#MukkamalaJanakiram, #ముక్కామలజానకిరామ్, #GovindaiahMaripoyadu, #గోవిందయ్యమారిపోయాడు, #TeluguMoralStories, #నైతికకథలు

Govindaiah Maripoyadu - New Telugu Story Written By Mukkamala Janakiram
Published In manatelugukathalu.com On 01/02/2025
గోవిందయ్య మారిపోయాడు - తెలుగు కథ
రచన: ముక్కామల జానకిరామ్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ముక్కామల అనే అందమైన పల్లెటూరు. ఆ పల్లె చుట్టూ పొలాలు,చెట్లు ఉండేవి. పక్షుల కిలకిలరావాలతో పల్లె ప్రజలు నిద్రలేసేవారు. గోదావరి నది ఊరి మధ్య నుండి ప్రవహించడం వల్ల అక్కడి ప్రజలకు నీటికి కొదవలేదు. ఆ ఊరిలో గోపాలయ్య,గోవిందయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వారి ఇండ్లు, పొలాలు పక్క పక్కనే ఉండడంతో మంచి మిత్రులు అయ్యారు.
గోపాలయ్య ఉదయాన్నే నిద్రలేచి వేపపుల్లను నములుతూ రచ్చబండ వద్దకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి గోవిందయ్య కూడా వచ్చాడు. "వరి ధాన్యాన్ని ఎలా అమ్మాలి" అని మాట్లాసుకోసాగారు. ఆ ఊరి రైతులంతా వరిని పండించేవారు.
ఆ పండించిన ధాన్యాన్ని అమ్మడానికి ఎడ్ల బండ్లపై పట్టణానికి తీసుకెళ్లేవారు. అక్కడికి వెళ్లిన తర్వాత వ్యాపారస్తులు వడ్లు తడిగా ఉన్నాయని, ధాన్యం ఎక్కువగా వచ్చిందని ఏవేవో సాకులు చెప్పి వారం రోజులపాటు కూడా ధాన్యాన్ని కొనేవారు కాదు. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మడానికి అష్టకష్టాలు పడేవారు.
"మన ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉంటే ఇక్కడే ధాన్యాన్ని అమ్ముకునే వాళ్ళం. ఇన్ని అవస్థలు పడే వాళ్ళం కాదు కదా" అని అక్కడ ఉన్న రైతులు మాట్లాడుకుంటుండగా వారి మాటలను గోపాలయ్య విన్నాడు. "వీరి ఆలోచన బాగుంది. ఇన్ని సంవత్సరాలు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు" అని అనుకున్నాడు. వెంటనే గోవిందయ్యతో విషయం చెప్పాడు. ఇద్దరూ అధికారులను కలిసి గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తీసుకువచ్చారు.
ఈ సంగతిని ఊరు ఊరంతా డప్పుతో చాటింపు వేయించారు. రైతులంతా చాలా సంతోషించారు. ఆ సంవత్సరం నుండి ఆ ఊరి రైతులతో పాటు,పక్క గ్రామాల నుండి కూడా రైతులు పండించిన ధాన్యాన్ని ముక్కామలలో ఉన్న కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్మసాగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నడిపే బాధ్యతను గోపాలయ్య, గోవిందయ్య చూసుకునేవారు. ధాన్యంలో ఎలాంటి తరుగు తీయకుండా రైతులకు మంచి ధరను కట్టించేవారు.
ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. రాను రాను గోవిందయ్యలో డబ్బుపై ఆశ పెరిగిపోయింది. గోపాలయ్యకు తెలియకుండా రైతుల వద్ద బస్తాకు కొన్ని రూపాయలను వసూలు చేయసాగాడు. "ఈ విషయాన్ని గోపాలయ్యతో చెప్పొద్దు"అని రైతులను బెదిరించేవాడు. గోపాలయ్యకు చెబితే మీరు తీసుకొచ్చిన ధాన్యంలో నాణ్యత లేదని డబ్బులు తగ్గిస్తానని ఆ గ్రామ రైతులు బెదిరించేవాడు.
ఒకరోజు రైతులంతా పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని గోవిందయ్య చేసే పనులను గురించి మాట్లాడుకుంటుండగా అప్పుడే అటువైపుగా వచ్చిన గోపాలయ్య విన్నాడు. మిత్రుడు ఇలా చేయడంతో చాలా బాధపడ్డాడు.
"ఇది ఇలాగే కొనసాగితే ఊర్లో చెడ్డపేరుతో పాటు మళ్ళీ మునుపటి రోజులే వస్తాయి. గ్రామ రైతులతో పాటు మేము కూడా పట్టణానికి వెళ్లి ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది"అని గోపాలయ్య మనసులోనే అనుకున్నాడు.
రైతులందరినీ పిలిచి" మీ మాటలు విన్నాను. గోవిందయ్య తన మిత్రుడి కూతురి పెళ్లి కోసం డబ్బు సాయం అందజేయాలని నన్ను అడిగాడు. నేను పని మీద బయటకు వెళ్లడంతో మీ వద్ద తగ్గించి తీసుకోమని నేనే అతనికి చెప్పాను. ఎవరెవరికి ఎంత డబ్బు తగ్గిందో చెప్పండి నేను ఇస్తాను" అని చెప్పి తన వాటాకు వచ్చిన డబ్బును రైతులకు అందజేశాడు.
"గోవిందయ్యను తప్పుగా అర్థం చేసుకున్నాం" అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు.
మరుసటిరోజు గోవిందయ్య పొరుగూరికి పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మిత్రునికి చెప్పడానికి గోపాలయ్య ఇంటి ముందుకు వచ్చాడు. అక్కడ గోపాలయ్య భార్య తన భర్తతో "ఏమండీ!మీరు,గోవిందయ్య ఇద్దరూ కలిసే వ్యాపారం చేస్తున్నారు కదా? గోవిందయ్యకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. మీరేమో అక్కడికి అక్కడే ఖర్చులు సరిపోతున్నాయి అంటున్నారు" అని అడిగింది.
“గోవిందయ్య తన మిత్రుని కూతురు పెళ్లికి డబ్బు సాయం చేస్తున్నాడు. ఖర్చుల కోసం నేనే నా వాటిలో కొంత డబ్బును ఇచ్చాను. తర్వాత వాడు డబ్బు సర్దుతాడు" అని భార్యకు బదులిచ్చాడు గోపాలయ్య.
ఇంటిముందు తలుపు వద్దే ఉన్న గోవిందయ్య తన మిత్రుడు గోపాలయ్య భార్యతో చెప్పిందంతా విన్నాడు.
"ఒరేయ్ గోపాలయ్య! నన్ను క్షమించు" అని రెండు చేతులను పట్టుకున్నాడు. “నిన్న రైతులతో నువ్వు మాట్లాడటం విన్నాను. డబ్బులు ఇవ్వడం చూసాను" అని రైతుల వద్ద తీసుకున్న డబ్బును గొపాలయ్య చేతిలో పెట్టాడు.
“డబ్బుపై ఆశతో అలా చేశాను. ఇంకెప్పుడూ ఇలా చేయను. నీలాంటి నిజాయతీ గల మిత్రుడు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి" అనుకుంటూ గోవిందయ్య పెళ్లికి బయలుదేరాడు.
గోపాలయ్య మిత్రుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా వ్యాపారం చేయసాగారు.
***
ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed
స్కూల్ అసిస్టెంట్- తెలుగు
నల్గొండ జిల్లా
తెలంగాణా
ముక్కామల అనే పల్లెలో గోపాలయ్య, గోవిందయ్య అనే ఇద్దరు రైతులు మంచి మిత్రులు. ఆ ఊరిలోని రైతులు తమ ధాన్యాన్ని ఎడ్ల బండ్లపై పట్టణానికి తీసుకెళ్లి అమ్మేవారు. ఈ దుస్థితి చూడగా, గోపాలయ్య, గోవిందయ్య ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతులకు సాయం చేశారు.
కాలక్రమంలో, గోవిందయ్య డబ్బుపై ఆకర్షితుడు అయి, రైతుల వద్ద అక్షేపణలు సేకరించడానికి ప్రారంభించాడు. గోపాలయ్య ఈ విషయాన్ని తెలుసుకుని రైతులకు సత్యం చెప్పాడు. గోవిందయ్య తన తప్పును అంగీకరించి, మరింత నిజాయతీగా మారినాడు.
ఈ కథ రైతుల నైతికత, నిజాయితీ, పరస్పర సహకారానికి గౌరవం చెలాయించటం గురించి ఉంది.
saketha devulapally
•52 minutes ago
👏👏👌సర్!పిల్లలకు ఉపాయుక్తమైన కథ 💐