top of page
Writer's pictureDasu Radhika

గోవిందా గోవింద


Govinda Govinda New Telugu Story


Written By Dasu Radhika


(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

కవిత మొహమంతా ముచ్చమటలు పట్టాయి.. కంగారుగా తుడుచుకొని ఎదురు గా అల్మారా లో కనిపించిన చీర, మ్యాచింగ్ బ్లౌసు దొరక లేదు, దొరికిందే వేసుకుని లల్లీ గది నిండా పరిచిన బొమ్మలను తీసి బుట్ట లో సర్ది పెట్టింది.. స్నానం హాయిగా చేసిన తృప్తి కలగ లేదు కవిత కు.. రోజూ కూడా అంతే.. ఎవరైనా తన కూతురిని కాసేపు కనిపెట్టు కుంటే తప్ప అది కుదరదు..

ఈ రోజు అయితే బాత్రూమ్ లోకి అడుగు పెట్టగానే ఆ వెధవ వాచ్మాన్ చూసే పిచ్చి చూపే గుర్తొచ్చింది.. నిజంగానే ఎక్కడి నుంచో చూస్తు ఉన్నాడేమో అని భయం వేసింది తనకు.. దాంతో చెమటలు పట్టేశాయి..

ఏం ఖర్మ రా బాబు.. ఇలాంటి రోజు కూడా వస్తుందని కలలో కూడా ఊహించ లేదు..

సంవత్సరం అయింది ఆ ఇంట్లోకి మారి.. రెండు నెలల క్రితం మేడ మీద ఇంకో అంతస్తు కట్టాలనే ఉద్దేశంతో పని మొదలైంది.. అప్పుడే వీరయ్య ని వాచ్మాన్ గా పెట్టి వెళ్ళాడు ఇల్లు గల ఆయన భూషణం గారు..

"ఒక్క ఆరు నెలలు ఓపిక పడితే అయిపోతుంది" అన్నాడు ప్రకాష్ కవిత తో.. ఇప్పటికి రెండు నెలల అయింది.. చుక్కలు కనిపిస్తున్నాయి కవిత కు..

ఇల్లంతా దుమ్ము, ధూళి.. ఇల్లు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది.. కొత్త గా ఈ పని కోసమే కొన్న రోబో ను కవిత బాగా వాడుతున్నది.. కాని నెత్తి మీదే అవడం తో చాలా కష్టంగా ఉంది..

ప్రకాష్ వారం లో రెండు రోజులు- శనాదివారాలు- ఇంట్లో ఉంటేనే దుమ్ము వల్ల ఎలర్జీ వచ్చి ఎప్పుడూ జలుబు, దగ్గు తో బాధ పడుతూ ఉన్నాడు..

ఆ పై ఇద్దరు పిల్లలు.. బాబీ ఇంకా మూడింటి దాకా బడి లో ఉండి ఒక సందు అవతల ఉన్న స్కూల్ నుంచి ఆటో ఎక్కి వస్తాడు..లల్లీ అయితే పూర్తిగా అదే గాలి, దుమ్ము లో ఉంటోంది కవిత తో పాటు..

వీరయ్య ఇంటికి ముందు వైపు న ఉన్న గేటు దగ్గరే వేళ్లాడుతూ ఉండే వాడు..

గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ కి గేట్ కీ మధ్యలో కొంచెం స్థలం ఉంది.. అక్కడ తను ఇంట్లో ఉన్న రోజు కాసేపు ప్రకాష్ షటిల్ ఆడాల్సినదే కవిత తో.. లల్లీ పడుకున్న సమయంలో..

వీరయ్య దూరంగా నిలబడి చూస్తుండేవాడు.. కవిత ఆట లో అతను వచ్చాక చాలా మార్పు వచ్చింది..ఏకాగ్రత కోల్పోయింది.. వీరయ్య చూపు కవిత కు అతను వచ్చిన రోజు నుండి నచ్చ లేదు.. ప్రకాష్ కి చాలా సార్లు చెప్పింది కాని ప్రకాష్ పట్టించుకోలేదు..

వీరయ్య ప్రవర్తన ప్రకాష్ ఉన్నప్పుడు ఒక లాగా, లేనప్పుడు మరో లాగా ఉండేదని కవిత అభిప్రాయం..

అప్పుడప్పుడు పక్క ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన రజనీ సాయంత్రం పూట కాసేపు కవిత దగ్గర కూర్చుని వెళ్లేది.. ఇంటి ముందు వచ్చే కూరగాయల బండీ దగ్గర ఇద్దరికీ పరిచయం అయింది.. ఒక నెల రోజులు ఏవో ఫంక్షన్ల పేరు తో సరదాగా తన అక్క ఇంట్లో గడపటానికి వచ్చింది రజనీ..

అసలు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనబడే వాడు కాదు వీరయ్య.. కానీ రజనీ వెళ్లిన మరు క్షణం ఏదో ఒక కిటికీ కి తలకాయ ఆనించి లోపలికి కవిత కోసం చూస్తూ ఉండేవి అతని కళ్ళు..

హాల్లో పిల్లను ఆడించు కుంటూ ఉంటే తల ఎత్తితే కనిపించే వాడు కవిత కు.. ఎన్నో సార్లు ఏంటి వీరయ్య, నీకేమీ కావాలి అని కవిత మేక పోతు గాంభీర్యం తెచ్చుకుని అడిగితే ఆమెను పై నుంచి కింద వరకు నమిలి మింగేసేటట్లు చూసే వాడు..

ఒక్కో రోజు అన్నం కూడా సరిగ్గా తినేది కాదు కవిత.. ఏదో భయం పట్టుకుంది.. బాబీ స్కూల్ నుంచి ఆటో లో వచ్చే ఏర్పాటు చేసు కున్నారు.. కవిత కు కష్టమని.. ఒక సందు అవతల నుంచి వాడు ఇల్లు చేరే లోపల కవిత చాలా ఆందోళన చెందేది..

ప్రకాష్ తో ఒక రోజు గట్టిగా మాట్లాడి చూసింది..

"కవితా ప్లీజ్, ఏమైయింది నీకు.. నువ్వు ఇద్దరి పిల్లల తల్లివి.. అనవసరంగా భయ పడుతున్నావు.. నీకేదయినా అవుతుందేమో అని నాకు మాత్రం భయం అనిపించదా?

భూషణం గారిని కూడా అడిగాను వీరయ్య సంగతి.. బాగా తెలుసు అని చెప్పారు"..

"మనం ఇల్లు మారి పోదాము ప్రకాష్" అన్నది కవిత.. “ఇక్కడే దగ్గర లో రెండు వీధులు అటు ఇటు వెతికితే ఏదో ఒకటి దొరుకుతుంది బాబీ బడి దగ్గర.. చూడు ప్రకాష్.. చిన్న ఇల్లు అయినా సరే.. మళ్లీ తరువాత చూసు కొందాము.. అసలు ఫ్లాట్ అయితే గొడవే లేదు.. బోలెడు సెక్యూరిటీ.."

"ఏం మాట్లాడు తున్నావు కవిత? అన్ని సార్లు ఈ పిల్లల తో..ఎలా??"

రజనీ వచ్చింది ఇంత లో.. "హలో రజనీ గారు, ఎలా ఉన్నారు" అని పలకరించాడు ప్రకాష్.. "హలో అండీ, బావున్నాను, రేపు ఊరు వెళ్లి పోతున్నాను, కవిత తో చెప్పి పోదామని వచ్చాను" అన్నది..

కవిత కు అసలే ప్రకాష్ మాటలు చికాకు గా ఉన్నాయి.. ఒక్క సారి ఇంకా భయం వేసింది.. “రజనీ, నువ్వయినా ప్రకాష్ కు చెప్పు.. ప్లాస్టరింగ్ చేస్తున్నారు పైన.. దాని వల్ల పిచ్చి చల్ల గా ఉంటోంది ఇల్లు.. పిల్లలు అడ్డం పడుతారు..ఇల్లు మారితే మంచిది..” కవిత టీ కలుపుకుని వచ్చింది రజనీ తో మాట్లాడుతూనే..


వంటయింటి కిటికీ లో వీరయ్య ని చూసి నట్లు అనిపించింది..దొడ్డి తలుపు తీసి అటు వెళ్లి చూస్తే లేడు..

అప్పుడు ప్రకాష్ రజనీ తో అన్నాడు.. "మా ఆవిడ వీరయ్య ని చూసి భయ పడుతోంది.. మీకు తెలుసా?"

"అదేమిటి కవితా, ఎందుకు? అతని పని అతను చేసుకు పోతాడుగా.. మన జోలికి ఎప్పుడు వచ్చాడు?" రజనీ ఆశ్చర్యంగా అన్నది..

"అలా చెప్పండి".. అన్నాడు ప్రకాష్..

"సరే మరి, వస్తాను కవితా, టీ చాలా బాగుంది.. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తాను.. ఇప్పుడప్పుడే ఏమీ లేవు నాకు తెలిసి"..

కవిత బాధ పడలేక ప్రకాష్ బయట వాక్ వెళ్లినప్పుడు ఒక రెండు మూడు వీధుల్లో ఇళ్లు ఏమైనా ఖాళీ ఉన్నా యేమో అని కనుక్కున్నాడు.. ఎక్కడా లేవు..

సగం సేపు కవిత కు చీర సర్దు కోవడం లేదా పంజాబి డ్రస్ మీద వేసుకునే చున్నీ ని సరిగ్గా కప్పు కోవడం తో సరి పోతోంది.. ఏ కిటికీ లో నుంచి ఏం చూస్తున్నాడో ఆ వెధవ అని.. కానీ పిల్లలు చిన్నప్పుడు కష్టం.. ఎప్పుడూ తల్లి చీర ను, చున్నీ ని చీర కొంగు అనుకొని, లేదా జుట్టు నో లాగి పీకి పెడతారు.. కిటికీలు అన్నీ వేసుకోని ఎవరు ఉండ గలరు ?

ఒక వారం పది రోజులు బాబీ కి జ్వరం వచ్చింది.. డాక్టర్ దగ్గర కు వెళ్లడం, మందులు టైమ్ కి వేయడం, ఇంటి పని తో సరి పోయింది కవితకు.. రాత్రిళ్లు నిద్ర లేక పగలు లల్లీ పడుకున్న వెంటనే కవిత కూడా పడుకునేది.. ప్రకాష్ చేసేది లేక హీటర్ తెచ్చి పెట్టాడు పిల్లల కోసం.. వారం పట్టింది బాబీ కి జ్వరం తగ్గటానికి..ఇంకో వారం పట్టింది బడి కి వెళ్ళటానికి.. ఆ పది రోజులు కవిత వీరయ్య సంగతి మర్చి పోయింది..

మళ్లీ పొద్దున స్నానం చేసేటప్పుడే..ఇవాళ ఆ వెధవ జ్ఞాపకం వచ్చాడు.. తులసి మొక్క లో నీళ్లు పోసి వెనక్కి తిరిగింది.. ఎదురు కుండా బాగా డోస్ వేసుకున్న ఎర్ర కళ్ల తో ఊగి పోతున్నాడు వీరయ్య.. లోపల లల్లీ ఏడుపు వినిపిస్తోంది.. అడ్డం రా బోతే తప్పు కొని ఇంట్లో కి వెళ్ళి తలుపులు గట్టిగా బిగించు కుంది కవిత..

లల్లీ కి కాస్త ఇడ్లీ పెట్టి ఆ తరువాత ప్రకాష్ కు ఫోన్ చేసింది.. బిజీ గా ఉండి ఫోన్ ఎత్త లేదు ప్రకాష్.. సాయంత్రం వీలు అయినప్పుడు ఇంటికి ఫోన్ చేశాడు ప్రకాష్.. కవిత కు దుఃఖం వచ్చింది.. ఫోన్ తియ్యలేదు..

ఆ సాయంత్రం ప్రకాష్ ఇంటికి వచ్చాక ఇంట్లో గోడవ అయింది.. కవిత చెప్పింది విన్నాడు కానీ ప్రకాష్ నమ్మ లేదు.. ఆఫీసు నించి వచ్చినప్పుడు గేట్ దగ్గర ఫ్రెష్ గా కనిపించాడు వీరయ్య..

కవిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నదో అర్థం కాలేదు ప్రకాష్ కు.. కవిత తల్లి ని ఫోన్ చేసి రమ్మని అడిగాడు.. ఒక నెల అయినా ఉండేట్లు రమ్మంటే ఆవిడ ఒక వారం రోజుల కోసం వచ్చింది.. కారణం ఇదీ అని ప్రకాష్ చెప్పలేదు.. కవిత కూడా తల్లి తో ఆ సంగతి చెప్పలేదు. తన తల్లి తండ్రి కంగారు పడతారని..

ఆ వారం వీరయ్య ఊరు వెళ్ళి పోయాడు.. కవిత, ప్రకాష్ ఆ వారం రోజులు చాలా హ్యాపీ గా గడిపారు.. అత్తగారు పిల్లల ను చూసు కుంటే వీళ్లు చెట్టా పట్టాలు వేసుకుని సినిమా ల కు, షికార్లకు తిరుగారు.. కవిత మళ్లీ కొంచెం నవ్వుతూ తుళ్ళుతూ ఉంది.. ప్రకాష్ కు తన హనీమూన్ రోజులు గుర్తుకు వచ్చాయి..

అప్పట్లో వేసుకున్న తన కిష్టమైన జీన్స్, దాని మీద రెండు స్లీవ్లెస్ టాప్స చాలా కాలానికి తీసి మళ్లీ వేసు కుంది కవిత.. ఎంత సన్నపడిందో బాగా తెలిసింది ప్రకాష్ కు.. చాలా అందంగా ఉంది కవిత.. విసుకు పుట్టే అన్ని ఎక్కువ ఫోటోలు తీసు కున్నాడు..

చూస్తుండగా వారం గడిచి పోయింది.. అత్తగారు కవిత నే పుట్టింటికి పంపమని అల్లుడు తో చెప్పి తిరిగి వెళ్లిపోయింది..

ఆ మరునాడే మళ్ళీ వీరయ్య వచ్చాడు.. "చచ్చినాడు.. ఎట్లా తెలుసు వీడికి అమ్మ వెళ్ళి పోయిందని".. అన్నది కవిత.. ప్రకాష్ జవాబు చెప్పే లోగా భూషణం గారు వచ్చారు..పైన కట్టి నంత వరకు చూడడానికి.. కాసేపు కింద కూర్చొని వెళ్లాడు..

కవిత ఆయన తో వీరయ్య సంగతి చెప్పాలని రెడీగా ఉంది.. ప్రకాష్ వద్దన్నాడు.. అనవసరంగా నలుగురు నోట్లో పడతాము అన్నాడు.. "మీ అమ్మ ఉందని కాదు కవితా.. ఈ వారం పైన పని జరగలేదు.. నీకు అది కూడా తెలియలేదు.. అయినా ఏం జరిగిందని చెబుతావు" అన్నాడు..

ఆ మాటకు కవిత కు ప్రకాష్ మీద చాలా కోపం వచ్చింది.. “ఏదైనా జరిగే దాకా వెయిట్ చేస్తావా ప్రకాష్?”

ప్రకాష్ కవిత ను మందలించాడు.. వచ్చే వారం తిరుపతి వెళ్లి వద్దామన్నాడు..

ఒక రోజు మధ్యాహ్నం అటక మీద ఉన్న సూట్కేసు తీసి ప్రయాణానికి బట్టలు పెడదామని సర్దుడు మొదలు పెట్టింది.. రోజుకు కొంచెం సర్దు కుంటే తప్ప ఈ పిల్లల తో అవ్వదనుకుంది..

బీరువా తీసి మెల్లగా రెండు పట్టు చీరలు తీసి పెట్టె లో పెట్టింది.. ఒక చిన్న నెక్లెస్ తీసి వాటి తో పాటు పెట్టు కుంది..

ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు అయింది. వెళ్లి తీసింది.. కొరియర్ బాయ్ వచ్చాడు. వాడి వెనకాలే వీరయ్య ఉన్నాడు.. లోపల బీరువా లాకర్ తెరచి ఉన్నది.. అంతా వాకిట్లో కి కనిపిస్తోంది.. కొరియర్ బాయ్ వెళ్తుండగా కవిత తలుపు వేసు కుంటూ ఉంటే పెద్ద గా నవ్వాడు వీరయ్య..

లోపలికి రానీయకుండా తలుపును వేసు కుంది..

వీరయ్య అంత గట్టిగా ఎందుకు నవ్వాడో కవిత కు అర్థం కాలేదు.. ఏం చేస్తాడో.. భగవంతుడా..

ఒక నాలుగు రోజులు మధ్యాహ్నం పూట పెట్టెలు సర్దుతూ కూర్చుంది కవిత.. ఆ సమయం లో ఇంటి కిటికీలు అన్నీ వేసేది..

ఆదివారం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రకాష్ ని అన్నీ తలుపులు వేసి లోపలకు పిలిచినది.. "ఏంటి కవిత?" అడిగాడు ప్రకాష్.

"ఇదిగో చూడండి బీరువా లో ఉన్న నా నగలన్నీ తీసి కొన్ని వంట ఇంట్లో, కొన్ని అటకల మీద ఇలా దాచి పెడతాను.. ఆ వెధవ వాచ్మాన్ నిన్న గట్టిగా నవ్వాడు".. అంది కవిత..

ప్రకాష్ అడిగాడు "అసలు నాకు తెలయక అడుగుతున్నాను - వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్?"

కవిత చిరాకు పడింది "నీకు ఏమీ అర్థం కాదు ఎందుకు ప్రకాష్? మనము ఊరు వెళ్లాక వాడు మన ఇంట్లో దొంగతనం చేస్తే ? అందుకే నా చంద్రహారం తీసి వంట ఇంట్లో బియ్యం డబ్బా లో వేశాను.. బాగా లోపలికి పెట్టాను.. అలాగే ఎండు మిర్చి డబ్బా లో గాజులు కొన్ని పెట్టాను. ఇంకా వెండి సామాను అటక మీద పెట్టాలి..మిగిలిన బంగారం కూడా అటక మీద పాత బట్టల మూట లో పెట్టాలి"..


"కవిత, ఏం మాట్లాడుతున్నావు ? ఇంతకు ముందు మనం ఊరు ఎప్పుడూ వెళ్ల లేదా? ఏమయినది నీకు? "

"ఆ వీరయ్య వల్లే ఇలా అవుతోంది.. ఐ కాంట్ టేక్ రిస్క్ ప్రకాష్" అన్నది కవిత..

"అందుకే కదా ఊరు వెళ్తున్నాము.. నీకు మార్పుగా ఉంటుందని " అన్నాడు ప్రకాష్..

"ప్లీజ్ ప్రకాష్ నా మాట విను.. కొంచెం అటక మీద నుండి నేను అడిగినవి కింద పెట్టు".. అంది కవిత..

ఆ రకంగా ఊరు వెళ్లే నాటికి సర్దుడు పూర్తి చేసి రెడీ అయింది కవిత..

రాత్రి ట్రైన్ కి బయలుదేరి మర్నాడు పొద్దున తిరుపతి చేరుకున్నారు.. ఫస్ట్ క్లాస్ కూపే లో హాయిగా వెళ్లారు.. కూపే లో మూడో వ్యక్తి ఎవరూ ఉండరు.. కవిత వాలకం చూస్తే ప్రకాష్ కు అనిపించింది- ఎందుకొచ్చిన గోల.. మామూలు కోచ్ లో ఎక్కినప్పటి నుంచి వాడు నన్ను చూస్తున్నాడు వీడు నవ్వాడు అని కవిత మొదలు పెడితే తన పని గోవింద..

కూపే అయితే వాళ్ళిద్దరే ఉంటారు.. తలుపు వేసుకుని బెడ్రూమ్ లో ఉన్నట్లు నిశ్చింతగా పడు కోవచ్చు.. కవిత కు మూడు ఉంటే పిల్లలు పడుకున్నాక కొంచెం రొమాన్స్ చేసుకోవచ్చు..

అన్నీ ఏర్పాట్లు ముందే పకడ్బందీగా చేశాడు ప్రకాష్.. ఈ పిల్లలను వేసుకుని తన వల్ల కాదని తెలిసిన వాళ్ల ద్వారా మంచి వీ ఐ పీ కాటేజ్బు క్ చేసుకున్నాడు.. రైలు దిగి కాటేజ్ కి వెళ్ళి అక్కడే తలనీలాలు సమర్పించి కాసేపు విశ్రాంతి గా టిఫిన్ తిని అక్కడ పరిసరాల్లో పిల్లల కు కొన్ని ఫోటోలు తీశాడు ప్రకాష్. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు మరియు మర్నాడు సుప్రభాత దర్శనం టికెట్లు ఉన్నాయి.. మర్నాడు రాత్రి రైలు కు తిరుగు ప్రయాణం..

కొండ పైన రష్ ఎప్పటి లాగే ఉంది.. ఎక్కడ చూసినా జనం.. సర్వ దర్శనం లో 15 గంటలు పడుతోందని అక్కడ సిబ్బంది చెప్పారు.. పిల్లలను, సామానులను భుజాన, తల మీద పెట్టుకొని క్యూ లో కి వచ్చేస్తారు.. వాళ్లే స్వామి కి నిజమైన భక్తులు.. కాస్త హాయిగా వెళ్లాలంటే తన లాగే అందరూ ఎవరో ఒకళ్లను పట్టుకుని తేలిక గా స్వామి దర్శనం కోసం పాటు పడుతారు..

కవిత హోటల్ లో పిల్లలకు మధ్యాహ్నం అన్నం పెడుతున్న సమయంలో ప్రకాష్ ఫోను మోగింది.. ఎవరా అనుకుంటూ హలో అన్నాడు.. పేరు రాలేదు.. కొత్త నెంబర్.. హోటల్ లో గోల గా ఉందని కొంచెం పక్కకు వెళ్లి మాట్లాడుతూ నుంచున్నాడు..

వీరయ్య మాట్లాడుతూ ఇంట్లో దొంగతనం జరిగింది, ఎవరో తాళం పగలగొట్టి సామాన్లు దొంగిలించాడని చెప్పాడు.. అడ్డు పడ్డందుకు బాగా గాయాలయ్యాయి

తన ఫోన్కూడా ఆ గలాటా లో ఆ దొంగలు లాగేసుకున్నారు అని ఒక కట్టు కథ అల్లి ఏడుస్తున్న గొంతు లో ఇంటి ముందు వెళ్తున్న మనిషి ఫోన్ తీసుకుని ఫోను చేస్తున్నా అని చెప్పాడు.

ప్రకాష్ కు ఒక్క నిమిషం భయం వేసింది..బుర్ర పని చేయలేదు.. వెంటనే తన స్నేహితుడు ఒకతను సర్కిల్ ఇనస్పెక్టర్ గా ఉన్నట్లు గుర్తుకు వచ్చింది.. అతని నెంబర్ తన దగ్గర లేదు.. ఇంకో ఫ్రెండ్ కు ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నాడు..

ఈ లోపు కవిత పిల్లల తో సహా బయట కు వచ్చి ఏంటి సంగతి అని అడిగింది..

"ఆకలి వేస్తోంది.. ఆర్డర్ చెప్పాను", తినడానికి రమ్మని పిలిచినది.. ప్రకాష్ మొహం చూసి కవిత కు అనుమానం వచ్చింది.. అతను తనని పట్టించుకోవడం లేదు.. వరసగా ఫోన్లు చేస్తున్నాడు.. అత్తగారు, మామగారికి విషయం చెప్పాడు.. పోలీసులు వెళ్ళే టైమ్ కు వాళ్ళని అక్కడికి వెళ్లమని చెప్పాడు..

కవిత నిర్ఘాంత పోయింది.. టెన్షన్ తట్టుకోలేక ఏడుపు మొదలు పెట్టింది.. దాంతో పిల్లలు బిక్క మొహం వేశారు..

ఆ పూట కు భోజనం ప్రాప్తం లేక పోయింది.. ఎలాగో కాటేజ్ కి వచ్చారు.. తిరిగి వెళ్లాలంటే రాత్రి రైలు తప్ప దిక్కు లేదు.. ఉన్న ఒక్క ఫ్లైట్ బుక్ అయిపోయింది..టైమ్ కూడా సరిపోదు..

ఒక్క క్షణం దర్శనం గురించి ఆలోచించాడు ప్రకాష్.. చేసుకుని వెళ్తే బావుండు అని.. కవిత చాలా భయపడి పోయింది.. ఆ నిమిషంలో ఇంట్లో ఉండాలని యేడుస్తూ ఉంది..

"అసలు ఈ వెధవ వీరయ్య చేసి ఉంటాడు".. అని ఖచ్చితంగా చెప్పింది కవిత.. "నువ్వు నన్ను ఎప్పుడూ నమ్మ లేదు ప్రకాష్".. అని కవిత బాధ పడింది.

సాయంత్రం ఆరు అయింది.. ప్రకాష్ పోలీస్ ఫ్రెండ్ రఘు ఇద్దరు కానిస్టేబుళ్ల తో అక్కడికి వెళ్లి ఫోన్ చేశాడు ప్రకాష్ కు.. "వీరయ్య చేతులు, మొహం మీద ఇనప తీగ తో గీరినట్లు గాయాలు ఉన్నాయి.. నేను మళ్ళీ చేస్తాను" అని రఘు ఫోన్ పెట్టేశాడు.. దాదాపు 7:30 కావస్తున్నది.. ఈ లోగా టెన్షన్ తట్టుకోలేక కవిత తన తల్లి ఫోన్ కు కాల్ చేసింది.. వాళ్లు ఒక అరగంట అయింది అప్పటి కి కవిత ఇంటికి చేరుకుని..

రఘు ఆ వాచ్మాన్ ని రకరకాల గా ప్రశ్నిస్తున్నాడు అని కవిత తల్లి చెప్పింది.. చివరకు నాలుగు పోలీసు దెబ్బలు పడ్డాక వీరయ్య నిజం చెప్పాడు.. అని ఆవిడ చెప్పింది..

అప్పుడే రఘు మళ్లీ ఫోన్ చేశాడు ప్రకాష్ కు.. “మీ వాచ్మాన్ చేశాడు ప్రకాష్..వాడు అతి తెలివి ఉపయోగించడం తో మాకంటే ముందే నీకు దొరికి పోయాడు.. వాడి నెంబర్ నీకు తెలుసుగా.. కొత్త నెంబర్ నుంచి చేస్తే నీకు తెలియదు అనుకున్నాడు.. అది దారే పోయే వాడిది.. నువ్వు మాకు ఇచ్చిన ముఖ్యమైన క్లూ.. నీ సంకేతం తో ముందు ఆ మనిషి ని పట్టుకున్నాము - మీ ఇంటి ముందు వెళుతున్న మనిషి ఫోన్ వీడు ఒక నిమిషం వాడు కున్నాడు.. అతన్ని తీసుకొచ్చి

వీరయ్య చేత నిజం కక్కించాను..


పది పట్టు చీరలు, ఒక టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ పాతది, ఐపాడ్, తీశానని చెప్పాడు.. ఏదో అలికిడి అవడం తో పిరికి వెధవ - నీకు ఫోన్ చేశాడు..

వాడిని తీసుకెళ్లి ఇక్కడ పోలీసు స్టేషన్ లో లాక్ అప్ లో మీరు తిరిగి వచ్చే వరకు ఉంచ మని చెబుతాను.. నువ్వు వచ్చాక చూద్దాం.. వస్తువులను మీ అత్తగారు వాళ్లకు అప్ప చెప్పాను రా.. మీ ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న పొదలో దాచి పెట్టాడు రా.. వచ్చాక ఫోన్ చేయి” అన్నాడు..

"చాలా థాంక్స్ రఘు.. టైమ్ కి వచ్చి హెల్ప్ చేశావు".. అన్నాడు ప్రకాష్..

వెంటనే కొండ దిగి రైల్వే స్టేషన్ కు హడావిడి గా వెళ్లారు ప్రకాష్, కవిత.. అక్కడ రైల్వే క్యాంటీన్ లో అందరికి ఇడ్లీలు పార్శిల్ కట్టించు కొని రైలు ఎక్కారు.. సైడు బర్తులు వచ్చాయి.. చేసేది ఏమీ లేక అలాగే అడ్జస్ట్ అయ్యారు.. కవిత కు వీరయ్య అని తెలిశాక వాడిని కసి తీరా కొట్టాలని ఉంది.. కోపం తో ఊగి పోతోంది..

ప్రకాష్ కు నాలుగు పడ్డాయి.. "అంతా నీకే తెలుసు అనుకున్నావు.. నా మాట వినలేదు.. వాడి చూపు, బుద్ధి మొదటి నించి బాగా లేదని చెబుతూ ఉన్నాను.. నాకే ఏదో అయిందన్నావు.. మన బంగారం, వెండి బీరువా లోనే ఉంచి ఉంటే అవి కూడా పోయి ఉండేవి.. ఇంటికి వెళ్లే వరకు మనకు ఇంకా ఏమీ పోయాయో తెలీదు.. స్వామి దర్శనం చేసుకునే యోగం కూడా లేక పోయింది.. అన్నీ వాడి వల్లే.."

గంట లేటు గా వెళ్లింది ట్రైన్.. పది అయింది ఇంటికి వెళ్లే సరికి.. కవిత పరుగు న ఇంట్లో కి వెళ్ళి మొత్తం ఇల్లు కలియ చూసింది.. ఆ తర్వాత వంటయింటి లో బియ్యం డబ్బా వగైరా అన్నీ తీసి వాటిల్లో పెట్టిన సొమ్ము తీసింది.. అటక మీద సామాను కూడా తీసి చూసుకుని అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు..

ప్రకాష్ తరువాత రఘు కి కాల్ చేశాడు.. ఇద్దరూ ఒక గంట తరువాత పోలీసు స్టేషన్ కి వెళ్ళారు.. “కేసు పెడితే చాలా తల నొప్పులు ఉంటాయి.. వాడిని ఎలాగో రాత్రి మా వాళ్లు బాగా చూసుకున్నారు.. ఇంకో రెండు రోజులు అలాగే ఉతికితే సరిపోతుంది” అని చెప్పాడు రఘు.. “వాడికి ఇదే మొదటిసారి..భయపడకు.. ఇలాంటి వాళ్లు మళ్లీ సాహసించరు.."

కొన్ని రోజులు పిల్లలను, కవిత ను తమ తో పాటు తీసుకు వెళతామన్నారు అత్త గారు వాళ్లు.. బాబీ కి పరీక్షలు ఉన్నాయి..ఇంకో నెల కు కాని కుదరదు.. రెండు రోజుల ఉండి వాళ్లు వెళ్లి పోయారు.. భూషణం గారు వచ్చారు.. జరిగిన దానికి విచారించారు.. ఇంకా రెండు నెలలు పడుతుంది మొత్తం పని పూర్తి అవటానికి..వాచ్ మాన్ లేకుండా కుదరదు..

బాబీ పరీక్షలు అయ్యాక సెలవుల లో ఇల్లు మారాలని నిశ్చయించు కున్నారు కవిత, ప్రకాష్.. అప్పటి దాకా కష్టమే.. ఈ వీరయ్య ఎక్కడ ఉన్నాడో తెలీదు.. పోలీసులు కొట్టారని వీళ్ల పై ఏం కక్ష కట్టాడో తెలీదు.. దిన దిన గండం నూరేండ్లు ఆయుషు లాగా ఉంది పరిస్థితి.. రఘు రెండు మూడు సార్లు డ్యూటీ మీద అటు వచ్చినప్పుడు ప్రకాష్ ఇంట్లో కాసేపు కనిపించి వెళ్లాడు..

ప్రకాష్ ఆ రెండు నెలలు వర్క్ ఫ్రం హోమ్ పెట్టు కున్నాడు.. బాబీ ని తానే తీసుకొని వెళ్లి మళ్లీ స్కూల్ నుంచి తీసుకు వచ్చే వాడు.. కొత్త వాచ్మాన్ తో రఘు తో వచ్చిన పోలీసులు చెప్పాల్సిన తీరు లో చెప్పారు.. అసలే సర్కిల్ ఇనస్పెక్టర్ ఫ్రెండ్ ఇల్లు అని ఆ చుట్టుపక్కల అందరికీ అర్థం అయిపోయింది.. ఎవరికీ వాళ్ల జోలికి వెళ్లే దమ్ము లేదు..

కవిత ఆ యేడు కొండలు నడిచి ఎక్కు తానని స్వామి కి మొక్కు కుంది.. ఈ సారి అయినా తిరుపతి హాయిగా వెళ్లి రావాలి అనుకుంది..

ప్రకాష్ లల్లీ ని భుజం మీద నిద్ర పుచ్చుతూ కవిత కు చెప్పాడు.. “ఆ స్వామే మొన్న కూడా కాపాడింది.. నీకు ఇన్నాళ్లు ఏమీ కాకుండా కూడా కాపాడాడు.. ఎప్పుడు వెళ్లాలో ప్లాన్ చేయి.. శ్రీ కాళహస్తి కూడా వెళ్లి వద్దాము"..

***

దాసు రాధిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.








189 views0 comments

Comments


bottom of page