top of page

గోవిందా.. గోవింద.. !


'Govinda Govinda' - New Telugu Story Written By Pujitha Charan

'గోవిందా.. గోవింద..!' తెలుగు కథ

రచన: పూజితా చరణ్


"అన్నీ సరిగానే సర్దినట్లేనా..? మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాక, అది మర్చిపోయాను.. ఇది మర్చిపోయానని నువ్వు టెన్షన్ పడి, నన్ను టెన్షన్ పెట్టవుకదా..!" భార్య చేతిలో, కొడుకు భుజాన.. ఉన్న బ్యాగులవంక, మిగతా లగేజీ వంక ఎగాదిగా చూస్తూ అన్నాడు భజగోవిందం.


"అన్నీ సరిగానే సర్దానండీ..!" భర్తవంక భయం భయంగానే చూస్తూ సమాధానమిచ్చింది అలివేలు.


"సర్సర్లే..అడిగినదానికిప్పుడు బాగానే సమాధానం చెప్తావు.. అవసరమొచ్చినపుడు మాత్రం ఒక వస్తువూ కంటికి కనపడి చావదు!" భార్యపై రుసరుసలాడుతూ, ఇంటి గేటు దగ్గరకు వచ్చి నిల్చున్నాడు.. బుకింగ్ చేసిన ఆటో కోసం ఎదురుచూస్తూ!


అనుకున్నదానికన్నా అరగంట ఆలస్యంగా వచ్చి ఆగింది బుకింగ్ ఆటో.


"ఏమయ్యా.. ఇప్పుడా రావడం! బుకింగ్ చేసుకున్నాక, అనుకున్న టయానికి రావాలన్న ఇంగితజ్ఞానం ఉండక్కర్లే..!" ఆటోవాడిపై గయ్యిమన్నాడు గోవిందం.


"అర్జంట్ సవారీ అండీ.. వెళ్ళక తప్పింది కాదు. అందుకే కాస్త ఆలస్యమయ్యింది!" ఆలస్యానికి కారణం చెప్పాడు ఆటోవాడు.


"కాస్త ఏంటయ్యా.. కాస్త.. ఊరకనే వస్తున్నావా ఏంటి? డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆ మాత్రం టైం పంక్చ్యువాలిటీ ఉండాలిగా..!"


"తిరుమల బండి బయల్దేరడానికి ఇంకా టైముంది కదా. అదేదో తప్పిపోయినట్లు ఎందుకలా అనవసరంగా కారంతిన్న కోతిలా అరుస్తారు!" భజగోవిందం మాటలు నషాళానికెక్కి గట్టిగానే ఇచ్చి పడేసాడు ఆటో డ్రైవర్.


తనని కోతితో పోల్చినందుకు ఒంటికాలిపై లేచాడు భజగోవిందం.


"ఏవండీ! ఆలస్యం చేస్తే అవతల ట్రైనెళ్ళిపోతుంది. మనం పెట్టుకున్న ప్రయాణం కాన్సిల్ అవుతుంది!" భర్తకు భయంభయంగానే నచ్చజెప్పింది అలివేలు. ఆ క్షణంలో తనలో తన్నుకువస్తున్న కోపాన్ని లోలోపలే అణుచుకున్నాడు భజగోవిందం.


భజగోవిందానికి పీనాసితనంతోపాటు, కూసింత కోపం కూడా ఎక్కువే. తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న రకం. అతని మాటకు ఎవరు ఎదురుచెప్పినా ఒంటికాలి బొటనవేలిపై అంతెత్తున లేస్తాడు మరి. ఆ విషయం తెలిసిన తల్లీ కొడుకు అతనిముందు నోరు మెదపలేక, ప్లాస్టర్ అతికించిన ఉత్సవ విగ్రహాలైపోతారు.


మొక్కు తీర్చుకునేందుకు వైజాగ్ నుండి భార్య, కొడుకుతో కలిసి కుటుంబ సమేతంగా, తిరుమల ఎక్స్ ప్రెస్ లో తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి బయలుదేరాడు పిసినారి భజగోవిందం.


"ఏంటలా చూస్తున్నారు! త్వరగా ఎక్కండి! నాకవతల బేరముంది!" అన్నాడు ఆటో డ్రైవర్ చిరాగ్గా.


ఆటో డ్రైవర్ వంక కొరకొరాచూస్తూ, అతని పద్ధతి నచ్చకపోయినా భార్యా కొడుకుతో సహా ఆ ఆటో ఎక్కాడు. లోలోపల అయితే ఆ ఆటో డ్రైవర్ పై మండిపోతూనే వుంది అతనికి.


రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ పద్మవ్యూహన్ని చేధించుకుని, వాళ్ళెక్కిన ఆటో రైల్వే స్టేషన్ ముందుకు తీసుకొచ్చి ఆగింది. ఆటోలోంచి గబగబా దిగి, ఆటో వెనుక కుక్కిన లగేజీ సరిచూసుకున్నాడు భజగోవిందం.


ఆ తర్వాత.."ఎంతయింది? " మొహానికి గంటుపెట్టుకుని అడిగాడు.


ఆటో మీటరు చూపించి.."లగేజీ చాలా ఉంది. మీటరుకి ఓ యాభై కలిపి ఇవ్వండి!" ఎంతివ్వాలో చెప్పాడు ఆటో డ్రైవర్.


ఆటో మీటరు చూసిన సదరు భజగోవిందం గుండె ఆ ఆటో మీటరుకన్నా వేగంగా కొట్టుకుంది. మీటర్ రీడింగ్ చూసి చిర్రెత్తుకొచ్చింది అతనికి. "అమ్మో.. అమ్మో.. ఇది ఆటో మీటరా? లేక రాకెట్ మీటరా..? అంత స్పీడుగా తిరుగుతోందేంటి! డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా..!? " మీటర్ వంకచూస్తూ అతనితో వాదనకు దిగాడు భజగోవిందం.


"ఆ..మిమ్మల్ని, మీ లగేజీనీ ఎక్కించుకుని ఇక్కడిదాకా లాక్కురావాలంటే ఆటో కాదు..ఏ టైటానిక్ షిప్పో కావాలి! ముందు డబ్బులిచ్చి ఎళ్ళవయ్యా..పెద్ద చెప్పొచ్చాడు మహానుభావుడు!" అంటూ వెటకారంగా మాట్లాడుతూ, ప్రతి వాదనకు దిగాడు ఆ ఆటోవాడు.


"ఏవండీ..అందరూ మనవైపే చూస్తున్నారు! పైగా ఇక్కడ వాళ్ళ యూనియన్ మనుషులుంటారు. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళతో మనకు గొడవెందుకు? అడిగిన డబ్బులు ఇచ్చేయండి! టైం అవుతోంది.. పైగా గొడవ ముదిరితే, మనమెళ్ళాల్సిన రైలు మనమెళ్ళే లోపలే వెళ్ళిపోతుంది..!" వాళ్ళు వాదనలు గాడితప్పి గొడవవైపు సాగడంతో చొరవ తీసుకుని భర్తకి వినబడేటట్లు నెమ్మదిగా అంది అలివేలు.


భార్య మాటలతో భజగోవిందం తన కోపాన్ని కాసేపు నియంత్రించుకున్నాడు. ఆమె మాటల్లో వాస్తవం, అక్కడి పరిస్థితులు అన్నీ అతనికి అవగతమయ్యాయి. గొడవపడినా లాభం లేదని.. అనుకున్న డబ్బుల్ని వారు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారని అర్థమయ్యింది.


ఉసూరుమంటూనే ఆ ఆటో డ్రైవర్ అడిగిన డబ్బుల్ని అతని చేతిలో పెట్టి, టికెట్ తీసుకోడానికి హడావుడిగా ఫ్యామిలీతో రైల్వే స్టేషన్ వైపు కదిలాడు.


ఆ తర్వాత ఎంక్వైరీ లో తాము వెళ్ళాల్సిన రైలు ఏ ఫ్లాట్ ఫారం మీద ఉందో కొనుక్కుని, ఫుట్ వే బ్రిడ్జి మీదుగా ఆదరాబాదరాగా మిగతా ఇద్దర్నీ తనతోపాటు లాక్కుపోయాడు. అతని చర్యలకు భార్యాకొడుకులకు తెగ చిరాకొచ్చేసింది.


అప్పటికే తిరుపతి వెళ్ళాల్సిన తిరుమల ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫాం పై బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.


ఎలాగైతేనేం ఇంజన్ పక్కనున్న జనరల్ బోగీలో ఎక్కేసారు భజగోవిందం అండ్ ఫ్యామిలీ.


జనరల్ బోగీ పెద్ద రష్ గా లేదు. సీట్లన్నీ చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. అక్కడక్కడ సీట్లలో పాసింజర్స్ కాళ్ళు బార్లా చాపుకుని కనిపించారు. తాము తెచ్చుకున్న లగేజీని బెర్తు కిందికి తోసి, ఒక దగ్గర కింది బెర్తును తమ ఫ్యామిలీతో ఆక్రమించేశాడతను.


రైలు నెమ్మదిగా కదిలి ఊపందుకుంది.


కిటికీ ప్రక్కన కూర్చున్న భజగోవిందానికి కిటికీలోంచి వీస్తున్న చల్లగాలికి హాయిగా అనిపించింది. రైలు వేగానికి చెట్లు, భవనాలు ఒకటికొకటిగా వెనక్కి పోతున్నాయి.


"చల్లగాలి తగులుతోంది కదాని, తల్లీకొడుకులిద్దరు శుభ్రంగా కునుకు తీసేరు! రైలులో దొంగ వెధవలుంటారు.. ఆ లగేజీని తిరుపతికి పోయేవరకు కాస్త కనిపెట్టుకు చావండి..!" భార్యా కొడుకుపై హుకుం జారీచేస్తున్నట్లు చెప్పి, చల్లగాలిని ఆస్వాదించడానికి కిటికీ వైపు తిరిగాడు గోవిందం.


రైలు లయబద్ధంగా ముందుకు సాగుతోంది. వారి ప్రయాణం అరగంట గడిచింది.


ఇంతలో..'వేడి వేడి సమోసా.. వేడి వేడి సమోసా.. ' అంటూ సమోసా అమ్ముకునేవాడు వాళ్ళ సీటు దగ్గరకు వచ్చాడు. భజగోవిందం కొడుకు సమోసా తింటానన్నట్లు తల్లి మొహంలోకి చూసాడు.


అలివేలు కాస్త ధైర్యంచేసి, "ఏవండీ! సమోసా తీసుకోండి. మధ్యాహ్నం ప్రయాణం హడావుడిలో ఎవ్వరమూ ఏమీ తినలేదు. బాబు ఆకలిగా ఉందంటున్నాడు!" కాస్త భయపడుతూనే కిటికీలోంచి బయటకు చూస్తున్న భర్తని అడిగింది.


"ప్రయాణం ఆసాంతం కనిపించిందల్లా కొనుక్కుని తినడానికి మనమేమన్నా కోటీశ్వరులమా! లేక డబ్బులేమన్నా ఊరకే వస్తున్నాయా! రైలు దిగాక కడుపునిండా తిందురులెండి. పైగా ఇలా బయట తినడం ఆరోగ్యానికి హానికరం..!" అని చిరాకుపడుతూ మళ్ళీ కిటికీ వైపు తిరిగిపోయాడు భజగోవిందం. చల్లగాలిని ఆస్వాదించడానికి!


అతని మాటలకు అలివేలు మనసు చివుక్కుమంది. భర్త పిసినారితనం తెలిసి అడగడం తన బుద్ధి పొరపాటని అనుకుని, ఆ తర్వాత ఇంకేమీమాట్లాడకుండా గమ్మునుండిపోయింది. వాస్తవానికి మధ్యాహ్నం సరిగా తినకపోవడం వలన అతనికీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అతనికి సమోసాలు కొనాలని ఉన్నా, అతనిలో పిసినారి తనం అతన్ని కొనకుండా చేసింది.


తర్వాత చాలా రకాల తినుబండారాలమ్మే వాళ్ళు బోగీలోకి వచ్చారుగానీ, భజగోవిందం ముఖంవైపు చూసి ధైర్యంచేసి అడగలేక తలదించుకున్నారు తల్లీ కొడుకులు.


చీకటి పడింది..రైలులో లైట్లు వెలిగాయి..రైలు తన గమ్యస్థానం చేరడానికి హుషారుగా పట్టాలపై పరిగెడుతోంది.


కొంత సమయం దాటాక రైలు ఏదో స్టేషనులో కాసేపు ఆగింది.


ఎవరో అమ్మాయి బోగీలోకి వచ్చి, భజగోవిందం కూర్చున్న బెర్తు ఎదురుగా ఖాళీగావున్న బెర్తులో వచ్చి కూర్చుంది. ఆమెను నిశితంగా పరిశీలించాడతను. ఆమె వస్త్రధారణ బట్టి.. కలిగిన కుటుంబం నుంచి వచ్చినమ్మాయిలా, బాగా చదువుకున్నట్టు, చాలా ఆధునికంగా ఉన్నట్లు కనిపించింది అతని కంటికి.


'అయినా..బోగీలో ఇన్ని బెర్తులు ఖాళీ ఉండగా, ఇక్కడికే వచ్చి తగలడిందెందుకో..!? ' అని మనసులో అనుమానపడుతూనే, కిటికీలోంచి వస్తున్న చల్లగాలిని ఆస్వాదిస్తూ, ఆ అమ్మాయిని ఓ కంట కనిపెట్టసాగాడు భజగోవిందం.


రైలు ఆ స్టేషన్ ని విడిచిపెట్టి ముందుకు సాగింది. కిటికీలోంచి బయటకు చూశాడతను. బయటంతా చీకటిగా కనిపించింది. బయటనుండి వీస్తోన్న చల్లని గాలికి కనురెప్పలు మూతలుపడసాగాయి. కానీ ఆ అమ్మాయి ఆరాత్రి అతని నిద్రను దూరం చేసింది.


కాలగమనంలో ఇంకొంత సమయం గడిచింది.


తమవెంట తెచ్చుకున్న బ్యాగులోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి తినబోయి.. ఎదురు సీటులో కూర్చున్న భజగోవిందం ఫ్యామిలీని చూసి చిన్నగా నవ్వింది ఆ అమ్మాయి.


ప్రతిగా నవ్వాలనుకుందిగానీ, చండశాసనుడైన భర్త ముఖం గుర్తొచ్చి ఆ సాహసం చెయ్యలేకపోయింది అలివేలు. భజగోవిందం మాత్రం ఆ అమ్మాయి తమవైపు చూసి నవ్వినా తమకు కాదన్నట్లు చూసి ఊరుకున్నాడు.


తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ లోంచి కొన్ని బిస్కెట్లుతీసి భజగోవిందం కొడుక్కి ఇవ్వబోయింది ఆ అమ్మాయి. ఆ బిస్కెట్లవంక ఆశగానూ, ఆకలిగానూ చూశాడు భజగోవిందం కొడుకు.


కొడుకు వాలకం చూశాడు. ఆమె చేతిలోని బిస్కెట్ ప్యాకెట్ లాగేసుకునేటట్లు కనిపించాడు. కొంపదీసి అలా చేస్తాడేమోనని కంగారుపడి, ముందుగానే మేల్కొని.. "వద్దులేమ్మా.. మాకు బయట చిరుతిళ్ళు అలవాటులేదు!" అన్నాడు భజగోవిందం.


"ఏంటంకుల్.. ఇందులో నేనేమన్నా కలిపానేమోనన్న అనుమానమా..!? " అని నవ్వుకుని ప్యాకెట్ ని తెరిచి తనో బిస్కెట్ తీసుకుని తింది ఆ అమ్మాయి.


"అలాగని కాదు.." ఆమె మాటలకు ఏం చెప్పాలో తెలియక గమ్మునుండిపోయాడు.


"నిజమేలే అంకుల్! ఇలాంటి ప్రయాణాల్లో అపరిచితుల్ని అస్సలు నమ్మకూడదు. అలా అని బోగీలో ఎక్కేవారందరూ దొంగలు కారు..మీతో సహా! అలా అనుకుంటే తప్పవుతుంది. మరీ మడికట్టుకున్నట్లు కాకుండా, మన గమ్యం చేరేవరకు కాస్త కలివిడిగా ఉండి, సరదాగా జర్నీ చేయలనే ఆశతో బిస్కెట్ ప్యాకెట్ ని ఆఫర్ చేశాను. మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులెండి..!" వాళ్ళ వైపు చూస్తూ అంది ఆ అమ్మాయి.


ఆ అమ్మాయి మాటలు నిజమే అనిపించాయి భజగోవిందానికి. 'జర్నీ చేసేవారందరూ దొంగలు కాదు కదా!' అని మనసుని సమాధానపరుచుకున్నాడు. అప్పటికే ఆకలితో వాళ్ళ కడుపులు నకనకలాడుతున్నాయి. పైగా ఫ్రీగా వస్తున్న బిస్కెట్ ప్యాకెట్ ని ఎందుకు వద్దనుకోవాలి అనుకున్నాడు.


ఆమిచ్చిన బిస్కెట్ ప్యాకెట్ ని ఆనందంగా తీసుకున్నాడు భజగోవిందం. ఆ తర్వాత ఆ ప్యాకెట్ ని ముగ్గురూ పంచుకుని ఆబగాబగా తినేసారు. బాగా ఆకలితో ఉండటం వల్ల ఆమిచ్చిన క్రీం బిస్కెట్లు చాలా రుచిగా అనిపించాయి వాళ్ళకి.


చీకటిని చీల్చుకుని రైలు ముందుకు దూసుకుపోతోంది..బోగీలోని పల్చగా ఉన్న ప్రయాణీకులు ఒక్కొక్కరిగా నిద్రలోకి జారుకుంటున్నారు.


కాసేపటికీ కాస్త మత్తుగా, కళ్ళు మూతలు పడుతున్నట్లు అనిపించాయి భజగోవిందం అండ్ ఫ్యామిలీకి. జరిగినదేమిటో నెమ్మదిగా అర్థమయ్యేలోపే ఉన్నచోటనే సీటులో వాలిపోయారు ముగ్గురూ.


ఆ అమ్మాయి ఇచ్చిన మత్తు క్రీం బిస్కెట్లు బ్రహ్మాండంగా పనిచేసాయి. అంత తొందరగా ఆ ఫ్యామిలీకి స్పృహ వచ్చే అవకాశమే లేదని నిర్థారించుకున్నాక, ఆ అమ్మాయి పెదాలపై చిక్కటి చిరునవ్వు మొలిచింది.


ఆధునికంగా కనిపిస్తూ, తన మాటలతో నమ్మిస్తూ, భజగోవిందం లాంటి ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ చాలా కాలంగా రైలులో చాకచక్యంగా దొంగతనాలు చేస్తోందామె.


అయితే నిజానికి పై రెండు బిస్కెట్లు మాత్రమే స్వచ్ఛమైనవి. అందుకే భజగోవిందాన్ని నమ్మించడానికి ఏ బెదురూ లేకుండా తిందామె! కానీ తర్వాత ఉన్నవన్నీ మత్తు పదార్థం కలిపిన క్రీం బిస్కెట్లు. ఆ సంగతి తెలియని భజగోవిందం అండ్ ఫ్యామిలీ ఆ కిలాడి అమ్మాయి చేతిలో మోసపోయారు.


మొత్తానికి తన పధకం పారినందుకు సంతోషించి, తదుపరి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి తర్వాత వచ్చే స్టేషనులో దిగిపోయిందామె.


తెల్లారింది..


బయట గోలగోలగా ఉండటంతో మెలుకువ వచ్చింది ముగ్గురికీ. చుట్టూ చూశారు..తామెక్కిన రైలు గమ్యస్థానం చేరి తిరుపతి స్టేషనులో ఆగి ఉంది. ఒక్క క్షణంలో మత్తు వదిలింది ముగ్గురికీ..!


ముందుగా భజగోవిందం తేరుకున్నాడు. ఎదురు బెర్తువైపు చూశాడు. బెర్తు ఖాళీగా కనబడింది. ఆ బెర్తేకాదు బోగీ అంతా ఖాళీగానే కనపడింది. తమకు క్రీం బిస్కెట్స్ ఇచ్చిన అమ్మాయి కోసం వెదికాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. తాము నిలువునా మోసపోయామని తెలుసుకోడానికి అర క్షణం పెట్టలేదు భజగోవిందానికి.


కింది బెర్తు కింద అయితే తమ సూట్ కేస్ కనపడింది. కానీ అందులో పెట్టిన డబ్బు కనపడలేదు. భార్య మెడలోనున్న నగా నట్రా ఒలుచుకుపోయిందా కిలాడి. తన చేతికి తగిలించుకున్న వాచీ, చేతివేళ్ళకు పెట్టుకున్న బంగారపు ఉంగరాలన్నీ.. అన్నీ.. సర్వం 'గోవిందా.. గోవింద.. !'


నిలువ దోపిడీ జరిగిన తమ పరిస్థితికి గొల్లుమన్నాడు భజగోవిందం. అతనికి శృతి కలిపారు మిగతా ఇద్దరు.


***** సమాప్తం *****

పూజితా చరణ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పూజితా చరణ్

నా పేరు వాడపర్తి వెంకటరమణ. కలం పేరు 'పూజితా చరణ్'. వృత్తి వ్యవసాయం. ప్రవృత్తి సాహిత్యం. ఇంతవరకు నేను రాసిన కథలు, కవితలు కొన్ని ఆఫ్లైన్, ఆన్లైన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో కొన్నింటికి బహుమతులు కూడా అందుకున్నాను. అందులో ఆంధ్రభూమి (వార,మాస),విపుల, బాలమిత్ర, విశాలాక్షి, నెచ్చెలి, సంచిక, తర్జని, ధర్మశాస్త్రం, తపస్వి మనోహరం ఉన్నాయి. తాజాగా ప్రభాత వెలుగు - దర్వాజ సండే సప్లిమెంటరీలో ఓ బాలలకథ ప్రచురితమైంది. ఓ ప్రముఖ ఎఫ్. ఎం. ఛానెల్ కు కంటెంట్ రైటర్ గా వర్క్ చేశాను. అలాగే 'ఇయర్ హుక్ ' ఓటీటీ ఆడియో యాప్ వారికి కొందరు ప్రముఖుల బయోగ్రఫీలు రాశాను. ప్రస్తుతం ఫ్రీలాన్స్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. ధన్యవాదాలు...




Comments


bottom of page