసీపడేస్తున్నా. చూడు.. నువ్వొక వేళ పోలీసులకు చెప్పాలని చూసినా నువ్వే నీ బాయ్ ఫ్రెండుకు ఇచ్చి నాటకం ఆడుతున్నావని మీ ఆయనకు చెబుతాను జాగ్రత్తా, నాతో పెట్టుకున్న వాళ్ళెవరూ బాగుపడలేదు. ఉంటా, ” ఫోన్ కట్ చేసింది. 


నోటమాట రాకుండా అలాగే ఉండిపోయింది వసుధ. ఎన్ని మాటలు చెప్పి ఎంత మోసం చేసింది.. చివరకు నా ఇంట్లో నన్నే దొంగని చేసింది. ఇలాంటి వాళ్ళను ఊరికే వదల కూడదు అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేసింది.


 స్విచ్చాప్ వస్తుంది. అంటే నిజంగానే ఫోన్ నెంబరు మార్చిందా.. ఇక తనను పట్టుకోవడమెలా. 


అయిపోయింది ..తను ఘోరంగా మోసపోయింది.


ఇంతకు.. మొన్న తీసుకున్న పెద్ద గొలుసు నాదేనా లేక అది కూడా మోసం చేసిందా. 


గబగబా గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి చూస్తే అది గిల్టు నగ. నోరు తెరిచి అలానే చూస్తుండిపోయింది వసుధ. 


 ******* ******** ********* ***

 

 లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 







 




 


















 


33 views2 comments

2 comentários


Lakshmii Trigulla

•18 hours ago

Thank you swapna

Curtir


swapna j

•19 hours ago

Super attayya, appatlo ilantivi baaga vinnam kada.

Curtir
bottom of page